18, మార్చి 2022, శుక్రవారం

తపస్సు కాల 3 వ ఆదివారం

తపస్సు కాల 3 వ ఆదివారం 

నిర్గ 3:1-8,13-15  1 కోరింథీ 10:1-6, 10-12 లూకా 13:1-9  

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా !ఈ నాడు మన తల్లి అయిన తిరుసభ తపస్సు కాల మూడవ ఆదివారంలోనికి  ప్రవేశిస్తుంది.  అయితే  ఈనాటి మూడు దివ్య గ్రంధ పఠనాలను  ధ్యానించినట్లయితే ముఖ్యముగా హృదయపరివర్తన గూర్చి భోధిస్తున్నాయి. 

మొదటి పఠనములో  మోషే ప్రవక్తను యిస్రాయేలీయుల  బానిసత్వం నుండి విడిపించుటకై ఎన్నుకుంటున్నాడు. ఇతని ద్వారానే తమ పూర్వులు కొలిచినటువంటి యావే దేవుని గూర్చి  తెలియ చేస్తున్నాడు. 

రెండవ పఠనములో  మనం చూస్తే  ఈలోక  సంబంధమైన  విషయములపై , వస్తువులపై విగ్రహములపై మన మనస్సులను  లగ్నం చేయక,  ఆధ్యాత్మిక శిలయగు యేసు క్రీస్తునందు జాగ్రత్త కలిగి జీవించాలి అని తెలియజేస్తుంది. 

సువిశేష పఠనములో మనం చూస్తే, హృదయ పరివర్తనం గురించి మరియు ఫలభరితమైన జీవితం గురించి భోదిస్తుంది. 

మొదటి పఠనం :- 

ఈనాటి మొదటి పఠనములో ముఖ్యముగా మోషే ప్రవక్త ఎన్నికను మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడంటే, యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు బానిసత్వంలో మునిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. వారిని ఎంతో ఘోరంగా చూసెడివారు. వారిని బానిసలుగా ఎంచి ఇటుకలు చేయడానికి ఇల్లు కట్టడానికి ఇలా ఎన్నో రకాలుగా వారిని వాడుకుంటూ చిత్ర హింసలకు గురిచేసెడివారు. నిర్గ 2:23. అటువంటి సమయంలో యిస్రాయేలు ప్రజలు దేవుని సహాయాన్ని అర్ధించారు. అప్పుడు ఆర్తనాదాలు దేవుని చెవిన పడి వారిని రక్షించడానికి ఈ మోషే ప్రవక్తను ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. 

మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్గ 3:1 లో ఇతను తన మామ అయినటువంటి యిత్రో మందలను మేపెడివాడు. తనకంటూ ఏమి లేదు. తన మామ దగ్గర సేవకుడుగా జీవించాడు. తన గొర్రెల నిమిత్తం మోషే హోరెబు కొండకు  వెళ్ళాడు. ఈ హోరెబు  కొండ అంటే దేవుని కొండ అని అర్ధం. దేవుడు నివసించే  ప్రదేశమునకు దేవుని చేత కొండకు నడిపింపబడ్డాడు. ఎప్పుడైతే మోషే  ఆ కొండ దగ్గరికి వచ్చాడో అక్కడ  దేవుని సాక్షాత్కారాన్ని చూసాడు. నిర్గ 3:2.  అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత  అతనికి సాక్షాత్కారించేను. యోష  6:1-2 లో చూస్తే  ప్రభువు ఉన్నతమైన సింహాసనము పై  ఆసీనుడై ఉండెను. అతనికి పై భాగమున జ్వలించుచున్న  సెరాఫీము దేవ దూతలు నిల్చియుండిరి అని చదువుచున్నాం. అదే విధంగా సమువేలు కూడా దేవుని దర్శనములు ఎప్పుడు లభించుచునే ఉండెను. 1 సమూ 3:21. ఇలా ఎంతో మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఆయన యొక్క మహిమను తెలియ చేస్తున్నాడు. 

ఎందుకు దేవుడు తన పనికి ఎంతో మందిని పిలుస్తున్నాడు? 1. శ్రమలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయడానికి.(నిర్గ 3:7-8) 2. పాపములో ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించడానికి (యోనా 3:4-6) 3. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి (నిర్గ 3:14) 

దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమంటే, దేవుని  గూర్చి భోధించాలి. కానీ ఈ సమాజంలో మనం చూస్తే ఎంతో మంది దేవుని మాటలను వినడానికి, దేవుని చెంతకు రావడానికి, ఆయనను గురించి  భోదించదానికి వెనకాడుచున్నారు. మోషే ప్రవక్త జీవితంలో చూస్తే ఆయన దేవుని మాట శిరస్సా వహించి 1. ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నవాడైన దేవుని గురించి తెలియ చేశాడు. 2. ఫరో రాజు దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క ప్రణాళికను అతనికి తెలియజేసి ఎన్నో విపత్తుల తర్వాత ప్రజలను ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు తీసుకెళ్ళాడు. 3. దేవుని ఆజ్ఞలను వారికి అందించాడు. 4. వారి గురించి ప్రార్దన చేశాడు. 

ఈనాడు నీవు నేను కూడా క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరిస్తున్నవాడు. కాబట్టి మనం కూడా మోషే ప్రవక్తవలే , ఇంకా ఇతర ప్రవక్తల వలె దేవుని మాట శిరస్సా వహించి, దానిని పఠిస్తూ, పాటిస్తూ దానిని ఇతరులకు పంచుదాం. దేవుని యొక్క ప్రేమను ప్రణాళికను తెలియచేద్దాం. 

సువిశేష పఠనం లూకా 13: 1-13 

ఈనాటి  సువిశేష పఠనం ముఖ్యంగా హృదయ పరివర్తన గురించి తెలియచేస్తుంది. దేవుడు ఎలాగా వారిపై జాలి చూపిస్తున్నాడు. తన కరుణను తెలియచేస్తున్నాడని తెలుపుతుంది. అయితే ఈ సువార్త పఠనం లూకా 12 వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే లూకా 12 వ అధ్యాయంలో మొదటి మూడు వచనములలోకపట ప్రవర్తనను గూర్చి జాగరూపులై ఉండాలి అంటున్నాడు. 

4 నుండి 7 వ  వచనములలో  ఎవరికి మనం భయ పడాలి. ఎవరికి భయ పడకూడదని  తెలుపుచున్నాడు. మనం ఎవరికి భయ పడాలి అంటే  మన శరీరమును నాశనం  చేయు వారికి భయపడకూడదు. కానీ మిమ్ము చంపి నరక కూపములో పడవేయగల వానికి భయ పడాలి అని తెలుపుచున్నాడు. 

8 వ వచనం నుండి 12 వ వచనములలో  దేవునికి బహిరంగ సాక్షులుగా మారాలి అని భోదిస్తున్నారు. అట్టి వాడిని దేవదూతల ఎదుట  అంగీకరించును, వారు ఎట్లు మాట్లాడవలయునో పవిత్రాత్మ ద్వారా తెలుపబడును. 

ఇలా జీవించుటద్వారా  ఈ లోక సంబంధమైన విషయములపై , లోకాశలపై చింతించక దేవుని రాజ్యమును, నీతిని వెదుకుతారు అప్పుడు వారికి అన్నియు సమకూర్చబడును అని 13 వ వచనం నుండి 31 వరకు తెలుపుచున్నది. 

మరి ఎందుకు దేవుడు తన రాజ్యమును ఇస్తాడు అంటే ఇది తన ఇష్టం ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము దానిని చేద పురుగులు తినివేయవు. లూకా 12:32-33. 

ఈ రాజ్యం కోసం ప్రతి ఒక్క సేవకుడు  సిద్ధ పాటు కలిగి జీవించాలి. లూకా 12:32. ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ గడియాలో వస్తాడో తెలియదు. లూకా 12:40. ఈ సిద్ద పాటు ద్వార ప్రతి ఒక్క సేవకుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. లూకా 12:43. అలా జీవించనిచో తన యజమాని చేతిలో కొరడా దెబ్బలతో కఠిన శిక్ష ఉంటుంది. లూకా 12: 47-48. 

