28, జనవరి 2023, శనివారం

 

సామాన్య నాలుగవ ఆదివారం

జెఫన్యా 2:3,3:12-13

1 కొరింతి 1:26-31

మత్తయి 5:1-12

ఈనాటి దివ్య పఠనాలు క్రైస్తవుల యొక్క లక్ష్యమైన పరలోక శాశ్వత ఆనందం గురించి తెలియజేస్తున్నాయి.

క్రైస్తవుల యొక్క లక్ష్యం పరలోకం,  ఆ రాజ్యమును ఆనందమును పొందుట ఈనాటి దివ్యగ్రంధ పట్టణాలు మనందరికీ ఒక మార్గమును చూపిస్తున్నాయి. ఏ విధంగా మనం జీవిస్తే పరలోక శాశ్వత ఆనందంను పొందుతాం  అని తెలుపుతున్నాయి.

ఏసుప్రభు వలే జీవిస్తూ, పరలోక అనుభూతిని ఆనందంలో పొందాలి అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి అని కోరుకుంటాం. ఎవరికిని శపింపబడుట ఇష్టముండదు, ఒక విధంగా చెప్పాలి అంటే, ఈనాటి పఠనాలు మనకి పరలోక ఆనందం ఇచ్చుట మాత్రమే కాదు బోధించేది, మనం దేవునికి అనుగుణంగా జీవిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, పరలోక బహుమానంను దయ చేస్తారు అని కూడా తెలుపుచున్నాయి.

ఈనాటి మొదటి పఠనం లో జెఫన్యా  యూదా ప్రజలకు దేవుని యొక్క తీర్పు గురించి, శిక్ష గురించి తెలియజేస్తున్నారు, జెఫన్యా  ప్రవక్త ఎరుషలేములో దేవుని సందేశం అందజేశారు, జెఫన్యా  ప్రవక్త యొక్క గ్రంథమును యూదా  ప్రజలు బాబిలోనియా బానిసత్వంకు వెళ్ళకముందు ఏడవ శతాబ్దంలో రాశారు. ప్రవక్త ఎరుషలేములో బోధించేటప్పుడు యూదా ప్రజలు విశ్వాస రహితులు, అవినీతితో జీవించేవారు, యూదా  ప్రజల యొక్క విశ్వాస జీవితంలో వివిధ రకాల మార్పులు వచ్చాయి వారి అన్యాయంగా సంపాదించిన ధనం వలన, ఆస్తులు వలన, పేరు వలన, సంతృప్తి చెందారు దానితోపాటు పురుగురాజుల యొక్క సహాయంను కోరుతూ ఎటువంటి చీకు చింతా లేకుండా దేవుని మరచి జీవిస్తున్న సమయంలో జెఫన్యా  ప్రవక్త దేవుని హెచ్చరికను తెలుపుచున్నారు, ప్రవక్త ముఖ్యంగా దేవుని యొక్క శిక్ష  గురించి తెలిపారు.

జెఫన్యా  తన యొక్క మొదటి అధ్యాయంలో వివిధ రకాల వ్యక్తులకు, దేవుని శిక్షా వస్తుందని తెలిపారు.

- యోధాకు శిక్ష విధించబడుతుందని

- అన్య దైవములను ఆరాధించు వారికి శిక్షయని

- రాజోద్యోగులకు  శిక్షయని

- ఎరుషలేము వ్యాపారులకు శిక్షయని

-  అన్య జాతులకు శిక్షయని

జపాన్య ప్రవక్త తెలియజేశారు.

ప్రజలు దేవుని మరచిపోయి ఆధ్యాత్మిక నైతిక విలువలు విసర్జించి గర్వంతో జీవించే వారికి తమ ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుని యొక్క శిక్ష (బానిసత్వం - బాబిలోనియాకు ) తప్పదని జెఫన్యా ప్రవక్త తెలియజేశారు.

