30, ఏప్రిల్ 2022, శనివారం

పాస్క మూడవ ఆదివారం

పాస్క మూడవ ఆదివారం 

అపో 5:27-32 ,40-41, దర్శన 5:11-14, యోహను 21:1-19 

 ఈనాటి దివ్య పఠనాలు  దేవునికి సాక్షిగా జీవించే వారి గురించి బోధిస్తున్నాయి. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంను విశ్వసించి పిత పుత్ర పవిత్రాత్మ  నామమున జ్ఞాన స్నానం పొందిన వారందరు దేవునికి సాక్షులై జీవించాలని ఈనాటి పఠనాలు తెలియజేస్తున్నాయి. 

ఈనాటి మొదటి పఠనం, అపోస్తులులు యేసు ప్రభువుకు ఎలాగా సాక్షులై జీవించారో తెలుపుతుంది. యేసు ప్రభువుతో పాటు మూడు సంవత్సరాలు జీవించి, ఆయనను తెలుసుకొని ఆయన అప్ప జెప్పిన  బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ, ఆయనకు సాక్షులై జీవించారు అపోస్తులులు. 

లూకా గారు, యేసు ప్రభువు యొక్క శిష్యులను  అపోస్తులులు అని  పిలుస్తున్నారు. అంటే పంపబడినవారు అని అర్ధం. దేవునికి సాక్షులుగా ఉండుటకు పంపబడిన వారు అని అర్ధం . ఏసుతో జీవించి ఆయన భోదను చెవులారా ఆలకించి, ఆయన మరణాన్ని కన్నులారా గాంచి, మృతులలో నుండి సజీవునిగా లేచిన, క్రీస్తుని గురించి ప్రకటించకుండా వుండలేక పోయారు. 

దేవునితో కలిసి జీవించినప్పుడు పొందిన అనుభవాన్ని ఇతరులకు తెలియజేయుటకు సిద్దంగా ఉన్నారు. క్రీస్తు పేరిట ప్రసంగించేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అపోస్తులు అనేక హింసలకు గురయ్యారు. 

దేవుని యొక్క సేవ చేసేటప్పుడు అనేక రకాలైన ఆటంకాలు కలుగుతాయి. పూర్వ నిబందన గ్రంధం లో కూడా చూస్తుంటాం, ఏ విధంగా యిస్రాయేలు ప్రజలు ప్రవక్తలను హింసించారో. 

యిర్మియా ప్రవక్తను  కొట్టి బావిలో పడవేశారు. యిర్మియా 20:2,  దానియేలును సింహాపు బోనులో పడవేశారు, దానియేలు 6 వ అధ్యాయం. బాప్తిస్మ యోహనును కూడా శిరచ్ఛేదనం చేశారు. మత్తయి 14:1-12. చాలా మంది ప్రవక్తలు దేవునికి సాక్షులై జీవించేటప్పుడు అనేక రకాలైన హింసలకు గురయ్యారు. శిష్యులుకూడా దేవుని యొక్క పవిత్ర ఆత్మను స్వీకరించిన తరువాత ఆయన గురించి గొప్పగా ప్రకటన చేస్తున్నారు. ఇక ఎదియు వారిని ఆపలేదు. 

అపోస్తులను చెరసాలలో వేయడానికి కారణం కేవలం అసూయాయే. అపో 5:17. క్రీస్తు ప్రభువుకు అనుచరులు పెరిగిపోతున్నారని సద్దుకయ్యులు  భావించారు. అందుకే వారు ఆ విషయమును జీర్ణించుకోలేక పోయారు. 

క్రైస్తవ మతమును , క్రీస్తు అనుచరులను తుద ముట్టించాలను కున్నారు. కానీ వారికి అది సాధ్య పడలేదు. క్రైస్తవత్వం ప్రారంభమైనప్పటి నుండి  క్రీస్తు అనుచరులు అనేక కష్టలు అనుభవించారు, అయిన కానీ క్రైస్తవ మతం అణగిపోలేదు. క్రీస్తు విశ్వాసులు దిన దిన అభివృద్ధి చెందుతున్నారు. 

అధికారులు అపోస్తులులను చెరసాలలో వేసి బందించినప్పటికి దేవుడు వారిని విడిపించారు. ఎందుకంటే  వారు దేవునికి సాక్షులై జీవించారు. దేవునికి విధేయత చూపించారు. 

దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నికొలిమిలో వేసిన సంధర్భంలో, దేవుడు వారిని కూడా కాపాడారు. దానియేలు 3:92. ఈ ముగ్గురు వ్యక్తులుకూడ దేవునికి సాక్షులై , విధేయులై జీవిస్తున్నారు. రాజు యొక్క విగ్రహాన్ని ఆరాధించుటకు వారు ఒప్పుకోలేదు. కేవలం దేవున్ని  మాత్రమే ఆరాధిస్తాం అని గట్టిగా విశ్వాసానికి సాక్షులై జీవించారు.

ప్రభువు యొక్క సేవ ఎంత ఆపాలని ప్రయత్నిస్తే అంతగా క్రైస్తవులు పెరుగుతున్నారు. అపోస్తులులు ఎన్నో ఇబ్బంధులను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారు. వారు కష్టాలకు, శిక్షలకు వెనుదీయలేదు,ఎంతో ధైర్యంగా ఉన్నారు. 

వారు సురక్షితంగా పిల్ల పాపలతో ఉండాలని కోరుకోలేదు. దేవుని జీవితం ప్రకటించాలని దేశ దేశాలు తిరిగి సువార్త ప్రకటించారు. 

క్రీస్తు పునరుత్తానం తరువాత అపోస్తులులు దేవుని చిత్తమును మాత్రమే వేదికారు. ఆయన చిత్తం నెరవేర్చుటకు , ప్రాణ త్యాగం చేయుటకు సైతం సిద్ధంగా ఉన్నారు. ప్రభువు సేవలోనే నిజమైన ఆనందం వుందని భావించి ఆయన సేవ చేశారు అపోస్తులులు. 

ఈనాటి రెండవ పఠనంలో యోహాను గారు చూసిన దర్శనం గురించి తెలియచేస్తున్నారు. కోట్ల కోలదిగా  దేవ దూతలు  చంపబడిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల యైన యేసు క్రీస్తు ప్రభువును ఉద్దేశించి స్తుతులు పాడుచున్నారు. దేవుడు మాత్రమే స్తుతులకు అర్హుడు, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని ఆయనను ఆరాధించారు. 

చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది, ఎందుకంటే ఈ గొర్రె పిల్లయైన యేసు క్రీస్తు ప్రభువు బాధమయ సేవకుని వలె తన యొక్క జీవితంను త్యాగం చేశారు. తన రక్తమునుచిందించి ఇతరులను రక్షించెను. తన ప్రేమను మనకు పంచి ఇచ్చారు. మనలను క్షమించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. కాబట్టి ఆయనను ఎక్కువగా తండ్రి దీవించారు. పిలిప్పి 2: 9.

ఈనాటి సువార్త పఠనంలో దేవుడు పేతురు గారికి కాపరి యొక్క బాధ్యతలను అప్పజెప్పుతున్నారు. పేతురు గారు కూడా యేసు ప్రభువుకు సాక్షియై జీవిస్తూ తన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు.

ఈ సువిశేషంలో చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. 1. మొట్టమొదటగా దేవుడు తప్పిపోయిన వారిని వెదుకుచున్నారు. క్రీస్తు ప్రభువు మరణం తరువాత శిష్యులందరు ఎవరి దారిన వారు పోయారు, భయంతో జీవించారు.  వారందరిని దేవుడు వెదకు చున్నారు. తప్పిపోయిన గొర్రెను వెదికారు, నాణెమును వెదికారు. అలాగే తప్పి పోయిన కుమారుడి కోసం ఎదురు చూశారు. ప్రభువు ఈలోక ప్రాణ భయం వలన బాధ్యతలను నిర్వహించుట మరిచిపోయిన శిష్యులను వెదకుచున్నారు. వారికి బాధ్యతలను అప్పజెప్తున్నారు.

2. యేసు ప్రభువు మనలను పాత జీవితం జీవించుటకు అంగీకరించరు.  పేతురు గారిని దేవుడు తన యొక్క సువార్త పని కోసమై పిలిచారు. మూడు సంవత్సరములు సువార్త పరిచర్య బాగానే చేశారు. కానీ క్రీస్తు  ప్రభువు యొక్క మరణం తరువాత పరిచర్య విడిచిపెట్టి  మళ్ళీ వారి యొక్క పాత పని, చేపలు పట్టుటకు వెల్లుచున్నారు. ప్రభువు దానికి అంగీకరించుటలేదు. 

మనం ఎప్పుడుకూడా  క్రొత్త జీవితం జీవించాలి. తపస్సు కాల 40 రోజుల మంచి జీవితమే ఇక మీదట  కూడా మనం కొనసాగించాలి. తపస్సుకాలంలో  మంచిగా, పవిత్రులుగా జీవించిన విధంగా ఇక మీదట అదే క్రొత్త జీవితం కొనసాగాలి. 

3. యోహను గారు,క్రీస్తు ప్రభువు  3 వ సారి దర్శనం ఇచ్చారని సువిశేషంలో అన్నారు. వాస్తవానికి ఇది నాలుగవ సారి. 1. మొదట మగ్దల మారియమ్మకు దర్శనం ఇచ్చారు. యోహను 20:11-17. 

2. శిష్యులకు దర్శనం ఇచ్చారు, అప్పుడు తోమస్సు గారు వారితో లేరు. 20:19-23. 

3. తోమస్సు శిష్యులతో ఉన్నప్పుడు 20: 26-29. 

4. ఈనాటి సువిశేషంలో శిష్యులకు ఇచ్చిన దర్శనం , ఇవన్నీ చేయుట ద్వారా ప్రభువు తాను సజీవుడని తెలుపుచున్నారు. శిష్యుల విశ్వాసం బలపరుస్తున్నారు. యేసు ప్రభువు తాను సజీవుడని శిష్యులకు తెలియచేస్తున్నారు. 

4. చేపలు పట్టే అనుభవం ద్వారా  దేవుడు మరొకసారి శిష్యులను సువార్త పరిచర్యకు పిలుస్తున్నారు. లూకా 5: 1-11 లో  మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చేపలు పట్టే అనుభవం ద్వారా శిష్యులను తన యొక్క సేవకు పిలిచారు. 

ఈ అనుభవం ద్వారా  ప్రభువు  తాను దేవుడని తెలియపరిచారు. శిష్యులు ఆయనను ప్రభువు అని గుర్తించారు. ప్రభువు వారిని మనుష్యులను పట్టువానిగా చేశారు. ఈ అనుభవం వలన శిష్యులు సమస్తమును విడిచిపెట్టి  క్రీస్తును వెంబడించారు, ఆయన సేవ చేశారు. 

శిష్యుల యొక్క విశ్వాసమును దేవుడు అధికం చేయుటకు ఈ అద్భుతం చేస్తున్నారు. 

5. చేపలు పట్టే సమయంలో  ఆ వలలో 153 రకాల చేపలు పడ్డాయి. దీనియొక్క అర్ధం ఏమిటంటే ప్రభువు జీవించే సమయంలో కేవలం 153 రకాల చేపలే ఉండేవి. అని అన్నియు ఆయన వలలోకి వచ్చాయి.  ఆయన పునరుత్థానం తరువాత  అందరిని కూడా దీవిస్తారు, రక్షిస్తారు. 

ఈ 153 రకాల చేపలు వలలో వున్నప్పటికి వల చినగలేదు. ఎందుకంటే అవి కలసి ఉంటున్నాయి, ఐక్యంగా ఉన్నాయి. మనం కూడా అందరం కలిసి మెలిసి ఉండాలి. తిరుసభలో అనేక ప్రాంతాల వారు జాతుల వారు ఉన్నారు, అయినా అందరు ఐక్యంగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. మనం కూడా కలిసి జీవించుటకే దేవుడు మనల్ని పిలిచారు ఆయన బిడ్డలమైన మనం కలసి ఉండాలి. 

6. యేసు ప్రభువు పేతురు గారిని  నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అని మూడు సార్లు అడుగుచున్నారు. మూడు సార్లు ఎందుకని మనం ఆలోచించాలి. పేతురు ప్రభువును మూడు సార్లు నిరాకరించారు. అందుకే మూడు సార్లు అడిగారు. ఇది ఒక వివరణ. 

రెండవది ఏమిటంటే గ్రీకు భాషలో ప్రేమకు మూడు అర్ధాలు ఉన్నాయి. 1. philia - స్నేహితుల మద్య ఉన్న ప్రేమ 2. eros - ప్రేమికుల మధ్య , భార్యభర్తల మధ్య ఉండే ప్రేమ, 3. agape - త్యాగ పూరితమైన ప్రేమ ,ప్రాణాలిచ్చే ప్రేమ. ప్రభువు పేతురు నుండి కోరినది మూడవ ప్రేమ , ఆయన సేవ కోసం  ప్రాణాలిచ్చే ప్రేమ పేతరు నుండి ప్రభువు కోరారు. 

