20, మార్చి 2021, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారము

తపస్సుకాల 5 వ ఆదివారము

యిర్మియా 31: 31-34

హెబ్రీ 5: 7-9

యోహాను 12: 20-33

క్రీస్తు నాధునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పఠనములు మనకు అంతరంగిక యాత్ర, ఆత్మ పరిశీలన, ఆత్మ పరిత్యాగము అను అంశములను గూర్చి బోధిస్తున్నాయి. క్రైస్తవత్వము, క్రైస్తవ జీవితము ద్వంద్వ ప్రయాణమనే చెప్పాలి; ఒకటి అంతరంగికమైనదైతే, మరొకటి తండ్రి అయిన దేవుని వైపునకు నిర్దేశింపబడినది. ముఖ్యముగా ప్రతి తపస్సుకాలము కూడా ఈ యాత్రలకు గల ప్రాముఖ్యతను గూర్చియు, దీని అవసరతను గూర్చియు మనకు భోధిస్తుంది. ఈనాటి మొదటి పఠనము ఇశ్రాయేలీయులతో దేవుడు ఏర్పరచుకొను నూతన నిబంధనను మనకు గుర్తు చేస్తుంది. యావే దేవుడు ఐగుప్తు దాస్య విముక్తి అనంతరము, సీనాయి పర్వతముపై ఇశ్రాయేలీయులతో ఓ నిబంధనను చేసుకున్నారు. ఆనాడు పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానమనుసరించి, ఆ వాగ్దానమును నవీకరించి, ఇశ్రాయేలీయులతో నిత్యమూ నివశిస్తాననియు, వారు నిర్మల హృదయముతో ప్రభువైన దేవుని మాత్రమే ఆరాధింపవలయుననియు, వారు దేవుని ప్రజలు కావున వారిని ఎన్నటికీ విడనాడననియు పలికారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాటను, నిబంధనను తిరస్కరించి దేవునికి వ్యతిరేకముగా పాపము మూటగట్టుకుని, దేవునిని విడనాడారు. వారి తలబిరుసుతనమునకు చిహ్నముగా దేవుడు వారిని విడనాడారు. అస్సీరియులుబబులోనీయులు వారి దేశమును, దేవళమును తూలనాడి, నాశనమునకు గురి చేసి వారిని బందీలుగా కొనిపోయారు. అలా క్రీస్తు పూర్వము 587 వ సంవత్సరములో చెర పట్టబడి బబులోనియా దేశములో బందీలుగా వశిస్తున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధలను గాంచిన దేవుడు వారితో పూర్వము తాను సీనాయి కొండపై చేసుకొనిన నిబంధనకు అతీతమును, నూతనమును ఐన మరియొక నిభందనను వారితో చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు. పూర్వ నిబంధన వారి ద్వారబంధములకు పరిమితము కాగా, ఈ నూతన నిభందనమును దేవుడే స్వయముగా వారి హృదయములపై లిఖిస్తానని పలుకుట మనము ఈనాటి మొదటి పఠనము 33వ వచనము లో చూస్తున్నాము. ఇదిగో! మనము చేయవలసిన అంతర్గత ప్రయాణము, దేవుడు మన హృదయములపై వ్రాసిన దైవ మానవ ప్రేమ అను ఈ నూతన నిబంధనము వైపునకే. మన అంతరంగిక జీవితమును దేవుడు ఏర్పరిచిన ఈ ప్రేమ అను తక్కెడలో తూచి, పరిశీలించి, దైవ రాజ్యమునకు మనలను దూరము చేసే ప్రతి అంశమును తొలగింప ఈ తపస్సు కాలము మనలను ఆహ్వానిస్తుంది.

ఇక ఈ నాటి సువిశేష పఠనము దేవుడు ఏర్పరచిన ఆ నిత్య జీవితము క్రీస్తునందు ఏ విధముగా సాధ్యమగునో మనకు నేర్పిస్తుంది. యేసు క్రీస్తు నందు ఏర్పరచిన ఆ నిత్య జీవితమును పొంద మనలను మనము ఏవిధముగా ధ్వంసమొనర్చుకొనవలెనో, ఏవిధముగా ఆత్మార్పణ గావించుకొనవలెనో భోదిస్తుంది. నిక్కముగా ఆత్మ పరిత్యాగము, మరియు ఆత్మార్పణము అంతర్వేదనకు దారితీస్తుంది. అనేక అద్భుత కార్యములను చేస్తున్న యేసుని గూర్చి విని గ్రీకులు కొంతమంది ఆయనను చూచుటకు వస్తే, క్రీస్తేమో గోధుమ గింజ అను చక్కని ఉపమానము ద్వారా తన శ్రమల, మరణ, పునరుత్తాన పరమ రహస్యములను గురించియు, వాటి ఫలమైన నూతన జీవితమును గురించియు బోధించుట మనము చూస్తున్నాము. జీవము, మరణము అను రెండును విభిన్న సత్యములుగాను, తధ్యములుగాను

