25, మార్చి 2023, శనివారం
Fifth Sunday of Lent
తపస్సు కాల ఐదవ ఆదివారము
తపస్సు కాల ఐదవ ఆదివారము
హెయిజ్కే :
37:12-14
రోమా :8:8-11
యోహాను :11: 1-
45
ఈనాటి మూడు పఠనములు ఏ విధముగా దేవుడు మనలను మరణము నుంచి జీవానికి నడిపిస్తారో అని వివరిస్తున్నాయి.
మొదటి పఠనము:
మరణం ద్వారా నిరాశ నిస్పృహలో మునిగిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా సమాధులను తెరచి మరలా జీవాన్ని ప్రసాదిస్తానని అభయమిస్తు, దేవుడు జీవ ప్రదాత అని గుర్తు చేస్తున్నాడు.
రెండవ పఠనము: క్రీస్తుని ఆత్మ మనయందు వుంటే నశించు మన శరీరములనుకూడా జీవంతో నింపబడతాయి.
సువిశేష పఠనము: క్రీస్తు లాజరును మృతులలోనుండి లేపిన విధముగా మనలనుకూడా మరణము నుండి జీవితానికి, నిరాశనుండి నిరీక్షణకు నడిపిస్తారు.
వీటిని మూడు అంశాలద్వారా ధ్యానిస్తూ అర్ధం చేసుకుందాం.ఆలోచిస్తూ మన జీవితాలకు ఆపాదించుకుందాం.
1.మరణం దాని పరమార్ధం .
2.దేవుడు జీవ ప్రధాత .
3.జీవం పొందుటకు మన కర్తవ్యం.
I. విశ్వాసం.
Ii.మనకు మనం మరణించాలి .
Iii.దేవుని అనుసరణ.
1. మరణం దాని పరమార్ధం .:
మరణం అంటే ప్రాణాన్ని/ జీవాన్ని శాశ్వతంగా కోల్పోవడం. మరణం ఎప్పుడు , ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ( కీర్త: 89: 48
)( సిరా: 7:36 ).
ఒకరు ముందు మరొకరు తరువాత. కానీ ప్రతిఒక్కరు మరణించాల్సిందే. మనకు మనము ఎంత దగ్గరిగా ఉంటామో మనకి కూడా మరణం అంతే దగ్గరగా ఉంటుంది. మనము ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రులమైనా కావచ్చు, ఆర్ధికంగా ఎంత ధనవంతులమైనా కావచ్చు, భౌతికంగా ఎంత ఆరోగ్యవంతులమైనా, ఆకారంగా ఎంత ధృడవంతులమైనా, చూడటానికి ఎంత అందముగా వున్నా , సమాజములో ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నా మరణం సంభవిస్తుందంటే వణికి పోతాం , భయపడతాం.
కానీ
క్రైస్తవులమైన మనము మరణానికి భయపడనవసరంలేదు. ఎందుకంటే, ఆదాము పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమైనది కానీ, యేసు క్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరెంతో గొప్పది! దేవుని విస్తారమైన అనుగ్రహము, నీతియునూ, అయన కృపావరములను పొందువారు అందరునూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు ( రోమా:5:17 ). క్రీస్తు తన మరణంతో మరణాన్ని శాశ్వతంగా ద్వంసం చేసి తన పునరుత్తానముతో మనకి జీవాన్ని ఇచ్చేరు .( 1కొరింతి:15: 54-57 ) ఈ జీవం శాశ్వతమైనది.. మరణంతో మన జీవితం అంతము కాదు కానీ, మరణం శాశ్వత జీవితానికి ఒక ద్వారము.
2.
దేవుడు జీవ ప్రధాత:
ఈనాటి మొదటి పఠనంలో ( హెయిజ్కే :37:12-14
) మరణం ద్వారా నిరాశ నిస్పృహలో మునిగిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా సమాధులను తెరచి మరలా జీవాన్ని ప్రసాదిస్తానని అభయమిస్తు, దేవుడు జీవ ప్రదాత అని గుర్తు చేస్తున్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు మరణించిన లాజరును తిరిగి ప్రాణంతో సమాధినుంచి లేపుతున్నాడు. ఇది కూడా దేవుడు జీవ ప్రదాత అని గుర్తు జేస్తుంది.
రెండవపఠనం ద్వారా పునీత పౌలు గారు
ఆత్మగతమైన జీవితమును
జీవించమని అంటే, శరీరాను సారముగా గాక, ఆత్మానుసారముగా జీవిస్తూ, , ఆ ఆత్మను మనలో ప్రతిష్ఠించుకొని ,నశించు మన శరీరమునకు జీవం ప్రసాదించబడుతుంది అని గుర్తుచేస్తున్నారు .
యోహాను గారు తన సువార్తలో నిత్యజీవము అను అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అదేవిధముగా క్రీస్తు ప్రభువును జీవముగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినది జీవాన్ని ఇవ్వడానికి దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ( యోహా :10:10 ) క్రీస్తు ప్రభువు ఈ నాటి సువిశేష పఠనంలో అంటున్నారు, “నేనే పునరుత్తానమును జీవమును” (యోహా:
11:25 ). లాజారుకు మరొక జీవితాన్ని ప్రసాదించడం ద్వారా క్రీస్తు ప్రభువు తన శ్రమల పునరుతానముద్వారా మనకు కూడా నూతన జీవితాన్ని
ప్రసాదించగలరన్న నిరీక్షణ మనలో నింపుతున్నారు.
