16, ఏప్రిల్ 2022, శనివారం

క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

 క్రీస్తు పునరుత్థాన మహోత్సవం 

యేసు ప్రభువు తన ఉత్థానం ద్వారా మన చీకటి అంతటినీ వెలుగుగా మలచారు. ఈ రోజు  యేసు ప్రభువు ఉత్తనమైన రోజు.  ఒక సమాధి పై పెద్ద బరువైన  రాయి దొర్లించబడి, ఆ సమాదిలోని దేహం  లేచి రాకుండా కావలికాయడానికి సైనికులు కాపలా ఉంచబడిన సమాధి. ప్రపంచ చరిత్రలో ఒకే  ఒకటి. అదియే  యేసు ప్రభువు సమాధి. యేసు ప్రభువు మరణానికి కారకులైన ప్రధానర్చకులు, పరిసయ్యులు కలసి యూదయ రాష్ట్ర పరిపాలకుడైన పిలాతు దగ్గరిని పోయి ఇలా విన్నవించారు. 

అయ్యా! ఆ మోసగాడు యేసు జీవించి ఉన్నప్పుడు , నేను మూడు దినాలు తరువాత జీవంతో లెతును అని చెప్పినట్టు మాకు జ్ఞాపకమున్నాడు. అతని శిష్యులు  అతనిని సమాధి నుండి  దొంగిలించుకొని పోయి మృతుల నుండి జీవంతో లేచెను అని ప్రజలకు చెప్పుదురేమో, అప్పుడు మొదటి మోసం కంటే ఇది మరి ఘోరముగా వుండును కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రపరప అజ్ఞాపింపమని చెప్పిరి. అందుకు పిలాతు మీకు కావలివారు వున్నారు గదా! పోయి మీ చేతనైనంత వరకు సమాధిని కాపలా  చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతి పై ముద్ర వేసి కావలివారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. మత్తయి 27:63-66 లో ఇది అంత చూస్తున్నాము. 

ఆదివారం ప్రాతః కాల సమాయమన పెద్దగా  భూమి కంపించేను . ఎలయన పరలోకం నుండి దేవ దూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను. కాపలాదారులు భయపడి చని పోయిన వారి వలె పడి పోయెను. అంతలో అక్కడికి వచ్చిన స్త్రీతో ఆ దేవదూత భయ పడకుడు  మీరు శిలువ వేయబడిన యేసును వెదకుచున్నారా ? ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచెను అని చెప్పెను.  ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కాపలా కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ఆ ప్రధానార్చకులకు పరిసయ్యులకు చెప్పిరి. 

ప్రభువు దర్శనం - ఖాళీ సమాధి 

మీరు భయపడకుడు. శిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన పునరుత్థానుడైనాడు, ఇక్కడ లేడు, వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు మార్కు 16:6. క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా దేవుని బిడ్డలారా ప్రభుని ఉత్థాన మహోత్సవం , మనం జరుపుకునే పండుగలన్నింటిలో క్రీస్తు ఉత్థాన పండుగ ఒక అత్యంత గొప్ప పండుగ. ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు విశ్వాసులందరు కలసి, క్రీస్తు ప్రభువు యొక్క ఉత్థానాన్ని , ఉత్థాన సందేశమును ప్రపంచానికి , సర్వ మానవాళికి ప్రకటించుచున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు తన వెలుగును,శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యం పొందుకొని మొదటగా ఖాళీ సమాధిని దర్శించిన ముగ్గురు వ్యక్తులు మగ్ధలా మరియమ్మ , పేతురు, యోహను. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకే నిరీక్షణ , ఒకే ఎదురు చూపును చూస్తున్నాము. 

యెరుషలేములో జరిగిన ఈ సంఘటనల తరువాత శిష్యులందరు భయాందోళనలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పేతురు నేను ఆయనను ఎరుగాను అని మూడు సార్లు బోంకారు. యోహను 18:27. 

