4, మార్చి 2022, శుక్రవారం

తపస్సుకాలం మొదటి ఆదివారం (2)

 తపస్సుకాలం మొదటి ఆదివారం

ద్వితీ 26:4-10, రోమి 10:8-13, లూకా 4:1-13 

ఈనాటి దివ్య పఠనాలు  విశ్వాస  జీవితంలో ఎదురయ్యే శోధనలు  గురించి  భోధిస్తున్నాయి. ఈనాటి  తపస్సు కాల మొదటి వారంలోనే శోధనలు గురించి మాట్లాడుటకు గల కారణమేమంటే  శోధనలు  అందరి జీవితంలో  సర్వ సాధారణం. కేవలం  యేసు  ప్రభువు  యొక్క  జీవితంలో మాత్రమే కాదు, శోధనలు వచ్చింది. 

సృష్టి ప్రారంభం నుండి దేవునితో కలిసి,  దేవుని కొరకు జీవించే దేవుని  ప్రజలకు శోధనలు ఎదురయ్యాయి. శోధనలు  ఏదురైనప్పుడు  సాతాను బంధాలకు  లొంగకుండా  దైవ శక్తితో, ప్రార్ధనాయుదంతో శోధనలు జయించాలని నేడు ప్రభువు  మనకు  తెలియజేస్తున్నారు. 

ఈ 40  రోజులు  పాటు ఎంతో మంది  ఉపవాస, ప్రార్ధన  ధాన ధర్మల ద్వారా పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఆయితే  ఇలాంటి మంచి  కార్యాలు చేసేటప్పుడు మనలో ఎదురయ్యే  శోధనలకు పడిపోకుండా  జీవించాలన్నదే దేవుడు మనకు నేర్పించేది. 

శోధనలు జయించినప్పుడే మనం యొక్క నిజమైన విశ్వాసం, అనుసరణ ఎలాంటిది అని తెలుస్తుంది. పేతురు గారు తాను వ్రాసిన మొదటి లేఖ 1:7 వచనంలో  బంగారం కన్నా విలువైన మీ విశ్వాసం  పరీక్షించబడాలి అని తెలుపుచున్నారు. 

సైతానుడే మన జీవితంలో శోధనలు పెడతాడు యాకోబు 1:13. మన యొక్క విశ్వాస జీవితంలో సైతానుతో పోరాడాలి మనం చేసే ఉపవాసం, ప్రార్ధన ధాన ధర్మాల ద్వారా  సైతాను శక్తిపై విజయం సాధించాలి. 

ఈ నలభై  రోజుల తపస్సు కాల యాత్ర మనందరిలో దైవ శక్తిని నిపుతుంది. ఏ విధంగానైతే  యేసు ప్రభువు సైతాను శక్తిని జయించారో అలాగే 40 రోజులు జీవితం ద్వారా  మన యొక్క బలహీనతలను మనం అధిగమించాలి, వ్యాసనాలను విడిచిపెట్టాలి, పుణ్య మార్గంను అనుసరించాలి. 

సైతాను యొక్క శోధనలు  జయించడానికి  మనందరికీ ప్రార్ధన శక్తి అవసరం. శోధన  జయింప అను క్షణం ప్రార్ధించమని ప్రభువు పలికారు. మత్తయి 26:41. 

ప్రార్ధన వలన మనం దేవునితో ఐక్యమై ఆయన యొక్క సహకారం పొందగలం, ఉపవాసం ద్వారా శారీరక వాంఛలను, ఐహికాకర్షణలను మనం అదుపులో వుంచుకోగలం అదే విధంగా  త్యాగ జీవితం ద్వారా మన యొక్క స్వార్ధాన్ని త్యజించి తోటి సోదరులకు  సహాయ పడగలం. 

ఈనాటి  మొదటి  పఠనంలో  దేవుడు చేసిన మేలులకు ప్రతీ ఫలంగా మొదటి ఫలములను దేవునికి సమర్పించే  అంశం గురించి భోధిస్తుంది. 