మూడవదిగా పేతురును మూడు సార్లు ఎందుకు అడుగుచున్నారంటే, పేతురు నీవు నన్ను -పూర్ణ హృదయం , పూర్ణ మనస్సుతో , పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా అని అర్ధం. హృదయం, మనస్సు , ఆత్మతో ప్రేమిస్తే అది సంపూర్ణంగా ఉంటుంది. 

పేతురు పశ్చాత్తాప పడి ఈ మూడు విషయాలకు ఒప్పుకొనుట ద్వారా దేవుడు మళ్ళీ అతన్ని నాయకునిగా ఎన్నుకొంటున్నారు. దేవుని యొక్క గొర్రెలను మేపమంటున్నారు. ఆయన ప్రభువు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతున్నారు. 

ఈనాటి సువిశేషంలో  ప్రభువు రెండు ఉదాహరణలు వాడుచున్నారు. 1. చేపలు పట్టటం 2. గొర్రెలు చూచుకొనుట. 

ప్రతి ఒక్క సువార్త సేవకులు మొదటిగా దేవుని యొక్క వాక్కుచే ప్రజలను పట్టుకోవాలి. తరువాత దేవుని మందను పరలోక మార్గం వైపు నడిపించాలి. 

పేతురు గారు ప్రాణ భయంతో క్రీస్తు ఎవరో తెలియదు అని చెప్పాడు. అయినా ప్రభువు యొక్క పునరుత్థాన అనుభవం ద్వారా  తన జీవితం మార్చుకున్నాడు. ఆయనకు సాక్షిగా జీవించాడు. తాను వేద సాక్షిగా మరణం పొందాడు. క్రీస్తు ప్రభువు యొక్క సేవ చేశాడు. 

దేవుని సేవలో నిజమైన ఆనందం కనుగొన్నారు. ప్రభువుకు విధేయులై జీవించారు. మనం దేవునికి సాక్షులై జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD


22, ఏప్రిల్ 2022, శుక్రవారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

పాస్క కాలపు రెండవ ఆదివారం

 క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ! ఈనాడు మనందరం  కూడా పాస్కకాలపు రెండవ  ఆదివారం లోనికి ప్రవేశించి ఉన్నాం. అయితే ఈనాటి సువిశేష  పఠనం ద్వారా దేవుడు మనకు  5 విషయములను తెలియజేస్తున్నాడు. 

1. పునరుత్థాన యేసు ప్రభువు  శాంతి నొసగుచున్నాడు 

2. పునరుత్థాన యేసు ప్రభువు తనను తాను తెలియ పరుచుకుంటున్నాడు. 

3. తన చిత్తాన్ని శిష్యులకు తెలియ పరుస్తున్నాడు. 

4. పవిత్రత్మశక్తిని వారికి ఇస్తున్నాడు. 

5. దేవునికి సాక్షులుగా జీవించడానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. 

1. శాంతినొసగుట 

యేసు ప్రభువు  పునరుత్థానుడైన తరువాత తన శిష్యులు ప్రాణ భయంతో , యూదులు వారిని చంపి వేస్తారేమో అని  తలంచి వారు ఒక ఇంటిలో ప్రవేశించి తలుపులు మూసుకొని జీవించారు. ప్రాణ భయంతో  జీవించారు. ప్రాణ భయంతో  తలుపులు మూసుకొని జీవించిన శిష్యుల జీవితాలలోకు పునరుత్థానుడైన యేసు క్రీస్తు వస్తున్నాడు. వారివద్దకు రావడమే కాదు. వారికి శాంతి నొసగుచున్నాడు. పునరుత్థానుడైన  యేసు క్రీస్తు మనతో ఉన్నడని మనం నిజంగా విశ్వసిస్తే , నీవు ఈలోకంలో జరుగు ఏ విపత్తుకు, నీ జీవితంలో ఏ విషయానికి దిగులు చెందక భయపడక ధైర్యం గా వుంటావు. యోహాను 20:20. లో చూస్తే  ప్రభువుని చూచిన వారు ఆనందించిరి, అని వ్రాయబడినది. కానీ 19 వ వచనంలో చూస్తే యూదుల భయముచే శిష్యులు ఒక చోట  తలుపులు మూసుకొని ఉండిరి. ఇక్కడ యూదులను చూసి భయ పడితే, అక్కడ యేసుని చూసి ఆనందించారు. మత్తయి 10:28 "శరీరమును మాత్రము నాశనము చేయ గలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. శరీరమును, ఆత్మను కూడా నాశనము చేయ గల వానికి భయపడుము." అని చాటుతున్నది.

 మనం జీవితంలో కూడా ఇది పాటించినట్లయితే  ఈలోకంలో ఎవరికి భయపడకుండా దేవుని శాంతిలో మనం జీవించగలుగుతాము. 

2. తనను తాను తెలియపరుచుకొనుట 

ఇక్కడ యేసు క్రీస్తు యొక్క కర్తవ్యం గూర్చి తెలుపబడుతుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన స్వార్ధం కోసం కాదు. మరి ఎందుకు  పంపబడ్డాడు అంటే అందరిని ప్రేమించి,  వారికి రక్షణ ఇవ్వడానకి. యోహను 3:17. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు రక్షించడానికి పంపేనె కానీ దానిని ఖండించడానికి పంపలేదు. మరి ఈనాడు యేసు ప్రభువు కూడా తన శిష్యులను కూడా అదే చేయమనుచున్నాడు. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20:21. ఎందుకు దేవుడు తన శిష్యులను తన పనిని, కర్తవ్యాన్ని నెరవేర్చడానికి పంపుచున్నడంటే, యోహను 14:34 లో మనం చూస్తాము, ప్రభువు చెప్పేది ఏమిటంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. యోహను 6:57 . జీవము గల తండ్రి నన్ను పంపేను. 

3. తన చిత్తాన్ని వారికి తెలియ పరుస్తున్నాడు. యోహను 20:21 

యేసు చిత్తము ఏమిటంటే 1. ఒకరి నొకరు ప్రేమించుకోవాలి. యోహను 14:34 

2. ఒకరినొకరు క్షమించుకోవాలి యోహను 8:10 

3. ఒకరినొకరు రక్షించుకోవాలి లూకా 19:10 

4. ఒకరికొకరు ప్రార్ధన చేసుకోవాలి. లూకా 6:12 . నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యోహను 20: 2 

4. పవిత్రత్మ శక్తిని వారికంధిచుట 

యోహను 14:18 నేను మిమ్ము అనాధులుగా విడిచి పెట్టను. నేను మీ ముద్దు వత్తును. ఈనాటి సువిశేషంలో దేవుడు తన  వాగ్ధానాన్ని తెలియపరుస్తున్నాడు. 

రెండవ పఠనంలో కూడా చూస్తే పవిత్రత్మ పొందిన శిష్యులు గొప్ప గొప్ప ప్రార్ధనలు చేస్తున్నారు. పేతురు నడుచుచున్నప్పుడు అతని అంగీని నీడన పడిన చాలు అని విశ్వసించిన ప్రజలు ఎప్పుడైతే శిష్యులు ఈలోక relationship ను తృణీకరిస్తున్నారో వారు   పవిత్రత్మ శక్తి ద్వార ఎన్ని అద్భుతాలు చేశారు. 

ఈ శక్తి ద్వార ఎంతో మంది విశ్వాసులు స్వస్థతను పొందుతున్నారు. నూతన విశ్వాసులుగా మారుచున్నారు. యోహను 20: 24. 

5. దేవునికి సాక్షులుగా వుండటానికి వారందరికీ ఆహ్వానిస్తున్నాడు. 

ఎలా మనం సాక్షులుగా మారుతం అంటే , మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొనుటచే దేవునికి సాక్షులలుగా జీవించడానికి అలా చేశారు. ఎవరి పాపములైన  మీరు క్షమిస్తే వారి పాపములు క్షమించబడతాయి. మనం ఎప్పుడైతే ఇతరుల పాపములను క్షమిస్తామో అప్పుడు మనం దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తాం. 

కాబట్టి ఈనాడు నీవు నేను ఈ లోకంలో ఉన్న వస్తువులకు , వ్యక్తులకు ,ఇబ్బందులకు బయపడకుండా దేవునికి భయ పడాలి. ఆయన పిలుపుని పొందిన మనం ఆయనను అనుసరించు వారీగా జీవించాలి. ఆ దేవాతి దేవుడినికి  ఒక గొప్ప సాక్షిగా మారి దేవుని ప్రేమను నీవు నేను అందరికి అందేలా చేయాలి. 

Br. Joseph mario 

16, ఏప్రిల్ 2022, శనివారం

క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

 క్రీస్తు పునరుత్థాన మహోత్సవం 

యేసు ప్రభువు తన ఉత్థానం ద్వారా మన చీకటి అంతటినీ వెలుగుగా మలచారు. ఈ రోజు  యేసు ప్రభువు ఉత్తనమైన రోజు.  ఒక సమాధి పై పెద్ద బరువైన  రాయి దొర్లించబడి, ఆ సమాదిలోని దేహం  లేచి రాకుండా కావలికాయడానికి సైనికులు కాపలా ఉంచబడిన సమాధి. ప్రపంచ చరిత్రలో ఒకే  ఒకటి. అదియే  యేసు ప్రభువు సమాధి. యేసు ప్రభువు మరణానికి కారకులైన ప్రధానర్చకులు, పరిసయ్యులు కలసి యూదయ రాష్ట్ర పరిపాలకుడైన పిలాతు దగ్గరిని పోయి ఇలా విన్నవించారు. 

అయ్యా! ఆ మోసగాడు యేసు జీవించి ఉన్నప్పుడు , నేను మూడు దినాలు తరువాత జీవంతో లెతును అని చెప్పినట్టు మాకు జ్ఞాపకమున్నాడు. అతని శిష్యులు  అతనిని సమాధి నుండి  దొంగిలించుకొని పోయి మృతుల నుండి జీవంతో లేచెను అని ప్రజలకు చెప్పుదురేమో, అప్పుడు మొదటి మోసం కంటే ఇది మరి ఘోరముగా వుండును కనుక మూడవ దినము వరకు సమాధిని భద్రపరప అజ్ఞాపింపమని చెప్పిరి. అందుకు పిలాతు మీకు కావలివారు వున్నారు గదా! పోయి మీ చేతనైనంత వరకు సమాధిని కాపలా  చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతి పై ముద్ర వేసి కావలివారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. మత్తయి 27:63-66 లో ఇది అంత చూస్తున్నాము. 

ఆదివారం ప్రాతః కాల సమాయమన పెద్దగా  భూమి కంపించేను . ఎలయన పరలోకం నుండి దేవ దూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపువలెను, వస్త్రము మంచువలెను తెల్లగా ఉండెను. కాపలాదారులు భయపడి చని పోయిన వారి వలె పడి పోయెను. అంతలో అక్కడికి వచ్చిన స్త్రీతో ఆ దేవదూత భయ పడకుడు  మీరు శిలువ వేయబడిన యేసును వెదకుచున్నారా ? ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లుగా సమాధి నుండి లేచెను అని చెప్పెను.  ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కాపలా కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ఆ ప్రధానార్చకులకు పరిసయ్యులకు చెప్పిరి. 

ప్రభువు దర్శనం - ఖాళీ సమాధి 

మీరు భయపడకుడు. శిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన పునరుత్థానుడైనాడు, ఇక్కడ లేడు, వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు మార్కు 16:6. క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా దేవుని బిడ్డలారా ప్రభుని ఉత్థాన మహోత్సవం , మనం జరుపుకునే పండుగలన్నింటిలో క్రీస్తు ఉత్థాన పండుగ ఒక అత్యంత గొప్ప పండుగ. ఈ రోజు ప్రత్యేకంగా క్రీస్తు విశ్వాసులందరు కలసి, క్రీస్తు ప్రభువు యొక్క ఉత్థానాన్ని , ఉత్థాన సందేశమును ప్రపంచానికి , సర్వ మానవాళికి ప్రకటించుచున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు తన వెలుగును,శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యం పొందుకొని మొదటగా ఖాళీ సమాధిని దర్శించిన ముగ్గురు వ్యక్తులు మగ్ధలా మరియమ్మ , పేతురు, యోహను. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకే నిరీక్షణ , ఒకే ఎదురు చూపును చూస్తున్నాము. 

యెరుషలేములో జరిగిన ఈ సంఘటనల తరువాత శిష్యులందరు భయాందోళనలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. పేతురు నేను ఆయనను ఎరుగాను అని మూడు సార్లు బోంకారు. యోహను 18:27. 

