4, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాలం రెండవ ఆదివారం (2)

 ఆగమన కాలము 2వ ఆదివారము (2)

బారుకు 5:1-9, పిలిప్పీ 1:4-6,8-11, లూకా 3:1-6 

నేటి దివ్య పఠనాలు దేవుని రాకకు మార్గమును సిద్ధపరచుట గురించి భోదిస్తున్నాయి. మన హృదయములో దేవునికి రాజమార్గమును సిద్ధపరచాలి. మన హృదయములో అయన ప్రయాణము చేయాలంటే మనము మార్గము సిద్దము చేయాలి. గమ్యము చేరుటకు ప్రతి మార్గము ముఖ్యం. దేవుడు మానవ హృదయము అనే గమ్యము చేరాలంటే మనయొక్క జీవిత మార్గము సరిగ్గా ఉండాలి. మన యొక్క జీవిత ప్రయాణములో ఎన్నో రకాలైన మార్గాలు మనము చూస్తున్నాము. ఇరుకైన మార్గము, సులువైన మార్గము, గుంతలతో ఎత్తుపల్లాలతో ఉన్న ఎన్నో మార్గాలను చూస్తుంటాము. అయితే గమ్యమునకు చేరవేసే మార్గము ఎలాంటిది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాలన్నా, లేదా దేవుడు మన రాజ్యములోనికి ప్రవేశించాలన్నా నీతిమంతమైన, దైవభయము కలిగిన మార్గమును అనుసరించాలి. ఈనాటి మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బబులోనియా నుండి యెరూషలేము వెళ్ళుటకు మార్గము సిద్దము చేస్తున్నారు. యిర్మీయా ప్రవక్త యొక్క స్నేహితుడు, శిష్యుడైన బారూకు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఒక శుభవచనములు తెలియజేస్తున్నారు.

యూదా రాజ్యము పతనమై యూదులంతా బబులోనియాకు బానిసలుగా ఈడ్చుకుని పోబడిన సమయములో అనేక విధాలుగా వారు శ్రమలు అనుభవించారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అనే ఎదురు చూసేవారు. దేవుని యొక్క సీనాయి ఒప్పందమును నిరాకరించినందుకు ఈ దురదృష్ట స్థితి అని భావించేవారు. ఈ సమయములో దేవుడు వారి మనవులను ఆలించి వారికి బారూకు ప్రవక్త ద్వారా ఒక శుభవార్తను తెలియపరుస్తున్నారు. బారూకు 5:1 వ వచనము చాల సంతోషమునిచ్చే వాక్యము.

1.        మనము ధరించే వస్త్రములు మన శరీరమును కప్పి వేస్తాయి. బారూకు ప్రవక్త అంటున్నారు, మీ మనస్సులను కప్పివేసిన విచారమును, మీ హృదయములను కప్పివేసిన చింతలు, బాధలు అన్నింటిని తొలగించండి. దేవుని మీరు మీ స్వంత భూమిలో ఆరాధించే సమయము రాబోతుంది. బానిసత్వములో మ్రగ్గుతున్న ప్రజల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా బాధతో, భయముతో, అధైర్యముగా ఉంటాయి. ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాలి. అలా హీనస్థితిలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు బారూకు ద్వారా తెలిపిన మాటలు, ఇక ఎలాంటి విచార వస్త్రములు ధరించవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడే మీకు సంతోష వస్త్రమును ఇవ్వబోతున్నారు. దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించుము అని అంటున్నారు. మన జీవితములో అందమునకు చాల ప్రాముఖ్యతను ఇస్తుంటాము. ఇక్కడ ప్రవక్త శాశ్వత సౌందర్యమును గురించి మాట్లాడుతున్నారు. దైవ భయం అనే వస్త్రంను ధరించే ముందు మనం స్వార్ధం,పగ ,ద్వేషం , అసూయ అనే వస్త్రాన్ని తీసివేయాలి. అప్పుడే మనం దైవ బీతి అనే వస్త్రాన్ని ధరించగలం. 
2.      దైవ భయము అనే వస్త్రము ధరిస్తే, అలాగే దైవ ప్రేమ కలిగి, విశ్వసనీయత కలిగి ఉంటే వారిలో ఎల్లప్పుడూ కూడా సంతోషమే కలుగుతుందని తెలుపుచున్నారు. ఈ దైవ భయము అనే శాశ్వత సౌందర్యమునకు ప్రాముఖ్యతనిస్తే అది చిరకాలము ఉంటుంది.
 
