15, మే 2021, శనివారం

క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

       క్రీస్తు మోక్షారోహణ మహోత్సవము

 అ. పో 1: 1-11

 ఎఫెసీ 1: 17-23

 మార్కు 16: 15-26

క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరీసహోదరులారా, ఈ రోజు మనము క్రీస్తు మోక్షరోహణ పండుగ జరుపుకుంటున్నాము. ఇది అత్యంత ముఖ్యమైన పండుగ. క్రైస్తవ జీవితాలకు ఇది మరో మహోన్నతమైన మలుపును దిద్దే పండుగ. ఈ పండుగ మనలను దేవునికి సాక్షులుగా ఉండ ఆహ్వానిస్తుంది.

క్రీస్తు ప్రభువు మరణించిన పిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా పలుమారులు శిష్యులకు కనిపించుచు, తాను సజీవుడని వారి సందేహములు తొలగునట్లుగా ఋజువు పరచు కొనెను. వారికి కనబడటమే కాక దేవుని రాజ్యము గూర్చి వారికి బోధించెను. ఈ మాటలు పలికిన పిమ్మట వారు చూచుచుండగా అయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను (అ. పో 1: 3-9). క్రీస్తు ఉత్తానుడైన పిదప నలువది దినములకు ఈ మోక్షరోహణము అపొస్తలుల ఎదుట జరిగింది. అప్పటి నుండి శిష్యులు ఈ గొప్ప రహస్యాన్ని విశ్వసించి ప్రకటించడము ప్రారంభించారు. 


 దైవ సహాయముతో


పవిత్రాత్మ మీపై దిగివచ్చినప్పుడు
, మీరు శక్తిని పొందుతారు. మీరు నా సాక్షులుగా రాజిల్లుతారు. ఈ మాటలు ప్రభువు తన  తండ్రితో పరలోక మహిమలో ప్రవేశించే ముందు పలికిన చివరి
మాటలు.  ఈ మాటలు ఆయన రక్ష సాధన కర్తవ్యాన్ని, ఆయన రక్షణ కార్యానికి సాక్షులుగా నిలవాల్సిన శిష్యుల కర్తవ్య  బాధ్యతను ఎత్తి చూపుతున్నాయి.  వారి కర్తవ్యము, బాధ్యత సువార్తను ప్రకటించడము,  రక్షణ  సువార్తను ఇశ్రాయేలు ప్రజలకే కాక, ప్రపంచములోని అన్ని జాతుల వారికి ప్రకటించడము.  

ఎందుకంటే దేవుని ప్రేమ రక్షణానుగ్రహము ఏ కొందరికో లేక ఏ ఒక్కజాతికో పరిమితమైనది కాదు.  అది ప్రపంచానికంతటికి, అంగీకరించే ప్రతి ఒక్కరికి చెందినది. దేవుని సువార్త అనేది ప్రజలను తమ అపరాధ, పాప బానిసత్వాలనుండి, భారము నుండి విడుదల చేసే దేవుని శక్తి గలది. మనలను స్వస్థపరచి పునరుద్ధరించి పరిపూర్ణులను చేయగల శక్తిమంతమైనది దేవుని వాక్కు. ఆ వాక్కును ప్రకటించడానికి దేవుడు శిష్యులను ఎన్నుకుని వారిలో పవిత్రాత్మను నింపాడు.

 అనునిత్యము ప్రకటించండి

    సువార్త వ్యాప్తి అనేది నిరంతరము కొనసాగించవలసినది. ఎందుకంటే క్రీస్తు ప్రేషిత కార్యము అన్ని కాలాలకు సంభందించినది. అయితే ఈ కర్తవ్య నిర్వహణ బాధ్యత కేవలము అభిషేకము పొందిన కొందరికి మాత్రమే అప్పగింపబడలేదు. క్రీస్తే నిజమైన రక్షకుడని విశ్వసించే అందరికి అప్పగింపబడినది. ఆనాటి క్రైస్తవ సంఘము ఈ ఆజ్ఞను బాగా అర్ధము చేసుకుని, చక్కగా పాటిచింది. కనుకనే సువార్త సందేశము వేగముగా విస్తరించింది. అయితే ఈ నాటి కాలములో సువార్త పరిచర్యలో ఏర్పడిన అధికార కేంద్రీకరణ కారణముగా అది మలుపు తిరిగి కేవలము అభిషిక్తుల ప్రధాన పరిచర్యగా మారిపోయింది.