ఎవరైతే దీనుగా దేవునికి విధేయులై జీవిస్తారో  వారిని దేవుడు కాపాడతారని తెలియజేశారు. ఎవరైతే యావే దేవిని వెతుకుతూ ఆయన యొక్క నీతిని, న్యాయమును ప్రభువుని ఆజ్ఞలను, పాటిస్తారో అదే విధంగా వినయంతో కూడిన జీవితం జీవిస్తారో వారు రక్షింపబడతారు అని జెఫన్యా తెలియజేశారు.

దుఃఖితులుగా , దీనులుగా, కటిక పేదరికంలో ఉన్న వారిని దేవుడు ఆదుకొని, వారికి సహాయం చేస్తారని ప్రభువు అభయం ఇస్తున్నారు.

దుఃఖితులకు, దీనులకు ప్రభువే ఆధరువు, కావున దేవుడే వారిని ప్రేమించి ఆదుకుంటారు, దేవుని యొక్క సంరక్షణ పొందుతారు.

ఈనాటి రెండవ పఠనం లో  పౌలు గారు రెండు రకాలైన జ్ఞానముల గురించి, ఆలోచనలు అభిప్రాయముల గురించి తెలియజేశారు. ఈ ప్రపంచంలో ఎదుటివారి గురించి ఎలాంటి జ్ఞానం కలిగి ఉంటుందో దేవుడు మానవాళి పట్ల ఎలాంటి దైవ జ్ఞానం కలిగి ఉంటారో పౌలు గారు తెలియజేశారు - యెషయా 55:8-9.

పౌలు గారు క్రైస్తవ జీవితం యొక్క ఔనత్వాన్ని తెలియజేస్తూ కొరింతు  సంఘంలో ఉన్న శ్రామిక క్రైస్తవులను పౌలు గారు అభినందిస్తున్నారు, ఎందుకంటే ఈ లోకంలో అత్యల్ఫులుగా చూడబడే వారు దేవుని దృష్టిలో గొప్పవారని తెలియజేశారు.

కొరింతు  సంఘంలో అధికంగా కూలి పని చేసేవారు బానిసలు, కొద్దో గొప్పో ఆస్తిపాస్తులు కలిగిన మధ్యతరగతి కుటుంబం వారు జీవించేవారు. సమాజంలో వీరికి ఎటువంటి ప్రాముఖ్యత గౌరవం లేదు, తమ యొక్క గొప్పదనం చాటుకోవడానికి వీరికి ఎలాంటి  అవకాశం  లేదు అయితే ఈ లోకంలో అల్పులైన వీరు దేవుని దృష్టిలో అధికులు  అని తెలిపారు పౌలు గారు.

తొలి క్రైస్తవ సంఘం కేవలం పేదలతో మాత్రమే కూడినది కాదు, ఎందుకంటే చాలామంది ధనం ఆస్తిపాస్తులు కన్నా దేవునికి ప్రాధాన్యత నిచ్చి  జీవించారు.

ఉదా: అరియో పగసులో సభ్యులైన డయోనేసిమసు దేమోరియస అనే పేరు గల స్త్రీ మరికొందరు - అపో 17:34

సెర్ధియా పౌలు - అపో 13:7,17:4,12, రోమి 16:23

చాలామంది ఏసుప్రభు యొక్క జీవితం కు ఆకర్షితులై సామాన్యమైన జీవితం జీవిస్తూ క్రీస్తు ప్రభువును అనుసరించారు.

ఈ రెండవ పఠనం లో పౌలు గారు ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకొని విశ్వాసులకు తెలియజేసే విలువైన సందేశం ఏమిటంటే పేదవారిని ఎవరు అంగీకరించిన, అంగీకరించకపోయినా దేవుడు వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తారని తెలిపారు.

