25, జూన్ 2022, శనివారం

సామాన్య కాలపు 13 వ ఆదివారము

   సామాన్య కాలపు 13 వ ఆదివారము

 రాజులు 19: 16, 19-21, గలతీ 5: 1, 13-18, లూకా 9: 51-62

స్వేచ్చా  జీవితానికి పిలుపు
క్రీస్తు నాదునియందు ప్రియ స్నేహితులారా! ఈనాడు తల్లి తిరుసభ మనలను అందరినికూడా సామాన్య కాలపు 13 వ ఆదివారములోనికి ఆహ్వానిస్తుంది.  

ఈ నాటి మూడు గ్రంథపఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ స్వతంత్రులుగా జీవించుటకై పిలుపునిస్తుంది”.
ఈ నాటి మూడు పఠణాలను మనం మూడు ప్రశ్నల రూపంలో ధ్యానించవచ్చు.  

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?
ఈ నాటి మూడు పఠనాలను మనం ధ్యానించినట్లైతే, దైవ సేవకులకు కావలసింది సంపూర్ణ జీవిత సమర్పణ, లేదా ఈ లోకాన్ని పూర్తిగా త్యజించాలనే సారాంశం మనకు అర్థమవుతుంది.

1. దేవుడు ఎవరిని పిలుస్తున్నారు లేదా ఎవరిని ఎన్నుకుంటున్నారు?
దేవుని పిలుపు ఎవరికి, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎవరు గ్రహించలేరు. దేవుని పిలుపు వివిధ రకాలుగా ఉంటుందని మనము ఎఫెసి 4: 11 -13 వచనాలలో చూస్తున్నాం.

దేవుని పిలుపు గురువులకు, గురుజీవితాన్ని అభ్యసించేవారికి, కన్యాస్త్రీలకు, ఉపదేసులకు, మాత్రమే కాదు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో భాగమైన మనకందరికి కూడా, దేవుని సేవలో భాగము ఉంది, లేదా మనందరమూ పాత్రులము.
దేవుని సేవ చేయుటకు, అందరు అర్హులే. కొందరు ఉపాధ్యాయులుగా, మరికొందరు కుటుంభంలో తల్లిదండ్రులుగా, సంఘపెద్దలుగా, మరికొందరిని దేశ పాలకులుగా, రాష్ట్ర పాలకులుగా, వారి జీవితాలు దేవునిచే నిర్ణయించబడి ఉంటాయి. ఆయా బాధ్యతలకు అనుగుణంగా జీవించడమే మనము చేస్తున్నటువంటి దేవుని సేవ అని మనం గ్రహించాలి.

మొదటి పఠనంలో చూసినట్లయితే
దేవుడు ఏలీయా ప్రవక్త ద్వారా ఎలీషా ప్రవక్తను దైవ సేవకునిగా పిలుస్తున్నారు. ఆబేల్మేహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఈ ఎలీషాఅతనిని ప్రవక్తగ నియమిస్తున్నారు.
మరి ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరకు వచ్చి తన అంగీని తీసి ఎలీషా పై కప్పెను. అంగీ ధరించడం అంటే ఒక సేవకు గుర్తు. ఇలాంటి సన్నివేషాన్ని మనము క్రీస్తు ప్రభువు జీవితంలో కూడా చూస్తున్నాం. యోహాను 13: 4 - 6 వచనాలలో చూస్తే క్రీస్తు ప్రభువు తన నడుముకి తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి వారికి సేవ చేస్తూ, మీరును ఒకరినొకరు ప్రేమించండి, సేవ చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారు.

అలాగే ఈనాటి మొదటి పఠనంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త మీద తన అంగీని కప్పినవెంటనే ఎలీషా ప్రవక్త, తన ఎద్దులను వధించి, అరకని వంట చెరుకుగ వాడి, మాంసమును వండి తన శిష్యులకు వడ్డించి, వారికి సేవచేశాడు. ఏలియా ప్రవక్తను అనుసరించాడు.
 నాటి సువిశేష పఠనంలో మనం శిష్యుల యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండాలి అని చూస్తున్నాం.

ఒకడు యేసును వెంబడించుటకు తన వెంట వస్తాను అని అన్నాడు, యేసు చెంత ఏమీలేవు, తాను ఉండుటకు స్థలము కూడ లేదు అని సమాధానం చెప్పగనే, నిరాశ చెంది ఉండవచ్చు.
మరియొకరిని యేసు ప్రభువు పిలిచారు, "నన్ను అనుసరించు" అని అన్నారు. కానీ అతడు తన తండ్రి చనిపోయిన తరువాత, దేహాన్ని సమాధి చేసి వస్తానంటున్నాడు.

