18, ఫిబ్రవరి 2023, శనివారం


7వ సామాన్య ఆదివారం

లేవి 19: 1-2, 17-18

1 కొరింతి 3: 16-23

మత్తయి 5: 38-48 

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు క్రైస్తవులము, దేవుని యొక్క అనుచరులమైన మనందరం పవిత్రులుగా జీవించాలని తెలుపుచున్నవి.

దేవుని వలె మనందరం కూడా పవిత్రమైన జీవితం జీవించాలి. అప్పుడే మన యొక్క జీవితం పూరి పరిపూర్ణమైంది. ఎవరైతే దేవున్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ, అనుసరిస్తారో వారి యొక్క భూలోక జీవితం మిగతా అన్యుల జీవితం కన్నా, మిగతా వ్యక్తుల జీవితం కన్నా భిన్నంగా వుండాలి.

తిరుసభలో, ఈ ప్రపంచంలో క్రైస్తవుల యొక్క జీవితం ఒక సుమాతృకగా వుండాలి. మహాత్మా గాంధీ అంటారు ‘యేసు క్రీస్తు అంటే నాకిష్టం’. కానీ క్రైస్తవులంటే అంత ఇష్టం కాదని ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఒక గొపు సుమాత్మక నిచ్చారు.  ఆయన జీవితం, ఆయన బోధన చాలా భిన్నమైనవి. క్రైస్తవులు మాత్రము వాటిని అనుసరించుట చాలా అరుదు కాబట్టి క్రైస్తవులంటే తక్కువ ఇష్టం అని పలికారు.

ఈ రోజు ఈ దివ్య పఠనాలు మనందరి జీవితాలు ఈ లోకానికి బిన్నంగా, దేవునికి అనుగుణంగా వుండేలా జీవించమని తెలుపుతున్నాయి. పవిత్రంగా జీవించాలంటే దేవుని యెడల మనకు గొపు ప్రేమ వుండాలి అప్పుడే మనం పవిత్రంగా జీవిస్తాం.

ఈనాటి మొదటి పఠనంలో దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులుగా వుండాలని రచయిత తెలుపుచున్నారు. రచయిత పవిత్రతకు సంబందించిన ఒక సూత్రంను తెలియచేస్తున్నారు. సృష్టి ప్రారంభంలోనే మనందరం దేవుని యొక్క పోలికలో  సృష్టించబడ్డాము, దేవుని యొక్క శ్వాసను, సుగుణాలను, పవిత్రమ పొందుకున్నాం కాని పాపం చేయటం ద్వారా మనలో పవిత్రత తగ్గిపోయినది. 

దేవుడు మానవుని యొక్క ఆలోచనలకు అందని వారు (Transcendent God) మానవుని యొక్క జ్ఞానంతో అర్ధం చేసుకోవటం కష్టం కానీ దేవుడు మాత్రము తనమ తాను మానవాళికి బయలు పరుచుకున్నారు.  మానవుల మధ్య దేవుడు సంచరించారు. వారితో కలిసి ప్రయాణం చేస్తూ దేవుడు తన యొక్క పవిత్రతను, ప్రేమను, దయను... వ్యక్త పరిచారు.

 

మానవులు దేవుడిని స్తుతించి, ఆరాధించి, ప్రేమించి జీవించుటయే కాదు చేయవలసినది దేవుని యొక్క పవిత్రతలో పాలు పంచుకొని జీవించాలి. పవిత్రత అంటే కేవలం ప్రార్ధించుట, నియమాలను తు చ తప్పకుండా పాటించుట కాదు అలాగే ఎక్కువ సేపు దేవాలయంలో గడుపుట కాదు. పవిత్రత అంటే స్వార్ధం లేకుండా జీవించుట, నిస్వార్ధ ప్రేమను వ్యక్తపరచటం, ఇతరులను క్షమించుట, దేవునితో మానవునితో సంబందం కలిగి జీవించుట. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క జీవితంను ఈ లోకంలో జీవించుటయే.