యోహను శిలువ  వరకు క్రీస్తు ప్రభుని వెంబడించినను ఎంతో భయపడ్డాడు. మగ్ధలా మరియమ్మ  యేసు ప్రభువును అనుసరించడం నేర్చుకొన్న స్త్రీ. ఈమె ప్రభువును అధికంగా ప్రేమించినది. కలువరి కొండవరకు ఆయనను అనుసరించినది. ఆయన శిలువ పై వ్రేలాడే సమయంలో ఆయన ప్రక్కనే ఉన్నది. ఆయన చనిపోవడం చూసినది. ఆయనను సమాధిలో ఉంచడం చూసినది. ఒంటరిగా , దుఃఖంతో నిండిన హృదయముతో ఆదివారం పెందలకాడనే సమాధి దగ్గరకు వెళ్ళి యేసు భౌతిక దేహాన్ని చూసి విలపించాలి అనుకున్నది. ఆయన భౌతిక దేహానికి సుగంధం పూసి అలంకరించాలి అనుకున్నది, ఆయన భౌతిక దేహాన్ని దర్శించుకోవాలి అనుకున్నది. చివరికి సమాధి దగ్గరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఈ ముగ్గురు కూడా క్రీస్తును వెదకడం మనం ఈనాటి సువిశేషంలో వింటున్నాము. వారు కూడా సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ అంత చీకటిగా ఉంది. సమాధి రాయి తొలగించబడి వుంది. వారు లోనికి వెళ్ళి ఖాళీ సమాధిని గుర్తించారు. 

క్రీస్తు దేహము అక్కడ వారికి కనిపించలేదు. వారికి ఆ పరిస్థితి అర్ధం కాలేదు. రకరకాల అనుమానాలు వారి మదిలో మెదిలాయి. ఖాళీ సమాధికి ఒక అర్ధం లేదు అనిపించింది. వారు ఖాళీ సమాధిని చూసి ప్రభువును విశ్వసించలేదు, నమ్మలేదు కానీ ఆ సమాధిని చూసి వారు  నిరాశ చెందలెదు. వారిలో ఎక్కడో ఆశలు చిగురించాయి. వారు ఆయనను వెదకటం ప్రారంభించారు. దేవ దూత అడుగుతుంది !అమ్మ నీవు ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? యోహను 20:15. అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపు వెళ్ళిరి. అయిద్దరును పరుగెత్తుచుండిరి.కానీ ఆ శిష్యుడు  పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను. యోహను 20:3-4. ఈ విధముగా ప్రభువును వెదకడం లో వారు ఆయనను కనుగొన్నారు. ఆయన దర్శన భాగ్యమునకు అర్హులైనారు. ఖాళీ సమాధి వారిని ఒక నూతన జీవితం వైపు నడిపించినది. వారి జీవితాలలో ఒక క్రొత్త ఆశను రేపినది. వారికి మార్గాన్ని చూపినది. ప్రియమైన మిత్రులారా వారిలోని తాపత్రయం, ఆశ, వారి ఆత్మ విశ్వాసం ఉత్థాన ప్రభువు దర్శనానికి తోడ్పడినది. 

వారంత ప్రభు దర్శనానికి   అనేక సార్లు నోచుకోని, వారు చూసిన ఖాళీ సమాధి నిజమని, ఒక వైపు ఖాళీ సమాధి, మరో వైపు ప్రభువు దర్శనం ,ఈ రెండు అంశాలు కూడా వారు విశ్వాసంతో వేదకడానికి తోడ్పడినవి. 

ప్రియమైన స్నేహితులారా మన రోజు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు,ఆటంకాలు, ఊహించని సంఘటనలు మన జీవితాన్ని ఒక ఖాళీ సమాధిగా చేస్తాయి. మన స్నేహితులుగాని కుటుంబ సభ్యులు గాని చనిపోయినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మన ప్రేమ ఫలించనప్పుడు మన జీవితం చీకటిగా కనిపిస్తుంది. మన జీవితంలో ముందుకు పోవడానికి అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. మన సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మన పరిస్థితి ఖాళీ సమాధిలా అనిపిస్తుంది. 

ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు ఎదురవుతుంటాయి కానీ మనం నిరాశ చెందక ,మగ్డలా మరియమ్మలా , పేతురులా యోహనులా సమస్య పరిష్కారం కోసం వెదకాలి. వారు ఏ విధంగా ప్రభువు కోసం , ప్రభువు కొరకు వెదకి ఆయనను కనుగొన్నారో,అధే విధంగా మనం కూడా మన జీవితంలో ఖాళీ సమాధిని చూసి భయ పడక క్రీస్తును వెదకాలి మత్తయి 7:7. లో  వెదకుడు దొరుకును అని చూస్తున్నాము, వారికి కనబడినట్లే మనకు కూడా తప్ప కుండా కనబడుతారు. 

అయితే ప్రభువు దర్శనం అందరికి ఒకేలా ఉండదు. ప్రభువు అనేక రూపాలలో , అనేక విధాలుగా మనకు ప్రత్యక్షం కావచ్చు. ప్రతి ఒక్కరి శక్తిని బట్టి , జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరి విశ్వాస అనుభూతి మారుతూ ఉంటుంది. ఒకరు పొందిన అనుభూతి , ఆనందం మరొకరు పొందకపోవచ్చు. కనుక క్రీస్తును మన జీవితంలో గుర్తించి కనుగొన్నప్పుడు మనం కూడా ఉత్థాన క్రీస్తు ఆనందాన్ని , ప్రేమను , శాంతిని పొందగలుగుతాము. 

యేసు ప్రభువు ఉత్థానుడయ్యాడు ఇది మనందరికీ ఒక శుభవార్త కాని ఈ యేసు ప్రభువు ఉత్థానమే  మనందరికీ ఒక సందేశం. అయితే ఈ క్రీస్తు ఉత్థానం ద్వార ఆశ, నమ్మకం ఎక్కడ నుండి వస్తుంది? ఈ సందేశాన్ని ఎక్కడ వెదకగలం? సువిశేషంలో విన్నట్లు , ఈ నమ్మకం ఆశ, యేసుని భూస్థాపితం చేసిన సమాధి నుండి వస్తుంది. కారణం ఆ సమాధి అందరిని ఆకర్షించింది. ఈ సమాధి దగ్గరకే మగ్దల మరియమ్మ , పేతురు , యోహనులు వెళ్ళినది. ఈ సమాధి వారిలో ఉత్థాన క్రీస్తు ఆశలు రేపినది. వారిలో నమ్మకాన్ని పెంచినది ప్రభువు యొక్క ఉత్థానం . మనందరి జీవితాలలో నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన ఈనాటి ఉత్థానం అవుతూనే ఉన్నాడు. 

ప్రతి సారి ప్రియమైన స్నేహితులారా మనలో ఉన్న చెదుకు మనం మరణించినప్పుడు క్రీస్తు ఉత్థానం అవుతున్నాడు. మన స్వార్ధాన్ని వీడి ఇతరులను ప్రేమించినప్పుడు దయ,కరుణ, జాలి అను గుణాలు మనలను ముందుకు నడిపించినప్పుడు క్రీస్తు మనలో ఉత్థానమవుతున్నాడు. మనం చేసే ప్రతి మంచి పని, ఆలోచన ద్వారా క్రీస్తు ఈ లోకంలో ఇంకా ఉత్థానమవుతున్నాడు. కనుక ప్రతి సంఘటన ద్వార ప్రతి రోజు మనకు ఉత్థాన మహిమను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి రోజు కూడా ఒక ఉత్థాన రోజుగా జీవించినప్పుడు , ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానం ,ప్రేమ , ఐక్యత మనలను ముందుకు నడిపిస్తాయి. పునరుత్థానం ఒక నూతన జీవితం, ప్రభువుతో ఉన్న అనుభందముతో ఒక నూతనత్వంతో ,సాటివారితో ఉన్న అనుబంధంలో నూతనత్వం కలిగి వుందాం. క్రీస్తు ప్రభువు విధానములో , ఆయన జీవించినట్లు అటు దేవునితో ఇటు పొరుగు వారితో జీవించడం ఒక ఉత్థానం జీవితమే. 

ఉత్థాన ప్రభువుని విశ్వసించడం అంటే ఖాళీ సమాధి దగ్గర జీవిత కష్టాలలో జీవించడం కాదు, ఆ ఉత్థాన క్రీస్తు శాంతి , సమాధానాలును , సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం. ఇలా ఒక నూతన ప్రపంచానికి నాంది పలకాలి. క్రీస్తు మరణం ఉత్థానం మన అనుదిన జీవితంలో భాగం కావాలి . ఆయన జననం , మరణం , ఉత్థానం ,నిత్యం మన జీవిత విధానం కావాలి. ప్రతి రోజు ఒక ఉత్థాన పండుగ కావాలి, ప్రతి రోజు ఒక నూతన జీవితం కావాలి. ఆమెన్ 

Br. Manoj 

14, ఏప్రిల్ 2022, గురువారం

పవిత్ర గురువారం

 నిర్గ 12: 1-8,11-14,  1 కోరింతి 11:23-26  యోహను 13:1-15 

ఈరోజు  తల్లి శ్రీ సభ మనందరిని మూడు ముఖ్యమైన  అంశాలు ధ్యానించమని ఆహ్వానిస్తుంది. 

1. దివ్య సత్ప్రసాధ స్థాపన 

2. గురుత్వ స్థాపన 

3. యేసు ప్రభువు ఇచ్చిన నూతన ప్రేమ ఆజ్ఞ 

ఈ మూడు అంశాలు  కూడా దేవుని యొక్క ప్రేమ సేవా జీవితం గురించి తెలియ జేస్తున్నాయి. 

యేసు ప్రభువు యొక్క జీవితం ముగిసే సమయంలో ఆయన తొందరలోనే మరణిస్తాడని గ్రహించి తన శిష్యులకు ప్రేమ విందును ఏర్పరచారు. దానినే మనమందరం కడరాత్రి భోజనం అంటాము. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువు ఇచ్చిన కడరా విందు అతని యొక్క వీడ్కోలు విందు. తన శిష్యులను సంతృప్తి  పరచి, బలపరచిన విందు. ఈ విందులో  క్రీస్తు ప్రభువు తనను తాను తన శిష్యులకు అందించాడు. 

ఈనాటి మొదటి పఠనంలో యిస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో భుజించిన కడరా విందును గురించి భోదిస్తుంది. దీనినే యిస్రాయేలు ప్రజలు పాస్కా విందు అని కూడా పిలుస్తారు. 

యిస్రాయేలు ప్రజలను బానిస బ్రతుకుల నుండి విడిపించుటకు మోషేను ఎన్నుకొని , అతన్ని ఫరో రాజు దగ్గరకు పంపించారు. అతడు ప్రవక్త  యొక్క మాటలు లెక్క చేయలేదు. 

ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి ఫరో రాజు అంగీకరించలేదు. ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించారు. పది  అరిష్టాలు కలిగించినా ఫరో రాజులో మార్పు లేదు. అందుకే చివరిగా  ఫరో రాజుకు ఒక పాఠం నేర్పించుటకు  దేవుడు మోషేతో యిస్రాయేలును విడిపించుటకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రజలను  కూడా సిద్దపరచమని ప్రభువు మోషేకు తెలియచేశాడు. 

ఈ యొక్క ఐగుప్తులో చేసే  ఆఖరి విందు  ఎలా తయారుచేయాలో ఎలాగ దానిని భుజించాలో  అన్నియు ప్రభువు  తెలుపుచున్నారు.  ఈ విందును  హిబ్రూ బాషలో పెసక్ అని అంటారు అంటే  ఆఖరి  దెబ్బ  అని అర్ధం.  ఈ పదం  యొక్క అర్ధం  ఐగుప్తు  ప్రజల్లో నెరవేరింది. యిస్రాయేలు  ప్రజలను విడిపించే  ఆ రాత్రే  దేవుడు ఐగుప్తు  వాసులను ఆఖరి  దెబ్బ కొట్టారు.  వారి జాతీయుల్లో  తొలిచూలు  పిల్లలందరిని హాతమార్చారు. దీని వలన  ఫరో  రాజు భయపడి యిస్రాయేలు  ప్రజలకు స్వేచ్చనివ్వడానికి అంగీకరించారు. 

ఫరో రాజు యిస్రాయేలు ప్రజలకు స్వేచ్ఛ నివ్వకముందే దేవుడు యిస్రాయేలు ప్రజలను ప్రయాణానికి సిద్దం కమ్మన్నారు. దీనితో పాటు  ఆ రాత్రి భుజించే  ఆఖరి విందును తమను స్వేచ్ఛ  స్వతంత్రులుగా  చేసినందుకు గుర్తుగా ప్రతి ఏడాది జరుపుకోవాలని ముందుగానే యావే దేవుడు తెలియ జేశారు. 

ఈ విందు ప్రజలను విముక్తులను చేసినందుకు గుర్తుగా ఉంది. బానిస బ్రతుకుల నుండి విముక్తులను, ఫరో రాజు యొక్క బంధములనుండి , ఆయన  చేతుల నుండి  వారిని దేవుడు విముక్తులను చేశారు. 

