30, డిసెంబర్ 2022, శుక్రవారం

మరియమ్మ గారి మాతృత్వ పండుగ


 మరియమ్మ గారి మాతృత్వ పండుగ

సంఖ్యా 6:22-27
గలతీ 4:4-7
లూకా 2:16-21

ఈరోజు మనందరికీ ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే ఒక పండుగ. హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదాలు లేకుండా అందరూ కూడా ఈ రోజున ఆనందంగా కొని ఆడతారు. ఈరోజు ముఖ్యంగా మనం నాలుగు ముఖ్య పండుగలు కొనియాడుచున్నాం.

1.మరియమ్మ గారి మాతృత్వ పండుగ - ఈ పండుగ కేవలం కతోలికలు మాత్రమే జరుపుకుంటారు.
2. ఏసుప్రభు యొక్క నామకరణ పండుగ - ఈ పండుగను క్రైస్తవులు అందరూ జరుపుకుంటారు.
3. నూతన సంవత్సరం - ఈ కొత్త సంవత్సరం అన్ని దేశాల ప్రజలు జరుపుకుంటారు.
4. ప్రపంచ శాంతి పండుగ - అందరూ శాంతియుతంగా జీవించాలని తెలిపే పండుగ. కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా శాంతిని ప్రకటింప చేయాలని తెలుపుతుంది.

ఈరోజు చాలామంది బయట క్రొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంటే మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం.
దేవుని యొక్క కృప ఉంటే చాలు నేను బ్రతికేదను, ఆశీర్వదించబడతాను అనే ఒక గొప్ప నమ్మకంతో క్రొత్త రోజు ప్రారంభమయ్యే సమయంలో మనం దేవునితో గడుపుతున్నాం.
ఒక సంవత్సరం అయిపోయి రెండవ (కొత్త) సంవత్సరం ప్రారంభమవుతుంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కేవలం దేవునికి మాత్రమే అంతా తెలుసు. దేవుడు మనందరి యొక్క అభివృద్ధి కొరకై మంచి ప్రణాళికలు తయారు చేస్తారు. - యిర్మీయా 29:11.
గడిచిన సంవత్సరం యొక్క చేదు అనుభవాలు విడిచిపెట్టి, రాబోయే రోజులను చూస్తూ ముందుకు సాగాలని పౌలు గారు అంటారు - పిలిప్పీ 3:12-14.
ప్రతి ఒక్క సంవత్సరంలో మనకు కష్టాలు, బాధలు, హింసలు, మనస్పార్ధాలు, కలహాలు, సంతోషాలు కలగవచ్చు అయితే అన్నింటిలో కూడా దేవుడిని అంటిపెట్టుకొని జీవించాలి.
మనందరి యొక్క జీవితాలను ఆశీర్వదించమని మనకు అన్ని సమయాలలో దేవుడు తోడుగా ఉడాలని మనందరం ప్రార్థన చేయాలి.
ఈ నూతన సంవత్సరం రోజున జరిగే దివ్యబలి పూజలో ప్రార్థనలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుట మన యొక్క సాంప్రదాయం. పరులకు ఈ సంవత్సరం మొత్తం కూడా మేలు కలగాలని మనం పొరుగు వారికి శుభాకాంక్షలు తెలుపుదాం.
ఈ క్రొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని ప్రేమతో ఉండాలని దేవునితో ఉండాలని సిరిసంపదలతో హాయిగా ఉండాలని మనందరం ఈరోజు ప్రార్థించాలి.

ఈనాటి ఈ నాలుగు పండుగల యొక్క సారాంశం ను ధ్యానించుకుందాం.

1.మరియమ్మ గారి మాతృత్వ పండుగ - మరియమ్మ గారు దేవుని యొక్క తల్లి అని తెలిపే పండుగ, ఎందుకంటే క్రీ. శ 431 వ సంవత్సరంలో Bishop Nestorian మరియమ్మ గారు కేవలం క్రీస్తు తల్లియే అనే సిద్ధాంతంలో ప్రకటించారు. అయితే అదే సంవత్సరంలో ఎఫేసు నగరంలో జరిగిన సదస్సులో మరియమ్మ గారు దేవుని తల్లి అనే ప్రకటించడం జరిగింది.
మరియమ్మ గారు కేవలం మానవ స్వభావం కలిగిన క్రీస్తుకు మాత్రమే కాదు జన్మనిచ్చినది, రెండు మానవ, దైవ స్వభావం కలిగిన దేవుని బిడ్డకు జన్మనిచ్చారు. ఏసుక్రీస్తు త్రిత్వం లో రెండవ వ్యక్తి దేవుని కుమారుడు ఆయనయే దేవుడు కాబట్టి మరియమ్మ గారు దేవుని తల్లి అనీ ప్రకటించారు. మాతృత్వం అంటే తల్లి కావటం అని అర్థం, దాంపత్య జీవితంలో ఉన్న అందరూ కోరుకునేది తల్లి అవ్వటం.
అమ్మతనంలో గొప్ప మాదుర్యం  ఉన్నది. తల్లి లేనిదే మనం లేము. తల్లి ద్వారానే మనం ఈ లోకంలోనికి ప్రవేశిస్తుంన్నం కాబట్టి అందరి తల్లులకు కృతజ్ఞతలు తెలుపుదాం. మాతృత్వం అనే లోటు పిల్లలు లేని తల్లులకు మాత్రమే అర్థమవుతుంది. మరియమ్మ గారి యొక్క గొప్పతనం ఏమిటంటే సృష్టిని చేసిన దేవునికి మరియమ్మ గారు జన్మనిచ్చారు, మరియమ్మ గారు తనను ఈ లోకంలో సృష్టించిన దేవుణ్ణి మరలా తాను ఈ లోకంలో సృష్టించారు.

