ఆగమన కాలం మొదటి ఆదివారం
యిర్మియా 33:14-16,
1 తెస్స 3:12-4:2 లూకా 21:25-28,34-36
నేడు మనం దైవార్చన
క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఆగమన కాలం క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కోసం ఎదురు చూసే కాలం. దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయాలలో
ప్రత్యేకంగా జరగాలని మనం ఆధ్యాత్మికంగా తయారయ్యే
కాలం, ఈ యొక్క ఆగమాన కాలం. ఆగమన కాలం మన జీవితాలను , ఆత్మలను శుద్ది చేసుకునే కాలం.
ఈ నాటి దివ్య పఠనాలు మన అనుదిన జీవితంలో ప్రభుని ఆగమనాన్ని గమనించుకొని
ఆయన యొక్క రాకడకు సిద్దపడవలసినదిగా తెలియ చేస్తున్నాయి. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క రాకడను గురించి మనం ధ్యానించుకోవాలి.
ఆయన యొక్క రాకడ అనేక విధాలుగా ఉంటుంది.
1.
ఆయన యొక్క జన్మ ఒక విధమైన రాకడ (క్రిస్మస్)
2.
ఆయన యొక్క రెండవ రాకడ-పునరుత్తానుడైన క్రీస్తుగా
3.
దివ్య సత్రప్రసాదంలో ఆయన యొక్క రాకడ –
ప్రతిసారీ ఈ దివ్య సంస్కారం స్వీకరించినప్పుడు క్రీస్తువు మన లోనికి వేంచేస్తారు.
ఆగమన అంటే వేచియుండే
కాలం, క్రీస్తు ప్రభువు కోసం ఎదురు చూసే కాలం.
ఈనాటి మొదటి పఠనంలో
యిర్మియా ప్రవక్త రక్షకుడైన ప్రభు యేసు రాకడను గురించి తెలుపుచున్నాడు. . ప్రజలు దేవుని మరచి , తన ఆజ్ఞలను మీరిన కాలంలో దేవుని యొక్క
శిక్షను అనుభవించిన తరువాత దేవుడు వారికి సంతోషకరమైన వార్తా తెలియ చేసారు ప్రవక్త ద్వారా.
దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడ దేవుని ప్రవక్త అయిన యిర్మియా మాటలు వినలేదు. అందుకే శిక్ష అనుభవించారు. యిస్రాయేలు
, యూదా ప్రజలు దేవుడిని విస్మరిస్తూనే ఉన్నప్పటికీ, కరుణ గల దేవుడు వారిని రక్షించడానికి
దావీదు వంశం నుండి ఒక రాజును ఎన్నుకొంటానన్నారు.
ఆ రాజు నీతి కలిగిన రాజు, ఆయన అందరి
ప్రజలకు న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు
చేసిన ప్రతి ప్రమాణమును నిలబెట్టు కొనును. దేవుడు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చారు.
దేవుడు అబ్రహముకు ప్రమాణం చేశారు, తనను ఆశీర్వదిస్తాను అని దానిని నెరవేర్చారు. ఆది
12:1-3.
దేవుడు ఇస్రాయేలు
ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని ప్రమాణం చేశారు -దానిని నిలబెట్టుకున్నారు. నిర్గమ
3:7-8.
దేవుడు వారిని (తన
ప్రజలను) ఆదుకుంటానని ప్రమాణం చేశారు -యోషయా
43:5-7, దానిని నెరవేర్చారు. దేవుడు రక్షకుని పంపిస్తానని ప్రవక్తల ద్వార తెలియచేసారు,
ఆయన క్రీస్తువుగా మన మధ్యలో జన్మించారు.
ఆనాడు యావే దేవుడు
ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణము క్రీస్తు యొక్క జన్మ ద్వార నెరవేరింది
క్రీస్తు ప్రభువు
తన ప్రజలను ఆశీర్వదించారు. ప్రజలకు నేను మీకు తోడుగా ఉంటానని నమ్మకం ఇచ్చారు. మత్తయి 28:20 . వారి
పక్షమునా న్యాయం కోసం పోరాడారు. ప్రజలకు నీతిని, న్యాయమును, ధర్మమును తెలియ
చేసారు. రక్షకుడు వచ్చేకాలం, యూదా రక్షణం పొందును అని ప్రవక్త తెలుపుచున్నాడు. ఆయన
ద్వారానే అందరం రక్షించబడతాం. వాస్తవానికి యిర్మియా ప్రవక్త దేవుని యొక్క సంతోషకరమైన వార్తను ప్రజలకు అందిస్తున్నారు. ఎన్నో సంవత్సరములనుండి ఎదురు చూస్తున్న,
దావీదు యొక్క వారస రాజు త్వరలోనే వస్తాడని
ఎదురు చూస్తున్నారు. దావీదు వంశం నుండి రాజులు వచ్చారు, కానీ ఎవ్వరూ కూడా దావీదు వలె
పరిపాలన చేయలేదు. కాని దేవుడు మరలా తన కుమారున్నీ దావీదు వంశం నుండి జన్మించేలా చేస్తున్నారు.
