28, ఆగస్టు 2021, శనివారం

22 వ సామాన్య ఆదివారం( 2)

 22 వ సామాన్య ఆదివారం( 2)

నేటి దివ్య గ్రంధ పఠనాలు నిజమయిన క్రైస్తవ మత యొక్క విశ్వాసము ఎలాగా ఉండాలి అనే విషయాన్ని బోధిస్తుంది. క్రీస్తు ప్రభువు నందు విశ్వాసము ఉంచిన  వారు నామ మాత్రమునకే  దేవుని  యొక్క  నిబంధనలు , చట్టాలు, విధులు పాటించకుండా  వాటిని  నిండు మనసుతో , నిండు హృదయముతో  ఆచరించాలనే  విషయములను  ఈనాటి పఠనాలు మనకు తెలియచేస్తున్నాయి. అదే విధముగా  దేవునియందు  విశ్వాసము ఉంచిన  వారు   జీవించవలసిన జీవిత విధానము  గురించి కూడా ఈ నాటి పఠనాలు భోధిస్తున్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో మోషే ద్వారా  తన యొక్క  చట్టములను,  విధులను పాటించమని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు  కోరుచున్నారు. మోషే  ప్రవక్త  తన యొక్క అంతిమ  సందేశమును ఇశ్రాయేలు  ప్రజలకు అందచేస్తున్నారు. వారు  ఎల్లప్పుడూ కూడా  దేవునికి  కృతజ్ఞులై జీవించాలి. వారు దేవుడిని మరవకుండా  ఆయన్ను ఆరాధించాలి , ఆయన మీద ఆధారపడి జీవిస్తూ  దేవునితో ఎల్లప్పుడూ తండ్రి బిడ్డలు అనే  బంధములో కలిసి జీవించాలి అని దేవుడు మోషే ద్వార పలుకుచున్నాడు. 

దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ , చట్టము ఏదైన సరే అది మానవ అభివృద్ధి  కొరకు మాత్రమే. దేవుని యొక్క చట్టములను  పాటించుట ద్వార మనము మన   విశ్వాస జీవితాన్ని  సరిగ్గా  జీవించవచ్చు. దేవుని  ఆజ్ఞలు మన జీవితాన్ని బాగు చేస్తాయి.  మనము  ఎలాగా జీవించాలి ,  అని నేర్పి , పాపంలో పడిపోకుండా చేస్తాయి. 

దేవుడు  మోషే ద్వారా  ఇశ్రాయేలు ప్రజలకు   ఈ చట్టాలను  ఆజ్ఞలను  అందచేశారు. దాని ద్వారా  ఎప్పుడు  కూడా వారు దేవునికి దూరం కాకుండా  దేవునికి దగ్గరై జీవించవచ్చు. మోషే ప్రవక్త ద్వార వచ్చిన చట్టాలను  3 రకాలుగా విభజించవచ్చు. 

1 పౌర చట్టము- ఇది  అను దిన జీవితము మంచిగా జీవించాలని చెబుతున్నది.

2 నైతిక చట్టము- ఇది దేవుని యొక్క నీతికి న్యాయమునకు చెందినవి.

3. ఆచార చట్టము.- బలులు సమర్పించేందుకు చెందినవి , బలులు మంచి బలులు  సమర్పించాలి అని తెలియ చేస్తుంది. 

ఈ విధముగా  ఈ మూడు చట్టాలను  పాటించుట ద్వార ప్రతి ఒక్కరూ  పవిత్ర జీవితము జీవించవచ్చు. 

మనకు కూడా భారత దేశ చట్టము ఉంది మనము ఎలా జీవించాలి ,జీవించకూడదు చెపుతుంది , దేవుని చట్టము జీవితమును ఒక మంచి దారిలో నడిపించుటకు సహాయపడుతుంది. 

మోషే ప్రవక్త ద్వార దేవుడు  ఈ చట్టాలు, విధులు  ఆజ్ఞలు పాటించుట ద్వార ప్రజలు  మేలు పొందుతారని తెలియచేస్తున్నాడు  , ఆ మేలులు  ఏమిటి అంటే 

1. దేవుని ఆజ్ఞలు పాటించుట ద్వార బ్రతుకు తారు.- దేవుని యొక్క దయను ,ప్రేమను అనుభవిస్తూ ,ఎల్లప్పుడూ సంతోషముతో  బ్రతుకు తారు. అని తెలియచేస్తున్నారు. 

