19వ సామాన్య ఆదివారము
హెబ్రీ 11 : 1 - 2, 8 - 19
లూకా 12 : 32 -48
ఈ నాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యందు విశ్వాసముంచుట గురించి మరియు అయన యొక్క రాక కోసం విశ్వాసంతో మనమందరం ఎదురు చూస్తూ సిదంగా ఉండాలి అని తెలుపుచున్నాయి.
దేవుడు చేసిన వాగ్దానాలు అన్నియు నెరవేరతాయి అనే విషయం అందరు గుర్తుంచుకొని ఆయన అప్పచెప్పిన పనులు అన్నియు సక్రమంగా నెరవేర్చాలి.
దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటయే సంసిద్ధత కలిగి జీవించుట కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుతూ జీవించాలి
ఈ నాటి మొదటి పఠనంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క నమ్మకం గురించి తెలుసుకుంటున్నాము.
దేవుడు వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకొనివస్తారని వారు దృడంగా నమ్మారు.
దేవుడు ఏవిధంగా యిస్రాయేలు ప్రజలను ఐగుప్తునుండి బయటకు తీసుకొని రాబోతున్నారో వారికీ
ముందుగానే తెలిపారు. యిస్రాయేలు ప్రజలు వాగ్దాత భూమికి ప్రయాణం ప్రారంభించేముందు రాత్రి పాస్కా విందు చేసుకొని వారి ప్రయాణం ప్రారంబించారు. ఆ రాత్రి ఐగుప్తు ప్రజలు చాల మంది మరణించారు. ఆ రాత్రి నుండియే యిస్రాయేలు ప్రజలు స్వేచ్ఛను పొందారు దేవుడు చూపిన ప్రతి విషయం జరుగునని విశ్వసించారు.
దేవున్ని విశ్వసించి వారు దైర్యంగా ఉన్నారు ఎందుకంటె మమల్ని పిలిచిన దేవుడు కాపాడతారు అనే గొప్ప నమ్మకం వారిలో ఉంది.
ప్రజలు దేవుని యొక్క మనసు ఎరిగి ఉన్నారు కాబట్టి వారు వాగ్దాత భూమికి ప్రయాణం చేయటానికి సంసిద్ధత కలిగివున్నారు.
దేవుడు దయా హృదయం కలిగిన వ్యక్తి అని సజ్జనులను కాపాడతాడని శత్రువులను శిక్షిస్తారని ప్రజలు తెలుసుకున్నారు.
ఈ మొదటి పఠనం ద్వారా మనమందరం గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు పిలుచుకొన్న ప్రజలను, ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ప్రభువు ఎల్లప్పుడు ఆదుకుంటారు.
రచయిత కూడా ఆ నాటి యూదుల యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచటానికి యిస్రాయేలు ప్రజల యొక్క విశ్వాస జీవితాన్ని సంసిద్ధతను తెలియజేసారు. దేవుడు చేసిన మేలులకు ఇచ్చిన స్వేచ్చకు గాను భక్తివంతులైన విశ్వాసులు ప్రభువునకు బలులు సమర్పించి ఆయనకు స్తుతించారు.
ఈ నాటి రెండొవ పఠనంలో విశ్వాసం అంటే ఏమిటి అనే అంశం గురించి తెలుపుచున్నారు.
నిజమైన విశ్వాసం అంటే మనం చూడని విషయాలు, అద్భుతాలు మనకు జరుగుతాయి అనే నమ్మకమును కలిగివుండటం. విశ్వాసం గురించి తెలియజేసేటప్పుడు రచయిత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము జీవితం గురించి తెలుపుచున్నారు.
అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు కేవలం ఆయన దేవుని యందు ఉన్న విశ్వాసం వలనే అన్నియు వదిలి తన ప్రయాణం ప్రారంభించారు.
యావే దేవుడు అంటే అతనికి ఎంత అవగాహన ఉన్నదో లేదో కానీ ఆయన పిలిచిన వెంటనే ఎటువంటి సందేహం లేకుండా దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఎక్కడికి వెళ్లుచున్నాడో, ఎందుకు వెళ్లుచున్నాడో ఆయనకు సరైన అవగాహన లేనప్పటికీ దేవుడు న్యాయం చేస్తారని, ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకుంటారని అబ్రాహాము విశ్వసించాడు.
అబ్రాహాము తన యొక్క విశ్వాస జీవితంలో ప్రతిసారి కూడా దేవుని మీదనే ఆధార పడ్డాడు, ఆయన్నే విశ్వసించాడు లోతుతో వేరు పడినప్పుడు లోతుకు నచ్చిన ప్రదేశం,పంటలు సంహృద్దిగా పండే నేలను ఇచ్చి తాను మాత్రం ఒక సాధారణమైన ప్రాంతంను ఎన్నుకున్నాడు ఎందుకంటె దేవుడు ఏమిలేమి నుండి తనను దీవిస్తాడని విశ్వాసం ఉంది కాబట్టి.
