అపోస్తులుల కార్యములు 9:26-31,
1 యోహాను 3:18-24,
యోహాను 15:1-8
“ఐక్యత కలిగి జీవించడం”
“నేను మీయందు ఉందును మీరు నా యందు ఉండుడు. ద్రాక్షా వల్లి
యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు,” యోహాను 15 : 4.”
ఉపోద్ఘాతం:
క్రీస్తునాధుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా! ఈ నాటి దివ్య గ్రంథ
పఠనాలు, క్రీస్తుని అంటి
పెట్టుకొని, ఐక్యత కలిగి
జీవించాలని మనల్ని ఆహ్వానిస్తున్నాయి. మన క్రైస్తవ జీవితం అంటేనే ఐక్యమైనటువంటి
జీవితం. మన దేవుడైన త్రిత్వైక సర్వేశరుడు ఐక్యత కలిగినటువంటి దేవుడు. తండ్రి
దేవుడు ఈలోకంలో తన ప్రణాలికను నెరవేర్చుటకు ఏ విధముగా తన కుమారుడి మీద ఆధార
పడియున్నాడో అదేవిధంగా కుమారుడు తన తండ్రి కార్యాన్ని నెరవేర్చుటకు తండ్రి మీద
అంతే ఆధారి పడియున్నాడు అని ఈ నాటి వాక్యంలో ధ్యానిస్తున్నాము. క్రీస్తు
పునరుత్తానము తరువాత గడచిన వారాలు కూడా మనకు నిజమయినటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, ఇద్దరు కూడా ఒక్కరే అని క్రీస్తు పలుకుల ద్వారా ఇంతకుముందు
పఠనాలలో ధ్యానించి యున్నాము. గడచిన వారం క్రీస్తు ఒక మంచి కాపరిగాను, మరి ఈనాడు క్రీస్తు ఒక నిజమయినటువంటి ద్రాక్షా వల్లిగాను
ధ్యానిస్తున్నాము.
నేను ద్రాక్షావల్లిని మీరు రెమ్మలు:
క్రీస్తు ప్రభు నివసించినటువంటి పాలస్తీనా దేశంలో ద్రాక్షా చెట్లకు చాలా ప్రాముఖ్యత
ఉంది. అక్కడ ద్రాక్షా చెట్లు చాలా ఎక్కువగ ఉంటాయి. చాలా మంది ఆ తోటలో పనిచేయుటకు
వెళ్తుంటారు. కనుక అక్కడి వారందరికీ ఆ ద్రాక్షావల్లికి {ద్రాక్షా చెట్టుకి}, దాని తీగలకు మధ్య ఉన్న సంబంధం గురించి బాగా తెలుసు.
ద్రాక్షావల్లికి ఉన్నటు వంటి తీగలు ఎప్పుడు మంచి ఫలాలన్నిస్తాయి, ఫలించాలంటే ఏమి చెయ్యాలో, ఫలించనటువంటి తీగలను ఏ విధంగా కత్తిరించి పారవేస్తారో, వారికి బాగా తెలుసు. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ ఉపమానం
ద్వారా తండ్రికి, తనకు తన శిష్యులకు
మధ్య అనుబంధం ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు.
తండ్రి దేవునికి, కుమారునికి మరియు
మనకు మధ్యగల అనుబంధాన్ని గుర్తిస్తుంది. తండ్రి వ్యవసాయదారుడు లేదా ద్రాక్షా రసం
పెంపకందారుడు, యేసు ప్రభు ద్రాక్షా
చెట్టు, మనం రెమ్మలం. ఇందులో
క్రీస్తు ప్రభు పాత్ర ఏమిటంటే తనయందు ఉన్నటువంటి
రెమ్మలకు జీవాన్ని అందించడం, ఆ ద్రాక్షా
తీగలమయిన మనకు జీవం పోయడం. తండ్రి, ద్రాక్షా
వల్లి అయిన క్రీస్తుకి శక్తిని ఇవ్వడం మరియు క్రీస్తుని హత్తుకొని ఉన్న రెమ్మలను
సరిచేయడం లేదా క్రీస్తు నుండి జీవం పొంది ఫలించు వాటిని అధికంగా ఫలించుటకు వాటిని
కత్తిరించి, ఫలించనటువంటి వాటిని
తీసిపడేసి కాల్చివేయుట. ఈ ఉపమానం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే క్రీస్తుని
అనుసరించువారు ఫలించాలంటే, వారు
క్రీస్తు యందు జీవించాలి. క్రీస్తు లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం లో ఏది చేయలేము, ఏది పొందలేము అని క్రీస్తే ఈ నాటి సువిశేషంలో చెబుతున్నాడు.