2 . దేవుడు ఒసగిన   కానాను  దేశము వారి సొంతమవుతుంది. ఈ కానను  దేశము సంతోసముకు గుర్తు, దేవుని యొక్క సమృద్దికి గుర్తు. దేవుని యొక్క నడిపింపునకు గుర్తు, దేవుడు ఆలాంటీ సంతోషంతో ఉండే స్థలాన్ని వారికి ఇస్తానన్నారు. 

3. వారిని ఒకే జాతిగా చేసి అందరూ కలిసి ఉంచుటకు సహాయపడుతుంది. 

4. వారు విజ్ఞానము పొందెలాగా  చేస్తుందీ. అదే విధముగా  మత చట్టములను హృదయ పూర్వ కముగా   పాటిస్తే  దేవుని వారు  పిలిచిన వెంటనే ఆయన వారికి   సమాధానము ఇస్తారు. 

5.  దేవుని యొక్క  ఆజ్ఞలను  పాటించుట ద్వారా దేవుడు మనలను వెయ్యి తరముల వరకు దీవిస్తారు. నిర్గమ.20:6 

6. ఆయన ఆజ్ఞలను చట్టాలను హృదయపూర్వకముగా  పాటిస్తే మనము అడిగినది దేవుడు దయ చేస్తారు.1 యోహను3:22

7 దేవుడు సకాలములో  వర్షాలు దయ చేస్తారు. లెవీ 26:3,4 కేవలము దేవుని ప్రేమించే వారే ఆయన చట్టాలను పాటిస్తారు. యోహను 4:15, మనమందరము కూడా  దేవుని ఆజ్ఞలను , చట్టములను హృదయ పూర్వ కముగా   పాటించి దేవునితో బంధము కలిగి జీవించాలి, ఈ చాట్టాలను  పాటించుట ద్వార  దేవునితో  బంధం కలిగి  జీవించాలి. ఈ చట్టాలను పాటించుట ద్వార మనము దేవునికి విధేయతను చూపుతున్నాము. మన విశ్వాసాన్నీ వ్యక్త పరుస్తున్నాము. 

రెండవ పఠనములో  పునీత యాకోబు గారు  దేవుని యొక్క వాకు మన హృదయాలపై ముద్రించబడింది, దాని ప్రకారము నడచుకోవాలి అని చెపుతున్నారు. ఈ  యొక్క దేవుని వాక్కు   దేవుని చట్టము మనం దాని ప్రకారము  నడుచుకుంటే అది మనలను రక్షిస్తుంది , నిజమైన మతము అనుసరించుట అంటే  దేవునికి విధేయులుగా పేద  సాదలకు సాయపడటమే . దేవుని చట్టమును హృదయపూర్వకముగా ఆచరించేవారు  అనాదలను  ఆదుకోవాలి. విధవరాళ్లకు సహాయము చేయాలి, వారు కష్టములో ఉన్నపుడు వారిని ఆదరించాలి. యాకోబు గారి ప్రకారము నిజమైన మతము అంటే దేవుని ప్రేమిస్తూ  అవసరములో ఉన్న అనాథలను , విధవరాండ్రను  సహాయము చేయుటయే , ఎవరు లేని  వారిని ఆదుకొనుటయే నిజమైన మత ఆచరణ అని యాకోబు గారు తెలియచేస్తున్నారు. యాకోబు గారు పలికిన విధముగా  ఆ దేవుని యొక్క వాక్కు  మన హృదయము  మీద ముద్రించబడినది , హృదయము మీద ముద్రించబడిన ఈ వాక్కు మనల్ని  నడిపిస్తుంది.  కీర్తన 119:15 

దేవుని యొక్క వాక్కు  ప్రకారమే  నడచుకుంటే  మనము నిజమైన మత విశ్వాసం  అనుసరించవచ్చు, దాని  వలన దేవుని యొక్క అనుగ్రహాలు పొందవచ్చు, పవిత్ర జీవితము జీవించవచ్చు. ప్రతి క్రైస్తవుడు యాకోబు గారు పలికిన విధముగా  ఆ  దేవుని  మాటలు పాటిస్తూ పేద వారిని , సహాయము కోసము ఎదురు చూసే అనాథలను  , విధవరాళ్లను ఆదుకుంటే ఈ భూలోకము స్వర్గముగా మారుతుంది. 

