2, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారం

యెషయా 43:16-21, పిలిప్పి 3:8-14, యోహాను 8:1-11
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  క్షమించుట  ద్వార దేవుడు ప్రసాదించు క్రొత్త జీవితం గురించి  బోధిస్తున్నాయి. దేవుడిచ్చే గొప్ప అవకాశం వల్ల  దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. పశ్చాత్తాప పడిన  ప్రతి యొక్క  విశ్వాసిని దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. పాపికి  దేవుడు మరొక అవకాశం దయచేసి క్రొత్త జీవితం జీవించమని తెలియజేస్తారు. 
మన జీవితంలో కూడా ఎదుటి వారు చేసిన తప్పిదములు లెక్క చేయకుండా వారిని క్షమించుకొని జీవించాలి. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. మన యొక్క స్నేహాలు నిలబెట్టుకోటానకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు చేసిన తప్పులు క్షమించి మరలా మనతో క్రొత్త జీవితం జీవించడానికి వారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. 
దేవుడు మన పట్ల  ఎలాగైతే  క్షమ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారో మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి అధేవిధంగా దేవుడు మానాకోక అవకాశం  ఇచ్చిన విధంగా వేరేవారికి కూడా అవకాశం ఇవ్వాలి. 
ఈ మూడు పఠనాలు కూడా మారని దేవుని ప్రేమగురించి అలాగే ఆయన యొక్క శాశ్వత ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాయి. 
మన నిజ జీవితంలో ఎవరైన సంపూర్ణంగా  ప్రేమిస్తే వారిని వారి పాపాలు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే మనం ఉంటాం. దేవుడు తన ప్రజలను సంపూర్ణంగా ప్రేమించారు, కాబట్టియే వారి అనేక పాపాలు క్షమిస్తున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు యిస్రాయేలు ప్రజలకు ప్రసాదించే నూతన జీవితం గురించి భోధిస్తున్నారు. 
యిస్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యోషయా ప్రవక్త ద్వార పలుకుచున్న సంతోష వాక్కులు వింటున్నాం. బాబిలోనియా బానిసత్వంలో చివరిరోజుల్లో ఉన్న సమయంలో పలికిన ఆనంద మాటలు ఇవి. 

బానిసత్వం నుండి మరొకసారి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తారని, యెరుషలేముకు నడిపిస్తారని తెలుపుచున్నారు. యెరుషలేము దేవాలయం పునరుద్ధరిస్తారని యోషయా ద్వారా తెలియచేసారు. 
మొదటి ప్రారంభ వచనాలలోదేవుడు  ఎలాగ వారికి  సముద్ర మార్గం గుండా దారిని చేశారో తెలుపుచున్నారు. అదే విధంగా జలరాశి గుండా, ఎండిన నేల మీద నడిపించారు. నిర్గ 14:22.  14:29. 
తాను ప్రేమించిన ప్రజలకోసం దేవుడు శత్రు సైన్యంతో  పోరాడారు. నిర్గ 1వ అధ్యాయం 11 వ అధ్యాయం వరకు వారికి 10 అరిష్టాల ద్వారా వారితో పోరాడారు. 
తనను నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు చూపించే కరుణ అలాంటిది. దేవుడు అన్ని సమయాలలో వారితో ఉండేవారు. నిర్గ 3:14. అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. లూకా 1:37. తన ప్రజల మీద ఉన్న ప్రేమ వలన అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తారు. 

18 వ వచనంలో  ప్రభువు  అంటున్నారు. మీరు పూర్వ సంగతులను గుర్తుంచు కొనక్కరలేదు అని ప్రభువు చెబుతున్నారు. 
వారి  బలహీనతలు గుర్తించుకొనక్కరలేదు అంటున్నారు. వారు దేవుడిని విస్మరించిన క్షణాలు గుర్తుంచుకొనక్కరలేదు.  వారి పాపాలు గుర్తుంచుకొనక్కరలేదు అంటున్నారు. వారి బానిసత్వ బాధలు గుర్తుంచుకొనక్కరలేదు అని అంటున్నారు. 

పశ్చాత్తాప పడిన ప్రజలకు, క్షమించమని కోరిన ప్రజలకు దేవుడు నూతన కార్యము చేస్తానంటున్నారు. ఆ నూతన కార్యమేమనగా అది క్రొత్త జీవితమే, క్రొత్త బంధమే, క్రొత్త ఒడంబడికయే, క్రొత్త ఆశీర్వాదమే. యోషయా 65:17, 2 కోరింథీ 5:17. అ. పొ 21:15. 

19 వ వచనంలో ప్రభువు  అంటున్నారు, ఎడారిలో బాటలు వేస్తానని, మరు భూమిలో త్రోవ వేయుదును అని అదే విధంగా 20 వ వచనంలో ఎడారి గుండా నీటిని పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు ఇత్తును అని అంటున్నారు. 

