26, మార్చి 2022, శనివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

తపస్సు కాల 4 వ ఆదివారం

యెహోషువ 5: 9, 10-12 , 2వ కొరింతి 5: 17-21 , లూకా 15: 1-3, 11-32.

ఈ నాటి ఆదివారమును తల్లి శ్రీసభ ఆనందించు ఆదివారం అని ప్రకటిస్తుంది.

-రాబోయేటటువంటి పునరుత్తానా రోజులను స్మరించుకొని మనందరం సంతోషంతో ఉండాలని ఈ ఆదివారం యొక్క ఉద్దేశం.

-ఈనాటి మూడు దివ్య పఠనాలు కూడా ఆనందించుటను గురించి బోధిస్తున్నాయి.

-తపస్సుకాలపు నాల్గొవ ఆదివారంలోకి ప్రవేశించాం ఇక కొన్ని రోజులలో ప్రభువు యొక్క సిలువ శ్రమలు, మరణ పునరుత్తానం లో బాగస్తులమై జీవించ బోతున్నాం కాబట్టి మనం ఆనందించాలి. 

-మనకు మేలు జరుగుతుందని ఆనందించాలి, మనం రక్షణ పొందే గడియ ఆసన్నమగుచున్నదని ఆనందించాలి.

-ప్రతి ఒక్కరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అందుకోసం రోజు చాల ప్రయత్నం చేస్తుంటాం.

-మనందరం మన యొక్క కుటుంబాలలో ఆనందంగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ శ్రమలు అనుభవించారు.

-మనము ఈ తప్పస్సుకాలములో దేవునితో మరియు తోటి మానవునితో సక్యపడి జీవించాలి అప్పుడు మనలో నిజమైన సంతోషం ఉంటుంది. 

- ఈనాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజలు స్వేచ్ఛతో ఆనందంగా చేసుకున్న పండుగను గురించి చదువుతున్నాం. 

-దేవుడు ఇశ్రాయేలుకు స్వేచ్ఛనిచ్చిన పండుగ వారు ఆనందంగా కొనియాడుచున్నారు.

-మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమికి ప్రయాణం చేయసాగారు. ఆయన తరువాత ఇశ్రాయేలును వాగ్దత భూమికి నడిపించింది యెహోషువ ప్రవక్తయే.

-మోషే కేవలం ఇశ్రాయేలీయులను వాగ్దత భూమికి దగ్గరకు మాత్రమే వారిని నడిపించారు, కానాను ప్రాంతంలో ఆయన అడుగు పెట్టలేదు. తన శిష్యుడైన యెహోషువ మాత్రమే ప్రజల తోటి అందు ప్రవేశించారు .

-యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత భూమిలో ప్రవేశించిన ప్రదేశానికి “గిల్గాలు” అనే పేరు వచ్చింది.

-గిల్గాలు అంటే పన్నెండు రాళ్ల వృత్తం అని అర్థం. ఈ పన్నెండు రాళ్లూ యాకుబు యొక్క 12 మంది కుమారులయొక్క జాతులకు చిహ్నం గా ఉన్నవి. యెహోషువ 4 :2 -3 .

-ఈ పన్నెండు రాళ్లతో దేవుని యొక్క బలిపీఠమును నిర్మిస్తున్నారు. ఈ రాళ్లు ఎందుకంటే దేవుడు చేసిన మేలు తలంచు కోవటానికి ఇశ్రాయేలు ప్రజలు దివ్యమందసంతో యోర్దాను నది దాటేటప్పుడు దేవుడి వారికి ఆరిన నేలను చేశారు. నదిలో నడిచి వెళ్ళుటకు దేవుడు మార్గం సిద్ధంచేశారు. ఆయన మేలులు గుర్తుంచుకొనటంకు ఈ బలిపీఠం నిర్మిస్తున్నారు. యెహోషువ 4 :7 .

-ఈ పన్నెండు జాతులలో దేవుడు తన ప్రజలను నియమించెను, వారిని తన బిడ్డలుగా ఎన్నుకొనెను.

వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఆనందంతో జరుపుకున్న తోలి పాస్కా పండుగ గురించి వింటున్నాం.

-యావే దేవుడు అంటున్నారు " నాటి అపకీర్తిని నేను మీనుండి తొలగించితిని" అని చెపుతున్నారు.

-వారియొక్క అపకీర్తి ఏమిటంటే సున్నతి పొందక పోవడమే యెహోషువ 5: 4 - 5.