మరియమ్మ గారి గురించి నాలుగు విశ్వాసలకు సంబంధించిన సిద్ధాంతాలు ప్రకటించబడ్డాయి (DOGMA).

1. దేవుని తల్లి             - MARY MOTHER OF GOD
2. నిత్య కన్యక             - PERPETUAL VIRGINITY OF MARY
3. నిష్కలంక మాత     - IMMACULATE CONCEPTION OF MARY
4. మోక్షరోహణం         - ASSUMPTION OF MARY

ఈ నాలుగు సిద్ధాంతాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ నాలుగు కూడా ఆమె యొక్క పవిత్రతను గొప్పతనం ను చాటి చెబుతున్నాయి.
దేవునికే తల్లి అవటం అన్నది చాలా గొప్ప వరం. దేవుడే స్వయంగా మరియమ్మ గారిని తన తల్లిగా ఎన్నుకొన్నారు. ఎందరో అందమైన వారు చదువుకున్న వారు ధనవంతులు ఉండవచ్చు కానీ మరియమ్మ గారిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నారు.
మరియమ్మ గారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఇది, అందుకే దేవదూత సైతం ఆమెను గౌరవిస్తున్నారు - లూకా 1:28.
ఆమె గురించి యెషయా ప్రవక్త పలికిన మాటలు నెరవేరాయి - యెషయా 7:14, మత్తయి 1:22.
మరియమ్మ గారు  పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించి వాక్కుగా ఉన్న దేవునికి జన్మనిచ్చారు - యోహాను 1:1.
మరియమ్మ గారు దేవుని యొక్క ప్రణాళిక కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తుంది. అందుకే ఆమె దేవుని యొక్క తల్లి.
మరియ తల్లి దేవుని భారాన్ని మోసి, మానవుని భారాన్ని తీసివేసిన గొప్పతల్లి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితం తల్లి ద్వారా ప్రారంభమైనట్లే యేసు ప్రభువు యొక్క జీవితం మరియ తల్లి ద్వారా ప్రారంభమైంది. మన యొక్క తల్లులు త్యాగమూర్తులు వారి యొక్క త్యాగఫలమే మన యొక్క ఆనంద జీవితం. మరియ తల్లిని దేవుడు తన తల్లిగా అంగీకరించి ఆ తల్లిని మన తల్లిగా అందిస్తున్నారు. అమ్మ ప్రేమ గొప్పది అమ్మ ఆదరణకు ప్రతిరూపం కాబట్టి మనం మన యొక్క తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తూ జీవించాలి. స్వయంగా దేవుడే మరియమ్మ గారిని గౌరవించారు, తనను ప్రేమించారు.

ఈరోజు మనందరం కూడా మరియ తల్లి యొక్క ఔనత్వం తెలుసుకోవాలి. మనందరం కూడా ఆ తల్లిని గౌరవించాలి.
- రక్షకున్ని మోసిన గర్భం పవిత్రమైనది.
- రక్షకున్ని ఎత్తుకున్న చేతులు పవిత్రమైనవి.
- రక్షకున్ని నడిపించిన కాళ్లు పవిత్రమైనవి.
- రక్షకుని వాక్కును హృదయంలో పదులపరుచుకున్న హృదయం పవిత్రమైనది.
కాబట్టి ఆమెను ఆమె యొక్క మాతృత్వన్ని గౌరవించూద్దాం.

మనం ఈ లోకానికి రావడానికి కారణమైన మన తల్లిని ఎప్పుడూ గౌరవించి, ప్రేమించి చూసుకుందాం. తల్లి లేనిది మనం లేము అనే సత్యం గుర్తుంచుకొని అమ్మను ప్రేమిద్దాం.

2. యేసు నామకరణం - ఏసుప్రభువుకు పేరు పెడుతున్నారు యూదుల ఆచారం ప్రకారం, శిశువు పుట్టిన ఎనిమిది రోజులకు పేరు పెడతారు.
బాప్తిస్మ యోహానుకు 8 రోజులకు పేరు పెట్టారు - లూకా 1:59, లూకా 2:21.
ఏసు అనే గ్రీకు నామం హెబ్రియా భాషకు చెందిన యెహోషువ నామం కు సమానం అంటే YHWH రక్షకుడు అని అర్థం.
ఏ విధంగానైతే మొదటి యెహోషువ (మోషే తరువాత నాయకుడు) ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి కాపాడారు అదేవిధంగా రెండవ యెహోషువ (యేసు) ప్రజలను పాపం నుండి కాపాడుతారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మనల్ని అన్ని విధాలుగా రక్షించే దేవుడు యేసు ప్రభువు. దేవుని యొక్క నామం ఉచ్చరించటం ద్వారా మనందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది.
యేసు నామకరణం ద్వారా చరిత్రలో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. రక్షక నామంతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఏసుప్రభు యొక్క నామాన్ని పలికి ప్రతి ఒక్కరూ రక్షించబడతారు - అపో 2:21.
దేవుని యొక్క నామం తలంచుకున్నప్పుడు మనలోకి దైవ శక్తి వస్తుంది.
శిష్యులు యేసు ప్రభువు యొక్క నామమున అనేక అద్భుత కార్యాలు చేశారు కాబట్టి యేసు నామం జపించి దీవెనలు పొందుదాం.

