14, జనవరి 2023, శనివారం



2వ సామాన్య ఆదివారం

యెషయా 49:3,5-6

1 కొరింతి 1:1-3

యోహాను 1:29-34

 

ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరం కూడా దేవుని యొక్క గొర్రె పిల్ల వలె జీవించి, దేవునికి సాక్షులై జీవించాలని తెలుపుచున్నాయి.

దేవుని యొక్క సేవకై ఎన్నుకొనబడిన ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి సాక్షులై జీవించాలి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలోకి ఒక ప్రత్యేకమైన పని నెరవేర్చటానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక సేవకునిగా, అనుచరునిగా, అపోస్తులుగా ఉండాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలుపుచున్నాయి.

మానవ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, ఆ దైవ ప్రణాళికకు తగిన విధంగా మనం జీవించాలి.

ఈనాటి మొదటి పఠనంలో రెండోవ బాధామయ సేవకుని గీతం ద్వారా ఒక సేవకుని ఎన్నిక గురించి చెప్పబడింది.

ఈ సేవకుడు దేవుని యొక్క పని కోసం ఎన్నుకోబడ్డాడు, దేవుడే ప్రత్యేకంగా ఆయనను అందరిలో మి న్నగా తన సేవకు ఎన్నుకొన్నాడు.

దేవుని యొక్క ఎన్నిక చాలా గొప్పది, ఎందుకంటే ఎన్నుకొనేముంది దేవుడు వారి కొరకు ప్రార్ధించారు, వారి యొక్క సేవను విశ్వసించారు, వారి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారికి దేవుడు తన యొక్క సేవ బాధ్యతలు అప్పజెప్పారు దేవుడు సేవకులను తమ యొక్క స్వార్థం కోసం కాదు ఎన్నుకొన్నది, ప్రజల కొరకు నిస్వార్ధ హృదయులై ఉండటానికి.

దేవుని యొక్క సేవకుని యొక్క ముఖ్యమైన కర్తవ్యం బాధ్యత ఏమిటంటే, ప్రజలందరిని దేవుని చెంతకు తీసుకొని రావాలి, ఇదే మాటలను పౌలు గారు కూడా పలుకుచున్నారు - గలతీ 1:15, రోమి 1:1, అపో 22:21.

తన యొక్క సేవకుని యావే దేవుడు ఇశ్రాయేలు తో పోల్చి పిలుస్తున్నారు - యెషయా 49:3.

ఈ మాటలు ఏసుప్రభు యొక్క జీవితానికి అక్షరాలా వర్తిస్తాయి ఎందుకంటే కేవలం మెస్సయ్య యొక్క జీవితం వలన తండ్రి దేవునికి కీర్తి కలుగును.

ఒక సేవకునిగా ఏసుప్రభు తండ్రికి సంపూర్ణ విధేయత చూపించారు. తల్లి గర్భముననే దేవుడు తన సేవకుని తన యొక్క పని నిమిత్తమై ఎన్నుకుంటున్నారు.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకుడు ప్రజలందరినీ దేవుని చెంతకు చేర్చాలి, అనగా వారిని పుణ్య మార్గంలో నడిపించాలి. దేవుని యొక్క బాధ్యతలు విధులు తెలుపుతూ వారిని ముందుకు నడిపించాలి.

ఒక సేవకునిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలో సృష్టించబడ్డాము - హెబ్రి 10:7, యోహాను :38, యోహాను 4:34.

కేవలం దేవుని ప్రజలను ఆయన చెంతకు చేర్చుట మాత్రమే కాదు ప్రవక్త యొక్క ముఖ్యమైన పని, వారికి జ్యోతి లాగా ఉండాలి.

ప్రజలను సత్యం వైపు నడిపించేటువంటి వెలుగుగా సేవకుడు ఉండాలి.

ఆరవ వచనంలో ప్రభువు అంటున్నారు నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిస్తున్నాను అని. అంటే ప్రవక్తగా, సేవకునిగా తన యొక్క పరిచర్య బాధ్యతలు సేవా తత్వం అందరికీ చెందినవి.

ఒక జ్యోతిగా అంటే వెలుగుగా ఉండాలి అని తెలుపుచున్నారు, వెలుగు దారిని చూపిన విధంగా ప్రజలు పుణ్య మార్గంలో నడుచుటకు ఒక ప్రవక్త, సేవకుడు ప్రజలకు దారి చూపించాలి.

తనలో ఎటువంటి అంధకారం లేకుండా ఇతరులను ముందుకు నడిపించాలి. వెలుగు తన కొరకు తాను ఎప్పుడూ ప్రకాశించదు అదే విధంగా ఒక సేవకుడు కూడా ఎప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఒక వెలుగు లాగా మనం కూడా ఇతరుల కొరకు జీవించాలి.

దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకులందరికీ దేవుడే స్వయంగా శక్తిని ఒసగుతారు. వారి యొక్క పరిచర్యకు అవసరమైన ప్రతి యొక్క అనుగ్రహం దేవుడు దయ చేస్తారు.

మనందరం కూడా సేవకులుగా దేవుని యొక్క సాధనములు మాత్రమే కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ప్రభువు యొక్క సేవ చేయాలి.

జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మనలను తన సేవకు ఎన్నుకొన్నారు కాబట్టి మనం ప్రభువు కొరకు జీవించాలి. ఆయన నామంను ప్రకటించాలి అనేకమందిని ప్రభువు చెంతకు చేర్చాలి దేవునికి సాక్షులై జీవించాలి.

ఈనాటి రెండవ పఠనం లో పునీత పౌలు గారు తాను దేవుని యొక్క సంకల్పానుసారంగా అపోస్తులుడుగా దేవుని యొక్క పరిచర్యకై ఎన్నుకొన్నబడ్డారని పౌలు గారు కొరింతి వాసులకు తెలియజేస్తున్నారు.

పౌలు గారు కొరింతి సంఘస్తులకు తెలిపే అంశం ఏమిటంటే ఏ విధంగానైతే తాను దైవ సేవకై ఎన్నుకొనబడి పవిత్రపరచబడ్డాడో అదే విధంగా కొరింతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడ్డారు అని తెలిపారు.

ఏసుప్రభు యొక్క నామమును విశ్వసించే ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పించబడిన వారే ఆయన యొక్క సేవ నిమిత్తమై వారు పవిత్ర పరపబడతారు అని పౌలు గారు తెలిపారు.

దేవుని యందు జ్ఞాన స్నానం పొందిన విశ్వాసులు, వారు ప్రభువు శరీరం నందు భాగస్తులవుతారు. దేవుని యొక్క పరిశుద్ధత వారికి అందజేయబడుతుంది. దేవుని యొక్క కృప అనుగ్రహాలు అందరికీ అందజేయబడుతాయి. కావున వెలుగుగా మనం దేవుని యొక్క సేవ చేయాలి.

ఏసుక్రీస్తు ద్వారా మనం అందరం పరిశుద్ధపరచబడ్డాం కావున ఆ పరిశుద్ధ జీవితం అలాగే కొనసాగించాలి పరిశుద్ధతతో ప్రార్థిస్తూ దేవుని యొక్క సేవ చేయాలి.

దేవుని యొక్క సేవ ప్రతి ఒక్కరూ చేసిన యెడల ఈ భూలోకం పరలోకంగా మారుతుంది. పరిశుద్ధ మనస్సు కలిగి నిస్వార్థంతో దైవ సేవ చేస్తే దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం.

ఈనాటి సువిశేష పఠనం లో బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును మెస్సయ్యగా సర్వేశ్వరుని గొర్రె పిల్లగా చూపిస్తున్నారు.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని సంబోధిస్తూ ఈ లోకానికి చూపిస్తున్నారు. తనుకు ఉన్న దైవ అనుభవమును బట్టి దైవత్వమును గుర్తించి ప్రజలకు బాప్తిస్మయోహాను గారు దేవుని చూపిస్తున్నారు.

ఒక దైవ సేవకునిగా మనందరం చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఇతరులకు చూపించాలి. మొదటిగా దైవ అనుభూతి మనం కలిగి ఉంటూ దేవుని ఇతరులకు చూపించాలి.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభు యొక్క స్వభావమును గొర్రె పిల్లతో పోల్చుతూ చెబుతున్నారు - యెషయా 53:7.

పవిత్ర గ్రంథంలో అన్నింటికన్నా అర్థవంతమైన పేరు ఏమిటంటే సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఈ పేరు 29 సార్లు పవిత్ర గ్రంథంలో చెప్పబడింది.

గొర్రెపిల్ల అనే పదం ఏసుప్రభు యొక్క వినమ్రతను, ప్రేమను, త్యాగాన్ని అదే విధంగా విజయంను సూచిస్తుంది.

గొర్రెపిల్ల దేవుని యొక్క బలి నిమిత్తమై వాడబడిన జంతువు. గొర్రె పిల్లగా ఏసుప్రభువును సంబోధించినప్పుడు యూదాలలో మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి.

1. పాప పరిహార దినోత్సవం నాడు ప్రధానార్చకుడు తన ప్రజల పాపాలన్నింటినీ ఒక గొర్రె పిల్లపై మోపి దానిని క్రూర జంతువులకు ఆహారంగా అడవిలోనికి తోలి వదిలేస్తారు - లేవి 16:20-22.