-ఐగుప్తు దాటినా తరువాత ఎడారిలో జన్మించిన వారు సున్నతి పొందలేదు. యూదులు దేవుని బిడ్డలుగా ఉండుటకు సున్నతి చాల అవసరం. ఆది 17 : 10 -11 .

-సున్నతి చేయుట ద్వారా వారందరు అబ్రహం సంతతిగా పరిగణించబడతారు. దీనివలన దేవుని యొక్క మన్ననను   పొందుచున్నారు.

-ఈ అపకీర్తి అంటే ప్రజలయొక్క దురాలోచనలు దేవుడు తొలగించారు. ఎప్పుడెప్పుడు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలన్న ఆలోచనలను అన్నింటిని దేవుడు తొలగించారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అపకీర్తి అంటే బానిసలుగా వున్నవారికి స్వేచ్ఛనిచ్చి గౌరవించటం .

-దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి వారికి ఒక గుర్తింపునిచ్చారు. దానివలన వారియొక్క అపకీర్తి అంతా తొలగి పోయింది.

-మన జీవితాలలో ఉన్న అపకీర్తిని కూడా దేవుడు తొలగించి మనల్ని రక్షిస్తాడు.

-వాగ్దత భూమిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఆనందంగా తోలి పంటను రుచి చూశారు.

-అక్కడ మన్నా ఆగిపోయినది. ఎందుకంటే ఇక వాగ్దత భూమిలో పండించే పంట సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దేవుడు మన్నాను ఆపివేశారు . దేవుడు వారికి ఎటువంటి కొరత రాకుండా చూస్తారు. 

-ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆనందం చూస్తున్నాం.

-ఈ నాటి రెండవ పఠనంలో మనం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి అని పలుకుచున్నారు. 

-మనందరం క్రొత్త వాళ్లమైతే చాల సంతోషంగా, మంచిగా ఉంటుంది. మనయొక్క కుటుంబ సభ్యులకు అలాగే దేవునికి ఆనందంగా ఉంటుంది. 

-మనం నిజంగా క్రీస్తునందు జీవిస్తే నూతన సృష్టిగా చేయబడతాం. కొరింతు సంఘంలోని ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని జ్ఞాన స్నానం పొందటం ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడుచున్నారు.  మనం దేవుని యందు ఉంటే మన జీవితాలు కూడా మారుతాయి.

-దానికి నిదర్శనం పౌలు గారి జీవితమే. గలతీ 2 : 20  ఇక నాలో జీవించేది నేను కాదు క్రీస్తుయే అని పౌలు గారు పలుకుచున్నారు.

-క్రీస్తునందు ఎవరైనా ఉండాలంటే ఈ లోకంలో వున్న చెడును విడిచిపెట్టి దేవుడిని వెంబడించాలి.

-క్రీస్తునందు ఉండాలంటే మనలో పరిత్యజించుకునే లక్షణం ఉండాలి. ఆయన యందు ఉండటం కోసం ఏదైనా త్యాగం చేసే గుణం మనలో ఉండాలి.

-క్రైస్తవులుగా మనం క్రొత్తవ్యక్తులుగా మారడానికి మన యొక్క సొంత శక్తి ప్రయత్నం కాదు కానీ తండ్రి దేవుడు మనమీద చూపిన దయవలనే అది కారణం. 

-పౌలు గారు తనకు దేవుడు అప్పచెప్పిన పరిచర్యగురించి కూడా తెలుపుచున్నారు. క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులతో ఏర్పరిచిన సఖ్యత గురించి భోదించటమే దేవుడిచ్చిన పని అని తెలుపుచున్నారు. 

-సఖ్య పడి జీవించమని పౌలుగారు పలుకుచున్నారు. 2 కొరింతి 5: 20.

సఖ్య పడితే దేవునికి ఇష్టమే మన పొరుగువారికి ఇష్టమే ఇద్దరుకూడా సంతోషంగా ఉండగలరు.

-మనం సఖ్య పడాలంటే దేవుని యందు ఉండాలి. ఆయన యందు లేకపోతె మన జీవితాలు మారవు. 

-మోషే 40 రోజులు దేవుని యందు ఉన్నారు ఆయన ముఖం ప్రకాశవంతంగా మారింది. 

-పేతురు దేవునియందు ఉన్నారు. ఆయన జీవితం మారిపోయింది .

-జక్కయ్య జీవితం, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ, వీరి జీవితాలు మారిపోయాయి.

మనం కూడా క్రీస్తునందు జీవిస్తే మనం కూడా మారతాం. కానీ మనం ఎక్కువగా క్రీస్తునందు జీవించము. ఆయన యొక్క సాన్నిధ్యం మనలను మార్చివేస్తుంది. పౌలుగారి యొక్క జీవితమును మార్చివేసింది. 