ఆయన నీతి గల కొమ్మ, ఆయనలో ఎటువంటి అసత్యం లేదు. అ ధర్మం లేదు, అవినీతి లేదు,
పాపం లేదు. ఆయన నిష్కళంకమైన గొర్రె పిల్ల, పరిశుద్ధుడైన దేవుడు , ప్రజలకు ధర్మమును
, తండ్రి ప్రేమను తెలియచేసే ప్రియమైన కుమారుడు. దావీదు యిస్రాయేలు ప్రజల యొక్క గొప్ప
రాజు, ఆయన వంశం నుండి వచ్చే రాజు కూడా అదే విధంగా పాలించును.
దేవుని రక్షణ దినము రానున్నది ,
ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వంను దూరం చేయును. ఇదంతా నూతన రాజు ద్వార జరుగును అని ప్రవక్త తెలియ
చేసారు, కాబట్టి అందరిని కూడా ఆశతో ఎదురు చూడమని
తెలుపుచున్నారు. ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో నమ్మకం ఉంది, అలాగే
ఎదురు చూడటంలో ప్రేమ ఉంది, సహనం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, ఒక విధంగా చెప్పాలంటే
యిర్మియా ప్రవక్త ప్రజలకు, ఈ రక్షకుడు వేంచేయుకాలం గురించి ఒక శుభ వార్త తెలుపుచున్నారు.
ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు తెస్సలోనిక
ప్రజలను ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ వారి కోసం రాసిన లేఖ గురించి వింటున్నాం. పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పర ప్రేమ ఉంచాలని
అదే విధంగా ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలని ప్రార్థనా పూర్వకంగా దేవున్ని కోరుతున్నారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, స్వచ్ఛమైన
నిస్వార్ధ ప్రేమ, చూపించాలని పౌలు గారు తెలుపుచున్నారు. తెస్సలోనియ ప్రజలకు పౌలుగారు,
వారి మధ్య ప్రవర్తించినట్లే అందరు కూడా ఒకరి
పట్ల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు. ఎందుకంటే
పౌలు గారు తన జీవితం ద్వార దేవున్ని సంతోష పెట్టారు. ఆ సుమాతృకయే ఆనాటి ప్రజలకు అందచేశారు.
ఈ వాక్యాలలో మనం గమనించవలసిన విషయాలేమిటంటే
పౌలుగారు ఎలాగా, ఈ
ప్రజల నడుమ ప్రవర్తించారు, ఎలాంటి సుమాతృకను వారికిచ్చారు అను అంశాలు.
పౌలు గారు – 1 . ఎన్ని ఆటంకములు
ఎదురైన సువార్తను బోధించారు. 1 తెస్స 2:2
2. దేవున్ని సంతోష పెట్టేలా జీవించారు
1 తెస్స 2:4
3. ఏమి ఆశించకుండా ప్రేమతో సేవ
చేశారు. 1 తెస్స 2:6
4. మంచిగా, మృదువుగా అందరితో
ప్రవర్తించారు. 1 తెస్స 2:7
5. దేవుని ప్రేమ పంచి – పరస్పర
ప్రేమ కలిగి జీవించారు. 1 తెస్స 2:8,9.
6. పరిశుద్దముగా జీవించారు, నీతిగా
, నిందారహితునిగా జీవించారు. 1 తెస్స 2:10
7. ఆయన ఇతర విశ్వాసులను ప్రోత్సహించారు,
బాధ్యత కలిగి జీవించారు, దేవునికి ఇష్టానుసారంగా జీవించారు. ఆయన దేవునికి ప్రియమైన
జీవితం జీవించి సాక్ష్యం ఇచ్చారు. 1 తెస్స 2:11
8. దేవుని యొక్క రాజ్యంకు తగిన
విధంగా జీవించారు. 1 తెస్స 2:12.
