14, ఏప్రిల్ 2022, గురువారం

పవిత్ర గురువారం

 నిర్గ 12: 1-8,11-14,  1 కోరింతి 11:23-26  యోహను 13:1-15 

ఈరోజు  తల్లి శ్రీ సభ మనందరిని మూడు ముఖ్యమైన  అంశాలు ధ్యానించమని ఆహ్వానిస్తుంది. 

1. దివ్య సత్ప్రసాధ స్థాపన 

2. గురుత్వ స్థాపన 

3. యేసు ప్రభువు ఇచ్చిన నూతన ప్రేమ ఆజ్ఞ 

ఈ మూడు అంశాలు  కూడా దేవుని యొక్క ప్రేమ సేవా జీవితం గురించి తెలియ జేస్తున్నాయి. 

యేసు ప్రభువు యొక్క జీవితం ముగిసే సమయంలో ఆయన తొందరలోనే మరణిస్తాడని గ్రహించి తన శిష్యులకు ప్రేమ విందును ఏర్పరచారు. దానినే మనమందరం కడరాత్రి భోజనం అంటాము. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువు ఇచ్చిన కడరా విందు అతని యొక్క వీడ్కోలు విందు. తన శిష్యులను సంతృప్తి  పరచి, బలపరచిన విందు. ఈ విందులో  క్రీస్తు ప్రభువు తనను తాను తన శిష్యులకు అందించాడు. 

ఈనాటి మొదటి పఠనంలో యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భుజించిన కడరా విందును గురించి భోదిస్తుంది. దీనినే యిస్రాయేలు ప్రజలు పాస్కా విందు అని కూడా పిలుస్తారు. 

యిస్రాయేలు ప్రజలను బానిస బ్రతుకుల నుండి విడిపించుటకు మోషేను ఎన్నుకొని , అతన్ని ఫరో రాజు దగ్గరకు పంపించారు. అతడు ప్రవక్త  యొక్క మాటలు లెక్క చేయలేదు. 

ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి ఫరో రాజు అంగీకరించలేదు. ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించారు. పది  అరిష్టాలు కలిగించినా ఫరో రాజులో మార్పు లేదు. అందుకే చివరిగా  ఫరో రాజుకు ఒక పాఠం నేర్పించుటకు  దేవుడు మోషేతో యిస్రాయేలును విడిపించుటకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రజలను  కూడా సిద్దపరచమని ప్రభువు మోషేకు తెలియచేశాడు. 

ఈ యొక్క ఐగుప్తులో చేసే  ఆఖరి విందు  ఎలా తయారుచేయాలో ఎలాగ దానిని భుజించాలో  అన్నియు ప్రభువు  తెలుపుచున్నారు.  ఈ విందును  హిబ్రూ బాషలో పెసక్ అని అంటారు అంటే  ఆఖరి  దెబ్బ  అని అర్ధం.  ఈ పదం  యొక్క అర్ధం  ఐగుప్తు  ప్రజల్లో నెరవేరింది. యిస్రాయేలు  ప్రజలను విడిపించే  ఆ రాత్రే  దేవుడు ఐగుప్తు  వాసులను ఆఖరి  దెబ్బ కొట్టారు.  వారి జాతీయుల్లో  తొలిచూలు  పిల్లలందరిని హాతమార్చారు. దీని వలన  ఫరో  రాజు భయపడి యిస్రాయేలు  ప్రజలకు స్వేచ్చనివ్వడానికి అంగీకరించారు. 

ఫరో రాజు యిస్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ నివ్వకముందే దేవుడు యిస్రాయేలు ప్రజలను ప్రయాణానికి సిద్దం కమ్మన్నారు. దీనితో పాటు  ఆ రాత్రి భుజించే  ఆఖరి విందును తమను స్వేచ్ఛ  స్వతంత్రులుగా  చేసినందుకు గుర్తుగా ప్రతి ఏడాది జరుపుకోవాలని ముందుగానే యావే దేవుడు తెలియ జేశారు. 

ఈ విందు ప్రజలను విముక్తులను చేసినందుకు గుర్తుగా ఉంది. బానిస బ్రతుకుల నుండి విముక్తులను, ఫరో రాజు యొక్క బంధములనుండి , ఆయన  చేతుల నుండి  వారిని దేవుడు విముక్తులను చేశారు. 

ప్రతి విందు మనలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది, పోషిస్తుంది మనల్ని నడిపిస్తుంది. యిస్రాయేలు ప్రజలు ప్రయాణం చేయుటకు దేవుడు ఈ విందు జరుపుకోమని తెలుపుచున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు  కూడా తాను శిలువ శ్రమలు అనుభవించే ముందు ఈ లోక  జీవితం ముగించే ముందు శిష్యులకు కడరా  విందు ఏర్పరిచారు. దీనినే  దివ్య సత్ప్రసాద స్థాపన అంటారు. 

ప్రభువు స్థాపించిన ఈ విందు దివ్య సత్ప్రసాదం మనందరిని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, శక్తినిస్తుంది. మనల్ని నడిపిస్తుంది. అధే విధంగా మనందరిని పాప బంధముల నుండి విముక్తులను చేస్తుంది. 

ఐగుప్తులో యిస్రాయేలు ప్రజలు భుజించినది కడరా విందుయే అధే విధంగా  క్రీస్తు  ప్రభువు కూడా భూలోకంలో చివరిగా కడరా విందును భుజించారు. 

విందు చేయుటకు దేవుడు పవిత్రమైన, మేలైన  గొర్రె పిల్లను ఎంచుకోమని ప్రభువు తెలియచేసారు. నిర్గ 12:3-5 

గొర్రె పిల్ల యొక్క  రక్తం, విందు యిస్రాయేలు ప్రజలను కాపాడింది.  నూతన నిబంధన గ్రంధంలో  యేసు ప్రభువును బాప్తిస్మ యోహను గారు కూడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల  అని అన్నారు. 1 యోహను 1:29. 

ఎందుకు యేసు ప్రభువును గొర్రె పిల్ల అంటున్నారంటే 

గొర్రె పిల్ల వినమ్రతకు  గుర్తు

గొర్రె పిల్ల మృధువుగా ఉంటుంది. 

గొర్రె పిల్ల తనకు తాను సమర్పించుకోంటుంది 

గొర్రె పిల్ల ఎవరికి హాని చేయదు  

గొర్రె పిల్ల బలికి సమర్పించబడింది 

గొర్రె పిల్ల పవిత్రమైనది , నిర్మల మైనది. 

గొర్రె పిల్ల విలువైనది. 

యేసు ప్రభువులో ఇవన్నీంటిని మనం  చూస్తున్నాం . ఆయన  మనకు ఒక నిదర్శనం. యావే దేవుడు  గొర్రె పిల్లను ఎంచుకోమంటున్నారు. కేవలం ఒక సంవత్సర ప్రాయం ఉన్నది. అదే విధంగా  యోహను గారు ప్రభువును గొర్రె పిల్ల అంటున్నారు. గొర్రె పిల్ల జీవితం కాలం కొన్ని నెలలు మాత్రమే. ఈ కొన్ని నెలల్లోనే అది తన ప్రాణాన్ని ఇతరుల కోసం త్యాగం చేస్తుంది. అధే విధంగా  యేసు  ప్రభువు యొక్క జీవితం కూడా కొద్ది కాలమే ఆయన కూడా మనందరం  రక్షించబడాలి అని తన రక్తం చిందించారు.  మనం పోషించబడాలి అని తన శరీరంనే భోజనంగా ఒసగి ఉన్నారు. 

దివ్య సత్ప్రసాదం దేవుడిచ్చిన  గొప్ప వరం. తనను తానే బలిగా  సమర్పించుకొని  మనలను  రక్షించారు. దివ్య సత్ప్రసాదం శ్రీ సభ యొక్క ఆధ్యాత్మిక  సంపద. సాక్షాత్తు దేవుడు దానిలో ఉన్నారు. ఆయనయే దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్నారు. 