-క్రీస్తునందు జీవించాలంటే ఇహలోక వాంఛలకు దూరంగా ఉండాలి అప్పుడు దేవునియందు మనం ఉండగలం. 

-ధనికుడైన యువకుడు క్రీస్తులో ఉండకుండా ధనం వెంబడి పోయాడు. యేసు ప్రభువుయొక్క శిష్యులు తనతో ఉన్నారు, కాబట్టి సామాన్యులైన వారి జీవితాలు చాలా మారిపోయాయి.

-క్రీస్తునందు మనం కూడా జీవిస్తే మనం నూతన వారిగా చేయబడతాం. పాతవి నశించి క్రొత్తవి ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తునందు జీవిస్తే నూతన జీవితం, నూతన ఆలోచనలు, మాటలు అన్ని ఉంటాయి.

-ఈనాటి సువిశేష పఠనంలో దేవుని యొక్క గొప్ప ఆనందం గురించి వింటున్నాం.

కేవలం తండ్రియొక్క ఆనందం మాత్రమే కాదు ఇక్కడ మనం చూసేది తప్పిపోయిన కుమారుడి ఆనందం కూడా ఎందుకంటే నిరాకరించిన తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ఏమి అనకుండా ఆయన్ను స్వీకరించారు, అందుకు కుమారుడు చాల ఆనందంగా ఉన్నారు. 

-లూకా సువార్త 15 వ అధ్యాయం మొత్తం కూడా తప్పిపోయిన వాటిగురించి భోదిస్తుంది.

-తప్పిపోయిన గొర్రె 

-తప్పిపోయిన నాణెము 

-తప్పిపోయిన కుమారుడు.

-తప్పిపోయిన గొర్రె, నాణెముల ఉపమానములు తప్పిపోయిన కుమారిని ఉపమానంకు ఒక వ్యత్యాసం ఉంది.

-తప్పిపోయిన గొర్రె, మరియు నాణెముల ఉపమానాలతో స్వయంగా దేవుడే, యజమానుడే వాటిని వెదకుచున్నారు కానీ తప్పి పోయిన కుమారుని యొక్క ఉపమానంలో తండ్రి కుమారుని వెదకటం లేదు, కుమారునికి స్వేచ్ఛనిచ్చారు. తనయొక్క స్వేచ్ఛ జీవితంలో కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నారు. మిగతా వాటికన్నా మానవుణ్ణి దేవుడు ఎక్కువగా ప్రేమించారు. అందుకే స్వేచ్ఛనిచ్చి ఎప్పుడు తన చెంతకు పశ్చాత్తాప పడి తిరిగి వస్తాడని ఎదురు చూశారు, తండ్రి. 

-ఈ సువార్త పఠనంలో చాల విషయాలు మనం ధ్యానించుకోవచ్చు దేవుని యొక్క గొప్ప దయా హృదయం మనకు ఇక్కడ అర్థమగుచున్నది దేవుడు మనలను ఎంతగా క్షమిస్తారో తెలుస్తుంది.

తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మూడు ముఖ్యమైన పాత్రలున్నాయి. 

-తండ్రి- అనంత ప్రేమ కలిగిన తండ్రి 

-చిన్నకుమారుడు -తప్పిపోయిన కుమారుడు.

-పెద్దకుమారుడు -నటించే పెద్దకుమారుడు 

-కొన్ని సందర్భాలలో ఈ ముగ్గురు వ్యక్తులు పోలినవారంగా మనందరం ఉంటాం. 

-ఈ ఉపమానం ప్రభువు తెలుపుటకు కారణం ఏమిటంటే పరిసయ్యులు సద్దుకయ్యలు తాము నీతిమంతులమని చెప్పుకొనుచు పశ్చాత్తాప పడకుండా ఇతరులను హీనంగా చూస్తున్నారు కాబట్టి దేవుడు పాపులను సుంకరులను ఎలాగా ఆదరిస్తారో ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియచేస్తున్నారు. 

-ఆ నాటి యుద్ధ సమాజంలో అలాగే నేటి ఆధునిక యుగంలో మూడు వర్గాల ప్రజలను సూచిస్తున్నాయి ఈ మూడు పాత్రలు. 

తమ పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చిన పాపాత్ములు -చిన్న కుమారునికి సూచనగా ఉన్నారు. 

