12, ఫిబ్రవరి 2022, శనివారం

6 వ సామాన్య ఆదివారం(2)

 6 వ సామాన్య ఆదివారం

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26

నేటి దివ్య పఠనాలు దేవుని  నమ్ముకుని జీవించే వారిలో, దేవుడు వారిని దీవించే  విధానం గురించి, అదే విధంగా దేవుని మీద ఆధారపడి,  దేవునికొరకు జీవించే వారు ఎల్లప్పుడు కూడా ధన్యులె  అనే అంశములను గురించి  దివ్య పఠనాలు సెలవిస్తున్నాయి. 

మానవ జీవితంలో నిజమైన ఆనందం దేవుని మీద ఆధారపడి  జీవించే వారికి కలుగుతుంది. వారి జీవితంలో ఒక వేళ సమస్యలు, కష్టములు ఉన్నా కాని దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు తప్పని సరిగా వారి జీవితంలో ఆనందంను ఎల్లప్పుడు ఉంచుతారు. దేవునిలోనే నిజమైన ఆనందం, ఆశీర్వాదం దాగి ఉంది. 

ఈనాటి మొదటి పఠనంలో  దేవుని యొక్క విజ్ఞాన వాక్కులను యిర్మియా ప్రవక్త ప్రకటిస్తున్నారు. దేవుడు రెండు రకాలైన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు పలుకుచున్నారు. 

1. మానవుల మీద ఆధారపడి జీవించేవారు 

2. దేవుని మీద ఆధారపడి జీవించేవారు

ప్రభువే స్వయంగా అంటున్నారు, నరున్నీ నమ్మే వాడు శాపగ్రస్తుడు అని. మనం నరుని శక్తిని నమ్ముకొని జీవిస్తే దేవుడిని విస్మరించినట్లే, ఎందుకంటే దేవుని శక్తి మీద నమ్మకం లేదు కాబట్టియే నరున్నీ నమ్ముకుంటున్నారు. ఇది  ఆనాడు యిస్రాయేలు ప్రజల్లో చూశాం, నేడు మనందరి జీవితాలలో కూడా చూస్తున్నాం. యిస్రాయేలు ప్రజలు నిజమైన రాజును (యావే)విస్మరించి వేరొక రాజు కోసం అడిగారు, దాని ప్రతిఫలంగా వారికి నష్టమే జరిగింది. 

అదే విధంగా యిస్రాయేలు ప్రజలు చాలా సందర్భాలలో తమ యొక్క రక్షణ కోసం అస్సిరియుల మీద సిరియా సైన్యం మీద ఆధారపడి జీవించేవారు. కొన్నిసార్లు ఐగుప్తు వాసుల మీద ఆధారపడేవారు. 

వీటన్నిటిలో యిస్రాయేలు ప్రజల దేవుని బలమును కాక మానవ బలముల మీద ఆధారపడి జీవించారు, అందుకే వారి జీవితంలో అన్ని సమస్యలు. వారి జీవితంలో కష్టలు ఎదురైనప్పుడు దేవుని వైపు మరలి  రాక మానవ శక్తి వైపు మొగ్గు చూపారు. దేవుని యొక్క ఒప్పందంను మరచి పోయారు.  మానవ  మాత్రుల సైనిక బలమును నమ్ముకున్నారు. 

యిర్మియా ప్రవక్త రెండు విషయములను అందరిముందు ఉంచుతున్నారు. 1. ఆశీర్వాదమా? 2. శాపమా?

మానవ జీవితంలో నరుల్ని నమ్మటం పాపము కాదు కాని నరుల్ని మాత్రమే నమ్మి వారి మీద ఆధారపడి జీవించుట పాపమే. మనందరం దేవున్ని నమ్ముకొని, దేవుని మీదనే ఆధారపడి  జీవిస్తున్నామని భావిస్తాం. కాని మనం దేవుని కన్నా మానవుల మీదనే ఎక్కువగా  ఆధారపడి జీవిస్తాం. 

