7, మే 2022, శనివారం

పాస్క నాలుగవ ఆదివారం

మంచి కాపరి 

ఈనాటి ఆదివారం మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. యేసు ప్రభువు తాను ఒక మంచి కాపరి అని ఎరుక పరుస్తూ ఒక కాపరిలాగా తన మంద కోసం ఎలాగా శ్రామిస్తారో తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు మంచి కాపరిగా సంభోదించుకుంటూ తనకు మరియు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గురించి తెలుపుచున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభువుని ఒక మంచి కాపరిగా మనం గ్రహిస్తూ, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మనం ధ్యానించుకోవాలి. 

పవిత్ర గ్రంధంలో  మనం చాలా మంది కాపరులను చూస్తున్నాం. ఆబేలు గొర్రెల కాపరియే-ఆది 4:2. అబ్రహాము గొర్రెల కాపరియే , ఇస్సాకు, యాకోబులు కూడా గొర్రెల కాపారులే. వీరితో పాటు మోషే ప్రవక్త , దావీదు రాజు సైతం గొర్రెలను కాసినవారే. 1 సమూ 17:36. ఆమోసు ప్రవక్త కూడా గొర్రెల కాపరియే. ఆమోసు 7:14. 

వీరితో పాటు పాత నిబంధన గ్రంధం లో  దేవుడు తనను తాను కాపరిగా , మంచి కాపరిగా సంబోదించుకుంటున్నారు. యెహే34:11-31. 

కాపరులలో మంచి వారున్నారు అధే విధంగా చెడ్డ వారున్నారు. యిర్మియా ప్రవక్త చెడ్డ కాపరులను గురించి తెలుపుచున్నారు. యిర్మియా 23:1-2. 

మనందరం కూడా కుటుంబ కాపరులం, సంఘ కాపరులం, దేశ కాపరులం మనకు దేవుడు నిజమైన కాపరి. ఆయన్ను మనం అనుసరించాలి. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పౌలుగారికి , బర్నబాసు గారికి అప్పజెప్పిన కాపరి బాధ్యతలను గురించి చదువుకున్నాం. 

వీరిని యేసు ప్రభువు అన్యులకు సువార్తను ప్రకటించుటకు ఎన్నుకొన్నారు. పౌలు యూదులతో సంభాషించిన వేళలో వారు ఆయన్ను అంగీకరించలేదు. అందుకే పౌలు గారు వారితో దేవుని వాక్కు మొదటిగా మీకు చెప్పవలసి ఉండెను,కాని మీరు దానిని తిరస్కరించిరి, మిమ్మల్ని మీరు నిత్య జీవమునకు అయోగ్యులను చేసుకున్నారు అని పలికెను.46 వ వచనం. 

మొదటి ప్రాముఖ్యతను దేవుడు యూదులకే ఇచ్చారు కాని వారు  దానిని తృణీకరించారు. పౌలుగారు మాత్రము ఎవ్వరు తృణీకరించినా సరే, దేవుని యొక్క వాక్కును వెలుగెత్తి చాటారు. అది కాపరి యొక్క లక్షణం. తనను నియమించిన పని కోసం ప్రాణములు సైతం ఇవ్వటం కాపరి యొక్క పని. 

పౌలు గారిని అన్యులకు అపోస్తులుడు అని పిలుస్తారు. apostle of  gentiles. ఆయన అనేక సంవత్సరములుగా అన్యులకు దాచబడిన , తెలియని క్రీస్తు ప్రభువు గురించి ప్రకటించిన వ్యక్తి. 

సువార్త వ్యాప్తి కోసం ఆయన అనేక హింసలకు గురి అయ్యాడు. శ్రమలు అనుభవించారు. అపో 21: 27,30,23:3, 27:41,22:22, 27,42,26:24. 

ఎన్నెన్నో ఆయన తన యొక్క పరిచర్యలో ఎదుర్కొని ముందుకు సాగి తన యొక్క కాపరి యొక్క బాధ్యతలను నెరవేర్చారు. 

పౌలు గారు మరియు బర్నబాసు గారు దేవుని యొక్క స్వరమును ఆలకించారు. 47 వ వచనం. దేవుడు వారిని అన్యులకు వెలుగై ఉండుడు అని చెప్పిన మాటను ఆలకించి ఆయన ప్రకారం నడుచుకున్నారు. 

యేసు ప్రభువు మొదటిగా పౌలును సువార్త పరిచర్యకు ఎన్నుకొన్న సందర్భంలో కూడా దేవుని యొక్క స్వరంను ఆలకించి హృదయ పరివర్తనం చెందుతున్నారు. అపో 9: 4. 