యోహను శిలువ  వరకు క్రీస్తు ప్రభుని వెంబడించినను ఎంతో భయపడ్డాడు. మగ్ధలా మరియమ్మ  యేసు ప్రభువును అనుసరించడం నేర్చుకొన్న స్త్రీ. ఈమె ప్రభువును అధికంగా ప్రేమించినది. కలువరి కొండవరకు ఆయనను అనుసరించినది. ఆయన శిలువ పై వ్రేలాడే సమయంలో ఆయన ప్రక్కనే ఉన్నది. ఆయన చనిపోవడం చూసినది. ఆయనను సమాధిలో ఉంచడం చూసినది. ఒంటరిగా , దుఃఖంతో నిండిన హృదయముతో ఆదివారం పెందలకాడనే సమాధి దగ్గరకు వెళ్ళి యేసు భౌతిక దేహాన్ని చూసి విలపించాలి అనుకున్నది. ఆయన భౌతిక దేహానికి సుగంధం పూసి అలంకరించాలి అనుకున్నది, ఆయన భౌతిక దేహాన్ని దర్శించుకోవాలి అనుకున్నది. చివరికి సమాధి దగ్గరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఈ ముగ్గురు కూడా క్రీస్తును వెదకడం మనం ఈనాటి సువిశేషంలో వింటున్నాము. వారు కూడా సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ అంత చీకటిగా ఉంది. సమాధి రాయి తొలగించబడి వుంది. వారు లోనికి వెళ్ళి ఖాళీ సమాధిని గుర్తించారు. 

క్రీస్తు దేహము అక్కడ వారికి కనిపించలేదు. వారికి ఆ పరిస్థితి అర్ధం కాలేదు. రకరకాల అనుమానాలు వారి మదిలో మెదిలాయి. ఖాళీ సమాధికి ఒక అర్ధం లేదు అనిపించింది. వారు ఖాళీ సమాధిని చూసి ప్రభువును విశ్వసించలేదు, నమ్మలేదు కానీ ఆ సమాధిని చూసి వారు  నిరాశ చెందలెదు. వారిలో ఎక్కడో ఆశలు చిగురించాయి. వారు ఆయనను వెదకటం ప్రారంభించారు. దేవ దూత అడుగుతుంది !అమ్మ నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? యోహను 20:15. అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపు వెళ్ళిరి. అయిద్దరును పరుగెత్తుచుండిరి.కానీ ఆ శిష్యుడు  పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. యోహను 20:3-4. ఈ విధముగా ప్రభువును వెదకడం లో వారు ఆయనను కనుగొన్నారు. ఆయన దర్శన భాగ్యమునకు అర్హులైనారు. ఖాళీ సమాధి వారిని ఒక నూతన జీవితం వైపు నడిపించినది. వారి జీవితాలలో ఒక క్రొత్త ఆశను రేపినది. వారికి మార్గాన్ని చూపినది. ప్రియమైన మిత్రులారా వారిలోని తాపత్రయం, ఆశ, వారి ఆత్మ విశ్వాసం ఉత్థాన ప్రభువు దర్శనానికి తోడ్పడినది. 

వారంత ప్రభు దర్శనానికి   అనేక సార్లు నోచుకోని, వారు చూసిన ఖాళీ సమాధి నిజమని, ఒక వైపు ఖాళీ సమాధి, మరో వైపు ప్రభువు దర్శనం ,ఈ రెండు అంశాలు కూడా వారు విశ్వాసంతో వేదకడానికి తోడ్పడినవి. 

ప్రియమైన స్నేహితులారా మన రోజు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు,ఆటంకాలు, ఊహించని సంఘటనలు మన జీవితాన్ని ఒక ఖాళీ సమాధిగా చేస్తాయి. మన స్నేహితులుగాని కుటుంబ సభ్యులు గాని చనిపోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మన ప్రేమ ఫలించనప్పుడు మన జీవితం చీకటిగా కనిపిస్తుంది. మన జీవితంలో ముందుకు పోవడానికి అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. మన సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మన పరిస్థితి ఖాళీ సమాధిలా అనిపిస్తుంది. 

ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతుంటాయి కానీ మనం నిరాశ చెందక ,మగ్డలా మరియమ్మలా , పేతురులా యోహనులా సమస్య పరిష్కారం కోసం వెదకాలి. వారు ఏ విధంగా ప్రభువు కోసం , ప్రభువు కొరకు వెదకి ఆయనను కనుగొన్నారో,అధే విధంగా మనం కూడా మన జీవితంలో ఖాళీ సమాధిని చూసి భయ పడక క్రీస్తును వెదకాలి మత్తయి 7:7. లో  వెదకుడు దొరుకును అని చూస్తున్నాము, వారికి కనబడినట్లే మనకు కూడా తప్ప కుండా కనబడుతారు. 

