ఐదోవ సామాన్య ఆదివారం
యెషయా 58:7-10
1 కొరింతి 2:1-5
మత్తయి 5:13-16
ఈనాటి దివ్య పఠనాలు క్రైస్తవ జీవితం అనేది ఇతరులకు సహాయం చేసే జీవితం లాగా ఉండాలి అని బోధిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా క్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉండేవారు సహాయం చేస్తూ జీవించాలి.
సృష్టి ప్రారంభం నుండి ఒకరికొకరు సహాయం చేసుకొని జీవించాలన్నది దైవ ప్రణాళిక.
ఆదాముకు సహాయం చేయుటకు దేవుడు ఏవమ్మను సృష్టించి తనకు తోడుగా చేశారు.
ప్రభువును విశ్వసించే
విశ్వాసులు తమ యొక్క అనుదిన జీవితంలో స్వార్థంతో జీవించకుండా తమకు ఉన్నదానితో నలుగురికి సహాయం చేస్తూ సోదర ప్రేమను వ్యక్తపరుస్తూ జీవించాలి.
మన యొక్క బోధన విశ్వాస
జీవితం, కేవలం మాటల్లోనే కాకుండా చేతుల్లో చూపించాలి. అనగా విశ్వాసం మన యొక్క క్రియల
ద్వారా నిరూపించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినది, ఉన్నతులను చేసినది, ఆ యొక్క సిరి
సంపదలతో ఇతరులకు సహాయం చేయుట కోసమే.
ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త ఉపవాసం యొక్క ప్రతిఫలం ఏవిధంగా ఉండాలి అని తెలియజేశారు, దేవుడు
కోరుకునే ఉపవాసం ఏవిధంగా ఉండాలో యెషయా ప్రవక్త తెలిపారు.
ఇశ్రాయేలు ప్రజలు
బాబిలోనియా ప్రవాసం ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు యేరుషలేము నగరాన్ని
పునర్నిర్మించుకున్నారు, అయితే వారి యొక్క నిర్మాణం చాలా ఆలస్యంగా జరిగింది
అదేవిధంగా ఎందుకు దాదాపు 50 సంవత్సరాల
ప్రవాసం జీవితంలోకి దేవుడు వారిని పంపించారు అని ఇశ్రాయేలీయులు ఆలోచించుకునే
సందర్భంలో యెషయా ప్రవక్త ఈ విధంగా తెలుపుతున్నారు. దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు
ఇతరులతో పంచుకోకపోవటమే మీయొక్క దృష్టితికి కారణం అని తెలిపారు. అదే విధంగా తమను తన
సొంత బిడ్డలుగా ఎన్నుకొని, దేవుని యెడల విశ్వాసనీయతను చూపనందుకు తమ జీవితంలో దేవుని
యొక్క ఆజ్ఞలను పాటించకపోవటమే ఎంతటి కఠినమైన స్థితికి కారణం అని తెలిపారు.
ఈనాటి మొదటి పఠనంలో యెషయా ప్రవక్త దేవుడు కోరే ఉపవాసం గురించి తెలుపుచున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం
చేశారన్నది కాకుండా ఏ విధంగా, ఎలాంటి హృదయంతో ఉపవాసం చేసాము అన్నది ముఖ్యము.
వాస్తవానికి ఈనాటి మొదటి పఠనం మనందరికీ ఒక సవాలు లాంటిది, ఎందుకంటే మనకు ఉన్నది ఇతరులతో పంచుకోవటం చాలామందికి కష్టం, ఉపవాసం చేసే సందర్భంలో మొట్టమొదటిగా దేవుడు చేయమని కోరిన పని ఏమిటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం ఒసగమని ప్రభువు తెలిపారు. మనం ఏదైతే మిగిల్చామో, త్యాగం చేసామో అది ఇతరులకు మేలు చేసేలా ఉండాలి అని దేవుడు తెలియజేశారు.
ఆకలితో ఉన్నవారికి అన్నం
పెట్టటం ఒక పెద్ద వరం వారు దీవించబడతారు, సారెఫేతులో ఉన్న వితంతువు ఆకలితో ఉన్న
ఏలియా ప్రవక్తకు ఆహారం ఒసగి ఉన్నారు. ఆమెను, ఆమె బిడ్డ దీవించబడ్డారు.