సువార్తను అంగీకరించిన చోట వారు ఆనందంగా వాక్యంను ప్రకటించారు. అంగీకరించని చోట కాలి దూలిని వారికి నిరసనగా దులిపి వేశారు. తమ యొక్క సేవలో వారు ఎల్లప్పుడు దేవుని యొక్క పవిత్రాత్మతో నిండి ఉన్నారు. 

ఒక కాపరిగా పౌలుగారు తన యొక్క బాధ్యతలను అన్నీ సక్రమంగా నెరవేర్చారు. తన మందకోసం క్రీస్తు ప్రభువు వలె ప్రాణాలు సమర్పించారు. 

రెండవ పఠనంలో యోహను గారు గొర్రె పిల్లను గురించి చూసిన దర్శనంలో  క్రీస్తును మంచి కాపరిగా గుర్తించి ఆయన తన యొక్క ప్రజల కోసం ప్రాణాలు సమర్పించిన గొర్రెపిల్ల అని తెలుపుచున్నారు. 

ఈనాటి రెండవ పఠన ప్రారంభ వచనాలలో క్రీస్తు సేవ కొరకు శ్రమలు అనుభవించే వారి గురించి తెలుపుచున్నారు. యోహను గారు హింసలకు గురి అయిన క్రైస్తవులను ప్రోత్సహించుటకు ఈ యొక్క సత్యమును వివరించారు. 

దేవుని కొరకు ప్రాణాలు అర్పించినవారు ఆయన సన్నీదిలో సేవ చేస్తారు. వారు రక్షణను పొందుకుంటారు. 

గొర్రె పిల్లయె కాపరి యగును, వారి కష్టాలను, బాధలను తొలగించును. ఈ కాపరి  తన యొక్క మందను జీవ జలము వద్దకు తీసుకొనిపోవును. కీర్తన 23. యోషయా 40:11, యెహే 34:23, యిర్మీయా 2:13. 

సువార్త పఠనంలో యేసు ప్రభువు తన గొర్రెలు తన స్వరమును వినును అని చెప్పెను. యోహను సువార్త 10 వ అధ్యాయం మొత్తం కూడా గొర్రెల కాపరి గురించి మరియు గొర్రెల గురించియే. 

కేవలం దేవుడిని మాత్రమే మంచి కాపరి అని పిలుస్తాం. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపుతారు, సంరక్షిస్తారు, నేర్పిస్తారు, కాపాడుతారు, వాటికి అవసరమైనవి అన్నీ సమకూర్చుతారు. పాత నిబందన గ్రంధం లో  యావే దేవున్ని మంచి కాపరి అని సంభోదించారు. యెహే 34 వ అధ్యాయం. 

నూతన నిబందన గ్రంధంలో క్రీస్తు ప్రభువును యోహనుగారు మంచి కాపరి అని సంభోదిస్తున్నారు. యోహను 10. 

యేసు ప్రభువు నా గొర్రెలు నా స్వరమున వినును అని తెలుపుచున్నారు.  ఇంతకీ ఎవరు ఆయన గొర్రెలు ? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క గొర్రె. 

గొర్రె తన యొక్క స్వరమును వినును అని అన్నారు. జ్ఞాన స్నానం పొందిన అందరు ఆయన స్వరమును ఆలకించారు, కేవలం కొందరు మాత్రమే ఆయన స్వరమును ఆలకించుతారు. 

సృష్టి ప్రారంభం నుండి మంచి కాపరి అయిన దేవుడు తన ప్రజలను పిలుస్తూనే ఉన్నారు, భోదిస్తూనే ఉన్నారు. అలాగే వారికి నేర్పిస్తూనే ఉన్నారు. అయితే కొంత మంది మాత్రమే కాపరి స్వరంను ఆలకించారు. 

ఆదాము అవ్వ దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితంగా శ్రమలు అనుభవించారు, ఏదేను తోట నుండి బయటకు పంపివేయబడ్డారు. 

సౌలు దేవుని స్వరంను వినలేదు. దాని ఫలితముగా తన యొక్క రాజ్య బాధ్యతలను కోల్పోయాడు. 1 సమూ 13:12-13. 

లోతు భార్య  దేవుని స్వరమును ఆలకించకుండా వెనుకకు చూసింది ఆది 19 :26 . ఆమె ఉప్పు కంబంగా మారిపోయాను. 

నెబుకద్నెసరు దేవుని స్వరం ఆలకించలేదు. దాని ఫలితంగా శిక్షను అనుభవించాడు. దానియేలు 4: 17-37. 