అప్పుడు తమ జీవితంలో విభేదాలు ఏర్పాడుతాయి. ఈ విభేదాలు ద్వార  తండ్రి కుమారున్నీ, కుమారుడు తండ్రిని,  తల్లి  కుమార్తెను , కుమార్తె తల్లీని, అత్త కోడలని, కోడలు అత్తని ఎదురిస్తారు. లూకా 12:53. ఇలా జరగకుండా ఒకరినొకరు సఖ్యత కలిగి జీవించినట్లయితే దేవుని శిక్షకు అర్హులు కాక ప్రేమకు పాత్రులవుతారు. 

ఇప్పుడు మనం సువిశేష పఠనం క్లుప్తంగా  పరిశీలిద్దాం. ఈనాటి సువిశేష పఠనం  ఒకే అంశము గురించి చర్చించిన  రెండు భాగాలుగా విభజింపబడింది. 1. ఇతరులను వ్రేలుఎత్తి  చూపడం 2.మనల్ని మనం మార్చుకోవడం. 

1. ఇతరులను వ్రేలెత్తి చూపడం : హృదయ కాఠిన్యం :- మొదటి వచనంలో చూస్తే, కొంత మంది యేసు ప్రభువు దగ్గరికి కొంత మంది వచ్చి గలీలియా విదేశీయలను చంపిన వదంతులను తెలియ చేస్తున్నారు. అప్పుడు యసు , గలిలీయా  సిలోము బురుజు కూలి  ప్రజల మరణం వారికి తెలియ చేస్తూ , హృదయ పరివర్తన  చెందనిచో అందరు అట్లే  నాశన మగుదురు అని చెప్పుచున్నారు. లూకా 13:1-5. 

అయితే ఇక్కడ పిలాతు గలీలియ దేశీయులను ఎందుకు చంపిస్తున్నాడంటే, సలోమోను  కాలంలో పిలాతు ఒక నూతన  జెరుషలేమును నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ  ప్రజల దగ్గరకు వెళ్ళి వారు దేవునికి సొమ్ములో కొంత భాగం  పిలాతుకు ఇవ్వాలని వార్తనందించాడు. కానీ ప్రజలు దానికి అంగీకరించలేదు. అటువంటి సమయంలో పిలాతు తన సైనికులను వారి దగ్గరకు మారు వేషంలో పంపించి బలులు అర్పించు సమయంలో వారి మీద పడి చంపించేశాడు. 

అదే విధంగా  శిలోయములో మరణించిన ప్రజల జీవితాలలో చూస్తే  అక్కడ కాల వైపరీత్యం వల్ల అక్కడ నిర్మించినటువంటి బురుజు కూలి మరణిస్తున్నారు. అయితే మరణం  ఎప్పుడు, ఎలాగా , ఎటువంటి సమయంలో సంభవిస్తుందో తెలియదు. కాబట్టి దానికంటే ముందు మనం మార్పుచెందాలి. 

అయితే ఇక్కడ ప్రజల ఏ విధంగానైతే  గలీలియ ప్రజల మరణంను  వ్రేలెత్తి చూపకుండా, దేవుని యొక్క రాకడ కోసం సిద్దపాటు కలిగి జీవించాలి. అప్పుడే మనం  హృదయ పరి వర్తనం చెంది మారు మనస్సు పొందుతాం.  

ఆమోసు 1:3,6,9,11,13 వచనములలో మనం చూస్తే అక్కడ ప్రజలపై జాలి లేకుండా దమాస్కు , గాజా , తూరు ప్రజలు తరచూ పాపం చిసిరి కాన నేను వారిని దండించి తీరుతాను అని దేవుడు పలుకుచున్నారు. వారు ఏమి చేస్తున్నారంటే 

ఆమోదు ప్రజలు గిలాదు గర్భవతుల కడుపులు చీల్చివేశారు. ఆమోసు 1:13 

మోవాబు ప్రజలు ఏదోము రాజు ఎముకలను బుగ్గి అగునట్లు కాల్చి వేశారు. ఆమోసు 2:1-2 

యూదా ప్రజలు దేవుని ఉపదేశములను తృణీకరించారు. ఆజ్ఞలను పాటింపలేదు. ఆమోసు 2:4-5 వారి పితరులు కొలచిన దేవతలను కొలిచి అపమార్గము పట్టారు. 

