5, జులై 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9: 32-38

మూగదయ్యమును  వెడలగొట్టుట మరియు క్రీస్తు కారుణ్యము.

32. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. 33. పిశాచము వెడలగొట్టబడిన యంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, "ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము" అనిరి. 34. కాని పరిశయ్యులు, "పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టు చున్నాడు" అని ఈసడించిరి. 

35. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి, ప్రార్థన మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి భాదలనెల్ల పోగొట్టుచుండెను. 36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె  చెదరియున్న జనసమూహను చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. 37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. 38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను  పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను.

ధ్యానము: పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట.

ప్రియ స్నేహితులారా ! ఈ నాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లైతే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిగా “పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట, లేదా క్రీస్తు తన సువార్త పరిచర్యను” నెరవేరుస్తున్నటువంటి సారాంశమే  మనకు అర్థమవుతుంది.

ఎందుకంటే, మన అందరికి తెలిసిన విధంగా పరిశయ్యులంటే సంఘ కాపరులు, లేదా ప్రజలను అనునిత్యం కాపాడేవారు, వారి బాగోగులు చూసుకునే వారు.

కాని వారిజీవిత నడవడిక మాత్రం, వారి పదవికి వ్యతిరేకంగా ఉంటుంది, లేదా వారు బోధించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కపట వేషధారులవలె, పేరుకు మాత్రమే భోదకులుగా జీవించే వారు, నిజానికి అమాయక ప్రజలమీద, శాస్త్రాలయొక్క భారాన్ని మోపేవారు, ప్రజలను ఎప్పుడు కూడా సక్రమైన మార్గములో నడిపించే వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, తమ వ్యక్తి, తమలో ఒకరయినటువంటి క్రీస్తు మీద, ఈర్ష, అసూయ చెందుతున్నారు.

ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి వారికంటే, పరిశయ్యులకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేసే శక్తి ఉంది, ప్రజలుకూడా క్రీస్తు ప్రభువు వైపే వెళుతున్నారు అని అసూయ చెందుతున్నారు.

దేవుని శక్తి మనలో లేనప్పుడు మనము సాతానుని వెళ్ళొగొట్టలేము. సాతాను, సాతానును వెళ్లగొట్టగలడా?

క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని శక్తి తనలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు ఆ సాతాను లొంగి పోయింది.

పరిశయ్యులు కూడా దేవుని యొక్క బిడ్డలే, కాని వారు ఎప్పుడు క్రీస్తు వలె, నిజమైన దేవుని రాజ్యాన్ని బోధించే వ్యక్తిగా లేదా అధికారులుగా, సంఘ కాపరులుగా జీవించలేదు. అందుకే దేవుని శక్తి, దేవుని మహిమ వారు చేయలేకపోయారు.

మరి పరిశయ్యులు, అంతా తెలిసినవారే కదా, దేవుని ధర్మశాస్త్త్రాన్ని అనుసరించే వారేకదా, దేవునిచే ఎన్నుకొనబడినవారే కదా, మరి వారి ప్రజలలో ఒకరు అస్వస్థతకు గురి అయినప్పుడు, పరిశయ్యులు ఎందుకు అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు? ఎందుకంటే వారు పేరుకు మాత్రమే సంఘపెద్దలు, లేదా కాపరులు.

దేవుని ప్రమేయమున్నపుడే, శాతానును మనము జయించ గలము లేదా ఓడించగలము. సాతాను తనకు తానుగా ఎలా ఓడించుకుంటుంది. పిశాచముల నాయకుడు అంటున్నారు, మరి పిశాచముల నాయకుడు అయితే మంచి కార్యములు, అద్భుతములు ఎలా చేస్తాడు? సాతాను నుండి అయితే మంచి పనులు చేయకూడదు కదా.

రెండవదిగా: క్రీస్తు ప్రభువు కారుణ్యము లేదా క్రీస్తు ప్రజలయొక్క నిస్సహాయతను, అమాయకత్వాన్ని చూసి, వారియొక్క భడాలను చూసి జాలి చెందుతున్నాడు.

క్రీస్తు ప్రభువు, గ్రామాలు గ్రామాలు తిరుగుచున్నారు, దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, చేస్తున్నారు., కాని ప్రజలందురు కూడా కాపరిలేని గొఱ్ఱెలవలె, త్రోవ తప్పిన వారివలె జీవిస్తున్నారు. సంఘ కాపరులు వారిని పట్టించుకోవట్లేదు, నాయకులు, ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. అందుకే ప్రజల జీవితాలు ఈవిధంగా ఉన్నాయని బాధపడుతున్నాడు.