తమ యొక్క  పంటలో  మొదటి ఫలములు దేవునికి సమార్పించే ముందు దేవునిపట్ల  తమకున్న విశ్వాసాన్ని భక్తి, శ్రద్దలతో ప్రకటించాలని మోషే ప్రవక్త  యిస్రాయేలియులకు  తెలుపుచున్నారు. మోషే ప్రవక్త దేవుని యొక్క గొప్పతనం గురించి అలాగే ఏ విధంగా  దేవుడు యిస్రాయేలుణు ప్రేమించి  బయటకు తీసుకొని వచ్చారు అనే అంశం గురించి తెలుపుచున్నారు. ప్రభువైన దేవుడు వారి కోసం  చేసిన మహాత్కార్యాలు  అని  వివరిస్తున్నారు. 

ఆరాము దేశంలో  లాబాను వద్ద అనేక సంవత్సరాలు సేవలు చేయడం వలన యాకోబుకు  ఆరామియుడు అనే పేరు వచ్చింది. యాకోబు యొక్క  వంశము ఎలాగ వృద్ది చెందినది అని మరొకసారి వివరిస్తున్నారు ప్రవక్త. 

యిస్రాయేలుప్రజలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టిన్నప్పుడు దేవుడువారిని కాపాడారు. వారిని తన యొక్క ప్రజలుగా  స్వీకరించి వారిని నడిపించారు. ఎడారిలో 40 సంవత్సరాల  ప్రయాణంలో  తోడుగా నీడగా ఉండి పాలు తేనెలు జాలు వారు నేలను బాహుమానంగా ఇచ్చారు. అన్నీ చేసిన దేవునికి ప్రధమ ఫలములు సమర్పించు అని మోషే అంటున్నారు. 

దేవునికి సమర్పించే  ఆ ప్రధమ ఫలములు వారిపట్ల  దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత వెల్లడి చేయుటయే. దేవుడు కేవలం  వారిని బానిసత్వం  నుండి బయటకు తీసుకొని రావడమే కాదు చేసింది, వారి యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలలో వారిని బలపరిచారు దేవుడు. ఇంకా ఎన్నో  గొప్ప గొప్ప  కార్యాలు  వారికి చేశారు. అందుకే ప్రధమ పంటను సమర్పించాలి. 

మొదటి ఫలమును బలి పీఠము ముందుంచిన సమయంలో యావే దేవుడు చేసిన గోప్ప కార్యాలు అన్నీ ఉచ్ఛరించాలి. ఆ మహత్తర కార్యలేమిటంటే  యిస్రాయేలును దేవుని బిడ్డలుగా ఒక ప్రజగా చేసిన మహత్తర కార్యాలు. 

1. మెసపటోమియా నుండి కానాను దేశంకు అలాగే ఐగుప్తుకు  ప్రయాణం. అబ్రహాము నుండి యిస్రాయేలు ప్రజలు వాగ్దత్త భూమి చేరుకొను సమయం వరకు. 

2. ఐగుప్తు నుండి యిస్రాయేలు  స్వేచ్ఛ స్వతంత్రులను చేసిన కార్యం, బానిసత్వం నుండి బయటకు తెచ్చిన కార్యము. 

3. యిస్రాయేలుతో సినాయి వద్ద చేసుకున్న  ఓడంబడిక 

4. దేవుని యొక్క వాగ్దాన భూమినిచ్చుట - పాలు తేనెలు జాలు వారు దేశం 

5. దేవుడు వారి పట్ల దయ చూపుతూ  తోడుగా ఉండే కార్యం 

6. దేవున్ని తండ్రిగా కలిగిన గొప్ప అద్భుతం. యిస్రాయేలుకు దేవుడు మంచి దేశంను  కానుకగా ఇచ్చినందుకు  దేవుని ఓడంబడికకు  బద్దులై  వారు ప్రతి సంవత్సరం దేవునికి కృతజ్ఞతలను  ప్రధమ ఫలములు  సమర్పించుట  ద్వారా  తెలిపేవారు. వాస్తవానికి యిస్రాయేలు  ప్రజలు ఈ విధంగా  సమర్పించుట  ద్వారా వారు దేవున్ని  జ్ఞాపక పరుచుకొంటున్నారు.  అలాగే దేవుడు ఎలాగ వారిని అభివృద్ది  పరిచారో  అవన్నీ  గుర్తుకు  తెచ్చుకుంటున్నారు. దేవుడు సమృద్దిగా  ఇచ్చిన విధానం  గుర్తుకు  తెచ్చుకుంటున్నారు. 

 ఈ తపస్సు  కాలంలో  అడుగు పెట్టిన మనము కూడా యిస్రాయేలు  ప్రజల జీవితం నుండి నేర్చుకోవాలి. 