ఎడారిలో దారి సరిగా  వుండదు ప్రభువు అలాంటి ప్రదేశంలో  విశాలవంతమైన ప్రాంతంలో దారులు వేస్తానని పలుకుచున్నారు. యోహా 14:6. ఆయన చెంతకు రావటం వల్లన మనం క్రొత్త  బాటలో  ప్రయాణం చేస్తాం - ముగ్గురు జ్ఞానులు  వేరొక మార్గం అనుసరించారు. మత్త 2:12. 

మార్గం, గమ్యం తెలియకుండా జీవించే మన బ్రతుకులకు దేవుడు దారిని చూపిస్తారు మనకు క్రొత్త జీవితం దయ చేస్తారు. 
మరు భూమిలో త్రోవ  వేస్తారని అంటున్నారు అంటే పనికి రాని నేలను కూడా సక్రమంగా వినియోగిస్తారని తెలుపుచున్నారు. 

ఎడారిలో దేవుడు నీటిని ఒసగటమే కాదు, నదులు, పారిస్తాను అని తెలుపుచున్నారు. నిర్గ 17:1-7. యోషయా 35:6-7. 
ప్రజల యొక్క దాహం తీర్చుతానని ప్రభువు పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కోసం ఎంతటి గొప్ప కార్యమైన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. 
ఆయన వారి పాపాలు క్షమించుటయే కాదు ఇంకా వారు సంతోషంగా  జీవించుటకు దేవుడు అవకాశంను ఇస్తున్నారు. 
మన యొక్క జీవితంలో ఎదుటి వారి పాపాలు గుర్తించుకొక  అవసరం లేదు వారికి  రెండో ఛాన్సు ఇచ్చి మంచిగా జీవించేలా చేయాలి. 
రెండవ పఠనంలో పౌలుగారి యొక్క జీవితం గురించి తెలుపుచున్నారు. ఆయన జీవితం మొత్తం కూడా దేవుని కృపను పొందడానికే ప్రయత్నం చేశారు. 
తన యొక్క సువార్త పరిచర్యలో అదే విధంగా క్రీస్తును తెలుసుకొన్న జ్ఞానం వలన ఆయన ఏమంటున్నారంటే ఆయన యొక్క జ్ఞానం పొందుటకు నేను సమస్తమున పూర్తి నష్టముగా పరిగణిస్తున్నాను అని పలుకుచున్నారు. 

దైవ జ్ఞానం  వుంటే దేవుడినే కలిగిఉంటాం. ఆయన కొరకు ఇహలోక జ్ఞానం  అంతా విడిచి పెడతాం. ఆయన కొరకు సమస్తం విడిచి పెడతాం. 
క్రీస్తును  పొందటానికి సమస్తము చెత్తగా భావిస్తున్నాను అని తెలుపుచున్నారు. మనకు దేవుని యొక్క విలువ తెలిసినప్పుడు ఆయన్ను కలిగి ఉండటానికి ఏదైనా విడిచిపెడతాం. 

దేవుని కన్నా ఏ  వస్తువు , మనుషులు మిన్న కాదు అని గ్రహిస్తాం. ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటారు HE WHO HAS GOD WANTS NOTHING, GOD ALONE SUFFICES అని దేవుడిని కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఆ ప్రభువు మాత్రం చాలు అని . 

అధే విధంగా దావీదు ప్రభువే నాకు కాపరి నాకు ఇక ఏ కొదవయు లేదు అని . కీర్తన 23:1 
వారికి దేవుని యొక్క విలువ తెలిసింది కాబట్టియే దేవుని కొరకు మిగతా ఏదైన వ్యర్ధంగా భావించారు. మనకి కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానం ఉంటే దేవుని కోసం మిగతా అనీ చెత్తగా భావిస్తాం. 

పౌలు గారు యొక్క కోరిక 10 వ వచనంలో తెలుస్తుంది దేవునికి సంభందించిన జ్ఞానం పొందాలనుకుంటున్నారు.అపో 22:3 . దైవ జ్ఞానం మనకు మంచి ఏదో, చెడు ఏదో తెలుపుతుంది. మనం కూడా క్రీస్తుకు సంబందించిన జ్ఞానంను సంపాదించుకోవాలి. అది మనకు పవిత్ర గ్రంధంను చదవటం ద్వారా తెలుస్తుంది. 

పౌలు గారు కూడా గమాలియేలు దగ్గర నేర్చుకున్నారు ఆయన పొందిన జ్ఞానం వల్లనే క్రీస్తును ప్రకటించ గలుగుతున్నారు. మనం కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానంకలిగి ఉంటే ఆయన గురించి నలుగురికి చాటి చెప్పవచ్చు. దాని కోసం అనుదినం ప్రయత్నం చేయాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు  వారు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెకు మంచి జీవితం జీవించుటకు రెండవ అవకాశం గురించి ధ్యానించుకుంటున్నాం. 