దివ్య సత్ప్రసాదం ద్వారా  దేవుడు తనను తాను మనకు ఇచ్చారు. ఆయన జీవం మనకు ఇచ్చారు, ఆయన సజీవ ప్రేమనిచ్చారు , ఆయన యొక్క బలము మనకిచ్చారు. ఆయన యొక్క సమస్తమును మనకిచ్చారు. 

శిష్యులు ఎన్నడూ తన యొక్క సాన్నిధ్యం కోల్పోరాదని, ఎన్నడూ వారు ఒంటరి వారని భావించకూడదని , ఎల్లప్పుడు శిష్యులతో తన ప్రజలతో ఉండుటకు దేవుడు దివ్య సత్ప్రసాదం  స్థాపించారు. 

దివ్య సత్ప్రసాద విందు అందరం కలసి చేసే విందు ఈ విందు ప్రేమతో, ఐక్యతతో  జీవించమని కోరుతుంది. 

దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువు  యొక్క కల్వరి బలిని గుర్తు చేస్తుంది. యేసు ప్రభువు స్థాపించిన  దివ్య సత్ప్రసాదంను గురువులు కొనసాగిస్తారు. 

ఇది నా జ్ఞాపకార్ధం  చేయమని ప్రభువు  తన శిష్యులను అజ్ఞాపించారు. దివ్య సత్ప్రసాదంను ప్రజలకు అందించేది యాజకులే. 

యాకోబు యొక్క కుమారులలో ఒక జాతిని దేవుడు ప్రత్యేకంగా  దేవాలయ విధుల కోసమే ఎన్నుకొన్నారు. 

లేవియ వర్గం వారిని ప్రత్యేకంగా బలులు సమర్పించుటకు దివ్య మందసం మోయుటకు దూపం  వేయుటకు దేవుడు వారిని ప్రత్యేకంగా ఆయన సేవ కోసం ఎన్నుకొన్నారు. సంఖ్యా 8:5-22. 

ప్రజల కొరకు ప్రజల నడుమనుండి  ఎన్నుకొనబడిన వారు యాజకుడు . గురువులను another christ అని సంభోదిస్తారు. క్రీస్తు ప్రభువు యొక్క ప్రతిరూపమే యాజకులు. ఈ రోజు ప్రత్యేకంగా యాజకుల రోజు  ఎందుకంటే క్రీస్తు ప్రభువే తన శిష్యులకు ఒక బాధ్యతగా తన పనిని చేయమని కోరుచున్నారు. 

యేసు ప్రభువు నిజమైన  యాజకుడిగా, నిత్య  యాజకుడిగా ఆయన ఈ లోకంలో  జీవించారు. 

యేసు ప్రభువు యొక్క యాజకత్వంలో ప్రతి గురువు కూడా పరిపూర్ణుడగుచున్నాడు. ఆయనయే ఒక మంచి నిదర్శనం. ఆయన యాజకత్వంలో  ఉన్న గొప్ప తనం. 

ప్రజల కొరకు పంపబడినారు క్రీస్తు ప్రభువు 

ప్రజల మధ్య  ప్రేమతో జీవించారు, ప్రజలకు దేవుడ్ని చూపిన యాజకుడు. ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుంది మనలను పరలోకం వైపు నడిపించారు. 

ఆయన నిస్వార్ధ సేవ చేశారు, దానిలో భాగమే శిష్యుల పాదాలు కడుగుట. ఏ  గురువు యజమానుడు, చేయనటువంటి పని నిత్య యాజకుకుడైన క్రీస్తు ప్రభువు చేశారు. 

ఆయన యాజకత్వం కేవలం తన సొంత వారికి మాత్రమే కాదు అందరి కొరకు ఆయన అభిషేకించబడ్డారు. ప్రజలను తండ్రి వైపు నడిపిన యాజకుడు క్రీస్తు ప్రభువు.  తనను తాను రిక్తుని చేసుకున్న యాజకుడు. 

