3, ఏప్రిల్ 2021, శనివారం

యేసు పునరుత్తాన మహోత్సవము

 నేడు యేసువు పునరుత్తానుడైనాడు  

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని సోదరులారా ఈనాడు మనము యేసు క్రీస్తుని యొక్క పునరుత్తాన పండుగను కొనియాడుచున్నాము. సిలువ శ్రమలను అనుభవించి, సిలువ మీద మరణించి, సమాధి చేయబడి ఈనాడు సజీవుడై లేచాడు.  నేనె జీవమును అని పలికిన ప్రభువు, మరణాన్ని సైతం జయించి జీవముతో లేచాడు. క్రైస్తవుల యొక్క విశ్వాసం అంత ప్రభుని యొక్క పునరుత్తానం మీదనే ఆధారపడి ఉంది. ప్రభుని పునరుత్తానం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన మూలరాయి. పునరుత్తానం లేనిదే క్రైస్తవత్వం లేదు, పునరుత్తానమును నమ్మని వాడు క్రైస్తవుడే కాడు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు ; క్రీస్తు ప్రభువు సజీవులు కాకపోయి ఉంటె నేను బోధించే బోధన అంత వ్యర్థమే.  ప్రభువు మరణించారు అనేది ఎంత సత్యమో మూడవనాడు సజీవులుగా లేచారు అనేది కూడా అంతే సత్యము. క్రైస్తవులకు, క్రైస్తవత్వానికి, క్రైస్తవ విశ్వాసానికి మూలం ఈ పునరుత్తానం. ప్రభువు పునరుత్తానం కాకపోయి ఉంటె ఈనాడు క్రైస్తవత్వం ఉండేదికాదు.

 ఈనాడు క్రైస్తవ మతం మరియు మనము ఇలా ఉన్నాము అంటే మూలం పునరుత్తానమే, పునరుత్తాన విశ్వాసమే. ఇంకా ఎంతో మంది ప్రభువు పునరుత్తానములో సందిగ్ధంగా ఉన్నారు ఎన్నో ప్రశ్నలు, సందేహాలతో, అవిశ్వాసముతో ఉన్నారు. మనము చరిత్రను పరిశిలించినట్లైతే మొదటిగా సమాధి ఎదుట ఏర్పరిచిన పెద్దరాయి అనగా సమాధిని మూయుటకు ఉపయోగించిన పెద్దరాయి పెద్ద గొలుసులతో కట్టబడి ఉంది. సమాధిని కాపలా కాయుటకు సైనికులు ఉన్నారు. కానీ ప్రభుని శరీరము దొంగలించబడినది అని సైనికులు మరియు యూదా పెద్దలు అంటున్నారు. రోమా సైనికుల ఆచార ప్రకారం సైనికులు విధులలో ఉన్నపుడు మెలకువతో, జాగ్రత్తతో కాపలా కాయవలయును. ఏ చిన్న తప్పు జరిగిన విధులలో ఉన్న సైనికుడు దానికి సమాధానం చెప్పాలి. కాపలా కాయుచున్నపుడు కునుకు తీసిన, విధిలో ఉండక పోయిన, ఆజాగ్రత్తతో ఉన్న వారికీ శిక్ష విధిస్తారు. ఆ శిక్ష మరణ దండన. గొలుసు తీసినప్పుడు, రాయి తొలిగించినపుడు శబ్దానికి ఎంత నిదురలో ఉన్న మెళుకువలోకి వస్తారు. మాగ్దలా మరియమ్మ తెల్లవారు జామున సమాధి యొద్దకు వెళ్ళినపుడు అక్కడ ఎవ్వరు కనిపించలేదు సైనికులతో సహా. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతిక దేహాన్ని శిష్యులు వచ్చి తీసికొని వెళ్లారు అని కాపలా ఉన్న సైనికులు సాక్ష్యం ఇచ్చారు. సైనికులు నిదురలో ఉండగా ప్రభువు భౌతికదేహాన్ని తీసుకొని వెళ్ళినది శిష్యులేనని సైనికులకు ఎలా తెలుసు, బండరాయిని తొలిగించినపుడు గొలుసులను తీసినప్పుడు మేలుకొని సైనికులు ప్రభువు భౌతికదేహమును శిష్యులు తీసుకొని వెళ్లారని ఎలా తెలుసు. ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్లుగానే పునరుతానుడైనాడు అని దేవదూత సాక్ష్యం ఇస్తున్నారు.మరీ ముఖ్యముగా ఆయన పలుమారులు శిష్యులకు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ చూసి, విని కూడా మనము ఇంకా వెలిగించి కుంచం క్రింద ఉంచిన దీపము వలె ఉన్నాము. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైనే ఉంచెదము గాని గంప క్రింద ఉంచారు గదా! 

పునీత పౌలు గారు అన్నవిధముగా ఉష్ణ కాలమున వేగుచుక్క మీ హృదయములను నింపువరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. పాపము అనే అంధకారమున ఉన్న మనము ఉష్ణకాల వేగుచుక్క హృదయములను వెలుతురుతో నింపునట్లు మనము ప్రభువు యొక్క పునరుత్తాన వెలుతురుతో నింపబడి గంప క్రింద ఉంచిన దీపము వలే కాక దీప స్తంభము పైన ఉంచిన దీపము వలె అందరికి వెలుగునిద్దాం. పౌలు గారి వలె అందరికి ప్రభువు వెలుగును పంచుదాం ఆయన పునరుత్తానములో పాలుపంచుకుందాం. ఈ పునరుత్తానము మనలను పాపములను నుంచే కాక అన్నింటినుంచి కూడా విముక్తులను, స్వతంత్రులను చేస్తుంది. ఈ పునరుత్తానము ద్వారా ప్రభువు మనకు నూతన జీవితాన్ని ఇస్తున్నారు. పొందిన జీవితము ద్వారా ప్రభుని పునరుత్తాన వెలుగులో జీవించుటకు ప్రయత్నిద్దాం.

Br. Lukas

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...