పాస్కా కాలపు నాల్గవ ఆదివారం
అపోస్తుల 13: 14, 43-52, దర్శన 7: 9, 14-17 , యోహాను 10: 27-30.
క్రీస్తు నాదునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ నాడు తల్లి తిరుసభ మనలందరిని పాస్కా కాలపు నాల్గవ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది.
ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలద్వారా, మనలందరికీ కూడా క్రీస్తు భగవానుడే మనకు నిత్య జీవితమును ప్రసాదించువాడు, ఆయనే మనకు మార్గచుపరి, వెలుగు మరియు సత్యమును అయియున్నాడు, క్రీస్తు ప్రభువే మంచి కాపరి, అని మనకు భోదిస్తుంది.
మనకు నిత్యజీవితం కావాలంటే, దేవుని సన్నిధి చేరుకోవాలంటే, క్రీస్తు ప్రభువు ఒక ద్వారమై ఉన్నారు, ఆయన జీవిత అనుసరణ ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందుకుంటాం అని తిరుసభ మనకు తెలియపరుస్తుంది.
ఏ విధంగా అంటే ?
మొదటి పఠనం: పునీత పౌలు, బర్నబాసుల వేదప్రచారం. పునరుత్తానా క్రీస్తు గురించి , ప్రజలకొరకై ప్రాణాన్ని దారపోసినటువంటి క్రీస్తు గురించి, ఆ మంచి కాపరి గురించి, బోధిస్తున్నారు.
వీరిద్దరూ పిసిదియా లోని అంతియోకు నగరంలో క్రీస్తు ప్రభువు పేరిట " దేవుని కృపలో జీవించమని" వేద ప్రచారం చేస్తున్నారు. వారి బోధనకు యూదులు మరియు యూదా మతాన్ని స్వీకరించిన వారందరు కూడా విశ్వసిస్తున్నారు. ఇది చేసినటువంటి అన్యులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. అందువలన యూదా ప్రజలు అసూయా చెంది. పౌలు, బర్నబాసులను తిరస్కరిస్తున్నారు, వారి ప్రదేశములనుండి తరిమివేస్తున్నారు.
వారుదేవుని కుమారుని విశ్వసించలేదు, అందువలననే వారు నిత్య జీవితానికి అభాగ్యులయ్యారు, దేవుని నుండి దూరమయ్యారు.
ఇలాంటి సన్నివేశాన్ని మనం సువిశేష పఠనంలో కూడా చూస్తున్నాం.
ఈ నాటి సువిశేషంలో క్రీస్తుప్రభుని యూదా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే, ముందుగా మనము ఈ అధ్యాయానికి ముందు అధ్యాయాలలో చూస్తున్నాం, క్రీస్తు ప్రభువు తన్ను తాను దేవుని కుమారుడని, తానే పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమని, తానే సత్యమును, మార్గమును, లోకమత్యము వరకు వెలుగై వున్నాను అని బోధించటం మనం చూస్తున్నాం.
క్రీస్తు ప్రభువు తాను దేవుని కుమారుడని బోధించుట :
“నేను మాత్రమే తండ్రి చెంతనుండి వచ్చినది, నన్ను పంపినవాడు నాతండ్రియే, నన్ను ప్రేమించువాడిని, నా తండ్రి ప్రేమించును. నన్ను నిరాకరించువాడు నా తండ్రిని నిరాకరిస్తున్నారు. నా ద్వారా తప్ప మరెవ్వరును తండ్రిని చేరుకోలేరు”. (యోహాను 8 : 39 - 59 ). అని బోధిస్తున్నారు.
“నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించు వాడు నాశనము చెందక నిత్య జీవమును పొందును”. యోహాను 11 : 25 - 27 మరియు 9 : 5 వచనం.
“జీవాహారమును నేనే నన్ను స్వీకరించువాడు నిత్య జీవమును పొందును”. యోహాను 6 : 25 - 71 మనము చూస్తే, క్రీస్తు ప్రభువే సత్యం, జీవం, మార్గం, వెలుగు, అనే సారాంశమే మనకు అర్థమవుతుంది.
యూదులు యేసుప్రభువుని, నీవు మా తండ్రియగు అబ్రహముకంటె గొప్పవాడివా? అని యేసుని ప్రశ్నించినప్పుడు. యేసు ప్రభు సమాధానము....నేను అబ్రాహాము కంటే ముందు నుండి వున్నాను...ఈ, మాటలు విన్నటువంటి యూదులు యేసుప్రభుని, ఇతనికి దెయ్యము పట్టినది, అని నిందిస్తున్నారు తిరస్కరిస్తున్నారు. ఈ విధంగా బోధించడం ఒక దైవ దూషణగా భావించి రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు.
(యోహాను 10: 32 - 33). క్రీస్తు ప్రభువు నిజముగా దేవుని కుమారుడు అయితే దేవుని నుండి ఒక గుర్తును చూపించమని అడుగుతారు.
కానీ క్రీస్తుప్రభువు మాత్రం ఎలాంటి గర్వానికి పోలేదు, తాను నిజముగా దేవుని కుమారుడైన కూడా, తాను నిరూపించు కోనవసరంలేదు. అందుకు ఆయన నేను చేస్తున్నటువంటి క్రియలే, దానికి సూచనలు అని సమాధానమిచ్చారు. యోహాను 10 : 24 - 25 .
