ఆగమనకాల 4 వ ఆదివారం
మికా 5:1-4, హెబ్రీ 10:5-10, లూకా 1:39-45
నేటి దివ్య పఠనాలు దేవుని యొక్క రాకడ కోసం సంసిద్దులై జీవిస్తున్న వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశం గురించి భోధిస్తున్నాయి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితములో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జీవిస్తారు. ఈనాటి మొదటి పఠనంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానములను గురించి వింటున్నాం.
బెత్లెహేము ఏఫ్రాతా !నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్న దానవు , కాని యిస్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును మీకా 5:2 .
బెత్లేహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు. అని చెప్పినప్పుడు దానిలో ఒక అర్ధము దాగిఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లేహేమును ఎన్నుకున్నారు. రక్షకుని యొక్క యొక్క జన్మస్థలంగా? మొదటిగా బెత్లేహేములో న్యాయాధిపతియైన ఇబ్సాను జన్మించారు. న్యాయదీపతులు 12:8
బెత్లేహేము లెవీయులకు ఒక కేంద్రంగా ఉన్న స్థలం. న్యాయా 17:7-9, 19:1
యాజకుల యొక్క స్థలం
బెత్లేహేము దావీదు రాజు యొక్క జన్మ స్థలం 1 సమూ 16:4 . లెవీయులకు అదే విధంగా దావీదు రాజుకు జన్మస్థలంగా కేంద్రంగా ఉన్నటువంటి ఒక చిన్న స్థలంను దేవుడు పుట్టిన స్థలంగా ఎంనుకొంటున్నారు.
యిస్రాయేలును పరిపాలించే పాలకుడు దేవుడు పంపబోయే క్రీస్తు ప్రభువే . ఎందుకంటే దేవ ధూత మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అని అన్నారు-లూకా 1:33.
దేవుడు చిన్నదైనటువంటి బెత్లేహేమునే ఎన్నుకొంటున్నారు. అల్పమైన ప్రదేశమును దేవుడు ఎన్నుకొని ఒక క్రొత్త అర్ధం తెలుపుచున్నారు.
పూర్వ వేదంలోని ప్రజలు , వారి జీవితాలు అన్నియు రక్షణ కోట కలిగిన యెరుషలేము నగరం మీదనే కేంద్రీకృతమై ఉండేవి.
యవే దేవునికి ఆరాధన స్థలం యెరుషలేము అని ప్రజల నమ్మకం అలాగే దేవుడు అక్కడ ఉండియే ప్రజలను పరిపాలిస్తాడని వారియొక్క ఆలోచన వారి ఆలోచనలకు భిన్నంగా దేవుడు యిస్రాయేలును పరిపాలించే రాజు అతి చిన్నదైన బెత్లేహేము నుండి జన్మిస్తారని మీకా ప్రవక్త తెలియచేస్తున్నారు.
ఏఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం , దానికి పెద్ద గుర్తింపు లేదు. అయితే దేవుడు మాత్రం ఆ గ్రామన్నే ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతంను ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన, అల్పమైన చిన్న గ్రామాన్ని , చిన్న మార్గాన్ని ఎంచుకున్నారు.
మనందరి జీవితంలో ప్రముఖమైన స్థలంలో ఉండటానికి ఆశ కలిగి ఉంటాం. కాని దేవుడు మాత్రం గుర్తింపు లేని వాటికె ప్రాముఖ్యతనిస్తున్నారు.
దేవుడు కూడా అల్పమైన లేదా చిన్న వారికి అనగా వినయం కలిగి జీవించే దీనులను దేవుడు ఎప్పుడు కూడా బాలపరుస్తూనే ఉన్నారు.
చిన్న వారైన చేపలు పట్టుకునే వారిని ఎన్నుకొని దేవుడు వారిని సువార్త సేవకులను , అద్భుతాలు చేసేవారిగా ఎన్నుకొన్నారు.
