16, అక్టోబర్ 2021, శనివారం

29 వ సామాన్య ఆదివారం (3)

 29 వ సామాన్య ఆదివారం  (3)

ఈనాటి దివ్య పఠనాలు: యెషయా:53 :10 -11, హెబ్రీ:4 :14 -16 ,మార్కు:10 :35 -45 

         ఈనాటి దివ్య  పఠనాలు నిజమైన నాయకునికి ఉండవలిసిన  లక్షణం గురించి భోదిస్తున్నాయి. 

    దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడు సంఘమును నడిపించే నాయకుడు అదేవిధంగా కుటుంబమును నడిపించే ప్రతియొక్క నాయకుడు ఎలాగ జీవించాలన్నది, ఎలాగ వారు ఇతరులకు సేవచేయాలన్న విషయం గురించి ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

    ఈనాటి మొదటి పఠనంలో, బాధామయ సేవకునియొక్క నాల్గవ గీతం గురించి యెషయా గ్రంధంలో చదువుకుంటున్నాం.

        ఈయెషయా గ్రంధం 52 :13 -53 :12 వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకుపడిన బాధలను మనం వింటున్నాం.

సేవకుడు దేవునికొరకు అనేక రకాలైన అవమానాలు, నిందలు,శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారు.ఆయన యొక్క భాధలలో దేవుణ్ణి విస్మరించలేదు, ఆయనయందు విశ్వాసం కోల్పోలేదు. ఈ బాధామయ సేవకునియొక్క నాల్గవగీతంలో దేవుడు తెలియజేస్తున్నారు ఎలాగ ఒక సేవకుడు జీవించాలి.సేవకునికి  దైవప్రజలమీద అధికారం ఇవ్వబడింది.ఆయన యొక్క అధికారం సేవచేయుటకు,మాత్రమే వినియోగించులున్నారు,కానీ, ఎలాంటి సుఖ సంతోషాలను పొందటానికి కాదు. ఈనాటి మొదటి పఠనంలో,ప్రభువు సేవకున్ని భాధాభరితున్ని చేయుట నా సంకల్పము అని అన్నారు (10 వ) ఇక్కడ దేవుడు సేవకునియొక్క జీవితంలో కష్టాలుఒసగినప్పుడు ఆకష్టాలను అయన ప్రేమతో స్వీకరించాడు.

ఈసేవకునిలో వున్న కొన్ని లక్షణాలు ఏమిటి;

1 .అయన తన దేవునియందు వినయము విధేయతను కనపరిచాడు.ఎందుకంటే, దేవుడు స్వయంగా ఈ సేవకుడు శ్రమలు పొందాలన్నపుడు ఆయన శ్రమలు అనుభవించుటకు తాను సిద్ధముగా వున్నానని,వినయమును,విధేయతను తెలియపరుస్తున్నాడు.- యెషయా:53 :7 .

2. ఆయన ఇతరుల కొరకు జీవించినవ్యక్తి.పరుల పాపపరిహారం కోసం తన జీవితమునే త్యాగం చేస్తున్నారు.ప్రజల యొక్క పాపములను తనమీద వేసుకొని వారికొరకు ప్రాణత్యాగం చేస్తున్నారు.ఈ సేవకునిలో వంద సంవత్సరాలు జీవించాలన్న ఆశలేదు. కానీ దేవుని కొరకు దేవుని ప్రజలకొరకు జీవించాలన్న మంచిమనస్సు ఉంది యెషయా:15 :13 .

3 . అయన ప్రేమించే సేవకుడు: అయన కేవలము ప్రేమవలన అయన జీవితమును పరులకోసం త్యాగం చేసారు.ఎన్ని భాధలు పొందినా,ఎంత హింసించినా,అయన మాత్రము నోరు విప్పలేదు.ఎంతో ప్రేమవుంటేనే అలాగ భరించగలిగి శ్రమలలో దేవుని సంతోషమును చూసిన సేవకుడు.పౌలు గారు చక్కగా వివరిస్తారు ప్రేమ సమస్తమును భరించును 1 కోరిం:13 :7 . పౌలు గారు చెప్పిన విధముగా ప్రేమకు సహనం ఉంది,వినయము ఉంది,అదేవిధముగా ఆ సేవకుని హృదయం దైవ ప్రేమ, మానవ ప్రేమతో నిండిఉంది.కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.