అయితే ప్రభువు దర్శనం అందరికి ఒకేలా ఉండదు. ప్రభువు అనేక రూపాలలో , అనేక విధాలుగా మనకు ప్రత్యక్షం కావచ్చు. ప్రతి ఒక్కరి శక్తిని బట్టి , జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరి విశ్వాస అనుభూతి మారుతూ ఉంటుంది. ఒకరు పొందిన అనుభూతి , ఆనందం మరొకరు పొందకపోవచ్చు. కనుక క్రీస్తును మన జీవితంలో గుర్తించి కనుగొన్నప్పుడు మనం కూడా ఉత్థాన క్రీస్తు ఆనందాన్ని , ప్రేమను , శాంతిని పొందగలుగుతాము. 

యేసు ప్రభువు ఉత్థానుడయ్యాడు ఇది మనందరికీ ఒక శుభవార్త కాని ఈ యేసు ప్రభువు ఉత్థానమే  మనందరికీ ఒక సందేశం. అయితే ఈ క్రీస్తు ఉత్థానం ద్వార ఆశ, నమ్మకం ఎక్కడ నుండి వస్తుంది? ఈ సందేశాన్ని ఎక్కడ వెదకగలం? సువిశేషంలో విన్నట్లు , ఈ నమ్మకం ఆశ, యేసుని భూస్థాపితం చేసిన సమాధి నుండి వస్తుంది. కారణం ఆ సమాధి అందరిని ఆకర్షించింది. ఈ సమాధి దగ్గరకే మగ్దల మరియమ్మ , పేతురు , యోహనులు వెళ్ళినది. ఈ సమాధి వారిలో ఉత్థాన క్రీస్తు ఆశలు రేపినది. వారిలో నమ్మకాన్ని పెంచినది ప్రభువు యొక్క ఉత్థానం . మనందరి జీవితాలలో నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన ఈనాటి ఉత్థానం అవుతూనే ఉన్నాడు. 

ప్రతి సారి ప్రియమైన స్నేహితులారా మనలో ఉన్న చెదుకు మనం మరణించినప్పుడు క్రీస్తు ఉత్థానం అవుతున్నాడు. మన స్వార్ధాన్ని వీడి ఇతరులను ప్రేమించినప్పుడు దయ,కరుణ, జాలి అను గుణాలు మనలను ముందుకు నడిపించినప్పుడు క్రీస్తు మనలో ఉత్థానమవుతున్నాడు. మనం చేసే ప్రతి మంచి పని, ఆలోచన ద్వారా క్రీస్తు ఈ లోకంలో ఇంకా ఉత్థానమవుతున్నాడు. కనుక ప్రతి సంఘటన ద్వార ప్రతి రోజు మనకు ఉత్థాన మహిమను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి రోజు కూడా ఒక ఉత్థాన రోజుగా జీవించినప్పుడు , ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానం ,ప్రేమ , ఐక్యత మనలను ముందుకు నడిపిస్తాయి. పునరుత్థానం ఒక నూతన జీవితం, ప్రభువుతో ఉన్న అనుభందముతో ఒక నూతనత్వంతో ,సాటివారితో ఉన్న అనుబంధంలో నూతనత్వం కలిగి వుందాం. క్రీస్తు ప్రభువు విధానములో , ఆయన జీవించినట్లు అటు దేవునితో ఇటు పొరుగు వారితో జీవించడం ఒక ఉత్థానం జీవితమే. 

ఉత్థాన ప్రభువుని విశ్వసించడం అంటే ఖాళీ సమాధి దగ్గర జీవిత కష్టాలలో జీవించడం కాదు, ఆ ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానాలును , సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం. ఇలా ఒక నూతన ప్రపంచానికి నాంది పలకాలి. క్రీస్తు మరణం ఉత్థానం మన అనుదిన జీవితంలో భాగం కావాలి . ఆయన జననం , మరణం , ఉత్థానం ,నిత్యం మన జీవిత విధానం కావాలి. ప్రతి రోజు ఒక ఉత్థాన పండుగ కావాలి, ప్రతి రోజు ఒక నూతన జీవితం కావాలి. ఆమెన్ 

Br. Manoj 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...