30, ఏప్రిల్ 2022, శనివారం

పాస్క మూడవ ఆదివారం

పాస్క మూడవ ఆదివారం 

అపో 5:27-32 ,40-41, దర్శన 5:11-14, యోహను 21:1-19 

 ఈనాటి దివ్య పఠనాలు  దేవునికి సాక్షిగా జీవించే వారి గురించి బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంను విశ్వసించి పిత పుత్ర పవిత్రాత్మ  నామమున జ్ఞాన స్నానం పొందిన వారందరు దేవునికి సాక్షులై జీవించాలని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి. 

ఈనాటి మొదటి పఠనం, అపోస్తులులు యేసు ప్రభువుకు ఎలాగా సాక్షులై జీవించారో తెలుపుతుంది. యేసు ప్రభువుతో పాటు మూడు సంవత్సరాలు జీవించి, ఆయనను తెలుసుకొని ఆయన అప్ప జెప్పిన  బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ, ఆయనకు సాక్షులై జీవించారు అపోస్తులులు. 

లూకా గారు, యేసు ప్రభువు యొక్క శిష్యులను  అపోస్తులులు అని  పిలుస్తున్నారు. అంటే పంపబడినవారు అని అర్ధం. దేవునికి సాక్షులుగా ఉండుటకు పంపబడిన వారు అని అర్ధం . ఏసుతో జీవించి ఆయన భోదను చెవులారా ఆలకించి, ఆయన మరణాన్ని కన్నులారా గాంచి, మృతులలో నుండి సజీవునిగా లేచిన, క్రీస్తుని గురించి ప్రకటించకుండా వుండలేక పోయారు. 

దేవునితో కలిసి జీవించినప్పుడు పొందిన అనుభవాన్ని ఇతరులకు తెలియజేయుటకు సిద్దంగా ఉన్నారు. క్రీస్తు పేరిట ప్రసంగించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అపోస్తులు అనేక హింసలకు గురయ్యారు. 

దేవుని యొక్క సేవ చేసేటప్పుడు అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి. పూర్వ నిబందన గ్రంధం లో కూడా చూస్తుంటాం, ఏ విధంగా యిస్రాయేలు ప్రజలు ప్రవక్తలను హింసించారో. 

యిర్మియా ప్రవక్తను  కొట్టి బావిలో పడవేశారు. యిర్మియా 20:2,  దానియేలును సింహాపు బోనులో పడవేశారు, దానియేలు 6 వ అధ్యాయం. బాప్తిస్మ యోహనును కూడా శిరచ్ఛేదనం చేశారు. మత్తయి 14:1-12. చాలా మంది ప్రవక్తలు దేవునికి సాక్షులై జీవించేటప్పుడు అనేక రకాలైన హింసలకు గురయ్యారు. శిష్యులుకూడా దేవుని యొక్క పవిత్ర ఆత్మను స్వీకరించిన తరువాత ఆయన గురించి గొప్పగా ప్రకటన చేస్తున్నారు. ఇక ఎదియు వారిని ఆపలేదు. 

అపోస్తులను చెరసాలలో వేయడానికి కారణం కేవలం అసూయాయే. అపో 5:17. క్రీస్తు ప్రభువుకు అనుచరులు పెరిగిపోతున్నారని సద్దుకయ్యులు  భావించారు. అందుకే వారు ఆ విషయమును జీర్ణించుకోలేక పోయారు. 

క్రైస్తవ మతమును , క్రీస్తు అనుచరులను తుద ముట్టించాలను కున్నారు. కానీ వారికి అది సాధ్య పడలేదు. క్రైస్తవత్వం ప్రారంభమైనప్పటి నుండి  క్రీస్తు అనుచరులు అనేక కష్టలు అనుభవించారు, అయిన కానీ క్రైస్తవ మతం అణగిపోలేదు. క్రీస్తు విశ్వాసులు దిన దిన అభివృద్ధి చెందుతున్నారు. 

అధికారులు అపోస్తులులను చెరసాలలో వేసి బందించినప్పటికి దేవుడు వారిని విడిపించారు. ఎందుకంటే  వారు దేవునికి సాక్షులై జీవించారు. దేవునికి విధేయత చూపించారు. 

దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నికొలిమిలో వేసిన సంధర్భంలో, దేవుడు వారిని కూడా కాపాడారు. దానియేలు 3:92. ఈ ముగ్గురు వ్యక్తులుకూడ దేవునికి సాక్షులై , విధేయులై జీవిస్తున్నారు. రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించుటకు వారు ఒప్పుకోలేదు. కేవలం దేవున్ని  మాత్రమే ఆరాధిస్తాం అని గట్టిగా విశ్వాసానికి సాక్షులై జీవించారు.

ప్రభువు యొక్క సేవ ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంతగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అపోస్తులులు ఎన్నో ఇబ్బంధులను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారు. వారు కష్టాలకు, శిక్షలకు వెనుదీయలేదు,ఎంతో ధైర్యంగా ఉన్నారు. 