బాబిలోనియా రాజు యెరుషలేము మీదకు యుద్దం చేయడానికి వస్తున్నాడని తెలుసుకున్న యూదా రాజు, మతాధికారులు యావే దేవున్ని ఆశ్రయించకుండా, నమ్మకుండా ఐగుప్తు రాజు సహాయం కోరారు. ఈ విషయం దేవుడిని చాలా బాధించింది. 

అన్నీ ఇచ్చిన దెవుడ్ని మరచి వేరె వారివైపు  సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుని శక్తిని మరచారు. దేవుడు యిస్రాయేలును ఫరో నుండి బయటకు తీసుకొచ్చిన విధానం మరిచారు.

ఎర్ర సముద్రం గుండా రక్షించిన  విధానం మరిచారు. 

ఎడారిలో ఒసగిన సమృద్ది ఆహారంను, అధ్బుతములను మరిచారు. 

దేవుడు వారికి ఇచ్చిన యుద్ద విజయములను  సంరక్షణను మరిచిపోయారు. 

ఇవన్నీ మరచిపోయి మానవుల సహాయం కోరారు. పవిత్ర గ్రంధంలో దేవుని శక్తి మీద ఆధారపడి  దీవెనలు పొందిన వారిని చాల మందిని చూస్తున్నాం. 

దావీదు రాజు దేవుని మీదనే ఆధారపడ్డారు, ఆశ్రయించారు కాబట్టి అనేక విజయాలు సాధించారు. ఎస్తేరు తన ప్రజలను రక్షించుటకు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి తన ద్వారా ఆ ప్రజలను రక్షించారు. యెబు తన యొక్క విశ్వాస  జీవితంలో దేవుని మీదనే ఆధారపడ్డారు అందుకే శ్రమలు తరువాత ఆశీర్వాదాలు సమృద్దిగా పొందుకున్నారు. -యొబు 42:12. 

యిర్మియా ప్రవక్త తెలియ చేసే  విషయం ఏమిటంటే దేవుని మీద ఆధారపడి జీవించుట ద్వారా శాశ్వత ఆనందం దొరుకుతుంది. వారి జీవితంలో అంతయు సమృద్ది దొరుకును అని ప్రవక్త పలుకుచున్నారు. దేవుని మీద ఆధారపడితే దీవెనలు వస్తాయి. అన్నా ఆధారపడినది దీవెనలు పొందింది. శతాధిపతి ఆధారపడ్డారు, యాయిరు ఆధారపడ్డారు, కననీయ స్త్రీ ఆధారపడ్డారు. తన యొక్క దివ్య శక్తి మీద ఆధారపడిన వారందరినీ ప్రభువు దీవించారు. ఆ దీవెనలు ఎలా ఉంటాయి అంటే జీవితం మొత్తం కూడా ఎటువంటి కొదవలేని విధంగా ఉంటాయి. 

వారి జీవితం ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే వుంటుంది. అక్కడ చెట్టుకు కావలసిన నీరు, సమృద్దిగా దొరుకుతుంది. ఆకులు పచ్చగా ఉంటాయి, కాయలు కాస్తాయి అని అంటే ఎప్పుడు కూడా వారు సు:ఖ సంతోషాలతో  ఉంటారని దీని అర్ధం. మన జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎక్కువగానే  ఉంటాయి. కీర్తన గ్రంధంలో 1 వ అధ్యాయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వారిని గురించి చెప్పబడింది. వారికి సకాలంలో అంతయు ఇవ్వబడును. 