క్రీస్తు చేసిన క్రియలగురించి మనందరికీ తెలుసు. గ్రుడ్డివారికి చూపునిచ్చాడు “నేనే వెలుగును , లోకాత్యము వరకు నేనే వెలుగు” అని బోధించాడు. యోహాను 9:5. ఆకలికొన్న వారికి ఆకలి తీర్చారు. ఇలా చాల అద్భుతాలు క్రీస్తు ప్రభువు చేసారు.
ఈవిధంగా యూదులు యేసు క్రీస్తుని అసూయ చేత తిరస్కరించారు. మొదటి పఠనంలో యూదులు ప్రభువు సేవకులైనటువంటి పౌలుగారిని , బర్నబాసు గారిని కూడా అసూయా చేత తిరస్కరించారు.
ఎందుకంటే ప్రజలందరూ క్రీస్తుని అనుసరిస్తున్నారు, క్రీస్తు గొప్పవారు అవుతున్నారన్న దురుద్దేశం, అసూయ.
ఈ యూదా ప్రజలు దేవుడు వారికే సొంతం, దేవాది దేవుడు వారికి మాత్రమే దేవుడు, అనుకున్నారు, గర్వంతో పొంగిపోయారు. వారి జీవితాలు లోక సంబంధమైనవి, కపట ఆచారాలు, కపట జీవితాలు, దేవాలయాలలో, మరియు వీధులలో నమస్కారాలకోసం, ప్రజల మెప్పు పొందడం కోసం, మేము యూదులము అని చెప్పుకుంటున్నారు తప్ప. నిజమైన దేవుని బిడ్డలాగా, దేవుని ప్రజలవలె జీవించలేదు. దేవుని ప్రేమిస్తున్నాము, మా దేవుడు , మాదేవుడు అని ఎప్పుడు చెప్పే వాళ్లే, కానీ తోటి మానవుని మాత్రం, ద్వేషించేవాళ్ళు, దూరం చేసేవాళ్ళు. అందువలననే క్రీస్తుప్రభువు వారిని అంటుంటారు,.. మీరు “మేము దేవుడి ప్రేమిస్తున్నాము, అని చెప్తారే తప్ప, ఆయన ఆజ్ఞలను ఎప్పుడు పాటించలేదు”, అందువలననే మీకు దక్కవలసినవి అన్యులకు దక్కినవి, అని అంటుంటారు.
మీరు దేవుని కుమారుని విశ్వసించలేదు, స్వీకరించలేదు, అందువలననే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేక పోయారు. కానీ అన్యులు విశ్వసించారు, క్రీస్తుని స్వీకరించారు, ఆయనను అనుసరించారు, అలాంటి వారే దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు, దేవుని సాన్నిధ్యాన్ని సంపాదించుకున్నారు.
ఈనాడు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. క్రీస్తు ప్రభువుని, విశ్వసిస్తున్నామా ? క్రీస్తు వాక్యాన్ని లేదా దేవుని వాక్యాన్ని భోదిస్తున్నటువంటి దేవ సేవకులను నిందిస్తూ తిరస్కరిస్తున్నామా?.
రెండవ పఠనం మనం ధ్యానించినట్లయితే. పునీత యోహాను గారు తనకు వచ్చినటువంటి దర్శనంలో, పరలోక రాజ్యం లేదా దేవుని సాన్నిధ్యం యొక్క గొప్ప తనాన్ని ఈ యొక్క రెండవ పఠనంలో వివరిస్తున్నారు.
గొప్ప జన సమూహము తెల్లని దుస్తులు ధరించి, దేవాది దేవుని, పాటలద్వారా, కీర్తనలద్వారా స్తుతిస్తూ, సంతోషంగా వున్నారు అని తెలియ చేస్తున్నారు. ఎవరు వారంతా ? అంటే వారు ఈ భూలోకంలో వున్నంతకాలం పరలోక భాగ్యం కోసం జీవించినవారు, సత్యం కోసం హింసలు పొంది, మరిణించినవారు, క్రీస్తు కోసమై జీవించినవారు, వారికి, ఇక ఎలాంటి భాదలు , భయమును, మరణమును, ఉండవు. వారిని దేవుని సాన్నిధ్యము నుండి , దేవుని రక్షణము నుండి ఎవరును వేరుచేయలేరు. అని తెలియ చేస్తున్నారు.
కావున క్రీస్తునాదునియందు ప్రియులగు సహోదరి సహోదరులారా మనమందరము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఏవిధంగా కొనసాగుతున్నాయి ? క్రీస్తుని విశ్వసించి అనుసరించి, క్రీస్తు ప్రభువుకు సంభందించిన వారివలె, ఆయన స్వరమును ఆలకించే వారిగా ఉన్నాయా? లేదా, కపట యూదులవలె గర్వంతో, అసూయతో, దేవునికి, లేదా ఆ పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, దూరంగా జీవిస్తున్నామా?
ఎందుకంటే ఈనాటి సువిశేషంలో యోహాను 10 :27 -30 వచనాలలో చూస్తున్నాం. క్రీసు మంచికాపరి, ఆయనను ప్రేమించువారు, ఆయన స్వరమును వినును, ఆయన వాక్కును పాటించును, ఆయన వారిని ప్రేమించును, వారియందు జీవించును అని.
కాబట్టి క్రీస్తు ప్రభువు మనయందు జీవించాలన్న మనం క్రీస్తు చెంతకు చేరాలన్న, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకోవాలన్న క్రీస్తు ప్రజలవలె జీవించాలి.
కాబట్టి మనందరం క్రీస్తు ప్రజలవలె , దేవుడిని, మరియు మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ, పరలోక భాగ్యాన్ని ఆ నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్..
- బ్రదర్. సుభాష్ ఓ.సి.డి