ప్రజలకు చేరువలో ఉండే యాజకుడు వారి పాపాలు  క్షమించే యాజకుడు, జీవిత సత్యమును భోదించె యాజకుడు. 

అన్నింటిలో కూడా సుమాతృకగా  ఉండే యాజకుడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు వలె ప్రతి యాజకుడు కూడా  జీవించాలి. 

ఈ రోజు ప్రత్యేకంగా యాజకుల యొక్క గొప్పతనం గ్రహించాలి. యాజకుల ద్వారానే మనం క్రైస్తవ  జీవితం ప్రారంభమగుచున్నది. వారి ద్వారానే మన జీవితం  ముగిస్తుంది.  యాజకుల వలన జ్ఞాన స్నానం పొందుతున్నాం. దివ్య సత్ప్రసాదం ,పాప క్షమాపణ , భద్రమైన అభ్యంగనం , జ్ఞాన వివాహం, గురు పట్టాభిషేకం ,అవస్తభ్యగనం జరుగుతుంది. 

వారి యొక్క పవిత్ర  హస్తాల ద్వారా ప్రతి ఆశీర్వాదం కలుగుతుంది. ఇల్లు కట్టేటప్పుడు గురువుకావాలి,కూల్చేటప్పుడు గురువు కావాలి,  బిడ్డలు స్కూలుకు వెళ్లేటప్పుడు , పరీక్షలు రాసేటప్పడు,అనారోగ్య సమయంలో అన్ని సమయాలలో క్రైస్తవుల యొక్క జీవితంలో బాగుండటానికి గురువు కావాలి. 

ప్రజల కొరకు ఎన్నుకొనబడిన, ప్రజల కొరకు జీవించి మరణించే వారే మంచి యాజకులు. ప్రతి యాజకుని జీవితంలో  ప్రార్దన ఉండాలి. మోషే ప్రవక్త వలె ప్రార్ధనలో దేవునితో గడపాలి, దేవుని ప్రజలను నడిపించాలి. 

ఏలియా వలె ఎన్ని రకాలైన సవాళ్ళు ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి. 

యిర్మియా వలె శ్రమలు పొందుటకు సిద్దంగా ఉండాలి, క్రీస్తు ప్రభువు వలె ప్రేమతో జీవించాలి కాబట్టి యాజకుల కోసం ప్రార్ధించుదాం. 

3. యేసు ప్రభువు ఇచ్చిన నూతన ఆజ్ఞ 

మీరు  ఒకరినొకరు ప్రేమింపుడు  నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపుడు  మీరు పరస్పరం  ప్రేమ కలిగియున్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసు కొందురు అని ప్రభువు  యోహను 13:34-35 వచనాలలో పలుకుచున్నారు. ఈ  నూతన ఆజ్ఞ పాటించుట ద్వారా మనం దేవునికి సాక్షులుగా ఉండవచ్చు. 

ఈ ఆజ్ఞ పాత నిభందన గ్రంధంలో ఉన్నది. ద్వితీ 6: 5 , లెవీ 19:18. మరి ఎందుకు నూతన ఆజ్ఞ అని పిలుస్తుంటాం అంటే ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని పలుకుచున్నారు. 

ఆయన మనలను ప్రేమించిన విధంగా మనలను ప్రేమించమని ఆజ్ఞ ఇస్తున్నాడు. 

నిజమైన ప్రేమ ఎలాంటిదో యేసు ప్రభువుతన జీవితం ద్వారా మనకు తెలియచేసారు. ఆయన కేవలం తన ప్రేమను యూదులకు మాత్రమే కాకుండా అందరికి పంచి ఇచ్చారు. 

యూదులకు అన్యులకు మధ్య ఉన్న అడ్డుగోడలు అన్ని ప్రభువు తీసివేసి అందరిని సరిసమానంగా ప్రేమించారు. 