2. ప్రతిరోజు ఉదయం సాయంత్రం యూదుల పాప పరిహారం కొరకు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పిస్తారు - నిర్గమ 29:38-42.

3. గొర్రె పిల్లల రక్తమే ఐగుప్తులోని యూదుల కుటుంబాలలోని తొలిచూలు మగ శిశువులను కాపాడింది. అలాగే బాప్తిస్మ యోహాను పలికిన మాటలు ప్రతి ఏడాది పాస్కా పండుగనాడు తాము బలిగా అర్పించే గొర్రె పిల్లను గుర్తుకు తెచ్చి ఉండవచ్చు - నిర్గ 12:11.

బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువును దేవుని గొర్రెపిల్ల అని పిలిచినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ గొర్రెపిల్ల దేవుని చేత ఎన్నుకొనబడినది దేవుని కొరకు సమర్పించబడే గొర్రెపిల్ల ప్రజల యొక్క పాప నిమిత్తమై తన యొక్క జీవితం ని త్యాగం చేసే నిష్కలంక గొర్రెపిల్ల.

మనంతట మనమే పాపం నుండి మరణం నుండి విమోచన పొందగలిగే మార్గం లేదు. అందుకు పరిహార మూల్యం చెల్లించక తప్పదు. మనందరి పాపం నిమిత్తమే క్రీస్తు ప్రభువు మన కొరకు మరణించారు - 1 పేతురు 2:24, హెబ్రి 9:28.

బాప్తిస్మ యోహాను గారు దేవునికి సాక్ష్యం ఇచ్చారు. తన జీవితం ద్వారా సాక్ష్యం ఇచ్చారు దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకునిగా తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు.

మన యొక్క విశ్వాస జీవితంలో యేసు క్రీస్తును ఇతరులకు చూపించాలి దేవునికి సాక్షలై జీవించాలి.

మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా ప్రభువుకు సాక్షలై జీవించాలి.

బాప్తిస్మ యోహాను గారు దేవుని సేవ కొరకు జీవించిన వ్యక్తి మనం కూడా దేవుని కొరకు జీవించాలి.

బాప్తిస్మ యోహాను మరియు యేసు ప్రభువు తన యొక్క బాధ్యతలను నెరవేర్చారు అదే విధంగా మనం కూడా నెరవేర్చాలి.

బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువును ఉద్దేశించి పలికిన మాటలు ఆయన నాకంటే ముందుగా ఉన్న వ్యక్తి అని అన్నారు, సృష్టికి పూర్వము నుండి ఆయన ఉన్నవారు అని బాప్తీస్మ యోహాను గారికి తెలుసు - యోహాను 1:15.

బాప్తిస్మ యోహాను గారికి యేసు ప్రభువు గురించి వ్యక్తిగతంగా తెలుసు - లూకా 1:36.

బాప్తిస్మ యోహాను గారు గొప్ప విశ్వాసము ఉన్న దేవుని సేవకుడు, దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించిన వ్యక్తి సత్యమును ప్రకటించిన వ్యక్తి, దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప ప్రవక్త.

బాప్తిస్మ యోహాను గారు ప్రభువు యొక్క ఆత్మ యేసు ప్రభువు మీద దిగిరావడం చూసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.

యూదులకు పావురం పవిత్రమైనది. పావురం శాంతికి  చిహ్నం అదే విధంగా నిర్మలత్వంకు అమాయకత్వం కు గుర్తు.

పవిత్ర గ్రంథంలో పావురం పవిత్రాత్మకు గుర్తు పావురం యేసు మీదకి దిగిరావడం ద్వారా ఇతడే మెస్సయ్య అని తెలిపారు.

పాత నిబంధన గ్రంథంలో అనేకసార్లు దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకు వచ్చింది కానీ ఎవరి మీద ప్రత్యేకంగా నిలవలేదు, కేవలం యేసు ప్రభువు మీదనే ప్రత్యేకంగా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది.

ఏసుప్రభు పొందిన జ్ఞాన స్నానం ద్వారా పరలోకం తెరవబడింది. ఆదాము, అవ్వ చేసిన పాపం ద్వారా మూసివేయబడిన పరలోకం మరలా క్రీస్తు ప్రభువు జ్ఞాన స్నానం ద్వారా తెరవబడింది.

ఏసుప్రభు జ్ఞాన స్నానం తరువాత సువార్త పరిచర్యను ప్రారంభించారు. దేవుని యొక్క రాజ్య స్థాపన కోసం ప్రభువు కృషి చేశారు. దేవుని చేత పంపబడిన సేవకునిగా ఏసుప్రభువు పరిచర్యను చేశారు. మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారం కాబట్టి, ప్రభువు యొక్క సేవ చేయాలి.


Fr. Balayesu OCD

 

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...