24, ఏప్రిల్ 2021, శనివారం

నాలుగవ పాస్కా ఆదివారము

 

క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరీ సహోదరులారాఈనాడు మనం పాస్కా కాలపు నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కుడా కొనియాడుతున్నాం.  ఈనాడు మూడు దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధించేది ఒక్కటే. అది యేసు క్రీస్తు మంచి కాపరిగా ఉంటూమనలను సకల ఆపదలనుండి సంరక్షిస్తున్నాడనిబోధిస్తున్నాయి. 

ముందుగా మనం మొదటి పఠనాన్ని చూస్తే,ఇక్కడ పేతురు గారు పవిత్రాత్మ శక్తిని పొంది, కుంటి వానికి స్వస్థత నిచ్చిన తరువాత, విచారణ సభ ముందు నిలబడి, అక్కడ ఉన్న ప్రజా నాయకులను, పెద్దలను ఉద్దేశించి,యేసు ప్రభువు యొక్క గొప్పతనము గురించి, తన యొక్క శక్తిని గూర్చి, ధైర్యముగా సాక్ష్యమిస్తున్నాడు. ఈనాడు ఈ కుంటి వాడు లేచి నడుస్తున్నాడు, దానికి కారణం యేసుప్రభువు మాత్రమే. ఆయన నామములో శక్తి వుంది. అందుకే ఈనాడు మేము ఆయనకు సాక్ష్యం  ఇస్తున్నాము.కానీ మీరు ఆయనను సిలువపై కొట్టి చంపారు. ఇల్లు కట్టు వారైన మీరు, రక్షకుడైన యేసు క్రీస్తును పనికిరాని రాయి అని  త్రోసివేసారు.కానీ  ఇప్పుడు ఈ లోకంలో  రక్షణ లభించాలి అంటే, యేసు క్రీస్తు తప్ప వేరొక వ్యక్తి లేడు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి  ఇవ్వబడలేదు".

ఒకప్పుడు పేతురు జీవితం మనం చూస్తే,  మూడు సంవత్సరాలు యేసు ప్రభువుతో వుండి కూడా, అతని శక్తిని చూసి కూడా, ప్రభువుని వదిలివేసి పారిపోయాడు, అవిశ్వాసిగా మారాడు,యూదులు అతడిని చంపివేస్తారని భయపడ్డాడు.కానీ యేసుప్రభు పునరుత్తానమైన తరువాత శిష్యుల దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగును గాక! అని చెప్పిన తరువాత వారికి పవిత్రాత్మ శక్తినిచ్చి, వారిని సాక్షులుగా  మారుస్తున్నాడు( యోహా ;20 ; 21 -23 ) . మరి ఈనాడు నువ్వు నేను దేవుని యొక్క రక్షణను పొందాలి అంటే, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి, అయన యందు విశ్వాసము ఉంచి  ఆయన దగ్గరకు చేరాలి. అప్పుడే మనకు నిజమైన రక్షణ లభిస్తుంది.

రెండవ పఠనము గమనిస్తే, దేవుడు తన బిడ్డలపై చూపు ప్రేమ ఎంతో  మిక్కుటము అని బోధిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ మూలమునే ఇప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలము అని పిలువబడుచున్నాము.మరి ఇప్పుడు మన పని ఏమిటంటే, యేసయ్యను మనం చూడాలి అంటే, అయన  వలె అవ్వాలి అంటే, అయన యందు మనము నిరీక్షణ కలిగి జీవించాలి.అప్పుడే మనకు, మనజీవితానికి, ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే అయన ప్రేమ  ఎలాంటిది అంటే, రక్షించే ప్రేమ. జీవాన్నిచ్చే  ప్రేమ. మరణించు ప్రేమ.మరణించి తిరిగి లేచి, నీకు శాశ్వత, నూతన జీవితాన్నిచ్చు ప్రేమ. మరి అలాంటి  ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుందంటే కేవలం మన యేసుక్రీస్తులోనే. కాబట్టి మనమందరం దేవునియొక్క  బిడ్డలుగా మారడానికి ప్రయత్నిద్దాం, ప్రయాస పడుదాం.

