33 వ సామాన్య ఆదివారం
మలాకీ 4:1-2
2 తెస్స
లూకా 21 :5 -19
ఈనాటి దివ్య పఠనాలు దేవుని యొక్క రెండవ రాకడను గురించి బోధిస్తున్నాయి. దేవుని యొక్క రోజు దేవుని యొక్క మహిమాన్వితమైన రెండవ రాకడ గురించి కూడా ఈ దివ్య గ్రంథ పఠనాలు తెలుపుచున్నవి. అదేవిధంగా మన యొక్క జీవిత అంత్యకాలము గురించి కూడా బోధిస్తున్నాయి. ఈనాడు మనందరం కూడా ముఖ్యంగా ధ్యానించుకోవలసిన అంశములు ఏమిటంటే:
1. మరణం
2. తుది తీర్పు
3. పరలోకం
4. నరకం
ఎందుకంటే దివ్య పఠనాలు అంత్య దినముల గురించి బోధిస్తున్నాయి. మన యొక్క మరణం తరువాత ఏమి అవుతుందో అనే విషయాలు గురించి తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠనంలో మలాకీ ప్రవక్త రాబోతున్న దేవుని యొక్క రోజు గురించి తెలుపుచున్నారు. ప్రభు యొక్క రోజున దుర్మార్గులు శిక్షించబడతారు అని, అదే విధంగా దేవుని యెడల భయభక్తులు కలిగి నీతివంతమైన జీవితం జీవించేవారు రక్షించబడతారు అని ప్రవక్త తెలుపుచున్నారు.
మలాకీ ప్రవక్త యొక్క పరిచర్య కాలంలో యూదా ప్రజలు అవినీతికరమైన జీవితంలో జీవించేవారు. చాలా సంవత్సరాలు బాబిలోనియ బానిసత్వంలో ఉన్నవారు అక్కడ ప్రజల యొక్క ఆచారాలను అక్రమ మార్గాలను అనుసరిస్తూ, అవినీతి కరమైన జీవితంను తిరిగి వచ్చిన తరువాత కూడా కొనసాగించేవారు. వారు మంచికి చెడుకు మధ్య ఎలాంటి భేదం లేకుండా జీవించేవారు, నైతిక విలువలు మరచిపోయారు, ప్రజలతో పాటు యాజకులు కూడా అదే విధమైన అవినీతి మార్గాలను అనుసరించేవారు, తప్పును ఖండించలేదు అందుకనే ప్రవక్త దేవుని యొక్క హెచ్చరికలను తెలుపుచున్నారు. వారి యొక్క అవిశ్వాసనీయతకును, అవినీతికిని అదే విధంగా అన్యులతో వివాహ బంధంకు దేవుని యొక్క శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త హెచ్చరించారు.
కొంతమంది విశ్వాసహీనులు అన్ని విధాలుగా ఎదుగుతుంటే, సుఖసంతోషాలు అనుభవిస్తుంటే, కొంతమంది విశ్వాసులు మాత్రము వారి యొక్క మంచి జీవితంకు ప్రతిఫలంగా కష్టాలు అనుభవిస్తూ జీవించే సందర్భంలో యావే దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా తెలుపుచున్నారు, దేవుని యొక్క రోజు వచ్చుచున్నది అప్పుడు ఆయన అవిశ్వాసులను శిక్షించి విశ్వాసులను రక్షిస్తారని పలికారు. ప్రభువు వచ్చే రోజుకు మనం సిద్ధంగా ఉండాలి ఆయనతో పాటు పరలోకం చేరుటకు మనం ఈ లోకంలో ఉండగానే మంచి జీవితం జీవించాలి. నీతిమంతులుగా మనం ఈ లోకంలో కొన్ని కష్టాలు బాధలు అనుభవించినప్పటికీని ప్రభువు యొక్క దినమున మనకు రక్షణ లభిస్తుంది. ప్రభు యొక్క దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం సిద్ధంగా ఉండాలి.
దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించే సమయంలో మనకు సహనం ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి. గత వారం చదివిన మొదటి పఠనం 2 మక్క 7:1-2,9-14 ఒక తల్లి, ఏడుగురు సోదరులు, విశ్వాస పాత్రులుగా జీవించారు. దేవుని యెడల సహనం కలిగి జీవించారు మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంతకాలం వరకు మంచినీ చేస్తూ, పాటిస్తూ జీవించాలి. అవినీతి లేకుండా నీతితో జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై జీవించాలి.