రెండవ పఠనంలో పునీత పౌలు గారు మరియొక సారి  యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి భోదిస్తున్నారు. పౌలుగారు యేసు ప్రభువు యొక్క శరీరం యొక్క పునరుత్థానం యాదార్ధమని ప్రకటిస్తున్నారు,అదియే వారి యొక్క విశ్వాసం అని కూడా ప్రకటిస్తున్నారు. కోరింతులోని కొందరు వ్యక్తులు శరీరం యొక్క పునరుత్థానం లేదని బలంగా నమ్మేవారు అలాంటి అపనమ్మకం ఉన్న వ్యక్తులకు పౌలుగారు చెప్పే విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు పునరుత్థానం అవ్వక-పోతే మా విశ్వాసం , మా సాక్ష్యం వ్యర్ధమని ప్రకటిస్తున్నారు. 

యేసు ప్రభువు పునరుత్థానం అయి కొందరికి ప్రత్యక్షమయ్యారు 1 కోరింథీ 15:4-7. దేవుడే ప్రత్యేక్షంగా దర్శనం ఇచ్చారు అది  చూసిన వ్యక్తులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు అని చెప్పిన గాని ఇంకా కోరింతులోని వ్యక్తులు నమ్ముటలేదు. 

కొన్ని సార్లు  కొంత మందికి  ఎంత చెప్పినా సరే వినరు . యేసు ప్రభువు పునరుత్థానం అయిన తరువాత శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు తోమస్సు గారు అఆ సమయంలో వారితో లేరు అప్పుడు శిష్యులు ప్రభువు వారికి దర్శనం  ఇచ్చారు అని ఎన్ని సార్లు చెప్పిన వినలేదు నమ్మలేదు. కోరింతు వారికి కూడా ఇది జరుగుతుంది. సజీవులు సాక్ష్యం ఇచ్చిన కానీ వారిలో ఇంకా అవిశ్వాసం దాగి ఉంది. పౌలు గారు ప్రభువు పునరుత్థానం చెందకపోతే, మన విశ్వాసం వ్యర్ధమని, అపోస్తుల భోదన వ్యర్ధమని , పునీతుల సాక్ష్యం వ్యర్ధమని పలుకుచున్నారు. 

సువిశేషంలో యేసు ప్రభువు ధన్యత గురించి, అనర్ధముల గురించి, సంతోషం గురించి విచారము గురించి తెలియచేస్తున్నారు. అలాగే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని తెలుపుచున్నారు. వాస్తవానికి ప్రభువు ప్రాపంచిక జీవితమును తిరస్కరిస్తున్నారు.దానితో పాటు భౌతిక వాదంను తిరస్కరిస్తున్నారు. 

యేసు ప్రభువు మైదానం వద్ద పలికిన  ఈ విలువైన  మాటలు  మత్తయి సువార్తలోని అష్ట భాగ్యాలకు సమానంగా ఉన్నాయి. కాని లూకా సువర్తకుడు అన్నీ ఇక్కడ రాయలేదు. రెండు విషయాలను మాత్రమే ఆయన గట్టిగా చెబుతున్నారు. మొదటిగా పేదవారి గురించి రెండవదిగా ధనికుల గురించి. దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు, స్వార్ధంతో జీవిచ్చే వారి గురించి చెబుతున్నారు. పేదలగు మీరు ధన్యులు దేవ రాజ్యం మీది అని ప్రభువు పలుకుచున్నారు. 

పేదవారు అంటే కేవలం ఆర్ధికంగా సంపదలు లేని వారు మాత్రమే కాదు కాని దేవుని యొక్క ఆత్మీయతతో బలహీనంగా ఉన్నవారు, దేవుని అనుభవం లేనివారు , దేవుని యొక్క  ఆత్మ తక్కువగా ఉన్నవారు. 

నిజానికి ఈలోకంలో సమృద్దిగా  అన్నీ ఉన్నాయి అయితే అవి ఎక్కువ శాతం ధనికుల వద్దనే ఉన్నాయి. ప్రభువు వారిని ధనవంతులుగా చేసినది పేదవారిని ఆదుకొనుటకొరకే. 