యిస్రాయేలు ప్రజలు బాకీలు తీర్చలేని సజ్జనులను చెప్పుల జోడు కరీదు కూడా చేయలేని పేదలను బానిసలుగా అమ్మివేశారు. ఆమో 2:6 

ఈ ఆమోను, మోవాబు , యూద  యిస్రాయేలు ప్రజలు ఇతరులను ఎలాగైనా  నాశనం  చేయాలని పూనుకొని ఇంత ఘోర పాపానికి ఒడి గట్టారు. మరి అటువంటి వారి మీదకు నిప్పులు కురిపింతును అని పలుకుచున్నారు. వారి హృదయంలో కాఠిన్యం కారణముగానే వారు ఇంత పాపానికి ఒడి గట్టారు. 

యవేలు 2:12 లో ప్రభువు  ఇట్లనుచున్నాడు. ఇప్పుడైనను  మీరు పూర్ణ హృదయముతో  నా చెంతకు మరలిరండు మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసి కొనుడు అంటున్నాడు. 

కాబట్టి తపస్సు కాలంలో  నీవు నేను దేవుని చెంతకు పూర్ణ హృదయముతో వచ్చి మనం చేసిన పాపములను ఒప్పు కోవాలి అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. 

ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో కాల విపత్తుల ద్వారా భూకంపము, రోగములు, సునామీ వర్షము , కరొన  ఎంతో మంది మరణిస్తున్నారు. ఇలా మరణించడం వారి తప్పిదముల వల్ల కాదు కానీ ఈ లోక వైపరీత్యాల వల్ల జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇదే మొదటి భాగంలో దేవుడు అనేది. ఆట్లు చంపబడిన గలీలియ వాసులకంటే, శీలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది  తక్కిన యెరుషలేము నివాసులకంటే ఎక్కువ పాపులని, అపరాధులని ఎంచుచున్నారా?అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులను నిందించకుండా సిద్దపాటు కలిగి పాశ్చాత్తాపములో దేవుని చెంతకు తిరిగి రావాలి. 

2.  మనల్ని మనం మార్చుకోవాలి :-

ఇక్కడ రెండవ భాగంలో  అంజూరపు చెట్టు గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టును యూదా ప్రజలకు ఉదాహరణగా తీసుకొనుచున్నాడు యేసు ప్రభువు లూకా 13:6 లో చూస్తే ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించేను అంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సూచిస్తుంది. దేవుడు ఈ లోకములో ఉన్నటువంటిలో కెల్ల యూదా ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకోంటున్నారు. ఎందుకంటే వారికి సురక్షితమైన జీవితాన్ని ఇవ్వడానికి.  ఈ సురక్షిత జీవితం ద్వార వారు ఎప్పుడు దేవునికి వినయ విధేయత చూపిస్తూ, పండ్లు అను మంచి పనులను వారి నుండి  ఆశించాలనుకున్నాడు. కానీ వారు ఎప్పుడు వారి స్వార్ధం కోసమే జీవిస్తూ, దేవునికి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఆది కాండం 2:1 లో ఈ విధంగా ఆకాశం భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా  రూపొందెను అని తెలుపుచున్నాడు. ఇదంతా సృష్టించిన తరువాత దేవుడైన యావే ఏదేనులో తూర్పుగా ఒక తోట వేసి అందులో తాను సృజించిన నరుని ఉంచాడు. ఆదికాండం 2:8. వారు సంతోషముగా జీవించుటకు, తినుటకు  తియ్యని పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేశాడు. తరువాత నరుని సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు.