యావే దేవుడు కూడా ఆకలితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను, పూరేడు పిట్టలు, ఒసగి ఆకలి తీర్చారు. మన విశ్వాస జీవితంలో కూడా ఉపవాసం చేసేటప్పుడు పొరుగువారికి ఆహారం ఒసగాలి.
రెండవదిగా ఇల్లు వాకిలి
లేని వారికి ఆశ్రయమివండి అని ప్రభువు తెలుపుచున్నారు. అనాధలు, అభాగ్యులు, పేదవారికి
ఆశ్రయం ఇవ్వమని తెలుపుచున్నారు. ప్రస్తుత కాలంలో మనం ఆశ్రయం ఇవ్వల్సింది
వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులకు ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులను విడిచి
పెడుతున్నారు కాబట్టి మొదటిగా వారికి ఆశ్రయం ఇవ్వాలి.
మూడవదిగా వస్త్రాలు లేని
వారికి వస్త్రాలు ఇవ్వమని తెలుపుచున్నారు. వస్త్రాలు మన యొక్క గౌరవానికి గుర్తు
కాబట్టి మన యొక్క జీవితం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు గౌరవం ఇచ్చి
జీవించాలి.
నాల్గవదిగా అవసరాలలో ఉన్న
బంధువులు సహాయం అడిగినప్పుడు నిరాకరించవద్దని పలుకుచున్నారు. దేవుడు మనకు అనేక
రకాలైన దీవెనలు ఒసగినది ఇతరులతో పంచుకోవడానికి క్రైస్తవ జీవితంలో ఒకరికొకరు సహాయం
చేసుకుని జీవించాలి. ఈ విధంగా మనం ఉపవాసం చేసి ఇతరులకు సహాయం చేసి జీవిస్తే దేవుని
యొక్క ఆశీర్వాదాలు పొందుతాం.
యెషయా ప్రవక్త తెలియజేసే విషయం ఏమిటంటే మన మిత్రులకు సహాయం చేసి జీవిస్తే అవి ఆశీర్వాదాలుగా మారతాయి, సహాయం చేసినప్పుడు దేవుని కృప ప్రాతక్కాలమున సూర్యుని వలే మనపై ప్రకాశించును, మన యొక్క గాయాలు మార్పబడతాయి, మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి, మన యొక్క ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇస్తారు, కాబట్టి ఇతరులకు సహాయం చేస్తూ మంచి క్రైస్తవ జీవితం జీవించుదాం.
ఈనాటి రెండవ పఠనం లో పునీత పౌలు గారు దైవ శక్తితో చేసిన సువార్త ప్రకటన గురించి తెలుపుచున్నారు. మానవ
శక్తుల మీద, జ్ఞానం మీద కాకుండా దైవ శక్తి మీద ఆధారపడి దైవ పరిచర్య చేశారు.
పునీత పౌలు గారు ఏథెన్స్ లో సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయనకు మానవ జ్ఞానం తెలివితేటలు అంతగా సహకరించలేదని
అందుకే మానవ సహాయం మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడ్డాను అని తెలియజేశారు. ఏథెన్స్ లో ఉన్న మేధావులందరికీ
గొప్పగా ఉపన్యసించాడు అయినప్పటికీ అవి వృధా అయ్యాయి అని. క్రీస్తు ప్రభువే లోకా
రక్షకుడని నిజమైన దేవుడని మేధావులకు తెలియజేయడంలో తన యొక్క మానవ ప్రయత్నం విఫలం
అయిందని తెలిపాడు.
పౌలు గారు అక్కడ ఉన్న
వారు దేవుని శక్తి మీద ఆధారపడుతూ క్రీస్తు ప్రభువు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల
గురించి తెలియజేసినప్పుడు ఏ విధంగా క్రీస్తు ప్రభువు తన యొక్క జీవితంను అనేక మంది
యొక్క రక్షణార్థం త్యాగం చేశారు తెలుసుకొని అప్పటి మేధావులు ఏసుప్రభువును
విశ్వసించారు.
పౌలు గారు ఎప్పుడైతే
క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలు బోధించారో క్రీస్తు ప్రభువు యొక్క
జీవితంలో ఎవరు ఊహించని సంఘటన (ఆయన సిలువ మరణం) జరిగిందని తెలిపారో అక్కడ ఉన్న
అన్యులు యూదా మతం నుండి మారిన క్రైస్తవులు ప్రభువును విశ్వసిస్తూ, తమ జీవితాలను
మార్చుకున్నారు. క్రీస్తు ప్రభువు ఇతరుల యొక్క రక్షణార్థమై అనేక శ్రమలు అనుభవించారు, తన జీవితం త్యాగం చేశారు, తన ప్రేమను పంచారు, తాను ఇతరులకు సహాయం చేశారు, మనం కూడా
ప్రభువు వారి ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలని పౌలు గారు తెలిపారు.
ఈనాటి సువిశేష పఠనం లో
యేసు ప్రభువు క్రైస్తవ జీవితంలో ఉప్పుతోను, వెలుగుతోను పోల్చి చెబుతున్నారు.
ఉప్పు, వెలుగు రెండు ప్రతి
ఒక్కరి జీవితంలో విలువైనవి అవసరమైనవి.
ఉప్పును, వెలుగును రెండు
కూడా తమ కోసం జీవించేవి కావు అవి ఇతరుల కోసం మాత్రమే జీవిస్తాయి.
పవిత్ర గ్రంథంలో ఉప్పు
గురించి వివిధ రకాలుగా చెప్పబడింది.
1. ఉప్పును ఒప్పందం కు గుర్తుగా వాడారు - లేవి 3:13
2. స్వస్థత పరచటానికి పరిశుభ్రపరచటానికి ఉప్పును వాడారు - 2 రాజు 2:20-21.
3. రుచిని ఒసగటానికి ఉప్పును వినియోగిస్తారు - యోబు 6:6.
4. నశించి పోకుండా ఉప్పు కాపాడుతుంది - లూకా 14:34-35.
5. ఉప్పు సమాధానంకు గుర్తు - మార్కు 9:50.
6. ఉప్పు దీవెనలకు సాక్ష్యం - కొలోస్సి 4:6.
దేవుడు క్రైస్తవుల జీవితం
ఉప్పు వలె వెలుగు వలె ఉంటాయి అని తెలుపుచున్నారు. మనం పరస్పరం ఒకరికొకరు సహాయం
చేస్తూ జీవించాలి.
మనందరిని ఉప్పు వలే
జీవించమని కోరుచున్నారు ఉప్పులో ఉన్న మంచి లక్షణాలు మనం అలవర్చుకోవాలి.
1. ఉప్పు సంరక్షిస్తుంది:
పాతకాలంలో మనకి ఫ్రిజ్లు
ఏమీ లేవు అయితే పండ్లు, వస్తువులు, మాంసం కుళ్ళిపోకుండా వాటిని చాలా
కాలం వరకు కాపాడుతుంది.
క్రైస్తవులైన మనందరం కూడా
మన పొరుగువారు పాడవకుండా కాపాడాలి, వారిని అవినీతి నుండి అక్రమముల నుండి చెడు
మార్గాల నుండి వ్యసనాల నుండి కాపాడాలి.
2. ఉప్పును శుభ్రపరచడానికి వాడతారు:
చాలా సందర్భాలలో మనం
ఉప్పును పరిశుభ్రపరచటానికి వినియోగిస్తాం. మరీ ముఖ్యంగా చేపలను ఉప్పుతో కడిగి
పరిశుభ్రపరుస్తాం అదేవిధంగా క్రైస్తవులందరూ ఈ సమాజంలో ఉన్న చెడును అక్రమాలను
శుభ్రపరచాలి, పాప మాలిన్యమును శుభ్రపరచాలి. చెడును శుభ్రపరచాలి. ఎలీషా ప్రవక్త
ఉప్పుతో నీటిని శుభ్రం చేశారు - 2 రాజు 2:19:22.
3. ఉప్పు రుచిని అందజేస్తుంది :
అన్నీ తినే పదార్థాలలో
ఉప్పు రుచిని అందజేస్తుంది అన్ని సమపాలల్లో ఉన్న లేకపోయినా అన్ని వేసినా
వేయకపోయినా కానీ ఉప్పును మాత్రం కూరల్లో వెయ్యాలి అందుకే ఉప్పు అంటుంది 'అన్ని వేసి
చూడు నన్ను వేసి చూడు అని'.
మనం కూడా ఇతరులకు రుచిని
అందజేయాలి. రుచి అనే ప్రేమ, సంతోషం, సమాధానం అందజేయాలి.
4. ఉప్పుకు కలిసిపోయే గుణం ఉంది -
అన్నిటిలో కూడా కరిగిపోయి
కలిసిపోతుంది అదే విధంగా మనం కూడా అందరితో కలిసి పోవాలి అవసరంలో ఉన్న వారిని చూసి
కరిగిపోవాలి వారికి సహాయం చేయాలి.
