17, జులై 2021, శనివారం

పదహరవ సామాన్య ఆదివారం


 పఠనములు: యిర్మీయా:23 :1 -6; ఎఫె:2 :13 -18; మార్కు:6 :౩౦ -34
క్రీస్తు నాధుని యందు ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన తల్లి తిరుసభ పదహారవ సామాన్య ఆదివారంలోకి మనందరినీ ఆహ్వానిస్తుంది.
      ముందుగా మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే, పూర్వ వేదంలో ఇశ్రాయేలీయుల రాజుల స్వార్ధం, అహం, పాలితులపట్ల అశ్రద్ధవల్ల తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు చెల్లా చెదురయ్యారని యిర్మీయా ప్రవక్త మొదటి పఠనంలో తెలియజేస్తున్నాడు.
       రెండవ పఠనాన్ని మనం చూస్తే, పునీత. పౌలు గారు చెల్లా చెదురైనా మానవ జాతిన ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసారని బోధిస్తున్నాడు.
               అదే విధంగా, సువిశేష పఠనంలో కాపరిలేని గొర్రెలవలే నున్న వారిని చూసి యేసు జాలి పడి వారికి ఉపదేశింప నారంభించెను అని పు.మార్కు గారు తెలియజేస్తున్నారు.
           అయితే , ముందుగా మొదటి పఠనాన్ని క్లుప్తంగా ధ్యానించినట్లయితే,ఈ లోకంలో జీవిస్తున్న ప్రతిఒక్కరికి దేవుడు ఏదోఒక బాధ్యతను అప్పగించి ఉన్నాడు.అయితే ఆ బాధ్యతను నీవు ఏవిధంగా నెరవేరుస్తున్నావు అనేది  ముఖ్యం.ఉదా;నాయకులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు,  గురువులు,ఇంకా మొదలైనవారు.
            ఈనాటి పఠనంలో,యిర్మీయా ప్రవక్త గారు ఆత్మ పూరితుడై ఇశ్రాయేలు రాజులగురించి ప్రవచించాడు.యిర్మీ;21 ;1 లో చూస్తే, “ప్రభు మందను చెల్లాచెదరు చేసి,నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు”,అని బోధించాడు.ఎందుకంటే వారు ప్రజలపై జాగ్రత్తపడకుండా, వారిని ఎంతో కష్టపెట్టి, అన్యదేవములను కొలువమని చెబుతూ, వారిని బ్రష్టులుగా చేసి, దేవునినుండి దూరమయ్యేలా వారిని చెల్లాచెదరు చేసారు.దీని కారణంగా ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వకుండా వారి ఇష్టాను సారము జీవించసాగారు. హోషేయ:5 :4 లో చూస్తే,"ప్రజలు తాము చేసిన దుష్కార్యాలవలన తిరిగి దేవునివద్దకు రాలేకపోవుచున్నారు.వారు విగ్రహారాధనమున తల మునస్కులై యున్నారు.కావున ప్రభువును తెలిసికోజాలకున్నారు".
      ఎజ్య్రా కాలములో దివ్య గ్రంధాన్ని చదువుచున్నప్పుడు దుఃఖం  పట్టలేక బోరున ఏడ్చారు అని తెలుపుచున్నది(నెహమ్యా : 8 :9). కానీ, రానురాను వారిలో ఆ విశ్వాసం సన్నగిల్లిపోతుంది.అదే విధంగా, రాజు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలకు సేవకుడు మాత్రమే. కానీ, ఐగుప్తు దేశంలో ఫరో రాజు మాత్రం దేవునితో సమానము.అందుకే దావీదు మహారాజు తనను సేవకుడిగా పోల్చుకున్నాడు, నేను దేవుని యొక్క సేవకుడనని. మొదటి సమువేలు;17 :34 లో చూస్తే, దావీదు సౌలుతో "నీ దాసుడు తన తండ్రి గొఱ్ఱెలమందనుకాయుచుండెడివాడు.అప్పుడప్పుడు సింగము గాని, ఎలుగుబంటిగాని, మంద మీద పడి గొర్రెలనెత్తుకొని పోయెడిది.నేను వన్య మృగమును తరిమి, చావమోది దాని నోటినుండి గొర్రెను విడిపించుకొని వచ్చెడివాడను.అది నామీద తిరగబడెనేని మెడక్రింద జూలు పట్టుకొని చితక బొడిచి చంపెడివాడను".ఇలా తన తండ్రి గొర్రెలను కాపాడినట్లు దావీదు రాజుగా అభిషిక్తుడైన తరువాత కూడా తన తండ్రి అయినటువంటి దేవునియొక్క మంద అయినటువంటి మనలను తన మరణాంతము వరకు, ఇతర రాజులనుండి సురక్షితముగా కాపాడుకుంటూ వచ్చాడు.సమువేలు  ప్రవక్త  కాలమున  ఇశ్రాయేలుప్రజలు,సమువేలుతో ఇలా అంటున్నారు; అన్ని రాజ్యాలకు రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజును నియమించు అని పలుకుచున్నారు.రాజుని ఎప్పుడైతే వారికి నియమించారో అప్పటి నుండి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి,ఇంకా విభజన ఏర్పడినది.
        మొదటి రాజులగ్రంధము 9 :4 -9 లో చూస్తే తండ్రియైన దేవుడు సొలొమోను రాజుతో ప్రమాణము చేస్తున్నాడు. అదేమిటంటే, నీతండ్రి దావీదు వలె నన్ను చిత్త శుద్దితో కొలుస్తూ, నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసముపై కూర్చుండి ఇశ్రాయేలును పరిపాలించునని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును.కానీ, నీవుగాని, నీ అనుయాయులు  గాని  నన్ను విడనాడి అన్యదైవములను ఆరాదింతురేని,ఇశ్రాయేలును నేనిచ్చిన నేలమీద నుండి తొలగింతును. నేను దేవాలయమును విడనాడుదును,జనులు చూసి నవ్వుకొందురు. గడ్డిపోచతో సమానముగా చూతురు.ప్రభువు ఈ గడ్డకు, ఈ దేవాలయానికి ఎంత గతి పట్టించెనో చూడుడని ఛీ కొట్టుకొందురు".  దేవుడు వారితో ఇంత చెప్పినా కూడా వారు మాత్రం ఆయనకు విరుద్ధముగానే జీవించారు.
    అంతే కాకుండా ఒక్కటిగావున్న రాజ్యాన్ని సొలొమోనురాజు మరణించిన తరువాత రెండుగా విభజించి ఒకటి ఉత్తర రాజ్యంగా, మరొకటి దక్షణ రాజ్యంగా విభజించారు.దీని మూలంగా వీటిని పరిపాలిస్తున్న రాజులు వారి స్వంత స్వలాభాలకోసం, అన్యదేవుళ్ళను కొలవడం,బంగారముతో ఆవులనుచేసి కొలవడం,వారికిష్టమొచ్చినట్లు దేవాలయమును నిర్మించి, సాధారణ కుటుంబానికి చెందిన యాజకులను ఈ దేవాలయములలో నియమించడం,కొండలపైనదబ్బర దేవతలకు దూపములను, నైవేద్యములను అర్పించడం, ఇలా ఇన్నోరకాలుగా  ప్రజలను ఎన్నో పాపములను ఒడిగట్టేలా చేసారు. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీస్తుపూర్వం 595 - 587 మధ్య కాలంలో పరిపాలిస్తున్నటువంటి సిద్కియా రాజును తన పాపపు జీవితము నుండి మరల మంచి జీవితమునకు తీసుకురావటానికి యిర్మీయా ప్రవక్తను దేవుడు పంపిస్తున్నాడు.కానీ, అతడు మాత్రం ప్రవక్త మాటలను వినికూడా, ఆచరించకుండా బబులోనియాపై యుద్దానికి దిగాడు. అందుకు గాను బాబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి,ప్రజలను బానిసలుగా బాబులోనియాకు తీసుకొని వెళ్లారు. దీనంతటికి ముఖ్య కారణం అప్పుడున్నటు వంటి కాపరులే.
    అయితే దేవునినుండి వెడలిపోయిన ప్రతిఒక్కరిని మరల దేవునితో ఏకం చేయడానికి,అయన వద్దకి చేర్చుటకు ఈ యిర్మీయా ప్రవక్తను తన చిన్న ప్రాయమునందే ఎన్నుకొని తన పేరిట బోధించామని పంపిస్తున్నాడు. అదేవిధంగా రానున్న మెస్సయా గురించి తెలియజేస్తున్నాడు. "నేను దావీదు వంశమునుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి.రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమంతట నీతి న్యాయములు నెలకొల్పును.అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును" (యిర్మీయా :23 :6 ).  
    మరి ఈనాటి సువిశేష పఠనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు:
                మొదటిది, శిష్యులయొక్కపని.
                 రెండవది, దేవునియొక్క కనికరం.
      మొదటిగా, గడచినా వారము యేసుప్రభువు తన పండ్రెండు మంది శిష్యులను ఇద్దరిద్దరిని చొప్పున వివిధ ప్రాంతాలకు వేదప్రచారమునకు పంపించినపుడు,వారు వెళ్లి హృదయపరివర్తనము గురించి బోధించి,పిచచములను ప్రాలద్రోలి, ఎంతోమందిని స్వస్థపరిచి,తిరిగి ఏసుప్రభువుని చేరుకొనిన పిమ్మట వారి శ్రమను, పనితనమును చూసి,వారికి విశ్రాంతి అవసరమని గుర్తించి,జనసమూహమునుండి  ఈనాడు వారిని నిర్జనప్రదేశమునకుపంపిస్తునాడు.ఇక్కడ శిష్యులపై దేవునియొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం అర్ధం చేసుకునేదిఏమిటంటే,క్రీస్తును అనుసరిస్తున్న మనము ప్రతిరోజు ప్రజల ఆవరణనుండి, దేవుని ఆవరణకు వెళ్ళాలి.మనయొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది.
         రెండవదిగా, దేవుని యొక్క కనికరం. మనం చూస్తే,యిర్మీయా ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరుతుంది. యేసుప్రభువు జనసమూహాన్ని చూసి,కాపరిలేని గొర్రెల వలే నున్న వారిపై కనికరము కలిగి, వారికి అనేకవిషయములను బోధింపనారంభించెను అని పు.మార్కు గారు అంటున్నారు.
 అయితే ప్రజలపై ఎందుకు దేవుడు జాలి చూపిస్తున్నాడు అంటే, ఏమార్గమున వెళ్లాలో వారికి తెలియదు.అందుకే దేవుడంటున్నాడు,"నేనే మార్గమును"అని.ఎవరిని ఆశ్రయిస్తే వారిలో కష్టాలుపోతాయని వారికీ తెలియదు. అందుకే దేవుడంటున్నాడు, "నేనే జీవమును" అని.అయితే సత్యవంతుడైనటువంటి యేసుప్రభువుని ఎప్పుడైతే వారు ఆశ్రయిస్తున్నారో,   వారి రోగములను నయం చేస్తున్నాడు.పాపములను తుడిచివేస్తున్నాడు.పరలోక రాజ్యం గురించి,నిత్య జీవితము గురించి,అదేవిధముగా, తండ్రి దేవునియొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ, వారిని పాపపు మార్గము నుండి నిత్యజీవితము అను మార్గము వైపు నడిపిస్తున్నాడు.అందుకే ఈనాటి సువిశేష పఠనంలో ఎంతోమంది ప్రజలు దేవునియొద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. 
 ఆనాడు ఎంతోమంది రాజులు వారి స్వార్ధం కోసం చూసుకుంటే ఈనాడు యేసుప్రభువు ప్రజల క్షేమం కోరుకున్నాడు. అందుకే వారియొక్క జీవితాలను మారుస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు  ఇలా అంటున్నాడు, “నేను మీ క్షేమము కొరకు ఆదేశించిన పధకములు నాకు మాత్రమే తెలియును.నేను మీ అభివృద్ధినేగాని వినాశనమును కోరాను.నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని"(యిర్మీ:29 : 11 ).
    అయితే ఆ బంగారు భవిష్యత్తును మనం పొందాలంటే ఏం చేయాలి?
         1 .యేసుప్రభువునందు విశ్వాసం కలిగి జీవించాలి.
                         ఈ విశ్వాసమే ఈలోకంలోఉన్న ప్రతిఒక్కరిని దేవునిలో ఏకం చేయగలదు.అందుకే రెండవపఠనంలో పు.పౌలు గారు ఇలా అంటున్నారు:"యూదులము, అన్యులము అయినా మనము అందరము, క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము".అందుకే ఈనాడు ఎంతోమంది ప్రజలు వివిధ గ్రామాలనుండి దేవునివద్దకు  వచ్చి ఎన్నోమేలులను పొందుచున్నారు.ఇది కేవలం వారి విశ్వాసం వలననే.ఆనాడు ఈ యూదులు అన్యులు ఎంతో  శత్రువులుగా వుండి,వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, ఒకరిపై ఒకరు యుద్ధము చేసుకొనుచుండెడివారు. కానీ “క్రీస్తు వీలందరికోసం ఒక్కడే ఈ లోకానికి వచ్చి సిలువపై ఘోరాతి గోరంగా మరణించి,ఆ వైరమును రూపు మాపెను” (పు.పౌలు:2 :16 ).  అలా, ఈ అన్యులను, యూదులను ఒక్కటిగా మార్చాడు.వీరిని దేవునియొక్క సమక్షంలో నడిపించాడు.స్నేహితులుగామార్చడు.అదేవిధంగా,వీరందరికి ఒకే నియమం కల్పించాడు. చివరికి అందర్నీ ఒక్కటిగా కలిపాడు.
      2 .భాద్యత కలిగిన కాపరులుగా లేక వ్యక్తులుగా మెలగాలి.
                మోషే ప్రవక్త నలుబది సంవత్సరములు భాద్యత కలిగిని కాపరిగా ఉండి,ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనాను దేశమునకు నడిపించాడు.దావీదు మహారాజు నలుబది సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు బాధ్యత కలిగిన రాజుగా ఉండి వారిని దేవుని వైపు నడిపించాడు.అలాగే, ఎంతోమంది ప్రవక్తలుకూడా బాధ్యత కలిగిన కాపరులుగా ఉండి దేవుడు వారి జీవితములో నియమించిన పనిని వారు పూర్తి విధేయతతో,  భాద్యతగా చేసారు.అదే విధంగా ఈనాడు నువ్వు నేను కూడా ఒక నాయకుడిగా,అధికారిగా,ఉపాధ్యాయుడిగా,గురువుగా,ఒక తల్లి తండ్రిగా,మనకు నియమించబడిన పనిని సక్రమంగా నెరవేర్చినపుడే మనం బాధ్యతకలిగిన కాపరులుగా పిలువబడడానికి అర్హులమవుతాం. 
       ౩. ఐక్యతా వారధులుగా ఉండాలి.
                ఈనాటి రెండవ పఠనంలో, పు.పౌలు గారు, చెల్లాచెదురైన మానవజాతిని ఏకం చేయడానికి క్రీస్తు ప్రభువు తన జీవితాన్నే త్యాగం చేసాడని వివరిస్తున్నాడు. వీరులు ఎప్పుడైతే రాజ్యంలో ఐక్యతను కోరుకుంటారో,అప్పుడే రాజ్యం సుఖ సంతోషాలతో అలరాలుతుంది.యేసుప్రభువు తన మరణము ద్వారా ద్వేషాన్ని,విభజనా శక్తిని నాశనం చేసి, నూతన మనిషిని, నూతన కుటుంబాన్ని రూపొందించాడు.పు. పౌలు గారు ఇలా అంటున్నారు:"పూర్వము మీరెట్లుండిరో స్మరింపుడు.ఒకప్పుడు మీరు శారీరకంగా అన్యులై ఉంటిరి, కానీ ఇప్పుడు క్రీస్తుయేసు నందు ఏకమగుటతో, దూరస్థులగు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసికొనిరాబడితిరి"( ఎఫె:2 :11 ,13 ).  అందుకే ఈనాడు క్రైస్తవ మతం అంటే ఐక్యత కలిగిన మతంగా పిలువబడుతోంది.అయితే ఈనాడు మన జీవితములో కూడా ఐక్యత కలిగి ఉండాలంటే లేక ఐక్యత వారధులుగా ఉండాలంటే,ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ,శాంతి, సమాధానాలతో,కరుణతో మెలిగినపుడే,మనలో ఐక్యత ఏర్పడి, ఐక్యత వారధులుగా మెలుగుతాము. 

           కాబట్టి ప్రియ విశ్వాసులారా! ఈనాడు మన జీవితములలోకి, మంచికాపరి ఐన మన యేసు ప్రభువుని ప్రగాఢమైన విశ్వాసముతో ఆహ్వానించి,భాద్యత కలిగిన కాపరులుగా జీవిస్తూ, ఐక్యత కలిగి జీవిస్తూ,ఒక మంచి క్రీస్తుననుసరించు వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నిదాం.అప్పుడే మన జీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ఆమెన్.

             Nandigama Sunil mario

పాస్కా ఆరవ ఆదివారం

పాస్కా ఆరవ ఆదివారం  అపో 10:25-26, 34-35,44-48 1యోహను 5:7-10 యోహాను 15:9-17 ఈనాటి పరిశుద్ధ గ్రంథములు పఠనములు దేవుని యొక్క ప్రేమ గురించి మరియు...