 దేవుడైన  యావే వారిని సృష్టించిన తరువాత ఈ నేలపై అన్ని రకాలైన  మృగములను , పక్షులను సృజించి వాటిపై మానవునికి ఆధికారాన్ని కలుగజేశాడు. దేవుడు వారిని ఎంతో ప్రేమించి ముందుగా 1. ఈ లోకాన్ని సృష్టించి,2. సమస్త వస్తువులను రూపొందిచాడు, 3. వారు నివసించుటకు ఏదేను తోటను ఎన్నుకొన్నాడు. 4. ఆ తోటలో నరునికి నివాసం ఏర్పరిచాడు. 4. రుచికరమైన పండ్లనిచ్చాడు. 6. ఆయన సంతోషం కోసం స్త్రీని సృష్టించాడు,7. తరువాత వారికి అన్నింటిమీద ఆధికారం కల్పించాడు. 

దేవుడు ఇన్ని చేసిన కానీ దేవుడు చెప్పిన మాటకు విరుద్దముగా జీవించారు. వారిని తినవద్దని చెప్పిన పండును తిన్నారు. దీని ద్వారా వారిని ఆ తోట నుండి పంపివేస్తున్నాడు. 

మరి ఈనాడు సువిశేష పఠనంలో  దేవుడు అంజూరపు చెట్టు పై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తన తోట మాలితో ఇదిగో నేను మూడెండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చు చున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు అంటున్నాడు. దేవుడు దేవుడు ఎన్నోసార్లు మనం మారుమనస్సు పొందాలని ఎదురుచూశాడు కానీ మనం మాత్రం  మారు మనస్సు పొందకుండా  స్వార్ధపు జీవితాన్ని దూరంగా వేదలిపోతున్నాం. యోష 1: 2 లో చూస్తే " భూమి, ఆకాశములారా! వినుడు, నేను పెంచి పెద్ద చేసిన ప్రజలే నన్ను విడనాడిరి అంటున్నాడు. దేవుడు ఎంతో బాధతో ఆకాశము, పక్షులతో  మాట్లాడుతున్నారు. తనతో ఉండటానికి మానవుణ్ణి సృష్టిస్తే మనం మాత్రం  మన స్వార్ధం కోసం చూసుకుంటున్నాం. 

తరువాత వచనంలో  దీనిని నరికి వేయుడు (లూకా 13:7  )  ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అంటున్నాడు. 

అప్పుడు తోటమాలి తన యజమానికి ప్రార్ధన చేస్తున్నాడు. అయ్యా !ఇంకొక యేడు ఓపిక పట్టుడు అంటున్నాడు. పాత నిబందనలో చూసినట్లయితే అబ్రహాము గారు దేవుడు సొదొము, గోమోర్ర ప్రజల పాపం పెరిగిపోయినప్పుడు దానిని నాశనం చేయపునుకొనినప్పుడు అబ్రహాము గారికి దాని గురించి వివరించాడు. ఎందుకంటే, 1. సర్వ శక్తి వంతమైన ఒక మహా జాతి ఇతని వల్ల ఏర్పడుతుంది. 2. భూమండలమందంతట సకల జాతి జనులు దీవెనలు పొందుతారు. 

మరి ఆటువంటి వ్యక్తికి దేవుడు తన ప్రణాళికను తెలియజేస్తున్నాడు. అప్పుడు అబ్రహాము ప్రభువుకి ఆరు సార్లు ప్రార్దన చేయుచున్నాడు. వారికి శిక్ష ఎలాగైనా పడకుండా చూడాలని 50 మంది నుండి 45 కు చేశాడు, 45 నుండి 40 కి చేశాడు, 40 నుండి 30 కి, 30 నుండి 20 కి , 20 నుండి 10 కి చేసి వారిని ఎలాగైనా రక్షించాలని ఎంతో ధైర్యం చేశాడు. కానీ వారి పాపం వలన వారిని అగ్ని దహించి వేసింది. 

ఈనాటి సువిశేష పఠనంలో కూడా ఇలాంటి సన్నివేశాన్ని చూస్తున్నాం. యజమానుడు అనే యావే దేవుడు, తోటమాలి అనే యేసుప్రభువుకు అంజూరపు చెట్టు అనే జనాంగాన్ని యిచ్చియున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ పరివర్తనం చెందకుండా పశ్చత్తాపపడకుండా దేవుని నుండి దూరమైపోతున్న వారికోసం ప్రార్థన చేస్తున్నాడు లూకా 13:8; అయ్యా ఇంకొక ఏడు ఓపికపట్టుడు నేను దీని చుట్టూ పాదుచేసి, ఎరువు వేసెదను అంటున్నాడు.