3. నూతన సంవత్సరం 
- ఈ నూతన సంవత్సరం దేవునితో ప్రారంభిస్తున్నాం.
ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుని యొక్క వాక్యం ఆశీర్వాదం గురించి తెలుపుతుంది.
మనందరి జీవితంలో దేవుని యొక్క దీవెనలు కావాలి. దీవెనలు ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు వచ్చినా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని అధికమించవచ్చు.
దీవించుట అంటే పవిత్రపరచుట అభిషేకించుట, దేవుని అనుగ్రహాన్ని ఖాక్షించుట, మంచి జరగాలని కోరటం ఆనందింప చేయుట లేదా అదృష్టాన్ని కలిగించుట అని చెప్పవచ్చు.

ఈనాటి మొదటి పఠనం లో ఈ నూతన సంవత్సరంలో కావలసిన మూడు రకాల దీవెనల గురించి తెలియజేయబడింది.

1. యావే మిమ్ము కాపాడును గాక.
2. యావే మిమ్ము కరుణించును గాక.
3. యావే మీకు సమాధానము ఒసుకుగాక.

మొదటి ఆశీర్వాదం కాపాడుట గురించి - మోషే కాలంలో ఇది ప్రధానంగా శత్రువుల దాడి నుండి కరువు నుండి అనేక రకాల ఆపదల నుండి కాపాడుటను సూచిస్తుంది.
దేవుని యొక్క సంరక్షణ మనకు ఎంతో అవసరం, ఈ సంవత్సరం మొత్తం మనందరం అనేక విషయాలలో కాపాడబడాలి.
దేవుడి మనలను       -ఆటంకముల నుండి
                                -సమస్యల నుండి
                                -ప్రాణాపాయము నుండి
                                -రాబోయే వైరస్ ల నుండి
                                -అనారోగ్యముల నుండి
                                -ఆర్థిక సమస్యల నుండి
                                -యుద్ధాల నుండి
                                -సైతాను శక్తుల నుండి
దేవుడు అనేక విధాలుగా మనలను రక్షించాలి, అందుకే మొదటిగా దేవుని యొక్క కాపుదల మనకి అవసరం.
ఒక గొర్రెల కాపరి  తన మందను ఏ విధంగానైతే కాపాడారు అదే విధంగా దేవుడు మనల్ని కాపాడితే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు.

2. రెండోవ ఆశీర్వాదం - దేవుని యొక్క ముఖ కాంతి మనపై ప్రకాశిస్తుంది. ముఖ కాంతి దేవుని యొక్క సాన్నిథ్యంకు గుర్తు. మోషే దేవునితో సినాయి పర్వతము వద్ద 40 రోజులు ఉన్నప్పుడు ఆయన యొక్క మొఖం  కూడా ప్రకాశించింది. దేవుని యొక్క సానిద్యంతో నింపబడింది.
మనం కూడా దేవునితో కలిసి ఉన్నప్పుడు మనం ఆయన యొక్క ముఖ కాంతితో ఆయన యొక్క సాన్నిధ్యంతో నింపబడుతాం.
దేవుని యొక్క కరుణ కూడా ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది.

3. దేవుని యొక్క కృప తోడుగా ఉండి శాంతి సమాధానాలతో దీవించబడతారు.

ఎవరైతే సంపూర్ణంగా కేవలం దేవుని ఎడల మాత్రమే విశ్వాసముంచుతారో వారు శాంతి సమాధానాలతో జీవిస్తారు - యెషయా 26:3-4.
ఏసుక్రీస్తు ప్రభువు శాంతి రాజు, సమాధానకర్త అనేక పేద వారి హృదయాలలో సమాధానమును దయచేసిన ప్రభువు.
మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుని యొక్క శాంతి మనలో ఎప్పుడూ ఉంటుంది.
ఈ మూడు ఆశీర్వాదాలు మన యొక్క అనుదిన జీవితాలలో చాలా అవసరం.
దేవుని యొక్క సంరక్షణ దేవునితో గడపటం అదేవిధంగా దేవుని యొక్క సమాధానం తోడుగా ఉంటే అన్నివేళలా మనకు మేలు కలుగుతుంది.
యాకోబు దేవునితో కృస్తీపట్టే సమయంలో ఆయన సంపదల కోసమో, రాజ్య విస్తరణ కోసం అడగలేదు, దేవుని ఆశీర్వాదం కోసం అడిగాడు - ఆది 32:26.
మనం కూడా ఆశీర్వదించుటకు ఆశీర్వాదం పొందుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.
ప్రభువు యొక్క ఆశీర్వాదం ఉంటే అభివృద్ధి చెందుతాం, కష్టాలు అధిగమించవచ్చు, శత్రువులను జయిస్తాం, పుణ్య మార్గంలో నడుస్తాం, మంచిని అలవర్చుకుంటాం, కాబట్టి ఆశీర్వాదం కోసం దేవునికి ప్రార్థిద్దాం.

ఈ నూతన సంవత్సరం నూతనంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి.

1. పాతది విడిచి పెట్టాలి క్రొత్తదనంను ధరించాలి.

పాతది విడిచి పెడితేనే మనం క్రొత్తది స్వీకరించగలం అందుకే పౌలు గారు ఎఫెసీ 4:22-24 పాత పాపమును విడిచిపెట్టి జీవించమని ఆహ్వానిస్తున్నారు.
                      -పాత  వ్యసనాలను   విడిచిపెట్టాలి.
                      -పాపం విడిచి పెట్టాలి.
                      -కోపం గర్వం విడిచిపెట్టాలి.
                      -అసూయ ద్వేషాలు విడిచిపెట్టాలి.
                      -పగలు స్వార్ధాలు విడిచిపెట్టాలి.
                       -అన్యాయపు జీవితం విడిచిపెట్టాలి.
                       -కుట్రలు కుతంత్రాలు విడిచిపెట్టాలి.
                       -పాత చెడు స్నేహాలు విడిచి క్రొత్త మంచి స్నేహాలు పాటించాలి.

పాత భవనం కూలిస్తే గాని క్రొత్త భవనంలో నిర్మించలేము అందుకే పాత పాపపు జీవితంను విడిచి క్రొత్త జీవితం అలవర్చుకోవాలి.
చీకటి పనులు మానివేసి వెలుగుకు సంబంధించిన పనులు చేయాలి - రోమా 13:12.
క్రొత్త ప్రేమ సేవ నిస్వార్థం విశ్వాసం మంచితనం వినయం అలవర్చుకొని జీవిస్తే కృత సంవత్సరం క్రొత్తదిగా ఉంటుంది లేదంటే క్యాలెండర్లో అంకెలు మాత్రమే మారతాయి గాని మన యొక్క జీవితాలు మారవు.
క్రీస్తు ప్రభువును ధరించి జీవిస్తే మన జీవితాలలో నూతనత్వము ఉంటుంది క్రీస్తు అనే రక్షణ కవచం ధరించి జీవిస్తే మనం దీవించబడతాం.

2. మన హృదయాలు దేవుని కొరకు తెరవాలి.

ఏ కుటుంబ ద్వారాలు అయితే దేవుని కొరకు తెరుస్తారు అక్కడ దేవుడు ప్రవేశిస్తారు.
ఏసుప్రభు అనేకమంది గృహాలలోకి ప్రవేశించాలని బెత్లెహేములో వారి తలుపులు తట్టారు కానీ ఎవరు ఆయనకు తలుపు తీయలేదు - యోహాను 1:11.
ఏసుప్రభు కొరకు మనం తలుపు తీస్తేనే ఆయన మనలోనికి వచ్చి ఉంటారు - దర్శన 3:20.
ప్రతి హృదయపు తలుపులు దేవుడు తడుతుంటారు  మనందరం ఆయన్ను మనలోనికి ఆహ్వానించాలి.
మనం ప్రభువును ఆహ్వానిస్తే చాలు మన జీవితాలు మారతాయి.
జక్కయ్య ఏసుప్రభును తన ఇంటిలోనికి ఆహ్వానించారు తన జీవితమే మారిపోయింది, అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తము మనం దేవుని మన యొక్క హృదయాలలోనికి ప్రార్ధన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, దివ్య సప్రసాదం స్వీకరించుట ద్వారా, మనలోనికి ఆహ్వానిస్తే మనం నిచ్చింతగా  ఉండవచ్చు.
మన యొక్క హృదయపు తలుపులు తెరిస్తేనే మనం దేవుని ఆహ్వానించగలం అదే విధంగా మనం కూడా మంచి చేయగలుగుతాం.

3. దేనికి ప్రాముఖ్యత ఇచ్చి జీవించాలి - 

మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమకు ప్రాముఖ్యతను జీవించాలి - మత్తయి 22:36-39, మత్తయి 6:25-33.
దైవ ప్రేమ, సోదర ప్రేమ పాటిస్తే మనల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు.
కేవలం దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపి జీవించిన వారు  దైవమును, సోదరులను, ప్రేమించగలరు. ఈ రెండింటిలో ఏది పాటించకపోయినా సరే జీవితాలకు నిజమైన అర్థం ఉండదు.
ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి.
దేవాలయాలకు వెళ్ళుటకు ప్రాముఖ్యతనివ్వాలి.
అవసరాలలో ఉన్న వారికి ప్రాముఖ్యతను ఇవ్వాలి.
ఈ కొత్త సంవత్సరంలో మనం క్రొత్తగా ఉండాలంటే ఈ యొక్క గొప్ప విషయాలు పాటించాలి.

4. ప్రపంచ శాంతి రోజు - 

యొక్క పండుగను పరిశుద్ధ 6 వ పౌలు పాపుగారు 1968 లో ప్రారంభించారు. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కోరుకునేది శాంతియే. చాలామంది శాంతిని ప్రకటిస్తారు కానీ శాంతి యుతంగా జీవించరు.
కుటుంబంలో శాంతి లేదు, మతాల మధ్య శాంతి లేదు, రాజకీయ పార్టీలలో శాంతి లేదు.
నిజమైన శాంతి అంటే ఒకరినొకరు గౌరవించుటయే ,అర్థం చేసుకొనుటయే, ప్రేమించుటయే.
మనం ఎప్పుడైతే నిజాయితీగా జీవిస్తామో ధైర్యంగా ఉంటామో, దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, అప్పుడు మనం శాంతియుతంగా ఉండగలుగుతాం.
మనం దేవుని కొరకు జీవిస్తామో, అప్పుడు శాంతియుతంగా జీవించగలుగుతాం. దేవుని కలిగి ఉంటాము. అప్పుడు శాంతియుతంగా జీవిస్తాం.
ఈ నూతన సంవత్సరం దేవునితో ప్రారంభిస్తున్నాం కాబట్టి అన్నివేళలా దేవుని అంటిపెట్టుకొని జీవించాలి.