భావించిన తరమునకు క్రీస్తుని భోద ఒక క్రొత్త మలుపునకు, నిజమైన సత్యమునకు దారితీస్తుంది. క్రీస్తు ఈ నాటి సువిశేష పఠనములో నూతన జీవితమును గూర్చి నేర్పుతూ, గోధుమ గింజ ఉపమానమును బోధిస్తున్నారు. మనము పాతి పెట్టబడిన గింజ యొక్క బాహ్యమును మాత్రమే గ్రహించగలము. కానీ, అది నశించు సమయములో మనము గుర్తించజాలని వేదనకు, భాదకు గురవుతుంది. కానీ, గోధుమ గింజకు అలా భూమిలో పడి నశించడము వెనుకనున్న ఆంతర్యము తెలుసు. దాని గమ్యము విస్తారముగా ఫలించడమేనన్న సత్యమును ఎఱుకయే. కాబట్టియే అది నశించుటను ఎన్నుకున్నది. తనను అద్భుతముగా మార్చగల భూమిలో పడుటకును, తనను తాను సంపూర్ణముగా అర్పించుకొనుటకు సిద్ధమైంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి మరణించక తప్పదు. కానీ మరణము అంతము కాదు. అది ఒక మార్పు మాత్రమే. ఒక స్థితి నుండి వేరొక స్థితికి గల ప్రయాణమే. మనలను ఆ దేవుడు ఫలించే గింజలుగా సృజించాడు. ఫలించు విధమును, క్రీస్తు తన జీవిత ఉదాహరణమునందు మనకు నేర్పించాడు. ఫలించుచు, వెలుగు పుత్రులుగా జీవింప మనలను ఎన్నుకొన్నారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19, 20 వచనములలో చీకటియందు వశించు వారికి, వెలుగునందు వశించు వారికి గల వ్యత్యాసము మనము చూస్తున్నాము. ఈ చీకటి యందు వశించు ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమతో వెలుగునకు ఆహ్వానిస్తున్నారు. గోధుమ గింజ భూమిలో పడి నశిస్తూ ఏవిధముగా ఆత్మార్పణమునకు గురవుతుందో అదే విధముగా మన చీకటి కార్యములను విడనాడుటలో మనము కూడా నశించాలి. ఆత్మ పరిత్యాగము ఈ ప్రక్రియలో ఓ ముఖ్యమైన ఘట్టము. ఈ స్థితిలో దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే మన ఇష్టాలను వదిలివేయ మనము సిద్ధపడాలి. మన గమ్యస్థానమైన దైవారాజ్యమును పొంద అడ్డగించే, ఆటంకపరిచే బంధబాంధవ్యాలను, బంధకాలను, మనస్తత్వాలను, ఇష్టాయిష్టాలను అధిగమించవలెను. అంతేకాక, మనలను మనము ధ్వంసమొనర్చుకొనిన ప్రతిసారి మనము ఓ క్రొత్త మనుషులుగా మారగలుగుతాము. కాబట్టి, పునీత సిలువ యోహాను గారు నేర్పిన విధమున సులభతరమైన దానిని కాక కష్టతరమైన దానిని ఎన్నుకుందాం. మన జీవితాలలో ఉన్న చెడుగును తొలగింప కష్టతరమైన, ఇరుకైన మార్గమున పయనిద్దాం.

 

యేసు ప్రభువు ఈ నాటి సువిశేషములో తనను తాను గోధుమ గింజ వలె అభివర్ణిస్తున్నారు. గోధుమ గింజ ఏవిధముగానైతే నశించి విస్తారముగా ఫలించునో క్రీస్తు కూడా తన శ్రమల, మరణము ద్వారా, పునరుత్తానమను మిక్కుటమగు ఫలమును సంపాదించి, మనలను తండ్రికి బిడ్డలుగా చేసాడు. తండ్రి రాజ్యవారసులవ అవకాశము దయచేసాడు. ఈనాటి రెండవ పఠనము, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో మనము చదువుతున్నాము; క్రీస్తు ఏడ్పులతో, కన్నీటితో తనను రక్షింపగల దేవునికి మొరపెట్టాడు అని. క్రీస్తువలె ఎందరో పునీతులు, వారు సామాన్య మానవులే అయినను, అయన పిలుపును అందుకుని, తమను తాము పరిత్యజించుకుని, తమ సిలువను ఎత్తుకుని, తమ జీవితములయందు నశించి, ఫలించారు, ఇతరులకు మార్గదర్శకులయ్యారు. ఇక క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా మన కర్తవ్యము; క్రీస్తు ఉదాహరణమును సముఖతతో స్వీకరించి గోధుమ గింజ వలె మనకై మనము క్రీస్తు అను భూమిలో విత్తబడి, అయన వలె నిత్యమూ ప్రార్థన అను నీటితో తడపబడవలెను. ఏలయన ఏ విత్తనము తడవనిదే నశించదు, మొలకెత్తదు. పరిశుద్ధ గ్రంధము ఆయన నిత్యము ప్రార్ధించెను అని వక్కాణిస్తుంది. కాబట్టి ఆ విధమున మనలను మనము ఆత్మార్పణము గావించుకుని, తండ్రి యందు ఫలింప మనలను మనము తయారుచేసుకుందాము. ఈరోజు మనలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్న క్రీస్తుని అక్కున చేరి ఆతను నేర్పిన శ్రమల విలువను గుర్తిద్దాం, వాటిలో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకుని, వాటిని వృధాకానీయక ఫలవంతమొనర్చుకుందాం. దేవుని నిబంధన యందు జీవిద్దాం. ఆమెన్.

By Br. Kiran Putti OCD

 


ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం  యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36 ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంత...