17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

 7 వ సామాన్య ఆదివారము

లేవి 19 :1 -2 , 17 -18, 

1 కొరింతి 3 : 16 - 23,  

మత్తయి 5 : 38 - 48

పవిత్ర జీవితానికి ప్రేమ మార్గం


క్రీస్తు నాధుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ నాడు మనమందరము కూడా సామాన్య కాలపు 7 వ ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. ఈ నాటి మూడు పఠనాల ద్వారా తల్లి తిరుసభ మనందరినీ కూడా దేవునివలె, క్రీస్తు వలే పవిత్రముగా జీవించమని, ప్రేమ మార్గాన్ని అవలంబించమని ఆహ్వానిస్తుంది. 

ఏ విధంగా మనం క్రీస్తు వలే పవిత్రముగా జీవించగలం? ప్రేమ మార్గాన్ని ఈ ప్రస్తుత సమాజంలో మనము అవలంబించగలమన్న సందేహం మనలో కలుగవచ్చు. ఆ సందేహానికి సమాధానంగా ఈ నాటి మూడు పఠనాలు ఉంటున్నాయి. 

ఉపదేశకుడు గ్రంధము 12 : 13 వ వచనంలో చూసినట్లయితే “దేవుని ఆజ్ఞలకు భయపడి అతని ఆజ్ఞలను పాటింపుము. నరుని ప్రధాన ధర్మము ఇదియే”. 

రోమీయులు 13 : 8 - 10  చూసినట్లయితే “ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడి. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోటివారిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము. తోడివారిని ప్రేమించువాడు, వానికి ఏ కీడును చేయడు. కనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 

సిరా 28 : 1 - 7  వచనాలలో చూసినట్లయితే “ప్రభువు నరుని పాపమునెల్ల గమనించును. పగ తీర్చుకొను నరుని మీద అతడు పగ తీర్చుకొనును. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో దేవుడు నీ అపరాధములను మన్నించును”. నీవు తోడి నరుని మీద కూపముగా ఉన్నచో నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లు అడుగగలవు? 

ప్రియ సహోదరులారా, ఈ నాటి మూడు పఠనాలు కూడా మనకు  ఇచ్చే ముఖ్యమైన లేదా ప్రధానమైన సందేశం “పొరుగువారిని ప్రేమింపుము”.

మొదటి పఠనము: “మీ దేవుడును ప్రభుడనైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై యుండుడు”. అని మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇస్రాయిలు ప్రజలు, దేవుడు వారికి ఇచ్చిన పవిత్రతను కోల్పోయారు. దేవుని ప్రేమ నుండి దూరమవుతున్నారు. పరిశుద్ధ గ్రంధములో హోషేయ ప్రవక్త దేవుని ప్రేమను చాలా చక్కగా వర్ణిస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భార్య స్థానంలో ఉంటె, దేవుడు భర్త స్థానంలో ఉంటున్నాడు. దేవుడు మాత్రం తాను చేసిన ఒడంబడికలకు, వాగ్ధానాలకు విశ్వాస పాత్రుడుగా ప్రతి నిత్యము  కాపాడుతూ వస్తున్నారు, అనేక అద్భుతాలు చేస్తున్నారు. కానీ భార్య అయిన ఇశ్రాయేలు ప్రజలు బాలు దేవతలను లేదా అన్య దేవతల వెనుక వెలుతూ విగ్రహములను ఆరాధిస్తున్నారు. అన్య దేవతలను భర్తగా దేవుడి స్థానంలో ఉంచుతున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రులయ్యారు.

అందుకే హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను “వ్యభిచారిణిగా” పరిగణిస్తారు.

అందుకే మొదటి పఠనంలో చూస్తున్నాం “నేను పవిత్రుడను” ఇశ్రాయేలు ప్రజలను కూడా పవిత్రులుగా ఉండమని చెప్పమని ప్రభువు మోషే ప్రవక్త తో పలుకుతున్నారు.

మరి పవిత్రులుగా కావాలంటే ఏమి చేయాలి ? పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిమీద పగ తీర్చుకోకూడదు, వైరము పెట్టుకోకూడదు, ద్వేషము పెట్టుకోకూడదు. 

మనము పొరుగు వారిని ప్రేమిస్తే, దేవుడిని ప్రేమించినవారమవుతాము. 

దేవుని ఆజ్ఞలను పాటించినవారమవుతాం.

ఎందుకంటే ప్రతి మానవుని దేవుడు తన పోలికలో, తన రూపురేఖలలో సృజించెను.  కనుక, మనలోను, పొరుగు వారిలోను దేవుడు ఉన్నాడు.

అందుకే పునీత మథర్ తెరెసా గారు చెబుతారు, అవసరంలో ఉన్నవారిలో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిలో ప్రభువును చూసేవారు అని చెబుతారు.