క్రైస్తవత్వం ప్రారంభమైన తొలి దశలో క్రైస్తవులకు ఎటువంటి గౌరవం ఉండేది కాదు, అప్పట్లో దాదాపు ఒక సామ్రాజ్యం కింద ఆరు కోట్ల బానిసలు, సేవకులు ఉండేవారు. వారికి ఎటువంటి స్వేచ్ఛ ఉండేది కాదు. యజమానులు వారిని ఒక పని ముట్టు లాగా ఎలాబడితే అలా వినియోగించుకునేవారు, కొందరిని చంపి వేసేవారు, వారిని హింసించేవారు, చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేవారు, కానీ పౌలు గారు క్రైస్తవత్వం బానిసల యొక్క జీవితంకు సరియైన అర్థం ఇచ్చింది అని తెలిపారు.

క్రైస్తవత్వం బానిసలను మనుషులుగా చూసిందని వారు దేవుని యొక్క బిడ్డలని తెలిపింది వారికి ఇవ్వవలసిన వ్యక్తిగత గౌరవం ఇచ్చిందని పౌలు గారు తెలిపారు.

జీవం లేనటువంటి వారికి, అదే విధంగా జీవితం మీద ఆశలు లేనటువంటి వారికి, ఒక క్రొత్త జీవితం ప్రసాదించిందని పౌలు గారు తెలిపారు.

అదేవిధంగా ఎవరైనా అయితే సమాజం అవివేకులుగా బలహీనులుగా భావించిందో దేవుడు వారినే తన సేవకు ఎన్నుకొన్నారు అని తెలిపారు.

ఈ లోకం తక్కువగా చూసే వారిని దేవుడు తన సొంత వారిగా చేసుకుంటున్నారు, ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి, దేవుడే వారికి ఆదరువు. కేవలం దేవుడు మాత్రమే మనల్ని మనం అంగీకరించి గౌరవించి ఆశీర్వదిస్తారు.

పౌలు గారు దేవుడు అందరినీ క్రీస్తుతో ఐక్యము చేశారు అని తెలుపుతూ నాలుగు ముఖ్యమైన అంశాలు తెలిపారు.

1. క్రీస్తు ప్రభువే అందరి యొక్క వివేకము - HE IS WISDOM

ఏసుప్రభువుని చూసి మనము నడుచుకున్నట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది, ఆయన యొక్క మాటలను అనుసరించి జీవిస్తే, మనం ఎంత దీనస్థితిలో ఉన్నా దేవునికి అంగీకరించి జీవించవచ్చు.

2. క్రీస్తు ద్వారా మనం నీతిమంతులమవుతాం - పౌలు గారి ప్రకారం నీతిమంతులంటే దేవునితో సరియైన బంధం కలిగి ఉండటమే RIGHTEOUSNESS MEANS A RIGHT RELATIONSHIP WITH GOD. దేవునితో మంచి బంధం కలిగి ఆయన ద్వారా మనం దేవుని యొక్క పరలోకంలో ప్రవేశించాలి.

3. క్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధులము అవుతాము - కేవలం క్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. క్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవుని దత్తపుత్రులుగా చేయబడ్డాం. పరిశుద్ధులుగా చేయబడ్డాం.

4. క్రీస్తు ప్రభువు ద్వారా మనం విముక్తులము చేయబడితిని ఏసుప్రభు మనలను పాపం నుండి విముక్తి చేశారు. మనలను బాధల నుండి, అనారోగ్యము నుండి, ఆపదల నుండి అనేక  సమస్యల నుండి విముక్తులను చేస్తారు.

దేవుని దృష్టిలో లేనివారు, పేదవారు, తన మీద ఆధారపడి జీవించే ఎవరైనా తన యొక్క ప్రియమైన బిడ్డలే. ఈ లోకం చూసిన విధంగా, ఆలోచించిన విధంగా, తీర్పు చేసిన విధంగా దేవుడు చేయరు. తనను ఆశ్రయించిన వారికి దేవుడి తోడుగా ఉంటారు.

