11, డిసెంబర్ 2021, శనివారం

ఆగమన కాలపు 3 వ ఆదివారం(2)

 ఆగమన కాలపు 3 వ ఆదివారం(2)

జెఫన్యా  3:14-18
ఫిలిప్పియన్స్ 4:4-7 
లూకా  3:10-18

క్రీస్తునాధుని యందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నాడు తల్లి శ్రీసభ మూడోవ ఆగమన కాలపు ఆదివారంలోనికి ప్రవేశిస్తుంది, ఈ యొక్క ఆదివారన్ని ఆనందపు ఆదివారంగా కొనియాడుతున్నాము.
ఈ యొక్క ఆనందం ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మనము పెదవులతో సత్యం, కన్నులకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ అందిస్తామో అప్పుడే మన యొక్క జీవితాలలో ఆనందం అనేది వస్తుంది.
ఈ నాటి మూడు పఠనాలు కూడా దీని గురించే తెలియజేస్తున్నాయి, ఎందుకంటే ఈ యొక్క ఆగమన కాలంలో మనమందరము కూడా యేసు ప్రభును మన యొక్క హృదయంలోకి ఆనందంతో ఆహ్వానించి ఆ ఆనందాన్ని ఇతరులతో  పంచినపుడు మనయొక్క క్రైస్తవ జీవితాలకు ఒక అర్థం ఉంటుంది.
మొదటి పఠనము జఫాన్యా గ్రంధములో మనము చూస్తున్నాము సీయోను ప్రజలారా ఆనంద నాదముతో దేవుని ఆరాధించండి అన్ని చెబుతున్నాయి,
ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆనందంగా ఉండాలంటే?
1. దేవుడు వారియొక్క శత్రువులను చెల్లా చెదురు చేసెను.
2. వారి యొక్క దండనమును తొలగించెను. 
3. దేవుడు వారి మధ్యలో ఉండి వారికీ నూతన జీవితమును దయచేసెను.
ఈ  కాలంలో మనము యేసును ఆహ్వానిస్తే క్రీస్తు మన శత్రువులను చెల్లా చెదురు చేస్తాడు, శిక్షనుండి తప్పిస్తాడు, నీతో ఉండి కావలసిన ప్రతి దానిని నీకు ప్రసాదిస్తాడు.
రెండొవ పఠనంలో పునీత పౌలు గారు పిలిప్పీ ప్రజలకు రాస్తూ క్రీస్తు ప్రభు దగ్గరలోనే ఉన్నారు కనుక వారు ఏమి చేయాలో వారికీ తెలియజేస్తున్నాడు.
1.ఎల్లపుడు ఆనందింపుడు
2. అందరితో సాత్వికంగా ఉండుడు
3. దేనిని గూర్చి విచారింపకుడు.
 మనం ఏమి కావాలి అని దేవుని, నిండు మనసుతో అడిగితె దేవుని యొక్క శాంతి మన హృదయాలయందు దేవుడు భద్రముగా ఉంచుతాడు. 
వినయంగలవారే దేవునికి ఇష్టమైన వారు (మార్కు 1 :40 ).
కుష్టు రోగి ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చి నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచుము అని అడిగినప్పుడు క్రీస్తు వాణి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని వానికి స్వస్థత కలిగించటం మనము చూస్తున్నాము. ఎప్పుడైతే స్వస్థత పొందాడో దేవునికి వినయవంతమైన జీవితంతో జీవించాడు. అలాగే ప్రతి  క్రైస్తవుడు కూడా క్రిస్తుయందు ఆనందించాలి ఇది విశ్వాసికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అదేమిటంటే క్రీస్తు యొక్క రాకడ గురించి మన నిరీక్షణ శుభప్రదమైనది 
1. ఆనందించండి
2. దేనిని గురించి చింతించకూడదు
3 ప్రతి విషయంలో దేవునికి ప్రార్ధించాలి. అలా ఉండటంవల్ల మనయొక్క జీవితాలలో అనందం అనేది ఉంటుంది. 
ఎందుకు ఆనందించాలి అంటే క్రీస్తు మనకు సమీపంలోనే ఉన్నాడు కనుక అందించాలి. 
అదేవిధంగా సువిశేష పఠనములో చూస్తున్నాము బాప్తిస్మ యోహాను ఇశ్రాయేలు ప్రజలను రానున్న క్రీస్తు ప్రభు గురించి తెలియజేస్తూ మనమందరం కూడా క్రీస్తు యేసు రాకడ కోరకు వేచిఉండాలని, బాప్తిస్మ యోహాను గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందంటే, మానవులైన మనకందరికీ కూడా తెలియని విధంగా మరియు ఎప్పుడు వస్తుందో  తెలియదు, కాబట్టి మనమందరము కూడా క్రీస్తు యొక్క రాకడకై వేచిఉండాలని ఈ నటి సువిశేష పఠనం తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునదునియందు ప్రియా సహోదరులారా క్రైస్తవులమైన మనమందరము కూడా క్రీస్తు యొక్క రాకడ కొరకు ఆనందంతో వేచిఉండాలని మరియు ఈ యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచాలని  ప్రార్ధించుదాం.
Br. Johannes

ఆగమనకాల 3 వ ఆదివారము

ఆగమనకాల 3 వ ఆదివారము

జెఫన్యా 3: 14 – 18

ఫిలిప్పు 4: 4-7

లూకా 3: 10-18

ఈ నాటి దివ్యపఠనాలు దేవుని రాక గురించి సంతోషించుడి అనే అంశము గురించి భోదిస్తున్నాయి. మొదటి పఠనము మరియు రెండవ పఠనము ముఖ్యముగా ప్రభువు నందు ప్రతిఒక్కరు ఆనందించాలి అనే అంశము గురించి ప్రస్తావిస్తున్నాయి. ప్రతి ఒక్కరి హృదయములో దేవుడే శాశ్వత ఆనందం నింపుతారు. ప్రభువు యొక్క అవసరత తెలుసుకుని అయన కోసం తమ జీవితాలను సిద్ధం చేసుకునే వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. మానవ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే దేవుని మీద నమ్మకం, ప్రేమ ఉంది జీవిస్తే బాధ అయినా ఆనందంగా ఉంటుంది. మనకు ఏ బాధలు ఎదురవకపోతే మనము సంతోషముగా ఉండగలుగుతామని మనము సాధారణంగా అనుకుంటాము. కానీ యేసు ప్రభువు జీవితం చూస్తే వారిలో ఎప్పుడు సంతోషమే ఉంది. పౌలు గారు తనయొక్క సువార్త పరిచర్యలో ఎన్నో రకాల ఎదురుదెబ్బలు తిన్నారు, ఎన్నో నిరాశలకు, హింసలకు, అణిచివేతలకు గురయ్యారు. అన్ని బాధల్లో కూడా ప్రభువులో సంతోషాన్ని అనుభవించారు. ఎందుకంటే అయన ప్రభువులో ఐక్యమై జీవించారు (2 కొరింతి 6:10) మనము దేవుని యందు మాత్రమే నిజమైన ఆత్మీక సంతోషాన్ని పొందగలుగుతాము.

ఈనాటి మొదటి పట్టణములో జెఫన్యా ప్రవక్త యెరూషలేమును మరియు ఇశ్రాయేలును సంతోషించమని భోదిస్తున్నాడు. జెఫన్యా ప్రవక్త యోషీయా రాజు యూదాయాను పరిపాలిస్తున్న సమయములో యెరూషలేములో, యూదాలో దైవసందేశమును ప్రజలకు అందజేశారు. జెఫన్యా ప్రవక్త దేవునికి సంపూర్ణ విధేయుడై దేవుని యందు నిజమైన ఆనందము వెదుకుతూ జీవించినప్పటికీ తన చుట్టుప్రక్కల జీవించే ప్రజలు దేవునికి అవిధేయులై పాపము చేయుటవలన కష్టాలనుభవించారు, బానిసలుగా జీవించారు. జెఫన్యా ప్రవక్త దేవుని యొక్క మాటలు చక్కగా వివరిస్తున్నారు. సీయోను కుమారి ఆనంద నాదము చేయుము, యెరూషలేము నిండు హృదయముతో సంతసింపుము, అను సంతోష వార్తను తెలియజేస్తున్నారు. యావే దేవుడు పునరుద్ధరించిన యెరూషలేమును ఎంతో ఆప్యాయముగా సీయోను కుమారి అని పిలుస్తున్నారు. వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే సమయము వస్తుందని వారికీ గుర్తుచేస్తున్నారు. ఎంతో సంతోషముగా హర్షద్వానము చేయుము అని ప్రవక్త తెలుపుచున్నారు. దేవుని ప్రజలయొక్క కష్టకాలం ముగిసింది. ఇక సంతోషకరమైన రోజులు రాబోవుచున్నాయి అని తెలుపుచున్నారు. ఈ మాటలు నిజంగా మన యొక్క హృదయపూర్వక సంతోషమును వెల్లడిచేస్తున్నాయి. మనలో చాల సంతోషము దాగివుంటేనే హర్షద్వానము చేస్తాము. దేవుడు యెరూషలేము ప్రజల్లో గొప్ప సంతోషము నింపుతున్నారు, కాబట్టియే సంతోషించమన్నారు.