ఈ యొక్క ఆగమన కాలంలో క్రీస్తు యొక్క
రాకడ కోసం ఎదురు చూసే మనం కూడా మన యొక్క అనుదిన
జీవితాలను పౌలు గారి యొక్క సందేశం ద్వార మార్చుకొని జీవిస్తే, క్రీస్తు ప్రభువు యొక్క
రాకడ నిజంగా, మన యొక్క హృదయాలలో జరుగుతుంది. దేవుని సంతోష పెట్టె జీవితం, జీవించమని పౌలు గారు మనకు
తెలియచేస్తున్నారు. దేవుని యొక్క రాకడ కోసం
ఎదురు చూసే వారందరు కూడా ప్రేమతో సహనంతో ఎదురు చూడాలని తెలియ చేస్తున్నారు.
ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు వచ్చే
సమయానికి జాగరుకుత, కలిగి జీవించమని లూకా గారు మనకు తెలుపుచున్నారు. పాత నిబంధన గ్రంధంలో,
యిస్రాయేలు ప్రజలు మెస్సయ్యాను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ప్రవక్తలు ఇచ్చిన సందేశమును
బట్టి వారు మెస్సీయ్య యొక్క రాకడ కోసం సంసిద్దులైనారు. అదే విధంగా క్రీస్తు ప్రభువు తన యొక్క రెండవ రాకడ కోసం ప్రజలను
సంసిద్దులను చేస్తున్నారు.
ఆనాడు యిస్రాయేలు ప్రజలు మెస్సీయ్య యొక్క రాకడ కోసం తయ్యారైనట్టు ఇప్పుడు
మనం క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం
తయారవ్వాలని. యేసు క్రీస్తు ప్రభువు స్వయంగా జరుగబోయే సంఘటనలు వివరిస్తున్నారు. ఆకాశంలో సూర్య చంద్రుల యొక్క పరిణామాలు, సంభవించే ఆటంకాలు అన్నీ కూడా ఆయన వచ్చేటప్పుడు జరిగే పరిస్థితులను
గురించి ముందుగానే తెలియ చేసారు.
ఎన్ని విపత్తులు ఎదురైన మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు.
మత్తయి 28:20. నేను సర్వదా మీతో ఉందును, అని ప్రభువు అనేక సార్లు చెప్పి ఉన్నారు.
ఆయన రాకడ కోసం మనం ఎప్పుడు కూడా
సిద్దంగానే ఉండాలి. అదియే క్రైస్తవ విశ్వాసం.
ఆటంకములకు భయపడకుండా ధైర్యముగా ఎదుర్కోవాలి. పాత నిబంధన గ్రంధంలో దానియేలును సింహాపు బోనులో పడవేసినప్పుడు ఆయన భయ పడలేదు. పంది మాంసం తినమని
చెప్పినప్పుడు ఏడుగురు సోదరులు వారు మరణానికి భయ పడలేదు, వారు ధైర్యంగా మరణంను ఎదుర్కొన్నారు.
యేసు ప్రభువు యొక్క రాకడ జరిగే
సమయంలో కూడా అన్ని శ్రమలు, కష్టాలు ఎదురౌతాయి.
అప్పుడు ఎవరైతే ధైర్యంగా అన్ని ఎదుర్కోవడానికి
సిద్దంగా ఉంటారో, వారు దేవుని యొక్క రాకడ జరిగిన సమయంలో ఎటువంటి భయాలకి గురికారు. ఎందుకంటే
దేవుని మీద వారికి నమ్మకం ఉంది, ఆయన వారిని కాపాడుతారని. ఇలాంటి కష్టాలు అవిశ్వాసులకు
మాత్రమే భయంను చేకూరుస్తాయి. ఎంత నష్టం జరిగిన మీ తల వెంట్రుకలు ఒక్కటియు రాలిపోదు
అని ప్రభువు తెలియ పరుస్తున్నారు. లూకా 1:18. తలెత్తి చూడటం అంటే ధైర్యంగా ఉండటం, సంతోషముగా, భయపడకుండా ఉండటం. తలెత్తి
చూడటం అంటే విజయంకు గుర్తు , ఎదురుచూపుకు గుర్తు.
దేవుని రాకడ కోసం, ఎదురు చూసే వారు కూడా, అలాగే మాకు విజయం తెచ్చే మెస్సీయ్య, వస్తాడని
తలెత్తుకొని ఎదురు చూడాలి. ప్రభువు యొక్క దినమునకై వేచి వుండటానికి మనం పిలువబడ్డాం.
ఆయన కోసం శ్రద్దతో, ఆసక్తితో మేలుకువతో వేచి
ఉండాలి. కనులు తెరచి అన్నీ విషయాలు పరిశీలించాలి. మనందరం కూడా జాగరూకులై అప్రమత్తంగా
ఉండాలి.