5. ఉప్పు త్యాగం చేస్తుంది:
తనను తాను కరిగించుకుంటూ ఉప్పు
ఇతరులకు రుచిని అందజేస్తుంది, సహాయపడుతుంది ఏసుప్రభు తన జీవితంలో త్యాగం చేస్తూ
మనకు రక్షణను ప్రసాదించారు. మనం కూడా మన జీవితాలను త్యాగం చేసుకుంటూ ఇతరులకు సంతోషం
ఇవ్వాలి.
6. ఉప్పు స్నేహ ఒప్పందానికి గుర్తు:
పూర్వం రెండు జాతుల మధ్య
స్నేహ ఒప్పందం ఏర్పరచుకున్న సమయంలో వారు ఉప్పుతినే వారు రొట్టెను తినేవారు - సంఖ్య
18:19, 2 రాజు దిన 13:5.
క్రైస్తవ జీవితం కూడా
ఇతరులతో స్నేహ సంబంధం కలిగి ఉండమని కోరుతుంది.
7. ఉప్పు విశ్వాసానికి గుర్తు:
అప్పుడప్పుడు అంటాం నేను
నీ ఉప్పు తిన్నాను కాబట్టి నిన్ను మోసం చేయను అని. కాబట్టి మనం కూడా
విశ్వాసంను కలిగి జీవించాలి దేవునికి విశ్వాస పాత్రులై జీవించాలి.
దేవుడి మనకు ఇచ్చిన ఏ వరం కూడా కోల్పోకూడదు. ప్రభువు అన్నారు ఉప్పు గొప్పదనం కోల్పోతే అది భారవేయబడి త్రొక్క పడుతుందని దేవుడిచ్చిన వరాలు సరిగా వినియోగించుకోకపోతే మన నుండి ఒప్పందంను దేవుడు తీసి వేసుకుంటారు.
ఉదా: సౌలు రాజు -ఆయనను అభిషేకించారు కానీ ఆయన దానిని సరిగా
వినియోగించుకోలేదు. దేవుడు మన జీవితంలో ఇతరుల కొరకు సహాయం చేయుటకు ఇచ్చారు కాబట్టి
సహాయం చేస్తూ జీవించుదాం.
అదేవిధంగా ప్రభువు మనల్ని
వెలుగుతో పోల్చుతున్నారు. వెలుగు అంతటా ప్రకాశిస్తుంది, నిర్మలమైనది - ఎఫేసి 5:8-9 వెలుగు కూడా
ఇతరుల కొరకు జీవిస్తుంది.
ఉప్పు వెలుగు నిర్మలంగా
ఉన్నట్లు మన జీవితం కూడా పవిత్రంగా ఉండాలి. ఈ వెలుగులో ఉన్న లక్షణాలు మనలో కూడా
ఉండాలి.
1. వెలుగు దారి చూపుతుంది -
మనం కూడా ఇతరులకు దారి చూపాలి
విశాఖపట్నంలో ఉన్న లైట్ హౌస్ మిగతా షిప్స్ అన్నింటికీ దారి చూపి, గమ్యం చేర్చిన
విధంగా మనం కూడా దారి చూపుతూ గమ్యం చేర్చాలి.
2. వెలుగు అంధకారంను తొలగిస్తుంది - యోహాను 3:13-20 మనం కూడా ఈ
సమాజంలో ఉన్న పాపం అనే అంధకారం తొలగించాలి.
3. వెలుగు హెచ్చరిస్తుంది - మన సిగ్నల్ లైట్స్ మనల్ని
హెచ్చరిస్తాయి అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు దారి తప్పిపోతున్న విశ్వాసులను
హెచ్చరించి సన్మార్గంలో నడిపించాలి.
4. వెలుగు కాపాడుతుంది - రోమి 13:12 మనం కూడా కాపాడాలి.
5. వెలుగు ప్రకాశింప చేస్తుంది - యోహాను 12:35 వెలుగు వలె మనం
కూడా ఇతరుల జీవితంలో ప్రకాశింప చేయాలి క్రైస్తవ జీవితం అనేది ఉప్పు వెలుగు వలె
ఇతరులకు సహాయం చేస్తూ జీవించమని ప్రభువు కోరుచున్నారు.
FR. BALAYESU OCD