యేసు ప్రభువు యొక్క ప్రేమ శత్రువులకు కూడా అందజేయబడినది. ఎందుకంటే తనను హింసించిన వారిని,శిక్షించిన వారిని అందరిని కూడా యేసు ప్రభువు ప్రేమించి క్షమించారు. మనందరం సాధారణంగా మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. కాని దేవుడు  అందరికి పాపులను,సుంకరులను యూదులను , మంచివారిని, చెడ్డ వారిని అందరిని ప్రేమించారు. ఆయన భోదించినది ప్రతిదీ కూడా పాటించారు. మత్తయి 5:43-45. 

తనను సిలువ వేసి హింసించిన వారి కొరకు ప్రార్ధించి మనకు ప్రేమలోని నూతనత్వం చూపారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తన యొక్క మరణం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడయినప్పటికి ఒక దొంగ వాని వలె శిలువ మీద మరణించారు. దొంగవానికి వేసిన శిక్షను భరించారు. ప్రజల పాపాలకు  మరణించాలనుకున్నారు. సిలువ భారం మోసారు. ఇవన్నీ కూడా ప్రభువు చేశారు ఎందుకంటే మనపట్ల ఉన్న ప్రేమ అలాంటిది. 

యేసు ప్రభువు యొక్క ప్రేమ చాలా గొప్పది,ఆయన యొక్క ప్రేమను ఎవరు ఈ లోకంలో చూపించలేరు. 

ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - అందరిని అర్ధం చేసుకొని వారితో కలిసి మెలిసి జీవించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవించేవారు అయిన వారిని అర్ధం చేసుకొన్నారు, చేరదీశారు తన స్నేహితులుగా చేసుకొన్నారు. 

ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ - తనను తాను మన కోసం త్యాగం చెసుకున్నారు, సంపూర్ణంగా తన జీవితాన్ని మనకు సమర్పించి ఉన్నారు. 

ఆయన ప్రేమ క్షమించే ప్రేమ - ఎన్ని రకాలైన తప్పిదములైన  దేవుడు మన్నించారు. అందరి పాపాలను మన్నించారు. మత్తయి 9:2-8, యోహను 8:3-11 లూకా 7:36-50. లూకా 17:3, లూకా 23:34 

ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు ఆయన ప్రేమకు లేవు. 

యేసు ప్రభువు ఎవ్వరు చేయని విధంగా, ప్రేమించని విధంగా మనల్ని ప్రేమించారు. అందుకు అది నూతన ఆజ్ఞ అనుచున్నది. 

ప్రేమ మార్గమే సరియైన మార్గం  అని దేవుడు ఎన్నుకొన్నారు . ప్రేమ మనలో మార్పు తెస్తుంది. ప్రేమ మన జీవితాలను దేవునికి ఇష్టమయ్యేలా చేస్తుంది. 

మనందరం కూడా ప్రేమ కలిగి జీవించడానికి  ప్రయత్నం చేయాలి. మనిషి ఈ లోకంలో పుట్టింది దైవ ప్రేమ , తల్లిదండ్రుల ప్రేమ వలనే కాబట్టి పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం. 

ఈనాటి సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభువు శిష్యుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. వారి యొక్క పాదాలు కడుగుటకు సైతం ఆయన సిద్ధంగా ఉన్నారు. 

పాదాలు కడుగుట కేవలం సేవకులు మాత్రమే చేస్తారు. ప్రభువు అందరి పాదాలు కాడిగారు ప్రేమకు గొప్ప చిహ్నం. 

యేసు క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకొని శిష్యులకు ఒక సుమాతృకగా ఉన్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినంత కాలం ప్రేమను పంచి  సేవ చేశారు కాబట్టి మనం కూడా ఆయన శిష్యులుగా ఉండాలంటే అదే ప్రేమను పంచి జీవించాలి. 


Rev. Fr. Bala Yesu OCD


28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...