20, మే 2022, శుక్రవారం

పాస్క కాల 6 వ ఆదివారం

 పాస్క కాల 6 వ ఆదివారం 

అపో. కా 15:1-2,22-29 దర్శన 21:10-14,22-23 యోహను 14:23-29 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ నాడు తల్లి తీరుసభ ఈస్టర్ 6 వ ఆదివారం లోనికి అడుగిడుతుంది. ఈనాటి  మొదటి పఠనం అపోస్తుల కార్యముల నుండి తీసుకొనబడింది. ఈ పఠనంలో  ఒక ముఖ్యమైన సంఘటనను వివరించడం చూస్తున్నాము. అది ఏమన “రక్షణ”మరియు సున్నతి .

ఈ సున్నతి వలన యూదులకు మరియు పౌలు , బర్నబాలకు మధ్య ఒక గొప్ప వివాదం చోటుచేసుకుంది. అది ఏమి అంటే యూదులకు సున్నతి  పొందిననే తప్ప రక్షణ లేదు అని పౌలు, బర్నబాలు  రక్షణ పొందడానికి సున్నతితో సంభందం లేదు అని వాదించారు.  యూదులు ధర్మ శాస్త్రానికి మరియు మోషే చట్టానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వారు పాటించడాని కంటే ఎదుటివారు పాటించడం మీద  ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు,  ఉదాహరణకు ఈనాటి వాక్యము మరియు క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన సంఘటనలు.

చట్ట ప్రకారము సున్నతి  పొందితేనే రక్షణ మరియు దేవాలయము లోనికి అనుమతి. యూదులకు అన్యులు దేవాలయమునికి రావడం ఇష్టమే కాని వారు సున్నతి పొందిన వారై ఉండాలి. సున్నతి పొందటం అంటే యూదుడుగా మారుటయే అని యూదులు భావించేవారు. పౌలు , బర్నబాలు యూదుల మాటలన్నీ త్రోసివేసి దేవుడు ఒక్కడే, అన్యులకు , యూదులకు , గ్రీకులకు అందరకు ఆయనే దేవుడు, ఆయన యందే రక్షణ అని ధృడంగా వాదించారు. రోమి 3:29... దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడే, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ధర్మ శాస్త్రమనే సంకెళ్లతో యూదులు ఎప్పుడు బంధించడానికి ప్రయత్నించేవారు. కాని పౌలుగారు చెప్పినట్లు  మరణించిన వారి మీద ధర్మ శాస్త్రము వర్తించదు. మనము క్రీస్తు శరీరము ద్వారా మరణించితిమి, ఆయన లేవనెత్త బడినట్లు మనము ఆయనలో సజీవులమయ్యాము, అంటే ధర్మ శాస్త్రముల నుండి విముక్తులమై, వ్రాతపూర్వకమైన ధర్మ శాస్త్రమును అనుసరించిన పాత పద్ధతిలోకాక,  ఆత్మానుసరమైన క్రొత్త పద్దతిలో  దేవుని సేవించు చున్నాము. రోమి 7:1-6.

విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహముకూడ ఎటువంటి ధర్మ శాస్త్రమును పొందలేదు, ఎటువంటి సున్నతి పొందక ముందే  దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింప బడ్డాడు. రోమి 4 :10  అబ్రహాము సున్నతి పొందక పూర్వమే విశ్వాసము వలన దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. దేవుని బిడ్డలు కావాలంటే, దేవుని రక్షణ పొందాలంటే విశ్వాసము అవసరము కాని బాహ్యకరమైన సున్నతి కాదు.

రోమి 3:30 విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని , సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను చేయును. అంతియోకులో ఈ వివాదము చోటు చేసుకోవడానికి కారణం కొంత మంది యూదులు, ఎవ్వరైతే అన్యులంటె గిట్టని వారో  , వారు ఎప్పుడు, యూదులు దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు అని, గర్వంతో వుంటూ ఇతరులను అన్యులుగా పరిగణించేవారు.