గర్వంతోను పాపంలోనూ నైతిక విలువలు లేకుండా జీవించే వారికి దేవుని శిక్ష వస్తుందని మలాకీ ప్రవక్త పలికారు. ఆ శిక్ష ఎంత కఠినంగా క్రూరంగా ఉంటుంది అని ప్రభువు తెలుపుచున్నారు ప్రవక్త ద్వారా. సమస్తమును దేవుడు చూస్తారు కాబట్టి ఆయన వచ్చు రోజున దృష్టులకు దేవుని నుండి శిక్ష, మంచి వారికి దేవుని నుండి రక్షణ వస్తుంది.
మంచిని, చెడును, పాపమును, పుణ్యమును, విశ్వాసమును, అవిశ్వాసమును అనుసరించుట అన్ని మన మీదనే ఆధారపడి ఉన్నాయి, కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనందరం ఒక మంచి జీవితం జీవించాలి.
ఈనాటి రెండవ పఠనములో పౌలు గారు అందరిని పరిచేసే వారిగా ఉండమని తెలుపుచున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూ జీవించాలి అని పౌలు గారు పలికారు. దేవుని యొక్క రెండవ రాకడ జరుగును కాబట్టి అందరూ ప్రభువునికోసం పనిచేస్తూ ఆయన యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించాలి. కొందరు ప్రభువు యొక్క రాకడ త్వరలో వస్తుందని ఏ పని చేయకుండా ఉన్న సందర్భంలో పౌలు గారు తెస్సలోనియ ప్రజలను కష్టపడి పని చేయమని పలుకుచున్నారు.
పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు అని పౌలు గారు తెలుపుచున్నారు. సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఆదామును పనిచేయుటకు ఏదోను తోటలో ఉంచారు - ఆది 2-15.
అదేవిధంగా ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని తన తోటలో పనిచేయుటకు యేసు ప్రభువు కొందరిని పంపిస్తున్నారు - మత్తయి 20:1-16.
ఎవరైతే పనిచేయకుండా సోమరులుగా ఉంటున్నారో దేవుడు వారిని శిక్షిస్తున్నారు - మత్తయి 25:26.
ప్రభువు మనందరినీ కూడా సృష్టించినది ఎందుకంటే ఆయన యొక్క రాజ్యం కొరకు పని చేయుటకు. కాబట్టి సోమరులుగా జీవించకుండా కష్టపడి పని చేస్తూ జీవిస్తూ ప్రభువు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం.
ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు కూడా అంత్య దినముల గురించి బోధిస్తున్నారు. సువిశేష మొదటి భాగంలో యేసు ప్రభువు యేరుషలేము దేవాలయం యొక్క పతనం గురించి బోధిస్తున్నారు. యూదులకు యేరుషలేము దేవాలయం చాలా ప్రత్యేకమైనది. యేరుషలేము దేవాలయమును సొలోమోను రాజు క్రీస్తుపూర్వం 960 సంవత్సరంలో నిర్మించారు, దానిని బాబిలోనియులు 586 బిసి లో ధ్వంసం చేశారు, తరువాత జెరుబాబేలు మరియు ప్రవాసం నుండి తిరిగి వచ్చిన యూదులు మరలా నిర్మించారు (536-516 BC).
మరలా యేరుషలేమును సుందరంగా హేరోదు మహారాజు నిర్మించారు (20 BC - AD 64) అంత సుందరంగా అలంకరించబడిన యేరుషలేము దేవాలయంను రోమియు 70 (AD) సంవత్సరంలో ధ్వంసం చేశారు.
ఎంతో గొప్ప దైవ యేరుషలేము సైతం ధ్వంసం చేయబడినది అదే విధంగా మన యొక్క జీవితం కు ఒక అంతము అనేది ఉంటుంది, కాబట్టి మన జీవితాలను దేవుని రాకడ కొరకు సంసిద్ధత కలిగి ఉండాలి. మన యొక్క జీవిత అంతం పరలోక జీవితం కు ప్రారంభం కావాలి.