మరి మనం కూడా మన సోదరులను, అవసరంలో ఉన్నవారిలోను, ప్రభువుని చూస్తున్నామా, ప్రేమిస్తున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

రెండవ పఠనము 

“మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా?”.

దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము. అని పౌలుగారు అంటున్నారు.

ఆదిఖాండములో మానవ సృష్టి వృత్తాంతమును మనకు తెలుసు, దేవుడు మానవుని తన పోలికలో సృజించెను,దేవుని ఊపిరిని మానవుడిలో ఊదాడు . మానవుడు image of God, likeness of God. 

ఈ image అనే పదమునకు దైవ శాస్త్రంలో చాల ప్రాముఖ్యమైన అర్థము ఉంది. 

image అంటే పోలిక మాత్రమే కాదు. image అంటే holy అని likeness of God అంటే holiness of God “పవిత్రత అని అర్థం”. అని చాలామంది వేదపండితులు చెబుతున్నారు.

అంటే మనలో, లేదా ప్రతి మానవునిలో దైవత్వం ఉంది, దైవత్వం ఉంది అంటే దేవుడే కొలువు దీరి ఉన్నాడు.

అందువలననే మనము పవిత్రులము అయ్యాము. ఎప్పుడైతే మనము పవిత్రముగా జీవిస్తుంటామో, మనలో ఉన్నదా దైవత్వాన్ని ఇతరులకు మన జీవిత విధానంద్వారా వ్యక్త పరుస్తామో, సాక్షాత్తు దేవుడే మన రూపంలో మనద్వారా జీవిస్తున్నారు, మనలో జీవిస్తున్నారు అని అర్థంచేసుకోవాలి.

ఉదాహరణకి : పునీత ఆవిలాపురి తెరేసమ్మగారు చెబుతారు, " దేవాది దేవుడు స్వయానా, మనలో, మన హృదయాంతరంగం అనే కోటలో నివసిస్తున్నారు". అని తన రచనలలో తెలియ పరుస్తారు. కానీ  చాలాసార్లు మనము ఈ పరమార్థాన్ని, మనకున్న బలహీనతల ద్వారా గ్రహించలేకున్నాము. 

ఇంకొక ఉదాహరణకు  దైవశాస్త్ర పండితులందరూ కూడా మరియ తల్లి గర్భాన్ని పవిత్రమైన దేవాలయముగా సంభోదిస్తారు. ఎందుకంటే ఆమే సాక్షాత్తు దేవుని కుమారుని, పవిత్ర మూర్తి అయినా యేసు ప్రభుని తన గర్భములో మోసింది. ఇది మన క్రైస్తవ విశ్వాసముకూడాను.

సోలోమోను మహా రాజు కూడా దేవాది దేవుడికి ఒక పవిత్రమైన దేవాలయాన్ని ఎన్నో నియమ నిభంధనలతో, పవిత్రమైన వస్తువులతో, అందమైన వస్తువులతో, దేవాలయాన్ని నిర్మిస్తారు.

దేవాది దేవుడు పరమ పవిత్రుడు. మరి ప్రతి నిత్యమూ కూడా మన హృదయమనెడు దేవాలయములో నివసిస్తున్నారు. 

మరి మన హృదయమనెడి ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుతున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

కొన్ని సార్లు మన చెడు జీవితం ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, మన హృదయమనెడు ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాం.

ఈ ఆలయములో దేవుడికాక, లోకపు ఆలోచనలకూ, ఆస్తి అంతస్తులకు, పేరు ప్రఖ్యాతలు, కోపం ద్వేషం, క్రోధం, మోహం, వ్యభిచారం, అసూయా, పగ, స్వార్థం అనే సాతాను పనులకు, ఆలోచనలకూ స్థానమిచ్చి, మన హృదయాన్ని వాటితో నింపివేసాము. దేవుడిని, అంటే దేవుడి ఆలోచనలను, ప్రేమ, దయ, కరుణ, క్షమా, మర్యాద, సోదర ప్రేమ, అనేది దైవ కార్యాలను, దైవ వ్యక్తుత్వాన్ని మనం గమనించకుండా, దేవునికి దూరంగా ఉంటున్నాం. మన హృదయమనే ఆలయాన్ని నాశనం చేస్తున్నాం, మోసపోతున్నాం. అందుకే ఈ నాడు రెండవ పఠనం ద్వారా పునీత పౌలుగారు మనందరినీ మోసపోవద్దు అని హెచ్చరిస్తున్నారు.

దేవుని ఆలయము ఎప్పుడుకూడా  పవిత్రంగా ఉంటుంది. పవిత్రముగా ఉంటె ప్రేమ ఉంటుంది. కాబట్టి దేవుని ఆలయము చెడు ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో ఉండకూడదు.