-పశ్చాత్తాపంతో తన చెంతకు తిరిగి వచ్చి క్షమించమని కోరినప్పుడు వెంటనే క్షమించి తన చెంత చేర్చుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్న దేవుణ్ణి -తండ్రికి సువార్తలో సూచనగా ఉంది.

-మూడవ పాత్ర దారులు - మేము మాత్రమే నీతిమంతులమని చెప్పుకొనే యూదులు పెద్దకుమారునికి సూచనగా ఉన్నాయి. యూదులు ఎప్పుడు కూడా విమర్షించే వారే దేవుని దయను, ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా ఆయన్ను విమర్షించారు, నిందించారు.

ఈ మూడు పాత్రలను గురించి తెలుసుకుందాం. 

చిన్నకుమారుడు- చిన్న కుమారుణ్ణి మనం తప్పి పోయిన కుమారునిగా పిలుస్తున్నాం. 

చిన్నకుమారుడు తండ్రి నుండి స్వేచ్ఛను కోరుకొని తన తండ్రి సంపదనుండి  తన హక్కుగా రావలసిన మూడవ వంతు వాటాను బలవంతంగా పంచుకొని వెళ్ళాడు.

-తండ్రియొక్క విలువను, ప్రేమను, ఆయన చూపించే ఆ యొక్క ఆదరణను గ్రహించలేకుండా చిన్న కుమారుడు తండ్రితో వున్న భందమును తెంచుకొని తన యొక్క సొంత ఆనందాలు అనుభవించటానికి దూరంగా వెళ్లుచున్నాడు, తండ్రి ప్రేమను తిరస్కరించి వెళ్తున్నాడు. 

-జల్సా చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ, తన ఆస్తినంతా పోగొట్టుకొని చివరికి ఒక హీనమైన పని చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరుకూడా ఏమి ఇవ్వలేదు అంత దురదృష్టకరమైన స్థితి 15 : 16 .

-తనకు ధనమున్న క్షణంలో ఏమి గుర్తుకు రాలేదు. తన తండ్రి కూడా గుర్తుకు రాలేదు. కానీ అన్ని కోల్పోయిన్నప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు. 

-మనజీవితంలో కూడా చాలా మందికి డబ్బున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. చిన్న కుమారుని వలే జీవిస్తాం. 

తనయొక్క హీన స్థితిలో కను విప్పు కలిగెను అని 17 వ వచనంలో చెప్పబడింది. 

-ఈ కనువిప్పు మనలో కూడా కలగాలి. నేను ఎలాంటి తప్పు చేశానని కనువిప్పు కలిగింది . కనువిప్పు అంటే చేసిన తప్పు తెలుసుకోవడమే.

-చేసిన తప్పు మనస్సుకు గుర్తుకు వచ్చి చిన్న కుమారుడు పశ్చాత్తాప పడుచున్నాడు. తన తండ్రి యొక్క ప్రేమను గుర్తించుకుంటున్నారు, ఆయన చేసిన పాపలు క్షమించాలని కోరుకుంటానని ఆలోచన చేస్తున్నాడు. 

-మనజీవితంలో తండ్రిని కాదని స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మన జీవితాలు కూడా దారుణంగా మారతాయి. చిన్న కుమారుడి జీవితం తండ్రితో వున్నప్పుడు ఒక విధంగా ఉంది తండ్రితో లేనప్పుడు ఇంకొక విధంగా ఉంది. ఆయన ఆకలితో అలమటించారు. తండ్రి దగ్గర అంతా సమృద్ధిగా పొందాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ తెలుసుకోలేదు. 

-ఈ చిన్న కుమారుడు తానూ పాపం చేశానని గ్రహించి తండ్రి చెంతకు వెళ్లుచున్నాడు.

18 వ వచనంలో "వాడు లేచి " తండ్రి వద్దకు వెళ్లాలనుకున్నాడు మనం నడవాలంటే ముందుగా కూర్చున్న స్థలం నుంచి లేవాలి. 

-మనం ఎక్కడ నుండి లేవాలంటే మన పాపపు స్థితి, వ్యసనాల నుండి లేవాలి. మనయొక్క చెడు గుణాలనుండి లేవాలి . పొరుగు వారితో సఖ్య పడటానికి కూడా లేచి నడవాలి, మనయొక్క దీన స్థితి నుండి లేవాలి అప్పుడు దేవునితో పొరుగు వారితో సక్యపడి మంచి జీవితం జీవించాలి.