ప్రతి విందు మనలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది, పోషిస్తుంది మనల్ని నడిపిస్తుంది. యిస్రాయేలు ప్రజలు ప్రయాణం చేయుటకు దేవుడు ఈ విందు జరుపుకోమని తెలుపుచున్నారు. 

యేసు క్రీస్తు ప్రభువు  కూడా తాను శిలువ శ్రమలు అనుభవించే ముందు ఈ లోక  జీవితం ముగించే ముందు శిష్యులకు కడరా  విందు ఏర్పరిచారు. దీనినే  దివ్య సత్ప్రసాద స్థాపన అంటారు. 

ప్రభువు స్థాపించిన ఈ విందు దివ్య సత్ప్రసాదం మనందరిని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, శక్తినిస్తుంది. మనల్ని నడిపిస్తుంది. అధే విధంగా మనందరిని పాప బంధముల నుండి విముక్తులను చేస్తుంది. 

ఐగుప్తులో యిస్రాయేలు ప్రజలు భుజించినది కడరా విందుయే అధే విధంగా  క్రీస్తు  ప్రభువు కూడా భూలోకంలో చివరిగా కడరా విందును భుజించారు. 

విందు చేయుటకు దేవుడు పవిత్రమైన, మేలైన  గొర్రె పిల్లను ఎంచుకోమని ప్రభువు తెలియచేసారు. నిర్గ 12:3-5 

గొర్రె పిల్ల యొక్క  రక్తం, విందు యిస్రాయేలు ప్రజలను కాపాడింది.  నూతన నిబంధన గ్రంధంలో  యేసు ప్రభువును బాప్తిస్మ యోహను గారు కూడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల  అని అన్నారు. 1 యోహను 1:29. 

ఎందుకు యేసు ప్రభువును గొర్రె పిల్ల అంటున్నారంటే 

గొర్రె పిల్ల వినమ్రతకు  గుర్తు

గొర్రె పిల్ల మృధువుగా ఉంటుంది. 

గొర్రె పిల్ల తనకు తాను సమర్పించుకోంటుంది 

గొర్రె పిల్ల ఎవరికి హాని చేయదు  

గొర్రె పిల్ల బలికి సమర్పించబడింది 

గొర్రె పిల్ల పవిత్రమైనది , నిర్మల మైనది. 

గొర్రె పిల్ల విలువైనది. 

యేసు ప్రభువులో ఇవన్నీంటిని మనం  చూస్తున్నాం . ఆయన  మనకు ఒక నిదర్శనం. యావే దేవుడు  గొర్రె పిల్లను ఎంచుకోమంటున్నారు. కేవలం ఒక సంవత్సర ప్రాయం ఉన్నది. అదే విధంగా  యోహను గారు ప్రభువును గొర్రె పిల్ల అంటున్నారు. గొర్రె పిల్ల జీవితం కాలం కొన్ని నెలలు మాత్రమే. ఈ కొన్ని నెలల్లోనే అది తన ప్రాణాన్ని ఇతరుల కోసం త్యాగం చేస్తుంది. అధే విధంగా  యేసు  ప్రభువు యొక్క జీవితం కూడా కొద్ది కాలమే ఆయన కూడా మనందరం  రక్షించబడాలి అని తన రక్తం చిందించారు.  మనం పోషించబడాలి అని తన శరీరంనే భోజనంగా ఒసగి ఉన్నారు. 

దివ్య సత్ప్రసాదం దేవుడిచ్చిన  గొప్ప వరం. తనను తానే బలిగా  సమర్పించుకొని  మనలను  రక్షించారు. దివ్య సత్ప్రసాదం శ్రీ సభ యొక్క ఆధ్యాత్మిక  సంపద. సాక్షాత్తు దేవుడు దానిలో ఉన్నారు. ఆయనయే దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్నారు. 

దివ్య సత్ప్రసాదం ద్వారా  దేవుడు తనను తాను మనకు ఇచ్చారు. ఆయన జీవం మనకు ఇచ్చారు, ఆయన సజీవ ప్రేమనిచ్చారు , ఆయన యొక్క బలము మనకిచ్చారు. ఆయన యొక్క సమస్తమును మనకిచ్చారు. 

శిష్యులు ఎన్నడూ తన యొక్క సాన్నిధ్యం కోల్పోరాదని, ఎన్నడూ వారు ఒంటరి వారని భావించకూడదని , ఎల్లప్పుడు శిష్యులతో తన ప్రజలతో ఉండుటకు దేవుడు దివ్య సత్ప్రసాదం  స్థాపించారు. 

దివ్య సత్ప్రసాద విందు అందరం కలసి చేసే విందు ఈ విందు ప్రేమతో, ఐక్యతతో  జీవించమని కోరుతుంది. 

దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువు  యొక్క కల్వరి బలిని గుర్తు చేస్తుంది. యేసు ప్రభువు స్థాపించిన  దివ్య సత్ప్రసాదంను గురువులు కొనసాగిస్తారు. 

ఇది నా జ్ఞాపకార్ధం  చేయమని ప్రభువు  తన శిష్యులను అజ్ఞాపించారు. దివ్య సత్ప్రసాదంను ప్రజలకు అందించేది యాజకులే. 

యాకోబు యొక్క కుమారులలో ఒక జాతిని దేవుడు ప్రత్యేకంగా  దేవాలయ విధుల కోసమే ఎన్నుకొన్నారు. 

లేవియ వర్గం వారిని ప్రత్యేకంగా బలులు సమర్పించుటకు దివ్య మందసం మోయుటకు దూపం  వేయుటకు దేవుడు వారిని ప్రత్యేకంగా ఆయన సేవ కోసం ఎన్నుకొన్నారు. సంఖ్యా 8:5-22. 

ప్రజల కొరకు ప్రజల నడుమనుండి  ఎన్నుకొనబడిన వారు యాజకుడు . గురువులను another christ అని సంభోదిస్తారు. క్రీస్తు ప్రభువు యొక్క ప్రతిరూపమే యాజకులు. ఈ రోజు ప్రత్యేకంగా యాజకుల రోజు  ఎందుకంటే క్రీస్తు ప్రభువే తన శిష్యులకు ఒక బాధ్యతగా తన పనిని చేయమని కోరుచున్నారు. 

యేసు ప్రభువు నిజమైన  యాజకుడిగా, నిత్య  యాజకుడిగా ఆయన ఈ లోకంలో  జీవించారు. 

యేసు ప్రభువు యొక్క యాజకత్వంలో ప్రతి గురువు కూడా పరిపూర్ణుడగుచున్నాడు. ఆయనయే ఒక మంచి నిదర్శనం. ఆయన యాజకత్వంలో  ఉన్న గొప్ప తనం. 

ప్రజల కొరకు పంపబడినారు క్రీస్తు ప్రభువు 

ప్రజల మధ్య  ప్రేమతో జీవించారు, ప్రజలకు దేవుడ్ని చూపిన యాజకుడు. ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుంది మనలను పరలోకం వైపు నడిపించారు. 

ఆయన నిస్వార్ధ సేవ చేశారు, దానిలో భాగమే శిష్యుల పాదాలు కడుగుట. ఏ  గురువు యజమానుడు, చేయనటువంటి పని నిత్య యాజకుకుడైన క్రీస్తు ప్రభువు చేశారు. 

ఆయన యాజకత్వం కేవలం తన సొంత వారికి మాత్రమే కాదు అందరి కొరకు ఆయన అభిషేకించబడ్డారు. ప్రజలను తండ్రి వైపు నడిపిన యాజకుడు క్రీస్తు ప్రభువు.  తనను తాను రిక్తుని చేసుకున్న యాజకుడు. 

ప్రజలకు చేరువలో ఉండే యాజకుడు వారి పాపాలు  క్షమించే యాజకుడు, జీవిత సత్యమును భోదించె యాజకుడు. 

అన్నింటిలో కూడా సుమాతృకగా  ఉండే యాజకుడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు వలె ప్రతి యాజకుడు కూడా  జీవించాలి. 

ఈ రోజు ప్రత్యేకంగా యాజకుల యొక్క గొప్పతనం గ్రహించాలి. యాజకుల ద్వారానే మనం క్రైస్తవ  జీవితం ప్రారంభమగుచున్నది. వారి ద్వారానే మన జీవితం  ముగిస్తుంది.  యాజకుల వలన జ్ఞాన స్నానం పొందుతున్నాం. దివ్య సత్ప్రసాదం ,పాప క్షమాపణ , భద్రమైన అభ్యంగనం , జ్ఞాన వివాహం, గురు పట్టాభిషేకం ,అవస్తభ్యగనం జరుగుతుంది. 

వారి యొక్క పవిత్ర  హస్తాల ద్వారా ప్రతి ఆశీర్వాదం కలుగుతుంది. ఇల్లు కట్టేటప్పుడు గురువుకావాలి,కూల్చేటప్పుడు గురువు కావాలి,  బిడ్డలు స్కూలుకు వెళ్లేటప్పుడు , పరీక్షలు రాసేటప్పడు,అనారోగ్య సమయంలో అన్ని సమయాలలో క్రైస్తవుల యొక్క జీవితంలో బాగుండటానికి గురువు కావాలి. 

ప్రజల కొరకు ఎన్నుకొనబడిన, ప్రజల కొరకు జీవించి మరణించే వారే మంచి యాజకులు. ప్రతి యాజకుని జీవితంలో  ప్రార్దన ఉండాలి. మోషే ప్రవక్త వలె ప్రార్ధనలో దేవునితో గడపాలి, దేవుని ప్రజలను నడిపించాలి. 

ఏలియా వలె ఎన్ని రకాలైన సవాళ్ళు ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలి. 

యిర్మియా వలె శ్రమలు పొందుటకు సిద్దంగా ఉండాలి, క్రీస్తు ప్రభువు వలె ప్రేమతో జీవించాలి కాబట్టి యాజకుల కోసం ప్రార్ధించుదాం. 

3. యేసు ప్రభువు ఇచ్చిన నూతన ఆజ్ఞ 

మీరు  ఒకరినొకరు ప్రేమింపుడు  నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపుడు  మీరు పరస్పరం  ప్రేమ కలిగియున్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసు కొందురు అని ప్రభువు  యోహను 13:34-35 వచనాలలో పలుకుచున్నారు. ఈ  నూతన ఆజ్ఞ పాటించుట ద్వారా మనం దేవునికి సాక్షులుగా ఉండవచ్చు. 

ఈ ఆజ్ఞ పాత నిభందన గ్రంధంలో ఉన్నది. ద్వితీ 6: 5 , లెవీ 19:18. మరి ఎందుకు నూతన ఆజ్ఞ అని పిలుస్తుంటాం అంటే ప్రభువు అంటున్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని పలుకుచున్నారు. 

ఆయన మనలను ప్రేమించిన విధంగా మనలను ప్రేమించమని ఆజ్ఞ ఇస్తున్నాడు. 

నిజమైన ప్రేమ ఎలాంటిదో యేసు ప్రభువుతన జీవితం ద్వారా మనకు తెలియచేసారు. ఆయన కేవలం తన ప్రేమను యూదులకు మాత్రమే కాకుండా అందరికి పంచి ఇచ్చారు. 

యూదులకు అన్యులకు మధ్య ఉన్న అడ్డుగోడలు అన్ని ప్రభువు తీసివేసి అందరిని సరిసమానంగా ప్రేమించారు. 

యేసు ప్రభువు యొక్క ప్రేమ శత్రువులకు కూడా అందజేయబడినది. ఎందుకంటే తనను హింసించిన వారిని,శిక్షించిన వారిని అందరిని కూడా యేసు ప్రభువు ప్రేమించి క్షమించారు. మనందరం సాధారణంగా మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. కాని దేవుడు  అందరికి పాపులను,సుంకరులను యూదులను , మంచివారిని, చెడ్డ వారిని అందరిని ప్రేమించారు. ఆయన భోదించినది ప్రతిదీ కూడా పాటించారు. మత్తయి 5:43-45. 

తనను సిలువ వేసి హింసించిన వారి కొరకు ప్రార్ధించి మనకు ప్రేమలోని నూతనత్వం చూపారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తన యొక్క మరణం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుడయినప్పటికి ఒక దొంగ వాని వలె శిలువ మీద మరణించారు. దొంగవానికి వేసిన శిక్షను భరించారు. ప్రజల పాపాలకు  మరణించాలనుకున్నారు. సిలువ భారం మోసారు. ఇవన్నీ కూడా ప్రభువు చేశారు ఎందుకంటే మనపట్ల ఉన్న ప్రేమ అలాంటిది. 

యేసు ప్రభువు యొక్క ప్రేమ చాలా గొప్పది,ఆయన యొక్క ప్రేమను ఎవరు ఈ లోకంలో చూపించలేరు. 