ఇశ్రాయేలు ప్రజల యొక్క దండనము, వారి యొక్క శిక్ష ముగిసింది అని ప్రభువు నుడువుచున్నాడు. ఇక శత్రువుల యొక్క బాధ తొలిగిపోయింది అని దేవుడు ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు. దేవుడు వారికి ఒక అభయము ఇస్తున్నారు. ఇశ్రాయేలు రాజైన ప్రభువు మీ నడుమనున్నాడు, ఇక ఏ కీడుకు వెరువనక్కరలేదు అని ఒక అభయమిస్తున్నారు. రాజు మనతోవుంటే మన జీవితంలో ఇక కొడవయు ఉండదు. రాజు మనకోసం యుద్ధం చేస్తారు. ఇశ్రాయేలు నిజ దేవుడైన యావే. మరి అయన తోడుగా ఉంటె ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అయన తన ప్రజలను సమపాలనలో చూస్తారు. అయన మనతో ఉంటె మనకు అన్ని నేర్పిస్తారు. మనకు కష్టాలురాకుండా మనలను మంచిగా చూసుకుంటారు. మనకు జీవన శైలి నేర్పిస్తారు. నూతన జీవితం ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనను అంటిపెట్టుకుని జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలయొక్క జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఇంకేం కావాలి. రాజు తోడుగా ఉంటారు అన్న మాట చాలు. దేవుడు మన జీవితాల్లో చేసే ప్రతియొక్క గొప్ప విషయాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. మన ఇష్టానుసారంగా మనము జీవిస్తే కష్టాలపాలవుతాము కానీ దేవుని ప్రకారము జీవిస్తే ఆనందము పొందుతాము. ఒకవేళ కష్టాలు ఎదురువచ్చినా సంతోషముగానే ఉంటాము.

యెషయా ప్రవక్త అంటారు,"నా ఆత్మానందమైన నా ప్రభువు, నా దేవుని యందు నా హృదయము ఆనందంతో నిండి ఉంది"(యెషయా 61:1) ఆయన ప్రభుని ఆత్మతో ఐక్యమైనందువల్లే ఆలా అనగలిగారు. దేవుడు కూడా మన మధ్య ఉంటె ఎప్పుడు కూడా సంతోషమే. 

ఈనాటి రెండవ పఠనంలో పౌలుగారు నిజమైన విశ్వాసి ఎవరియందు ఆనందించాలి అనే అంశము గురించి బోధిస్తున్నారు. మనము అందించాల్సింది దేవునియందు మాత్రమే. ఈ లోక విషయాల యందు కాదు. బంగారము వల్లనో, సంపదల వల్లనో, స్నేహితుల వల్లనో, కాదు మనము అందించాల్సింది. దేవునియందు ఆనందించాలి. 

  • యేసు ప్రభవు జన్మించారని ఆనాడు గొల్లలు ఆయనయందు ఆనందించారు.

  • రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు జన్మించారని ముగ్గురు రాజులు ప్రభువు నందు ఆనందించారు.

  • యేసు ప్రభువు పాపులతో భుజించినప్పుడు వారు క్రీస్తునందు ఆనందించారు 

  • జక్కయ్య నిజమైన స్నేహితుడిని కనుగొన్నానని యేసునందు ఆనందించారు

  • అపోస్తులులు హతసాక్షులవుతూ మేము క్రీస్తు కోసము మరణిస్తున్నామని  ఆనందించారు 

మన ఆనందము ఎక్కడ దాగి ఉంది. దేనిలో ఆనందమును వెదుకుచున్నాము. , ఓపికగా మనము పొరుగువారికి సహాయము చేస్తే దానిలో నిజమైన దేవుని ఆనందము వెదకవచ్చు. ప్రతిఒక్కరు ప్రకటించేది సువార్తే కాబట్టి అందరు ఆనందించాలి.

  • దేవుని సేవచేయుటలో ఆనందించాలి 

  • దేవుని ప్రేమను పంచుటలో ఆనందించాలి

  • దేవుని క్షమను విస్తరించుటలో ఆనందించాలి

  • దేవుని సువార్త ప్రకటించుటలో ఆనందించాలి 

పౌలు గారు ఫిలిప్పు క్రైస్తవులకు కూడా చెప్పే మాటలు కూడా అవే. మన యొక్క ఆనందము దేవునిలో వెదకాలి. ఆనందంగా ఉండాలనుకునే మనిషి యొక్క మానవ దృక్పథం తన ఆత్మ సమ్మతిపై ఆధారపడివుంటుంది. పౌలు గారు దేవునిలో సంతోషము కనుగొన్నారు. అదే విధముగా మనము కూడా జీవించాలి. రెండవదిగా ఈ లేఖలో పౌలు గారు అందరిని సాత్వికంగా ఉండమని చెబుతున్నారు. అందరి పట్ల మృదువుగా జీవించమని చెబుతున్నారు. సాత్వికంగా అంటే సహాయము చేసుకుంటూ, అర్ధం చేసుకుంటూ ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ జీవించడమే. సాత్వికంగా జీవిస్తే మనము మంచి స్నేహితులను సంపాదించుకోవచ్చు. మన యొక్క మాటల్లో, చేతల్లో సాత్వికత ఉంటె మనము చాల మందితో సంబంధము కలిగి జీవించవచ్చు. మూడవదిగా ప్రభువు దగ్గరలోనే ఉన్నారు అని తెలుపుచున్నారు. 

  • ప్రార్ధించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • ప్రేమించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • దానం చేసే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

  • క్షమించే వారికి ప్రభువు దగ్గరలోనే ఉంటారు.

నేటి సువిశేషం భాగంలో బాప్తిస్మ  యోహాను  గారు జన సమూహానికి  చేసిన విలువైన  బోధనలు మనం చదువుకుంటున్నాం ప్రవక్త హృదయం పరివర్తనం  చెంది  జీవించమని గట్టిగా చెప్పిన  సందర్భంలో  ప్రజల దైవ భయం  కలిగి హృదయ పరివర్తనం  చెంది  జీవించాలనికున్నారు దాని  నిమ్మిత్తం మేము ఏమిచేయాలి అని  అడుగుతున్నారు. వాస్తవానికి  ప్రవక్త యొక్క మాటలు  ప్రజలను కొత్త జీవితము  జీవించటానికి  ఆహ్వానిస్తుంది. ప్రతి యొక్క  ప్రవక్త యొక్క  సందేశం కూడా ప్రజలను  దేవునితో  కొత్త జీవిత జీవితానికి ఆహ్వానిస్తుంది  బాప్తిస్మ  యోహాను  గారు  చాలా కఠినమైన మాటలు  వాడుచున్నారు   - లూకా ౩ ; 8 -9  ఈమాటలు వారి హృదయాలను  రగిలించాయి  వారి యొక్క పాపపు జీవితం  వారికీ గుర్తుకు వచ్చింది. వారిలో దైవ  భయం  ఉంది కాబట్టి  దేవుని  శిక్ష  వారిమీదకి రాకుండా ఏమిచేయాలి అనీ అడుగుచున్నారు. వారి జీవితాలు  మార్చుకోవడానికి  సిద్ధంగా   ఉన్నారు   దేవునికి ఇష్టమైన జీవితం  జీవించటానికి వారు సిద్దముగా ఉన్నారు  వారుఅందరుకూడా  యోహాను   యొక్క  బోధనలను  అనుకూలంగా  స్పందించారు. ఆనాడు యోహాను   గారి మాటలు  విన్న  ప్రజలు  అడిగిన విధంగా  మేము ఏమిచేయాలి  అని  అందరుకూడా ప్రశ్నించుకోవాలి  