4 . బాధామయ సేవకుడు దైవజ్ఞానము కలిగిన వ్యక్తి: ఈ సేవకునికి ప్రభువు యొక్క మనస్సు తెలుసు, ఆయన సంకల్పం తెలుసు.అందుకే ఆయన చిత్తమును నెరవేర్చుతూ,అన్నిటిని సహించుకొని,ముందుకు సాగారు.దేవుడుయొక్క ప్రతిమాట, ఆయన చిత్తం గ్రహించుకొని దాని ప్రకారము సేవ చేస్తూ,శ్రమల కాడిని మోసి,తన ప్రాణ త్యాగం చేసి అనేకమందియొక్క సంతోషమునకు కారణమయ్యారు.

5 .దేవుడుసేవకునికి ఇచ్చు ప్రతిఫలం : బాధామయ సేవకుడు తన కోసం పడిన ఏశ్రమనుకూడా తండ్రి దేవుడు మరచి పోలేదు.తన శ్రమలలో భాగస్తుడయ్యారు.తనకు తోడుగావున్నారు.ఆయనపట్ల సంతోషముగావున్నారు.ఎందుకంటే తన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చారు. ఈ సేవకుడు ఎన్ని భాధలు అనుభవించాడో,దానికి అన్ని రెట్లు ఎక్కువగా అతడిని గొప్పవానిగా దేవుడు చేశారు.యెషయా :53 :12 .

ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రేమ కాబట్టి మనం జీవితములో,కూడా కష్టాలు వస్తాయి, శ్రమలను ఎదుర్కోవాలి.అయితే వాటన్నిటిని ఈ బాధామయ సేవకుని వలే భరించాలి. ప్రతి శ్రమవెనుకాల ప్రతిఫలం దాగివుంటుంది.దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తే,అవి తరువాత దీవెనలుగా మార్చబడతాయి.కాబట్టి ఈ సేవకునిలో వున్న లక్షణాలు మనం పాటించుకుందాం.

    రెండవ పఠనంలో రచయిత యేసు క్రీస్తు ప్రభునియొక్క యాజకత్వము గురించి భోదించారు.

    యేసుక్రీస్తు ప్రభువుయొక్క యాజకత్వం పాతనిభందనా గ్రంధంలో లేవీయుల యాజకత్వము కన్నా కొద్దిగా భిన్నముగా వుంటుంది. లేవియ గోత్రముకు చెందిన యాజకులకంటే,క్రీస్తుప్రభువుయొక్క యాజకత్వం గొప్పది.ఎందుకంటే,లేవీయులు దేవునికి బలులు మాత్రమే అర్పించే యాజకులు కానీ,క్రీస్తుప్రభువు తానే ప్రజలకోసం బలిగా అర్పించుకున్న గొప్ప యాజకుడు.లేవీయులు ఈ భూలోకములోవున్న దేవాలయములోకి మాత్రమే ప్రవేశించారు.(లేవి :16 :15 -17 ) కానీ యేసు ప్రభువు పరలోకమునుండి దిగివచ్చి, పరలోకంకు ఎక్కివెళ్లిన ప్రధాన యాజకుడు.

లేవీయులు అందరిని ప్రేమించుటలేదు, ఆపదలోవున్నవారిని ఆదుకొనలేదు ( మంచి సమరుయుని కథ) కానీ క్రీస్తుప్రభువు అందరినీ ప్రేమించారు, పేదలలో జీవించాడు,అందరిని దీవించాడు,అవసరంలో వున్న వారికి చేయూతనిచ్చారు. లేవీయులు సేవింపబడ్డరు,గౌరవింపబడ్డారు.కానీ క్రీస్తు ప్రభువు సేవచేసారు, సిలువ శ్రమలు అనుభవించారు.అందుకే క్రీస్తుప్రభువుని యాజక అగ్రగణ్యుడు అంటారు. మనం బలహీనతల యందు మనకు శక్తిని ఇస్తారు.అదేవిధంగా మనలాగా ఈ లోకంలో మానవునిగా జీవించి అన్నిటిలో కూడి,ఎటువంటి పాపం చేయని వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మన బలహీనతలు తెలుసు కాబట్టి,మనల్ని  దేవుడు అర్ధం చేసుకుంటారు.సానుభూతి చూపుతారు, ఆదుకుంటారు,కాబట్టి ఆయన సన్నిధికి సమీపించి మనలను, మన పాపాలు క్షమించమని మొరపెట్టుకోవచ్చు.

         ఈ నాటి సువిశేష పఠనంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అధికారం పట్లవున్నఆశని గూర్చి వివరిస్తున్నారు. నిజమైన అధికారమంటే తనను తాను తగ్గించుకుని, అందరికీ సేవచేయడమే అని క్రీస్తు ప్రభువు శిష్యులకు తెలుపుచున్నారు.

 పోయిన వారపు సువిశేష పఠనంలో ధన వ్యామోహమును గూర్చి వింటున్నాం.ఈ రెండు కూడా మానవుడిని, దేవుడికి దూరం చేస్తాయి.ఎందుకంటే ఎప్పుడు కూడా వారిమనస్సు, హృదయం వాటిమీదనే ఉంటుంది.వారు దేవుడిగురించి ఆలోచించుట చాలా తక్కువ. వ్యామోహం ఏదైనా సరే అది విశ్వాస జీవితానికి మంచిదికాదు.

   ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు తన యొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,ఇద్దరు శిష్యులు మీ రాజ్యంలో మారు రెండు స్థానాలు ఇవ్వమని జెబాదాయి పుత్రులు యాకోబు,యోహాన్నులు అడుగుచున్నారు.

 వీరిద్దరూ కూడా యేసు ప్రభువు చేత ప్రేమింపబడినవారే, ఎందుకంటే,చాలా సందర్భాలలో వీరిని తోడుగా తీసుకొని వెళ్లుచున్నారు (యాయీరు ఇంటికి,తాబోరు కొండకు,గేస్తేమనే తోటకు).

  యేసు ప్రభువు మరణం గురించి, పునరుతానము గురించి చాలా సందర్భాలలో ప్రస్తావించారు.ఆయన శ్రమలను గూర్చి చెప్పిన ప్రతిసారి కూడా శిష్యులు ఉన్నారు. అయినాకూడా వారు గొప్ప అంతస్థు గురించి ప్రభురాజ్యములో కుడి, ఎడమ స్థానం గురించి ఆలోచనలుచేయసాగారు. శిష్యులు యేసుప్రభువు మరణిస్తారని ఆలోచనలేదు. కేవలం ఆయన రాజ్యంస్థాపిస్తారని అందరి యొక్క ఆలోచన. ఇక్కడ మానవుని యొక్క స్వభావం స్పష్టంగా కనపడుతుంది.

పేరుకోసం ,అధికారంకోసం,గుర్తింపుకోసం ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వం అర్ధమవుచున్నది.

   యేసు ప్రభువు మొదటిసారిగా తనయొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,పేతురుగారు దానికి అభ్యన్తరం పలికారు. అప్పుడు ప్రభువు తన సేవకులుగా ఉండాలంటే సిలువను మోయాలి అని పలికారు (మార్కు:8 :24 ). ఆయన ఆలోచనలు సరిచేశారు.

    రెండవసారి తన మరణం గురించి చెప్పినపుడు శిష్యులలో ఎవరుగొప్పఅని ఆలోచనలు చేశారు.అప్పుడు చిన్నబిడ్డను చూపించి,గొప్పవారు కావాలంటే,చిన్నబిడ్డలాగా దేవునిపై నమ్మకం ఉంచి,ఆయన మీద ఆధారపడి జీవించాలి అని తెలిపాడు మార్కు;9 :35 . 

       మూడవసారి మళ్ళీ మరణం గురించి చెప్పినపుడు,ఇద్దరు శిష్యులు తన రాజ్యంలో కుడి ఎడమల స్థానాలను ఆశిస్తున్నారు. అప్పుడు ప్రభువు, గొప్పవారు కాదలిస్తే,వారు సేవకుడిగా ఉండాలని తెలుపుచున్నాడు (44 వ వచనం).శిష్యులు అధికారంకోసం ఆశిస్తే, ప్రభువు సేవాగురించి భోధిస్తున్నాడు. అధికారం ఆశపడుతూ,శ్రమలను వద్దనుకుని జీవింప ప్రయత్నిస్తే,ప్రభువు మాత్రము అనుదిన జీవితములో శ్రమలు అంగీకరించాలని గట్టిగా చెబుతున్నారు. నిజమైన గొప్పదనం అంటే, ఇతరులకు సేవకునిగా ఉండి సేవచేయుటకు అని ప్రభువు చెబుతున్నారు.

  యోహాను యాకోబు అడిగిన వరం సరియైనది కాదు.ఎందుకంటే అధికారవరమును అడుగుచున్నవారు దానికోసం వారి తల్లిని కూడా తీసుకొనివచ్చి అడుగుచున్నారు (మత్త:20 :20 -21 ).వారికి ఎంత అధికారఆశ అంటే, వారు అడిగితే ఆ అధికారం రాదూ అనుకోని తన తల్లి చేత అడిగిస్తున్నారు.సలోమి మరియమ్మ గారి సోదరి వరుస అవుతారు (యేసుప్రభువుకు పిన్ని/పెద్దమ్మ వరుస).ఇక్కడ శిష్యులు ఏమిఅడుగుచున్నారో,వారికి సరిగా అవగాహన లేదు.మనం కూడా కొన్నిసార్లు ఏమిఅడుగుతామో అవగాహన లేదు.వారు (యాకోబు/యోహాను ) తనకు దగ్గర బంధువులు అయినప్పటికీ, వారికి యేసు ప్రభువు వారికి ఎలాంటి పక్షపాతం చూపించలేదు.ఆయనకు అందరూ సరిసమానులే.ప్రభువు వారి మధ్యలో వారికి విభేదాలు రాకుండా ఇలా మంచి నిర్ణయం తీసుకున్నాడు.

   మనమైతే ఎప్పుడూ కూడా మనవారి గురించి ఆలోచిస్తుంటాం. ఏదయినా పదవి ఖాళిగా ఉంది అంటే వెంటనే అది మనం బంధువులకు వచ్చేలా చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు మాత్రం వీరికి ఎలాంటి అధికారం ఇవ్వటం లేదు.

  యాకోబు యోహానులు ఇద్దరు కూడా ఉన్నవారే,(మార్కు:1 :20 ) వారికి వున్న సంపదలవల్ల అధికారం కూడా కావాలి అనే స్వార్ధపు ఆలోచనలలో వున్నారు.అందుకే ప్రభువు వారి ఆలోచనలను సరిచేస్తున్నారు (యోహా :18 :16 ). ఈ ఇద్దరు శిష్యులు యేసుప్రభువు యొక్క శ్రమల యొక్క సవాళ్లు అంగీకరించారు.అవసరమయితే ఆయనకోసం యెరూషలేములో మరణించడానికైనా సిద్ధం అని అన్నారు. యాకోబు గారియొక్క మరణ చరిత్ర మనకు ఆయన క్రీస్తుకొరకు పొందినాశ్రమలు బాప్తిస్మము గురించి వివరిస్తుంది.యాకోబుగారు హేరోదు అగ్రిప్పచే శిరచ్చేదం పొంది  మరణించారు   (అపో:12:2).  

    యేసు ప్రభువుయొక్క శ్రమలలో భాగస్థుడై మరణించిన మొదటి శిష్యుడు.యోహానుగారు కూడా తన తోటి క్రైస్తవుల వేద హింసల్ని,తీవ్రభాధను పొందటమే గాక, దేశ బహిష్కారణకు గురయ్యారు.వీరిద్దరూ క్రీస్తు శ్రమలలో పాలుపంచుకొని,దేవుని మహిమను పొందారు. వారు అధికారం గురించి అడిగినప్పుడు, ఆలోచించారోలేదో కానీ క్రీస్తు ప్రభువుయొక్క పునరుతానము తరువాత ఆయన కోసం జీవించాలి, మరణించాలి,ఆయన సేవ నిస్వార్ధంతో  చేయాలనే దృఢసంకల్పం కలిగిన సేవకులు వీరు.యేసు ప్రభువు తన తండ్రియే అందరికీ తన రాజ్యంలో స్థానం ఇస్తారని ప్రభువు తనయొక్క వినయాన్ని, విధేయతను చూపుచున్నారు. క్రీస్తుప్రభువుకు ఈలోకంమీద సర్వాధికారం ఇవ్వబడినది. అయితే దానిని ఎప్పుడూ కూడా సొంతలాభంకోసం వినియోగించలేదు.