ఈనాటి సువిశేష పఠనము లో ఏసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం గురించి చదువుకున్నాం.

ఏసుప్రభువు శిష్యులను ఎన్నుకొన్న తరువాత, శిశువులను తన యొక్క సేవకై పంపించే ముందు చెప్పిన ముఖ్యమైన సందేశం అష్ట భాగ్యాలు.

శిష్యులు ఒక ధన్యమైన జీవితం జీవించుటకు దేవుడిచ్చిన కొన్ని ముఖ్యమైన సలహాలు.

పర్వతం మీద చెప్పిన ప్రసంగం ఒక విధంగా చెప్పాలంటే గురు పట్టాభిషేకం ప్రసంగం, ఎందుకంటే శిశువులను సువార్త పరిచర్యకు ముందు శిష్యులను సిద్ధం చేస్తున్నారు.

అష్టభాగ్యాలు ఏసుప్రభు యొక్క జీవిత సారాంశం,  అష్ట భాగ్యాలు పరలోకానికి  మోక్షానికి దారి. దేవుని రాజ్యంలో ప్రవేశించి నిత్యానందాన్ని పొందేందుకు అవసరమైన నైతిక విలువలను మనోవైఖరిని యేసు ప్రభువు నిర్దేశిస్తున్నారు.

అష్టభాగ్యాలు ఏసుప్రభువునకు ఉండవలసిన వ్యక్తిగత గుణగణాల గురించి తెలుపుచున్నాయి, క్రీస్తు ప్రభువు వలే జీవించేందుకు తగిన జీవన శైలిని, ప్రవర్తన నియమావళిని వెల్లడిస్తున్నాయి, అష్టభాగ్యాలు క్రీస్తు ఆశించే జీవిత విలువలను చూపిస్తున్నాయి.

అష్టభాగ్యాలు, ఏసుప్రభు యొక్క జీవితమే, అవి చూస్తే ప్రభువు యొక్క జీవితంలో అద్దంలో చూసినట్లే, ఆయన తన జీవితంలో బోధించి పాటించినది మనకు ప్రభువు నేర్పిస్తున్నారు.

మోషే ప్రవక్త సీనాయి పర్వతంపై మీద ఇచ్చిన పది ఆజ్ఞలు అదే విధంగా అష్టభాగ్యాలు తెలిపే సారాంశం పరలోకమును చేరుట దేవునికి ఇష్టమైన శిష్యులుగా జీవించుటయే.

మోషే ప్రవక్త ద్వారా వచ్చిన ఆజ్ఞలలో ఇది చేయకూడదు అది చేయకూడదు అని తెలుపుచున్నాయి ఏసుప్రభువు ఇచ్చిన అష్టభాగ్యాల్లో ఏమి చేయాలో, ఎలా జీవించాలో తెలుపుతున్నాయి. అష్టభాఖ్యాల యొక్క సారాంశం ను ధ్యానించుకుందాం.

1. దేనాత్ములు ధన్యులు దేవుని రాజ్యం వారిది

blessed are the poor in spirit ,for theirs is the Kingdom of heaven.

దేవుని యొక్క రాజ్యం పొందాలంటే దీనాత్మం అవసరం, దీనాత్మకు స్థానం పేదరికంలో దారిద్రంలో లభిస్తుంది. లూకా సువార్తికుడు దీనాత్ములను పేదలు అని పిలుస్తారు అందుకనే ఆయన పేదలకు మీరు ధన్యులు దైవ రాజ్యము మీది అని తెలిపారు - లూకా 6:20.

ఈ పేదరికం కేవలం డబ్బు వస్తువులు లేకపోవటం కాదు (not material poverty) ఆధ్యాత్మిక పేదరికం.