ద్రాక్షా వల్లి యందు ఉండని తీగ దానియంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు
ఉండనిచో ఫలింపజాలరు {యోహాను 15 :
4}.
ఫలభరితమయిన తీగలు:
శిష్యులు క్రీస్తుకి సన్నిహితంగా జీవించడం ద్వారా ఉన్న అనుబంధాన్ని గురించి
మరియు ఆ బంధాన్ని అలాగే కొనసాగించాలని ఈ ఉపమానంలో తెలియజేస్తున్నాడు. తండ్రి కుమారిని మీద, కుమారుడు తండ్రి మీద ఏవిధముగా ఆదారిపడియున్నారో, అదే విధముగా, క్రీస్తు
అనుచరులమయిన మనము రక్షణ పొందాలంటే తండ్రితో ఐక్యమవ్వాలంటే నువ్వు, నేను, మనమందరము
క్రీస్తులో జీవించాలి, ఆ క్రీస్తుని మన
జీవితంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ద్రాక్షా వల్లికి ఫలించే తీగలవలె మన జీవితంలో
గూడ క్రీస్తు ఫలాలు పొందుతాము.
పునరుత్తానమైనటువంటి క్రీస్తుకి సన్నిహితంగా జీవించిన శిష్యులు ఆధ్యాత్మిక ఫలాలు
పొందారు అని మొదటి పఠనములో చదువుతున్నాము. ఆ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ నాటి మొదటి
పఠనంలో పునీత పౌలు గారిలో చూస్తున్నాము. పౌలు గారు ఒక పరిసయ్యుడు. క్రైస్తవులను
హిసించినటువంటి ఒక మతోన్మాది. అటువంటి వ్యక్తి, పునరుత్తాన క్రీస్తు దర్శనం కలిగిన వెంటనే మంచి ఫలాన్ని
ఉత్పత్తి చేసే రెమ్మ వలె మారాడు. క్రీస్తుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఆ క్షణం
నుంచి క్రీస్తులో తన విశ్వాసాన్ని బలపరచుకొని క్రీస్తుని అంటిపెట్టుకుని, క్రీస్తు ఫలాలు పొంది తన జీవితం మొత్తం కూడా క్రీస్తు
సువార్తను బోధిస్తూ, క్రీస్తే
నిజమయినటువంటి రక్షకుడు అని ఆ క్రీస్తుని అన్యులకి అందిచారు. క్రీస్తు నుంచి
ఆధ్యాత్మిక జీవం పొందాడు. అందుకే పౌలు గారు గలతీయులకి రాసిన లేఖ 2 : 4 వచనంలో
ఈవిధముగా అంటారు. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన
జీవించుచున్నాను. అంత దగ్గరగ క్రీస్తుని హత్తుకొని జీవించాడు. క్రీస్తులో తన
జీవితం ప్రారంభించినప్పుడు తనలో క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి
మలినాలన్నింటిని (పగ, కోపం, ద్వేషం, అసూయ మరియు
హింస) లన్నింటిని తండ్రి దేవుడు కత్తిరించి, వినయం, ప్రేమ, దయ, కరుణ, త్యాగం అనే ఫలాలతో నింపాడు. క్రీస్తు ఏ విధంగా మన రక్షణ
కొరకు మానవరూపందాల్చి ఒక సేవకునివలె జీవించాడో అదే విధంగా పునీత పౌలు గారు తన
సువార్త పరిచర్యలో అన్యులకు మరియు అందరికి అన్నివిధాలుగా తనను తాను మలచుకొన్నాడు, 1 కొరింతి 9 : 19 - 23 వచనాలలో చూస్తున్నాము. అందుకే ప్రభు
సువిశేష పఠనములో స్పష్టంగా చెబుతున్నారు. నేను మీయందు ఉందును మీరు నాయందు ఉండుడు.
నేను లేకుండా మీరు ఏమియు చేయజాలరు అని {యోహాను 15 : 4}. శిష్యులు నమ్మలేదు పౌలు పొందిన మార్పును గూర్చి. వారిని
చంపివేయడానికి వచ్చారని భయపడిరి. బర్నబా ద్వారా జరిగిన సంఘటన గూర్చి వారికి
ఎరుకపరచబడింది. అప్పుడు వారు శాంతి పొంది పౌలు ని ఆహ్వానించిరి. ఎందుకంటే క్రీస్తు
తనతో ఉన్నాడు కాబట్టి.
క్రీస్తుతో ఐక్యమవడం ఎలా?