FR. BALAYESU OCD

23, డిసెంబర్ 2022, శుక్రవారం

 

క్రీస్తు జయంతి పండుగ

యెషయా 9:1-6

తీతు 2:11-14

లూకా 2:1-14

 

క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రక్షకుడు ఈ భూమి మీదకు కాలు మోపిన గొప్ప రోజు క్రీస్తు జయంతి. ప్రజలకై, ప్రజలతో ఉండుటకై దేవుడు మానవుడైనా వేళ.

ఈ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కలసిమెలసి చేసుకునే ఒక పండుగా ఇది.

అందరికీ ఈస్టర్ పండుగ అంటే గుర్తుంటుందో లేదో కానీ డిసెంబర్ 25 అంటే అందరికీ గుర్తుంటుంది.

అన్ని దేశాలు జరుపుకునే పండుగ ఇది. సాధారణంగా ఎవరిదైన పుట్టినరోజు అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో దేశానికో పరిమితమై ఉంటుంది కానీ క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ఈ ప్రపంచానికి సమస్తమునకు చెందినటువంటిది అందరికోసం రక్షకుడు జన్మించారు. అందరూ జరుపుకుంటారు - లూకా 2: 11.

క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సృష్టిలో దేవుడు మానవుని చేసినప్పుడు తన రూపం ఇచ్చారు, తన శ్వాస నిచ్చారు, తన యొక్క దైవత్వం మానవునికి ఇచ్చారు, పాపం చేయటం ద్వారా మానవుడు దేవునితో ఉన్న స్నేహమును ప్రేమను, బంధంను కోల్పోయారు. తనలో ఉన్న దైవత్వపు లక్షణాలు మానవుడు కోల్పోయాడు, దేవుడు మరల వాటిని మానవునికి తిరిగి ఇవ్వటానికి మనుష్యవతారం ఎత్తుతున్నారు.

ఇది ఒక గొప్ప పరమ రహస్యం, దేవుడు భూమిపై ఉన్న సమస్త మానవాళికి అందజేసిన ఒక గొప్ప వరం. స్వయానా  దేవుడు మనకు బహుకరించిన ఒక గొప్ప కానుక. మనం అడిగితే దేవుడు తన కుమారుడిని ఇవ్వలేదు. మనం అడగకుండానే మన కొరకు ఆదియు అంతమునైన తన కుమారుడిని మనందరి రక్షణార్థం కొరకు దేవుడు ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఇది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే పూర్వం దేవుడిని ఎవ్వరూ మన రూపంలో చూడలేదు, సృష్టిలో మొట్టమొదటిసారిగా దేవుడు మనలాగా మారారు, మనలాగా తల్లి ఒడిలో పవళించారు, తల్లిపాలతో పోషింపబడ్డారు, ఎంతో గొప్ప దేవుడైనప్పటికిని తనను తాను సామాన్యునిగా చేసుకున్నారు.

క్రిస్మస్ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతున్న రాత్రి, ఆది తల్లిదండ్రులు పాపం చేసిన తరువాత దేవుడు తన ఏకైక కుమారుని పంపించాలని నిర్ణయించుకున్నారు, అందుకే కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు - గలతీ 4:4.

క్రీస్తు జననం దేవుని మానవునికి దగ్గరకు తీసుకొని వచ్చింది. పరలోకంలో ఉండే దేవుడు మనతో ఉండటానికి వేంచేసిన వేళ ఇది.

ఇది ఒక ఆనందంతో కూడిన రాత్రి. దాదాపు ఈ ప్రపంచంలో అనేకమంది నిద్రిస్తున్న అర్ధరాత్రి వేళలో మనం ఈ సమయం దేవునితో గడుపుతున్నాం. మనకై వచ్చిన దేవుని కలుసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక శాంతి కరమైన రాత్రి ఎందుకంటే శాంతిని ఒసగే రారాజు జన్మిస్తున్నాడు.

ప్రతి ఒక్కరి పుట్టినరోజు మనకు ఎంతో సంతోషం ఇస్తుంది, చరిత్రలో ఆ రోజును ఎప్పుడూ గుర్తుంచుకొని ఉంటాం. దేవుని పుట్టినరోజు ప్రత్యేకం ఎందుకంటే దేవుడు మానవ చరిత్రలోనికి వస్తున్నారు.

ఏసుప్రభు యొక్క పుట్టినరోజు ప్రత్యేకం. చరిత్రలో ఎవరి పుట్టినరోజు గురించి కూడా వేల సంవత్సరాలు ముందుగా ప్రవశింపబడలేదు.

చరిత్రలో చాలామంది మహనీయులు, పేరు ప్రఖ్యాతలుగాంచిన వారు ఉన్నారు, బుద్ధుడు, గాంధీ, మహమ్మద్... ఇలా చాలామంది ఉన్నారు కానీ వీరెవ్వరు పుట్టుక గురించి ముందుగా చెప్పబడలేదు. కేవలం క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి ముందుగా చెప్పబడింది - యెషయా 7:14, 9:6-7, మీకా 5:2.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పుట్టుకతో మనందరికీ ఎన్నో గొప్ప విషయాలు నేర్పిస్తున్నారు. తాను ఈ లోకంలో జన్మించినది మనలను రక్షించుట కొరకే మనలను పరలోకం చేర్చుట కొరకై.