    ప్రభువు దృష్టిలో అధికారం ఇవ్వబడినది కేవలం సేవకే అని స్పష్టమవుచున్నది. ప్రభువు తాను చూపిన అధికారులను ఆదేశించి పలుకుచున్నారు.వారు ప్రజలపై ఎంత కఠినముగా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ అధికారం పెత్తనం చెలాయించడాన్ని కాదు, కానీ అందరిలో ఒకడిగా ఉంటూ అందరికీ సేవచేయడమే, ఇదే నిజమైన గొప్పదనం అని తెలుపుచున్నాడు.

      గొప్పవారు కాదలిస్తే తనను తాను తగ్గించుకొని, ఇతరులను అంగీకరించి సేవచేయాలి అని భోధిస్తున్నాడు.ప్రథముడు కాదలిస్తే , బానిసగావుండాలి, ఎటువంటి పెత్తనం లేకుండా ఉండాలి అని భోధిస్తున్నాడు.

    మదర్ థెరెసా గారు తనను తాను తగ్గించు కొని అందరికీ సేవచేసారు. ఆసేవలో ప్రేమ, వినయం వున్నాయి.యేసుక్రీస్తు ప్రభువు నిజమైన సేవకునికి నిదర్శనం.ఆయన అందరికన్నా గొప్పవాడయినప్పటికీ, దేవుడైనప్పటికీ,తనను తాను తగ్గించుకున్నాడు.ఎవ్వరిమీద అధికారం చెలాయించలేదు. ప్రేమించాడు, తండ్రికి విధేయత చూపారు. పేదవారి పక్షాన పోరాడారు. అందరికీ సేవచేసారు.సిలువశ్రమాలు అనుభవించారు. శిష్యులపదాలు కడిగాడు.పేదవారిగా ఈలోకంలో జీవించారు.సుఖ సంపదలు విడిచిపెట్టారు.మనందరం కూడా క్రీస్తుప్రభువలె,సేవకు దూపం దాల్చి జీవించాలి.దేవుడిచ్చిన అధికారంతో ప్రేమిస్తూ,సేవచేస్తూ,దేవునికి దగ్గరగా జీవించాలి.మనం ఇతరులయొక్క శ్రేయస్సును కోరుకోవాలి. 1 కోరి:10 :24 , ఫిలి:2 :4 .

        అధికారం కేవలం సేవకుమాత్రమే కాబట్టి క్రీస్తు ప్రభువు వలే జీవించుటకు ప్రయత్నిద్దాము.ఆమెన్

Rev.Fr. Bala Yesu OCD

ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారము(2)

 యెషయా 53:10-11                                                                            

హెబ్రీయులకు 4:14-16

మార్కు 10:35-45

 క్రీస్తునాధునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా!

ఈనాటి దివ్యగ్రంథపఠనాల ద్వారా తల్లి శ్రీసభ, నిజమైనటువంటి నాయకుడు లేదా అధికారి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్న అంశాలను గూర్చి తెలియ జేస్తుంది. దేవుని దృష్టిలో గొప్పనాయకుడు అంటే గొప్ప సేవకుడు. సేవకునిలా సేవ చేస్తూ ఇతరుల కొరకు తన జీవితాన్ని సైతం త్యాగం చేయగలిగేటటువంటివాడే దేవునియందు గొప్పవాడిగా పరిగణింపబడతాడు అని ఈనాటి వాక్యం మనకు బోధిస్తుంది.

పరలోక అధికారానికి, ఇహలోక అధికారానికి  వ్యత్యాసం

ఇహలోక నాయకత్వానికి, పరలోక నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం గమనించినట్లయితే నేటి సమాజంలో అధికారం అనే వ్యామోహాన్ని ప్రతిఒక్కరిలో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో నాయకత్వం అంటే అధికారం. ఆ అధికారంతోనే సామాన్యుల మీద పెత్తనం  చెలాయించడం అన్న తలంపులతో ఉన్నాము. రాజకీయ నాయకులు అధికారం అనే పదవి కోసం ప్రజల చుట్టూ తిరిగి, ప్రజల అవసరాలు తీరుస్తాము అని ఎన్నో  వాగ్ధానాలు, హామీలు ఇస్తుంటారు. కానీ ఒక్కసారి వారు ఆ అధికార పదవిని దక్కించుకున్నాక వారు వారిని గెలిపించినటువంటి సామాన్యులను, చేసిన వాగ్ధానాలు ఏవి గూడ వారికి గుర్తుకురావు. అన్ని మర్చిపోయి, అధికారం, దనం అనే వ్యామోహం లో జీవిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న నాయకున్ని గూడ వారు కలవడానికి వీలులేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. ఈ అధికార వ్యామోహం అనేది మనందరిలో ఉండవచ్చు. అందరూ సేవచేయడానికి నాయకులమవ్వాలని అనుకుంటారు కానీ ఎక్కువగ వారి అధికారం చేత సేవించబడుటకే నాయకులు అవుతుంటారు. ఇటువంటి వ్యామోహం ఎప్పటినుంచో మానవాళి స్వభావం లో ఉంది. ఆదాము అవ్వ ఇద్దరు గూడ దేవుని లాగ, దేవునికంటే గొప్పవారు అవ్వాలనుకున్నారు అని ఆదికాండము లో చూస్తున్నాము. ఇటువంటి అధికార వ్యామోహాన్ని గురించి ఈనాటి సువిశేష పఠనంలో వింటున్నాము.  కానీ పరలోక రాజ్యములో అందరూ సమానత్వం కలిగి దేవునియందు ఆనందంగా జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంధంలో చదువుతున్నాము.

అధికార వ్యామోహం

క్రీస్తు ప్రభు శిష్యులలో  యోహాను మరియు యాకోబు లు ఇద్దరు పరలోక రాజ్యంలో క్రీస్తు తన సింహాసనంలో ఆసీనుడైనప్పుడు వీరికి తన కుడి, ఎడమ వైపులా ఉండుటకు అధికారాన్ని ఇవ్వమని కోరుతున్నారు. ఈ తలంపు శిష్యులందరిలో ఉండవచ్చు, కానీ వీరిద్దరు మాత్రమే తమ కోరికను క్రీస్తు నందు వ్యక్తపరిచారు. ఎందుకు వీరిద్దరే  ఆ కోరికను వ్యక్తపరిచారు అంటే క్రీస్తు చేత ప్రేమించబడ్డారు మరియు క్రీస్తు వారిని అన్నీ ప్రాంతాలకు తీసుకొని వెళ్లారు. క్రీస్తుప్రభువు వారి సమాజంలో బహిరంగంగా చేసిన గొప్ప అద్భుత కార్యాలను చూసి ఆయన తప్పకుండ రోమ్ సామ్రాజ్యానికి గొప్ప రాజు అవుతాడు అన్న దృఢ నమ్మకం వారికి కలిగింది. అందుకే వారు క్రీస్తుకి దగ్గరగ  మంచిగా జీవిస్తున్నారు. ఆవిధంగా అయినా మంచి హోదా వారికి దక్కుతుందని. అదేవిధంగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూ ఉన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు క్రీస్తుకి చాలా దగ్గరగ జీవిస్తూ ఆయనను ఎక్కువ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా చూసియున్నారు. కాబట్టి అందుకే వారు క్రీస్తునందు దగ్గరగ  మంచివారిగా జీవించారు. ఆవిధంగా అయినా వారికి మంచి హోదా, అధికారం దక్కుతుందేమో అని. 

అదేవిధంగా మనము ధ్యానించినట్లయితే పరిశుద్ధగ్రంథంలో చూస్తూన్నాము యోహాను, పేతురు మరియు యాకోబులు ముగ్గురు గూడ క్రీస్తుకి చాలా దగ్గరగ జీవిస్తూ ఆయనను ఎక్కువగ వెంబడించి క్రీస్తు యొక్క మహిమాన్వితాన్ని కళ్లారా చూసియున్నారని లూకా సువార్త 9 : 28 -30  వరకు గల వచనాలలో చూస్తున్నాం. "ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించు చుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు". క్రీస్తు దివ్యరూపధారణ మొందిన తర్వాత మోషే ఏలీయా ప్రవక్తలు క్రీస్తుతో మాట్లాడటం వారు చూసిన అనుభవంతో ఈయన నిజంగా పరలోక రాజ్యానికి అధిపతి అని గ్రహించారు. అందుకే వారు క్రీస్తు యొద్దకు వచ్చి " మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనంపై ఆసీనులైనపుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని మార్కు 10 : 37  లో చదువుకొనియున్నాము. కానీ పరలోక రాజ్యం ఇహలోక రాజ్యమువలె అధికారాలతో గాక అందరూ సమానత్వం కలిగి ఉంటారని ఆ సమయంలో వారు తెలుసుకోలేకపోయారు.

గొప్పవాడు అంటే గొప్ప సేవకుడు

అందుకనే క్రీస్తు ప్రభు తన రాజ్యములో గొప్పవారిగా ఉండాలంటే ఏ వింధంగా జీవించాలి అని తెలియజేస్తున్నారు. గొప్ప నాయకుడు లేదా గొప్ప అధికారి అంటే సేవ, త్యాగం అనే లక్షణాలు కలిగినటువంటి  గొప్ప సేవకుడు అని మత్తయి శుభవార్త 20 : 26 - 27 వచనాలలో  ప్రభువు పలుకుతున్నాడు. "మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను".   అందుకు గొప్ప ఉదాహరణ క్రీస్తు ప్రభువు అని ఈ నాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త పలుకుల ద్వారా మనం వింటున్నాము. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నటువంటి సమయంలో వారికి ఆశ, ఊరట, దైర్యం కలిగేలా వారికి రక్షణ బడయుటకు బాధామయ సేవకుడు అంటే ప్రభుని సేవకుడు, రక్షకుడు రాబోతున్నాడు అని ప్రవచిస్తున్నాడు.

బాధామయ సేవకుడు {ప్రభుని సేవకుడు}

బాధామయ సేవకుడు మనందరి బాధలను, పాపాలను తన మీద వేసుకొని తన రక్తాన్ని చిందించి  మనలను రక్షింతును అని యెషయా ప్రవక్త తెలియపరుస్తున్నారు. ఆ బాధామయ సేవకుడు తన తండ్రి సంకల్పం ప్రకారం మన పాపములకొరకు నలిగిపోయి తాను అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగించును. ఆయన తండ్రి సంకల్పము ప్రకారం బాధా భరితునిగా, తనను తాను పాపపరిహారబలి చేసి, పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. ఆ విధముగా ప్రభుని సేవకుడు ఆనందమొంది తన తండ్రిచేత గొప్పవానిగాను ఘనులలో నొకనిగా గణింపబడును అని తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు. ఈ ప్రవచనాలు అన్ని గూడ క్రీస్తు ప్రభువు జీవితంలో నెరవేరాయి. మత్తయి 20:28 లో క్రీస్తు ప్రభువు తన తండ్రి సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. "మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను".