1. మనం కూడా అంధకారం నుండి  వెలుగులోనికి ప్రయాణం చేయాలి. బానిసత్వం నుండి స్వేచ్ఛ లోనికి వెళ్ళాలి. పాపం నుండి పుణ్య మార్గం అనుసరించాలి. 

2. దేవునితో కలిసి జీవిస్తామని, దేవునికొరకు అన్నీ సమర్పించి  జీవిస్తామని నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఓడంబడిక  చేసుకోవాలి. 

3. దేవుడిచ్చిన దివ్య సత్ప్రసాదంను  స్వీకరిస్తూ  దేవున్ని కలిగి జీవించాలి. 

4. దేవుడు మన కోసం సిద్దం చేసిన  పరలోక రాజ్యంకు  అర్హత  కలిగి జీవించాలి. 

5. దేవుడు చేసిన మేలులకు  ఎల్లప్పుడు  కృతజ్ఞులై  జీవించాలి.  చాలా  సందర్భాలలో మనం దేవునికి ఆయన చేసిన మేలులకు ప్రధమ ఫలాలను సమర్పించం. దేవునికి ఇవ్వాలనుకునే సమయంలోమనకు శోధనలు  వస్తాయి. ఇంత ఖరీదైనది, మెలిమయినది దేవునికి ఇవ్వలా , వద్దా అనే సందేహాలు, శోధనలు  వస్తాయి వాటిలో మనం మునిగిపోతాం. 

దేవునికి ఇవ్వాల్సిన  సమయంలో  ఇచ్చుటకు  మనం సిద్ధంగా ఉండాలి. చాల మందిలో  మనం ఇచ్చేది  దేవునికే గా  ఏది ఇస్తే  ఏముందిలే అని  ఆలోచిస్తారు. 

1. మనం ప్రధమ సమయం దేవునికి ఇవ్వాలి - ఎందుకంటె  దేవుడే  మనకు  మరొక  రోజును సమర్పించారు కాబట్టి ప్రధమ సమయం అంటే  ఉదయం లేచిన సమయం. 

ప్రధమ ఫలములు - కూరగాయలు , కాయ పండ్లు అధే విధంగా  ఏదైతే  ప్రధామముగా వస్తుందో దానిని ప్రభువునకు  సమర్పించాలి. సమార్పించేముందు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలి. 

రెండవ పఠనంలో  పునీత పౌలు గారు యూద మాతము క్రైస్తవులుగా మారిన వారికి ఒక విధమైన భోధన  చేస్తున్నారు. మళ్ళీ విశ్వాస జీవితంలో యూద మతంలోనికి వెళ్లాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలుగారు వారికి భోధన  చేస్తున్నారు. మోషే ప్రవక్త ఇచ్చిన శాసనములకు బద్దులై  జీవించాలనే శోధన నుండి బయటకు రావాలని పౌలు గారు తెలియ జేస్తున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు  అని ఒప్పు కుంటే ఆయన మృతులలో నుండి లేచాడని విశ్వసిస్తే  నీవు రక్షించ బడుదువు అని అన్నారు. 

పాలు గారు మనంతట మనం నీతిమంతులం కాలేము కానీ హృదయములో దేవుని విశ్వసించి జీవిస్తే ఆయన యొక్క  కృప ఫలితమున నీతిమంతులము అవుతాము అని తెలుపుచున్నారు. 

యేసు క్రీస్తు నందున్న విశ్వాసంను  మాటల ద్వారా  క్రియాల ద్వారా  మరియు  మన యొక్క జీవితం ద్వారా  వెల్లడించాలి. ఆయనను విశ్వసించే వారు సిగ్గుపడనవసరం లేదు ఎందుకంటే ఆయనయె లోక రక్షకుడు కాబట్టి  ఆయన దేవుడు కాబట్టి ఎవరు కూడా  బాధపడనవసరం లేదు. 

దేవుడు ఒక్కడే కాబట్టి  ఆయనను  అందరు విశ్వసించి జీవించాలి. ప్రభువుకు ప్రార్ధించుట ద్వారా దీవెనలు సమృద్దిగా దొరుకుతాయని పౌలు గారు  తెలుపుచున్నారు. యేసు క్రీస్తు నామమున ప్రార్ధించే వారు అందరు రక్షింపబడుతారు. 

