17, డిసెంబర్ 2022, శనివారం

ఆగమన కాలం - నాలుగవ ఆదివారం

 

ఆగమన కాలం - నాలుగవ ఆదివారం

యెషయా 7:10-14

రోమా 1:1-7

మత్తయి 1:18-25

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క జననం త్వరలోనే జరగబోతుంది అనే అంశం గురించి తెలియజేస్తున్నాయి.

దేవుడు త్వరలోనే రాబోతున్నాడు కాబట్టి ఆయన యొక్క రాక కోసం మనందరం విశ్వాసంతో ఎదురు చూడాలి.

విశ్వాసం అనేది ద్వారం లాంటిది కేవలం విశ్వాసం ద్వారానే దేవుడిని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించగలుగుతాం.

ఈనాటి మొదటి పఠనం లో ఆహాజు రాజు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మానవ శక్తి మీద ఆధారపడి జీవించాడు.

క్రీస్తుపూర్వం 8 వ శతాబ్దం చివర్లో సొలోమోను రాజు తరువాత ఎన్నుకొనబడిన ప్రజలు రెండుగా విభజించబడ్డారు. ఇశ్రాయేలు - యూదాగా రెండు రాజ్యాలుగా విభజించబడ్డాయి.

రెండుగా విభజించబడిన తరువాత ఎన్నుకొనబడిన ప్రజలు దేవుడిని విస్మరించిన సందర్భంలో బానిసత్వంలోకి కొనిపోబడ్డారు.

అప్పటిలో చాలా మంచి మంచి ప్రదేశాలు ఆసీరియా రాజ్యం క్రింద ఉన్నాయి. అప్పుడు సిరియా రాజు మరియు ఉత్తర ప్రాంతపు ఇశ్రాయేలు రాజు కలిసి హోదా రాజ్యంపై దండెత్తి రాపోయారు.

సిరియా రాజు అదే విధంగా ఉత్తర ప్రాంతపు (ఇశ్రాయేలు) రాజులు ఎందుకు యూదా రాజ్యం మీద యుద్ధం చేయాలనుకున్నారంటే అస్సిరియ  రాజు మీద యుద్ధం చేయుటకు సహాయం చేయమని కోరినప్పుడు యూదా రాజు అయిన ఆహాజు, సిరియా రాజు, ఉత్తర దేశం ఇశ్రాయేలు రాజుల మాటను నిరాకరించాడు అందుకే వారు మొదటిగా యూదా  రాజ్యమును ద్వంశం చేయాలని అనుకున్నారు.

ఆహాజును తన యొక్క అధికార పదవి నుండి దించాలని వారు భావించారు. అలాంటి కష్ట సందర్భంలో ఆహాజు రాజు అస్సిరియ రాజు సహాయంను కోరాడు అయితే ఇలాంటి ఒక ఇబ్బందుల సమయంలో దేవుడు తన యొక్క ప్రవక్త యెషయా ను ఆహాజు దగ్గరికి పంపించి అభయమోసగుతున్నరు.

దేవునికి మొరపెట్టుకొని సహాయం అందించిన ఎడల దేవుడు కాపాడతారని యెషయా ఆహాజు రాజుకు తెలిపారు.

దేవుడు పూర్వం దావీదునకు వాగ్దానం చేశారు, "దావీదు యొక్క కుటుంబం కలకాలము రాజ్యపాలనము చేయునని" - 2 సమూ 7:16. ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు వారిని అన్ని ఆపదల నుండి కాపాడతారని యెషయా ప్రవక్త తెలిపారు.

ప్రవక్త ఎంత చెప్పినా సరే ఆహాజు రాజు తన యొక్క మాటలను వినలేదు రాబోయే పరిస్థితులను ఊహించి సంధికి వెళ్ళవద్దని ప్రవక్త హెచ్చరించారు. అస్సిరియ యొక్క సహాయం కోరితే తరువాత యూదా ప్రజలు మత బ్రష్టులవుతారని ప్రవక్త తెలిపారు ఎంత హెచ్చరించినా సరే ఆహాజు రాజు మాత్రం తనను తాను కాపాడుకునేందుకు దైవ శక్తిని కాదని మానవ శక్తిని నమ్ముకున్నాడు.

దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన విజయం రాదని అసాధ్యమని తలంచి ప్రవక్త యొక్క మాటలను పెడచెవిన పెట్టారు.

అయినప్పటికీ యెషయా ప్రవక్త దేవుడు నీకు ఒక గుర్తు చూపిస్తారు దానిని బట్టి అయినా దేవుని విశ్వసించు అని తెలిపారు. అయినా కానీ ఆహాజు రాజు ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించారు రాజు దేవుని మాటలు తన జీవితంలోకి ఆహ్వానించలేదు.

ఆహాజు రాజు దేవుడిని రుజువు కోరితే పరీక్షించటమే అని ఆహాజు భావించాడు ఎందుకంటే పూర్వం మిస్సా వద్ద ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారు - ద్వితి 6:10.

ఈ యొక్క మాటలు ఆహాజు రాజు ఒక నేపంగానే వాడుకున్నాడు ఇది కేవలం ఒక సాకు మాత్రమే ఎందుకంటే ప్రవక్తయే తెలుపుచున్నారు ఒక యువతి గర్భము ధరించి కుమారుని కనును అతను రాజ పాలనము శాశ్వతముగా చేయునని (యెషయా 7:13-14), దేవుడు తనకు సహాయం చేస్తాడు అని స్వయంగా ప్రవక్తయే తెలిపారు.

దావీదు వంశం స్థిరంగా నిలుచును అని పలికారు కానీ ఆహాజు రాజు దేవుని మాటలను ఆలకించలేదు అవిశ్వాసంతో ఉన్నారు.

చాలా సందర్భాలలో మరీ ముఖ్యంగా మనం కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు మనం కూడా దైవ శక్తి మీద ఆధారపడకుండా మానవ శక్తి మీద ఆధారపడి జీవిస్తాం.

యూదా ప్రజలు యావే దేవిని యొక్క ఎన్నో గొప్ప కార్యాలు చూశారు అయినప్పటికీ వారి కష్ట సమయంలో అన్నీ మరచిపోయారు అందుకే అంతా అవిశ్వాసులుగా మారారు.

దేవుని పట్ల నమ్మకము ఉంచి ప్రార్థిస్తే ఆయన మీద ఆధారపడి జీవిస్తే తన ప్రజలకు చిరకాలం తోడుగా ఉంటారని ఈ మొదటి పఠనం ద్వారా తెలియజేస్తున్నారు.

ఈనాటి రెండవ పఠనంలో పౌలు గారు ఏసుక్రీస్తు ప్రభువు దావీదు వంశస్తుడని ఆయన మెస్సయ్య అని తెలిపారు.

తన యొక్క కుమారుని యొక్క జననం గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశారు అని పౌలు గారు పలికారు.

ఏసుక్రీస్తు ప్రభువు మానవునిగా దావీదు వంశస్తులైన యోసేపు, మరియమ్మ గార్లకు జన్మించారు. తన యొక్క మరణం పునరుద్ధానం ద్వారా ఆయన శక్తిమంతుడైన దేవుని కుమారుడని పిలవబడ్డారు.

తన యొక్క లేఖనములో పౌలు గారు తనను తాను అన్యులకు యూదా క్రైస్తవులకు ఎరుకపరచుకొంటున్నారు.

తనను ఎరుకపరుచుకునే సందర్భం నాటికి రోము నగరంలో ఎటువంటి హింసలు ప్రారంభం కాలేదు. చిన్నచిన్నగా విశ్వాసం పెరుగుతుంది ఆయన దేవుని యొక్క అపోస్తులుగా మారిన విషయం బహుశా రోమా నగరంలో అందరికీ తెలియదు కాబట్టి తనను తాను ఏసుక్రీస్తు అపోస్తులుగా తెలియపరచుకుంటున్నారు.

ప్రతి ఒక్క ప్రజ, జాతి రక్షింపబడుటకు దేవుడు తనను సువార్త సేవకై ఎన్నుకొన్నారు అని తెలిపారు. ఏసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచారు కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించమని పౌలు గారు తెలిపారు.