·         దైవ భయము ఉంటే దేవునికి విధేయులై జీవిస్తారు.
·        దైవ భయము ఉంటే అన్య దైవములను ఆరాధించరు.
·         దైవ భయము ఉంటే ఆజ్ఞలు పాటిస్తారు.
·         దైవ భయము ఉంటే దేవునికి సన్నిహితముగా జీవిస్తారు.
·         దైవ భయము ఉంటే పాపములో పడిపోరు..


            అందుకే ప్రవక్త దైవ భయము అనే శాశ్వత సౌందర్యమును ధరించమని పలుకుచున్నారు. అందం అసలయితే నశించిపోతుంది కానీ, దైవభయము ఉంటె శాశ్వత సౌందర్యము ఉంటుంది అనగా వారిలో కొరత ఉండదు, సంతోషమే ఉంటుంది.

3.       దేవుని యొక్క నీతి వస్త్రమును ధరింపుము అని అంటున్నారు. దేవుని యొక్క పవిత్ర వస్త్రమును ధరింపమని ప్రవక్త తెలియపరుస్తున్నారు. దేవుని నీతి వస్త్రము అంటే అయన యొక్క జీవితమునే మనము ధరించాలి. ఎఫెసీ 6:11 దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించమని పలుకుచున్నారు. అది ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనలను అభివృద్ధిపరుస్తుంది.

రెండవ పఠనంలో పౌలుగారు పిలిప్పీయుల పట్ల వ్యక్త పరిచే ఆనందం గురించి వింటున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం అర్ధం చేసుకోవాలి. 

1. పిలిప్పీ క్రైస్తవులు ఎలాగున పౌలు గారికి తన యొక్క  సువార్త  ప్రచారంలో సహాయం చేశారన్న అంశం. 

2. పిలిప్పీ క్రైస్తవుల కోసం చేస్తున్న ప్రార్ధన. 

పిలిప్పీ క్రైస్తవులు  పౌలు గారి యొక్క  సేవకు ధన సహాయం చేస్తూ సువార్త కృషిలో ఆయనకు భాగస్వాములుగా వున్నారు. (1:5).  తన యొక్క దేవుని కార్యంలో పాలు పంచుకొనిన వారికి ఆయన కృతజ్ఞత తెలుపుచున్నారు. వారి పట్ల ప్రేమను, సంతోషమును వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా వారికోసం ప్రార్ధిస్తున్నారు. 

పౌలు గారు చక్కగా అంటున్నారు "మీకు నా హృదయమందు ఎప్పుడు స్తానం ఉందని చెబుతున్నారు. (1:7) 

ఆయనకు ఎంతగానో  వారు సహకరించి ఉంటేనే పౌలు గారు ఇంతటి గొప్ప మాటలు పలుకుచున్నారు. ఆనాటి పిలిప్పీ క్రైస్తవులు పౌలుగారిని ప్రేమించే వారు , గౌరవించేవారు ,ఆదరించేవారు. ఆయన యొక్క కష్ట కాల సమయములో వారు అండగా నిలబడ్డారు. దేవుని రక్షణ కార్యంకు సహకరించినందుకు వారి కోసం ప్రార్ధిస్తున్నారు. మనల్ని ప్రేమించి ,మంచి చేసే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తించుకొని వారికి ఎప్పుడు కూడా మన హృదయంలో చోటిస్తాం. పౌలు గారికి మంచి చేసి, సహకరించిన పిలిప్పీ క్రైస్తవులకు తన హృదయంలో చోటిచ్చారు. 

