పదునాల్గవ సామాన్య ఆదివారం
జెకరియా 9: 9-10,
రోమా 8: 9, 11-13,
మత్తయి 11: 25-30
బ్రదర్. సుభాష్ ఓ.సి.డి
క్రీస్తుపూర్వం 538 వ సంవత్సరం యిస్రాయేలు ప్రజలు బబులోనియా బానిసత్వం నుండి తిరిగివచ్చిన కాలం.
యిస్రాయేలు ప్రజలను పరిపాలించుటకు ఈ రాజులూ కూడా లేరు . యిస్రాయేలు ప్రజలు స్వతంత్రులు, కానీ ముఖ్య అధికారం మాత్రం యూదులు, పర్షియా, గ్రీసు మరియు రోమీయులది. కానీ యిస్రాయేలు ప్రజలకు ఏ రాజునూ లేడు. దేవాలయం ధ్వంసం చేయబడింది ప్రజల జీవితములో శాంతి లేదు.
ఈ సమయములో జెకర్యా మరియు హగ్గయి ప్రవక్తలు ఇద్దరు కూడా దేవాలయ నిర్మాణంలో యిస్రాయేలు ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఆ సందర్భంలో జెకరియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను సంతోష పరిచే వాక్యాలే మొదటి పఠనంలో చూస్తున్నాము.
9. వచనంలో చూస్తున్నాం, యూదా మరియు యిస్రాయేలు ప్రజలారా మీరు సంతసించండి నేను మీ మధ్య నివసించబోతున్నాను. ఒక శాంతి యుతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాను. మీ శాంతి రాజు గాడిదపై ఊరేగింపుగా వచ్చును అని చెపుతున్నాను.
రాజులు గుఱ్ఱములపై లేదా అశ్వములపై లేదా రథములపైనా కదా ఊరేగింపుగా వస్తారు గాడిదమీద రావటం ఏమిటి?.
ఇక్కడ గాడిద అనే జంతువు వినమ్రతకు, శాంతి సూచనగా నిలుస్తుంది.
గొప్ప రాజులుకూడా గాడిదపైన ఉరేగింపబడ్డారు. జాయిరు, యిస్రాయేలు ప్రజల ఏడవ నాయకుడు. తన ముప్పది మంది కుమారులతో ముప్పది గాడిదలపై స్వారీ చేసి గిలియాద్ దేశములో ముప్పది పట్టణములను దాడి చేసెను. (న్యాయాధిపతులు 10: 4)
సొలొమోను మహారాజు కూడా గాడిదపై ప్రయాణించెను (1రాజుల 1 :33). దావీదు మహారాజు కుమారులు కూడా గాడిదపై పర్వతములలోకి పారిపోయాను (2వ సమూయేలు 13 : 29 ). దావీదు మహారాజు కుమారుడు అబ్షాలోము గాడిదపై స్వారీ చేసెను (2వ సమూయేలు 18 : 9 )
ఇక్కడ గాడిదను తక్కువ విలువగల జంతువుగా కాకుండా గాడిదయొక్క వినమ్రతను ముఖ్యమైన అంశముగా మనం గ్రహించాలి.
10 వ వచనంలో ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను యిస్రాయేలు నుండి రథములను యెరూషలేమునుండి యుద్దఅశ్వములను తొలగింతును ధనస్సులను నాశనం చేసెదను.
ఇక్కడ రథములు, ధనస్సులు అధికారానికి గుర్తు. కానీ దేవుడు రథములను తొలగిస్తాను అంటున్నాడు, ధనస్సులను నాశనం చేస్తా అంటున్నాడు. అంటే అధికారాన్ని తీసివేస్తా అని చెపుతున్నాడు.
యుద్ధాశ్వములు యుద్దానికి ఉపోయోగించే జంతువులు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. రాజులకు ఒక శక్తి, బలం లాంటివి. దేవుడు వాటిని కూడా తొలగిస్తానని అంటున్నాడు.
యుద్దాలు శత్రుత్వానికి, చంపుకోవడానికి, చావడానికి గుర్తు.
ఇక యుద్దాలు జరగవు, శాంతిని దయచేస్తాను అని అంటున్నాడు. మిమ్మలను శాంతితో పరిపాలించుటకు రాజు రాబోవుచున్నాడు అని ప్రభువు జెకర్యా ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు.
సువిశేషం:
25 - 27 వచనాలలో క్రీస్తు ప్రభువు, తండ్రి దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ వాక్యాలు యూదుల అధికారములను ధర్మశాస్త్ర బోధకులను, పరిస్సయులను ఉద్దేశించినవి. ఈ వచనంలో దేవుడికి క్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమను మనం గమనించవచ్చు.
అంతేకాక “విజ్ఞులకు, వివేకావంతులకు” ,” వీటిని”, “పసిబిడ్డలకు” “మరుగు పరచి” “బయలు పరచి” అనే పదాలను వింటున్నాము.
విజ్ఞులకు, వివేకవంతులు :- అంటే యూదులు అధికారులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయులు, గర్వాత్ములు క్రీస్తుని రాజుగాను, దేవుని కుమారుడగును, రక్షకుడిగాను విశ్వశించని వారు నిరాకరించనివారు.
వీటిని :- క్రీస్తు చేసేటటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, మంచి పనులు (పరమ రహస్యాలు)
పసిబిడ్డలు :- అంటే వయస్సు పరంగా కాదు ఇక్కడ ప్రభువు వ్యక్తుత్వన్ని గురించి మాట్లాడుతున్నాడు. వినమ్ర హృదయులు కలిగిన వారు, పేదలు, దరిద్రులు, పాపాత్ములు క్రీస్తుని తమ రాజుగా స్వీకరించిన వారు, క్రీస్తు రక్షకుడిగా విశ్వసించినవారు.
మరుగుపరచి:- తొలగించి, తీసివేయబడి. విజ్ఞులు మరియు వివేకవంతుల, నుండి తీసివేయటం
బయలు పరచటం:- పసిబిడ్డలు వంటి వ్యక్తుత్వం, మంచితనం కలిగిన వారికీ దేవుని ఆశిర్వాదములు బయలుపరచబడ్డాయి.
సొలొమోను మహారాజు వలె విజ్ఞానం, వివేకం ఉంది దేవుని యందు విశ్వాసం మరియు మంచితనం లేకపోతె మరి ఎందుకు పనికిరాము, దేవునిచే తిరస్కరించబడుతాం.
28 - 30 వచనాలను ధ్యానిస్తే: - ఈ వచనాలు, జీవితంలో, మానసిక, శారీరక, ఆత్మలో, భారంగా నలిగి పోతున్న ప్రజలకు, క్రీస్తు పలుకుతున్న వచనాలు, “భారముచే అలసి సొలసి ఉన్న జనులారా నాయొద్దకు రండి విశ్రాంతినిస్తాను”. అని అంటున్నాడు.
అంటే క్రీస్తు ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. శాంతిని పొందుటకు, రక్షణ పొందుటకు, సంతోషంగా ఉండుటకు.
పునీత అగస్తీను గారు " నా ఆత్మా నీలో కలవనిదే దానికి శాంతి లేదు" అని చెపుతారు.
ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తామో, మన ఆత్మలు దేవునిలో లీనమవుతాయో మనకు కూడా శాంతి లభిస్తుంది.
యూదుల మతాచారాలు వారి చట్టాలు, వారి పరిపాలన ప్రజలకు చాల భారమైంది, శాంతి లేని ఒక అన్యాయపు పరిపాలన యూదులు ప్రజలపై భారం మోపుదురు, కానీ వారి చిటికిన వ్రేలుకూడా సహాయం చేయడానికి కదుపరు. మత్తయి 23 : 4
యూదా సిద్దాంతాలతో, చట్టాలతో ప్రజలు నలిగి సతమతమవుతున్నారు, కానీ వారు మాత్రం సుఖవంతమైన జీవితాన్ని జీవించేవారు.
కానీ క్రీస్తు మాత్రం యూదులకంటే భిన్నంగా ప్రజల భారాన్ని కూడా మోశారు.
నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది . ఏమిటి దీని అర్థం?
ఇక్కడ క్రీస్తు ప్రభువు తన సిద్దాంతాలతో , ధర్మశాస్త్ర బోధకులు లేదా యూదుల చట్టాలను పోల్చి చెపుతున్నారు.
యూదుల చట్టాలు " ప్రాణానికి ప్రాణం , కంటికి కన్ను , పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, దెబ్బకు దెబ్బ నిర్గమ 21 వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతీకారం అనే చట్టం యూదులది.
యేసు కాడి, ప్రేమతో కూడినది, దైవ ప్రేమ, సోదర ప్రేమ.
క్రీస్తుని చట్టం నీ శత్రువులను ప్రేమింపుము, వారికోసం ప్రార్థన చేయుము. క్రీస్తు చట్టంలో క్షమా , దయ , జాలి, సహాయం, కనికరం ఉంటాయి. కానీ యూదా చట్టంలో ఇవేవి ఉండవు.
క్రీస్తు ఈ లోకంలో శాంతిని నెలకొల్పడం కోసం గాడిదపైన వినమ్రుడై , ఉరేగించబడ్డాడు, శ్రమలు అనుభవించి , అవమానాలు పొంది, యూదులు మోపిన సిలువ అనే భారాన్ని మోసి మనకోసం మరణించాడు.
క్షమించు అనే మాట ద్వారా లోకమంతటికి శాంతిని నెలకొల్పాడు.
రెండవ పఠనం;
దేవుని ఆత్మ మనలో వాసమై ఉందని పునీత పౌలు గారు పలుకుతున్నారు.
కాబట్టి మనము ఇక శరీరానికి భానిసలము కాము. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు.
13 వ వచనంలో మనము శరీరాను సారంగా జీవిస్తే, మనం మరణిస్తాం. ఆత్మచే జీవిస్తే మరణించినను జీవిస్తాము అని అంటున్నారు.
ఎందుకంటే ఒక సందర్భంలో పౌలుగారు ఈవిధంగా పలుకుతున్నారు మన హృదయాలు దేవుని ఆలయాలు కాబట్టి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము కూడా దేవుడివలె జీవించాలని మనకు తెలియచేస్తున్నారు.
చివరిగా ఈ మూడు పఠనాలు మనందరినీ కూడా సువిశేషంలో క్రీస్తు ప్రభువు బోధించిన విధంగా 29 వ వచనం . సాధుశీలుడుగను, వినమ్ర హృదయము కలిగి జీవించాలి అప్పుడే మన ఆత్మలకు శాంతి లభిస్తుంది.
మత్తయి 5 : 5 వినమ్ర హృదయులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు.
మత్తయి 5 : 9 శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు.
కాబట్టి మనందరం కూడా క్రీస్తు వాలే శాంతి స్థాపకులుగా, మన కుటుంబాలలో , మన సంఘాలలో ఒక నిర్మలమైన జీవితాన్ని జీవించుదాం