మనం కూడా దేవుని ప్రజలమే కాబట్టి ఆయనను ఆహ్వానించుటకు మనం విశ్వాసంతో పరిశుద్ధతతోను తాయారు అవ్వాలి.

ఈనాటి సువిశేష పఠనంలో దేవదూత యోసేపు గారికి దేవుని కుమారుని యొక్క పుట్టుక రీతిని వివరించిన విధానం చదువుకుంటున్నం.

యోసేపు గారు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి పలుకును విశ్వసిస్తున్నాడు.

ఈనాటి సువార్త యోసేపు గారి మనసులో ఏర్పడిన ఒక సున్నితమైన సందేహంతో మొదలవుతుంది.

లూకా సువార్తికుడు మరియమ్మ గారి యొక్క వినయమును, విశ్వాసమును తెలుపుతూ క్రీస్తు ప్రభువు యొక్క జననం ను రాశారు.

మత్తయి సువార్తికుడు యోసేపు గారి యొక్క విధేయతను, విశ్వాసమును తెలుపుతూ క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి తెలిపారు. ఎందుకంటే ఏసుక్రీస్తు దావీదు వంశస్థుడు కాబట్టి (మత్తయి 1:1-17).

ఎందుకని ఈనాటి దివ్యగ్రంధ పఠనాలు ఆహాజు రాజును యోసేపు గారిని కలిపి తెలుపుతుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా జీవితంలో ఒక కష్ట సమయంలో ఉన్నారు నిర్ణయం తీసుకొనుటలో ఇబ్బంది పడ్డ సమయం అది.

ఒకరు (ఆహాజు) తన యొక్క సొంత ఆలోచనలు, ప్రణాళికలు మరియు మానవ శక్తి మీద ఆధారపడితే ఇంకొకరు (యోసేపు) దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు తెలిపిన ప్రతి ఒక్క విషయమును విశ్వసించారు.

దేవుని పట్ల దృఢమైన విశ్వాసంతో విధేయత కలిగి నడుచుకున్నారు.

ఆహాజు రాజు ఇతరులను ఒప్పించటం కోసం శాంతింప చేయుట కోసం దయ లేకుండా తన కుమారుని బలి చేశాడు -2 రాజులు 16:3.

యోసేపు గారు మాత్రము తన బిడ్డకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు. ఆపదల నుండి సమస్యల నుండి కాపాడారు. యోసేపు గారు దేవుని స్వరముకు ప్రాధాన్యతనిచ్చి ఆయన యొక్క మాటలను తన జీవితంలో నెరవేర్చారు.

యూదుల యొక్క వివాహం నిశ్చితార్థం ద్వారా ప్రారంభం అవుతుంది. అది ఇప్పటి కాలంలో కూడా మనం అనుసరిస్తున్నాం.

యూదుల ఆచార ప్రకారం యోసేపు, మరియమ్మలకు నిశ్చితార్థం జరిగింది వారిరువురూ ఇక భార్యాభర్తలతో సమానంగా కలిసి ఉండవచ్చు. ఒక్క శారీరక సంబంధం తప్ప మిగతా అన్ని విషయాలలో ఒకటిగా జీవించవచ్చు.

మరియమ్మ గారు వివాహానికి ముందే పవిత్రాత్మ ప్రేరణతో గర్భవతి అయ్యారు. యోసేపు గారు ఈ విషయమును తెలుసుకొని ఆందోళన పడ్డారు.

ఒక స్త్రీ వివాహం అవ్వకుండా గర్భవతి అయితే వ్యభిచారినిగా పరిగణింపబడుతుంది. ఆమెను మోషే ధర్మ శాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి - ద్వితీ 22:23-34.

యోసేపు గారు నీతిమంతుడు కనుక ఆమెకు కష్టం కలిగించకుండా ఆమెను రహస్యంగా విడనాడాలని నిర్ణయించుకున్నారు. అలా చేయుట ద్వారా యోసేపు గారు క్రీస్తు వలె పాపి పట్ల కనికరం చూపించారు. అంతేకాక తోరా చట్టానికి, ప్రేమ చట్టానికి సమతుల్యతను ప్రదర్శించారు.

ఇది కుటుంబంలో ఒక కలహమే, ఒక బాధయే మరి ముఖ్యంగా యోసేపు గారికి ఎందుకంటే ఎంత గానో ప్రేమించిన వ్యక్తి ఇష్టపడిన వ్యక్తి మరియమ్మ తన ప్రమేయం లేకుండా గర్భం దాల్చుట ఆయన అంగీకరించలేకపోయారు. ఆమె మీద ఉన్న ప్రేమ వలన ఆయన ఆమెను అవమానించలేదు.నిజం తెలియక ముందు సందేహించాడు, నిజం తెలిసిన తరువాత యోసేపు గారు మరియమ్మను తన భార్యగా స్వీకరించారు.

యోసేపు గారు ఒక గొప్ప అంతరంగిక బాధనే అనుభవించి ఉండవచ్చు నిరుత్సాహపడి ఉండవచ్చు మోసగించబడ్డానని భావించి ఉండవచ్చు, అసూయగా ఉండవచ్చు కానీ వాటన్నిటికీ ఆయన చోటు ఇవ్వలేదు.

ఎప్పుడైతే దేవదూత కలలో కనిపించి మరియ తల్లి యొక్క గర్భం గురించి వివరించిన సందర్భంలో వెంటనే దేవుని మాటలను విశ్వసించాడు విధేయత చూపారు.

దాదాపు మత్తయి సువార్తలో 4 సార్లు దేవదూత యోసేపు గారికి ప్రత్యక్షమై దైవ ప్రణాళిక ప్రకారం నడవమని తెలిపారు.

1. మరియమ్మను భార్యగా స్వీకరించమని చెప్పారు - మత్తయి 1: 24.

2. దేవదూత శిశువును మరియమ్మ ఐగుప్తుకు తీసుకొని వెళ్ళమని చెప్పారు - మత్తయి 2:13.

3. దేవదూత యోసేపుతో కుటుంబంను ఇస్రాయేలుకు తిరిగి తీసుకొని వెళ్ళమని చెప్పారు - మత్తయి 2:19.

4. గలీలియా నందు నజరేతు  నివాసమేర్పరుచుకోమని దేవదూత ఏసేపు గారికి తెలిపింది - మత్తయి 2:22.

అన్ని సందర్భాలలో యోసేపు గారు పలుమాటా మాట్లాడక దేవునికి సంపూర్ణ విధేయతను చూపుతూ దేవుని కార్యము నెరవేర్చారు.

ఈనాటి సువిశేష భాగంలో దేవదూత చెప్పిన వెంటనే మరియమ్మ గారిని తన భార్యగా స్వీకరించారు మరియమ్మ గారిని అంతకన్నా ఎక్కువగా ప్రేమించారు ఎందుకంటే ఆమె దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నారు కాబట్టి.

యోసేపు గారు మరియమ్మ గారిని మంచిగా చూసుకున్నారు ఎందుకంటే ప్రేమ సమస్తమును అంగీకరించును, భరించును 1 కొరింతి 13:7, 1 పేతురు 4:8.

యోసేపు గారు నీతిమంతుడు కాబట్టి మరియమ్మ గారిని తన భార్యగా స్వీకరించారు.

యోసేపు గారు ఎటువంటి స్వార్థంతో ఆలోచించకుండా దేవుని చిత్తం నెరవేర్చుటలోనే సంతోషం  వెతికారు. దేవుని యొక్క ప్రతి మాటను విశ్వసించారు, విధేయత చూపించారు.

మరియమ్మ గారు యోసేపు గారు ఇద్దరూ దేవుని వాక్కును తమ జీవితంలోకి ఆహ్వానించారు.

దేవుని యొక్క వాక్కు వారి జీవితంలో బలపరిచింది వారి జీవితంలో దేవుని సంపూర్ణంగా విశ్వసించారు.

వారి జీవితంలో దేవుని కార్యాలు అర్థమైన అర్థం కాకపోయినా వారు విశ్వసించారు దేవుని కొరకు జీవించారు.

మనం కూడా మరియమ్మ, యోసేపు గారు  వలె దేవుని వాక్కు విశ్వసించి, ఆచరించి మన హృదయంలో క్రీస్తు ప్రభువు జన్మించేలా తయారవ్వాలి.

 FR. BALAYESU OCD

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...