గ్రీకు భాషలో పేదలకు రెండు అర్థాలు ఉన్నాయి:

1. తన యొక్క కనీస అవసరాల కొరకు శ్రమించి కష్టపడి జీవించే వ్యక్తి. ఆయన ధనికుడు కాదు అటు కఠిన పేదవాడు కాదు కేవలం రోజు వారికి సరిపోయేది కలిగిన వాడు.

2. ఎటువంటి ఆధారం లేని వ్యక్తులు. ఏమీ లేనటువంటి వ్యక్తులు. వారి యొక్క జీవిత మనుగడ కోసం జీవనాధారం కోసం ప్రతిక్షణం దేవుని మీద ఆధారపడి జీవించేవారు. హీబ్రూ భాషలో పేదవారు అంటే నిసహాయులు, దేవునియందే గొప్ప నమ్మకం ఉంచిన వారు. అదే విధంగా వినయం కలిగిన వారు. అన్ని సందర్భాలలో దేవుని మీద ఆధారపడటమే నిజమైన పేదరికం. దీనాత్మను కలిగి ఉండటం. నా చేతుల్లో ఏమీ లేదు అంతా దేవుని యొక్క కృపయే అనే గొప్ప నమ్మకం కలిగి ఉండుట మన జీవితాలను ఎటు ముందుకు తీసుకుని వెళ్లాలో తెలియక పోవడం జీవిత సమస్యలను ఎదుర్కో లేకపోవడం అలాగే అందరి ముంగిట మనం ఏమి లేని తనం ను గ్రహించి ప్రభువు మీద ఆధారపడి జీవించడమే నిజమైన పేదరికం.

దేవుడు పేదవారి యొక్క మనవులను ఆలకిస్తారు, వారిని ఆదుకుంటారు, అందుకనే కీర్తనల గ్రంథంలో అనేకసార్లు పేదవారి గురించి దేవుడు వారిని ఆదుకునే విధానం గురించి చెప్పబడింది- కీర్తన 34:6,9:18,35:10,68:10,72:4,107:41,132:15.

ఎవరైతే ఈ లోక వస్తువులు శాశ్వతమైన ఆనందం అని గ్రహించి వాటిని పరిచరించి దేవుని చెంతకు తిరిగివచ్చి దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు.

సంఘంలో తన యొక్క ఆర్థిక పేదరికం వలన, బలహీనత వలన, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని హింసలు సంభవించిన, దేవునిపై విశ్వాసం ఉంచి తన కష్టాలన్నింటిని ఓర్పుతో భరించే పేదవారు ధన్యులు వారు పరలోకం పొందుతారు.

తమ హృదయాన్ని దేవునిపై లగ్నం చేసుకొని ఆయనపై ఆధారపడి జీవించాలి.

దీనాత్మను ఎవరైతే కలిగి జీవిస్తారో వారు దేవుని దీవెనలు పొందుతారు. దేనాత్ములు దేవుని క్షమను పొందుతారు- హెబ్రీ 8:12,10:17.

- దీనాత్ములు అందరితో కలిసి మెలిసి జీవిస్తారు- అపో 2:42.

- దేనాత్ములలో ఎటువంటి గర్వం భేదాభిప్రాయాలు ఉండవు - ఎఫిసి 2:19.

- దీనాత్ములు దేవుడు ప్రసాదించే శాశ్వత జీవంను పొందవచ్చు - యోహాను 5:24, రోమి 8:15.

దీనాత్మతో కూడిన పేదరిక జీవితాన్ని ఏసుప్రభువు ఈ లోకంలో జీవించి మనందరికీ ఒక ఆదర్శంగా ఈ లోకంలో ఉంటున్నారు. ప్రభువు పరమును వీడి భువికి వచ్చారు, పశువుల పాకను తన జన్మస్థలంగా ఎన్నుకొన్నారు. నజరేతులో  30 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. తండ్రి దేవుని మీద ఆధారపడి జీవించారు, ఎన్ని కష్టాలు, హింసలు, ఎదురైనా కానీ తండ్రి నే నమ్ముకొని ప్రాణత్యాగం చేశారు, కాబట్టి మనం కూడా ప్రభువు యొక్క జీవితంలో ఆచరించి జీవించాలి.