ఇంతకుముందు మరణించిన యాయీరు కుమార్తెను (మత్త:9:18-26 ) నాయినులో వితంతువు కుమారుడిని (లూకా: 7:11-17
) జీవముతో లేపాడు. వీరందరూ విశ్వాసము ద్వారానే దేవుని మహిమను చూడగలిగారు. మార్త దేవుని పట్ల విశ్వాసముతో వచ్చి, “ప్రభూ ! మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాదు ( యోహా:11:21) యేసు ఆమెతో నీ సహోదరుడు మరలా లేచును" అని చెప్పెను (యోహా:11:23 ) కానీ ఆమె అంతిమ దినమున లేస్తాడనుకుంది. మార్తా ప్రభువు గతములో పలికిన మాటలు మరచిపోయింది. “ఆ గడియ సమీపించుచున్నది”. అప్పుడు సమాధులలో వారు అయన స్వరమును విని ఉత్తానులగుదురు. మంచికార్యములు చేసే వారు జీవ పునరుతానములను, దుష్టకార్యములు చేసేవారు తీర్పు పునరుత్తానమున పొందెదరు. (యోహా:5:28,29 ). సమారియా స్త్రీ కి మెస్సయ్య వస్తాడని తెలుసు కానీ ఆమెతో మాట్లాడేది స్వయముగా మెస్సయ్య అని గ్రహించలేక పోయింది. అదేవిధముగా మార్తకు పునరుత్తానమందు విశ్వాసముంది కానీ, క్రీస్తు పునరుత్తానుడని, పునరుత్తానము ఇచ్చునది ఈ యనేనని గ్రహించలేకపోయింది. అందుకే, క్రీస్తు "నేనే పునరుత్తానమును జీవమును, నన్ను విశ్వసించిన వాడు మరణించిననూ జీవించును”.( యోహా: 11:25 ) అని మార్తకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎవరయితే క్రీస్తు పునరుత్తానుడు అని గ్రహిస్తారో, వారు మాత్రమే జీవాన్ని పొందగలరు.
3. జీవం పొందుటకు మనలో వుండవల్సినది :
1.విశ్వాసం:
మనం విశ్వసిస్తే దేవుని మహిమను చూడగల్గుతాం.. క్రైస్తవ జీవితానికి విశ్వాసం శ్వాసలాంటిది. శ్వాస తీసుకోకపోతే ఏవింధంగా నయితే మానవుడు మరణిస్తాడో, విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. కేవలం విశ్వసించిన వారు మాత్రమే క్రీస్తు పునరుత్తానాన్ని చవిచూడగలరు. “క్రీస్తే, పునరుత్తానము,, జీవము. ఆయనను విశ్వసించిన వాడు మరణించిననూ జీవించును.( యోహా: 11:25 ) క్రీస్తుని విశ్వసించినవాడు
నిత్య జీవితాన్ని పొందుతాడు” ( యోహా:6:40, 30:36,6:47).
2.మనకు మనం
మరణించాలి:
మన పాపాలకు, స్వార్ధానికి, గర్వానికి మనము మరణించినప్పుడు మాత్రమే మనము క్రీస్తునందు జీవాన్ని పొందగలం. గోధుమగింజ భూమిలోపడి నశించినంతవరకు అది
అట్లే ఉండును . కానీ, అది నశించిన యెడల విస్తారముగా ఫలించును. ( యోహా: 12:24 ) గోధుమగింజ లాగే మనము కూడా మన పాత జీవితానికి మరణించి క్రొత్త జీవితానికి లేచి క్రీస్తుని జీవంతో ఫలించాలి, ఓ నలుగురికి ఆ జీవితాన్ని అందించగల్గాలి. .
3. క్రీస్తుని అనుసరణ:
నన్ను నుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుసరించాలి ( మత్త: 16:24 ) అని ప్రభువు నుడువుచున్నారు. మనం ఎప్పుడయితే మన సిలువ అనే మన జీవితభారంలో ప్రభువును అనుసరిస్తామో అప్పుడు ఆ అనుసరణ నిత్య జీవితానికి బాటలు వేస్తుంది. మనం ప్రభువుని అనుసరించాల్సింది పాదాల కదలిక ద్వారా కాదు. కానీ, మన జీవిత మార్పు ద్వారా . మన జీవితములో ప్రభువు ఆత్మను వుంచగలిగితే ప్రభు జీవాన్ని కూడా పొందగలం.
కాబట్టి విశ్వసిద్దాం. లాజారువలే ప్రభువు ఒసగే
నిత్యజీవితాన్ని పొందుదాం. మనకు మనము మరణిద్దాం . క్రీస్తు పునరుతానాన్ని అనుభవిద్దాం . క్రీస్తును అనుసరిద్దాం . నలుగురికి క్రీస్తు మరణ పునరుత్తనములను, మహిమను ప్రకటిద్దాం, ప్రభువు జీవాన్ని పొందుదాం......ఆమెన్ .
బ్ర. సునీల్ ఇంటూరి ఓ సి డి .
ఆగమన కాలం మొదటి ఆదివారం
ఆగమన కాలం మొదటి ఆదివారం యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36 ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంత...