13, మార్చి 2021, శనివారం

తపస్సుకాల 4 వ ఆదివారము

తపస్సుకాల 4 వ  ఆదివారము

2 రాజు దిన 36: 14 – 16, 19-20
ఎఫెసీ 2: 4 - 10

యోహాను 3: 14 - 21  


ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనమందరము తపస్సుకాల నాలుగవ ఆదివారవములోనికి ప్రవేశించియున్నాము. మరి ఈనాటి దివ్య పఠనాలు మనకు ఒక విషయాన్ని  సూచిస్తున్నాయి. అదే దేవుని పైన మానవులకు గల నిర్లక్ష్యం. మరి ఈ నిర్లక్ష్యం ఎంత వినాశనానికి దారితీస్తుంది అని మనందరికీ తెలుసు.  ఇది ఒక చిన్న పదమే కానీ, దీని ఫలితం మాత్రం చాల పెద్దది. దీనిని అలవాటు చేసుకున్నవారికి నాశనము తప్పదు. వారు ఎంత గొప్పవారైనా సర్వనాశనానికి గురిచేస్తుంది. వారు మాత్రమే కాక వారి సన్నిహితులను, పొరుగువారిని సహితము ఇది నాశనము చేస్తుంది.

నిర్లక్ష్యము:

‘నిర్’ మరియు ‘లక్ష్యము’. “నిర్” అనగా వదిలివేయడము, దూరముగా ఉండటం. అనగా లక్ష్యమును వదిలివేయడటము లేదా దూరముగా ఉండటం. ఇదే మాటకు సాధారణ పరిభాషలో లెక్క చేయకపోవటం, మాటవినకపోవడటము, పెడచెవినిపెట్టడము అను అర్ధాలు ఉన్నాయి. ఇంకా వివరముగా చెప్పాలంటే మనకు ఎవరన్నా ఏదైనా చెబుతుంటే, మాటలు వినబడుతున్నా వినబడనట్లు ప్రవర్తించడం. మనుషులు కనబడుతున్నా కనబడనట్లు ప్రవర్తించడం, మరియు మన ప్రక్కన ఉన్న ఒక మనిషిని మనిషిగా గుర్తించకపోవడటము.

ప్రియమైన క్రైస్తవులారా, ఈ నాటి మొదటి పఠనములో మనము గమనించినట్లయితే నిర్లక్ష్యము వలన ఇశ్రాయేలీయులు పొందిన ఫలితము మనము చూస్తున్నాము.  ఇశ్రాయేలు రాజులు, యాజకులు మరియు ప్రజలు దేవుని ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టి దేవుని బాటను నిర్లక్ష్యము చేసారు. దేవుడు వారికి ఏర్పరచిన ప్రణాళికను; అనగా ఇతరేతర జనుల మధ్య నిజదేవుడైన యావేకు ప్రతీకలుగా, నీతిన్యాయము చొప్పున  నడుచుకుంటూ ఉండాలని. వారు ఈ దేవుని ప్రణాలికను నిర్లక్ష్యము చేసారు. దేవాలయమును అమంగళము చేశారు. దేవుని యొక్క ప్రవక్తలను ఎగతాళి చేసారు. దేవుని స్వరమును, వాక్కును అయిన ప్రవక్తలను తృణీకరించారు.

ఎప్పుడు అయితే వారు దేవుని తృణీకరించారో  అప్పడి నుండే వారి పతనము ఆరంభమయింది. ఏ అధికారమును, ప్రతిభను, సంపదలను, భూమిని, మందిరమును చూసి వారు మురిసిపోయారో, గర్వపడ్డారో, వాటన్నిటిని ప్రభువు వారి నుండి దూరం చేసారు. సింహాసనము నుండి రాజులు త్రోయబడ్డారు, దేవాలయము నుండి యాజకులు వెలివేయబడ్డారు, మరియు చంపబడ్డారు. ప్రజల సంపద అంతా దోచుకొనబడినది. నాది, మాది అనుకున్న ప్రతి దాని నుండి వారు దూరం చేయబడ్డారు, వేరు చేయబడ్డారు. మరి అన్ని కోల్పోయి మిగిలి ఉన్నవారిని బబులోనియా రాజు తనకు, తన ప్రజలకు దాసులుగా, దాసీలుగా ఊడిగము చేయుటకు తీసుకొని వెళ్ళాడు. 

ఈనాడు మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతములో పనే లోకముగా జీవించినా, పదవే లక్ష్యముగా, డబ్బే ముఖ్యమని, ఆ తర్వాతే అన్నీ అని, నా ప్రతిభ ద్వారా అన్నీ చేయగలమని అనుకున్నామా! ఆ దేవుడు చూపిన వెలుగులోనికి, మార్గములోనికి ప్రవేశించకుండా నిర్లక్ష్యము చేస్తూ ప్రతి రోజు చేసే ప్రార్ధనే కదా, ప్రతి ఆదివారము పాల్గొనే పూజా కదా, ఎప్పుడు చదివే బైబిలే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా, అని నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించామా!. ఒకవేళ మనము ఈవిధమైన ఆలోచనలతో జీవించి ఉంటే మారు మనస్సు పొంది, ప్రభవునే లక్ష్యముగా చేసుకొని, ఆయనే మన మార్గము, సత్యము, జీవమని విశ్వసించి ఆయన చూపిన మార్గములో నడువ కావలసిన అనుగ్రహాలకై ఆ దేవతిదేవుణ్ణి వేడుకుందాము. ఆమెన్ .

By . Br. Avinash

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...