ఎప్పుడైతే ఈ కొంత మంది యూదులు, విశ్వాసులుగా మారిన యూదులు,  అన్యులు మధ్యకు వచ్చి ఈ యొక్క మాటలను అన్నారో అప్పుడు యూదులకు మరియు పౌలు, బర్నబాలకు మధ్య వివాదం మొదలైంది. ఇటువంటి ప్రవర్తనే మన క్రైస్తవత్వం లోనికి వస్తే మనము కూడా యూదా మతం లాగా వర్గాలుగా మారాల్సి వచ్చేది.

క్రైస్తవత్వం  అంటేనే కలయిక , కలసిఉండటం. ఈ కలయిక వలనే క్రైస్తవత్వం అంటారు. మనమందరం కూడా క్రీస్తులో ఐక్యమవటం, ఆయనలో కలసి ఉండటం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలసి ఆయన నామమున ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఉంటాను  అని అన్నాడు.

దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాదం ఇవన్నీ ఒక్కరి కోసం కాదు, ఒక తెగ కోసం కాదు, ఒక జాతి కోసం కాదు. జాతి , కుల , ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా అందరు కలసి పాల్గొనే దానినే  దివ్య బలిపూజ, అందరు కలసి భుజించే దానినే దివ్య సత్ప్రసాదం, అందుకే క్రైస్తవం,  కలసి చేసేది, కలసి ఉండేది, క్రైస్తవత్వం. అందుకే  పౌలు , బర్నబాలు ఈ సమస్యను  అపోస్తులులు, పెద్దలు మరియు క్రీస్తు సంఘంలోని వారి యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఎంతో చాక చక్యంగా మెలిగిరి.

వారికి వారుగా, వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారు పవిత్రాత్మ సహాయాన్ని కోరారు. వారు పవిత్రాత్మ  సహాయము ద్వారా ఎంతో చాక చక్యముగా ఈ సమస్యను చక్క దిద్దారు. యేసు ప్రభువు చెప్పినట్లు మిమ్ము నడిపించడానికి మీకు  తోడుగా ఒక సహాయకుడిని  పంపిస్తాను, ఆయన మీకు అన్నీ విషయాలలో అన్నీ వేళలా తోడ్పడతాడు అని, ఆ పవిత్రాత్మ వారికి తోడ్పడింది ఈ సమస్యను తీర్చడానికి . యోహను 16:13-14. వారు సమస్యను చక్క దిద్దటమే కాదు, సమస్యను చక్క దిద్దటములో ఎంతో తెలివిగా మెలిగారు.

వారు రాసిన లేఖను తిరిగి పౌలు , బర్నబాలకు ఇచ్చి పంపించ కుండా, వారిలో ఇద్దరును ఎన్నుకొని, ఇద్దరికి  పౌలు , బర్నబాలతో లేఖను ఇచ్చి పంపిచ్చారు.  పౌలు, బర్నబాలు  లేఖను  తీసుకొని వెళ్లినట్లయితే ప్రజలు  నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే  వీరు మార్గ మధ్యములో, కూడబలుకుకొని  ఒక లేఖను తీసుకొని వచ్చి మనలను నమ్మిస్తున్నారు, అని అపోహ పడే వారు. కానీ పవిత్రాత్మ  ఇద్దరినీ పౌలు , బర్నబాలతో పంపించి లేఖను చదివించి అంతియోకులో , సిరియాలో, సీలీషియాలో ప్రజల విశ్వాసాన్ని దృడం చేసింది. 

ఈనాటి రెండవ పఠనంలో యోహను గారికి కలిగిన దర్శనం  గురించి వివరిస్తున్నాడు. ఈ  యొక్క దర్శనం నూతన యెరుషలేము గురించి మరియు దాని వైభవము గురించి వివరిస్తుంది. యెరుషలేము  నగరం దాని యొక్క కాంతి, ప్రాకారము, ద్వారములు, గోడలు మరియుదేవుని సన్నిధి గురించి తెలియజేస్తుంది.  ఇటువంటి దర్శనమును  మనము యెహేజ్కెలు గ్రంధంలో కూడా చూస్తాము. ప్రభువు యొక్క సన్నిధి దర్శనములో యెహెజ్కెల్ ప్రవక్తను యిస్రాయేలు దేశమునకు తీసుకొనిపోయి ఒక ఉన్నత పర్వతం పై నిలిపి ఆ నగరపు కట్టడములను చూపిస్తాడు ( యెహెజ్కెలు 40:2 )

ఈ యొక్క నగరపు గోడలు మీద  యిస్రాయేలు ప్రజలు యోషయా గ్రంధంలో పాటలు పాడటం చూస్తాము. యోషయా 26:1 మాకోక బలమైన పట్టణము కలదు. ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును. యోషయా 54:11-12 విలువ గల మణులతో నిన్ను పుననిర్మింతును , నీల మణులతో నీ బురుజులు కట్టుదును, అరుణ కాంతిలీను మణులతో నీ ద్వారములు కట్టుదును, ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.