ప్రార్థన చేయడం ద్వారా,
దేవుని వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించి
పాటించడం ద్వారా క్రీస్తు మనలను బలపరుస్తాడు. ఉదాహరణకు పునీతులు అనునిత్యం
ప్రార్ధిస్తూ, దేవునియందు విధేయత
కలిగి, దేవుని వాక్యాన్ని
ధ్యానించి ఆచరించారు కాబట్టి వారు దేవునితో ఐక్యమైయున్నారు. చాలా మంది చర్చికి
వస్తుంటారు, అన్ని కార్యాలలో
పాల్గొంటారు గాని క్రైస్తవ జీవితాన్ని పాటించరు, క్రీస్తుయందు జీవించరు, దేవుని వాక్యాన్ని వింటారు కానీ దానికి అనుగుణంగా జీవించరు.
అట్టివారిని తండ్రి దేవుడు ఫలించని రెమ్మలవలె కత్తిరించి అగ్నిలో పారవేయును.
ఎందుకంటే వారు క్రీస్తు నుంచి జీవం పొందుతున్నారు కానీ ఆ జీవాన్ని వృధా
చేస్తున్నారు. వారి వల్ల ఫలించు వారికి ఇబ్బంది అవుతుందని పారవేయును. ఈనాడు
ప్రపంచం అంతా కరోనా వైరస్ కి బయపడి జీవిస్తుంది. ఇటువంటి సమయంలో మనం క్రీస్తుయందు
దృఢమయిన విశ్వాసం కలిగి క్రీస్తులో జీవించినట్లయితే తప్పకుండా ప్రభువు మనందరినీ
దీవిస్తాడు, రక్షిస్తాడు.
ఎందుకంటే క్రీస్తు మనతో ఉంటె అన్నియు సాధ్యమే అని
రోమా 8:31 లో చూస్తున్నాము.
క్రీస్తు అనుచరులం,
ప్రియ బిడ్డలమయిన మనం నేటి సమాజంలో
ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తుకి అంటి
పెట్టుకొని ఫలించే రెమ్మల వలే ఉన్నామా లేక
ఫలితం లేదు అని పారవేయబడినటువంటి రెమ్మల వలె ఉన్నామా అని ధ్యానించాలి. క్రీస్తులో
జీవించాలనుకొను వారికి ఏది అడిగిన ఇవ్వబడును అని యేసు ప్రభు ఆహ్వానం
పలుకుతున్నారు. రెండవ పఠనంలో పునీత యోహాను గారు అంటున్నారు కేవలం క్రీస్తులో
విశ్వాస ముంచి క్రీస్తుతో ఐక్యమై జీవిస్తే తప్ప మనం ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని
గాని, ఫలాలు గాని పొందలేము అని. ఎప్పుడైతే పునీత పౌలు గారి వలె
క్రీస్తే సర్వము అని క్రీస్తుని మన జీవితం లోకి ఆహ్వానించి మనం ఆ ప్రభువుని
అంటిపెట్టుకొని జీవిస్తామో అప్పుడు దేవుని వరాలు, ఆధ్యాత్మిక ఫలాలు, ప్రేమ, సహనం, దయ, జాలి, త్యాగం కలిగి దేవుని రక్షణ పొందుతాము. కనుక నేను క్రీస్తు
అనుచరుడిని, అయన సేవకుడిని అని
ఒత్తి మాటలతో చెప్పుకోవడం కాకుండా దేవుని ఆజ్ఞలను, ముఖ్యంగ క్రీస్తు ప్రేమ ద్వారా మన పొరుగువారిని ప్రేమించి, అందరితో ఐక్యమై సహాయ సేవచేస్తూ మన జీవిత కార్యాల ద్వారా క్రీస్తే నాలో
జీవించేది అని అందరికి క్రీస్తుని అందిస్తూ క్రీస్తుని తెలియ చేద్దాం.
ద్రాక్షావల్లికి తీగల వలే క్రీస్తుతో మన అనుబంధాన్ని పెంచుకొని క్రీస్తు బాటలో
పయనిద్దాం. అందుకు మన జీవితంలో దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మన జీవితం
నుండి పారద్రోలి క్రీస్తు శక్తితో అన్ని శోధనలను జయించి జీవించాలి. మరియు
క్రీస్తులో మనము, మనలో క్రీస్తు
జీవించుటకు ఆహ్వానించాలి. అందుకు కావలసిన దైవానుగ్రహాలను దయచేయమని ఈనాటి దివ్య
బలిపూజలో ప్రార్థిదాం. ఆమెన్
Br. Vijay Thalari. OCD