అందుకే క్రీస్తు ప్రభువుకూడా, దేవాలయములో అన్యాయపు వ్యాపారం చేస్తున్నప్పుడు, ఇతర చెడు కార్యాలను చేస్తున్నప్పుడు , అందరినికూడా దేవాలయమునుండి బయటికి తరిమికొట్టారు.

అలాగే మనంకూడా మన హృదయములో ఉన్నటువంటి మలినాన్ని, చెడును అంతటిని కూడా తరిమికొట్టాలి, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి.

సువిశేష పఠనము 

ఈ నాడు క్రీస్తు ప్రభువు, మానవుడు ఏర్పరిచిన నియమ నిభందనలకన్నా, మానవత్వపు విలువలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

సువిశేష పఠనంలో చుస్తే క్రీస్తు ప్రభువు ఒక నూతన సిద్దాంతాన్ని తన శిష్యులకు తెలియచేస్తున్నారు.

43. వ వచనం చూస్తున్నాం “నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము”. అను ఈ సిద్దాంతం ముగించింది. ఇప్పుడు నూతన సిద్దాంతాన్ని పాటించండి అని కోరుతున్నారు. అదియే,  “మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారికొరకు ప్రార్థింపుడు”.

46, 47 వచనాలు చూస్తే మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? అని పలుకుతున్నారు.

ఉపకారికి, ఉపకారం చేయడం కన్నా, అపకారికి ఉపకారం చేయడంలోనే గొప్పతనం ఉందని మనకు అర్థమవుతుంది.

అంతేకాక దేవుడు తన ప్రేమను అందరికీ సమానంగా పంచుతారు, అందరిని  ఒకే విధంగా దీవిస్తారు. 

కానీ మనం మాత్రం, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మనకు మేలుచేసినవారికి మాత్రమే, మేలుచేస్తాము, లేదంటే మనకు పడనివారితో భందం ఉండదు.వారిని ద్వేషిస్తాము. మనము ఎప్పుడు కూడా పగలతో, ద్వేషాలతో, కులభేదాలు, మతాల పేరుమీద చాల వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు చూపిస్తుంటాము. 

క్రీస్తు ప్రభువు తన జీవితంలో, తానూ శ్రమలను అనుభవించినాకూడా, తనని దూషించినాకూడా, మొఖము మీద ఉమ్మివేసినాకూడా , వారందరిని క్షమించారు.

సమాజంలో అంటరానివారిని, సమాజంనుండి వెలివేయబడిన వారిని, యూదులు తిరస్కరించినవారిని , పాపాత్ములను, సుంకరులను, ద్రోహులను, కుష్ఠిరోగులను అందరినికూడా  ప్రేమించారు, క్షమిచ్చారు, సేవలందించారు, అద్భుతాలు, స్వస్థతలు చేసారు.

ఆయన నడిచిన ప్రేమ మార్గాన్ని మనకు భోదించారు.

సోదరుని లేదా పొరుగు వారిని నిరాకరించిన వారిని దేవుడు కూడా నిరాకరిస్తారు.

ఉదాహరణకి పైన చెప్పిన వచనాలలో మనకి అర్థమవుతుంది. ఉపదేశకుడు గ్రంధము 12 : 13, రోమీయులు 13 : 8 - 10, సిరా 28 : 1 - 7.

ఉదాహరణకి 

ధనికుడు లాజరుని నిరాకరించారు, ప్రేమిచలేదు, గమనించలేదు. అందువలననే దేవుని రాజ్యాన్ని కోల్పోయారు.

కైను తన సోదరుడు ఆబేలుని  అసూయతో నిరాకరించాడు, కావున దేవుడు కైనును తాను అర్పించిన అర్పణలనుకూడా నిరాకరించారు.

యోసేపును తన అన్నలు నిరాకరించారు, అందుకు గాను దేవుడి ప్రణాళిక ప్రకారం వారిని బానిసలూ చేసారు. 

క్రీస్తుప్రభువు భోదనలలో కూడా చూస్తున్నాం, ఎవరేని ఈ అత్యల్పులలో ఈ ఒక్కరిని మేలుచేసిన యెడల అది నాకు చేసినట్లే, చేయని యెడల అది నాకును చేయనట్లే అని పలికారు. 

మనము ఏ కొలతతో ఇతరులను కొలుస్తామొ అదే కొలతతో కొలవబడుతాము అని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియ చేస్తోంది.

కావున మనంకూడా మన ముందున్నటువంటి సోదరులను, పొరుగు వారిని , గ్రహించలేకపోతే, ప్రేమించలేకపోతే, క్షమించలేక పొతే, దేవుడు కూడా మనలను నిరాకరిస్తారు, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము.

కాబట్టి మనందరమూ కూడా మానసోదరులను, పొరుగు వారిని ప్రేమించి, క్షమించి,  దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు  పొందడానికి ప్రయాస పడుదాం.


Bro. సుభాష్ OCD


సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...