2. శోకార్తులు ధన్యులు వారు ఓదార్పు బడుదురు.

శోకించుట  అనే పదం చనిపోయినప్పుడు వినియోగిస్తాం, మనకు నచ్చిన వారు, ప్రేమించిన వారు, మన ఇంట్లో చనిపోయిన వారి యొక్క మరణ సందర్భంలో మనం సోకిస్తాం. యాకోబు తన కుమారుడు యోసేపు మరణించాడని శోకించాడు - ఆది 37:34

శోకించుట  కేవలం చనిపోయిన వారి కొరకు మాత్రమే కాదు చేసిన ప్రతి యొక్క పాపం కు తప్పిదంకు శోకిస్తే వారు ఓదార్పు బడతారు అనే ప్రభువు తెలుపుచున్నారు.

ఏసుప్రభు సువార్తను ప్రారంభించినప్పుడు హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసించండి అని తెలుపుచున్నారు. పాపం కు పశ్చాత్తాపం చెంది శోకించకపోతే మనకు దేవుని యొక్క ఓదార్పు దొరకదు.

దేవుని మొదట మన యొక్క అయోగ్యతకు కూడా మనం శోకించాలి అప్పుడే మనం దేవుని యొక్క ఓదార్పు పొందుతాం - కీర్తన 51:17.

3. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు.

క్రైస్తవ జీవితానికి వినమ్రత ఎంతో అవసరం, వినయం లేనిదే మన జీవితం అభివృద్ధి చెందదు, వినయం ద్వారానే అబ్రహాము యొక్క జాతి అభివృద్ధి చెందింది. వినయం వల్లనే దేవుడు మోషేను గొప్ప నాయకునిగా చేశారు. వినయం ద్వారానే దేవుడు మరియమ్మను తన తల్లిగా ఎన్నుకొన్నారు. మనలో వినయం ఉన్నట్లయితే మనం భూమికి వారసులవుతాం. మనం ఎంత ఆస్తులు కలిగి ఉన్నా, పేరు ప్రతిష్టలు ఉన్న, మనలో వినయం లేనిదే ఆ జీవితం దేవునికి అంగీకారం గా ఉండదు.

ఏసుప్రభు ఈ లోకంలో ఎంతో వినయంగా జీవించి ఒక సుమాతృకగా ఉన్నారు, కాబట్టి ఆయన వలే మనం కూడా వినయంతో జీవించాలి.

4. నీతి నిమిత్తము ఆకలి దప్పలు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరపబడుదురు.

ఎవరైతే నీతి కొరకు, న్యాయం కొరకు, కష్టపడి కృషి చేస్తారో వారు సంతృప్తి పరచబడతారు అనే ప్రభువు తెలుపుచున్నారు. పవిత్ర గ్రంథంలో నీతి అంటే మంచిగా ఉండటం మంచి చేయుట.

సమాజంలో సంఘంలో నీతి న్యాయం నెలకొల్పుట కొరకు మాత్రమే కాదు జీవించల్సింది మన యొక్క జీవితం కూడా నీతి గల జీవితం లాగా ఉండాలి అంటే ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేయకుండా దేవుని యొక్క న్యాయం నువ్వు తెలియజేస్తూ జీవించాలి.

నీతి నిమిత్తము అనగా ఎటువంటి అసమానతలకు తావివ్వకుండా జీవించుటయే. అనేకసార్లు ప్రవక్తలు నీతిగా జీవించమని తెలిపారు, అంటే దేవుని దృష్టిలో మంచి చేస్తూ ఆయనకు ఇష్టకరంగా జీవించమని తెలుపుచున్నారు.

ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసుకొని జీవించాలి. మనలో త్రాగుడు జూదం, కోపం, అసూయలు అన్నీ ఉన్నప్పటికీ వాటి నుండి మంచి జీవితం జీవించాలి. అది మాత్రమే కాదు అందరూ కూడా మంచితనం కలిగి నీతి కలిగి జీవించేలా ప్రతి ఒక్కరూ దేవుని మార్గంలో నడిచేలా మనం ప్రయత్నం చేయాలి.

5. దయామయుడు ధన్యులు వారు దయను పొందుదురు

మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో దయ కలిగి ఉండాలి. ఎవరైతే ఎదుటివారి ఎడల కనికరం చూపించరు దేవుడు కూడా కనికరం చూపించరు - యాకోబు 2: 13.

దయను చూపించుట అంటే ఎదుటివారి యొక్క తప్పిదములను మన్నించుటయే.

పవిత్ర గ్రంథములు దేవుడు అనేకమార్లు పలుకుచున్నారు ఎవరైతే ఇతరులను క్షమించరు దేవుడు వారి ఎడల అదే రీతిలో ఉంటారని - మత్తయి 18:35,6:12,14-15.

ఎదుటివారిని అన్యాయం చేసిన వారిని శత్రువులను మనం క్షమించిన సందర్భంలోనే మనం కూడా దేవుని యందు దయ పొందుతాం. ఏసుప్రభువు మరణించి చివరి క్షణంలో కూడా క్షమించమని ప్రార్థించారు.

మనం మనసుతో హృదయంతో మన్నించి జీవిస్తే దేవుడు కూడా మన పాపాన్ని క్షమిస్తారు,. మనకు దయను చూపిస్తారు, దయను మనం చాలా విధాలుగా చూపించవచ్చు ఆకలితో ఉన్నవారికి వస్త్రాల అవసరతలు ఉన్నవారికి వివిధ అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయుట.

6. నిర్మల హృదయలు ధన్యులు వారు దేవుని దర్శించురు.

దేవుని దర్శించాలంటే మనందరికీ ఒక నిష్కలంక హృదయం ఉండాలి, మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో నిర్మల హృదయం కలిగి జీవించాలి, ఎటువంటి సందర్భాలలో మన యొక్క క్రియల ద్వారా మాచల ద్వారా ఆలోచనల ద్వారా మన హృదయం కలుషితం కాకూడదు ఈ లోకంలో జీవించినప్పటికీని మనం మాత్రం దేవుని కొరకు కేవలం మంచి మార్గాన్ని అవలంబించాలి.

ఎవరైతే నిర్మల హృదయం కలిగి ఉంటారు వారు మంచి జీవితం జీవిస్తారు - యాకోబు 1:27.

నిర్మల హృదయులు తమ యొక్క ప్రతి పాపమును పాప సంకీర్తనం ద్వారా కడిగి వేసుకుని రక్షణను పొందుతారు - యిర్మయా 4:14.

నిర్మల హృదయలు దేవుని యొక్క సత్యం కు విధేయించి జీవిస్తారు 1పేతురు 1:22.

తన యొక్క అన్ని విషయాలలో నిర్మలత్వం కలిగి దేవుని దర్శిస్తారు ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లల వలె ఎటువంటి కల్మషం లేకుండా అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు.

దేవుడు మన నుండి కోరుకునేది కల్మషం లేని హృదయం కల్మషం లేని విశ్వాస జీవితం కల్మషం లేని ప్రేమ కల్మషం లేని స్వార్థం మనలో ఉండాలి.

7. శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు.

శాంతి స్థాపకులు అనగా మానవుల మధ్య శాంతి కొరకు కృషి చేసేవారు అదే విధంగా మానవులను దేవునితో సఖ్యపరిచేవారు శాంతిస్థాపకులు.