  • నా విశ్వాస జీవితం  బాగుండుటకు  నేను ఏమిచేయాలి 

  • నా కుటుంబం   సంతోషంగా ఉండుటకు  నేను  ఏమిచేయాలి 

  • నా భర్త సంతోషంగా ఉండుటకు  నేను  ఏమిచేయాలి 

  • నా భార్య సంతోషంగా ఉండుటకు  నేను ఏమిచేయాలి 

  • నా  దేవుడు  నాలోకి  వచ్చుటకు నేను ఏమిచేయాలి 

  • నా స్నేహితులతో  బంధం  కాలిగి జీవించుటకు నేను ఏమిచేయాలి   

  • నాలో హృదయ  పరివర్తనం  కలుగుటకు  నేను ఏమిచేయాలి

ఈ  యొక్క  ఆగమన కాలంలో  బాలయేసు ప్రభు  నాలో  జీవించుటకు  నేను ఏమి చేయాలి. ఏమి చేస్తే  నా   దేవుడు  సంతోషిస్తాడు.  ఏమి చేస్తే   నా   ఆత్మ  రక్షించపడుతుంది.  ఏమి చేస్తే సమాజంలో  నేను మంచిగా  జీవించగలను  అనీ  ధ్యానించుకొని జివితం  సరిచేసుకొని  ఉంటె  మనం మంచిగా జీవించవచ్చు

సువిశేష భాగములో ప్రజలు తమ జీవితంలో దేవుడికి జన్మనివ్వడానికి హృదయపరివర్తన చెందటానికి సిద్ధముగా ఉన్నారు. 

1.  సామాన్య ప్రజలు: రెండు అంగీలున్నవారు ఒకదానిని ఇంకొకరితో పంచుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. అవసరంలో ఉన్న వారికి మన వంతు సహాయము మనము చేయాలి. భోజనము ఉన్న వ్యక్తి లేనివాడితో పంచుకోవాలి, ప్రేమ ఉన్నవారు లేనివారితో పంచుకోవాలి. దేవుడు మనలను అధికముగా దీవించింది వేరే వారికి సహాయము చేస్తూ దైవ ప్రేమను పంచుకోవడానికే. 

2.  సుంకరులు: అన్యాయపు బాటలు వదిలివేసి నీతిమంతమైన జీవితం జీవించాలని కోరుచున్నారు.అందరు బలహీనులే అయినా సరే బలహీన జీవితాలు మార్చుకోవాలి. ఆశవల్ల ఎక్కువ సుంకం వసూలు చేసేవారు సుంకరులు. అది అవినీతితో కూడిన జీవితము కావున దానిని సరిచేసుకోవాలి. సత్యమైన జీవితము జీవించాలి. 

3. రక్షకభటులు: క్రూరముగా ప్రవర్తించకుండా న్యాయముగా ప్రవర్తించమని ప్రభువు యోహాను ద్వారా పలుకుచున్నారు. న్యాయ పాలన చేయాలి, ప్రేమతో కూడిన పాలన చేయాలి అని యోహాను గారు తెలుపుచున్నారు.   

మన విశ్వాస జీవితములో కూడా కొన్ని సవరణలు చేసుకుని జీవించాలి. అప్పుడే అందరు మన వలన సంతోషిస్తారు. ధనము ఉన్న వారు పేద వారితో పంచుకుంటే అది దేవునికి చాల ఆనందకరము. జక్కయ్య వలన దేవుడు ఆనందపడ్డారు. ఉన్నవారు లేని వారితో పంచుకోవాలి. పాపపు అన్యాయపు జీవితము వదిలివేసి నీతివంతమైన జీవితము జీవిస్తే దేవుడు ఆనందిస్తారు. అదే విధముగా మన యొక్క బాధ్యతలను క్రూరముగా కాకుండా ప్రేమతో, వినయముతో చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తారు. మనము దేవుని యందు ఆనందించాలి. అంటే మనాలి కొత్తదనం ఉండాలి. దేవునిలో నిజ సంతోషము వెదుకుదాము.

Rev. Fr. Bala Yesu OCD



పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...