ఈనాటి సువిశేష పఠనంలో బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధనలు వింటున్నాం. దేవునియొక్క రాకడకోసం అయన ప్రజలను అయన తయారు చేసే విధానం గురించి వింటున్నాం.

  దేవుడు ఎన్నుకొన్న ప్రవక్త ప్రజలయొక్క జీవితములో దేవునియొక్క వెలుగును నింపుటకు అదేవిధంగా దేవునియొక్క రాకడ కోసం ప్రజలయొక్క హృదయాలను సంసిద్ధం చేస్తున్నారు. దేవుడిని మన హృదయములోకి ఆహ్వానించాలంటే, హృదయ పరివర్తన అవసరం. హృదయ పరివర్తన ద్వారా మన మనస్తత్వం మార్చుకోవాలి. హృదయ పరివర్తనం క్రొత్త జీవితానికి నాంది. మనం హృదయ పరివర్తన చెందితేనే క్రీస్తుతో క్రొత్త జీవితం ప్రారంభించవచ్చు.

     బాప్తిస్మ యోహానుగారు తన ప్రజలకు హృదయ పరివర్తనం చెంది బాప్తిస్మము పొందమని చెబుతున్నారు. ప్రజల జీవితాలు పాపములో వున్నప్పుడు, అవిధేయతతో వున్నప్పుడు, అవిశ్వాసముతో వున్నప్పుడు ప్రవక్త వారిని హృదయ పరివర్తనం చెంది, పాపక్షమాపణ పొందమని ఆహ్వానిస్తున్నారు. ఆయన యొక్క భోధన "ప్రభువు మార్గమును సిద్దము చేయుడు," అయన త్రోవను సరిచేయుడు అని పలికెను.

      దేవునికి మన మార్గం సిద్ధం చేయాలి. అయితే ఇంతకీ దేవుని మార్గం ఏది?

         - దేవునియొక్క మార్గం ప్రేమమార్గం 
        - దేవునియొక్కమార్గం క్షమించేమార్గం.
         - దేవునియొక్క మార్గం కరుణ చూపే మార్గం
        - దేవునియొక్క మార్గం సేవచేసే మార్గం.
        - దేవుని మార్గం రక్షణ మార్గం.


      దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయములో వారికి ఇవన్నీ చూపించారు. ప్రజలు దేవుని యొక్క విశాలమైన మార్గమును అర్ధం చేసుకోలేదు. దేవునికోసం మన మార్గం సిద్ధం చేయాలంటే అయన ప్రేమను, క్షమను, సేవను మనందరమూ కూడా పాటించాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయటమంటే క్రొత్త జీవితాన్ని ధరించటమే. ఇప్పటి వరకు మనం వేళ్ళ స్వార్ధ మార్గం విడిచిపెట్టి దేవుని మార్గమును అనుసరించాలి. ఒకరు తమయొక్క పాపపు స్థితిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండటమే రక్షణకు ప్రారంభము . లాతిను భాషలో ఒక సామెత ఈ విధంగా ఉంది, ఒకరు తమ పాపాలను సమర్ధించుకోకుండా, తన పాపాలను అగీకరించినపుడు వారు దేవుని ఎదుట నీతిమంతులు అవుతారు. నాతాను ప్రవక్త దావీదు చేసిన పాపాలు చెప్పినప్పుడు దావీదు మహారాజు అంగీకరించారు.అందుకే దేవుని ఎదుట అంగీకరించబడ్డాడు. తన లోపాలు ఎప్పుడూకూడా గుర్తించుకున్నారు - (కీర్తన:51 :3 ). మనం కూడా దేవుని యొక్క మార్గములో నడిస్తే,తప్పనిసరిగా మనందరిలో దేవుని జీవితం ప్రారంభమవుతుంది.బాప్తిస్మ యోహానుగారు దేవుని మార్గంలో వున్న సవరణ గురించి తెలుపుచున్నారు. ఎలాగ దేవుని మార్గమును మన జీవితములో సిద్ధపరచాలి అన్నది ధ్యానించుకోవాలి.   
సువిశేషములో 5 వ వచనంలో యోహానుగారు అంటున్నారు,
1.    ప్రతి లోయ పూడ్చబడును:
 లోయలు ఎప్పుడు కూడా క్రిందకువుంటాయి. అనగా వినయముతో జీవించే విశ్వాసులను దేవుడు తన యొక్క దీవెనలతో నింపుతాడు. దేవుని కొరకు విశ్వాసముతో ఎదురుచూసే వారందరియొక్క హృదయాలు నింపబడతాయి. మన హృదయములో, జీవితములో వున్నా లోయలు పూడ్చబడాలంటే,మనలో వినయము, విశ్వాసము ఉండాలి. అప్పుడే మనలోకి దేవుని ఆత్మ వస్తుంది.
 2.పర్వతాలు, కొండలు చదును చేయబడాలి:
పర్వతాలు, కొండలు ఎత్తునకు గుర్తు. మన జీవితములో కూడా కొని సార్లు మనం ఎత్తున జీవిస్తాం .
 - అహం అనే ఎత్తున.
 -స్వార్ధం అనే ఎత్తున. '
- క్షమించలేకుండా జీవించే ఎత్తున ఉంటాం.
     మనలో వున్న అహంను అణచి వేయాలి. స్వార్ధమును అణచివేయాలి.అప్పుడే అవి ప్రభువును ఆహ్వానించడానికి ఎంతో సహాయపడతాయి. మనజీవితములో ఉన్నతస్థాయిలో వున్నప్పుడు మనమే గొప్ప అనే భావనలో ఉంటాం కానీ, దేవుడు అన్నీ కూడా సమము ఇయ్యబడును అంటున్నాడు. అప్పుడు ఎటువంటి భేదములు వుండవు.  - పేద- ధనిక భేదములు వుండవు.
               - అన్యులు- యూదులు అని భేదములు వుండవు.
                -పాపి- నీతిమంతుడు అని భేదములు వుండవు.
అందరూ కూడా దేవుని దృష్టిలో సరిసమానులే, అందరూ దేవుని బిడ్డలే అనే భావన మాత్రమే ఉంటుంది.
3. వక్రమార్గములు సక్రము చేయబడును:  
       వక్రమార్గములు అంటే, సొంతలాభాముకోసం అనుసరించే మార్గం. స్వార్ధముతో జీవించే మార్గాలు, దేవుని చిత్తానికి వ్యతిరేఖంగా జీవించే మార్గములు. ఇంకొన విధముగా చెప్పాలంటే, అడ్డదారులు, అవినీతితో కూడిన మార్గాలు విడనాడి సక్రమముగా నీతితో జీవించాలి. మన జీవితములో కూడా చాలా వక్రమార్గాలను వెంబడిస్తున్నాము. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, అలాగే  తల్లి దండ్రులకు తెలియకుండా పిల్లలు వక్రమార్గాలు అనుసరిస్తున్నారు. అవన్నీ కూడా దేవుని రాకడ కోసం సక్రమము చేయబడాలి. సక్రమంగా చేయబడాలి అంటే,దేవుని యొక్క అనుగ్రహముతో వ్యక్తిగతముగా ప్రయత్నించాలి.
 4.  కఱుకుమార్గం నునుపు చేయబడును: 
        ప్రతియొక్కరియొక్క జీవితములో కఱుకు మార్గాలుంటాయి. ద్వేషం అనే కఱుకులు.అసూయ, పగ, కోపం,పాపం,స్వార్ధం అనే కఱుకులు, అసమానతలు,బలహీనతలు ఉంటాయి. వాటిని దేవుని యొక్క సుగుణాలు పాటించుటద్వారా నునుపు చేసుకోవాలి.
ఎవరైతే ప్రవక్తయొక్క మాటలను ఆలకించి దేవునికోసం తన జీవితములో మార్గాలను సిద్ధం చేసుకుంటారో వారిలోకి, వారి హృదయం అనే గమ్యంకు దేవుడు చేరతాడు. బాప్తిస్మ యోహానుగారి భోధన అనేకమంది జీవితాలను దేవునిరాకకోసం సిద్ధం చేసింది. ఈనాడు మనకు  భోధింపబడుచున్న భోధన ద్వారా మన జీవితాలను ఎలా మనం సిద్ధం చేసుకుంటున్నాం.  సిద్ధం చేయుట గురించి పవిత్ర గ్రంధం చాలా సార్లు బోధించింది. ఆమోసు :4 :12, హోషేయ :10:12, యవేలు:2:12-13,మత్తయి :24:44,మార్కు : 13:35.  
      ఈయొక్క ఆగమన కాలములో, దేవుని రాక కోసం మన హృదయాలను ఎలాగ చేసుకుంటున్నాం. చేసుకుంటున్నాం. 
    మంచి కార్యాలు చేస్తున్నామా? ప్రేమను పంచుతున్నామా? క్షమిస్తున్నామా?దేవుని వాక్యం చదివి వాక్యం ధ్యానిస్తున్నామా?
   వ్యక్తిగతముగా మనం ఎలాగ సిద్దపడుచున్నాము అని మనం ధ్యానించుకొని, మన జీవితాలను మార్చుకొని దేవుని రాకడ కోసం మార్గమును సిద్ధం చేద్దాం. 
Rev.Fr. Bala Yesu OCD
 