సామాన్యురాలైన మరియమ్మను ఎన్నుకొని దేవునికి తల్లిగా దీవించారు. యేసు క్రీస్తు ప్రభువు కూడా తనను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించారు. ఎవరూ ఊహించని పశువుల తొట్టిలో శయనించారు. దేవుడు బెత్లేహేమును తన నివాస స్థలంగా ఎన్నుకొన్నారంటే మనం ఆయన యొక్క వినయంను అర్ధం చేసుకోవాలి. గుర్తింపు లేని ఎందరో జీవితాలకు గుర్తింపు ఇవ్వడానికి దేవుడు ఇలా చేశారు.
ఆ చిన్న ప్రాంతం మానవుల యొక్క తగ్గింపు జీవితానికి ఒక గుర్తు. తగ్గించుకొని జీవిస్తే దేవుడు వారి జీవితంలో జన్మించి దానికి సరైన అర్ధం దయ చేస్తారు.
మన కోసం జన్మించే వ్యక్తి సామాన్యుడైన వ్యక్తి కాదు.
-ఆయన పాలకుడు
-ఆయన కాపరి
-ఆయన శాంతి ధూత
ఆయన ప్రతి ఒక్కరి జీవితాలను పాలించే రాజు , ప్రజల మేలు కోసం తన ప్రాణాలు త్యాగం చేసే పాలకుడు.
-ప్రజలను ప్రేమతో పాలించే పాలకుడు
-ప్రజలను శాంతితో నింపే పాలకుడు
-ప్రజలకు సహాయం చేసే పాలకుడు
-ప్రజల మీద కరుణ చూపే పాలకుడు
-ప్రజలను పరలోక గమ్యం వైపు నడిపే పాలకుడు
-తన ప్రజల కోసం సైతనుతో పోరాడి మనకు విజయం చేకూర్చే పాలకుడు
-శాంతితోను, సమానత్వంతోను, దీవెనలతోనూ నింపే పాలకుడు. ఆ రాజు యొక్క రాకడ కోసం మన జీవితాలను సంసిద్దం చేసుకోవాలి.
రెండవ పఠనంలో నిత్య యాజకుడైన క్రీస్తు ప్రభువు, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు వచ్చియున్నారు అని తెలుపుచున్నారు. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ ప్రత్యేక విధంగా యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారికోసం వ్రాయబడినది.
క్రైస్తవులుగా మారటం వల్ల మిగతా యూదులు వారిని దేవాలయం నుండి , ప్రార్ధనాలయాల నుండి బహిష్కరించారు. బలులు సమర్పించేందుకు యాజకులను సంప్రదించేందుకు ధర్మ శాస్త్రమును పఠించుటకు నిర్భందించారు. అయితే ఇలాంటి కష్టతరమైన సమయంలో క్రీస్తు ప్రభువే మీ యాజకుడని, ధర్మ శాస్త్రమని ఆయన బలియే శాశ్వత బలి అని వారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఇలా వ్రాశారు.
యేసు దేవుడు ఈ లోకంలోకి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చారు. ఆయన యొక్క మనుష్యవతారం కేవలం తండ్రి చిత్తం పరిపూర్ణమొనర్చుటయే. యేసు ప్రభువు తండ్రి చిత్తమును ప్రతి నిత్యం కనుగోంటు ఆయన చిత్తము వేదకుచు దానిని తన జీవితంలో నెరవేర్చారు.
మన జీవితంలో మొదటిగా దేవుని చిత్తం వేదకాలి, తరువాత ఆ చిత్త ప్రకారం జీవించాలి.
యేసు ప్రభువు సుస్పష్టంగా తెలియ జేస్తున్నారు, "దేవా నేను నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను" అని. యేసు ప్రభువు యొక్క జీవితంలో ప్రతిసారీ కూడా తండ్రి చిత్తమునే వేదికారు. దేనిలో కూడా స్వార్ధం లేదు. ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలోకి వచ్చారు. ఆయన చిత్త ప్రకారం దైవ రాజ్య స్థాపన చేశారు. ఆయన చిత్త ప్రకారం అందరిని ప్రేమించారు, అందరికోసం ప్రాణ త్యాగం చేశారు. సమస్త మానవాళి కోసం తానే ఒక బలిగా సమర్పించబడి తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చారు.
మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే ఈ లోకంలోకి పంపించబడ్డాం. దేవుని చిత్తాన్ని వెదకి దానిని నెరవేర్చుదాం. దేవుడు మనకు శరీరం ఇచ్చారు. దాని ద్వారా దేవున్ని తెలుసుకొంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మన శరీరం ఉపయోగపడాలి. నేటి సువిశే షంలో మరియమ్మ గారు ఎలిజబెతమ్మ సందర్శించిన విధానం మనం వింటున్నాం.
దేవ దూత వద్ద నుండి శుభ వచనం విన్న మరియమ్మ గారు వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెల్లుచున్నారు. దాదాపు నాలుగు రోజుల ప్రయాణం 130 కి. మీ దూరం. విసుగు చెందకుండా ప్రయాణం చేస్తూ నజరేతు నుండి యూదయా లో ఉన్న ఒక పట్టణంనకు వెళ్లారు.
మరియమ్మ గారి ప్రయాణం చాలా కష్టతరమైనప్పటికిని ఎలిజబెతమ్మ మీద ప్రేమ వల్ల ప్రయాణం చేసి వెళ్లారు. మరియమ్మ గారి గర్భమందున్న యేసు ప్రభువు, తల్లి గర్బంనుండియె తండ్రి చిత్తమును నెరవేర్చుట ప్రారంభించారు. అవసరంలో ఉన్నవారికి తన సహాయం చేస్తున్నారు.
మరియమ్మ గారు మరియు ఎలిజబెతమ్మ ఇద్దరు గర్భవతులే అయినప్పటికీ మరియమ్మ గారు సేవా బావంతో ఒక అడుగు ముందుకువేసి ఆమెకు సహాయం అందించింది.
దేవుడు కూడా చేసిన పని అది. మానవ జాతికి దేవుని యొక్క అవసరం ఉంది. అందుకే తన యొక్క ఏకైక కుమారున్నీ ఈ లోకానికి పంపించారు. యేసు క్రీస్తు ప్రభువు తన పుట్టుకకు ముందే సేవలు అందించేందుకు వచ్చారు. సేవలు అందుకొనుటకు ఆయన రాలేదు. మత్త 20:28 . దేవున్ని తన గర్భమున మోస్తున్న తల్లి మరియమ్మ కూడా సేవా బావంతో సహాయం చేయుటకు వెల్లుచున్నారు. ఇది కూడా దేవుని చిత్తం నెరవేర్చుటలో ఒక ప్రణాళికయే.
మరియ తల్లి దైవ సందేశం ఆలకించిన వెంటనే త్వరితముగా సేవకు వెల్లుచున్నది. త్వరితముగా అంటే ఆమె ఎంతో ఉత్సాహం కాలీగ్ , ఆనందంతో నింపబడినదై వెల్లుచున్నది.
మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించినది ఎందుకంటే దేవుడు వారిద్దరి అద్భుతాలు చేశారు. ఒకరిని దేవుని ప్రవక్తకు జన్మనిచ్చుటకు , ఇంకోకరిని దేవునికే జన్మనిచ్చుటకు ఎన్నుకొన్నారు కాబట్టి. ఈ రెండు అధ్బుత కార్యాలు ఒకరికి ఒకరు పంచుకొనుటకు, సహాయం చేసుకొనుటకు, ఆనందాన్ని వెల్లడించుకొనుటకు కలుసుకొంటున్నారు.
మరియమ్మ గారికి ఎలిజబెతమ్మ గర్భవతి అని తెలుసు కానీ ఎలిజబెతమ్మకు మరియమ్మ గర్భవతి అని తెలియదు అయినప్పటికీ పవిత్రాత్మ శక్తితో గ్రహించి నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించేను అనెను.
మరియ తల్లి వందన వచనం పలికినప్పుడు ఎలిజబెతమ్మ మరియు ఆమె గర్బంలో ఉన్న శిశువు బాప్తిస్మ యోహను దేవుని యొక్క సాన్నిధ్యంను గుర్తించారు.