వారు సురక్షితంగా పిల్ల పాపలతో ఉండాలని కోరుకోలేదు. దేవుని జీవితం ప్రకటించాలని దేశ దేశాలు తిరిగి సువార్త ప్రకటించారు. 

క్రీస్తు పునరుత్తానం తరువాత అపోస్తులులు దేవుని చిత్తమును మాత్రమే వేదికారు. ఆయన చిత్తం నెరవేర్చుటకు , ప్రాణ త్యాగం చేయుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. ప్రభువు సేవలోనే నిజమైన ఆనందం వుందని భావించి ఆయన సేవ చేశారు అపోస్తులులు. 

ఈనాటి రెండవ పఠనంలో యోహాను గారు చూసిన దర్శనం గురించి తెలియచేస్తున్నారు. కోట్ల కోలదిగా  దేవ దూతలు  చంపబడిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల యైన యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి స్తుతులు పాడుచున్నారు. దేవుడు మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని ఆయనను ఆరాధించారు. 

చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది, ఎందుకంటే ఈ గొర్రె పిల్లయైన యేసు క్రీస్తు ప్రభువు బాధమయ సేవకుని వలె తన యొక్క జీవితంను త్యాగం చేశారు. తన రక్తమునుచిందించి ఇతరులను రక్షించెను. తన ప్రేమను మనకు పంచి ఇచ్చారు. మనలను క్షమించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. కాబట్టి ఆయనను ఎక్కువగా తండ్రి దీవించారు. పిలిప్పి 2: 9.

ఈనాటి సువార్త పఠనంలో దేవుడు పేతురు గారికి కాపరి యొక్క బాధ్యతలను అప్పజెప్పుతున్నారు. పేతురు గారు కూడా యేసు ప్రభువుకు సాక్షియై జీవిస్తూ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు.

ఈ సువిశేషంలో చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. 1. మొట్టమొదటగా దేవుడు తప్పిపోయిన వారిని వెదుకుచున్నారు. క్రీస్తు ప్రభువు మరణం తరువాత శిష్యులందరు ఎవరి దారిన వారు పోయారు, భయంతో జీవించారు.  వారందరిని దేవుడు వెదకు చున్నారు. తప్పిపోయిన గొర్రెను వెదికారు, నాణెమును వెదికారు. అలాగే తప్పి పోయిన కుమారుడి కోసం ఎదురు చూశారు. ప్రభువు ఈలోక ప్రాణ భయం వలన బాధ్యతలను నిర్వహించుట మరిచిపోయిన శిష్యులను వెదకుచున్నారు. వారికి బాధ్యతలను అప్పజెప్తున్నారు.

2. యేసు ప్రభువు మనలను పాత జీవితం జీవించుటకు అంగీకరించరు.  పేతురు గారిని దేవుడు తన యొక్క సువార్త పని కోసమై పిలిచారు. మూడు సంవత్సరములు సువార్త పరిచర్య బాగానే చేశారు. కానీ క్రీస్తు  ప్రభువు యొక్క మరణం తరువాత పరిచర్య విడిచిపెట్టి  మళ్ళీ వారి యొక్క పాత పని, చేపలు పట్టుటకు వెల్లుచున్నారు. ప్రభువు దానికి అంగీకరించుటలేదు. 

మనం ఎప్పుడుకూడా  క్రొత్త జీవితం జీవించాలి. తపస్సు కాల 40 రోజుల మంచి జీవితమే ఇక మీదట  కూడా మనం కొనసాగించాలి. తపస్సుకాలంలో  మంచిగా, పవిత్రులుగా జీవించిన విధంగా ఇక మీదట అదే క్రొత్త జీవితం కొనసాగాలి. 

3. యోహను గారు,క్రీస్తు ప్రభువు  3 వ సారి దర్శనం ఇచ్చారని సువిశేషంలో అన్నారు. వాస్తవానికి ఇది నాలుగవ సారి. 1. మొదట మగ్దల మారియమ్మకు దర్శనం ఇచ్చారు. యోహను 20:11-17. 

2. శిష్యులకు దర్శనం ఇచ్చారు, అప్పుడు తోమస్సు గారు వారితో లేరు. 20:19-23. 

3. తోమస్సు శిష్యులతో ఉన్నప్పుడు 20: 26-29. 

4. ఈనాటి సువిశేషంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం , ఇవన్నీ చేయుట ద్వారా ప్రభువు తాను సజీవుడని తెలుపుచున్నారు. శిష్యుల విశ్వాసం బలపరుస్తున్నారు. యేసు ప్రభువు తాను సజీవుడని శిష్యులకు తెలియచేస్తున్నారు. 