    


ఆగమన కాలము 2వ ఆదివారము

 
ఆగమన కాలము 2వ ఆదివారము

బారుకు 5:9,

ఫిలిప్పీ 1:4-6,8-11,

లూకా 3:1-6

క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి అయిన తిరుసభ ఈరోజు మనలను 2వ ఆగమన కల ఆదివారములోనికి ఆహ్వానిస్తూ, మనలను ఒక్కసారి మనము చేస్తున్న పనులను ఆపి, మనము పయనించే దారి ఎటువైపునకు సాగుతుందో చూసి, దానిని చక్కబరిచి, నూత్నీకరించి మన ప్రయాణాలను కొనసాగించమని కోరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనలను ఆంతరంగీకముగా ప్రయాణము చేయమని అడుగుతుంది.

ఆగమన కాలము అనేది దేవుని రాకను గురించి ఎదురుచూడడమొక్కటే కాదు, మనలను పరిశీలించుకుని, మన తలంపులు,మాటలు, చేతలు, చూపులు ఎటువైపు మరలుతున్నాయో అని గమనించుకుని, వక్రమైన దానిని సక్రమొనర్చుకుని, ముందు మనలను మనము అర్ధము చేసుకుని, అంగీకరించిన యెడల మాత్రమే మన మనసులో దేవునికి మరియు అతని రాజ్యానికి చోటు ఉంటుందని తెలుసుకునే కాలము. ముందు మన గమ్యము మనకు తెలిస్తే, మన ప్రయాణము ఎటువైపునకు సాగాలో మనకు తెలుస్తుంది. గమ్యము తెలియని ప్రయాణము వ్యర్ధము. క్రైస్తవులుగా, క్రీస్తులో భాగస్వామ్యులమైన మనము ఈ ఆగమన కాల 2వ ఆదివారములో మన ప్రయాణాలను ఎడారి వైపునకు మళ్లిద్దాము. ఎడారి అనేది ఒక నిర్జన ప్రదేశము. పూర్వము ఋషులు, సాధువులు ఎడారిని తమ ధ్యానమునకు తగు స్థలమని అక్కడే తమ జీవితాలను గడిపి తమలో ఉన్న దైవీక శక్తిని, మానవ శక్తిని ఐక్యపరిచి ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకుని వాటిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజు మనము మన ప్రయాణాన్ని ఈ ఎడారి వైపునకు మళ్లించి మన ఆంతరంగిక ప్రయాణాన్ని తేజోమయము చేయడానికి సంసిద్ధపడుదాము.