మరియమ్మ గారు ఎలిజబెతమ్మ కలిసిన సమయంలో జరిగిన సంఘటనలు
1. ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నారు.
2. ఎలిజబెతమ్మ దేవుని యొక్క ఆత్మచేత నింపబడింది. అందుకే నా ప్రభుని తల్లి అని పలికింది.
3. ఎలిజబెతమ్మ ఆనందంతో వెలుగెత్తి దేవుని సువార్తను ప్రకటిస్తుంది.
ఎలిజబెతమ్మ గారే మొట్ట మొదటిగా యేసు క్రీస్తును గుర్తించారు. మరియమ్మ గారి గర్భమందున్న దేవున్ని గుర్తించారు.
ఎలిజబెతమ్మ గారు కూడా వినయంతో , మరియ తల్లి తన కన్నా చిన్నదైనప్పటికి ఆమెను గౌరవించింది, దేవుని తల్లి అని అంగీకరించింది. ఆమెలో ఎటువంటి స్వార్ధం లేదు. ఆమె పలికిన ప్రతి మాట నిస్వార్ధమే. పిలిప్పీ 2:3-4 .
ఎలిజబెతమ్మ ,మరియమ్మ గర్భమందున్న శిశువును తన మెస్సియా గా అంగీకరించింది. దేవుని సజీవ కుమారునిగా బావించింది.
తన గర్బంలో ఉన్న శిశువు కన్నా మరియమ్మ గారి గర్భంలో ఉన్న శిశువు గొప్ప వాడని భావించింది . మరియమ్మ గారు దేవుని ప్రణాళికను తన జీవితంలో నెరవేర్చింది. అందుకే ఆమె గురించి ఎలిజబెతమ్మ గొప్పగా పొగుడుతుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు అని అన్నారు.42 వ వచనం. సృష్టిలో ఎవ్వరికీ దక్కని గొప్ప ఆశీర్వాదం దేవుడు మరియమ్మకు ఇచ్చారు అని ఎలిజబెతమ్మ గ్రహించారు.
జీవం పోసిన దేవునికే జీవం నీచ్చుటకు నిన్ను ఎన్నుకొన్నారు అని మరియమ్మను పొగిడారు.మరియమ్మ గారు దేవున్ని తన గర్భమందు మోసారు. అది గొప్ప విషయం. తాను ఆశీర్వదింపబడటానికి కారణం - దేవుడు ఆమెను ఎన్నుకొన్నారు. రెండవది ఆమె దైవ ప్రణాళిక నెరవేర్చుతూ జీవించింది.
అదే విధంగా మరియమ్మ గారు దేవుడు పలికిన ప్రతి మాట విశ్వసించింది. తనకు వచ్చిన సందేశం దేవునిది అని విశ్వసించింది. తన గర్భమున జన్మించే శిశువు దేవుడని విశ్వసించింది. ఆయన తన ప్రజల కోసం జన్మించే దేవుడని మరియ తల్లి విశ్వసించింది. లూకా 11:28,యోహను 15:7 . ఆమె దేవుని వాక్కును విశ్వసించి వీధేయించింది.
మనం కూడా మన జీవితాలను మరియమ్మ వలె , అదే విధంగా ఎలిజబెతమ్మ వలె దేవుని కొరకు తయారు చేసుకొంటే ఆయన రాకడ మనలో జరుగుతుంది.
ఇద్దరు దేవుని మాటలు విశ్వసించారు.
ఇద్దరు దేవుని కొరకు జీవితాలు సిద్దం చేసుకున్నారు.
ఇద్దరు దేవుని సేవకు , ప్రజల శ్రేయస్సు కొరకు తమ బిడ్డలను సమర్పించారు.
ఇద్దరు దేవుని చిత్తం నెరవేర్చారు, దేవున్ని ప్రేమించారు.
కాబట్టి మన జీవితంలో కూడా దైవ ప్రణాళికలను నెరవేర్చుతు దేవుని కొరకు జీవించుదాం, అప్పుడే ఆయన మనలో జన్మించి మనతో ఎప్పుడూ ఉంటారు.
Rev. Fr. Bala Yesu OCD