చిన్న కుమారునికి తండ్రి మీద ఉన్న నమ్మకం వల్లనే ఆయన చెంతకు తిరిగి రావాలను కున్నాడు. మనం కూడా తిరిగి రావాలి. తిరిగి రావాలంటే 

-దేవునితో కలిసి ఉండటానికి తిరిగి రావాలి

-కుటుంబ సభ్యులతో కలిసి ఉండుటకు తిరిగి రావాలి 

-భార్య, భర్తతో, కలిసి ఉండటానికి తిరిగి రావాలి. 

అందుకే దేవుడు ఇప్పుడైనా తిరిగి రమ్మంటున్నారు. యావేలు 2 : 12 -13 .

-చిన్న కుమారుడు- తప్పిపోయాడు -తన యొక్క సొంత ఆలోచనలవల్ల, జల్సాల వల్ల తప్పిపోయాడు. తండ్రిని అర్థం చేసుకోవడంలో తప్పిపోయాడు -తండ్రిని ప్రేమించుటలో తప్పిపోయాడు, తండ్రని గౌరవించుటలో తప్పిపోయాడు. తనయొక్క బాధ్యతలు నిర్వహించుటలో తప్పిపోయాడు- విధేయత చూపటంలో తప్పిపోయాడు. 

-మనం కూడా చాలా విషయాలలో తప్పిపోతున్నాం;

-ప్రార్థించుటలో తప్పిపోతున్నాం.

-ఈ లోక కోరికలకు తప్పిపోతున్నాం. 

-దేవుని సన్నిధికి రావటంలో తప్పిపోతున్నాం. ఇంకా చాలా విషయాలలో తప్పిపోతున్నాం.

-చిన్న కుమారునిలో వున్నా గొప్ప లక్షణం ఏమిటంటే తండ్రి చెంతకు తిరిగి రావాలనుకోవడం, సఖ్య పడి క్షమించమని అడగటం. మనకు నచ్చిన విధంగా మనం జీవించి పాపము చేసిన సందర్భంలో పాపాలకు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి క్రొత్త జీవితం జీవించాలి. 

-చిన్నవాని వలే మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితమును సరిచేసుకొని జీవించాలి. మనలో ఎలాంటి మార్పు అవసరమో అని మనకు తెలిస్తే మన జీవితాలు మనం మార్చుకోవచ్చు.

2. తండ్రి - దేవుడు 

-తనను కాదని వెళ్లిపోయిన కుమారున్ని తండ్రి క్షమించాడు ఆదరించాడు. 

-తండ్రియొక్క సహనంకు, ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు తన కుమారునికి మేలిమి వస్త్రాలు ఇవ్వమని చెప్పుచున్నారు. 

-తన కూమారుని పట్ల అనంతమైన ప్రేమను దయను చూపిస్తున్నారు ఆయన దయ కుమారుని యొక్క అన్ని పాపాలను మరచి పోతుంది. 

-తండ్రి కూమారునికి స్వేచ్ఛనిచ్చారు, ఆస్తిని పంచిపెట్టారు, కుమారుడు ఏది కావాలన్నా తండ్రి ఇచ్చారు, అది ఆయన యొక్క గొప్పతనం. 

-తండ్రి కుమారుని యొక్క రాక కోసమై, కూమారుని హృదయ పరివర్తన కోసమై ఎంతో ఎదురు చూశారు. తన బిడ్డలయెడల ఆయన ప్రేమ అలాంటిది. 

-తండ్రి ప్రేమ అర్థం చేసుకునే ప్రేమ -దేవుని ప్రేమ క్షమించే ప్రేమ -దేవుని మనస్సు స్వీకరించే మనస్సు.

-కుమారుడు పలికినది ఒకే ఒకమాట "తండ్రి నీకును పరలోకంకు విరుద్ధంగా పాపం చేశాను అన్నాడు. అది కూడా తండ్రి సరిగ్గా విన్నాడో లేదో కానీ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనను బిడ్డలాగే స్వీకరించి ఆయన్ను గౌరవించి విందు చేస్తూ ఆనందమును వ్యక్తం చేస్తున్నారు.

-మనం కూడా దేవునివలె మంచి మనస్సు ఉండాలి. క్షమించమని అడిగిన వారిని క్షమించి స్వీకరించాలి.


3. పెద్ద కుమారుడు - ఆయన నటించే కుమారుడు 

వాస్తవానికి ఆయన తండ్రి దగ్గర రోజు గడిపినప్పటికీ తండ్రి హృదయం తెలుసుకోలేక పోయాడు. 

-తమ్ముడు యొక్క రాకను అంగీకరించలేక పోయాడు. ఆయన అనుకోని వుండవచు, మళ్లి   ఆస్తి తీసుకొని పోవటానికి వచ్చాడని. తమ్ముడి పట్ల ఈర్ష జీవిస్తున్నాడు. జీవిస్తున్నాడు.