ప్రతి ముగింపు కు ఒక నూతన ప్రారంభం అనేది ఉంటుంది, మనకు భూలోక జీవితం ముగిస్తేనే పరలోక జీవితం ప్రారంభం అవుతుంది. మనలో పాపము ముగిస్తేనే, పుణ్య జీవితం ప్రారంభం అవుతుంది. మనలో ద్వేషం అంతరిస్తేనే, ప్రేమ ప్రారంభమగుచున్నది. మనం ఈ లోకంలో మరణిస్తేనే పరలోకంలో జన్మిస్తం. అదే విధంగా మన చదువులు ముగిస్తే మనం ఉద్యోగం ప్రారంభిస్తాం. ఒక తల్లి యొక్క పురిటి నొప్పులు ముగిస్తేనే బిడ్డకు జన్మనిచ్చుట ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కటి చివరికి చేరుతుంది ముగించబడుతుంది కాబట్టి మనం ప్రతిదానికి సంసిద్ధత కలిగి ఉండాలి.
ఎప్పుడు ఏమి సంభవించును ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతి రోజు మనం సిద్ధంగా ఉండాలి. కాలం కాదు ముఖ్యం సూచనలు స్నేహాలు కాదు ముఖ్యం మనం ప్రతిక్షణం ప్రభు యొక్క రాకడ కోసం సంసిద్ధత కలిగి ఉండాలి.
ప్రభువు చివరి ఘడియలు అని తెలుపుచున్నారు ఈ చివరి ఘడియలు బహుశా సైతాను యొక్క చివరి ఘడియలు పాపం యొక్క చివరి గడియలు ఈ చివరి ఘడియలు ముగిస్తే దేవుని క్రొత్త గడియలు ప్రారంభమవుతాయి.
ఈ సువిశేష రెండో భాగంలో ప్రభువు సువార్త సేవ గురించి బోధిస్తున్నారు. సువార్త పరిచర్య చేసే సందర్భంలో అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి యుద్దాలు సంభవిస్తాయి, అనేక రకాలైన హింసలు ప్రారంభమవుతాయి వీటన్నిటిని చూసి భయపడవలదు అని ప్రభువు తెలుపుచున్నారు. ప్రభు యొక్క పునరుద్దానం తరువాత అనేకమంది ప్రజలు సువార్త సేవకులు హింసించబడ్డారు. శ్రీ సభ ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభువు యొక్క అనుచరులు సేవకులు అనేక రకమైన కష్టాలు శారీరక అంశలు అనుభవిస్తున్నారు అయినా కానీ వారు దేవుని కొరకు మరణించారు.
యేసుప్రభు అందరినీ కూడా సాక్షులుగా ఉండమని తెలుపుచున్నారు. ఎలాగా మనం దేవునికి సాక్షులుగా జీవించగలుగుతున్నాం.
1. మన యొక్క మంచి జీవితం ద్వారా ఆ ప్రభువునకు సాక్షులుగా జీవిస్తాం.
2. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట ద్వారా.
3. దేవుని కొరకు ప్రాణత్యాగం చేయుట ద్వారా.
4. దేవుని యొక్క సువార్త పరిచర్య చేయుట ద్వారా.
5. దేవుని యొక్క ప్రేమను పంచుట ద్వారా
6. ఇతరులకు సహాయం చేయుట ద్వారా మనం ప్రభువుకు సాక్షులుగా జీవిస్తాం.
మన యొక్క కుటుంబ సభ్యులు కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు ఎందుకంటే ఒకరు యేసు ప్రభువు కొరకు జీవిస్తూ ఇంకొకరు అన్య దైవాల కొరకు జీవిస్తే అక్కడ విభేదాలు వస్తాయి.
అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నవారు సత్యం కొరకు జీవించినప్పుడు ఇంకొకరు అసత్యం కొరకు జీవించినప్పుడు కుటుంబాలలో విభేదాలు తలెత్తుతాయి.
ఏమి జరిగినా కానీ ప్రభువుకు సాక్షులుగా ఉండాలి మనందరం కూడా విశ్వాసంలో కృంగిపోకూడదు. కష్టాలు బాధలు వస్తాయి అయినప్పటికీని ప్రభువు మనతోనే ఉంటారు.
మన దేవుడు మనతో ఉండే దేవుడు అన్ని సమయాలలో మనతోనే ఉంటారు కాబట్టి విశ్వాసం కోల్పోకుండా దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.
మన యొక్క విశ్వాస జీవితంలో సహనం కోల్పోకూడదు ఎందుకంటే సహనం సమస్తమును జయించును.
ప్రభువు రోజు కొరకు మనందరం సిద్ధంగా ఉండాలి దేవునికి సాక్షులుగా ఉండాలి.
FR. BALAYESU OCD