మానవ జీవితంను విందులతో , వినోదములతో
కాకుండా, నీతిమంతమైన జీవితమును జీవించాలి.
బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో , శారీరక వాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే
దేవున్ని సంతృప్తి పరచలేం. కాబట్టి పరిశుద్దత కలిగి జీవించాలి. విందులు , వినోదాలు
మానవుని హృదయాన్ని దేవునికి దూరం చేస్తాయి. త్రాగుడు మనిషిని మారిచిపోయేలా చేస్తుంది.
బాధ్యతలు మరిచిపోతారు , దేవున్ని మరిచిపోతారు. వారి యొక్క హృదయాలు మందముగా ఉంటాయి(బాధ్యత
లేకుండా జీవించే వారి యొక్క హృదయాలు) ఫరో రాజుకూడా
తన హృదయాన్ని మందముగా చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్కును, ప్రవక్తలను లెక్క చేయలేదు.
(నిర్గ 7:14,9:7) మన హృదయాలు దేవునికి తెరువబడాలి అవి ఆయన వాక్కును వినటానికి మృదువుగా ఉండేలా చేసుకోవాలి.
సువిశేష పఠనం ద్వారా మూడు ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి.
1.
ఎలాంటి జీవితం జీవించాలి- నీతివంతమైన జీవితం జీవించాలి.
దేవునికి ఇష్టమైన
జీవితం జీవించాలి.
దేవుని ఆజ్ఞలు
పాటించి జీవించాలి.
దేవుని యొక్క
ప్రేమను పంచుతూ జీవించాలి.
దేవుని యొక్క చిత్తానుసారం, నడుచుకొని జీవించాలి.
ఎప్పుడైతే పవిత్రంగా , జాగ్రత్తగా మన జీవితం జీవిస్తామో
అప్పుడు ఆయన్ను మనం స్వీకరించవచ్చు.
2.
మెళకువతో ఉండుట – అంటే ఎప్పుడు కూడా సిద్దంగా ఉండటం, వేచి
ఉండటం, నిద్ర లేకుండా ఉండటం. ఏ సమయంలో ఏమి
జరుగునో తెలుసుకొని దేనికైనా సిద్దంగా ఉండటమే.
మనం మెలకువతో ఉంటే పాపంలో పడిపోము. ప్రతి నిత్యం కూడా మెలకువతో జాగరూకత కలిగి జీవిస్తే
ఈ లోక ఆకర్షణలో పడిపోక దేవుని రాకడ కోసం తయారవ్వవచ్చు.
3.
ప్రార్థించుట
మనందరం కూడా అనేక విపత్తుల సమయాలలో
ప్రార్థిస్తాం ఎందుకంటే ప్రార్థన ద్వార దేవుడు అద్భుతాలు చేస్తారు. ప్రార్థన చేయని
వారు క్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు కారు. ప్రార్థించుట – ప్రార్థించుట ద్వారా దేవుని
శక్తిని పొందవచ్చు. ఆయన రాకడ కోసం ప్రార్థించాలి. అను నిత్యం కూడా ఆయన రాకడ కోసం ప్రార్థించాలి.
క్రీస్తు ప్రభువు కూడా చాలా సార్లు ప్రార్థించారు.
1.
ఆయన జ్ఞానస్నానమప్పుడు ప్రార్థించారు.
2.
శిష్యులను ఎన్నుకునే ముందు ప్రార్థించారు.
3.
ఉదయాన్నే ప్రార్థించారు.
4.
గెత్సెమనేలో ప్రార్థించారు.
5.
తబోరు కొండ వద్ద ప్రార్థించారు. ఆయన చాలా
సందర్బాలలో ప్రార్థించారు. మనం కూడా ప్రార్థించాలి.
ప్రార్ధన లేకపోతే మనం బలహీనులమవుతాం కాబట్టి ప్రార్థించాలి.
యాకోబు 4:2 ఈ యొక్క ఆగమన కాలం మొదటి వారంలో
క్రీస్తు రాకడ కోసం సంసిద్దమై జీవించే వేళలో మనందరం పవిత్ర జీవితం జీవిస్తూ ఆయన రాకడ
కోసం ఆధ్యాత్మికంగా తయారవుతు ,మెలకువతో జీవిస్తూ పాపంలో పడిపోకుండా దేవున్ని అంటి పెట్టుకొని
జీవించుదాం.
Rev. Fr.
Bala Yesu OCD