ఒక పేదవారి కుటుంబం క్రిస్మస్ చేసుకొనే సందర్భంలో ఆ కుటుంబం మీదగా ఒక విమానం పోయే సమయంలో తల్లి తన బిడ్డలతో చెప్తుంది విమానంలో మీ నాన్న ఉన్నారు నాన్నకు టాటా చెప్పమని అక్కడ ఉన్న చిన్నపిల్లవాడు తల్లిని అడుగుచున్నాడు అమ్మ ఆకాశంలో తిరిగే విమానం లోనికి నాన్న ఎలా వెళ్ళగలిగారు అని అప్పుడు ఆ తల్లి తన బిడ్డతో ఈ విధంగా అంటుంది ఆకాశంలో తిరిగి విమానం భూమి మీదకు వచ్చి వారిని ఆకాశంలోనికి తీసుకొని వెళుతుందని చెప్పారు. అది ఏ క్రిస్మస్ సందేశం.

మనందరిని పరలోకం చేర్చుటకు, మనందరికీ తండ్రి ప్రేమను దయను, తెలియచేయుటకు ఏసుప్రభువు ఈ లోకానికి వచ్చారు.

అందరూ ఈ లోకానికి జీవించటానికి వస్తే యేసు ప్రభువు మాత్రము ఈ లోకానికి మరణించటానికి వచ్చారు.

ఏసుప్రభు యొక్క జననం మన అందరి యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది.

1. మనందరం మంచి స్థలంలో జన్మించాలనుకుంటే ఆయన మాత్రం పశువుల పాకలో జన్మించారు.

2. సమస్తమును ఒక్క మాటతో చేసిన దేవుడు ఇప్పుడు ఏమీ మాట్లాడని పసి బిడ్డగా  మరియు తల్లి గర్భం మందు జన్మించారు.

3. సూర్యుని వేడిని చేసిన గొప్ప దేవుడు మరియ తల్లి యొక్క ఒడిలో వెచ్చదనంను పొందుతున్నారు.

4. ఎవరైతే సమస్తమును తన కౌగిలిలో ఉంచుకున్నారో వారి ఇప్పుడు మరి తల్లి యొక్క కౌగిలిలో ఉన్నారు (one who embraces everything is now embraced by mother Mary).

5. ఎడారిలో సైతం తన ప్రజలను పోషించిన జీవాహారం ఇప్పుడు మరియ తల్లి యొక్క పాల ద్వారా పోషింపబడుతున్నారు.

6. ఈ ప్రపంచమే మోయచాలని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది. ఏసుప్రభువు తనను తాను తగ్గించుకొని మరియమ్మగారి గర్భమందు శరీర రక్తములను స్వీకరించారు.

7. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో సమస్తమునకు స్థానం కల్పించిన దేవుని పుట్టికై ఈ లోకంలో ఒక మంచి స్థలం లేకుండను.

8. ఈ లోకంలో ఆయన తనను తాను తగ్గించుకొని జీవిస్తే మనం మాత్రము ఈ ప్రపంచంలో మన యొక్క అధికారమును, కీర్తిని, ప్రతిష్టలను, ఆస్తి ఆస్తులను, చూపించు కోవాలనుకుంటున్నాం.

ప్రభువు యొక్క జననం మన యొక్క ఆలోచనలను చాలా తలక్రిందులుగా చేస్తుంది . మహిమను వైభవమును నిత్యము అనుభవించే దేవుడు సేవలందికొనే దేవుడు ఇప్పుడు సేవింపబడుటలేదు, సేవ చేయటానికి ఈ లోకంలోనికి జన్మించారు.

ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు చేసిన విధంగా మనం చేయగలమా? ఇది మనందరికీ ఒక గొప్ప సవాలు.

ఏసుప్రభువు ఈ భూలోకంలోనికి మానవునిగా జన్మించినప్పుడు ఆయన అప్పటి యొక్క విధులు విధానాలు ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలి. విద్య నేర్చుకోవాలి ఇంకొక్క ప్రపంచంలో జీవించాలి.

ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు బోధించిన దేవుడు ఇప్పుడు ఇవన్నీ మన మధ్య పాటించాలంటే ఎంతగా ఏసుప్రభు నేర్చుకోవాలో, ఎంతగా ఆయన సర్దుకొని పోవాలో మనం గమనించాలి.

పాపుల మధ్య జీవించుట విధేయత చూపించుట ఆకలి దప్పులను అనుభవించటం అన్ని పాటించడానికి ఏసుప్రభువు సిద్ధమై ఈ లోకానికి వచ్చారు.

నేడు మనందరం ఏసుప్రభు యొక్క జననం ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన వలే మనం మారాలి.

అనంతరం ఒక్కసారి పశువుల పాక గురించి ధ్యానించుకోవాలి. పశువుల పాకలలో ఏడుగురిని ప్రధానంగా చూస్తున్నాం .ఈరోజు వీరి గురించి ధ్యానించి మనం కూడా వారిలా మారినప్పుడే ఈ ఈ క్రిస్మస్ కు మంచి అర్థం ఉంటుంది.

1. ఏసుప్రభు - బాల యేసు

2. మరియా తల్లి

3. యోసేపు

4. పరలోక దూతలు

5. గొర్రెల కాపరులు

6. జ్ఞానులు

7. నక్షత్రం

1. బాల యేసు - పూర్వము దేవుని మనుష్యవతారమున ఎవరు ఎన్నడూ చూడలేదు - యోహాను ,1:18.