 నగరమునకు 12  ద్వారములు క్రైస్తవ సంఘాన్ని సూచిస్తున్నాయి. ఆ 12 ద్వారములకు 12 గోత్రముల పేర్లు లిఖించ బడినవి, ఇవి క్రైస్తవ సంఘం నడచుకునే , కొనసాగే విధానాన్ని  సూచిస్తున్నాయి. ఈ యొక్క నూతన యెరుషలేము ద్వారములు గురించి యెహేజ్కెలు  ప్రవక్త తన గ్రంధంలో వివరించాడు. (యెహేజ్కెలు 48:30-35.) తూర్పున ఉన్న ద్వారములు సూర్యుడు ఉదయించే వైపుని తలపిస్తాయి, ఇది ప్రతిరోజు ఉదయము ప్రభుని పవిత్ర నగరం లో వేదకటాన్ని  సూచిస్తుంది. ఉత్తరమున ఉన్న ద్వారము చల్లని ప్రదేశమును తలపిస్తాయి, క్రైస్తవత్వంలో క్రైస్తవులు హృదయంలో విశ్వాసాన్ని ధృడపరచుకునే మార్గంగా సూచిస్తున్నాయి. దక్షిణమున ఉన్న ద్వారములు వేడి ప్రదేశములకు తలపిస్తాయి, ఈ ప్రాంతములో గాలులు  ప్రశాంతముగా వీచుతాయి.  వాతావరణం సున్నితముగా వుంటుంది, ఇది ఎవ్వరైన బావోద్వేగాలతో సిలువ మీద ప్రేమతో వచ్చేవారికి మార్గముగా సూచిస్తుంది.పడమర ఉన్న ద్వారములు సూర్యుడు, అస్తమించే వైపు ఇవి పవిత్ర నగరములోని సాయం కాల సమయమున క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చే వారికి మార్గమును సూచిస్తుంది.

ఈ యొక్క క్రొత్త యెరుషలేము నగరములో ఎన్నో ఉన్నాయి, కానీ యోహను గారికి దేవాలయం మాత్రం కనిపించలేదు. యూదులకు  దేవాలయం  ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యం , ఎంతో పవిత్రత కాని అ క్రొత్త నగరమున దేవాలయం మాత్రం కనిపించలేదు. కాని ఒక గొర్రెపిల్ల మాత్రం కనిపించి దానినే దేవాలయముగా  యోహనుగారు భావించారు, యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్లు  ప్రభువే ఆ నగరమునకు దేవాలయం (యెహేజ్కేలు 48:35)  నగరమునకు ప్రభువు ఇచ్చట ఉన్నాడు అని పేరు పెట్టవలెను. 

రాతితో కట్టబడిన దేవాలయం కాదు మన విశ్వాసాన్ని తెలియజేసేది. మన అంతరంగంలో కట్టబడే విశ్వాసం అనే దేవాలయం తెలియ జేస్తుంది, క్రైస్తవులు అంటే ఎవరు అని. రాతితో కట్టబడిన  దేవాలయంలో కాదు ప్రభువు వసించేది, నీ హృదయంలో.  ప్రభువు సమరియా స్త్రీ తో చెప్పినట్లు పర్వతము మీదనో లేక దేవాలయంలో కాదు దేవుని ఆరాధించేది, నీ హృదయంలో దేవుని ఆరాధించే దినములు వస్తాయి అని.