ఆయన ప్రేమ అర్ధం చేసుకొనే ప్రేమ - అందరిని అర్ధం చేసుకొని వారితో కలిసి మెలిసి జీవించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవించేవారు అయిన వారిని అర్ధం చేసుకొన్నారు, చేరదీశారు తన స్నేహితులుగా చేసుకొన్నారు. 

ఆయన ప్రేమ త్యాగ పూరితమైన ప్రేమ - తనను తాను మన కోసం త్యాగం చెసుకున్నారు, సంపూర్ణంగా తన జీవితాన్ని మనకు సమర్పించి ఉన్నారు. 

ఆయన ప్రేమ క్షమించే ప్రేమ - ఎన్ని రకాలైన తప్పిదములైన  దేవుడు మన్నించారు. అందరి పాపాలను మన్నించారు. మత్తయి 9:2-8, యోహను 8:3-11 లూకా 7:36-50. లూకా 17:3, లూకా 23:34 

ఆయన ప్రేమ ఎల్లలు లేని ప్రేమ - ఎటువంటి హద్దులు ఆయన ప్రేమకు లేవు. 

యేసు ప్రభువు ఎవ్వరు చేయని విధంగా, ప్రేమించని విధంగా మనల్ని ప్రేమించారు. అందుకు అది నూతన ఆజ్ఞ అనుచున్నది. 

ప్రేమ మార్గమే సరియైన మార్గం  అని దేవుడు ఎన్నుకొన్నారు . ప్రేమ మనలో మార్పు తెస్తుంది. ప్రేమ మన జీవితాలను దేవునికి ఇష్టమయ్యేలా చేస్తుంది. 

మనందరం కూడా ప్రేమ కలిగి జీవించడానికి  ప్రయత్నం చేయాలి. మనిషి ఈ లోకంలో పుట్టింది దైవ ప్రేమ , తల్లిదండ్రుల ప్రేమ వలనే కాబట్టి పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం. 

ఈనాటి సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభువు శిష్యుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. వారి యొక్క పాదాలు కడుగుటకు సైతం ఆయన సిద్ధంగా ఉన్నారు. 

పాదాలు కడుగుట కేవలం సేవకులు మాత్రమే చేస్తారు. ప్రభువు అందరి పాదాలు కాడిగారు ప్రేమకు గొప్ప చిహ్నం. 

యేసు క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకొని శిష్యులకు ఒక సుమాతృకగా ఉన్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినంత కాలం ప్రేమను పంచి  సేవ చేశారు కాబట్టి మనం కూడా ఆయన శిష్యులుగా ఉండాలంటే అదే ప్రేమను పంచి జీవించాలి. 


Rev. Fr. Bala Yesu OCD


9, ఏప్రిల్ 2022, శనివారం

మ్రాని కొమ్మల ఆదివారం

 యేసు ప్రభువు తన యొక్క వైభవాన్ని పబ్లిగ్గా చాటడానికి అంగీకరించిన రోజు. యేసు ప్రభువు మరణానికి ఒక జాతి కాకుండా , మానవ జాతి అంతా బాధ్యత వహించింది. 

క్రీస్తు నాధునియందు ప్రియ దేవుని బిడ్డలారా మరియు క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుతుంది. మ్రాని కొమ్మల ఆదివారం నాడు యేసు క్రీస్తు ఒక గొప్ప రాజుగా బేతానియ  నుండి యెరుషలేము దేవాలయంలోనికి ప్రవేశించటం. అదే విధంగా ఈ రోజు నుండి యేసు ప్రభువు జీవితంలో కష్టాలు మరియు  శ్రమలు ప్రారంభం అవుతాయి.  

ఈ రోజున మూడు పఠనాలు కూడా శ్రమలన్నీటిని,  ప్రేమతో ఎలా స్వీకరించటమో చూస్తున్నాము. 

మొదటి పఠనములో  యోషయా ప్రవక్త తెలియచేస్తున్నాడు, సేవకుడు అంటే, దేవుని సేవకుడు శ్రమలన్నీటిని కూడా ప్రేమతో ఇతరుల కోసం అనుభవించటం మనము గమనిస్తున్నాము. సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు మనందరి రక్షణ కొరకై తనను తాను బలివస్తువుగా సీలువపై సమర్పించుటను గురించి చూస్తున్నాము. రెండవ పఠనంలో  పిలిప్పీయులకు వ్రాసినటువంటి లేఖలో  క్రీస్తు ప్రభువు మానవుల రక్షనార్ధమై తనను తాను తగ్గింపు తనముతో ఆ సీలువపై మనస్పూర్తిగా అంగీకరించి, మనందరి కొరకై బలిగా సమర్పించుకున్నారు. అని పునీత పౌలుగారుఅంటున్నారు.  

మొదటి పఠనం 

సేవకుని యొక్క జీవితం : 

సేవకుడు అందరికి ఒ సేవకుని వలె జీవించాలి. అంటే తగ్గింపు తనముతో జీవించాలి. దీనిని  క్రీస్తు ప్రభువు జీవితంలో చూస్తున్నాము. తనను తాను తగ్గించుకొని , ఒక సేవకుని వలె తనను తాను సీలువపై బలిగా మానవులందరి కొరకు సమర్పించుకున్నాడు.  . అలాగే మనం జీవించాలి. 

సేవకుని జీవితంలో కష్టాలు, సుఖాలు 

: మనం ఎప్పుడైతే సేవకుని వలె జీవిస్తామో అప్పుడే మన యొక్క జీవితంలో కష్టాలు, సుఖాలు సంభవిస్తాయని యోషయా ప్రవక్త తన యొక్క జీవితం ద్వారా  తెలియజేస్తున్నాడు. 50:5-7. 

ఈ యొక్క సేవకుడుతగ్గింపు  జీవితం జీవించాలి : జీవితంలో ఎన్ని ఇబ్బందులు కష్టాలు, శ్రమలు వచ్చిన కూడా తగ్గింపు జీవితం జీవించాలని యోషయా ప్రవక్త , క్రీస్తు శిష్యులు  మరియు క్రైస్తవులందరు కూడా తమ యొక్క జీవితం ద్వారా చూపిస్తున్నారు. 

అలా జీవించాలంటే సేవకుడు ఏమి చేయాలి :

 ఈ యొక్క తగ్గింపు జీవితం జీవించాలంటే సేవకుడు అనేవాడు యజమాని యొక్క అడుగుజాడల్లో నడవాలి అంటే క్రైస్తవులమైన మనమందరం కూడా క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడవాలి. ఏవిధంగానైతే యోషయా ప్రవక్త  మరియు క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని మాటలను అనుసరించి జీవించారో అదే విధంగా మనమందరం కూడా జీవించాలి. 

సేవకునిగా జీవించడం ద్వార వచ్చే లాభాలు :

 క్రైస్తవులమైన  మనం సేవకునిగా జీవించడం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం పొందుతాం. మరియు ఇతరులకు ఒక గొప్ప ఉదాహరణగా ఉంటాము. ఈ ఐదు అంశాలను  ఈనాటి మొదటి పఠనంలో యోషయా  యొక్క జీవితం ద్వారా చూస్తున్నాము. యోషయా మరియు క్రీస్తు ఏ విధంగా జీవించారో  తమ యొక్క జీవితాలను ఇతరుల కొరకు ధార పోసి అనేకమైనటువంటి బాధలను, ఇబ్బందులను అవమానములను పొంది మన యొక్క జీవితాలకు  ఒక గొప్ప మేలుగా మరియు  మార్గధర్శులుగా ఉన్నారు. అధేవిధంగా  మనమందరం వారి ఇద్దరి వలే  జీవించాలని మొదటి పఠనం మనకు తెలియచేస్తుంది. 

రెండవ పఠనం 

రెండవ పఠనములో పునీత పౌలు గారు క్రీస్తు మొక్క వినయము , ఆ యొక్క వినయము ద్వారా పొందినటువంటి అత్యున్నత స్థానము గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకంటె క్రీస్తు ప్రభువు దేవుని యొక్క బిడ్డ అయినకాని  తనను తాను తగ్గించుకొని ఒక సేవకుని వలె మానవ రూపం దాల్చి ఈ యొక్క  లోకంలో ఉన్నటువంటి పాపాత్ములమైన  మనందరి కొరకు ఈ భూలోకంలోనికి వచ్చి యున్నారు. 

ఏ విధంగానైతే మొదటి పఠనములో యోషయా ప్రవక్త జీవితం గురించి చూసియున్నామో అదే విధంగా పౌలుగారు క్రీస్తు యొక్క జీవితం గురించి పిలిప్పు ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క యోషయా ప్రవక్త మరియు పౌలుగారు ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నుకోబడినవారు . అంతే కాకుండా దేవుని యొక్క మాటలను తు. చ తప్పకుండా వారి యొక్క జీవితంలో జీవించి యున్నారు. 

వీరు ఇద్దరు కూడా ఈ రెండు పఠనాలలో క్రీస్తు యొక్క జీవితం గురించి ప్రస్తావించడం మనకందరికీ కూడా ఆశ్చర్యం. ఎందుకంటే యోషయా 50:6 వ వచనంలో చూస్తున్నాము. నన్ను మోదువారికి నా వీపును అప్పగించితిని, నా మొగము మీద ఉమ్మి వేసినప్పుడు నేనూరకుంటిని, నన్ను అవమానించుచుండగా నేనురకుంటిని, ఇది అంతా కూడా క్రీస్తు యొక్క జీవితంలో అక్షరాల  నెరవేరింది. ఎందుకంటే పిలిప్పీ 2:8 వ వచనంలో చూస్తున్నాము, క్రీస్తు  మరణము వరకు , సిలువ మరణము వరకు విధేయుడయి జీవించేను. 

అందుకే పునీత పౌలుగారు అంటున్నారు. క్రీస్తు ఏ విధంగానైతే  వినయవంతుడై  జీవించాడో ఆ యొక్క జీవితం ద్వారా అత్యున్నత స్థానాన్ని  పొందియున్నాడు. అదేవిధంగా  క్రైస్తవులమైన మనం  క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుస్తూ, క్రీస్తు యొక్క వినయము మనకందరికీ రావాలని , ఒక తగ్గింపు జీవితం జీవించాలని  ఈనాటి రెండవ పఠనం తెలియజేస్తుంది. 

సువిశేష పఠనం 

సువిశేష పఠనంలో లూకా సువార్తికుడు  క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించాడు, ఆ యొక్క శ్రమల ద్వారా మానవులకు  ఏ విధంగా  రక్షణ కలిగిందో తెలియజేస్తున్నాడు.  ఈ యొక్క లూకా సువార్తికుడు తన యొక్క సువార్తను అన్యుల కోసం రాశారు. ఎందుకంటే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలం యూదుల కోసం మాత్రమేకాదు,  సర్వమానవాళి కోసం వచ్చారు అని లూకా గారు వివరించారు. తండ్రి అయిన దేవుని దయ , ప్రేమ , పాప మన్నింపు అన్నవి పవిత్ర   గ్రంధంలో ప్రధానాంశాలు. అటువంటి దేవుని సిలువ వేయటం మనం చూస్తున్నాం. 

యేసు యొక్క సొంత ప్రజలే ఆయన్ను తృణీకరించి ఆయనను మట్టుపెట్టాలనుకున్నారు, అంటే క్రీస్తు యొక్క రూపంలో వచ్చినటువంటి రక్షణను త్యజించారు. మరియు తృణీకరించారు. యేసుని సిలువ వేయుడు అని ఒక్కటిగా డిమాండు చేశారు పిలాతుని.  వారి బెదిరింపులుకు బయపడినటువంటి పిలాతు క్రీస్తుకు సిలువ మరణంను  ఆమోదించాడు. 

ప్రభువైన క్రీస్తు మానవుని యొక్క రక్షనార్ధం కొరకై ఆ యొక్క సిలువ మరణంను అంగీకరించాడు. మరియు మానవుల యొక్క పాప పరిహారమునకై ఆ యొక్క సీలువను మనస్పూర్తిగా అంగీకరించాడు. ఏ విధంగానైతే  క్రీస్తు మన యొక్క జీవితాలకు రక్షణ కల్పించాడో  అదే విధంగా  మనమందరము కూడా ఇతరులకు మన యొక్క ప్రార్దన జీవితం  ద్వారా రక్షణ కల్పించాలని ఈనాటి సువిశేష పఠనం  ,మరియు  రెండు పఠనాలు  కూడా మనలను ఆహ్వానిస్తున్నాయి. 