గొప్పవానిగా [సేవకునిగా] రెండు ముఖ్య లక్షణాలు

క్రీస్తు అనుచరులమైన మనం పరలోకరాజ్యములో దేవుని యందు గొప్పవారిగా ఉండాలంటే ముందు ఒక గొప్ప సేవకుని వలె జీవించాలి,  క్రీస్తువలె మనం గూడా ఇతరులకు సేవ చేస్తూ మన ప్రాణాలను గూడా త్యాగం చేయుటకు సిద్ధంగా ఉండాలి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు సేవకునిగా జీవించడం అంటే అంత సులువైనది కాదు. అందుకే ఈనాటి సువిశేషంలో ప్రభువు ఇద్దరి శిష్యులను రెండు ముఖ్య లక్షణాలను గూర్చి అడుగుతున్నాడు. అవి 1 . నా పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని. దీనికి అర్థం నేను పొందబోయే శ్రమలను బాధలను మీరు గూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారా అని. అందుకు వారు చేయగలం అని సమాధానమిస్తున్నారు. నిజానికి వారు ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయారు. ఎప్పుడైతే వారు క్రీస్తుని సిలువపై మరణించడం చూసారో అప్పుడే వారికి క్రీస్తు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది. ఆ తర్వాత వారు నిజమైనటువంటి క్రీస్తు సేవకులుగా, సేవ చేసి క్రీస్తుకి మాట ప్రకారం క్రీస్తు కొరకు వారి ప్రాణాలు సమర్పించి క్రీస్తు లో బాగస్తులయ్యారు. 2 . రెండవది నేను పొందబోవు బప్తిస్మమును మీరును పొందగలరా? అని. బప్తిస్మము అనగా మన పాపపు జీవితానికి మరణించి క్రీస్తులో నూతనంగా జీవించడం. అంటే తనను తాను త్యజించు కొని తన సిలువని ఎత్తుకొని క్రీస్తుని అనుసరించడం. ఈ రెండింటిని శిష్యులందరు వారి జీవితాలలో పాటించి పరలోక రాజ్యంలో గొప్పవారిగా పరిగణింపబడ్డారు.

యోబు గారు గూడా ఒక మంచి సేవకునివలె దేవుని యందు విశ్వాస పాత్రుడుగా జీవించాడు. ఆయనకు ఎన్నో శోధనలు బాధలు ఎదురయ్యాయి అయినప్పటికీ తాను దేవునియందు విశ్వాసం కోల్పోకుండా నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదనుయావే దేవుడే ఇచ్చెను యావే దేవుడే తీసికొని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అని జీవించాడు. అదేవిధంగా ఎందరో పునీతులు తమ జీవితాలను త్యజించుకొని వారి సిలువను ఎత్తుకొని ప్రభుని మార్గములో సేవకులుగా జీవించి ఈనాడు దైవ రాజ్యంలో దేవునితో కలసి జీవిస్తున్నారని మనందరం విశ్వసిస్తున్నాము. మరి ఈనాడు క్రైస్తవులుగా మన గొప్పతనం దేనిలో చూపిస్తున్నాము? పరలోకంలో పొందబోయే జీవితాన్ని మరచిపోయి ఇహలోక జీవితమే శాశ్వతమైనది అన్న భ్రమతో, ధనం, అధికారం అనే వ్యామోహంతో జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ప్రకారం అధికారం అంటే సేవ. ఆ సేవ లో వచ్చే బాధలను కష్టాలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తీ ఉందా అని ప్రశ్నించుకోవాలి.

ప్రధానయాజకుడు

క్రైస్తవులమైన మనందరం ఎటువంటి బాధలకు కష్టాలకు బయపడి లొంగిపోకుండా ఉండమని ఈ నాటి రెండవ పఠనములో చూస్తున్నాం. ఎందుకంటే బలహీనులమైన మనలను బలపరుచుటకు మన ప్రధానయాజకుడు క్రీస్తు ప్రభువు మనకు మధ్యవర్తిగా తోడుగా ఉన్నాడు. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు. మనవలె ఆయన అన్ని విధాలుగా శోధింపబడియు, పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఆయన యందు దృఢమైన విశ్వాసం కలిగి జీవించెదము. ఆయన తన అనుగ్రహమును మనకు దయచేయును అని హెబ్రీయులకు రాసిన లేక 4 : 14 - 16 లో  చూస్తున్నాము.

కనుక క్రైస్తవులమైన మనం అనుదిన ప్రార్థన ద్వారా క్రీస్తువలె సేవకులకు సేవకులవలె జీవించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రార్థిస్తూ ఆవిధంగా జీవించుటకు ప్రయత్నించుదము.

ఎందుకంటే గొప్పతనానికి క్రైస్తవ మార్గం ఏమిటి అంటే, సేవ.

పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్.

By Br. Vijay Talari OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...