-పెద్దవానికి తండ్రి పట్లగాని, తమ్ముడి పట్ల గాని నిజమైన ప్రేమలేదు అతడు ఇద్దరినీ నిందించాడు. ఇద్దరి మీద కోపపడుచున్నాడు. కనీసం ఇంటిలోకి రావటానికి కూడా ఇష్టం లేకున్నాడు. 

-పెద్దకుమారుడు తండ్రి దగ్గర ఒకే ఇంటిలో జీవించిన తండ్రి మనస్సుకు దూరంగా ఉన్నాడు.

-పరిసయ్యులు సద్దుకయ్యలు అందరుకూడా దేవుని చేత ఎన్నుకొనబడి ప్రజలని దేవుని ఇష్టమైన బిడ్డలని చెప్పుకునే వారే. వాస్తవానికి వారు దేవుని హృదయానికి దూరంగా జీవించేవారే, ఇతరులను అంగీకరించకుండా జీవించేవారు.

-మన సమాజంలో కూడా ఇలాంటి మూడు పత్రాలు కలిగిన వారిని మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం ?

-క్షమించే తండ్రినా?

-చేసిన తప్పులు తెలుసుకొని తిరిగి వచ్చిన చిన్నవాడినా?

-తండ్రిని అర్థం చేసుకోకుండా నిందించే పెద్దవాడినా?

-మనం దేవుని చెంతకు మరలి వస్తే, సఖ్య పడి జీవిస్తే, హృదయం పరివర్తనం చెందితే అందరూ ఆనందిస్తారు.


Rev. Fr. Bala Yesu OCD

తపస్సు కాల 4 వ ఆదివారం (మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత)

 

మానవునితో సఖ్యత - హృదయ పరివర్తనం -దేవునితో సఖ్యత
 

మొదటి పఠనం: ఐగుప్తు  అపకీర్తిని దేవుడు మన  నుండి తొలగిస్తాడు . అంటే దాస్యాత్వం నుండి మనలను విమోచించి స్వతంత్రులుగా  జీవించే వారిగా మనందరిని  తీర్చిదిద్దుతాడు.

రెండవ పఠనం  , క్రీస్తునందు జీవిస్తే, క్రీస్తు మనలను తనతో సఖ్యపరచుకొని నూతన సృష్టిగా మనలను మారుస్తాడు

 సువార్త పఠనము , తప్పిపోయిన  కుమారుడి ఉపమానం ద్వారా మన తప్పులను తీసుకొని, తండ్రి చెంతకు తిరిగి రావాలని, ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు వారి   మనస్తత్వానికి  స్వస్తి చెప్పాలని, పెద్దకుమారుడిలాగా తండ్రి దగ్గర ఉంటూ, దూరంగా జీవించే జీవితానికి సెలవు చెప్పి, దేవునితో మరియు  తోటి మానవునితో  సఖ్యతగా, సమాధానంగా జీవించాలని విశద పరుస్తుంది

 ఈ విధంగా ఈ నాటి మూడు పఠనాలు తండ్రి దేవుడు   అవధులు లేని ప్రేమకలవాడని, మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాప పడి పాపం అనే  బానిసత్వం నుండి దేవుని ప్రేమ అనే స్వతంత్ర  జీవితానికి మరలి వచ్చి, నూతన సృష్టిగా మారమని ఈలాగున  దేవునితో, మానవునితో  సఖ్యత  పడమని మనందరిని   ఆహ్వానిస్తున్నాయి  వీటిని మనం మూడు అంశాలా రూపేనా  ధ్యానిస్తూ అర్ధం  చేసుకుందాం.

1. తండ్రి నుండి దూరంగా  వెళ్ళడం

2.మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం

3.నూతన సృష్టి – ఉత్సవం

 ఈనాటి సువార్త పఠణం లో తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో మూడు ముఖ్య పాత్రలను చూస్తున్నాము  1.  తండ్రి 2 .చిన్నకుమారుడు 3 .పెద్దకుమారుడు