పాపంలో పడే పోయినా మనుషులను తిరిగి రక్షించుటకు తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఎందరో ప్రవక్తలు చూడాలనుకున్నది, దర్శించాలనుకున్నది, ఎందరో వినాలనుకున్నది, క్రీస్తు ప్రభువు యొక్క జననం లో సాధ్యమైంది.

క్రీస్తు ప్రభువు మనందరిలాగా ఒక కుటుంబంలో జన్మించారు, ఏసుప్రభువుకు ఒక కుటుంబం కావాలి ఆ కుటుంబమే యోసేపు మరియమ్మ గార్ల కుటుంబం. మనలాంటి కుటుంబాన్ని మనలాంటి పరిస్థితులని మనలాంటి సంతోష బాధలని ఏసుప్రభువు ఈ లోకంలో అనుభవించదలిచారు.

ఏసుప్రభు పశువుల పాకలో అద్దాంతరంగా జన్మించలేదు. ఇది దేవుడే స్వయంగా ఎన్నుకున్నటువంటి స్థలం.

ఏసుప్రభువు పుట్టినప్పటినుంచి చివరి వరకు తనకంటూ తాను ఏమీ పెట్టుకోలేదు.ఆయన జన్మించినప్పుడు వేరే వారి పశువుల పాకను అప్పుగా తీసుకున్నారు.

ఆయన పరిచర్య అప్పుడు తలదాచుకొనుటకు స్థలం లేదు.- మత్తయి 8:19-20.

సముద్రంలో  ప్రయాణమునకు పేతురు పడవను తీసుకున్నారు. లూకా 5:1-11.

యెరూషలేము లో  ఇతరుల యొక్క గాడిదను బదులుగా సహాయంగా తీసుకున్నారు. మార్కు 11:1-11.

చివరికి ఆయన మరణించినప్పుడు వేరే వారి యొక్క సమాధిని వినియోగించారు. మత్తయి 27:57-61.

ఏసుప్రభు తనను తాను రక్షించుకొనే శక్తి కలిగిన దేవుడు అయినప్పటికీ ప్రభువు మొత్తము చిన్ననాటి నుండి మరణ పునరుత్థానము వరకు తండ్రి మీదనే ఆధారపడి ఉన్నారు, తండ్రి ప్రేమను మనందరికీ పంచారు, తండ్రికి విజయత చూపారు.

తండ్రి మీద, మన మీద ఉన్న ప్రేమ వలన, ప్రభువు సమస్తమును భరించారు. అందుకే పౌలు గారు దైవ ప్రేమ గురించి తెలిపినప్పుడు ప్రేమ సమస్తమును భరించెను అనే పలికారు. 1 కొరింతి 13:7.

దేవుడు మనతో ఉండటానికి వచ్చారు, మనలను వెదకీ రక్షించడానికి వచ్చారు, మనల్ని క్షమించటానికి, స్వస్థత పరచటానికి, మనలను సంతోషపరచటానికి, ప్రేమించడానికి నడిపించడానికి వచ్చారు, కాబట్టి ప్రభువు యొక్క గొప్ప జీవితంలో అనుసరించాలి.

2. మరియ తల్లి:

దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక గొప్ప మాతృమూర్తి. దేవుడు మరియ తల్లిని తన తల్లిగా ఎన్నుకొన్నారంటే ఆమె ఎంత గొప్ప పవిత్రాత్పురాలు, ఎన్నో సుగుణాలు ఆమెలో ఉన్నాయో అందరూ ధ్యానం  చేసుకోవాలి.

పాత నిబంధన గ్రంథం యొక్క బోధనబట్టి ఒక స్త్రీ వృద్ధాప్యంలో శిశువును కంటే ఆ శిశువు దేవుని పని కోసం పిలువబడ్డ వ్యక్తి అని నమ్మకం. వృద్ధాప్యంలో శిశువుకు జన్మనిస్తే ఆ తల్లి గొప్పది అని అంటారు.

మరియ తల్లి పురుషుని యొక్క ప్రమేయమే లేకుండా పవిత్రాత్మ శక్తితో దేవుని కుమారునికి జన్మనిస్తున్నారంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తియో మనం అర్థం చేసుకోవాలి.

దేవుడు మనకి తల్లిని ఎంచుకోమని స్వేచ్ఛ నిస్తే మన యొక్క ఆలోచనలకు తగిన వ్యక్తిని ఎన్నుకుంటాం. మరి దేవుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎలాంటి తల్లిని ఎన్నుకొన్నారో మనందరం గ్రహించాలి.

సృష్టి మోయలేని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది.

క్రీస్తు జయంతి సందర్భంగా మరియ తల్లి మనకు తెలిపే విషయం ఏమిటంటే దేవుని యందు మనం ఆనందించాలి.

దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యముల గురించి మరియమ్మ గారు సంతోషించారు. మరియ తల్లి నిజమైన ఆనందం దేవుని చిత్తంలో వెతికారు, దేవుని యందు ఆనందం కనుగొన్నారు.

క్రిస్మస్ అంటేనే ఆనందించటం, తన గర్భమందు రక్షకుడు జన్మించారని మరియ తల్లి ఆనందించింది.

సర్వ మానవాళికి దేవుడు జన్మనిచ్చారని ఆనందించింది. ఎఫెసి 5:16.