                సువిశేష పఠనాన్ని మనం చూస్తే, నేను మంచి కాపరి అని అంటున్నాడు యేసు ప్రభువు. ఎందుకు దేవుడు నేను మంచి కాపరి అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే,చెదిరిపోయిన గొఱ్ఱెలవలె వున్న మనందరినీ ఒక్కటిగా చేయడానికి. అయితే మంచి కాపరి అంటే, తన మందను ఎప్పుడూ సురక్షితముగా ఉంచుతూ, సక్రమమైన బాటలో నడిపిస్తూ, వాటికి కావలిసిన ఆహారాన్ని సమకూర్చుతూ,తగుజాగ్రత్తలు తీసుకుంటూ,ఒక మంచి నివాస స్థలమును ఏర్పరిచే వాడే మంచి కాపరి.సాధారణంగా మనం చూసే కాపరులు గొర్రెలను మేపడానికి తీసుకెళ్లేటప్పుడు తాను గొర్రెల ముందుగా నడుస్తూ, వాటిని పచ్చిక ప్రదేశాలకు తీసుకొని వెళ్తాడు. మరి యేసు ప్రభువు కుడా అదే చేసాడు. మూడు సంవత్సరములు ఈలోకంలో వుండి, తాను సత్యమైన మార్గములో నడుస్తూ,ఒక స్వచ్ఛమైన గొర్రె పిల్లలా ఈలోకంలో జీవించాడు. యోహా;1 ;29 లో చూస్తే బాప్తిస్మ యోహాను ఇలా అంటున్నాడు, "ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల." మంచికాపరి తన మందలకొరకు తన ప్రాణం ధారపోయును. యిర్మీ ; 31 ;10 లో, "నేను ఇశ్రాయేలును చెల్లా చెదరు చేసితిని.కానీ వారిని మరల ప్రోగు చేయుదును.కాపరి మందనువలె వారిని కాచి కాపాడుదును" అని అంటున్నాడు.

ఈ లోక కాపరులకు, మంచి కాపరి అయినటువంటి యేసుక్రిస్తుకు మధ్య తేడాను చూస్తే, ఆదాము అవ్వలు ఏ విధంగా దేవునికి అవిధేయులయ్యారో చూస్తున్నాం. ఆది;1;26-27 లో చూస్తే, తండ్రి దేవుడు ఈ లోకాన్నంతటిని సృష్టించిన తరువాత ఈ లోకంలో వున్న ప్రతి ప్రాణి మీద అధికారాన్ని మానవునికి మాత్రమే ఇస్తున్నాడు. కానీ దేవుని వలె కావాలని, అయన జ్ఞానమును పొందాలని,సర్పము చెప్పిన మాటలను నమ్మి దేవునికి విరుద్ధముగా పాపమును ఒడిగట్టుకున్నారు (ఆది;3;2-5). మోషేను ఇశ్రాయేలీయులకు ఎన్నుకొని,కాపరిలేని వ్యక్తులుగా వున్న ఇశ్రాయేలు జన సమూహాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాడు.కానీ మోషే దేవునియొక్క ఆజ్ఞలను జవదాతాడు. ప్రజలు గొణిగినప్పుడు దేవుని యొక్క పవిత్ర శక్తిని తెలియజేయలేదు (సంఖ్య ; 27;14 ). అందుకుగాను మోషే, అహరోనులవలె దేవుడు ప్రమాణం చేసిన కనాను దేశమున అడుగు పెట్టలేక పోయారు.ఇంకా సంసోను దేవునిచే ఎన్నుకొనబడి, గొప్ప శక్తిని పొంది,ఇశ్రాయేలు నాయకుడుగా చేసాడు. కానీ ఒక స్త్రీ మాటలకు లొంగి, ఆమెతో వ్యబిచారం చేసి పాపము చేసి శక్తిని కోల్పోయి, చివరికి తన ప్రాణాల్ని కోల్పోయి దేవుడిచ్చిన కార్యాన్ని నెరవేర్చలేక పోయాడు. ఇలా ఎంతో మంది జీవితాలలో జరిగింది. సౌలు ధనంమీద, జంతువులమీద ఆశతో దేవుని మాటను దిక్కరించాడు.దాని ఫలితం రాజరికాన్ని కోల్పోయాడు(1 సమూ ;10;1,15;10-11,14-15). దావీదు మహారాజు బెర్షెబా మీద మనసుపడి ఆమెతో వ్యభిచరించి, ఆమె భర్తను చంపి దేవునికి కోపం తెప్పించాడు. ఇలా ఎంతోమంది దేవుడు ఎన్నుకున్నటువంటి కాపరులు పేరు పలుకు బడి కోసం,ధనం కోసం, అధికారం కోసం దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు న్యాయం చేయలేక పోయారు. జెఫన్యా;11;16 లో ఇలా అంటుంటాడు,"నేను నా మందకు ఒక కాపరిని నియమించితిని, కానీ అతడు నాశనమును గురికానున్న మందను కాపాడడు. తప్పి పోయిన గొర్రెలను వెదకడు,గాయపడినవాటిని నయము చేయడు,చావగా మిగిలిన వానిని మేపడు.పైపెచ్చు, అతడు క్రొవ్విన గొర్రెల మాంసమును తినివేయును.వాని గిట్టలు చీల్చి వేయును".అని అంటున్నాడు. అయితే మన మంచి కాపరి ఐన యేసు ప్రభువు అలాంటి కాపరి కాదు. ఎందుకంటే, మన కాపరి రక్షించు కాపరి.పోషించు కాపరి. మన గాయములకు కట్టుకట్టు కాపరి. అదే విధముగా మన ప్రాణం కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టు కాపరి. అలాంటి కాపరి ఈనాడు నీతో నాతో అంటున్నాడు, నేను మంచి కాపరి అని.

అయితే, పు. మత్తయి గారు,నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచూ కాపరి లేని గొర్రెల వలే చెదరి యున్న జనసమూహాన్ని చూసి, ఆ కరుణామయుడి కడుపు తరుగుకొని పోయెను అని అంటున్నారు(మత్త ;9;36). అంటే ఇన్ని రోజులు వారి కష్టాలలో మ్రగ్గిపోయి వున్నారు. సరైన కాపరి లేక అల్లాడి పోయారు. కానీ నాలుగు వందల సంవత్సరాల దాకా ఏ ప్రవక్త యొక్క ప్రవచనాలను వారు వినలేదు.దేవునియొక్క స్వరం వారికి వినిపించ లేదు.కానీ ఇప్పుడు,మలాకీ ప్రవక్త ప్రవచనాల తరువాత యేసు ప్రభువు వారికి భోదిస్తున్నసమయంలో ఎంతోమంది ప్రజలు దేవుని దగ్గరకు తండోప తండాలుగా వస్తున్నారు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు స్వస్థతను పొందుతున్నారు. సంతోషముతో నింపబడుతున్నారు. మరి నువ్వు, నేను నిజమైన విశ్వాసంతో దేవునిదగ్గరకు వస్తున్నామా? అని మనం ధ్యానించాలి.మన కాపరి తన ప్రాణాన్ని తన గొర్రెలమైన మనకోసం ధారపోసే  ఒక గొప్ప కాపరి. ఆయన ఇలా అంటున్నాడు, నేనే మంచి కాపరిని. నా మంద కొరకు ప్రాణమును ఇచ్చెదను" (యోహా; 10 ;11 ). మన పాపములను తొలగించడానికినూతన జీవితమును ప్రసాదించడానికి,ఆయన సిలువపై మరణించి,మూడవనాడు తిరిగి లేచి మనకు రక్షణ కల్పిస్తాడు. ఒక జీతగాడు తన జీవితం సాగడానికి,డబ్బును సంపాదించ డానికి, తన కుటుంబాన్ని పోషించ డానికి పనిచేస్తాడు. కానీ,తనకు గానీ, గొర్రెలకు గాని కష్టం వస్తే, బయపడి వెనకకు తిరిగి పారిపోతాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు.ఇది నిజమైన కాపరి అయినటువంటి యేసయ్యకు,జీతగానికి ఉన్న తేడా.

         మంచి కాపరి లక్షణాలు:1 .మందను మేపేవాడు.2 .రక్షించు వాడు. 3 .నివాసమేర్పరిచేవాడు.

1.      మందను మేపేవాడు:

                  ప్రతి యొక్క కాపరి తన మందకు తగిన ఆహారాన్ని ఇవ్వడానికి మందను ఒక మంచి పచ్చిక పట్టుల దగ్గరకు తీసుకొనివెళ్ళి,అవి సంతృప్తిగా భుజించువరకు వాటితోనే ఉంటాడు ( యిర్మీ;50 ;19 ). అదేవిధంగా మనకాపరి  అయిన యేసయ్య కూడా మనకు తన వాక్కు ద్వారా, పవిత్రాత్మ శక్తి ద్వారా,స్వస్థత ద్వారా, మనలను మేపుతూ,మన శరీరాన్ని, ఆత్మను,నింపుతూ ఉంటాడు.