మరియొకడు నేను మిమ్ము అనుసరిస్తాను, కానీ ముందు నా కుటుంబంలోని వారికి చెప్పివస్తాను అంటున్నాడు.
వీరి ముగ్గురికి సమాధానముగా, యేసు వారితో "దేవుని రాజ్యాన్ని ప్రకటించండి". అంటే మొదట దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతను ఇవ్వండి అంటున్నారు. కుటుంబాలు ఉన్నాయి, లేదా సొంత పనులు ఉన్నాయి, అని వెనుతిరగ కూడదు.

2. దేవుడు ఎందుకు పిలుస్తున్నారు / ఎందుకు దేవుని ఎన్నిక?
దేవుని పిలుపునకు అనుసరించి వెనుతిరగడం "నాగటి మీద చేయిపెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదుఅంటున్నారు. బంధాలకు బానిసలు కావద్దు అంటున్నారు.

ఎందు కంటే స్వార్థంతో మన సొంత కుటుంబాలకోసమే మనము జీవించకూడదు. క్రీస్తు ప్రభువు తెలియని ప్రజలు, జీవితాలలో నిరాశకు లోనైన వారు, గ్రుడ్డివారు, కుంటివారు, విధవరాండ్రు, పేదవారు, నిస్సహాయులు, ఈలోకంలో, మన దేశంలో, రాష్ట్రంలో, మన సమాజంలో, చాల మంది ఉన్నారు. వారిని మనకుటుంబంలో ఒకరిగా, చూసుకోవాలి. వారిని ప్రేమించాలి, క్రీస్తు ప్రభువు వారికి నిత్య జీవితాన్ని దయచేస్తాడన్న ఆశ వారికి కలుగ చేయాలి, క్రీస్తు ప్రభువే మనకు సంపూర్ణ జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయనయే నిత్య జీవము అని బోధించాలి. అలాంటి వారి జీవితాలు అభివృద్ధిలోకి తీసుకొనిరావాలి. ఇలాంటివారికి సేవచేయడానికి వెనుకాడవద్దు అని క్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు.
మరి  ఇలాంటి  సేవా  జీవితం  జీవించడం , “ మనిషిగా  పుట్టిన  ప్రతి  ఒక్కరి భాద్యత ”. అందుకే దేవుడు మన అందరిని ఎన్నుకుంటున్నాడు.  మరి  ఈ  రెండు  పఠనాలుకూడా దీని గురించబోధిస్తున్నాయి. మనము  దైవ  సేవకునిగా  జీవించాలంటే ఇలాంటి  లక్షణాలు  కలిగి  జీవించాలి .

3. దేవుని పిలుపును స్వీకరించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి?  
-సేవా భావం కలిగి ఉండటం.

క్రీస్తువలె అందరిని సమానంగా, ఏ వర్గ, కుల, మత బేధాలు లేకుండా ప్రేమించే గుణం.
-చెడును, పాపాన్ని ద్వేషించే గుణం.

-ఇతరులకు చేతనైన సహాయం చేసే గుణం.
-నిజాయితీగా బ్రతికే గుణం.

-సత్యం కోసం జీవించే గుణం.
-కోప పడక, శాంతి, సమాధానాలతో జీవించే గుణం. 

ఇవన్నీ  కలిగిన  వారే  నిజమైన మనుషులుగా , దేవుని  యొక్క  బిడ్డలుగా  పిలువబడతారు.
దేవునికి ప్రియమైన వారీగా పిలుస్తారు. ఇలాంటి వారిదే  దేవుని రాజ్యము అని దివ్య గ్రంథ పఠనాలు  తెలియచేస్తున్నాయి.

దేవుని సేవ చేయాలంటే, మనలను మనము, ప్రజలకు, దేవుని ప్రణాళికకు, పిలుపునకు, సంపూర్ణంగా సమర్పించుకోవాలి .అప్పుడే  మనకు,  పైన  పేర్కొన్న విధంగా  జీవించడం  సాధ్యమవుతుంది.
ఇలా  జీవించినవారు  చాలామందిని   ఉదాహరణలుగా  చెప్పవచ్చు .

-క్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ - దేవుని కుమారుడై కూడా మానవాళి కోసం మరణించాడు, ప్రజలతో జీవించాడు.
-మరియ తల్లి.

-పునీత మదర్ థెరెసా.
-అనేకులైన పునీతులుఇంకా పునీత, మరియు సేవా జీవితాలను జీవిస్తున్నవారు, వీరందరి త్యాగ జీవితాన్ని మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

రెండవ  పఠనంలో  చుస్తే  
              పునీత పౌలుగారు, గలతీయ ప్రజలకు క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మరియొక సారి వారికి  గుర్తుచేస్తున్నారు , హెచ్చరిస్తున్నారు.
ఏవిధంగా అంటే , క్రీస్తు  తన  మరణము ద్వారా పాపానికి బానిసలమై జీవిస్తున్న మానవాళి అంతటిని తన  బలిద్వారా, తండ్రి చిత్తానుసారము, సిలువలో మరణించి, మనకు స్వేచ్చాజీవితాని ఒసగారు, మనలను  పాపమునుండి , పాపమునే  బానిసత్వమునుండి విముక్తులను  చేసారు .