1. పేదలగు మీరు ధన్యులు అంటే దేవుని ఆత్మలో పేదవారు - ఆధ్యాత్మిక పేదరికం దేవుని మీద ఆధారపడి జీవించే వారు దేవుని ముంగిట తన బలహీనతలను, ఆధ్యాత్మిక అవసరతలను గ్రహించుకొని దేవుని వైపు  మరలి ఆయన మీద ఆధారపడి  జీవించుటయే. 

మానవ జీవితంలో ఏ అనుగ్రహమైన దేవుని దగ్గరనుండియే ఇవ్వబడుతుందని గ్రహించుటయే. poor in spirit అని అర్ధం. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉండే వారికి ధన్యత కలుగుతుంది. 

2. ఆకలిగొని యున్న వారు ధన్యులు అని పలుకుచున్నారు.  ఇక్కడ ఇది శారీరక ఆకలి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఆకలి. 

దేవుని వాక్కు కోసం ఉన్న ఆధ్యాత్మిక ఆకలి, దేవుని ఆహారం (దివ్య సత్ప్రసాదం ) స్వీకరించాలనే ఆకలి, దేవుని అనుభూతి పొందలనే ఆకలి కలిగిన వ్యక్తులకు వచ్చే ధన్యత గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు ఆకలితో ఉన్న ఎందరో ప్రజల యొక్క ఆకలిని తీర్చారు. అలాగే ఆధ్యాత్మిక ఆహారం కోసం ప్రయత్నించే వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. పేదవారు, ఆకలి దప్పలు కలిగిన వారు ఎప్పుడు కూడా ఆధారపడి జీవిస్తారు, ఎదురు చూస్తారు, ప్రయత్నిస్తారు, కష్టపడతారు కాబట్టియే వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. మన యొక్క  జీవితంలో కూడా దేవుని మీదనే ఆధారపడి జీవిస్తే మన శారీరక , ఆధ్యాత్మిక ఆకలి తీసివేయబడి మనకు అంతా సమృద్దిగా ఇవ్వబడుతుంది. ధన్యులు అంటే దేవుని మీద ఆధారపడి , దేవుని కొరకు జీవిస్తూ తమ జీవితం ద్వారా దేవున్ని సంతృప్తి పరిచేవారు.   

3. శోకించుచున్న మీరు  ధన్యులు - ఆనందింతురు. తమ యొక్క పాపపు జీవితంనకు శోకించే వారు తం పాపాలకు హృదయ పరివర్తనం చెందాలని బాధపడే వారు దేవుని కృప వలన సంతోషం ఇచ్చారు. ఈ లోకం లో లాజరు శోకించారు కానీ దేవుడు అతనికి పరలోకంలో సంతోషం ఇచ్చారు. యొబు శోకించాడు అలాగే దేవుడు ఆశీర్వదించి సంతోషం ఇచ్చారు. ఎవ్వరు నిజంగా శోకీస్తారు అంటే దేవుని యొక్క పవిత్రత ముంగిట తమ యొక్క అయోగ్యత గుర్తించిన వారు. 

యెరుషలేము దేవాలయంలో సుంకరి రొమ్ము బాదుకొని తన పాపాలకు పశ్చాత్తాప పడి ఏడ్చాడు. ఆయన ప్రార్ధన ఆలకించబడింది. అలాగే ఆయనలో సంతోషం నింపబడింది. మనయొక్క పాపాలకు, వ్యసనాలకు శోకించి మన జీవితాలు దేవున వైపు మరల్చుకుంటే ఆనందంగా జీవించగలుగుతాం. 

4. దేవుని కొరకు నిందించబడినప్పుడు ధన్యులు అని పలుకుచున్నారు. క్రీస్తు కొరకు జీవించే వారిలో నిందలు ,హింసలు , అవమానాలు వస్తాయి అని ప్రభువు తెలుపుచున్నారు. దేవునికి సాక్షి పూరితమైన జీవితం జీవించే వారు ఎన్నో శ్రమలు  అనుభవించారు అని పరిశుద్ద గ్రంధం తెలుపుచున్నది. ప్రవక్తలు శ్రమలు అనుభవించారు, శిష్యులు హింసలు అనుభవించారు, సేవకులు , పునీతులు కష్టాలు , నిందలు అవమానాలు అనుభవించారు. శ్రమలు అనుభవించిన కాని వారు దేవుని సేవ చేశారు, దేవుని కొరకు  జీవించారు. 