ఈరోజు దివ్య పఠనాలలో బారూకు ప్రవక్త, మరియు లూకా సువార్తికుడు ఈ ఎడారిని గూర్చి ప్రస్తావిస్తున్నారు. మొదటి పఠనము అయిన బారూకు గ్రంధము, యూదులు బబులోనియా దేశమునకు వలసకు పోయిన కాలములో వ్రాయబడినది. ఎంతో ఆడంబరముగా, ఆనందముగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బబులోనియాకు వలసకు పోవలసివచ్చింది. యూదులు ఇతర దేశ ప్రజల మధ్య పలు భాదలు పొందవలసి వచ్చింది. అయితే ఇదే సమయములో యిర్మీయా ప్రవక్త కార్యదర్శియైన బారూకు ఈ గ్రంధమును వ్రాసి యూదులకు, యూదులకు అనగా ప్రత్యేకించి దేవునిచే ఎన్నుకొనబడినవారికి ధైర్యము చెప్తూ ముందుకు సాగమని ప్రబోధించాడు. "యెరూషలేమూ! నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సొందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. (బారూకు 1:2) ఒక ఆనందకరమైన వార్తతో, ఉత్తేజింపజేసే పలుకులతో బారూకు యూదులకు భోదిస్తున్నాడు. ఈ ప్రవచనాలు, ఊరడింపు మాటలు కావు. ఈ ప్రవచనాలు దేవుని మహిమను వెల్లడి చేసే మాటలు, గత వైభవాన్ని పొందబోతున్నారని ధైర్యపరిచే మాటలు. తమను సృష్టించిన దేవుడు వారితో ఉండబోతున్నారు. గత వైభవమును ఇంకా అధికము చేసి దానిని ప్రపంచ జనులందరకు చూపించాలనే అయన కోరిక. శత్రువులు నడిపించుకొనిపోయిన, యెరూషలేము బిడ్డలను మరల వారు రాజవైభవముతో జనులు మోసుకుని వచ్చుచున్నారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయమేమిటంటే యెరూషలేము ప్రజలు బబులోనియాకు ఎడారి గుండా పయనించి, మరల ఎడారి గుండా ప్రయాణము చేస్తారు. వారు ఈ ఉత్తేజకరమైన మాటలను వినగలిగింది ఈ ఎడారి ప్రయాణములోనే.

తన ప్రజలను రక్షించగల దేవుడు ఎందుకు వారిని పరుల ఉచ్చులో చిక్కుకోనిచ్చారు? అనే సందేహము మనలో మెదల వచ్చు. కానీ మనము పరిశీలించి చూస్తే దుఃఖం తరువాత ఆనందము, బాధ తర్వాత సంతోషము, పరాజయము తర్వాత విజయము కచ్చితంగా వస్తాయని మనము అర్థమవుతుంది. కానీ మన దుఃఖ సమయములో మన ఆలోచనలు, చేతలు ఎటువైపునకు పోతున్నాయో గమనించుకోవాలి. మన బాధ సంతోషముగా మారాలంటే మనము ఏమి చేస్తున్నామో, ఏమి చెయ్యాలో మనకు తెలియాలి. పరాజయము పొందిన తర్వాత విజయము సాధించడానికి ఎంత మనోధైర్యము, కృషి, దేవుని యందు గట్టి విశ్వాసము ఉండాలో మనకు అర్ధం కావాలి. మన చేతికి ఏమి ఉచితంగా రాదు. దుఃఖమైనా, ఆనందమైనా మన చేతులలోనే ఉంది. ఎందుకంటే నిన్ను, నన్ను సృజించిన ఆ దేవుడు పూర్తి స్వతంత్రమును మనకు యిచ్చియున్నాడు. మనము చేయవలసినది ఒక్కటే. మనము ఏ మార్గమును ఎంచుకుంటున్నాము? ఏ విధముగా ప్రయాణిస్తున్నాము? మన ప్రయాణములో ఆ దేవునికి ఎంత స్థానము కల్పిస్తున్నాము? ఇవన్నీ మనము పరిశీలించుకోవాలి. ముందుగా మనము ధ్యానించిన విధముగా "గమ్యము లేని ప్రయాణము వ్యర్ధము" మన గమ్యము మనకు తెలిసిన యెడల ప్రయాణములో ఎన్ని బాధలు, అడ్డంకులు వచ్చినా కూడా వాటిని సానుకూలంగా మార్చగల దేవుడు మన దగ్గర ఉన్నాడని జ్ఞాపక పరచుకుంటాము.