దేవుని యొక్క స్వభావం పవిత్రత కాబట్టి జాతిగా నం ప్రభువులుగా జీవించాలి. ఆయన పవిత్రత అనగా అనంత ప్రేమను చూపించుటయే, అందరి యెడల ఆదరణను, దయను, మంచితనమును ప్రదరించుటయే.

దేవుడు యిస్రాయేలును పవిత్రంగా వుండుటకు పిలిచారు. ఒక పవిత్ర జాతిగా జీవించాలని పిలుస్తున్నారు. ( నిర్గమ 19:6)

రెండవదిగా పొరుగు వాని మీద ద్వేషము పెట్టుకోవద్దు అని తెలుపుచున్నారు. ఎవరైనా మనకు హాని చేసినా మనం ద్వేషంను కలిగి వుంటాం అలాంటి సందర్భాలలో మనం వారిని మందలించాలి  అని తెలుపుచున్నారు. 

అంటే వారితో సఖ్యపడమని అర్ధం. సాధారణంగా ఎదుటివారు  మన యెడల తప్పిదాలు చేసిన యెడల వారిని మనం మన్నించాలి. మనలో ఉన్న ద్వేషం మనం పాపం చేసేలా దోహదపడుతుంది. 

మూడవది పొరుగువాని మీద పగతీర్చుకొనకుడు అని ప్రభువు తెలుపుచున్నారు.  అప్పటి కాలంలో ఇతర జాతుల మధ్య ప్రతీకారం చాలా క్రూరంగా ఉండేది. ఒక జాతికి చెందినవారు వేరొక జాతికి చెందినవానికి ఎటువంటిదైనా ముప్పు కానీ హాని కానీ అన్యాయం కానీ తలపెట్టినట్లైతే అప్పుడు వెంటనే రెండవ జాతి వారంతా మొదటి జాతి మీద పగతీర్చుకునే వారు. వారిని దారుణంగా చంపివేసేవారు. చేసిన హాని కన్నా ప్రతీకారం ఎక్కువగా జరుగుతుండేది. 

ఒకరు చేసిన తప్పిదం వాళ్ళ అక్కడి ప్రజలందరూ శిక్షను అనుభవించేవారు. అందుకే మోషే చట్టం ప్రతీకారంను చాలా వరకు పరిమితం చేసింది. మోషే చట్టప్రకారం కీడు చేసిన వానికి మాత్రమే ప్రతిక్రియ చేయవచ్చును గాక వేరే వారికి కాదు. చేసిన కీడుకంటే ప్రతిక్రియ ఎక్కువ ఉండకూడదు. యిస్రాయేలు ప్రజలు మిగతా వారికన్నా పవిత్రులుగా ఉండాలని అనుకున్నారు. అందుకే ఇవి భోదించారు. ఈనాటి మొదటి పఠన సారాంశం మనం దైవప్రేమను కలిగి పవిత్రంగా జీవించాలని అదేవిధంగా సోదర ప్రేమ కలిగి అందరితో స్నేహ భావంతో మెలగాలని తెలుపుచున్నాయి. 

ఈ మొదటి పఠనం ప్రతీకారాన్ని రద్దు చేస్తుంది. అందుకే శత్రువులకు సహాయం చేయుమని తెలుపుచున్నది (సామె 24 : 29 , 25 : 21) . కాబట్టి ప్రేమతో, దయతో జీవిస్తూ పవిత్రంగా ఉండాలి.   

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు మనందరం దేవుని యొక్క ఆలయమని తెలుపుచున్నారు. మనందరి యొక్క శరీరములు దేవునికి నివాస స్థలమని భోదించారు. దేవుడు నీవిసించే స్థలం పవిత్రంగా ఉండాలి కాబట్టి మన హృదయాలను, శరీరములను పవిత్రంగా వుంచమని పౌలు గారు తెలుపుచున్నారు. 

పౌలు గారు కొరింతులో ప్రసంగించే సందర్భములో అక్కడ అనేక విభజనలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఐక్యంగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక అని తెలిపారు.

మీరు దేవుని ఆలయం అని ఏక వచనంతో ఆయన తెలపలేదు అందరిని కూడా కలిపి చెప్పారు. దేవుని యొక్క ఆలయం ఒకరితో నిర్మితమైనది కాదు, అది ఒక సంఘ నిర్మాణం. అందరు కూడా కలసి ఉండాలి, అందరిలో కూడా దేవుని యొక్క ఆత్మ నివసించాలి అని తెలుపుచున్నారు. దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ ఒకటిగా ఉండాలి అన్నదియే పౌలుగారి యొక్క కోరిక. 

మనలో వసించే దేవుని యొక్క ఆత్మ మనలను పవిత్రులుగా చేస్తుంది. మనం పవిత్రంగా జీవించుటకు పవిత్రాత్మ మనకు వరములను దయచేస్తారు. అదేవిధంగా మన యొక్క శరీరములను పవిత్రంగా ఉంచుకోవాలి శారీరక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు మనం పాపంలో పడిపోకుండా నైతిక విలువలను కలిగి మనం జీవించాలి. 

మన యొక్క శరీరంను మాత్రమే పవిత్రంగా ఉంచుటకు మాత్రమే కాదు మిగతా వారి యొక్క శరీరములను కూడా గౌరవించాలి. ఎందుకంటే వారి యొక్క శరీరములు కూడా పవిత్రమైనవియే.  ప్రతి ఒక్కరు కూడా దేహమును దేవుని నివాస స్థలమని గుర్తించి శరీరమును పవిత్రంగా ఉంచుకొనుటకు ప్రయత్నించాలి.

ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు కొండమీద చెప్పిన విలువైన ప్రసంగం గురించి చదువుకున్నాం. ఈ యొక్క సువిశేష భాగం చాలా విలువైనది మానవ ఆలోచనలకు భిన్నమైనది. ఒక విధంగా చెప్పాలంటే యేసుప్రభువు అహింసను గురించి తెలుపుచున్నారు. పవిత్రంగా జీవించుటకు కొన్ని సూత్రాలు యేసుప్రభువు తెలియజేస్తున్నారు. 

యేసుప్రభువు ప్రకారం క్రైస్తవ జీవితంలో పగ తీర్చుకొనుట ఉండకూడదు. యేసుప్రభువు తనను వెంబడించే ప్రజల జీవితాలు ఈ లోక ఆలోచనలకు బిన్నంగా వుండాలని తెలిపారు. 

కీడును మేలును జయించాలని తెలిపారు (ఆది 44:4, సామెత 17:13,  1 పేతురు 3:9). మనకు కీడు తలపెట్టిన వారికి  సైతము యేసుప్రభువు మేలు చేయమని కోరుచున్నారు. మానవ స్వాభావంతో ఆలోచిస్తే ఇది కష్టం ఎందుకంటే మనకి అపాయం తలపెట్టిన వారిమీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలి అని మనం ఎదురు చూస్తాం.ఈనాటి సువిశేషం ద్వారా దేవుడు తెలిపే అంశం ఏమిటంటే మన జీవితం ప్రేమించే జీవితంలా, క్షమించే జీవితంలా బిన్నంగా వుండాలని ప్రభువు తెలిపారు. 

మానవ ప్రయత్నంతో ఇది అసాధ్యం కానీ దైవ సహాయంతో ఇది సాధ్యపడును (లూకా – 1:37). కంటికి కన్ను పంటికి పన్ను అనే అంశం అర్ధం చేసుకోవాలంటే పాత నిబంధన గ్రంథ బోధనను శాసనమును మనం పరిశీలించాలి ( నిర్గమ 21:23-25,  లేవి 24:20,  ద్వితియో 19:21).

ఈ వచనాలు ప్రతీకారం తీర్చుకోమని చెబుతున్నాయి కానీ కేవలం హాని తలపెట్టిన వ్యక్తికి మాత్రమే హాని చేయవచ్చు అని, అయితే అందరికి హాని తలపెట్టాలన్నది ఈ శాసనం యొక్క ఉద్దేశం కాదు.

పవిత్ర గ్రంధంలో యెసబేలు రాణి, హేరోదియా ఇంకా కొంతమంది పొరుగువారి మీద పగతీర్చుకున్నారు కానీ వారు  సంతోషంగా లేరు. కంటికి కన్ను పంటికి పన్ను అంటే పగతీర్చుకోవటం, ప్రతీకారం తీర్చుకోవటమే. దాని వలన మానవ సంబంధాలు, రక్త సంబంధాలు  కోల్పోతారు. ఇది ప్రభువు యొక్క ఉద్దేశం కాదు అందుకనే కీడును సైతం మేలుతో జయించామన్నారు. అలాగే దేవుని శాసనం ఏమిటానంటే మానవులు తమ పొరుగువారి యెడల దయను కలిగి జీవించుట. 

సాధారణంగా కుటుంబంలో వున్నా ఒక బిడ్డకు ఎవరైనా హాని చేస్తే లేక ఎవరైనా ఆ బిడ్డను కొడితే ఆ కుటుంబం మొత్తం వెళ్లి గొడవపడతారు. ఇలాంటి సందర్భాలను ప్రభువు ప్రక్కన పెట్టమంటున్నారు. 

దేవుడు శాసనం ఇచ్చినది ఎందుకంటేకేవలం నష్టపోయిన వానికి కొద్దిపాటి న్యాయం జరుగుట కోసమే కానీ అన్న్యాయానికి అన్యాయం చేయమని కాదు. ప్రతీకారం తీర్చుకొనుటకు బదులుగా పొరుగువారిని మనం మన్నించాలి. ప్రభువు అంటున్నారు నీ కుడి చెంప మీద కొట్టినవారికి ఎడమ చెంప చూపించమని ప్రభువు తెలిపారు. సాధారణంగా ఇది అతి కష్టం. ఎవరికి ఇది సాధ్యం. మాములుగా ఒక చెంపమీద కొడితే రెండవ చెంప చూపించటం ఇంకా కష్టం కానీ ప్రభువు అదియే చేయమని తెలిపారు. 

 ఒకని కుడి చెంప మీద కొట్టాలంటే సాధారణంగా మనం చేతి వెనుక బాగంతోనే కొట్టగలంగాని అరచేతితో కొట్టలేం. యూదుల యొక్క చట్టం ప్రకారం చేతి వెనుక భాగంతో ఒకనిని కొట్టడం చాలా అవమానకరం. అరచేతితో కొట్టిన దానికంటే రెట్టింపుగా అవమానకరం దీనిని బట్టి మనం గ్రహించవలసిన అంశం ఏమిటంటే మనకు ఎంతటి అవమానాలు జరిగినా వాటిని సహనంతో భరించాలి. యేసు ప్రభువు మీద ఉమ్ము వేశారు ప్రభువు అన్నింటిని భరించారు. నిజంగా ఈ యొక్క భోధన మనందరికీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ యేసుప్రభువు తన జీవితంలో అనుసరించి మనకు చూపించారు. 

రెండవదిగా యేసుప్రభువు నీ అంగీకొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము అని పలికారు. యూదుల ఆచారం ప్రకారం పై వస్త్రం విలువైనది. ఈ వస్త్రాన్ని రాత్రి పూట కప్పుకోవటానికి కూడా వాడుకుంటారు. విలియం బార్కే గారు అంటారు యూదులు తమ పై వస్త్రమును ఎవరైనా అవసరంలో వున్నా వారికి అప్పుగా ఇవ్వవచ్చు అని. అయితే దానిని మరలా సాయకాయలం వరకల్లా తిరిగి ఇవ్వాలి.  నిర్గమ 22 : 26 -27 .

ఈ యొక్క అంశం యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే మానవుని యొక్క ఆలోచనలు కేవలం తమ యొక్క సంపదలు, ఆస్తిపాస్తులు, వస్త్రాల మీద కాకుండా అడిగిన ప్రతివానికి ఇచ్చే ఉదార స్వభావం కలిగి జీవించమని ప్రభవు తెలిపారు. 

వ్యాజ్యమాడిన వానికి ఇవ్వమని ప్రభువు తెలిపారు. ఇచ్చేవాడు ఎటువంటి తగువులాడకుండా, క్షమిస్తూ, అర్ధం చేసుకొని పొరుగువానికి తన పై వస్త్రము ఇవ్వమని యేసుప్రభువు అన్నారు.

అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకే ఇవ్వమని ప్రభువు తెలిపారు. క్రైస్తవ జీవితమంటేనే ఇవ్వటం. అవసరమైన సందర్భాలలో మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. క్రైస్తవులు అనేవారు అవసరంలో వున్నప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎవరైతే అడిగిన ప్రతి ఒక్కరికి ఉదారంగా ఇస్తారో వారికి మేలు కలుగుతుందని పవిత్ర గ్రంధం తెలుపుతుంది. కీర్తన 112 : 5 . ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇవ్వాలి. 

మనయొక్క నిత్య నివాసం పరలోకమని గ్రహించి మనం పరలోకంలోకి ప్రవేశించుటకు ఇతరులకు సహాయం చేస్తూ జీవించాలి. మనం ఇచ్చేది అలాగే చేసే మంచి వ్యక్తిగతంగా ఉండాలి. చాలా సందర్భాలలో మనం అనేక చోట్ల చూస్తాం ఫ్యాన్ మీద ఇచ్చిన వారు పేరు, ద్రాక్షారసపు పాత్ర ఇచ్చిన వారి పేరు అలాగే వివిధ రకాలైన వస్తువులు ఇచ్చేటప్పుడు, సహాయం చేసేటప్పుడు తమ పేర్లు బహిరంగంగా కనపడేలా కొంతమంది కోరుకుంటారు కానీ యేసు ప్రభువు దీనిని ఇష్టపడుటలేదు. అందుకే ప్రభువు అంటారు నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియనివ్వవద్దని  (మత్తయి 6 : 3 ). కాబట్టి మనం చేసే సహాయం వ్యక్తిగతంగా ఉండాలి. 

మన ఇచ్చేటప్పుడు తీసుకునే వ్యక్తి యొక్క గౌరవమును కూడా కాపాడాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో తీసుకునే వారు అవమానాలు భరించవలసి వస్తుంది. కాబట్టి మనం ఏదైనా సహాయం చేస్తే ఎదుటి వారి యొక్క గౌరవమును కాపాడాలి మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు తప్పనిసరిగా దయచేస్తారు కాబట్టి స్వార్ధంతో కాక నిస్వార్ధంతో ఉదార స్వభావంతో జీవించాలి (లూకా 6:38, 3:10-11, 12:33,  రోమి 12:13,  అపో 20:35).

చివరిగా యేసుప్రభువు శత్రువులను ప్రేమిచామని పలుకుచున్నారు. మనల్ని ప్రేమిచిన వారినే మనం ప్రేమిస్తే మన జీవితంకు ప్రత్యేకత ఏమి లేదని ప్రభువు తెలుపుచున్నారు. నీ పొరుగు వానిని ప్రేమించు అని పలుకుచున్నారు. యూదుల యొక్క ఆలోచన ప్రకారం పొరుగువారు అంటే తోటి యూదుడే, వారి సంఘంకు చెందినవాడు, వారి యొక్క మతమును అనుసరిచేవాడు మాత్రమే. మిగతా వారందరు బయట వారే. నీ పొరుగువారిని ప్రేమించమని అన్నప్పుడు వారు తమ శత్రువులను ద్వేషించవచ్చని భావించారు కానీ యేసు ప్రభువు శత్రువులను ప్రేమించమని కోరారు. ఇది చాలా చాలా కష్టం.

నీ శత్రువులను ప్రేమిచామని అన్నారు దాని అర్ధం ఏమిటంటే అందరిని కూడా ప్రేమించమని కేవలం తోటి యూదులనే కాకుండా అందరి యెడల ప్రేమ కలిగి జీవించమని ప్రభువు తెలిపారు ( 1 పేతురు 2 : 17 ). శత్రువులను ప్రేమించుట అనేది మానవుని యొక్క స్వభావమును వ్యతిరేకం ఎందుకంటే మానవ స్వభావం ఏమిటంటే React అవ్వడం. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనం ఇంకొకటి నేస్తం కాబట్టి మన శత్రువులను ప్రేమించడం అంటే అతి కష్టం. సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉంటాం కానీ యేసుప్రభువు మన శత్రువులను ప్రేమించమని చెప్తున్నారు. 

ఒక నిజమైన క్రైస్తవుడు తన శత్రువు యెడల సానుభూతి చూపించకపోతే ఆయన ఈ లోకంలో ఏది సాధించినట్లే (లూకా 6 : 36 ).

శత్రువులను ప్రేమించమని ప్రభువు పలుకుచున్నారు కాబట్టి మనస్సులో ఎటువంటి ద్వేషం, అసూయలు, మనస్పర్థలు ఉంచుకోకుండా మన ఎదుటివారిని ప్రేమించాలి. అదేవిధంగా మనల్ని హింసించే వారికోసం ప్రార్ధించమని ప్రభువు పలుకుచున్నారు. మనం మూడింటి కోడం ప్రార్ధించాలి.

1 . హింసించే వారిని దేవుడు మన్నించాలని ప్రార్ధించాలి ( లూకా 23: 34,  అపో 7:60).

2 . హింసించే వాని మధ్య, హింసించబడుతున్న వాని మధ్య సమాధానం ఉండుటకు ప్రార్ధించాలి. 

3 . హింసించే వారు రక్షణ పొందేలాగా వానికొరకు ప్రార్ధించాలి.  

మనం శత్రువుల కొరకు ప్రార్ధిస్తే ఆ ప్రార్ధన మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని ప్రేమిచే ఏ వ్యక్తి అయినా సరే తమ పోరోగువానిని అసహ్యించుకొనడు ( 1 యోహాను 3: 23, 4: 19-21). 

ప్రేమించుట ద్వారా మనం దేవుని బిడ్డలగుచున్నాము. ఎందుకంటే ప్రభువే మీరు పరస్పర ప్రేమ కలిగి జీవించమని కోరుచున్నారు. మనం చూపించే ప్రేమ మనల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఎవ్వరు చూపించని ప్రేమ మనం చూపిస్తే శత్రువులు సైతం మారిపోతారు. యేసయ్య చూపిన ప్రేమ చూసి అనేక మంది మారిపోయారు. క్రైస్తవులను మిగతా వారికన్నా ప్రత్యేకంగా చూపించే అంశమే శత్రువులను ప్రేమించుట. అతి కష్టమైనా కానీ క్రీస్తు ప్రభువు మనల్ని ఇవి పాటించమని కోరారు. ఆయన తన జీవితంలో అక్షరాలా అన్నింటిని పాటించి జీవించారు. మన జీవితంలో యేసు ప్రభువు చెప్పించా మాటలు పాటించి జీవిస్తే మనం పవిత్రులుగా, పరిపూర్ణులుగా చేయబడతాం. 

దేవుడు మనందరం కూడా ఐక్యమత్యంతో  కలిసి వుండాలని కోరుకుంటున్నారు. పగ తీర్చుకోవటం ద్వారా, ద్వేషించుట ద్వారా మనం బంధాలు కోల్పోయి జీవిస్తాము కాబట్టి కీడుకు మేలుకు చేస్తూ, ప్రేమ కలిగి జీవిస్తూ యేసు ప్రభువు వలే మనందరం దేవునికి సాక్షులుగా ఉండాలి. 

మన జీవితం మిగతా వారి యొక్క జీవితాలకన్నా భిన్నంగా ఉండాలంటే ప్రభువు ఈనాడు సువిశేషంలో చెప్పిన విషయాలు పాటించాలి.


FR. BALAYESU OCD

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...