యేసు ప్రభువు ఓలివు పర్వతమునకు వెళ్ళేను. తెల్లవారిన తరువాత  యధావిధిగా దేవాలయంకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన భోదనలు వినటానికి ముందుగానే వచ్చేవారు. లూకా 21:37-38. 
ఇక్కడ ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సార్లు దేవాలయంకు ప్రార్ధించుటకు వెల్లుచున్నారు, వాక్యం ప్రకటించుటకు వెల్లుచున్నారు. పాపం , పుణ్యం గురించి ప్రజలకు భోధిస్తున్నారు. అది ప్రభువు చేసే మంచి పని. 

సువార్త ప్రకటన చేసే సమయంలో ప్రభువును కొందరు పరీక్షకు గురిచేస్తున్నారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి ఆయన్ను పరీక్షిస్తున్నారు. 

చాలా సందర్భాలలో తన తప్పులను దాచుకోవడం ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపటం సాధారణంగా మనకు కనిపించే మానవ స్వభావం. 

పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు ఎదుటివారి తప్పులు గురించే  ఆలోచించారు కానీ తమ తప్పులూ ఆలోచించడం లేదు. వారు తమను తాము సమర్ధించుకొనేవారు. లూకా 18:9-14. 

వారి యొక్క పాపపు జీవితం ఎన్నడూ వారికి గుర్తుకురాలేదు. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించాలనుకున్నారు. వాస్తవానికి మోషే ధర్మ శాస్త్రం ప్రకారం  వ్యభిచారం చేసే వారికి మరణ శిక్ష విధించాలి. లెవీ 20:10, ద్వితీ 22:13-24. 
పరిసయ్యులు యేసుప్రభువును పరీక్షకు గురిచేయాలనుకుంటే దేవుడే వారిని పరీక్షకు గురిచేస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారిలో అందరికన్నా పెద్ద మనిషిని ఆమె మీద రాయి విసరమన్నారు కాని అక్కడ ఎవరు ఆ పని చేయలేదు.వారిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది. వారు కూడా పాపాత్ములమే అని గ్రహిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లి పోవుచున్నారు.ఈ యొక్క సంఘటన లో దేవుని యొక్క గొప్ప కనికరం మనకు కనపడుతుంది. దైవ ప్రేమ మానవ దీన స్థితిని కలిసినప్పుడే దేవుని కనికరం పుడుతుంది.ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన పాపి దిన స్థితిని చూసినప్పుడు కనికరం చూపిస్తున్నారు.యేసు ప్రభువు ఆమెలో కలుగబోయే మార్పును చూసారు. అందుకే ఆమె వైపు కరుణతో చూసారు. ఆమె జీవితంను మార్చుకోమని ప్రభువు చెబుతున్నారు.
వ్యభిచారం లో పట్టుపడిన స్త్రీ పాపం యేసు ప్రభువు సమర్ధించలేదు.పాపం చేసిన ఫర్వాలేదు అని చెప్పలేదు.కాని ఆయన యొక్క వైఖరిలో క్రొత్తధనం ఉంది.నేను నిన్ను ఖండించను, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ జీవితంను చక్కబెట్టుకో అని ప్రభువు తనకు అవకాశం ఇస్తున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు, పాపంను విడచి పెట్టుటకు దేవుడు ఆమెకొక అవకాశం ఇచ్చారు.
పరిసయ్యులు ఆమెను శిక్షించాలనుకున్నారు, కాని ప్రభువు ఆమెను రక్షించారు.పరిసయ్యులు ధర్మ శాస్త్ర బోధకులు క్రూరంగా హింసించాలనుకున్నారు. దేవుడు మాత్రం కరుణ చూపించారు. పరిసయ్యులు అధికారాన్ని, నీతిమంతమైన జీవితాన్ని చూపించాలనుకున్నారు, కాని ప్రభువు దైవ ప్రేమ జీవితాన్ని చూపించారు.
ఇప్పటి వరకు చేసిన పాపాలను దేవుడు క్షమించి అవకాశం ఇస్తున్నారు కాబట్టి జీవితం ను బాగు చేసుకోవాలి.
మనం కూడా మన బలహీనతలవల్ల పాపం చేస్తాం. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తారు.బిడ్డలు తల్లి తండ్రులను ,తల్లి తండ్రులు బిడ్డలను మోసం చేసి జీవిస్తారు. మనం పాపం చేసి జీవిస్తాం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగించుకోవాలి.
ఈ సువార్త ద్వారా దేవుడు ఆమె పాపాలను క్షమిస్తూ, ఆమెకు ఒక క్రొత్త జీవితం జీవించుటకు అవకాశం ఇస్తున్నారు, మనం కూడా మన స్నేహితులకు ఒక అవకాశం ఇవ్వాలి.భర్త భార్యకు , భార్య భర్తకు అవకాశం ఇస్తూ , క్షమించుకొని, అంగీకరించుకొని జీవించాలి. 
దేవుని దయ, కనికరం, ప్రేమ చాలా గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం హృదయ పరివర్తన చెందుటకు, మంచిగా జీవించుటకు వినియోగించుదాం.
ఒకరి పట్ల ఒకరం కనికరం, ప్రేమ, సానుభూతి కలిగి జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం  యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36 ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంత...