19, ఫిబ్రవరి 2022, శనివారం

7 వ సామాన్య ఆదివారం (2)

 7 వ సామాన్య ఆదివారం 

1 సామువేలు 26:2,7-9, 12-13,22-23,   1 కోరింథీ 15:45-49, లూకా 6:27-38 

నేటి దివ్య పఠనాలు దేవుడిచ్చిన బంగారు సూత్రం గురించి భోదిస్తున్నాయి. ఇతరులు మీకు ఎట్లు  చేయాలనుకుంటారో అట్లే  పొరుగు  వారికి చేయుటయే బంగారు సూత్రం. ఇంకోక విధంగా ఆలోచిస్తే ఆ బంగారు సూత్రం  సోదరి సోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించుట. అది శత్రువులైన మిత్రులైన సరే మనం ఒకరినొకరు ప్రేమించుకొని జీవించాలని అని ప్రభువు తెలుపుచున్నారు. 

నేటి పఠనాలలో ప్రభువు శత్రువులను ప్రేమించి, క్షమించి వారి కోసం ప్రార్ధించాలి అనే అంశములు ఎక్కువగా కనబడుచున్నాయి. 

ఈనాటి మొదటి పఠనంలో దావీదు రాజు యొక్క మంచి మనస్సును మనం చూస్తున్నాం. దావీదు మహారాజు దేవున మనస్సు కలిగి తన శత్రువైన సౌలును కాపాడిన విధానమును మొదటి పఠనం ద్వార వింటున్నాము. దేవుడు  సౌలు తరువాత దావీదును  యిస్రాయేలు రాజుగా అభిషేకించిన తరువాత దావీదు యిస్రాయేలు ప్రజలకు ఎన్నో రకాలైన విజయాలు చేకూర్చారు, ప్రజల్లో సంతోషం నింపారు, వారిని రక్షించారు. 

సౌలురాజు కన్నా చక్కగా పాలన చేస్తూ ప్రజల యొక్క ఆధరాభిమానాలు పొందుతున్న దావీదు పట్ల సౌలుకు అసూయ కలిగింది, దానితో ఏ విధంగానైనా దావీదును చంపాలనుకున్నారు. తన యొక్క రాజ్యాధికారం పోతుందని సౌలు రాజు భయ పడ్డాడు. తన యొక్క కుమారులకు సింహాసనం దొరకదని ద్వేషంతో ఉన్నాడు. 

అసూయ ద్వేషం వల్ల ఎలాగైనా సరే సౌలు దావీదును హత్తమార్చాలని ఆ పనిలో మూడు వేల మందిని వెంటబెట్టుకొని దావీదు ఉన్న సీపు ఎడారి ప్రాంతమునకు సౌలు ప్రయాణమై పోయాడు. సౌలు దావీదును చంపాలనుకొని వెళితే దేవుడే సౌలును దావిదునకు అప్పజెప్పాడు. ఎందుకంటే దావీదు దేవునికి విధేయించినవాడు. దేవుని చిత్తాను-సారంగా నడుచుకున్న వ్యక్తి. ఒక విధంగా ఆలోచిస్తే  దేవుడు దావీదు పక్షమున నిలబడిన వారే. ఎందుకంటే దావీదు సౌలు శిబిరంలోకి ప్రవేశించే సమయానికి అందరు నిద్రమత్తులో ఉన్నారు. దేవుడే వారిని నిద్రించేలా చేసి ఉండవచ్చు. కనీసం ఒక్కరు కూడా మెళకువగా ఉండలేదు. 

సౌలుకు  దావీదు ఉన్న స్థలం తెలుసు కాని దావీదును చంపడానికి సౌలు వస్తున్నాడని బహుశా దావిదునకు దేవుడే ఎరుక పరచి ఉండవచ్చు. దావిదునకు వచ్చిన అవకాశమును ఆయన వినియోగించుకొనలేదు. తనను చంపాలనుకున్న సౌలును దావీదు రాజు  చంపలేదు. ఎందుకంటే దావీదు రాజు సౌలు దేవుని అభిషిక్తుడు అని గ్రహించాడు. 1 సమూ 24:10,కీర్తన 105:15.  

స్వయంగా దేవుడే అతన్ని రాజుగా అభిషేకించారని గుర్తించాడు. దేవుని యొక్క ప్రతి రూపం సౌలులో ఉందని తెలుసుకున్నారు. దేవుడే ప్రేమతో ఆయన్ను ఎన్నుకొన్నాడని గ్రహించాడు. దావీదు రాజు మాత్రము ఎప్పుడు కూడా సౌలును గౌరవించి జీవించిన వ్యక్తియే. అయిన కానీ సౌలు, దావీదు చేసిన అన్నీ మేలులు మరచిపోయారు. 

దేవుని అభిషిక్తుని తాకకూడదని, ఆయనకు హాని చేయకూడదని దావీదు భావించాడు, వెనుకకు తిరిగి వచ్చాడు. సౌలు పాపి అయినప్పటికిని అసూయ ద్వేషం, పగ కలిగి ఉన్నప్పటికీ బలహీనత ఉన్నప్పటికీ దావీదు ఆయనకు ఎటువంటి ముప్పు కలుగ చేయలేదు. ఆయన్ను తాక లేదు. 

మన యొక్క జీవితాలలో ఈ విషయం మరచిపోతాం. అభిషేకించబడిన వారికి వ్యతిరేఖంగా చాలా సంధర్భాలలో ఉంటాం. వారి యొక్క పేరు చెడగొడతారు, వారికి హాని కలుగ చేస్తారు. దావీదు సౌలును దేవుడు  అభిషేకించిన విధానం గ్రహించి ఆ అభిషేకంలో ఉన్న పవిత్రత తెలుసుకున్నారు, కాబట్టియే సౌలుకు ఎటువంటి కీడు తల పెట్టలేదు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. సౌలుకు దేవుడు ప్రసాదించిన రాజ్యాధికారాన్ని దావీదు ఎప్పుడు గౌరవిస్తూనే జీవించారు. దావీదు సౌలును గౌరవించాడు, తన రాజుగా అంగీకరించాడు,తన యొక్క ప్రభువుగా తనను ప్రేమించి సేవలందించాడు. 

సౌలుకు ఎంత ద్వేషం ఉందో దావీదుకు సౌలు పట్ల అంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. దావీదు శత్రువుల యెడల చూపిన ప్రేమ సౌలు జీవితం నే మార్చినది. శత్రువులను ప్రేమించుటయే దేవుని యొక్క మనస్సు, దావీదు దేవుని మనస్సు కలిగి జీవించాడు. దావీదు సౌలు వలె పవిత్ర గ్రంధంలో ఇంకొక ఉదాహరణ చూస్తాం. హమాను - మోర్ధకై .

ఇతరులకు కీడు తల పెట్టాలని భావించి తామే ప్రమాదంలో  పడిన వ్యక్తులు, మనం చాలా మందిని చూస్తాం. వారిలో సౌలు వలె హమాను కూడా వస్తారు. హమాను  యొక్క మనస్తత్వం ఏమిటంటే అందరు నా క్రింద అణగి ఉండాలని, తనకు తలవంచి  మిగతవారు జీవించాలి అనే అహం తో జీవించేవాడు. మోర్ధకై మాత్రం దేవుడినే ఆరాధించే వ్యక్తి, దేవునికి మాత్రమే తల వంచి , విధేయించి  జీవించే విశ్వాస పాత్రుడు. 

మోర్ధకై తనకు తల వంచ లేదని హమాను మోర్ధకై జాతిని నాశనం చేయాలనుకున్నాడు.  చివరకి తాను చేయించిన ఉరి కంబానికి తానే వ్రేలాడాడు. తాను ఏ అపాయం అయితే ఇతరులకు తల పెట్టాలనుకున్నాడో దానిలో అతనే పడిపోయాడు. తాను తీసిన గోతిలో తానే పడిపోయాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు హాని చేయకుండా మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. 

దావీదు రాజు తనకు అపకారం చేయదలచిన సౌలుకు ఉపకారం చేశాడు. అపకారం చేసిన వారికి అపకారం చేయక ఉపకారం చేయాలి అని స్వయంగా పౌలు గారు తెలుపుచున్నారు. రోమి 12:17-20. అపకారం చేసిన వారికి ఉపకారం చేయటయే దైవ లక్షణం కాబట్టి మనం కూడా అలాంటి దైవ లక్షణం కలిగి జీవించాలి. 

రెండవ పఠనంలో  పౌలు గారు మొదటి ఆదాము , చివరి ఆదాము మధ్య గల  తేడాను వివరిస్తున్నారు. మొదటి ఆదాము ఈ లోకంలో సృష్టించబడిన వ్యక్తి , ఆయన ఈ లోకానికి చెందిన వ్యక్తి అని పౌలు గారు వివరిస్తున్నారు. 

కొరింతు సంఘంలో ఉన్న విశ్వాసులకు, శరీరం యొక్క ఉత్తనమునకు సంభందించిన కొన్ని సందేహాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వలె తాము  కూడా శరీరంతో పునరుత్థానము చెందుతామా?లేదా? అన్నది వారి యొక్క ప్రశ్న. 

దానిలో భాగంగానే పౌలు గారు చక్కటి వ్యత్యసాలను ప్రజలకు వివరిస్తున్నారు. మొదటి ఆదాము భౌతిక జీవి, చివరి ఆదాము ఆత్మ సంబంది. ఆయన పరలోకం నుండి వచ్చిన వారు. వీరిద్దరి మధ్య తేడా ఉంది. ఒకరు భూలోక సంబంధులు , రెండవ వ్యక్తి పరలోక సంబంధులు. భువి నుండి పుట్టిన వానిని  పోలిన మనము దివి నుండి వచ్చిన వాని పోలీకను పొందగలము. మన జీవితాలు పరలోకం నుండి వచ్చిన దేవుని పోలికను పొందగలవు, మన జీవితాలు మార్చుకున్నప్పుడు.  

మన శరీరాలు కూడా పునరుత్థానం అవుతాయి, అందుకే క్రీస్తు ప్రభువు మానవ శరీరమున జన్మించి, శ్రమలు అనుభవించి, మరణించి, పునరుత్థానం అయ్యారు. మనం కూడా చివరి ఆదాము అయిన క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. అలా పోలిక కలిగి జీవిస్తామని దేవుడే స్వయంగా పౌలు గారు ద్వారా పలుకుచున్నారు. 

ప్రతి మనిషి కూడా ఆదాము యొక్క మానవ స్వభావంతో, పాపంలో భాగస్తులై జీవించిన విధంగా క్రీస్తు నందు జ్ఞాన స్నానం పొందిన తరువాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వభావం కలిగి జీవిస్తాం. కాబట్టి మనం కూడా పునరుత్థానం చెందగలం. 

మనం జ్ఞాన స్నానం పొందడం ద్వారా క్రీస్తు నందు  ఉన్నాము. క్రీస్తు సంబంధులం అయ్యాము . కాబట్టి మనకు పునరుత్థానం నిరీక్షణ ఉంది. 

సువిశేష పఠనంలో యేసు ప్రభువు మానవ జీవితంలో కొన్ని కష్ట తరమైన పనులు చేయమంటున్నారు. మానవ ఆలోచనలతో జీవిస్తే అవి కష్టం కానీ దైవ మనస్సు కలిగి జీవిస్తే ఇది సాధ్య పడుతుంది. 

సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యచకితులను చేశాయి. ఇప్పటి వరకు విన్న మాట ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది కానీ ఇప్పుడు ప్రభువు శత్రువులను ప్రేమించమని పలుకు చున్నారు. ఈ మాటలు ఏ వ్యక్తియు చెప్పలేదు. ఇంత వరకు మొట్ట మొదటి సారిగా యేసు ప్రభువు చెపుతున్నారు. 

పూర్వ వేదంలో పొరుగు వాడు అంటే కేవలం ఒక యూదుడుకి ఇంకొక యూదుడు పొరుడు వాడు. ఒక యూదునకు అన్యుడు పొరుగువాడు కాదు శత్రువే. 

యేసు క్రీస్తు ప్రభువు పొరుగు వారు అనే పదంకు  క్రొత్త అర్దం ఇస్తున్నారు. మానవులంతా మన పొరుగువారే. మిత్రులు మాత్రమే కాదు శత్రువులు కూడా మన యొక్క పొరుగువారే అని తెలుపుచున్నారు. ఇక్కడ మనం ఒక  విషయం గమనించాలి యేసు క్రీస్తు ప్రభువు 

-శత్రువులను ప్రేమించమంటున్నారు

-శపించే వారిని ఆశీర్వదించమంటున్నారు 

-ద్వేషించే వారికి మేలు చేయండి అని అంటున్నారు. 

-బాధించే వారికోసం ప్రార్ధించమంటున్నారు 

- ఒక చెంప మీద కొట్టిన వానికి ఇంకొక చెంప చూపించండి 

-పై బట్టను ఎత్తుకొని పోయేవానికి అంగీని కూడా ఇవ్వమన్నారు. 

- అడిగిన ప్రతి వానికి ఇవ్వమంటున్నారు 

ఇవ్వన్నీ  కూడా మానవులుగా సాధ్యమయ్యేనా 

-మనల్ని  తిరస్కరించిన వారిని ఎలా అంగీకరిస్తాము?

-మనకు కీడు చేసె వారికి ఎలా మేలు చేస్తాం? 

- మన నాశనం కోరుకున్నవారిని ఎలా ప్రేమిస్తాం?

-శత్రువుల కోసం ఎలా ప్రార్ధిస్తాం 

-మనకు హాని చేసే వారితో ఎలా స్నేహం చేయగలం 

ఇవ్వన్నీ కూడా మానవులుగా కష్టతరమైన పనులే. అయినప్పటికీ ఒక క్రైస్తవునిగా మన యొక్క జీవితం భిన్నంగా ఉండాలి. 

మానవ స్వభావం ధరించి జీవించే మనకు ఇది అసాధ్యం కాని దేవుని దేవుని స్వభావం ధరించి జీవిస్తే సాధ్యమే. మనకు సన్నిహితులైన బంధు మిత్రులను ప్రేమించినట్లు మన శత్రువులను ప్రేమించలేం. అది అసాధ్యం కాని దేవునిలో ఏకమై జీవించినప్పుడు ఇది సాధ్యం. 

-ప్రభువు అంటున్నారు, నేను లేక మీరు ఫలింపజాలరు -యోహను 15:5. ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంపను కూడా చూపించట నిజంగా గొప్పతనమే. మన జీవితంలో ఇది చక్కగా పాటిస్తే ఎదుటి వారు మారు మనస్సు పొందుతారు. 

మాటకు మాట, దెబ్బకు దెబ్బ సూత్రం పాటిస్తే ఈ లోకంలో మిగిలేది అశాంతియే, గొడవలు మాత్రమే మిగులుతాయి. అందుకే మన జీవితాలు మార్చుకొని దేవుడు చూపిన బాటలో నడవాలి. మన జీవితంలో నిస్వార్ధమైన ప్రేమను మనం పంచాలి. నిస్వార్ధమైన ప్రేమ అంటే ఎవ్వరిని కూడా వేరు చేయకుండా అందరిని ప్రేమించాలి. నిస్వార్ధ ప్రేమను మనం వ్యక్త పరిస్తే, అది  నిజంగా మనం దేవుని బిడ్డలమని నిరూపిస్తుంది. 

దేవుడు ఎలాగైతే శత్రువుల మీద కూడా వర్షాన్ని ,ఎండను కురుపిస్తూ ప్రేమను పంచుతూ ఉన్నారో అలాగే మనం కూడా దుష్టులకు మేలు చేయాలి. దేవుడు మనలను ప్రేమించిన విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలి. మనం పాపం చేసి ఆయనకు శత్రువులైనప్పటికి ఆయన మనలను ప్రేమించారు. 

యేసు క్రీస్తు ప్రభువు  తన శత్రువులను ద్వేషింపక ప్రేమించారు,  క్షమించారు. అలాగే వారి కోసం ప్రార్ధించారు. ఆయన యొక్క గొప్ప ప్రేమతో వారి జీవితమునే మార్చారు. శత్రువులను ప్రేమించుట కష్టమైన పని, అసాధ్యం అనిపిస్తుంది. అయితే ప్రభువు వారికి తన జీవితం ద్వార సుమాతృకను ఇస్తున్నారు. 

సువిశేషంలో చెప్పబడిన విషయాలు అన్నీ మానవ స్వభావంతో ఆలోచిస్తే కష్టమే కాని దేవుని వలె జీవిస్తే తప్పని సరిగా సాధ్యం అవుతుంది. 

-యేసు క్రీస్తు ప్రభువు శత్రువులను  ప్రేమించారు. 

-ద్వేషించే వారికి మేలు చేశారు 

-బాధించిన వారి కోసం ప్రార్ధించారు 

-శపించిన వారి బిడ్డలను దీవించారు. 

మానవ జీవితంలో క్రైస్తవ జీవితం, క్రీస్తు అనుచరుడిగా ఉండే వారు భిన్నంగా ఉండాలంటే ఇవ్వన్ని పాటించాలి.  మనందరం ఈ లోకం ఆశలు , ఆలోచనలు మించి దైవరాజ్య స్థాపన  కోసం, దేవునిలో ఐక్యమై జీవించుటకు కృషి చేస్తే ఇది సాధ్య పడుతుంది. 

మనం జీవితంలో దేవునితో  అంటుకట్టబడితే  మనం మారిపోతాం, దేవుని వలె ప్రేమిస్తాం. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. మనం జీవితం ప్రత్యేకంగా ఉండాలంటే  ద్వేషాలు, పగలు అసూయలు విడిచిపెట్టి ప్రేమను అలవరుచుకోవాలి. ప్రేమతో జీవిస్తే కష్టమైన పనులు అన్నీ సక్రమంగా చేయవచ్చు. 

నేటి పఠనాల ద్వారా దేవుడు మనందరిని ఒక క్రొత్త జీవితమునకు ఆహ్వానిస్తున్నారు. దైవ స్వభావం కలిగి, క్రీస్తులో ఐక్యమై క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాం . 

Rev. Fr. Bala Yesu OCD  

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...