పాదుచేయటం అంటే యేసుప్రభువు మూడు సంవత్సరములు తన శ్రమలు, మరణము, మరియు పునరుత్తానముల ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది అని తెలియజేసాడు.

దేవుడంటున్నాడు యెషయా 14:18 నేను మిమల్ని ఆనాధులుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. మన దేవుడు ఫలభరితముగా ఉన్న మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయనకు ఎప్పుడు అంటుకట్టుకొని జీవించు బిడ్డలుగా మారుస్తాడు.నేను ద్రాక్షావల్లిని మీరు నా కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను వాని యందు ఉందును అతడు అధికముగా ఫలించును యోహాను 15:5.

ఎరువు వేయటం :-    

యేసుప్రభువు తన జీవితం ద్వారా మనకు దృఢతవాన్ని కలుగచేస్తునాడు. ఇది ఎలాంటి ఎరువు అంటే ప్రార్ధన అనే ఎరువు, ఉపవాసం అనే ఎరువు, ధన రుణ అనే ఎరువు, క్షమాపణ అనే ఎరువు, వినయం అనే ఎరువు, విశ్వాసం అనే ఎరువు.

ఇలాంటి ఎరువుల ద్వారా దేవుడు మనలో హృదయ పరివర్తన కలిగించి మనలను ఫలవంతముగా చేస్తుంటాడు. ఇలా ఫలవంతంగా మారిన మనము ఇతరులకు ఆహారముగా మారుతుంటాము. దీని ద్వారా ఇతరులకు మంచికార్యాలు  చేస్తూ దేవునికి సాక్షులుగా జీవిస్తుంటాం. ముందు చూపినట్లుగా కపట ప్రవర్తనను మార్చుకొని జాగరూకులై ఉంటూ ఈలోక సంబంధమైన వ్యక్తులకు, వస్తువులకు భయపడకుండా ఎన్నో శ్రమలు అనుభవించినాకూడా సిద్ధపాటు జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునికి బహిరంగ సాక్షులుగా జీవిద్దాం. ఆలా జీవించనిచో ఈ అంజూరపు చెట్టును ఏవిధంగానైతే ఫలించకపోతే కొట్టి పారవేస్తారో మన జీవితంకూడా అదేవిధంగా జరుగుతుంది.ఈ నాటి రెండొవ పఠనంలో కూడా పునీత పౌలుగారు అదే బోధిస్తున్నారు.

రెండవ పఠనము :-1 కొరింతు 10 : 1-6 , 10 - 12

మన పూర్వులు మేఘముక్రింద ఉండినపుడు వారు సముద్రమును దాటి సురక్షితముగా అవతలకి చేరారు కానీ  వారు ఎప్పుడైతే దేవునిమీద సణుగుకొని దేవునికి విరుద్ధముగా జీవించారో  విగ్రహములను ఆరాదించారో, వ్యభిచరించారో అప్పుడు 25 వేలు మంది మరణించారు. పాము కాటుతో ఎంతోమంది మరణించారు కాబట్టి ఈ చిట్టచివరి రోజులలో తపస్సు కాల రోజులలో ప్రార్ధన, ఉపవాసం, దాన ధర్మ క్రియలను పాటించు రోజులలో మనం దేవునితో, దేవుని సన్నిధిలో మనం మన నివాసాన్ని దేవునితో ఏర్పరుచుకొని, ఆయనకు వినయ, విధేయతను చూపిస్తూ జాగ్రత్తగా అయన యొక్క రక్షణ ప్రణాలికను మన సాక్షపు జీవితం ద్వారా తెలియజేయాలి అప్పుడే మన జీవితం ఫలవంతమవుతుంది.



బ్రదర్ . జోసెఫ్  మారియో ఓ.సి.డి.

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...