ఈనాటి సు విశేషము దేవుని యొక్క విశ్వాసులు  దేనికి ప్రాముఖ్యతని ఇవ్వాలి అని నేర్పుతుంది. దేవుడు  ఇచ్చిన ఆజ్ఞలు చట్టముకా లేక  మానవ మాత్రులు ఏర్పరిచిన  సాంప్రదాయనికా? ఆదే విధముగా బాహ్యంగా మనం పవిత్రులుగా ఉండాలా లేక అంతరంగికముగా పవిత్రులుగా ఉండాలా అని నేటి సు విశేషములో  వింటున్నారు.. మనం  అంతరంగికముగా  పవిత్రముగా ఉండాలి.  సువిశేషములో  ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు  యొక్క శిష్యులలో తప్పిదములను  ఎతుకుచున్నారు. చేతులు కడుగుకొనుటలేదని చెపుతున్నారు. 

భోజనమునకు ముందు చేతులు కడుగుకొనుట  వారి సాంప్రదాయం చేతులు భోజనమునకు ముందు కడుగుకొంటె వారు తమ భోజనము దేవునికి కృతజ్ఞతగా  సమర్పిస్తున్నారని అర్దము. దేవునికి సమర్పించే సమయములో చేతులు  కడుగుకొనకపోతే  వారు ఆచార చట్టం ప్రకారము అపవిత్రులు. ఆనాటి ప్రజలు యొక్క ఆలోచన ఏమిటి అంటే దేవునికి సంబంధించిన ఏ వస్తువులు పట్టుకొన్న అవి పవిత్రముగా ఉండాలి అని అందుకే పట్టుకునేముందు చేతులు  కడుగు కొంటారు. ఇది మోషే ఇచ్చిన చట్టములోని ఒక విషయము. 

దేవుని విషయములకు ప్రాధాన్యత ఇవ్వకుండ ధర్మ  శాస్త్ర బోధకులు దేవుని యొక్క మాటకు అనేక సంప్రదాయాలను  జత చేశారు. దానివల్ల ప్రజల ఆలోచన  మొత్తము  ఎలాగా  ఈ నియమ నిబంధనలను పాటించుట అనే  కానీ దేవుని మీద ప్రేమ  లేదు. దేవుడిని మరిచి (ద్వితీయో 6:4-5) సంప్రదాయాలకు  విధేయతను చూపిస్తున్నారు. అందుకే దేవుడు వారి విశ్వాసాన్ని  సంప్రదాయాలను సరిచేస్తున్నారు.  దేవుని చిత్తాన్ని మానవ కల్పిత ఆచారాలతో సమానముగా  చూసే  వారి విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నారు. 

ధర్మ శాస్త్ర బోధకులు  దేవుని చట్టములోని నిజమైన అర్దమును  అదే విధముగా  నిజ స్పూర్తిని మరుగున  పెట్టి సంప్రదాయాల పేరుతో  ప్రజలకు అనేక నియమాలకి  కర్మలకు ప్రాముఖ్యతని ఇవ్వాలని తప్పుగా  నేర్పుతున్నారు   . అందుకే ప్రభువు  ఆంతరంగిక  విషయములకు  ప్రాముఖ్యతను ఇవ్వాలని చేపుతున్నారు. అంతరంగమునుండి వెలువడు  ఆలోచనలు, క్రియలే మన  పవిత్రతకు లేదా అ పవిత్రతకు కారణమవుతాయి . ఆలోచనలు , మాటలుగా మారతాయి , మాటలునుండి  క్రియలు వస్తాయి , క్రియలు అలవాటుగా మారి వ్యక్తిత్వంలా తయారవుతాయి. కాబట్టి మన యొక్క ఆలోచనలు పవిత్రముగా, మంచిగా ఉండాలి.