వృద్దాప్యంలో ఉన్న అబ్రాహాముకు సంతానం కలుగుతుందని దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుందని విశ్వసించాడు. తన యొక్క సంతతి ఆకాశమునందలి నక్షత్రమువలె భూమియందలి ఇసుకరేణువులవలె గొప్పగా మారుతుందని విశ్వసించాడు.
విశ్వాసం వలనే అబ్రాహాము తన అబ్రాహాము తన యొక్క ఏకైక కుమారున్ని బలిగా సమర్పించడానికి సిద్దమయ్యాడు.
అబ్రాహాముతో పాటు అతని యొక్క కుమారులు వారి యొక్క కుమారుడు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారు.
ఈ రెండవ పఠనంలో అబ్రాహాము కానీ, ఈసాకు కానీ, యాకోబు కానీ వారి యొక్క పాత దేశపు విషయములను ఆలోచించుట లేదు దాని కంటే మేలైనది పరలోకం గురించి క్రొత్త దేశం గురించి ఉన్నాయి.
మనం కూడా పాత విషయాలు ప్రక్కన పెట్టి దేవున్ని అనుసరించాలి. అబ్రాహాము దేవున్ని విశ్వసించి మేలైన దాని కోసం ముందుకు సాగాడు. దేవుడు పిలిచిన ప్రతిసారి అబ్రాహాము సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి మనలో కూడా అదే విశ్వాసం ఉండాలి.
మనం విశ్వాసం చాలా సందర్భాలలో దృడంగా ఉండదు ఎందుకంటే కష్టాలు వచ్చినపుడు మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది.
ప్రస్తుత కాలంలో ఉన్న యువత యొక్క జీవితంలో నిజంగా దేవుని యందు విశ్వాసం ఉందా లేదా అని అనిపిస్తుంది కేవలం యువత మాత్రమే కాదు చాలా మంది పుట్టు క్రైస్తవులకు కూడా దేవుని యందు విశ్వాసం తగ్గిపోతుంది.
మన యొక్క పూర్వీకులకు ఉన్న విశ్వాసం నేడు మనకు ఉన్నదా. అబ్రాహాము దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నాడు ఆయన తన బిడ్డకు అందించిన విశ్వాసం కూడా గొప్పది.
ఒకరి నుండిఇంకొకరికి విశ్వాసం మారుతుంది అందుకే అప్పటి మన పూర్వీకులకు ఉన్న విశ్వాసం నేడు చాలా మందికి లేదు.
ఈ రెండవ పఠనం ద్వారా మన విశ్వాసం కూడా మనం బలపరచాలి ఎన్ని కష్టాలు ఎదురైనా మన యొక్క విశ్వాసం కూడా అబ్రాహాము వలె ఉండాలి.
అబ్రాహాము వలె మనమందరం దేవున్ని విశ్వసించుచు, దేవునికి సాక్షులై జీవించుటకు సంసిద్ధత కలిగి జీవించాలి.
మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడిని వెంబడించేటపుడు మన యొక్క మార్గంలోఆటంకాలు రావచ్చు, అంధకారం అగాధాలు ఉండవచ్చు అయినప్పటికీ మనం ముందుకు సాగాలి.
ఈ నాటి సువిశేష పఠనంలోప్రభువు యొక్క రాకడ కోసం మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని తెలుపుతుంది. అదేవిధంగా మన యొక్క జీవితములో మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి దాని కొరకు సిద్ధంగా ఉండాలి.
ఈ సువిశేష పతనం ద్వారా ప్రభువు మనకందరికీ మన జీవితాలు ఎలా సరి చేసుకోవాలి అని కొన్ని సలహాలు ఇస్తున్నారు.
ప్రభువు తన యొక్క అనుచరులను దేనికి బయపడవలదు అని చెప్పుచున్నారు.
దేవునికి విధేయులై జీవించే వారు దేనికి బయపడవలిసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే వారికీ తోడుగా నిలుస్తారు.
మోషే ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు ఆయన నేను నత్తివాడను మాట్లాడుట సరిగా రాదు అన్నపుడు ప్రభువు బయపడవలదు అని అంటున్నారు.
యిర్మీయాను పిలిచిన సందర్బములో కూడా బయపడవలదు అని దేవుడు తన యొక్క అభయం ఇస్తున్నారు. యిర్మీయా 1 :8
యెషయా గ్రంధములో కూడా ప్రభువు తన యొక్క విశ్వాసులకు తెలిపే మాటలు ఏమిటంటే బయపడవలదు. యెషయా 41:10
దేవుని యందు నమ్మకం ఉంచిన దానియేలు మరణంకు భయపడలేదు ఆయన స్నేహితులు కూడా అగ్ని కొలిమిలో వేసినపుడు మరణానికి భయపడలేదు.
మన యొక్క దేవుడు మనకు అండగా నిలుస్తారు అందుకే అయన యందు విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు మనకు కావలిసిన వరాలు దయచేస్తారు మన యొక్క అక్కరలో తోడుగా ఉంటారు.
దేవుడు పరలోక సంపదలు కొరకు ప్రయత్నించండి అని తెలుపుచున్నారు.