Br. Johannes OCD

తపస్సుకాల 6 వ ఆదివారం, మ్రాని కొమ్మల ఆదివారం

 మ్రాని కొమ్మల ఆదివారం 

 యోషయా 50: 4-7, పిలిప్పీ 2: 6-11 లూకా 19:28-40, 22:14-23:56 

ఈ రోజు తల్లి శ్రీ సభ  మ్రాని కొమ్మల ఆదివారం కొనియాడుచున్నది. దీనినే  క్రీస్తు పాటుల ఆదివారం అని కూడా పిలుస్తారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో సంతోష సమయాలు కొన్ని ఉంటాయి. ఈ మ్రాని కొమ్మల రోజు కూడా  ప్రభువు యొక్క జీవితంలో  ప్రత్యేకమైనది, సంతోష కరమైనది ఎందుకంటే ప్రజలు ఆయన్ను రాజుగా  గుర్తించి హోసన్న పాడారు. 

ప్రతి ఒక్కరి సంతోషాన్ని అనుభవించినట్లే తరచుగా దుః ఖాన్ని కూడా పొందుతుంటాం. విచారం కలిగినట్లే ఆనందం కూడా కలుగుతుంది. 

ఈరోజు మనందరం పవిత్ర వారంలోకి అడుగుపెడుతున్నాం. మన యొక్క రక్షణ సంఘటనలు ధ్యానించుకోబోతున్నాం. 

యేసు ప్రభువు యొక్క రక్షణ ఘట్టాలను ధ్యానించుకోబోతున్నాం. ఆయన యొక్క శిలువ , శ్రమలు, మరణం పునరుత్థానం అధే విధంగా క్రీస్తుతో మన మరణ, పునరుత్థనాలు కూడా ధ్యానించుకోవాలి. 

ఈ పవిత్ర వారం యొక్క ఘట్టాలు మనం శ్రద్దగా ధ్యానిస్తే మనకు దేవునితో ఉన్న సంబంధం పెరుగుతుంది. దేవునిలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది మనలో కూడా హృదయ పరివర్తనం కాలుగుతుంది. 

ప్రభువు నా కోసమే మరణించారు అనే ఆలోచన మన జీవితాలను మార్చుతుంది. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం నాడున రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

1. ఆయన మహిమ సంఘటన 

2. ఆయన శ్రమల సంఘటన 

మహిమ సంఘటన ఏమనగా ప్రజలు ప్రభువును రాజుగా గుర్తించి ఆయన్ను యెరుషలేముకు ప్రేమతో ఆహ్వానించారు. శ్రమలు సంఘటన ఏమనగా ప్రభువును ద్రోహిగా నిందించి ఆయన్ను శిలువ వేయుటకు పన్నాగం చేయుట. 

ఒకటి సంతోషకరమైనది రెండవది బాధాకరమైనది. మన శరీరంలో రక్తం నీరు ఎలాగైతే కలసి వుంటాయో మన యొక్క జీవితంలో కూడా బాధ , సంతోషం కలసి ఉంటాయి. 

ఈరోజు మ్రానికొమ్మలతో ప్రదక్షణలో  వచ్చే సమయంలో ఒక సువిశేష భాగం చదువుతాం, పూజలో శ్రమల వృత్తాంతం చదువుతాం. 

యేసు ప్రభువు అనేక సార్లు యెరుషలేము వెళ్లారు కానీ అన్ని సార్లు అంత గొప్ప ఆహ్వానం ఇవ్వలేదు. కేవలం ఈరోజు మాత్రమే వారు గుర్తిస్తున్నారు. 

యేసు ప్రభువు పేదవారి పట్ల పోరాడిన విధానం ప్రజల్లో ఒక నమ్మకం కలుగజేసింది. ఇతడు మా కోసం జీవిస్తాడు. ఆధికార బంధముల నుండి మమ్మల్ని  విడిపిస్తాడు అనే ఆలోచన నమ్మకం వారిలో కలిగింది. 

ఈనాటి మొదటి పఠనంలో బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి చదువుకున్నాం. 

యోషయా గ్రంధంలో 40-55 ఆధ్యాయాలలో నాలుగు బాధామయ సేవకుని గీతాలు మనం వింటున్నాం. 

ఈనాటి మొదటి పఠనంలో 3 వ గీతం గురించి చదువుతున్నాం. క్రీస్తు పూర్వం 7 వ శతాబ్దంలో దేవుడు యోషయాను ప్రవక్తగా నియమించారు. 

సోలోమోను రాజు తరువాత యిస్రాయేలు రెండుగా విభజించబడింది. ప్రతి ఒక్క రాజ్యంకు వారివారి ప్రవక్తలు, నాయకులు, మత పెద్దలు ఉండేవారు. 

యోషయా ప్రవక్త యెరుషలేములో పని చేసిన ప్రవక్త. ఆయన అనేక మంది రాజులకు దేవుని యొక్క ప్రవచనాలు తెలిపారు. 

ఆయన కాలంలో అస్సిరియులు యిస్రాయేలును నాశనం చేసిన దానిని ఆయన కనులారా చూశాడు. అప్పుడు హేజ్కియా రాజును లొంగిపోవద్దు అని తెలిపాడు. దేవునికి ప్రార్ధించి ముప్పు తొలగించాడు. 

యోషయా ప్రవక్త ఈ సేవకుని యొక్క గీతము వ్రాసేటప్పుడు ఆయన మనస్సులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు 

1. యిస్రాయేలు ప్రజలు - ఎన్నుకోబడిన ప్రజలు 

2. మెస్సయ్య 

మెస్సయ్య తాను అందరి కోసం శ్రమలు అనుభవించి మరణిస్తారని ముందుగానే ప్రవక్త ప్రవచించారు. అందుకే అంటారు ప్రవక్తల ప్రవచనాలు నిజమేనని.  

యిస్రాయేలు ప్రజలు కూడా తమ యొక్క జీవితంలో సేవకుల  వలె బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు. 

మరి ముఖ్యంగా బాధామయ సేవకుని జీవితం మెస్సయ్యా గురించి ఉద్దేశించబడినది. 

ఈనాటి మొదటి పఠనంలో రెండు భాగాలు ఉన్నాయి. 

1. సేవకునికి అప్పజెప్పిన బాధ్యత 

2. సేవకుని యొక్క త్యాగ జీవితం 

సేవకునికి అప్పజెప్పిన  బాధ్యత ఏమిటంటే ప్రకటించుట , బోధించుట.దేవుని యొక్క రాజ్యం గురించి , దేవుని ప్రేమ గురించి, ఆయన క్షమ గురించి ప్రకటించే శక్తిని దయ చేశారు. ఆయన అలసిపోయిన వారికి ఓదార్పు దయ చేస్తారు. మత్తయి 11:28. 

బాధలలో, కష్టాలలో, నిరాశలో, జీవితంలో అన్ని సమస్యలు పడేవారిని దేవుడు ఈ సేవకుని ద్వారా  ఓదార్చుచున్నారు. 

సహాయం లేనివారికి ఒక సహాయంగా ఉండుటకు ఎన్నుకొన బడినవాడు, ప్రేమ లేని వారికి ప్రేమను పంచుటకు ఎన్నుకొనబడినవాడు, జీవితంలో ఆశలు కోల్పోయినవారికి ధైర్యం ఇచ్చుటకు ఈ సేవకుడు ఓదార్పును దయ చేస్తాడు. 

సేవకుడు తన జీవితంలో  దేవునికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చి యున్నారు. హెబ్రీ 10:7, హేబ్రి 5:8 

ఆయన మరణం వరకు తండ్రికి అడ్డు చెప్పలేదు. పిలిప్పీ 2:8 ఆయన మాటను ఎల్లప్పుడు నెరవేర్చారు. తనకు అప్పజెప్పిన పరిచర్య బాధ్యత సక్రమంగా నెరవేర్చాడు ఈ సేవకుడు. 

రెండవ భాగంలో తన యొక్క సేవక బాధ్యతలు నెరవేర్చుటలో ఈ సేవకుడు ఎంతగానో శ్రమలను అనుభవించాడు, నిందలు భరించాడు. 

ఆయనను మోదు వారికి వీపును అప్పగించారు అని 6 వ వచనంలో చెప్పబడింది. అంటే ఎన్ని దెబ్బలైనా భరించడానికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన ఎవరికి ఎదురు చెప్పలేదు. మౌనంగా భరించాడు. 

ఆయన గడ్డపు వెంట్రుకలు లాగేసారు, ఉమ్మి వేశారు, అవమానించారు. ఇవన్నీ కూడా భరించడానికి కష్టం అయినా భరిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వలనే సాధ్యం. ప్రేమ సమస్తమును భరించును. 1 కోరింథీ 13:7. యేసు ప్రభువు జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన వస్త్రములు లాగారు. యోహను 19:23. ఆయన మొహం  మీద ఉమ్మి వేశారు. మత్తయి 26:67 . ఆయన్ను కొరడాలతో కొట్టారు. మార్కు 15:15 , యోహను 19:1 

ఇన్ని రకాలైన  అవమానాలు తాను ఎదుర్కొన్నప్పటికి ఆయన క్రుంగిపోలేదు, పారి పోలేదు అన్ని సహనంతో భరించాడు. ఇంత బాధలు పొంది వాటిని భరించాలంటే నిజంగా దైవ శక్తి మనకు అవసరం. 

బాధమయ సేవకుడు  తండ్రి మీద ఉన్న గాఢమైన ప్రేమ  వలన అధే విధంగా తన ప్రజలను కాపాడాలనే ఉద్దేశం వలన ఎంతో బాధను భరించాడు. 

ఒక  క్రోవోత్తి తాను కరుగుతూ ఎలాగైతే ఇతరులకు వెలుగునిస్తుందో అధే విధంగా ఈ సేవకుడు తన జీవితం, ప్రాణం త్యాగం చేస్తూ ఇతరులకు రక్షణనిచ్చాడు. 

రెండవ పఠనంలో పునీత పౌలుగారు యేసు ప్రభువు యొక్క సేవా జీవితం గురించి తెలుపుచున్నారు. 

యేసు ప్రభువు తండ్రి , పవిత్రాత్మతో అన్నింటిలోను సరిసమానం అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈ వాక్యాలలో పౌలుగారు దేవుని యొక్క వినయ జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఎవ్వరు కూడా ఆయన వలె తగ్గించుకొని జీవించలేదు. 

ఆయన దేవుడు అయినా మనిషిగా మన మధ్య జన్మించారు. పరలోకంలో జీవించే దేవుడు భూలోకంలో జీవించుటకు ఇష్టపడ్డారు. పరలోక మహిమను విడిచి పెట్టారు. భూలోక సీలువను మోసారు. పవిత్రమైన  పరలోకంలో జీవించే దేవుడు పాప మలినం శోకిన ప్రజల మధ్యకు వచ్చారు. 

అధికారం కలిగినప్పటికి అణిగిమణిగి వినయంతో జీవించారు. ఆయన దేవుడే అయినప్పటికీ అన్ని విడిచిపెట్టారు మన మధ్యకు వచ్చారు పిలిప్పీ 2:7 

-సేవించబడాల్సిన దేవుడు సేవ చేస్తున్నారు 

-ప్రేమించబడాల్సిన దేవుడు ప్రేమిస్తున్నారు

-ఆరాధించబడాల్సిన  దేవుడు మన మంచికై అన్ని చేస్తున్నారు. 

-మనం ఎవరికోసం , ఎవరి రాక కోసం ఎదురు చూడాలో ఆయనే మన కోసం ఎదురు చూస్తున్నారు. 

-మనం వెదికే దేవుడు మన కోసం వెదుకుచున్నారు. 

ఆయన అన్నింటినీ త్యజించుకొని మన మధ్యకు వచ్చి జీవించారు. యేసు ప్రభువు అంతటి వినయంను చూపుతూ మన మధ్యలో జీవించి తన ప్రాణ త్యాగం చేశారు. ఆయన స్వార్ధం వేదకలేదు. సేవకుని వలె జీవించి అంత దేవుని కొరకు ప్రజల కొరకు చేశారు. 

యేసు ప్రభువు  తండ్రికి మాత్రమే కాదు వినయం చూపినది మానవులకు, అధికారులకు వినయం చూపించారు. తనను హింసించిన వారికి, చంపిన వారికి కూడా ప్రభువు వినయం చూపించారు. 

ఆయనకు అధికారం వుంది, ఆయన సృష్టికర్త అయినా కానీ అంతటి వినయం చూపించారు. యోహను 10:18, రోమి 5:19 , హెబ్రీ 10:9 . 

వినయం వలన ప్రాణ త్యాగం చేశారు, తనను తాను తగ్గించుకొని నిందలు మోసారు. 

తనను తాను తగ్గించుకొని శత్రువుల చేతికి అప్పగింప బడినారు, తనను తాను తగ్గించుకొని అందరి పాపాలు తన మీద వేసుకున్నారు. 

తనను తాను తగ్గించుకొని శిలువ భారం మోసారు, ఘోరమైన శిలువ మీద మరణం అంగీకరించారు. 