దేవుడు యోషయ్య ప్రవక్త ద్వారా చెప్పిన మాటలను గుర్తుకు చేస్తున్నారు. వారి హృదయాలు నా నుండి దూరముగా ఉన్నవి అని చెపుతున్నారు . (యోషయా 29:13, 1 సాము 15:22 ,16:7) 

కేవలము  బాహ్య ఆచరణ కాదు  ఆ బాహ్య ఆచరణలో మంచి హృదయము ఉండాలి. అనగా మన యొక్క హృదయమును   ఎప్పుడు పవిత్రముగా ఉంచుకోని  దేవుణ్ణి అనుసరించాలి. మన హృదయాలను శుద్దిచేసుకొని వాటిని దేవుని ప్రేమతో నింపుకోవాలి అన్నింటికీ కేంద్రముగా ఉన్న హృదయమును  ఎప్పుడు పవిత్రముగా ఉంచుకోవాలి. హృదయమునుండే అన్నీ ఉద్భవిస్తాయి. మంచి గుణాలైన చెడు గుణాలైన కాబట్టి దేవునికి చెందిన మంచి విషయాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. మంచిని చేయడానికి పూనుకోవాలి. 

మన విశ్వాస జీవితములో  దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు కొన్ని  బాహ్య ఆచరణలు ఉంటాయి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఈ నా సోదారులలో అత్యల్పుడైన .... మత్తయి 25:40  ఇలాంటి బాహ్యముగా  చేసే కార్యాలలో మన హృదయ ఉద్దేశ్యము  మంచిదిగా ఉండాలి. లేదంటే అది మన  ఎదుగుదలకు ఒక అడ్డుగా మారుతుంది. మనము గుడికి వెళ్ళిన, సాయము చేసిన ,ప్రార్దన చేసిన , వాక్యము చదివిన , మంచి పనులు చేసిన వాటి అన్నింటిలోనూ పవిత్ర హృదయము , ఉద్దేశ్యము ఉండాలి. 

ఒక వేళ మనలో అహంభావం, చెడు ఆలోచనలు నిండినట్లయితే  మనము ఎన్ని చేసినా , దేవుని ఎదుట అవి మనలను పవిత్రులను చేయదు. కాబట్టి హృదయమును పవిత్రముగా ఉంచుకొందాం. దేవునికి ప్రాధాన్యతను ఇస్తూ జీవిస్తూ, నిజమైన  దేవుని బిడ్డలుగా  జీవించుదాము. అదే విధముగా  మన మత ఆచరణ ప్రేమతో ఉండేలా, అలానే  మనం ఏమి గొప్ప కార్యము  చేసిన , ఆలోచనలు చేసిన అవి మంచి హృదయముతో చేయడానికి  దేవుని వరం కోరుకొందాం . 

 By. Rev. Fr. Bala Yesu OCD

సామాన్య 22 వ ఆదివారము

సామాన్య 22 వ ఆదివారము

ద్వితీ 4:1-2, 6-8

యాకోబు 1: 17-18, 21-22, 27 

మార్కు7: 1-8, 14-15, 21-23

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా,

ఈనాడు మనము సామాన్య 22 వ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాడు మొదటి పఠనము ద్వితీయోపదేశ- కాండము నుండి తీసుకొనబడినది. దేవుడు యూదులకు ఇస్తానని ప్రమాణము చేసిన వాగ్దాన భూమిలోనికి యూదులు చేరే వరకు మోషే బ్రతకడని అతనికి తెలుసు. దేవుడు తన ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించమని ప్రజలను హెచ్చరిస్తాడు. తాను ఇచ్చిన శాసనాలను ఏ మాత్రము మార్చకుండా తు. చ. తప్పకుండా యూదులు ఆచరించాలని చెబుతాడు. వాళ్ళు ఈ విధముగా జీవిస్తే ఇతర జాతుల కన్నా వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడని చెప్పాడు(ద్వితీ 4:6)

ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఈ యూదా ప్రజలకు తానే స్వయముగా మంచి మంచి కట్టడలు ఇచ్చి వాటి ప్రకారము జీవించడానికి వారికి సహాయపడటం వారి అదృష్టమని చెప్పాలి. ఇక మరొక జాతికి దేవుడు ఇలా చేయలేదు. ఈనాడు మనము చదివిన సువిశేషములో కొందరు న్యాయపండితులు, వారు చెప్పిన ఆచారములు తు. చ. తప్పకుండా పాటించే పరిసయ్యులు, క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మీ శిష్యులు యూదా ఆచారముల ప్రకారము భోజనమునకు ముందు చేతులు కడుకొనకుండా భోజనము చేస్తున్నారు. వారు మా ఆచారమును కించ పరుస్తున్నారు అని తెలివిగా ఒక ప్రశ్న వేశారు. నిజమే! యూదుల ఆచార ప్రకారము ప్రకారము పూజారులు దేవాలయములో ఏదైనా సాంగ్యము చేస్తే దానికి ముందు చేతులు కడుకోవాలి. అయితే రాను రాను ఈ ఆచారము మామూలు జనానికి అన్వయిస్తుందని వారు చెప్పారు. ఎవరైనా సరే ప్రార్ధన చేయుటకు ముందు, భోజనము చేయటానికి ముందు చేతులు శుభ్రముగా కడుగుకోవాలను ఆచారము వచ్చేసింది. కాలక్రమేణా ఈ ఆచారము ఎలా స్థిరపడినది అంటే బాహ్యశుద్ది ముఖ్యమైనది కానీ హృదయ శుద్ధి అనేది మరుగున పడిపోయింది. ఒళ్ళు శుభ్రముగా ఉంటె చాలు, హృదయ శుద్ధి ఎవరు చూస్తున్నారు? భక్తి అనేది బాహ్య ఆచరణములకే పరిమితమైపోయినది. ఎంత శుభ్రముగా దేవాలయమునకు వెళితే అంత భక్తుడను అను భావము జనములో స్థిరపడిపోయింది. తలంటు స్నానము, మంచి బట్టలు, ఇలా అన్ని కనబడే అట్టహాసములే కానీ కనబడు హృదయ శుద్ధి అడుగంటిపోయినది. 

ఇలాంటి బాహ్యశుద్ది లేకపోయినా హృదయశుద్ధి కావాలని చూపించడానికి క్రీస్తు ప్రభువు కానీ, అయన శిష్యులు కానీ ఆ ఆచారములను పాటించలేదు. చేతులు కడుకొనకుండా భోజనము చేసారు, శుద్ధిలేని పాపులతో ఒకే పంక్తిన భోజనము చేసారు. కావున ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు ప్రభువు ఈవిధముగా అంటున్నారు, "మీరంతా కేవలము మీ పెదవులతోనే దేవుని ప్రీతి పరచాలని అనుకుంటున్నారు, అలంటి వారు దేవుని దరి చేరలేరు. దేవునికి కావలసినది భక్తి, ప్రేమ". ఏమి తింటాము, ఎలా తింటాము అనేది పైకి కనబడేవి కానీ ఇవి మనిషిని శుభ్రము చేయవు. మనిషి హృదయము నుండి వచ్చేవి మంచి లేక చేదు. మనిషిని చెరిచేది అతను తినే ఆహారము కాదు కానీ అతని మనస్సులో నుంచి వచ్చే చెడుగు అతనిని మలినపరుస్తాయి. చెడుగా ఆలోచించేవాడు, దేవుని పొరుగు వాని ప్రేమించలేనివాడు, పాపమును మూటకట్టుకుంటారు. ఆ పాపమే వానిని అపవిత్రపరుస్తుంది. 

ఈనాడు రెండవ పఠనము మనకు ఏమి నేర్పుతుంది? దేవుని రాజ్యములో ప్రేమ అంటే ఎలా ఉంటుంది, మతము అంటే అర్ధము ఏమిటి అనే విషయాన్ని యాకోబు గారు మనకు ఈ విధముగా చెబుతున్నారు(యాకోబు 1:21-25). దేవుని వాక్కులే మనజీవితాలకు మార్గదర్శులుగా ఉండాలంటున్నారు. దేవుని మాట ప్రకారము జీవించే వారు నిజముగా మతమును అవలంబించేవారు. వానికే దేవుని ఆశీస్సులు నిండుగా, దండిగా వస్తాయి. మనము పొరుగు వారిని ప్రేమించడమే అసలైన మతము. అంత కంటే వేరొక మతము లేదు. కావున లోక ఆశలనుండి దూరముగా ఉండుటయే దేవుని దృష్టిలో నిజమైన మతము. 

ఆమెన్…

Br. Avinash OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...