మనుష్య కుమారుని నిమిత్తము ఎందుకు హింసలు  అనుభవిస్తారంటె 1. ఈ ప్రపంచం ఇంకా దేవుని తెలుసుకొనలేదు 2. శ్రమలు అనుభవించె వారు దేవుని లోకంలో జీవించే వారు ఈ లోకంలో ఉన్నప్పటికీని వారు ఈ లోకానికి చెందిన వారు కారు. 3. హింసలు పొందుతారు ఎందుకంటే దేవుని యొక్క సత్యమైన మాటలు ప్రకటించినప్పుడు అవి ప్రజలకు నచ్చనప్పుడు. 

దేవుని కొరకు హింసలు పొందినప్పుడు వారికి బహుమానం కలుగుతుంది. 1. గౌరవించ బడుతారు. అ . పో  . 5: 41, 2. ఓదార్చబడతారు 2 కోరింథీ 1:5 3. దేవునికి దగ్గరగా ఉంటే దీవెన పొందుతారు (1 పేతు 4:14)4.క్రీస్తుకు గొప్ప సాక్షులు అవుతారు. (2 కోరింథీ1:4-6)

మానవ జీవితంలో మనం దేవుని కొరకు  జీవిస్తే దేవుడు తప్పని సరిగా మన కొరకు జీవిస్తారు. ధనికులను గురించి ప్రభువు హెచ్చరిస్తున్నారు, ధనికులు సుఖాలు అనుభవించి పేదవారిని నిరాకరిస్తున్నారు, స్వార్దంతో జీవిస్తున్నారు. 

1.ధనికులు తమ మీదనే ఆధారపడుతారు. దేవున్ని కాదని ధనమే ముఖ్యమని జీవించే ధనికులందరికి అనర్ధం అని ప్రభువు తెలుపుచున్నారు. ధనం మనిషిని ఈ లోక ఆశలకు కట్టి వేస్తుంది, ధనమే అన్ని అనర్ధాలకు మూలం. 

2.కడుపు నిండిన వారా మీకు అనర్ద, అని పలుకుచున్నారు ప్రభువు అంటే ఇంకా వారికి ఎదియు అవసరం లేదు. నిండిన వారు అంటే ఈ లోక  ఆశల్లో , వ్యామోహంలో, ధనంతో, స్వార్ధంతో , కొరికలతో, నిండినవారు అలాంటి వారికి అనర్ధం వారి జీవితంలో దేవున్ని నింపు కోటానికి స్థలం లేదు. లూకా 15:16. 

3. నవ్వుచున్న వారులారా అనర్దం - నవ్వు చున్న వారి గురించి చెప్పబడింది. అంటే వారి జీవితంలో సరదాలు ఎక్కువగా ఉంటాయి. parties , celebrations ఎక్కువగా ఉండేవారు అలాంటి వారికి  అనర్ధం అని తెలుపుచున్నారు. వారి జీవితంలో పాపాలకు పశ్చాత్తాపం లేదు. అసలు పాపం అనే ఆలోచనే లేదు. దాని వల్ల విందులతో వినోదలతో జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారికి అనర్దం అని పలికారు. 

4. ప్రశంసించబడినప్పుడు అనర్ధం అంటున్నారు. ఎందుకంటే ఎదుటి వారికి నచ్చిన విధంగా, చెప్పిన విధంగా మనం జీవిస్తే తప్పని సరిగా ప్రశంసించబడతాం. కానీ అలాంటి జీవితం కాదు మనం జీవించాలిసింది. ప్రశంసల కోసం అన్యాయంను  న్యాయం చేయకూడదు. దేవుని కొరకు సత్యమైన జీవితం జీవించాలి. దేవుని మాటలే ప్రకటించాలి.  హింసలు వచ్చిన, బాధలు వచ్చిన దేవుని కొరకు జీవిస్తే ఆయనయె వారిని సన్మానిస్తారు. 

కాబట్టి  దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని దీవెనలు పొందుదాం. మానవ శక్తి  మీద కాకుండా, ఈ లోక శక్తి మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవునికి సాక్షులై జీవించుదాం. 

Rev. Fr. Bala Yesu OCD 

 

6 వ సామాన్య ఆదివారం ( ఏవరిని నమ్మాలి )

6 వ సామాన్య ఆదివారం 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

క్రీస్తు నాధుని యందు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి తిరుసభ  6 వ సామాన్య ఆదివారము లోనికి అడుగిడుతుంది. ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  అన్నీ దేవుని యందు విశ్వాసం గురించి భోదిస్తున్నాయి. ఈనాటి  మూడు పఠనాలు  మనము గమనించినట్లయితే మనకు ఒక సందేహము కలుగవచ్చు. అది ఏమిటంటే "ఎవరిని నమ్మాలి" అని ఎందుకంటే ఈనాటి మొదటి పఠనాన్ని గమనించినట్లయితే మొదటి పఠనం యిర్మియా గ్రంధము నుంచి తీసుకొనబడింది. యిర్మియా ఒక గొప్ప ప్రవక్త, దేవుని మాట కోసం తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండ దేవుడు ప్రజలను  ఏవిధంగా శిక్షింపనున్నాడో , వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనభోతున్నారో తన జీవితం ద్వారా తెలిపిన  గొప్ప ప్రవక్త, ప్రజలను  దేవుని వైపు నడిపించడానికి తన ప్రాణములను సైతం పణంగా పెట్టిన గొప్ప ప్రవక్త. ఈ యిర్మియా  ప్రవక్త  రాజకీయంగా విఫలమైయాడు కానీ ఆధ్యాత్మికతలో మాత్రం దేవునికి ఏంతో దగ్గరయ్యాడు.  ఈనాటి మొదటి పఠనంలోని మాటలు యిర్మియా ప్రవక్త తానే స్వయంగా ప్రజలను హెచ్చరిస్తూ పలికిన మాటలు. ఎందుకంటే ఈ యూదా ప్రజలను దేవుడు బానిసత్వం  నుండి  తీసుకొని వచ్చి వారికి కావలసిన వన్ని ఇచ్చి వారికి అక్కున నిలిచాడు. 

ఈ యిస్రాయేలు  ప్రజలకు  ఏ ఆపదవచ్చిన వారికి సమీపమున లేదా సహాయముగా ఉండేది ఎవరు అంటే దేవుడు. దేవుడు వారికి అతి సమీప వ్యక్తి  పిలవగానే పలికే వ్యక్తి , వారికి ఏ ఆపద  వాటిల్లినా మొదటిగా తలచేది దేవుడినే చివరకు దేవుడు వారితో ఓడంబడిక కూడా  చేసుకున్నాడు. మీరు నా ప్రజలు , నేను మీ దేవుడను అని . ఈ ప్రజలకు  దేవుడు ఇంత చేసిన  తరువాత కూడా ఆపద వచ్చినప్పుడు దేవున్ని కాదని మానవుల సహాయం కొరకై వెళుతున్నారు. అది కూడా వారి శత్రువుల దగ్గరికి బాబిలోనియా రాజు యిస్రాయేలు ప్రజలను బానిసత్వమునకు తీసుకొని వెళ్ళాడు. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు బాబిలోనియా రాజు వారి మీదకు దండెత్తి వస్తున్నారని తెలిసి యిస్రాయేలు ప్రజలు ప్రాణముల మీద  తీపితో ఈజిప్టు దగ్గరకు సహాయముకై వెళుతున్నారు.  శత్రువులైన ఈజిప్టు రాజు నుండి కాపాడిన దేవుడిని మరచి ఈ ప్రజలు మానవుని సహాయము కొరకై పరుగు తీస్తున్నారు. 