2.    రక్షించు వాడు:

               దేవుడు ఈ లోకానికి వచ్చినది మనలనందరిని రక్షించడానికే కానీ శిక్షించుటకు కాదు.ఎందుకంటే ఇది రక్షణ ప్రణాళిక.ఈ రక్షణ ప్రణాళికలో అందరూ రక్షణ పొందాలని మనందరి కోసం ఆయన శిక్ష అనుభవించి,మనకు రక్షణ తెచ్చాడు. దేవుడు అంటూ వున్నాడు,"మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించ డానికి వచ్చియున్నాడు"(మత్త;18 ;11 ).

3.     నివాసం ఏర్పరిచే వాడు:

ప్రతియొక్క కాపరి గొర్రెల కొరకు ఒక నివాసాన్ని ఏర్పరచాలి.ఎందుకంటే,వర్షానికి తడిసిపోకుండా,ఇతర జంతువుల బారిన పడకుండా, దొంగల నుంచి కాపాడటానికి,ఒక నివాసాన్ని లేక గుడారాన్నిఏర్పరుస్తారు.అదేవిధంగా, యేసయ్య కూడా మనందరి కోసం ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. యోహా; 14 ;2 లో చూస్తే,"నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు.లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను.నేను మీకొక నివాస స్థలమును సిద్దము చేయబోవుచున్నాను".అని అంటున్నాడు.

        మరి ఈనాడు నీవు మంచి కాపరిలా ఉండాలనుకుంటున్నావా, లేక జీతగాని వలె నీ ప్రాణాన్ని నీవు దక్కించుకొని, స్వార్థంగా జీవించాలనుకుంటున్నావా? ఈ లోకంలో ఎంతోమంది కాపరులు వున్నారు. గురువులుకన్యాస్త్రీలుఉపదేశకులు మాత్రమే కాదు. కానీప్రతియొక్క వ్యక్తి కాపరి యొక్క గుణాన్ని, లక్షణాన్ని పొందాలి.  ప్రతి యొక్క తల్లి, దండ్రులు తమ పిల్లలకు మంచి కాపరులుగా వుంటూ,సక్రమమైన మార్గములో నడిపిస్తుండాలి. బిడ్డలను దీవించాలి.(ఆది;27 ;25-29)ఈసాకు యాకోబును దీవించిన విధముగా వారిని బోధించాలి( ద్వితీ;6 ;7 ;4 ; 9 ).శిక్షణనివ్వాలి (సామె;22;6).అదే విధంగా ప్రతియొక్క ఉపాధ్యాయినీ ఉపాద్యాయుడు చదువుకొనే ప్రతియొక్క వ్యక్తికి కాపరిగా ఉంటూ,వారిని క్రమశిక్షణలో నడిపించాలి. ప్రతియొక్క రాజకీయ నాయకుడు కాపరియే. వారుకూడా ప్రజలను ఏ తారతమ్యం లేకుండా వారికి కావలిసిన సదుపాయాలు అందచేస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, వారికి ఎప్పుడూ చేరువలోనే ఉండాలి. కానీ,వారి అవసరాలకోసం ప్రజలను వాడుకొని, అవసరం తీరాక వారిని పట్టించుకోకుండా,డబ్బుని, హోదాని, పోగుచేసుకొని, ప్రజలను కష్టాలలో విడిచి పెట్టకూడదు.అదేవిధంగా, ప్రతియొక్క వ్యక్తి,ఇతరులకు కాపరిగా మారాలి.అప్పుడే మనలో,మరియు సంఘములో,ఈ లోకంలో మార్పు వస్తుంది.దీని కోసం మనం తపన పడాలి.

మరి  ఈనాడు నువ్వు నేను మన స్వార్ధం కోసం చూడకుండా, ఇంతరులకు సహాయం చేస్తూ, ఒక మంచి కాపరి వలె మన జీవితాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం మరణానికయినా  వెనకాడకుండా జీవించడానికి  ఈ దివ్య బాలి పూజలో ఆ దేవాతి దేవునికి  మనసారా ప్రార్దిదాం.

ఆమెన్.

Br. Joseph mario sunil nandigama

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...