పవిత్ర గ్రంధంలో చాలా మంది ఆయన స్వరమును వినలేదు. దాని ఫలితముగా వరాలు అనేక  కోల్పోయారు. శిక్షను పొందుకున్నారు. 

ప్రభువు యొక్క స్వరము విన్నవారు అధికంగా దీవించబడ్డారు. 

అబ్రహామును  దేవుడు దీవించారు ఎందుకంటే విన్నాడు కాబట్టి . మోషేను దీవించారు ఎందుకంటే ఆయన స్వరంను ఆలకించారు. ఏలియాను దీవించారు అలాగే మరియమ్మ గారిని ఎన్నుకొన్నారు తన తల్లిగా ఎందుకంటే ప్రభుని స్వరంను విన్నారు  కాబట్టి. 

కాపరి పిలిచినప్పుడు కేవలం  తన మందే పలుకుతుంది. జవాబిస్తుంది. అందరి స్వరాన్ని అవి ఆలకించావు , అనుసరించవు ఎవరు పిలిస్తే వారి వెంట పోవు. 

గొర్రెలు తమ కాపరి స్వరం విని, అతనితో ఉండి ప్రమాదాల బారి నుండి సంరక్షణ పొందునట్లు మనం కూడా కాపరియైన దేవుని స్వరం విని నడుచుకుంటే మన జీవితాలు సంతోష దాయకంగా ఉంటాయి. 

కాని మనం దేవుని యొక్క స్వరంను అలకించకుండా పెడ చెవిన  పెడతాం. యిస్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు  దేవుని యొక్క ప్రవక్తల మాటలను  పెడచెవిన పెట్టి శిక్షింప బడ్డారు. 

దేవుని స్వరం అంటే కేవలం మానవునిగా ఆయన  నోటినుండి వెలువడిన మాటల శబ్దం మాత్రమే కాదు. ఆయన గురించి తెలిపే స్వరం అనగా ఆయన జీవిత మార్గం , జీవితం, భోధనం, సందేశం , మరణం, పునరుత్థానం తెలిపేది. 

నిజంగా మనం జీవితంలో దేవుని స్వరం కాని ,పెద్దలు స్వరం కాని విని అనుసరిస్తే అందరం బాగుంటాం . 

రెండవదిగా ప్రభువుకు తన యొక్క మందలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలుసు. మనకు ఆయన తెలిసిఉండకపోవచ్చు. కాని ఆయనకు మాత్రం మనం బాగా తెలుసు. మన యొక్క పేరును దేవుడు  తన యొక్క అరచేతిలో చెక్కుకున్నారు. యోషయా 49: 16. మనందరం ఆయనకు బాగా గుర్తున్నవారమే. 

మంచి కాపరి ఈ గొర్రెలను అన్నింటిని సక్రమంగా చూసుకుంటారు. 

1. గొర్రెలకు కాపరి నిత్యజీవితం ప్రసాదిస్తారు. యోహను 10:10 

2. గొర్రెలు నాశనం కాకుండా వాటిని భద్రంగా చూసుకుంటారు. వాటి యొక్క ఎదుగుదలకై అనునిత్యం కృషి చేస్తాడు కాపరి.  యోహను 3:16. 

3. కాపరి కనుసన్నలలోనే గొర్రెలు ఉంటాయి. ఎవరు  వాటిని ఆయన చేతి నుండి తీసుకొనలేరు. యోహను 6: 37-39. 

4. ఈ గొర్రెలకు రెండు రకాలైన భద్రత కలుగుతుంది ఒకటి కాపరి దగ్గర నుండి రెండవది యాజమానుడి దగ్గర నుండి.  ఇద్దరు దేవుడే కాబట్టి మనకి రెండు రకాలైన రక్షణ దొరుకుతుంది. మన జీవితానికి యజమానుడు దేవుడే, ఆయనే మనల్ని సృష్టించారు, నడిపిస్తున్నారు. 

5. గొర్రెలు ఎప్పుడు కూడా కలసి జీవిస్తాయి. ఒక దాని వెనుక ఒకటి వెళతాయి అవన్నీ ఎప్పుడు ఒక మందలాగే ఉంటాయి. 

మన దేవుడు మంచి కాపరి మనం ఆయన స్వరం విని నడుచుకుంటె మనకు అంతా మేలే కలుగుతుంది. 

ఈరోజు ప్రతి కాపరి కోసం ప్రార్ధించాలి, మనందరికి ఇచ్చిన కాపరి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుదాం. 

Rev. Fr. Bala Yesu OCD 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...