24, జులై 2021, శనివారం

17 వ సామాన్య ఆదివారం


2 రాజులు 4 : 42 - 46 ఎఫెసీ 4 : 1 - 6 యోహా 6 : 1 – 15

ఐదువేలమందికి ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆకలిని తీర్చుట

“నేనే జీవాహారమును నా యొద్దకువచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికగొనడు అని యోహాను  శుభవార్త 6 : 35 వవచనంలో యేసు పలుకుచున్నాడు.”

క్రీస్తునాదుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని విశ్వాసులారా!

యేసుప్రభు మన ఆత్మకు, శరీరానికి ఆహారమైయున్నాడు. పరలోకపు నిత్యజీవాన్ని మనందరికి  ప్రసాదించుటకు పరలోకమునుండి  భూలోకమునకు దిగివచ్చిన జీవాహారము క్రీస్తే అని ఈనాటి పఠనాలలో మనం ధ్యానిస్తున్నాం. క్రీస్తు సువార్తను శిష్యులు అన్ని ప్రాంతాలలో బోధిస్తూ క్రీస్తు నామంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అది చూసిన ప్రజలు కాపరిలేని మందలవలె యేసువద్దకి తరలివస్తున్నారు. అప్పుడు యేసు వారికి పరలోక రాజ్యం గూర్చి బోధించి తర్వాత వారు ఆకలితో ఉండటం గ్రహించి వారికి భోజనమును ప్రసాదిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుణ్ణి విశ్వసించి తమ వాగ్దత్త భూమిని చేరుటకు ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో వారి శారీరక ఆకలిని తీర్చుటకు మన్నాను కురిపించిన దేవుడు ఈనాడు క్రీస్తు ద్వారా క్రీస్తుని విశ్వసించి పరలోక సత్యాన్ని తెలుసుకొని నిత్యజీవము పొందుటకు తన చెంతకు వచినటువంటి ప్రజలు ఆకలిగా ఉండటం ప్రభువు గ్రహించి వారు తిరిగి గమ్యం చేరుటకు కావలసిన శక్తిని ఇవ్వుటకు 5 రొట్టెలను 2  చేపలను 5000 ల మందికి అద్భుత రీతిలో వారిఅందరి ఆకలిని తీర్చారు. ఈనాటి మొదటి పఠనంలో గూడా ఇటువంటి అద్భుతాన్ని గూర్చి వింటున్నాం. ఎలీషా ప్రవక్త దగ్గరికి యావే భక్తుడు ఒకడు తానుపొందిన ప్రథమఫలములను దేవునికి సమర్పించుటకు బయలుదేరి, ఆ దేవాధీ దేవుని సన్నిధి ఎలీషా ప్రవక్తలో ఉన్నదని గ్రహించి 20 రొట్టెలను, ధాన్యపు వెన్నులను కానుకగా అర్పించెను. ఎలీషా తన సేవకునితో వాటిని అక్కడ ఉన్న ప్రవక్త జనులకు పంచిపెట్టమని చెప్పగా ఆసేవకుడు 100 మందికి ఇవి సరిపోవు గదా అని సందేహం వ్యక్తపరిచిన్నప్పటికీ ఎలీషా ప్రవక్త దేవుని మీద విశ్వాసంతో దేవుని వాక్కు ద్వారా వాటిని వారందరికీ సంతృప్తిగా అందించి ఇంకా కొన్ని మిగిలేలా ఈ గొప్ప అద్భుతం చేయగలిగారు. అది ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు చేసిన అద్భుతాన్ని గూర్చి ముందుగానే సూచిస్తుంది.  