 చిన్న కుమారుడు  తన తండ్రితో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడు.  అందుకే తనకు రావాల్సిన  ఆస్తిలో  భాగాన్ని పంచిపెట్టామని,  తన తండ్రిని బలవంతం చేసి తన బాగాన్ని నెగ్గాడు . (లూకా 15 :12 )ఈ కుమారుడు తన తండ్రి హద్దులు,  అవధులు  మరియు అంతం లేని ప్రేమను,  చేతులారా ఇక అవసరం లేదుగా అనుకున్నాడు. తను  సత్వహగా జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు . దూర దేశంలో దీనికంటే ఇంకా ఎక్కువ ప్రేమ, ఆప్యాయత, భోగావీలాస  జీవితం లభిస్తుందని,  తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూర దేశాలకు వెళ్లి అక్కడ భోగ విలాసాలకు అలవాటుపడి  ఇదే సర్వస్వం  అనుకోని, తన చిల్లర స్నేహితులే ప్రేపంచం  అనుకోని , వాళ్ళు ఎళ్ళకాలం తనతో ఉంటారు అనుకోని, డబ్బు శాశ్వతం అనుకోని భ్రమపడ్డాడు (లూకా 15 ;13 -14 ),అందుకే తన ధనమును విచ్చల విడిగా ఖర్చుపెట్టి సుఖమయ జీవితానికి అలవాటుపడ్డాడు. కానీ కరువు  దాపరించడం వళ్ళ, తన సుఖమయ జీవితానికి, భోగ విలాస జీవితానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తనతో  జీవితాంతం ఉంటారనుకున్న స్నేహితులు, ఇప్పుటి  దాక తనతో ఉండి, ఈ దరిద్రపు స్థితిని చూసి వదిలేసారు, ఒంటరయ్యాడు. కనీసం తినడానికి తిండి లేదు ,ఉండటానికి ఇల్లులేదు, ఎంచేయాలో అసలు తెలియదు ,చివరికి ఒక యజమానిని  ఆశ్రయించగా, తాను తన పొలంలో పందులను మేపుటకు పంపెను,  తర్వాత చెసేది కూడా ఏమిలేదు, ఎంతో హీనా స్థితికి దిగజారి చివరకు పందులు తిను పొట్టుతో తన పొట్టను నింపుకొని ఆశపడ్డాడు.  కానీ ఎవరు ఏమి ఇవ్వలేదు ,(లూకా 15 ;15 - 16 ),ఇదంతా ఓ తండ్రి ప్రేమమయ తండ్రి నుండి దూరంగా వెళ్ళుట ఫలితమే. ఈ రోజు నీవు నేను తండ్రి ప్రేమ నుండి కరుణ నుండి,తండ్రి సాన్నిధ్యం నుండి దూరంగా వెళ్ళామా?

 2. మన పాపపు స్థితిని గ్రహించి తండ్రి చెంతకు తిరిగి రావడం :

 తప్పిపోయన కుమారుడు ఎంతో హీనా స్థితికి దిగజారుడు,కడుపు నింపుకోవడానికి పందులు తిను పొట్టు మాత్రమే గతి, అన్నపుడు గుర్తుకొచ్చింది తండ్రి ప్రేమ.  అప్పుడు తండ్రి నుండి తాను అనుభవించిన రాజసం, వైభవం, జాగ్రత్త, అనురాగం ఒక్కోక్కటి గుర్తుతెచ్చుకొని, నెమరు  వేసుకుంటూ బోరున ఏడువసాగాడు. ఇక అనుకున్నాడు: నా తండ్రి వద్ద ఎందరో  పనివారికి పుష్టిగా  భోజనం దొరుకుతుంది కాని  ఇక్కడ నేను ఆకలికి మల మల మాడుచున్న.(లూకా 15 ;17 ) ఈలాగున  తన పాపపు స్థితిని గ్రహించాడు. ఇక లాభం లేదు! నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి,తండ్రి నేను పరలోకమునకును ,  నీకును ద్రోహం చేశాను ఇప్పుడు నేను ని కుమారుడను  అని అసలు అనిపించోకోదగను. నీ పని వారిలో ఒక్కరిగా పెట్టుకోనుము అని చెప్పెదనని ,  ఆలోచించుకుంటూ తండ్రి వద్దకు బయలుదేరెను.(లూకా 15 ;19). తన తండ్రి చెంతకు తిరిగి వచ్చెను. తన  తండ్రి  చెంతకు తిరిగి రావాలి అనేది  ఓ గొప్ప అభినందనీయ నిర్ణయం. ఎందుకు అంటే ఈ నిర్ణయం ద్వారా తన తండ్రితో మరల  జీవించాలి అనుకున్నాడు. తన తండ్రి ప్రేమను తనివితీరా అనుభవించాలి అనుకున్నాడు. తన తండ్రి సాన్నిధ్యంతో తండ్రి వద్ద ఉండాలి అనుకున్నాడు.