ఆయన పాప రహితుడైనప్పటికి మన పాపాల కోసం అన్ని భరించారు, మనల్ని రక్షించారు.2 కోరింథీ 5:12, గలతి 3:13 .1 పేతురు 2:24, 1 పేతురు 3:18 

యేసు ప్రభువు తన్ను  తాను రిక్తుని చేసుకున్నారు కాబట్టి తండ్రి కుమారున్నీ అంతగా సన్మానించారు. చివరి వరకు సంపూర్ణ విధేయతను, వినయంను చూపిన కుమారిడిని తండ్రి మిక్కిలిగా ప్రేమించారు. ఆయనకు సమస్తము ఇచ్చి ఉన్నారు. ఎఫెసీ 1:22, 1 పేతురు 3:22 ,రోమి 14:11. 

మనం ఒకరి ముందు తలవంచటానికి ఇష్టపడం కానీ యేసు ప్రభువు వినయంలో అందరి ముందు తనను తాను తగ్గించుకొని జీవించారు. 

ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యొక్క  శిలువ శ్రమలు ధ్యానించు కుంటున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనందరం ధ్యానించుకోవల్సిన అంశం ఏమిటంటే యేసు ప్రభువు ప్రజలు రాజుగా గుర్తించారు. 

యేసు ప్రభువు చాలా సార్లు యెరుషలేము దేవాలయంకు వెళ్లారు. కానీ ఈ సమయంలోనే ఆయన్ను గొప్పగా ఆహ్వానిస్తున్నారు. 

ప్రభువు యెరుషలేముకు వెళ్ళిన సమయాలు 

1. యెరుషలేము దేవాలయంను శుభ్రం చేసిన సమయం -యోహను 2:3 

2. యెరుషలేము కోనేటి వద్ద స్వస్థత ఇచ్చినప్పుడు -యోహను 5:1 

3. యెరుషలేములో ఆయన దేవుని కుమారుడని ప్రకటించిన వేళ . యోహను 7:16-17 

4. జీవ జలపు  ఊట అని చెప్పినప్పుడు - యోహను:37-39 

5. లోకానికి వెలుగు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు యెరుషలేములో ఉన్నారు.- యోహను 8:12, 9:5 

ఇలాగ చాలా సందర్భాలలో ప్రభువు యెరుషలేములోనే ఉన్నారు. కాని ఇప్పుడు దానికి ప్రత్యేకత ఉంది. ప్రభువు ఈ లోకంలో తండ్రి క్రియలు నెరవేర్చారు, అద్భుతాలు చేశారు, యూదుల విశ్వాసం పెంచడానికి 7 అధ్భుతాలు చేశారు. 

1. నీటిని ద్రాక్షరసంగా మార్చుట . యోహను 2:1-11 

2. ప్రభుత్వ ఉద్యోగి  కుమారునికి స్వస్థత నిచ్చుట.-యోహను 4:46-54 

3. బెత్సయిదా  వద్ద పక్షవాత  రోగికి స్వస్థత నిచ్చుట - యోహను 5:1-15 

4. 5000 మందికి ఆహారం పెట్టుట- యోహను 6:5-14 

5 . నీటి మీద నడుచుట -యోహను 6:16-24 

6. పుట్టు గ్రుడ్డి వానికి చూపును దయచేయుట -యోహను 9:1-7 

7. లాజరును జీవంతో లేపుట - యోహను 11: 1-45 

ఇవన్నీ చేసిన తరువాత ప్రజల యొక్క ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ కాలంలో ప్రభువు బలహీనుల పట్ల, ప్రజల పట్ల పోరాడుతున్నారు. కాబట్టి ఇతడు నిజంగా ప్రజల కోసం వచ్చారని, ప్రజల సమస్యల నుండి కాపాడుతారని నమ్మకం అందుకే ఆయన్ను రాజును చేయాలనుకున్నారు. 

ఆయనయే తమ రాజు అని ఆయన్ను స్తుతించారు. మాకోసం నిలబడే వ్యక్తి అని మాకోసమె పుట్టిన ప్రభువు అని అందరు భావించారు. అందుకే ఆయన తమ యొక్క రాజని గుర్తించారు. ఆ సందర్బంలోనే ఆయన్ను ఘనంగా ఆహ్వానించారు. 

ప్రజలు యేసు ప్రభువుకు హోసన్న పాడారు. హోసన్న అంటే మమ్ము ఇప్పుడు రక్షించు అని అర్ధం. ఆయన వారిని రక్షిస్తారు అని తెలుసుకున్నారు. పాపముల నుండి రక్షిస్తాడని తెలుసుకొని రక్షించమన్నారు. అధే విధంగా ఈ లోక బంధనముల నుండి, అధికారుల క్రింద నుండి రక్షించమని కోరారు. 

ఆయన ద్వారానే రక్షణ వస్తుందని భావించారు. ఆయన రాజుగా పాలిస్తాడని భావించారు. 

యేసు ప్రభువు యొక్క రాజ్యాధికారం  ఈ లోక అధికారం కన్నా  భిన్నంగా ఉంటుంది. 

ఈ రాజు  రాజ్యాలు గెలిచే రాజుగా రావడం లేదు. ప్రజల యొక్క మనస్సులు గెలిచే రాజుగా వస్తున్నారు. మన రాజు శ్రమలు అనుభవించారు, సుఖ సంతోషాలు విడచి పెట్టారు. ఈరాజు అందరికంటే ముందుగా నిలబడి తన ప్రజల కోసం పోరాడతారు. 

క్రీస్తు రాజు బంగారపు కిరీటము ధరించలేదు ముళ్ళ కిరీటము ధరించారు. అధికారంను దుర్వినియోగం చేసుకోకుండా  వినయంతో ప్రేమతో ఈ రాజు జీవించారు. 

యేసు ప్రభువును  రాజుగా సంభోదించుట వలన పరిసయ్యులు భయ పడ్డారు. ఎందుకంటే రోమా పాలకులకు తెలిస్తే వారు తమ పై యుద్దానికి వస్తారని అనుకొన్నారు. ఎందుకంటే యేసును యూదులు రాజుగా చేసుకున్నారని గ్రహించి రోమియులు యుద్దానికి వస్తారని భయ పడ్డారు అందుకే శిష్యులను గద్దించారు. లూకా 19:39 

దేవదూత పలికిన మాటలు నెరవేరాయి. దేవ దూత మారియమ్మకు  జన్మించిబోయే  శిశువు  దావీదు సింహాసనము అదిష్టిస్తారు అని అన్నారు. అది ఈ రోజు కార్యం ద్వారా జరిగింది. లూకా 19:18 . 

ప్రభువు పేరిట వచ్చే రాజు స్తుతింపబడును గాక అన్న మాటలు దావీదుకు చెందినవి, ఆయన శత్రువులను జయించి యెరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఇలాగే స్తోత్రగానం చేసేవారు అధేవిధంగా యేసు ప్రభువు యొక్క గొప్పతనం గుర్తించి ప్రజలు ప్రభువును పొగిడారు. 

యేసు ప్రభువు గాడిదను ఎన్నుకొని ప్రజల యొక్క నమ్మకంను పెంచుతున్నారు. అంతకు ముదనే ప్రవచనాలు చెప్పబడ్డాయి. మెస్సయ్యా గాడిద పిల్ల మీద వస్తాడని - జెకార్య 9:9 , జెఫన్యా 3:16-19 . 

యేసు ప్రభువు అడిగిన వెంటనే ఇంటి యజమానుడు కూడా వెంటనే గాడిద ఇచ్చారు. బహుశా ఆయనకు కూడా క్రీస్తు ప్రభువును రాజుగా గుర్తించి ఉండవచ్చు. 

యేసు ప్రభువుకు రాజుకు ఇచ్చిన గౌరవం ఇచ్చారు. 1మక్కా 13:51. 

ప్రభువు స్వయంగా గాడిదను ఎంనుకొంటున్నారు. ఎందుకంటే పూర్వం రాజులు యుద్ధం చేయడానికి వెళ్లేటప్పుడు గుర్రం మీద వెళ్ళేవారు, శాంతిని నెలకొల్పేటప్పుడు గాడిద మీద వెళ్ళేవారు. 

గాడిద  వినమ్రుని, శాంతి పరుని సూచిస్తుంది. యేసు ప్రభువు ప్రపంచానికి శాంతి ప్రధాత, ఆయన ఇహలోక సంబంధమైన రాజు కాక పరలోక సంభందమైన రాజు ఆయన అందరికి రాజు ప్రజలందరి పాపాలు తన మీద మోసుకొని మరణించిన గొప్ప రాజు. 

సోలోమోను తన తండ్రి గాడిద మీద వచ్చారు, సింహాసనం అదిష్టించే రోజు . 1 రాజు 1:38-41. 

గాడిద మీద  వచ్చిన వారు.- న్యాయ 10:4 , 2 సమూ 17:23, 2 సమూ 19:26  

ఈ లోకమును తన తండ్రితో సమాధాన పరుచుటకు ఆయన గాడిద మీద వస్తున్నారు. సఖ్యత ఏర్పరచడానికి . ప్రభువు ప్రజల యొక్క హృదయాలను గెలవడానికి గాడిద పిల్ల మీద వస్తున్నారు, ఎఫెసీ 2:13-18 

గాడిదను ప్రభువు ఎన్నుకొనుటకు కారణాలు 

1. గాడిద బరువు మొస్తుంది - అందరి భారం మొస్తుంది 

2. గాడిద సేవ చేస్తుంది - అందరికి సేవ చేస్తుంది 

3 గాడిద శాంతికి గుర్తు 

4. గాడిద పవిత్రతకు గుర్తు - వస్తువులను జంతువులను దేవునికి సమర్పించుటకు వాడతారు కాబట్టి అవి పవిత్రమైనవి. సంఖ్యా 19:2, ద్వితీ 21:3 , 1 సమూ 6:7  

యేసు ప్రభువు వాడిన గాడిదను ఎవ్వరూ ఎన్నడూ వాడలేదు అది పవిత్రమైనది. మనం దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు మంచి జీవితం జీవించాలి. 

Rev. Fr. Bala Yesu OCD

2, ఏప్రిల్ 2022, శనివారం

తపస్సుకాల 5 వ ఆదివారం

యెషయా 43:16-21, పిలిప్పి 3:8-14, యోహాను 8:1-11
ఈనాటి దివ్య గ్రంధ పఠనాలు  క్షమించుట  ద్వార దేవుడు ప్రసాదించు క్రొత్త జీవితం గురించి  బోధిస్తున్నాయి. దేవుడిచ్చే గొప్ప అవకాశం వల్ల  దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. పశ్చాత్తాప పడిన  ప్రతి యొక్క  విశ్వాసిని దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. పాపికి  దేవుడు మరొక అవకాశం దయచేసి క్రొత్త జీవితం జీవించమని తెలియజేస్తారు. 
మన జీవితంలో కూడా ఎదుటి వారు చేసిన తప్పిదములు లెక్క చేయకుండా వారిని క్షమించుకొని జీవించాలి. వారికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. మన యొక్క స్నేహాలు నిలబెట్టుకోటానకి అవకాశం ఇవ్వాలి. ఇతరులు చేసిన తప్పులు క్షమించి మరలా మనతో క్రొత్త జీవితం జీవించడానికి వారికి ఇంకో అవకాశం ఇవ్వాలి. 
దేవుడు మన పట్ల  ఎలాగైతే  క్షమ హృదయాన్ని కలిగి జీవిస్తున్నారో మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి అధేవిధంగా దేవుడు మానాకోక అవకాశం  ఇచ్చిన విధంగా వేరేవారికి కూడా అవకాశం ఇవ్వాలి. 
ఈ మూడు పఠనాలు కూడా మారని దేవుని ప్రేమగురించి అలాగే ఆయన యొక్క శాశ్వత ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాయి. 
మన నిజ జీవితంలో ఎవరైన సంపూర్ణంగా  ప్రేమిస్తే వారిని వారి పాపాలు క్షమించడానికి ఎప్పుడు సిద్దంగానే మనం ఉంటాం. దేవుడు తన ప్రజలను సంపూర్ణంగా ప్రేమించారు, కాబట్టియే వారి అనేక పాపాలు క్షమిస్తున్నారు. 

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు యిస్రాయేలు ప్రజలకు ప్రసాదించే నూతన జీవితం గురించి భోధిస్తున్నారు. 
యిస్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్న సమయంలో యోషయా ప్రవక్త ద్వార పలుకుచున్న సంతోష వాక్కులు వింటున్నాం. బాబిలోనియా బానిసత్వంలో చివరిరోజుల్లో ఉన్న సమయంలో పలికిన ఆనంద మాటలు ఇవి. 