3.యోసేపు:

దైవ ప్రణాళికను నెరవేర్చుటలో ఒక గొప్ప తండ్రి పునీతుడు- పునీత యోసేపు గారు.

యోసేపు కారు నీతిమంతుడు, అందుకే దేవుడు సైతము తన యొక్క ప్రణాళికలు విడమరచి చెప్పారు. కలలో దేవుడు అంతయు విడమరచి చెప్పారు, ఎందుకంటే మరియమ్మ నిరపరాధి. దేవుని యొక్క ప్రణాళికలు వివరించిన సందర్భంలో యోసేపు గారు దైవ ప్రణాళికలు సంపూర్ణంగా విశ్వసించారు దైవ ప్రణాళికలు నెరవేర్చుట కొరకు సిద్ధంగా ఉన్నారు.

యోసేపు గారు మరియ తల్లి యొక్క గౌరవం వ్యక్తిత్వమును కాపాడారు.

ఈ క్రిస్మస్ సందర్భంగా యోసేపు గారు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే నిన్ను నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకు మరియమ్మ గారు యోసేపు గారిని నమ్ముకున్నారు. ఎప్పుడైతే దూత యోసేపు గారు దైవ ప్రణాళికను వివరించినదో అప్పుడే దాన్ని అంగీకరిస్తూ మరియమ్మను తన భార్యగా స్వీకరిస్తున్నారు.

మనల్ని నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకూడదు. యోసేపు గారువలే దైవ ప్రణాళికకు సహకరిస్తూ జీవించాలి.

మరియమ్మను ఏసుప్రభువు కాపాడిన విధంగా మనం కూడా ఇతరులను కాపాడాలి మరియు ముఖ్యంగా వారి యొక్క గౌరవం కాపాడాలి.

4. పరలోక దూత:

దేవుని యొక్క సమాచారం అందించే వార్తావాహినులు పరలోక దూతలు. రక్షకుడు జన్మించాడు అన్న శుభవార్తను అందజేశారు.

క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక దూత వలె మంచి మాటలను ఇతరులకు తెలపాలి.

దూతలు లేకుండా క్రిస్మస్ పండుగ లేదు, దూతల యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట కాబట్టి మనకు రక్షకుని ఉచిత బహుమానంగా ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానం.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంటారు -నువ్వు నేను క్రిస్మస్ యొక్క దూత అని ఎప్పుడైతే దేవుని యొక్క శాంతిని నీతిని ప్రేమను అందిస్తాము అప్పుడు మనం కూడా క్రిస్మస్ దూతలమని.

5. గొర్రెల కాపరులు:

క్రీస్తు జననం మొదటిగా గొర్రెల కాపరులకు అందచేయబడింది. బెత్లెహేములో యాజకులు ఉన్నారు పండితులు ఉన్నారు వారిని విడిచి దేవుడు సామాన్యులైన గొర్రెల కాపరులకు ఈ విషయమును తెలిపారు. ఈ సామాన్యులకు ఎందుకు ప్రభువు ఈ గొప్ప వార్తను తెలియజేశారు అంటే:

1. ఏసుప్రభు దావీదు వంశానికి చెందిన వాడు. దావీదు కూడా ఒక కాపరి ఏ కాబట్టి.

2. గొర్రెల కాపరులు వినయంతో ఉండేవారు సమాజంలో ఎటువంటి status లేని వారి, వినుటకు విశ్వసించుటకు అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నవారు కాబట్టి దేవుడు యేసు ప్రభువు జనన వార్తను ముందుగా కాపరులకు తెలిపారు మనం కూడా వినయంతో ఉంటే దేవుని యొక్క పరమ రహస్యాలు మనకు తెలియజేయబడతాయి.

6. జ్ఞానులు:

ఏసుప్రభువును రాజుగా, రక్షకునిగా తమ కన్నా గొప్ప నాయకునిగా గుర్తించి ఆయన కొరకు దూర ప్రాంతముల నుండి ప్రయాణం చేశారు.

తమకోసం ఆకాశం నుండి భూమికి మనుష్యవతారం ఎత్తిన ప్రభువును కలుసుకొనుటకు వారు కష్టపడి ప్రాయసపడి ఇష్టంతో వచ్చారు.

కొన్ని సందర్భాలలో మనం దేవుని కొరకు గుడికి రావడానికి మన ఇంటి నుండి బయటకు రాలేము దేవుడు మాత్రము పరలోకం నుండి భూలోకానికి మన కొరకు వచ్చారు.

జ్ఞానులు మనకు, దేవునికి విలువైనవి సమర్పించుట నేర్పించారు. అదేవిధంగా దేవుని కలుసుకొనుట నేర్పించారు. కాబట్టి మన సమయమును కూడా దేవునికి సమర్పించాలి. ప్రతిరోజు ఆధ్యాత్మికంగా దేవుని కలుసుకొని జీవించాలి.

7. నక్షత్రం:

వెలుగుగా ఉంటూ మార్గం చూపిస్తుంది. దాని ద్వారానే జ్ఞానులు గమ్యం చేరారు.

నక్షత్రం నడిపించెను కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక నక్షత్రముగా మారాలి నక్షత్రంలా అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి సత్యం వైపుకు నడిపించాలి.

దేవుడు మన కొరకై తన కుమారుడిని ఈ లోకానికి పంపారు కాబట్టి ఆయనను ప్రేమతో స్వీకరించి ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకొని దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించూద్దాం.


FR. BALAYESU OCD

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...