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా చాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో అద్భుతాలు చేయాలి, దేవుని రాజ్యాన్ని బోధించాలి, అందుకనే క్రీస్తు ప్రభువు, పంట విస్తారము, కోతగాండ్రు కావాలి అంటున్నారు, అంటే, తన సువార్త పరిచర్యలో మనలనుకూడా, బాగస్తులను అవమాని ఆహ్వానిస్తున్నారు.

దేవుడంటే తెలియని గ్రామాలు చాలాఉన్నాయి, దేవుని సేవచేయుటకు, దేవుని రాజ్యాన్ని లోకమంతట వ్యాపింప చేయుటకు, శిష్యులు కావాలి, కాబట్టి ఈ నాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

ప్రియ స్నేహితులారా! మనము ఈ సువిశేషాన్ని గమనించినట్లయితే, భాద్యత కలిగినటువంటి అధికారులే(పరిశస్యులు), ఏ భాద్యత లేకుండా, ప్రజలను భాదలతో, కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవడంలేదు.

కాని దేవుడు కారుణ్యము కలవాడు కాబట్టియే, తనలో దైవత్వం ఉందికాబట్టియే, దేవుని కుమారుడు కాబట్టియే, తన ప్రజలచెంతకు వెళుతున్నాడు, వారికీ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఒక భాద్యత కలిగి జీవిస్తున్నాడు. దేవుని కార్యాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తున్నారు.

ఎందుకంటే తనప్రజలు కష్టాలతో, బాధలతో సతమతమవుతుంటే దేవుడు ఓర్చుకోలేడు, చూస్తూ ఊరుకోడు. తమ ప్రజలకు న్యాయము చేస్తాడు.

ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనందరమూ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము పరిశయ్యుల వలె జీవిస్తున్నామా? లేదా క్రీస్తు వలె ఇతరులకొరకే, దేవునిరాజ్యాన్నిభోధించుటకే జీవిస్తున్నామా?

ఎందుకంటే మనం, మన సాధారణ జీవితంలో, ఇలాంటి సన్నివేషాలను చాల చూస్తూనే ఉంటాం, మన గ్రామాలలో, అనారోగ్యం తో బాధపడేవారిని, కష్టాలలోఉన్నవారిని, నిస్సహాయులును, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళను మనము చూస్తూవుంటాం. కాని అందరమూ కూడా పరిశయ్యులవలె, పట్టించుకోము, నిర్లక్ష్యము చేస్తాము. 

ఆ త్రియేక దేవుడు, మనందరిలో జీవిస్తున్నాడు, మనందరిలో కూడా  దైవత్వం ఉంది. కాని మనము, మనలో ఉన్న దైవత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వము. అందుకే మనము స్వస్థతలు, అద్భుతాలు చేయలేక పోతున్నాం, అంతేకాక, దేవుడు చేసిన అద్భుతాలను మనం నమ్మలేక పోతున్నాం, ముందుగా వాటిని గ్రహించలేక పోతున్నాం.

మనంకూడా క్రీస్తు వలె అద్భుతాలు చేయగలము, ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, దేవుని పై ఆధారపడి జీవిస్తామో. 

ప్రియ స్నేహితులారా చివరిగా మనం గ్రహించాలిసింది ఏమిటంటే, సాతాను క్రియలు నాశనము చేయడానికే, కాని క్రీస్తు చేసే పనులు దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి.

ప్రార్థన: కరుణామయుడవైన దేవా! మాలో ఉన్నటువంటి మీ దైవత్వాన్ని మేము గ్రహించలేక పొతున్నాం.

మాజీవితాలు కూడా చాలా సార్లు పరిసయ్యులవలె ఉంటున్నాయి, పేరుకు మాత్రమే నేను, క్రైస్తవునిగా, సంఘంలో ఒకవ్యక్తిగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని, సువార్తను, నా జీవితం ద్వారా ఇతరులకు భోదించలేక పోతున్నాను, నా సహోదరులను నిరాకరిస్తున్నాను. ఇకనుండి అయినను నేను నీవలె జీవించుటకు, ఇతరులుకొరకు జీవించుటకు నాకు శక్తిని, మంచినే చేసే కరుణగల హృదయాన్ని నాకు ప్రసాదింపుము, అని ప్రార్థన. ఆమెన్.

Br. Subhash

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...