మత్తయి సువార్త 9 : 18 - 26
18. ఇట్లు మాట్లాడుచున్న
యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి, "నా కొమార్తె ఇపుడే మరణించినది.
కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును". అని ప్రార్థించెను.
19. అపుడు యేసు లేచి, శిష్యసమేతముగా అతనిని వెంబడించెను. 20. అప్పుడు పండ్రేండేళ్ల
నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును
తాకెను. 21. ఏలన, "యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును"
అని ఆమె తలంచుచుండెను. 22 . యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము
వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను". అని పలుకగా ఆమె ఆక్షణముననే ఆరోగ్య
వంతురాలాయెను.
23. పిమ్మట యేసు,
ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట వాద్యములు మ్రోయించువారిని, అలజడిగనున్నజన సమూహమును
చూచి, 24. "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు. నిదురించుచున్నది"
అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళన చేసిరి. 24. మూగియున్న జనసమూహమును వెలుపలకు
పంపి యేసు లోపలకు వెళ్లి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. 26. ఆ వార్త ఆ
ప్రాంతము అంతట వ్యాపించెను.
ధ్యానము: "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుచును".
క్రీస్తు నాధుని యందు
ప్రియ స్నేహితులారా, ఈ నాటి సువిశేష పఠనాన్నిమనము ధ్యానించినట్లయితే, మనము ఒక స్వస్థతను మరియు ఒక అద్భుతము గురించి మనము చదువుతున్నాము.
మొదటిగా పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ, తన శారీరక
రోగమునుడి స్వస్థత పొందుతుంది.
ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే,
ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆమెకు ఉన్నటువంటి
ధైర్యాన్ని, లేదా సాహసాన్ని, విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువు అభినందిస్తున్నారు. క్రీస్తు
నందు విశ్వాసముంచి, భయం భయంగా దేవుని యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది.
క్రీస్తు ప్రభువు, ఆమె యొక్క విశ్వాసముగల సాహసానికి, మెచ్చి, ఆమెతో "కుమారీ! నీ
విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని పలికాడు."
ఈ స్త్రీ, క్రీస్తు
ప్రభువు యొక్క అంగీ అంచును, ఒకే ఒక్కసారి,
తాకగానే స్వస్థత కలిగింది.
మరి మనము ప్రతి రోజుకూడా
క్రీస్తుని మన హృదయములోకి, మన ఆత్మలోకి దివ్య
సత్ప్రసాద రూపంలో, మనం స్వీకరిస్తున్నాం. మరి ఎన్ని సార్లు మనం స్వస్థత పొందాలి, ఎన్ని
రోగాలనుండి మనకు స్వస్థతలు, అద్భుతాలు జరగాలి.
మరి మనది నిజమైన విశ్వాసమా లేదా పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆచారము మాత్రమేనా
అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.
రెండవదిగా, క్రీస్తు
ప్రభువుకు మరణము పై ఉన్న ఆధిపత్యాన్ని, లేదా జీవాన్ని ఒసగే శక్తి ఉందని మనము గ్రహించవచ్చు.
ఈ వచనంలో మనము రెండు
విషయాలు అర్థం చేసుకోవచ్చు, మొదటిగా అధికారికి ఉన్నటువంటి వినయము, విశ్వాసము, రెండవదిగా
జనసమూహము యొక్క అవిశ్వాసము. ఇక్కడ అధికారి మోకరించి, క్రీస్తునందు పూర్తి విశ్వాసముంచి,
ప్రార్థిస్తున్నారు, కాని జనసమూహము హేళన చేస్తున్నారు, దేవుడిని నమ్ముటలేదు, ఒక పిచ్చివానిగా
చూస్తున్నారు. ఎందుకంటే "మరణించిన వారిని నిదురిస్తున్నారు" అంటే ఎవరైనా
హేళనచేస్తారు, వెక్కిరిస్తారు, వాస్తవమే. కానీ వారు మాత్రం క్రేస్తుప్రభువు దేవుడన్న
సంగతిని గ్రహించుటలేదు.
ఇక్కడ వారు క్రీస్తు
ప్రభువుకు, జీవాన్ని ఇచ్చే శక్తి, అధికారం ఉందని గ్రహించలేదు. అందుకు కాబోలు, ఆ జనసమూహము
క్రీస్తుని హేళన చేశారు.
కానీ క్రీస్తు ప్రభువు
వారి మాటలను హేళనను లెక్క చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరణించిన
ఆ బాలికను జీవంతో లేపుతున్నారు.
ఆ సన్నివేషాన్ని చూసి
జనసమూహము అశ్చర్యంతో నిండిపోయారు, అవును. సహజంగా
ఆ జనసమూహము, ఇప్పటి వరకు మరణించిన వారిని జీవముతో లేపటం, వినివుండరు, బహుశా చూసివుండరు
కూడా. అందుకే వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు. తరువాత వారు, క్రీస్తు చేసినటువంటి ఆ
అద్భుతాన్ని ఆ ప్రాంతమంతయు చాటిచెప్పారు.
ఈ రెండు సన్నివేషాల
ద్వారా మనందరమూ గ్రహించవలసినది ఏమిటంటే, ఏవిధంగా నైతే, ఆ అధికారి మరియు జబ్బునపడినటువంటి
స్త్రీ వలే, మన జీవితాలలో అద్భుతాలు, స్వస్థతలు
జరగాలంటే, మనము కూడా, ధైర్యము వహించి, దేవుని యందు విశ్వాసము ఉంచి, దేవుని చెంత మోకరించి
ప్రార్థించాలి, అప్పుడే, దేవుడు, మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మెచ్చుకొని, మన ప్రార్థనలు,
విన్నపాలను ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.
క్రీస్తునాడుని యందు
ప్రియ స్నేహితులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
మన జీవితాలు ఏవిధంగా
ఉన్నాయి, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, దేవుని యొక్క మనజీవితాలలో చూడాలనుకుంటున్నాయా
లేదా, ఒక వేల ఆ జనసమూహము వలే క్రీస్తుని మనము హేళన చేస్తున్నామా?
ప్రార్థన : ఓ దయా సంపన్నుడా! మా జీవితాలు కూడా ఎన్నో
సంవత్సరాలుగా, అనేక విధాలైన రోగములనుండి, కోపము, పగ, ద్వేషము, అసూయా, క్రోధము, వ్యామోహము, దొంగతనము, గర్వము, సోమరితనం, ఇంకా అనేక విధములైన
శారీరక, ఆత్మీయక రోగములనుడి నశించి పోతుంది. మాకు మాత్రం, వాటన్నిటినుండి, బయటకు రావాలని
ఉంది, స్వస్థతను పొందాలని ఉంది. కానీ నా బలహీనతలే, నా లోని అవిశ్వాసము, అధైర్యము, గర్వము,
నన్ను నీదరికి చేరనీయుట లేదు.
మీ యొక్క దయార్ద హృదయము
వలన, నాకు విమోచనము కలుగ చేయుము, నాలొఉన్నటువంటి, అస్వస్తతలను తీసివేయుము. మీరు ఒక్క
మాట పలికిన, నా శరీరము, నా ఆత్మకూడా స్వస్థత పొందును. కావున, మాకు కూడా, మిమ్ము హేళన
చేసిన జనసమూహము వలే కాకుండా, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, ధైర్యమును, విశ్వాసమును
కలుగ చేయుము అని ప్రార్థించుచున్నాము. కావున మేముకూడా మీ యొక్క మహిమను చాటి చెప్పే
విధంగా మాకు అనుగ్రహము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్.