4. చేపలు పట్టే అనుభవం ద్వారా  దేవుడు మరొకసారి శిష్యులను సువార్త పరిచర్యకు పిలుస్తున్నారు. లూకా 5: 1-11 లో  మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చేపలు పట్టే అనుభవం ద్వారా శిష్యులను తన యొక్క సేవకు పిలిచారు. 

ఈ అనుభవం ద్వారా  ప్రభువు  తాను దేవుడని తెలియపరిచారు. శిష్యులు ఆయనను ప్రభువు అని గుర్తించారు. ప్రభువు వారిని మనుష్యులను పట్టువానిగా చేశారు. ఈ అనుభవం వలన శిష్యులు సమస్తమును విడిచిపెట్టి  క్రీస్తును వెంబడించారు, ఆయన సేవ చేశారు. 

శిష్యుల యొక్క విశ్వాసమును దేవుడు అధికం చేయుటకు ఈ అద్భుతం చేస్తున్నారు. 

5. చేపలు పట్టే సమయంలో  ఆ వలలో 153 రకాల చేపలు పడ్డాయి. దీనియొక్క అర్ధం ఏమిటంటే ప్రభువు జీవించే సమయంలో కేవలం 153 రకాల చేపలే ఉండేవి. అని అన్నియు ఆయన వలలోకి వచ్చాయి.  ఆయన పునరుత్థానం తరువాత  అందరిని కూడా దీవిస్తారు, రక్షిస్తారు. 

ఈ 153 రకాల చేపలు వలలో వున్నప్పటికి వల చినగలేదు. ఎందుకంటే అవి కలసి ఉంటున్నాయి, ఐక్యంగా ఉన్నాయి. మనం కూడా అందరం కలిసి మెలిసి ఉండాలి. తిరుసభలో అనేక ప్రాంతాల వారు జాతుల వారు ఉన్నారు, అయినా అందరు ఐక్యంగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. మనం కూడా కలిసి జీవించుటకే దేవుడు మనల్ని పిలిచారు ఆయన బిడ్డలమైన మనం కలసి ఉండాలి. 

6. యేసు ప్రభువు పేతురు గారిని  నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అని మూడు సార్లు అడుగుచున్నారు. మూడు సార్లు ఎందుకని మనం ఆలోచించాలి. పేతురు ప్రభువును మూడు సార్లు నిరాకరించారు. అందుకే మూడు సార్లు అడిగారు. ఇది ఒక వివరణ. 

రెండవది ఏమిటంటే గ్రీకు భాషలో ప్రేమకు మూడు అర్ధాలు ఉన్నాయి. 1. philia - స్నేహితుల మద్య ఉన్న ప్రేమ 2. eros - ప్రేమికుల మధ్య , భార్యభర్తల మధ్య ఉండే ప్రేమ, 3. agape - త్యాగ పూరితమైన ప్రేమ ,ప్రాణాలిచ్చే ప్రేమ. ప్రభువు పేతురు నుండి కోరినది మూడవ ప్రేమ , ఆయన సేవ కోసం  ప్రాణాలిచ్చే ప్రేమ పేతరు నుండి ప్రభువు కోరారు. 

మూడవదిగా పేతురును మూడు సార్లు ఎందుకు అడుగుచున్నారంటే, పేతురు నీవు నన్ను -పూర్ణ హృదయం , పూర్ణ మనస్సుతో , పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా అని అర్ధం. హృదయం, మనస్సు , ఆత్మతో ప్రేమిస్తే అది సంపూర్ణంగా ఉంటుంది. 

పేతురు పశ్చాత్తాప పడి ఈ మూడు విషయాలకు ఒప్పుకొనుట ద్వారా దేవుడు మళ్ళీ అతన్ని నాయకునిగా ఎన్నుకొంటున్నారు. దేవుని యొక్క గొర్రెలను మేపమంటున్నారు. ఆయన ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్నారు. 

ఈనాటి సువిశేషంలో  ప్రభువు రెండు ఉదాహరణలు వాడుచున్నారు. 1. చేపలు పట్టటం 2. గొర్రెలు చూచుకొనుట. 

ప్రతి ఒక్క సువార్త సేవకులు మొదటిగా దేవుని యొక్క వాక్కుచే ప్రజలను పట్టుకోవాలి. తరువాత దేవుని మందను పరలోక మార్గం వైపు నడిపించాలి. 

పేతురు గారు ప్రాణ భయంతో క్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పాడు. అయినా ప్రభువు యొక్క పునరుత్థాన అనుభవం ద్వారా  తన జీవితం మార్చుకున్నాడు. ఆయనకు సాక్షిగా జీవించాడు. తాను వేద సాక్షిగా మరణం పొందాడు. క్రీస్తు ప్రభువు యొక్క సేవ చేశాడు. 

దేవుని సేవలో నిజమైన ఆనందం కనుగొన్నారు. ప్రభువుకు విధేయులై జీవించారు. మనం దేవునికి సాక్షులై జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD


సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...