కాని  పెద్ద కుమారుడు తండ్రి  సాన్నిధ్యంలో ఉన్న కానీ తండ్రికి దూరంగా జీవిస్తున్నాడు ఇది  ఎంతో దుర్లభమైన జీవితం. అటు తండ్రితో,  ఇటు  తమ్ముడితో సఖ్యత లేదు.  స్వార్థం,  నిరాకరణ, అసూయా అనే దుర్గుణాలతో నిండి ఉన్నాడు.  ఇతరుల శ్రేయస్సును, ఎదుగుదలను మరు మనసును, తట్టుకోలేక పోయాడు.

ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చిన్న కుమారుడని పోలి ఉన్నానా, పెద్ద కుమారుడని పోలి ఉన్ననా ?,పెద్దకుమారుడి లాగా ఈర్షతో జీవిస్తే , జీవితానికి ఒక అర్ధం ఇవ్వలేం.  జీవితంలో నిజమైన సంతోషాన్ని  పొందలేము,తండ్రి దేవుని ప్రేమను అనుభవించలేం.    కాని  చిన్న కుమారుడిలాగా మన పాపపు స్థితిని గ్రహించి, పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం చెంది, దేవుని వద్దకు తిరిగి వస్తే దేవుని అనుగ్రహాలు, అవధులు లేని ప్రేమని ,కరుణని పొందగలం.

  3 . నూతన సృష్టి ఉత్సవం

 ఎవడైనను క్రీస్తునందున్న  యెడల అతడు నూతన సృష్టి. పాత  జీవితం గతించినది.  క్రొత్త జీవితం ప్రారంభం అవుతుంది.(2 కోరింతి  5 :17 ), అని ఈనాటి రెండో పఠనంలో మనం  మనం చదువుతున్నాం. చిన్న కుమారుడు తన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకున్నాడు పశ్చాత్తాప పడి దేవుని చెంతకు తిరిగి వచ్చి ఇక క్రీస్తునందు ఉండాలి అనుకొన్నాడు, తోటి వారితో దేవునితో సఖ్యత పడ్డాడు. ఒక నూతన సృష్టి గా మారాడు.

 పెద్ద కుమారుడు మాత్రం తండ్రి వద్ద ఉన్నాడు, కాని  తండ్రి నందు ఉండలేకపొయ్యాడు. తన స్వార్ధం,నిరాకరణ మరియు  అసూయా దానికి కారణం. తన జీవిత స్థితిని గ్రహించలేకపొయాడు. తాను తండ్రికి  తగిన కుమారుడు అనుకున్నాడు,  కానీ తండ్రితో సఖ్యతను సంపాదించుకోలేకపొయాడు. ఓ పాతసృష్టిలానే  మిగిలిపోయాడు. ఎంత దురదృష్టకరణం! పెద్ద కుమారుడిలా కాక, మనం మన పాపపు బానిసత్వం నుండి విమొచించబడి దేవుని దగ్గరకు తిరిగి రావాలి.  (యెహోషువ 5 ;9 -12 ), ఒక నుత సృష్టిగా మారాలి. అప్పుడు ఒక  ఉత్సవం జరుగుతుంది. స్వయానా తండ్రి దేవుడే మనలను  ఆహ్వానిస్తాడు .ఏవిధంగా అంటే పరుగున వచ్చి, కౌగలించుకొని  ముద్దు పెట్టుకుంటాడు. అంతటితో ఆగడు, మనకు మేలిమి  వస్త్రములను, వెలికి ఉంగరమును ,కాళ్ళకు చెప్పులను ఇస్తాడు. అంటే ఇక మనం బానిసలం కాదు, స్వతంత్రులమని , తనకు చెందిన వారమని, తన రాజరికంలో వా రమని దానికి  అర్ధం.  క్రోవిన దూడను వాదించి విందు ఏర్పాటు చేస్తాడు (లూకా 15 ;20 -23 ), ఎందుకు అంటే? తప్పిపోయన మనం తిరిగి తండ్రి వద్దకు వచ్చేం . పాతజీవితానికి మరణించిన మనం నూతన జీవితానికి జన్మించం. ఈ తపసు కాల నాలుగవ  ఆదివారం మనమందరం మన పాపపు స్థితిని గ్రహించి, ఒప్పుకొని పశ్చాత్తాప పడి ,దేవుని చెంతకు తిరిగి వద్దాం.  నూతన సృష్టిగా మారుదాం. మన తోటి  వారితో,  దేవునితో, వెల్ల వేళలా  సఖ్యతతో జీవిద్దాం .

 BR. SUNIL INTURI 

 

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...