ఈ రెండు సంఘటనలను మనం ధ్యానిస్తే ఒకే విధంగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఎలీషా ప్రవక్త దేవుని వాక్కును బోధిస్తున్నారు, యేసు కూడా సువార్తను బోధిస్తున్నారు. వీరిద్దరూ కూడా దేవుని వాక్కును తమ ప్రజలకు భోదిస్తున్నారు. వీరిద్దరూ  తమ చెంత దేవుని వాక్కును ఆలకిస్తున్న ప్రజల ఆకలిని గుర్తించి వారికీ శారీరక ఆహారాన్ని సంతృప్తిగా అందిస్తున్నారు. ఇద్దరు కూడా తమ భక్తుల కానుకలను స్వీకరించి వాటితో తమ ప్రజల ఆకలి తీర్చుటకు,  ఎలీషా  తన  సేవకునితో  అదేవిధంగా యేసు  తన  శిష్యునితో వాటిని అందరికి భోజనంగా పంచమన్నప్పుడు ఇద్దరు సేవకులు అనుమానంగా, లేక సందేహంగా ఇంతమందికి ఇవి ఎలా సరిపోతుంది లేకుంటే ఇంతమంది ఆకలి తీర్చడం ఎలా అని సంకోచించారు. కానీ ఎలీషాకి, క్రీస్తు ప్రభువుకి ఏమి జరగబోతుందో  ముందే దేవుని చేత ఎరుకపరిచారు. కాబట్టి దేవునియందు వారి ధృడ విశ్వాసం ద్వారా దేవుని శక్తితో వారు ఆ కానుకలను అధికం చేసి అందరి ఆకలిని సంతృప్తిగా తీర్చి ఇంకా కొన్ని మిగిలేలా గొప్ప అద్భుత కార్యం చేయగలిగారు.       

ఈ అద్భుత కార్యం చూసిన తరువాత ప్రజలందరూ యేసును గూర్చి రాబోవు నటువంటి ప్రవక్త, మెస్సయ్య ఈయనే అని గ్రహించి వారు యేసుని రాజుగ చేయాలనుకున్నారు. అది గ్రహించిన యేసు అక్కడినుండి వెడలిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను ఇహలోక రాజుగా ఈలోకానికి రాలెదు, కానీ దైవారాజ్యానికి రాజుగా వచ్చియున్నాడు అని వారు గ్రహించలేకపోయారు.

ఎలీషా, మరియు యేసుక్రీస్తు ఇద్దరుకూడా తన ప్రజల శారీరక ఆకలిని తీర్చారు. కానీ యేసు ప్రభువు కేవలం భౌతిక ఆహారము మాత్రమేగాక ఆత్మలకు ఆహారమై ఉన్నాడని మనం గ్రహించాలి. ఎప్పుడయితే మనం దేవునియందు గట్టి విశ్వాసం కలిగి దేవుని వాక్కును ఆలకించి ఆ వాక్యాను సారంగా జీవిస్తామో అప్పుడే మనం నిత్యజీవాన్ని పొందగలం అని యేసు తెలియజేస్తున్నాడు. మనందరినీ శాశ్వతంగా తండ్రి దేవునితో ఐక్యమొనర్చుటకే యేసుప్రభు ఈలోకానికి వచ్చియున్నాడు. అందుకే రెండవ పఠనంలో పునీత పౌలు గారు ఐక్యమునకు పిలుపునందిస్తున్నారు.దే వుడు మనలను ఒకే నిరీక్షణకై పిలిచారు. అందరము ఒకే శరీరము, ఒకే ఆత్మను కలిగియున్నాము, ఎటువంటి విబేధాలు లేకుండా అందరికి ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం,ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఆయన అందరికి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు అని. ఆ దేవునితో నిత్యజీవితం కలిగి శాశ్వతంగా తమ బిడ్డలుగా ఐక్యమై ఉండుటకు తన ఏకైక కుమారుడు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఈ లోక పాప పరిహారమై చిందించి, తన ప్రాణాన్ని మనందరికీ  జీవాహారంగా మార్చాడు. ఆ జీవాహారాన్ని పొందుటకు క్రీస్తునందు విశ్వాసం కలిగి జీవిద్దాం మరియు దైవభక్తుడు మరియు చిన్నపిల్లవాడి వలె మనకి దేవుడిచ్చిన జీవాహారాన్ని ఆత్మాహారాన్ని ప్రతి ఒక్కరికి పంచుదాం. అందుకు కావలసిన దైవానుగ్రహాలను దేవుడు మనకు దయచేయాలని తండ్రి దేవుని ప్రార్దిదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున . ఆమెన్.

- విజయ్ తలారి

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...