ఉత్తాన ప్రభువు అప్పగించిన ఈ గొప్ప బాధ్యత, శ్రీ సభలోని విశ్వాసులందరికి  చెందినదన్న నిజాన్ని గ్రహించాల్సిన సమయము వచ్చింది. రెండవ వాటికన్ మహాసభ అందించిన, "గృహస్థ క్రైస్తవుల అపోస్తొలిక" అను అధికార పత్రములో తెల్పిన  విధముగా, సువార్త ప్రకటన అనేది బాప్తిస్మము స్వీకరించిన ప్రతి ఒక్కరికి ప్రభువు అప్పగించిన బాధ్యత. క్రైస్తవునిగా జీవించడము అంటేనే ప్రభువుకు సాక్ష్యము పలుకడము. ప్రభువు సువార్తను ప్రకటించడము. పునీత అస్సిసి పూరి ఫ్రాంచీసువారు  చెప్పిన విధముగా మాటలలోనే కాదు, చేతలలోను, జీవిత విధానములో కూడా సువార్తను ప్రకటించవచ్చు.

జీవిత సాక్ష్యము:

సమాజములో ఒక మంచి వ్యక్తిగ పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి, తన వృధాప్యములో తన ముగ్గురు కుమారులను పిలిచి నేను మరణించిన తరువాత మీరు నా పేరును ఎలా నిలబెడతారుఅని అడిగాడు. పెద్ద కొడుకు అందుకు సమాధానము చెబుతూ, మీలో ఉన్న గుణాలను అన్నిటిని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ముంద్రించి, అందరికి పంచుతాను. దానిని చదివిన ప్రతి ఒక్కరు మీ గురించి తెలుసుకుంటారు అని అన్నాడు. ఇక రెండవ వాడు తండ్రి గౌరవార్థము నగరము మధ్యలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని, అప్పుడు  అందరికి తండ్రి పేరు ప్రతిష్టలు స్థిరముగా తెలుస్తాయని, అప్పుడు తండ్రి పేరు నగరములో చిరస్థాయిగా నిలుస్తున్నాడని అన్నాడు. కానీ చిన్న కుమారుడు మాత్రము అందరు నన్ను మీ కుమారునిగా గుర్తించే విధముగా మీ అడుగుజాడలలో నడుస్తూ  మంచిగా జీవిస్తాను అని అన్నాడు.
పుస్తకాన్ని ప్రచురించడము ద్వారా, విగ్రహాన్ని ప్రతిష్టించడము ద్వారా కుమారులు తమ  తండ్రికి జీవిత సాక్ష్యాన్ని ప్రదర్శించడము లేదు. కానీ ఆయనలా మంచిగా జీవించడము
ద్వారా ఆయన మంచితనము ఎల్లయెడల వ్యాపిస్తుంది. అదే విధముగా క్రీస్తు సువార్తను 
మనము మాటల ద్వారా, పుస్తకాల ద్వారా, మందిరాల ద్వారా కన్నా, మన జీవిత సాక్ష్యము ద్వారా మరింత స్పష్టముగా తెలియజెప్పిన వారలమవుతాము. కాబట్టి దేవుని  వాక్యాన్ని విందాము, పాటిద్దాము, ఆయన సాక్షులుగా జీవిద్దాము.ఆమెన్


Bro. Ratnaraju Abbadasari OCD

ఇరవై ఎనిమిదవ ఆదివారము

సొలొమోను జ్ఞానం గ్రంధం 7:7-11 హెబ్రియులు 4:12-13 మార్కు 10:17-30  క్రీస్తునాదునియాందు ప్రియా సహోదరి సహోధులరా, ఈనాడు మనమందరం కూడా సామాన్య కాల...