కావున మన యొక్క  విశ్వాస జీవితంలో  యేసు ప్రభువు  యొక్క పునరుత్థానంను  ఆయన దేవుడని అందరు కూడా  బహిరంగంగా ఒప్పుకొంటూ మన యొక్క  జీవితం ద్వారా దానిని చాటి చెప్పాలి. 

మన జీవితంలో  శోధనలు వచ్చినప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభువును ప్రకటించాలి. మన యొక్క జీవితం ద్వారా మిగతా వారికి మన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు ఎదుర్కొన్న శోధనల గురించి మనం వింటున్నాము. యేసు ప్రభువు తండ్రి యొక్క కార్యమును కొనసాగించుటకు  ముందు 40 రోజులు ఏకాంతంగా ఉపవాసం, ప్రార్ధన చేస్తూ ఎడారిలో తండ్రితో గడిపారు. యేసు ప్రభువు యొక్క  శోధనలు మూడు విధాలుగా వర్ణించబడ్డాయి. 

ఎందుకని మూడు శోధనలనే ప్రత్యేకంగా  తెలుపుచున్నారు అంటే  ఈ మూడూ శోధనల గురించి పాత నిబంధన గ్రంధంలో వింటున్నాం. 

సైతాను యేసు ప్రభువును శోధించినప్పుడు  ప్రతిసారీ  పాత నిబందన  యొక్క వాక్యం ద్వారా  సైతాను యేసు ప్రభువును శోధిస్తుంది. ఇది ఎందుకంటే  పూర్వ నిబందన  గ్రంధంలో  యిస్రాయేలు ప్రజలు ఎడారిలో మూడు ముఖ్యమైన  శోధనలు గురియయ్యారు ఆ మూడు సందర్భలలో  వారు విఫలమైయ్యారు. 

ఇవే మూడు శోధనలు నూతన యిస్రాయేలు  అయిన యేసు క్రీస్తును కూడా  సైతాను పడవేయాలనుకున్నది. తండ్రికి దగ్గరైయె కొద్ది  అమనం జీవితంలో  సైతానుడు ప్రవేశించి మనలను ఆయన నుండి పడవేయాలనుకుంటాడు. అందుకే శోధిస్తుంటాడు. 

 ఈ సువిశేషం గమనించినట్లయితే  ఇక్కడ చాలా విషయాలు అర్ధమవుతాయి. మొదటిగా యేసు ప్రభువు పవిత్రాత్మ  పరిపూర్ణుడాయేను. ఎప్పుడైతే యోర్ధనులో  బాప్తిస్మమం పొందారో అప్పుడు మరొక సారి తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు మానవ దైవ స్వభావం కలిగిన క్రీస్తు ప్రభువును బలపరిచారు. 

ఆత్మ ప్రేరణ వలన ఏడారికి నడిపింపబడ్డాడు. ఎందుకు ఎడారికి నడిపించబడ్డారు అంటే  ఎడారి విశాలవంతమైన స్థలం, నిశబ్దంతో కూడిన స్థలం, దేవునికి యొక్క సాన్నిధ్యం అనుభవించుటకు వీలుగా ఉన్న స్థలం. అందుకే దేవుడు ఎన్నుకొన్నారు. ఏకాంతంగా ఉంటూ ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా తనను తాను దైవ కార్యంకు సిద్ధం చేసుకోవడానికి అక్కడకి వెళ్లారు. 

రెండవది యిస్రాయేలు ప్రజలు ఎడారిలో కలిగిన శోధనల్లో పడి పోయారు. వారి యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో శోదనల్లో పడి దేవున్ని విస్మరించారు. అదే ఎడారి ప్రాంతంలో మానవునిగా జన్మించిన క్రీస్తు ప్రభువు  శోధనలు జయించుటకు అక్కడకు నడిపించబడ్డారు. 

యేసు ప్రభువును సైతాను 40 రోజులు శోధించుచుండెను. పవిత్ర గ్రంధంలో చూసిన వాక్యాలు బట్టి సైతానుడు రెండవ సారి యేసు ప్రభువును తుదముట్టించాలను కుంటున్నాడు. బాల యేసు గా జన్మించినప్పుడు సైతాను హెరోధును శోధించి, ప్రేరేపించి చంపాలనుకున్నాడు. కానీ విలుపడలేదు. ఇప్పుడు మరొకసారి  యేసు ప్రభువును తన యొక్క తండ్రి కార్యం నుండి సంపూర్ణంగా వైదొలగే లాగా చేయాలనుకుంది. అందుకే శోధిస్తుంది. 