మనందరం ఈ లోకములో దానం కోసం, అధికారం కోసం, కీర్తి, ప్రతిష్టల కోసం పోరాడుతుంటాం ఇవన్నీ ఈ లోకానికి చెందినవియే ప్రభువు వీటి కోసం కాకుండా పరలోక సంపదలు సంపాదించుకోమని తెలుపుచున్నారు.
మనం రోజు కూడబెట్టుకున్న దానం మన సంపదగా మారుతుంది అదే విధంగా మనం రోజు చేసే పుణ్య క్రియలు మనలను పరలోక సంపదలు కూడబెట్టుకొనేలా చేస్తాయి.
ఏవిధంగా మనం సంపదలను పరలోకంలో కూడబెట్టుకుంటాము
1 . అవసరంలో ఉన్న వారికీ మనం సహాయం చేస్తే అది మనం పరలోకం చేరుటకు సహాయపడుతుంది.
2 . ఇతరులకు ప్రేమను పంచుట ద్వారా
3 . ప్రార్ధించుట ద్వారా
4. ఇతరులను క్షమించుట ద్వారా
5 . దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా
6 . పవిత్ర జీవితం జీవించుట ద్వారా మనమందరం పరలోకములో సంపదలు కూడబెట్టుకుంటాము.
మన సంపద దేవుడైతే మన యొక్క మనస్సు హృదయము ఆయన మీద లగ్నము చేయాలి.
కొంతమంది సంపద డబ్బు, అధికారం పేరు ప్రతిష్టలు అందుకే వాటి గురించే ఆలోచిస్తారు కొంతమంది సంపద పరలోక రాజ్యం కాబట్టి దానిని పొందుటకు మంచి కార్యాలు చేస్తారు.
ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి యజమానుడు అయిన ప్రభువు వస్తాడని ఎదురు చూసే సేవకులు ధన్యులు అని యేసు ప్రభువు తెలుపుచున్నారు.
విశ్వాసి నడుము కట్టుకొని సిద్ధంగా ఉండాలి అనగా వ్యక్తి గతంగా తాను నిర్మలమైన మనస్సు కలిగి తన యొక్క యజమానుడికి సేవ చేయాలి సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభువు కూడా కడరాత్రి భోజన సమయములో అదేవిధంగా సేవ చేశారు మన యొక్క జీవితములో చాలా సందర్భాలలో మనం సిద్ధంగా ఉంటాం.
పరీక్షకు సిద్ధంగా ఉంటాం
ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉంటాం
ప్రయాణాలకు సిద్ధంగా ఉంటాం
చాల సందర్భాలలో మనం సిద్ధంగా ఉంటాం కాబట్టి మన యజమానుడు కొరకు మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉంటె ఆయనయే మనకు సేవ చేస్తారు. మన హృదయపు తలుపులు తీయాలి యజమానిని మన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించాలంటే మన యొక్క హృదయపు తలుపులు తీయాలి.
మన యొక్క కఠిన జీవితమును విడిచిపెట్టి పుణ్య మార్గమును అనుసరిస్తూ ప్రభువును మన యొక్క హృదయపు ఇంటిలోనికి ఆహ్వానించాలి.
జక్కయ హృదయ పరివర్తనం చెంది క్రీస్తు ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించారు.
దేవుడు మన యొక్క ఇంటిలోనికి రావాలంటే కుటుంబ ప్రార్థన ఎంతో విలువైనది అందరు ప్రార్థన చేస్తూ ప్రభువును ఆహ్వానించాలి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు జ్యోతిని కలిగి వెలుగు మార్గములో జీవించటానికి ప్రయత్నించాలి అదే విధంగా సత్యవంతమైన జీవితం జీవిస్తే ప్రభువు వారి ఇంటిలోనికి ప్రవేశిస్తారు. క్రీస్తుజ్యోతి అనగా సత్యం ఆ సత్యవంతమైన జీవితం మనమందరం కూడా జీవిస్తే ప్రభువుకు మన యొక్క హృదయ తలుపులు తీయవచ్చు.
విశ్వాస పాత్రులుగా జీవించాలి మనకు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వహించుటలో మనం విశ్వాస పాత్రులుగా జీవించాలి.
మనం సోమరులుగా జీవించకూడదు దేవుని యొక్క పనిలో నిమగ్నమై జీవించాలి.
దేవుడు మన నుండి కోరుకొనేది మన యొక్క విశ్వసనీయతయే. ఇశ్రాయేలు ప్రజల నుండి కోరుకొనేది విశ్వసనీయత కాబట్టి ఎవ్వరు కూడా సోమరులుగా కాకుండా మనకు ఇచ్చిన బాధ్యతలు అన్ని సక్రమంగా నెరవేర్చాలి మన యొక్క జీవితములో ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి.
దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు కాబట్టి అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి.
ప్రభువు యొక్క రాకడ కోసం మనమందరం విశ్వాసముతో ఎదురు చూడాలి ప్రభువు కోసం, ఆయన సేవ కోసం సంసిద్ధత కలిగి ఉండాలి.
ఫాదర్. బాల యేసు. ఓ సి డి