కాని మనందరమూ,  పాపమూ ద్వారనైతే దేవునికి దూరమయ్యామో, దేవుని రాజ్యానికి దూరమయ్యామో, తిరిగి  అలాంటి  జీవితాన్నే  మనము  జీవిస్తున్నాము .
శారీరక కోరికలు అనే ఆకలి ద్వారా, ఆదాము  అవ్వలు , పాపము  చేసి  పాపానికి బానిసలు అయ్యారో, అలాంటి  జీవితాన్ని, మరల  మనకు  తెలిసి  కూడా  చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం .

శరీర   కోరికలకు  బానిసలైన  వారు  దేవుని  రాజ్యానికి  వారసులు  కారు  అని  పవిత్ర  గ్రంధం  చెబుతుంది .
గలతీయులు  5 : 19 -21 .
శరీర కోరికలు; జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయా, క్రోధము, స్వార్ధము, కక్షలు, వర్గత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము విందు  వినోదములు, మొదలగునవి .

ఇలాంటి  జీవితాన్ని  జీవించేవారు  దేవుని  రాజ్యానికి వారసులు కార, అంటే  శరీరానుసారము  జీవించే  వారు  దేవునిరాజ్యనికి వారసులు కారు అని అర్థం .
ఒక్కసారి  మనం  ఆత్మ  పరిశీలన  చేసుకుందాం .

ఈనాడు రెండవ పఠనంలో చూస్తున్నాం ; ఏలయన ధర్మశాస్త్రమంతయు కూడా  “ నిన్ను  నీవు  ప్రేమించుకొనినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము ”. అను  ఒక్క  ఆజ్ఞలో  నెరవేరియున్నది గలతీయులు 5: 14.
మానవునియొక్క  ప్రధాన  ధర్మం  దేవుని  ఆజ్ఞ  పాటించడమే  ఉపదేశకుడు  12: 13 -14 .

నరులు చేసిన పనులు మంచివి కావచ్చును చెడ్డవి కావచ్చును, రహస్యమైనవి కావచ్చును. కానీ వాటి కన్నిటికిని భగవంతుడు తీర్పు తీర్చును.
యోహాను13:34-35 “నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను మీరును ఒకరినొకరు ప్రేమింపుడు. నేను  మిమ్ము  ప్రేమించినట్లే  మీరు  ఒకరినొకరు  ప్రేమించుకొనుడు .

మీరు  పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులు అని అందరు తెలుసుకొందురు.
ఉదాహరణకి మనము గమనించినట్లయితే

మనము ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు, ఉదాహరణకి దొంగతనము చేసేటప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా ఇది తప్పు చేయవద్దు అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మన శరీరము మాత్రం, మనలను ఆ తప్పు వైపే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ పని మన శరీరానికి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇలాగె మనము ఏ పని చేసిన కూడా రెండు విధాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆత్మవైపునుండిమరియు శరీరమునుండి. మనము దేనికి ప్రాధాన్యతనునిస్తామో మన జీవితం కూడా అలానే ఉంటుంది. మనము శరీరానికి ప్రాధాన్యతను ఇస్తే మనము దేవునికి దూరమవుతాము. ఆత్మకు ప్రాముఖ్యతను ఇస్తే దేవునికి
ఆత్మ ఫలాలు: ఆత్మాను సారంగా జీవించటం. గలతి 5: 22

ప్రేమ, ఆనందం, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకంగా ఏ చట్టము లేదు.
ప్రియ స్నేహితులారా మరి మనము ఎలా జీవిస్తున్నాం. మన స్వార్థం కోసం, మన ఇష్టానుసారంగా, పగలతో, ద్వేషాలతో, ఒకరిమీద ఒకరం అసూయా కలిగి, సైతానును, శరీర వాంఛలకు బానిసలవలె జీవిస్తున్నాం.

కాబట్టి మనం దేవుని శిష్యులుగా జీవించాలంటేదైవ రాజ్యంలో ప్రవేశించాలంటే, సైతానుకు దూరంగా, ఈ లోక ఆశలకు దూరంగా, శరీర వాంఛలకు దూరంగా, ఏ వర్గ, కుల, మత భేదాలు లేకుండా జీవించుదాం. క్రీస్తు నేర్పించిన విధంగా ఒకరినొకరు ప్రేమించుకుందాం.

 


 Br. సుభాష్ 

28 వ సామాన్య ఆదివారం

సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11 హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30 ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కల...