దేవుడిని కాదని మానవుల మీద ఆధారపడిన వారు లేదా మానవులను నమ్మిన వారి గతి ఏ విధంగా ఉండునో దివ్య గ్రంధం చక్కగా వివరిస్తుంది. ఉదాహరణకు ఏసావు , యకొబును నమ్మితే, యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేస్తున్నాడు. పాత నిభందనలోని యేసేపు తన అన్నలను నమ్మితే వారు యేసేపు చావుని కోరారు, సంసొను డెలీలా ను నమ్మితే డెలీలా సంసొనును మోసం చేసింది, ఇలా మనం నిజ జీవితంలో ఎన్నో చూస్తున్నాం, కొన్ని సార్లు అనుభవించే వుంటాం. కానీ దేవుడు మాత్రం వారు ప్రార్ధించిన ప్రతిసారీ, అడిగిన ప్రతిసారీ, మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆలకించాడు,ఇచ్చాడు. వారి చెంతనే నిలిచాడు. పగలు మేఘ స్తంభం వలె రాత్రి అగ్ని స్తంభం వలె ఉంది కాపాడాడు. ప్రజలు ఎన్నిసార్లు మోసం చేసిన  దేవుడు మాత్రం దయ కలిగే ఉన్నాడు వారి యందు. ఈనాటి పఠనంలో కూడా తన ప్రవక్త అయిన యిర్మియాను పంపి తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు. దేవునిపై నమ్మకము ఉంచి విశ్వసించువాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలే ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎప్పుడు ఫలిస్తూ ఉంటాడు, మానవులను నమ్మి వారిపై ఆధారపడువాడు  మరు భూమిలో ఉండు తుప్పలను పోలి ఉంటాడు అని హెచ్చరిస్తున్నాడు. కానీ యిర్మియా ప్రవక్త మాత్రం దేవుడిని చివరివరకు విడనాడలేదు  అందుకే యిర్మియాను ఒక గొప్ప ప్రవక్త గా భావిస్తుంటారు. 

ఈనాటి లూకా సువార్తలోని వచనాలు మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాము. రెండు ఒకే విధంగా  ఉంటాయి. ఈ వచనాలు సరిగా చదివితే అవి విప్లవాత్మకంగా , సమాజ విలువలను గురించి  మాట్లాడినట్టుగా వుంటాయి. మత్తయి సువార్తికుడు ఆధ్యాత్మిక పేదరికం గురించి మాటలాడుతుంటాడు, కానీ లూకా సువార్తికుడు మాత్రం ఆనాటి కాలంలో జరుగుతున్న కలహాలు, హెచ్చుతగ్గులు గురించి మాట్లాడుతుంటాడు. నిజమైన పేదరికం గురించి వారు అనుభవిస్తున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. సువార్తలో ప్రభువు చెప్పినట్లు పేదరికం , ఆకలి, దాహం లాంటివి ఆనాటి కాలంలోని కలహాలు. ఆనాటి కాలం లోనే కాదు ఇప్పటికీ కొనసాగుతున్నావే ఇవి, మానవుడు దేవుని విలువలకంటే ప్రపంచ విలువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నారు ఆకలికొని ఉన్న వారులారా ఆనందపడుడు అని ధనికులకు శాపగ్రస్తులు అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వస్తువులకు, విలువులకి ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని  విలువులకు ప్రాధాన్యత ఇవ్వలేడు. హృదయాన్ని దేని మీద అయితే కేంద్రీకృతం చేస్తామో దాని కొరకై పరుగెడుతాము. ప్రపంచ వస్తువుల మీద అయితే వాటి కొరకై పరుగెడతాము కానీ వాటిని ఎప్పటికీ సాధించలేము, దేవుని మీద  అయితే మనం సాధించగలం. ఎందుకంటే మనం ఆయన ప్రజలం ఆయన మన దేవుడు. ఎవరైతే దేవుని విలువలకు ప్రాధాన్యత ఇస్తారో అట్టి వారు ఏటి ఒడ్డున నాట బడిన చెట్టు వలె నిరంతరం పచ్చిగా ఫలిస్తుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా ధన్యులు దైవ రాజ్యం అట్టివారిది. 

రెండవ  పఠనంలో పునీత పౌలుగారు క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమును  గురించి పునరుత్థానము నందు  విశ్వాసము గురించి ప్రస్తావించుచున్నారు. మొదటి కోరింథీయులు 15 వ అధ్యాయము అర్ధము చేసుకోవడానికి కష్టముగా ఉండేటువంటిది. అందులోని మర్మము అర్ధం కాదు. కొరయిన్థియ ప్రజలు శరీరము యొక్క ఉత్తానమును  తీరస్కరిస్తున్నారు. కానీ ప్రభువు యొక్క పునరుత్థానమును కాదు. పౌలు గారు చెప్పేది ఏమిటి అంటే శరీర ఉత్తానమును తీరస్కరిస్తే ప్రభుని పునరుత్థానమును కూడా తీరస్కరించినట్లే. శరీర ఉత్థానమును నమ్మని వాళ్ళు ప్రభుని పునరుత్థానమును ఎలా నమ్ముతారు? ఇలా అపనమ్మకము ద్వారా క్రైస్తవ సత్యాన్ని, నిజాన్ని, సందేశాన్ని  కించపరిచినట్లే. ఇప్పటి వరకు భోధించినది వ్యర్ధమైనట్లే ప్రభువు పునరుత్థానము కాకపోతే చేసే బోధన, విశ్వాసం అంతా వ్యర్ధమే. 

ఎందుకు పౌలుగారు ప్రభుని పునరుత్థానమునందు విశ్వాసాన్ని ముఖ్యముగా భావిస్తారు, అందులో దాగిన విలువలు, సత్యము ఏమిటి అంటే ప్రభువు అనేక సార్లు తన శిష్యులకు దర్శనమిచ్చారు.  

*క్రైస్తవులను హింసించే సౌలుకు సైతం దర్శనమిచ్చ పౌలుగా మార్చారు. 

*శిష్యులతో కలసి భుజించాడు, ప్రయాణించాడు ఇలా ఎన్నో జరిగాయి. 

*పునరుత్థాన సత్యము యూదులు చేసే అసత్య వాదనకన్నా బలమైనది, నిజమైనది. 

* ప్రభుని పునరుత్థానము మంచి చెడు మీద ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానం ప్రేమ  అసహ్యం కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

*ప్రభుని పునరుత్థానము బ్రతుకు చావు కంటే ఎంత బలమైనది అని నిరూపిస్తుంది. 

చివరిగా పౌలుగారు చెప్పేది ఏమిట అంటే  ఒక వేళ క్రీస్తు ప్రభుని పునరుత్థానం నిజము కాకుంటే , భోదించే సందేశం అబద్ధం అయితే పునరుత్థానంను విశ్వసించి చనిపోయిన వారి చావు, విశ్వాసం  వ్యర్ధమే వారి యొక్క విలువలు వ్యర్ధమే. 

పునరుత్థానమును జీవితంలో నుంచి తీసివేస్తే మనకు అయిన  క్రైస్తవ విశ్వాసాన్ని  చెడిపివేసినట్లే. "నేను కాదు జీవించేది నాలో జీవించేది క్రీస్తే" అని పౌలు గారి వలె మనము మన పునరుత్థాన విశ్వాసాన్ని చాటి చెప్పాలి. మనం మనయందును లేక మానవుల యందు కాక  దేవుని యందు నమ్మకం  ఉంచుదాం. ఆయనయందు  విశ్వాసంలో ధృడపడుదాం. 

Br. Lukas 


ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...