సైతానుడు మనల్ని కూడా ఈ 40 రోజుల్లోనే ఎక్కువగా శోధిస్తాడు. మరీ ముఖ్యంగా దీక్ష  తీసుకున్న వారిని ఎందుకంటే వారు దైవ ప్రేరణ వలన దీక్ష తీసుకున్నారు, కాబట్టి వారిని ఆటకం పరుచుటకు సైతానుడు శోధిస్తాడు. 

ఎవరినైతే దేవుడు తన యొక్క పనికోసం వినియోగించుకుంటున్నారో  వారి జీవితాలను 40 రోజులలో దేవుడు  ఎంచుకుంటున్నారు. నోవా యొక్క జీవితం  40 రోజుల వర్షంతో మారింది. మోషే  సినాయి  పర్వత మీద 40 రోజులు ప్రార్ధనా అనుభవం ద్వారా మారిపోయారు. 

ఏలియా దేవుడు ఒసగిన  40 రోజులు రొట్టెద్వారా మారిపోయారు, 40 రోజులు  విశ్వాస  ప్రార్ధన  ద్వారా నినివే పట్టణ వాసులు మారిపోయారు. 40 రోజులు ఉపవాస  ప్రార్ధన ద్వారా యేసు ప్రభువు దేవుని శక్తిచే క్రొత్తగా నింపబడుతున్నారు. ఈ 40 రోజుల్లో  తండ్రి, పవిత్రాత్మ యేసు  ప్రభువును తన పని కోసం సిద్దం చేశారు, క్రొత్తగా చేశారు, బలవంతుణ్ణి చేశారు. 

యేసు ప్రభువు యొక్క మొదటి శోధన: 

ఆహరం గురించి, శారీరక వాంఛ గురించి -  మనం ఎక్కడ బలహీనులమో అక్కడే సైతాను ఎక్కువగా శోధిస్తుంది. యేసు ప్రభువు 40 వది రోజులు ఉపవాసం చేశారు. ఆకలితో ఉన్నారు అందుకే అక్కడ శోధించింది. 

పూర్వ వేదంలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలికి సంబంధించిన శోధన ఎదురైనప్పుడు మోషేను దూషించి దేవునికి పాపం చేశారు. దేవుడు అప్పుడు వారికి మన్నాను ఒసగుతూ నేర్పించిన పాఠమేమిటంటే  కేవలము రొట్టెవలనే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం వలన కూడా జీవిస్తారని తెలిపారు. ద్వితీ 8: 3 , నిర్గమ16:2-3 భోజనము గురించి. 

శరీరానికి సంభందించిన శోధనలలో మనం చాలా సార్లు పడిపోతాం. మన పంచేంద్రియాల పంచేంద్రియాలు వలన పడిపోయే సమ్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. 

ఈ మొదటి శోధన తన యొక్క దైవత్వంను నిరూపించుటకు సైతాను శోదిస్తున్నాడు. వాస్తవానికి సైతాను యేసుప్రభువు తన యొక్క శక్తులను తన సొంత అవసరాలకు వినియోగించు  కుంటాడా లేదా అని శోధించింది. అయితే ప్రభువు శారీరక వాంఛలకు లొంగకుండా తన యొక్క శక్తిని స్వంత లాభం కోసం వాడలేదు. యేసు ప్రభువు   ఈ లోక శారీరక సుఖాల వలన సంతృప్తి చెందరు, ఆయన యొక్క నిజమైన ఆనందం తండ్రిని సంతృప్తి పరచటం, తండ్రి యొక్క కార్యం నెరవేర్చుటయే. 

రెండవ శోధన-  అధికారం గురించి 

ఈలోక సామ్రాజ్యాలను చూపించి తనను ఆరాధిస్తే అటువంటి సామ్రాజ్యాలను సైతాను ఇస్తానని యేసుతో అంటున్నారు.యేసుప్రభువు యొక్క సిలువ మార్గాన్ని అడ్డుకోవాలనుకున్నది. మత్తయి16: 22 . ఈలోకంలోనే ఆయన్ను ఉంచి తనకు లోబరుచుకోవాలనుకున్నది సైతాను. 

ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇతర దేవుళ్లను ఆరాధించారు. ఎడారిగుండా వారిని ఆదిపిన ఎవుణ్ణి వారు మరిచిపోయారు. ఒక బంగారు దూడను ఆరాధించారు నిర్గమ 32:16 , విగ్రహ ఆరాధనా చేశారు.  ఇక్కడ వీరు విగ్రహ ఆరాధన చేయటం మాత్రమే కాదు దేవునికి చెందవలసిన స్తానం ప్రాముఖ్యత వస్తువులకు ఇస్తున్నారు.

అధికారం కోసం మనం కొన్నిసార్లు ఏదైనా చేస్తాం ఎక్కడికైనా వెళతాం. కానీ యేసు ప్రభువు అందుకు ఒప్పుకోలేదు లోక సంపదలు అన్నింటిని కంటే దేవుడే ముఖ్యమని ఆయన మీదనే జీవించాలని తెలియచేస్తున్నారు.  అధికారం కోసం కొన్నిసార్లు ఎవరి కళ్ళైనా మొక్కుతాం ఎంతకైనా దిగజారతాం. కానీ ఇక్కడ ప్రభువు నేర్పించేది ఏమిటంటే, అధికారం కోసం సంపదల కోసం దేవుడిని విడిచిపెట్టకూడదు.

మూడవ శోధన దేవుడ్ని పరీక్షకు గురిచేయుట 

యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని అనేకసార్లు పరీక్షించారు, ఆయన శక్తిని పరీక్షించారు. యేసు ప్రభువు కింద పడితే ఏమి కాదని, దుఃఖమని సైతాను ఎవుని శక్తిని పరీక్షించింది. యిస్రాయేలు ప్రజలు దేవుడ్ని మస్సా, మెర్రిబ్బాల వద్ద పరీక్షించారు. నిర్గమ17: 1-7, దేవుడు మనతో ఉన్నాడా  లేడా అని. యేసుప్రభువు ఎన్నడును దైవ శక్తిని పరీక్షించలేదు ఆయనకు తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టియే దేవుడ్ని పరీక్షించలేదు. 

మనయొక్క విశ్వాస జీవితంలో శోధనలు వచిన్నపుడు దేవుడ్ని చాల సార్లు పరీక్షిస్తాం. దేవుడా నీవు నాకు వరం ఇస్తేనే గుడికి వస్తాం అని పరీక్షిస్తాం. పరీక్షలో మంచి మార్కులు వస్తే గుణదలకు వస్తానని పరీక్షిస్తాం. ఇంకా చాల విధాలుగా మనం దేవుడ్ని పరీక్షిస్తాం. అన్నిటి కన్నా కావలసినది దేవుడ్ని పరీక్షించటం కాదు దేవుని మీద ఆధారపడి జీవించుట, ఆయనయందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుట.

కాబట్టి మనయొక్క విశ్వాస జీవితంలో శోదనలు వచ్చినప్పుడు, దైవశక్తితో ప్రార్థనతో వాటిని జయించుదాం.

-యేసు ప్రభువు వారు అన్ని చోట్ల శోధించబడ్డారు. అయినా కూడా సైతానుకు లొంగలేదు. 

పవిత్ర గ్రంథంలో   శోధించబడినవారు 

-ఆదాము శోధించబడ్డారు, సైతానుకు పడిపోయాడు. 

-అబ్రాహాము శోధించబడ్డాడు, సైతానును జయించాడు.

-ఇశ్రాయేలియులు సైతాను మాయలో పడ్డారు.

-దావీదు శోధించబడ్డారు ఆయనకూడా పడిపోయారు కొన్నిసందర్భాలలో. 

-సొలొమోను, సంసోను శోధించబడ్డారు వారుకూడా పడిపోయారు.

-యేసు ప్రభువు కూడా శోధించబడినప్పటికిని సైతాను వలలో చిక్కుకొనక అన్ని శోధనలు జయించారు.

-మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు మనం కూడా శోధనలు జయించాలి. 

-మనయొక్క శక్తిని మించి మనం శోధించబడం. (1 కొ రింతి 10:13), కాబట్టి దైవ శక్తితో శోధనలు ఎదుర్కొందాం. దేవునికి సాక్షులై జీవించుదాం. 

-మనకు వచ్చే శోధనలలో దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ మనయొక్క విశ్వాస జీవితమును కొనసాగించుదాం. 

-మన జీవితంలో ఒక దాని తరువాత ఒక శోధన వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని దైవశక్తితో జయించుదాం.

Rev. Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...