అలాగే ఈ రోజు సువిశేషమును చూసుకున్నట్లయితే, బాప్తిస్మ యోహాను యొర్దాను నదీ పరిసర ప్రదేశములందంతట సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తనం చెంది, బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యోహాను భోద చేస్తున్నది దేవాలయములో కాదు, పట్టణ ప్రాంతములో కాదు, రాజ భవనాలలో కాదు, కానీ ఎడారి ప్రాంతములో యొర్దాను నదీ ప్రదేశములో. గతకాలములో ఐగుప్తునకు వలసపోయిన ఇశ్రాయేలీయులు ఏ విధముగా తమ దేవుని తెలుసుకున్నారో, ఏ విధముగా వెనకకు తీసుకురాబడ్డారో, ఈ ఎడారి ప్రాంతములో వాళ్లలో జరిగిన ఆంతరంగిక మార్పును మరల, లూకా వ్రాసిన శుభావార్తలో ఈ రోజు మనము వినిన యోహాను బోధనా స్థలము, మరల మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది. "ప్రభువు మార్గమును సిద్ధమొనర్పుడు, అయన త్రోవను తీర్చిదిద్దుడు" అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. (లూకా 3:4)

ప్రభువు మార్గమును సిద్ధమొనర్చడానికి, అయన త్రోవను తీర్చిదిద్దడానికి, మనలను మనము సరిచేసుకోవాలని, మారు మనస్సు పొందాలని, దేవుని మార్గాన్ని అవలంబించాలని, బాప్తిస్మము పొందాలని యోహాను ఎడారిలో భోద చేసారు. ప్రవక్తగా యేసును ఈ లోకమునకు యోహాను పరిచయము చేసారు. మార్గమును సిద్ధపరచాలి అంటే ముందు ఆ మార్గము ఎటు వైపునకు దారి తీస్తుందో మనకు తెలిసి ఉండాలి. త్రోవను తీర్చి దిద్దాలి అంటే, ముందుగా ఆ త్రోవ ఎంతమందికి ఉపయోగకరంగా మారుతుందో తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉండటం ఒక్కటే కాదు, అది ఎలా చెయ్యాలో కూడా ఎరిగి ఉండాలి. ఇవన్నీ చేయడానికి మన బుద్ధి బలము, మన కండ బలము ఒక్కటే కాదు గానీ, దేవుని శక్తి, ఆయన కృప అవసరము. ఈ అధునాతన ప్రపంచములో మనలను మనము తెలుసుకోవాలంటే మనము చేసే పనులను ప్రక్కనపెట్టి, మన కోసము మనము సమయము కేటాయించుకుని, ఈ ఎడారి అనే నిర్జన ప్రదేశములో అడుగుపెట్టి మనసును కేంద్రీకరించినచో, మన గమ్య స్థానము మనకు తెలుస్తుంది. అప్పుడు మనము ఆ దేవుని త్రోవను సిద్దపరిచే సైనికులమవుతాము.

Br. Putti Kiran OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...