సమాజంలో ఉన్న విభజనలను కుటుంబాలలో ఉన్న కలహాలు పోగొట్టి ఒక మంచి బంధం నిర్మించుటకు కృషి చేసేవారు శాంతిస్థాపకులే. అదే విధంగా ఎవరైతే దేవునితో శాంతిని ఏర్పరచుకుంటారు వారు కూడా శాంతిస్థాపకులే - రోమి 5:1, ఎఫేసి  2:14-17.

మంచికి చెడుకు మధ్య పోరాటం చేసి కేవలం మంచిని మాత్రమే చేయువాడు శాంతిస్థాపకుడు. అనునిత్యం తమ యొక్క తోటి వారితో సఖ్యపడి శాంతిని ఏర్పరిచేవాడు ఇతరులను కూడా సఖ్య పడమని కోరేవాడు.

శాంతి స్థాపకులు కలహాలకు, విభేదాలకు, అసమానతలకు, వ్యత్యాసాలకు తావివ్వరు ఎందుకంటే అందరూ కలిసి ఉండాలన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం.

శాంతి స్థాపకులు శాంతిని ప్రేమిస్తారు, కాబట్టి శాంతిని నెలకొల్పుటకు కృషి చేస్తారు.

క్రీస్తు ప్రభువు మనలను తండ్రితో సఖ్యపరుచుటకు తన ప్రాణాలే అర్పించి కృషి చేశారు.

మనం కూడా ఇతరుల మధ్య శాంతి నెలకొల్పే వ్యక్తులుగా మారాలి.

8. ధర్మార్థము హింసితులు ధన్యులు దైవ రాజ్యము వారిది.

దేవుని కొరకు, దైవ సేవ కొరకు ఎవరైతే అనేక రకాల బాధలను అనుభవిస్తున్నారు వారు ధన్యులు అని ప్రభువు అంటున్నారు.

దైవ సందేశం అందించుటకు ప్రవక్తలు, శిష్యులు, సేవకులు అనేక రకాల హింసలను భరించాలి. ఏసుప్రభువు మూడు రకాల హింసల గురించి బోధించారు:

1. అవమానించబడటం దూషించబడటం - హీబ్రూ 11:36

2. శారీరక శ్రమలను అనుభవించటం కొట్టబడుట చంపబడుట శత్రహింసలు అనుభవించబడటం.

3. అన్ని రకాలైన నిందలను భరించటం శపించబడటం అబద్ద సాక్షాలు వారి గురించి చెప్పబడటం - కీర్తన 35:11, అపొ 17:6-7.

దేవుని కొరకు, ధర్మము కొరకు పోరాడే వారికి మాత్రమే ఈ హింసలు, నిందలు కాబట్టి అలాంటి వారు భయపడకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన రక్షణార్థం, అనేక హింసలు అనుభవించారు ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులు క్రీస్తు ప్రభువును ప్రకటించే సందర్భంలో అనేక హింసలు అవమానాలు నిందలు భరిస్తూనే ఉన్నారు.

ఏసుప్రభు బోధించిన అష్టభాగ్యాలు క్రైస్తవులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు అష్టభాగ్యాలను ఇంగ్లీషులో BE ATTITUDES అని అంటారు అంటే BE ATTITUDES అవే మన ATTITUDE గా ఉంటే మనం ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు.

అష్టభాగ్యాలు అనుసరణ మనల్ని మోక్షానికి చేర్చుతుంది. క్రీస్తు ప్రభువు పాటించి జీవించారు. కాబట్టి మనకి కూడా సాధ్యమవుతాయి,  అష్టభాగ్యాలు పాటిస్తూ ఒక మంచి సేవకులుగా దేవుని బిడ్డలుగా జీవించుదాం.

FR. BALAYESU OCD

23వ సామాన్య ఆదివారం

23వ సామాన్య ఆదివారం  యెషయా 35:4-7, యాకోబు 2: 1-5, మార్కు 7: 31- 37 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మెస్సయ్య కాలములో జరిగినటువంటి అద్భుతములను గుర...