బానిసత్వం నుండి మరొకసారి దేవుడు వారిని బయటకు తీసుకొని వస్తారని, యెరుషలేముకు నడిపిస్తారని తెలుపుచున్నారు. యెరుషలేము దేవాలయం పునరుద్ధరిస్తారని యోషయా ద్వారా తెలియచేసారు. 
మొదటి ప్రారంభ వచనాలలోదేవుడు  ఎలాగ వారికి  సముద్ర మార్గం గుండా దారిని చేశారో తెలుపుచున్నారు. అదే విధంగా జలరాశి గుండా, ఎండిన నేల మీద నడిపించారు. నిర్గ 14:22.  14:29. 
తాను ప్రేమించిన ప్రజలకోసం దేవుడు శత్రు సైన్యంతో  పోరాడారు. నిర్గ 1వ అధ్యాయం 11 వ అధ్యాయం వరకు వారికి 10 అరిష్టాల ద్వారా వారితో పోరాడారు. 
తనను నమ్ముకున్న ప్రజల పట్ల దేవుడు చూపించే కరుణ అలాంటిది. దేవుడు అన్ని సమయాలలో వారితో ఉండేవారు. నిర్గ 3:14. అసాధ్యమైన కార్యములు దేవుడు తన ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు. లూకా 1:37. తన ప్రజల మీద ఉన్న ప్రేమ వలన అసాధ్యమైనవి దేవుడు సుసాధ్యం చేస్తారు. 

18 వ వచనంలో  ప్రభువు  అంటున్నారు. మీరు పూర్వ సంగతులను గుర్తుంచు కొనక్కరలేదు అని ప్రభువు చెబుతున్నారు. 
వారి  బలహీనతలు గుర్తించుకొనక్కరలేదు అంటున్నారు. వారు దేవుడిని విస్మరించిన క్షణాలు గుర్తుంచుకొనక్కరలేదు.  వారి పాపాలు గుర్తుంచుకొనక్కరలేదు అంటున్నారు. వారి బానిసత్వ బాధలు గుర్తుంచుకొనక్కరలేదు అని అంటున్నారు. 

పశ్చాత్తాప పడిన ప్రజలకు, క్షమించమని కోరిన ప్రజలకు దేవుడు నూతన కార్యము చేస్తానంటున్నారు. ఆ నూతన కార్యమేమనగా అది క్రొత్త జీవితమే, క్రొత్త బంధమే, క్రొత్త ఒడంబడికయే, క్రొత్త ఆశీర్వాదమే. యోషయా 65:17, 2 కోరింథీ 5:17. అ. పొ 21:15. 

19 వ వచనంలో ప్రభువు  అంటున్నారు, ఎడారిలో బాటలు వేస్తానని, మరు భూమిలో త్రోవ వేయుదును అని అదే విధంగా 20 వ వచనంలో ఎడారి గుండా నీటిని పారించి నేను ఎన్నుకొన్న ప్రజలకు ఇత్తును అని అంటున్నారు. 

ఎడారిలో దారి సరిగా  వుండదు ప్రభువు అలాంటి ప్రదేశంలో  విశాలవంతమైన ప్రాంతంలో దారులు వేస్తానని పలుకుచున్నారు. యోహా 14:6. ఆయన చెంతకు రావటం వల్లన మనం క్రొత్త  బాటలో  ప్రయాణం చేస్తాం - ముగ్గురు జ్ఞానులు  వేరొక మార్గం అనుసరించారు. మత్త 2:12. 

మార్గం, గమ్యం తెలియకుండా జీవించే మన బ్రతుకులకు దేవుడు దారిని చూపిస్తారు మనకు క్రొత్త జీవితం దయ చేస్తారు. 
మరు భూమిలో త్రోవ  వేస్తారని అంటున్నారు అంటే పనికి రాని నేలను కూడా సక్రమంగా వినియోగిస్తారని తెలుపుచున్నారు. 

ఎడారిలో దేవుడు నీటిని ఒసగటమే కాదు, నదులు, పారిస్తాను అని తెలుపుచున్నారు. నిర్గ 17:1-7. యోషయా 35:6-7. 
ప్రజల యొక్క దాహం తీర్చుతానని ప్రభువు పలుకుచున్నారు. దేవుడు తన ప్రజల కోసం ఎంతటి గొప్ప కార్యమైన చేయుటకు సిద్ధంగా ఉన్నారు. 
ఆయన వారి పాపాలు క్షమించుటయే కాదు ఇంకా వారు సంతోషంగా  జీవించుటకు దేవుడు అవకాశంను ఇస్తున్నారు. 
మన యొక్క జీవితంలో ఎదుటి వారి పాపాలు గుర్తించుకొక  అవసరం లేదు వారికి  రెండో ఛాన్సు ఇచ్చి మంచిగా జీవించేలా చేయాలి. 
రెండవ పఠనంలో పౌలుగారి యొక్క జీవితం గురించి తెలుపుచున్నారు. ఆయన జీవితం మొత్తం కూడా దేవుని కృపను పొందడానికే ప్రయత్నం చేశారు. 
తన యొక్క సువార్త పరిచర్యలో అదే విధంగా క్రీస్తును తెలుసుకొన్న జ్ఞానం వలన ఆయన ఏమంటున్నారంటే ఆయన యొక్క జ్ఞానం పొందుటకు నేను సమస్తమున పూర్తి నష్టముగా పరిగణిస్తున్నాను అని పలుకుచున్నారు. 

దైవ జ్ఞానం  వుంటే దేవుడినే కలిగిఉంటాం. ఆయన కొరకు ఇహలోక జ్ఞానం  అంతా విడిచి పెడతాం. ఆయన కొరకు సమస్తం విడిచి పెడతాం. 
క్రీస్తును  పొందటానికి సమస్తము చెత్తగా భావిస్తున్నాను అని తెలుపుచున్నారు. మనకు దేవుని యొక్క విలువ తెలిసినప్పుడు ఆయన్ను కలిగి ఉండటానికి ఏదైనా విడిచిపెడతాం. 

దేవుని కన్నా ఏ  వస్తువు , మనుషులు మిన్న కాదు అని గ్రహిస్తాం. ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటారు HE WHO HAS GOD WANTS NOTHING, GOD ALONE SUFFICES అని దేవుడిని కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఏది అవసరం లేదు, ఆ ప్రభువు మాత్రం చాలు అని . 

అధే విధంగా దావీదు ప్రభువే నాకు కాపరి నాకు ఇక ఏ కొదవయు లేదు అని . కీర్తన 23:1 
వారికి దేవుని యొక్క విలువ తెలిసింది కాబట్టియే దేవుని కొరకు మిగతా ఏదైన వ్యర్ధంగా భావించారు. మనకి కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానం ఉంటే దేవుని కోసం మిగతా అనీ చెత్తగా భావిస్తాం. 

పౌలు గారు యొక్క కోరిక 10 వ వచనంలో తెలుస్తుంది దేవునికి సంభందించిన జ్ఞానం పొందాలనుకుంటున్నారు.అపో 22:3 . దైవ జ్ఞానం మనకు మంచి ఏదో, చెడు ఏదో తెలుపుతుంది. మనం కూడా క్రీస్తుకు సంబందించిన జ్ఞానంను సంపాదించుకోవాలి. అది మనకు పవిత్ర గ్రంధంను చదవటం ద్వారా తెలుస్తుంది. 

పౌలు గారు కూడా గమాలియేలు దగ్గర నేర్చుకున్నారు ఆయన పొందిన జ్ఞానం వల్లనే క్రీస్తును ప్రకటించ గలుగుతున్నారు. మనం కూడా దైవ అనుభూతి , దైవ జ్ఞానంకలిగి ఉంటే ఆయన గురించి నలుగురికి చాటి చెప్పవచ్చు. దాని కోసం అనుదినం ప్రయత్నం చేయాలి. 

ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు  వారు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని క్షమించి ఆమెకు మంచి జీవితం జీవించుటకు రెండవ అవకాశం గురించి ధ్యానించుకుంటున్నాం. 

యేసు ప్రభువు ఓలివు పర్వతమునకు వెళ్ళేను. తెల్లవారిన తరువాత  యధావిధిగా దేవాలయంకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన భోదనలు వినటానికి ముందుగానే వచ్చేవారు. లూకా 21:37-38. 
ఇక్కడ ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సార్లు దేవాలయంకు ప్రార్ధించుటకు వెల్లుచున్నారు, వాక్యం ప్రకటించుటకు వెల్లుచున్నారు. పాపం , పుణ్యం గురించి ప్రజలకు భోధిస్తున్నారు. అది ప్రభువు చేసే మంచి పని. 

సువార్త ప్రకటన చేసే సమయంలో ప్రభువును కొందరు పరీక్షకు గురిచేస్తున్నారు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని గురించి ఆయన్ను పరీక్షిస్తున్నారు. 

చాలా సందర్భాలలో తన తప్పులను దాచుకోవడం ఇతరుల తప్పులను వ్రేలెత్తి చూపటం సాధారణంగా మనకు కనిపించే మానవ స్వభావం. 

పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు ఎదుటివారి తప్పులు గురించే  ఆలోచించారు కానీ తమ తప్పులూ ఆలోచించడం లేదు. వారు తమను తాము సమర్ధించుకొనేవారు. లూకా 18:9-14. 

వారి యొక్క పాపపు జీవితం ఎన్నడూ వారికి గుర్తుకురాలేదు. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించాలనుకున్నారు. వాస్తవానికి మోషే ధర్మ శాస్త్రం ప్రకారం  వ్యభిచారం చేసే వారికి మరణ శిక్ష విధించాలి. లెవీ 20:10, ద్వితీ 22:13-24. 
పరిసయ్యులు యేసుప్రభువును పరీక్షకు గురిచేయాలనుకుంటే దేవుడే వారిని పరీక్షకు గురిచేస్తున్నారు. యూదుల ఆచారం ప్రకారం వారిలో అందరికన్నా పెద్ద మనిషిని ఆమె మీద రాయి విసరమన్నారు కాని అక్కడ ఎవరు ఆ పని చేయలేదు.వారిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది. వారు కూడా పాపాత్ములమే అని గ్రహిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్లి పోవుచున్నారు.ఈ యొక్క సంఘటన లో దేవుని యొక్క గొప్ప కనికరం మనకు కనపడుతుంది. దైవ ప్రేమ మానవ దీన స్థితిని కలిసినప్పుడే దేవుని కనికరం పుడుతుంది.ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన పాపి దిన స్థితిని చూసినప్పుడు కనికరం చూపిస్తున్నారు.యేసు ప్రభువు ఆమెలో కలుగబోయే మార్పును చూసారు. అందుకే ఆమె వైపు కరుణతో చూసారు. ఆమె జీవితంను మార్చుకోమని ప్రభువు చెబుతున్నారు.
వ్యభిచారం లో పట్టుపడిన స్త్రీ పాపం యేసు ప్రభువు సమర్ధించలేదు.పాపం చేసిన ఫర్వాలేదు అని చెప్పలేదు.కాని ఆయన యొక్క వైఖరిలో క్రొత్తధనం ఉంది.నేను నిన్ను ఖండించను, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీ జీవితంను చక్కబెట్టుకో అని ప్రభువు తనకు అవకాశం ఇస్తున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు, పాపంను విడచి పెట్టుటకు దేవుడు ఆమెకొక అవకాశం ఇచ్చారు.
పరిసయ్యులు ఆమెను శిక్షించాలనుకున్నారు, కాని ప్రభువు ఆమెను రక్షించారు.పరిసయ్యులు ధర్మ శాస్త్ర బోధకులు క్రూరంగా హింసించాలనుకున్నారు. దేవుడు మాత్రం కరుణ చూపించారు. పరిసయ్యులు అధికారాన్ని, నీతిమంతమైన జీవితాన్ని చూపించాలనుకున్నారు, కాని ప్రభువు దైవ ప్రేమ జీవితాన్ని చూపించారు.
ఇప్పటి వరకు చేసిన పాపాలను దేవుడు క్షమించి అవకాశం ఇస్తున్నారు కాబట్టి జీవితం ను బాగు చేసుకోవాలి.
మనం కూడా మన బలహీనతలవల్ల పాపం చేస్తాం. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తారు.బిడ్డలు తల్లి తండ్రులను ,తల్లి తండ్రులు బిడ్డలను మోసం చేసి జీవిస్తారు. మనం పాపం చేసి జీవిస్తాం కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సరిగా వినియోగించుకోవాలి.
ఈ సువార్త ద్వారా దేవుడు ఆమె పాపాలను క్షమిస్తూ, ఆమెకు ఒక క్రొత్త జీవితం జీవించుటకు అవకాశం ఇస్తున్నారు, మనం కూడా మన స్నేహితులకు ఒక అవకాశం ఇవ్వాలి.భర్త భార్యకు , భార్య భర్తకు అవకాశం ఇస్తూ , క్షమించుకొని, అంగీకరించుకొని జీవించాలి. 
దేవుని దయ, కనికరం, ప్రేమ చాలా గొప్పవి, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశం హృదయ పరివర్తన చెందుటకు, మంచిగా జీవించుటకు వినియోగించుదాం.
ఒకరి పట్ల ఒకరం కనికరం, ప్రేమ, సానుభూతి కలిగి జీవించుదాం.
Rev. Fr. Bala Yesu OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...