పౌలు గారు చెప్పినట్లు  మన శరీరం దేవుని ఆలయం, మనముకాదు జీవించేది మనలో క్రీస్తే జీవిస్తున్నాడు అని . బాహ్యంగా కనపడేది కాదు ప్రభువునకు కావలసినది. కానీ నీ యొక్క అంతరంగంలో ఏమున్నది అని ప్రభువు లెక్కిస్తాడు, మొదటి పఠనములో యూదులు బాహ్యమైన సున్నతికి  మరియు ధర్మ శాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చారు కాని వారి అంతరంగమునకు కాదు.

 సువిశేష పఠనములో యోహను సువార్తికుడు తండ్రి కుమారుల బంధాన్ని, కలయికను వర్ణిస్తున్నాడు. తండ్రి కుమారున్నీ ఎంతగా ప్రేమిస్తాడో, కుమారుడు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈనాటి సువిశేషంలో చూడవచ్చు. అధె విధంగా తండ్రి, కుమారులను ప్రేమించే వారిని దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడో కూడా చూడవచ్చు.

యోహను సువిశేషమంత గమనిస్తే, సువార్తికుడు అయిన యోహను గారు ప్రభువునకు ప్రియమైన శిష్యుడు, ఆయన ప్రేమను ఎంతగా పొందాడో , ఈయన ప్రభువుని ఎంతగా ప్రేమించాడో, ఈయన రాసిన సువిశేషం ద్వారా మనకు అర్ధం అవుతుంది.

యోహను గారికి అంతా కూడా  దేవుని ప్రేమ, ప్రేమ అనేది అన్నిటికీ మూలాధారం. దేవుడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు, ప్రభువు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుడు మానవున్ని  ప్రేమిస్తున్నాడు, మానవుడు, దేవున్ని  ప్రేమిస్తున్నాడు, మానవుడు, మానవుడిని ప్రేమిస్తున్నాడు, సృష్టి అంతయు కూడా ప్రేమ అనే బంధంతో ముడి పడియుంది. విధేయతకు ములాధారం ప్రేమ, అందుకే దేవుడు ఉత్థానమైన తరువాత ఆయనను ప్రేమించిన వారికి కనిపించారు, కాని పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులకు మరియు యూదులకు కాదు. తండ్రి మీద ప్రేమ వలన క్రీస్తు ప్రభువు, సిలువ మరణాన్ని విధేయతతో స్వీకరించాడు.

ఇది అర్ధం కాని  వారు, సిలువ మరణాన్ని అసభ్యకరమైన మరణంగానే చూస్తారు.  కాని దానిలోని ప్రేమను కాని త్యాగాన్ని కాని విధేయతను కాని అర్ధం చేసుకోరు. ప్రభువు ఒసగిన రెండు ప్రధాన  ఆజ్ఞలను ఈనాటి సువిశేషంలో చూస్తాము. తండ్రి దేవుని ప్రేమించడం , తన పొరుగువారిని ప్రేమించడం. ప్రభువు తండ్రి దేవుని ప్రేమించాడు కాబట్టి విధేయతతో ప్రభువు ఒసగిన కార్యాన్ని  నెరవేర్చాడు.తన  స్నేహితులు , పొరుగువారు అయిన శిష్యులను ప్రేమించాడు అందుకే వారిని ఒంటరిగా  వదలి వేయకుండా వారికి తోడుగా పవిత్రాత్మను ఇస్తున్నాడు.

ఈ పవిత్రాత్మ మనకు అన్నీ విషయాలను బోధిస్తుంది, ప్రభుని మాటలను తెలియచేస్తుంది. ఆయన మార్గంలో నడుచుటకు సహాయకునిగా ఉంటుంది. ఎవరైతే ఆయన  యందు ప్రేమ కలిగి ఉంటారో, వారికి తన సమాధానం ఓసగుతాను అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రభుని సమాధానం అంటే కొద్ది కాలం ఉండేది కాదు, చివరివరకు మనతో ఉండేది. ఒక్క కష్టములలో మాత్రము కాదు, అన్నీ విషయాలలో మనతో ఉండేది. రోమి 5: 6-11 నీతిమంతుని కొరకై, సత్పురుషుని కొరకై , పాపాత్ములమైన మన కొరకై ఆయన మరణించేను. మన దేవుడు, మనపై తనకు ఉన్న ప్రేమను చూపాడు. అంతే కాదు ఆయన ద్వార మనం సమాధానం పొందాము.

 Br. Lukas OCD 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...