పాస్కాకాల రెండవ ఆదివారము
(1) అపో. కా 4: 32-35, (2) 1 యోహాను 5: 1-6, యోహాను 20: 19-31
క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా ఈనాడు మనము పాస్కాకాల రెండవ ఆదివారములోనికి ప్రవేశించియున్నాము. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల ద్వారా తల్లి శ్రీసభ మనకు ఉత్తాన క్రీస్తు యొక్క ప్రతక్ష్యరూపము గురించి తెలియజేస్తుంది. చనిపోయిన వారిలో నుండి ఉత్తానము అయిన యేసు, తన శిష్యులకు కనిపించారు. యేసు చనిపోయిన నాటి నుండి 40 రోజుల పాటు తాను స్వయముగా వారికి కనిపించారు. తాను సజీవుడనని వారికి చాలా విధములుగా తెలియజేసారు. యేసు శిష్యులకు కనిపించినది తాను ఎప్పుడూ జీవిస్తున్నాడని శిష్యులకు నిరూపించడానికే మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, అనాధలుగా మనలను విడిచిపెట్టడని తెలియజేయుటకును, శక్తిని ఇచ్చుటకు కూడాను. ఆ రోజులలో దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు అనే విశ్వాసము ఉండేదని యెషయా ప్రవక్త గ్రంథములో ఇమ్మానుయేలు (యెషయా 7:14) అను వాక్యంలో చూస్తున్నాము. మనుష్య జాతితో చేసిన వాగ్దానము ద్వారా దేవుడు తన ప్రజలతో యుగాంతము వరకు వశించునని వారి నమ్మిక. ఆ నమ్మకము యేసు ప్రభువు ఉత్తానములో పూర్తవుతుంది. ప్రభువు ఇప్పుడు తన ప్రజలతో జీవిస్తున్నాడు. దర్శన గ్రంథములో మనము చూస్తున్నాము; సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును. వారే ఆయనకు ఆలయము. వారే అయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును (దర్శన 21:3).
ఈ నాటి
సువిశేషములో మనము గమనించినట్లయితే పునరుత్తానము తర్వాత తండ్రి మహిమలో చేరిన
క్రీస్తు తన శిష్యులను మర్చిపోలేదు. ఆ రోజు
ఆదివారము తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు(యోహాను). క్రీస్తు నాధుని యందు ప్రియమైన స్నేహితులారా వాగ్దానము
నెరవేర్చే దేవుడు తన శిష్యుల వద్దకు వచ్చారు. అయన ఎప్పుడు వారిని వదిలిపెట్టలేదు అని ఈ దర్శనాలు
సాక్ష్యమిస్తున్నాయి. యేసు ప్రభువు యొక్క దర్శనాల ప్రత్యేకత ఏమిటంటే వాటిన్నంటిలో ఆయనే ముందుటారు. శిష్యుల
యొక్క లోతైన విశ్వాస ఫలముగాని, వారి దృఢ నమ్మకము గాని, నిరీక్షణాల ద్వారా గాని కాదు క్రీస్తు ప్రభువు ముందుకు వచ్చేది. ఆయన
తనకు తానుగా వారి యొద్దకు వస్తున్నారు.
ఆయన బలపరిచితే
తప్ప మనకు ఏమి అర్ధం కాదు. ఆయన క్షమియించిన మాగ్దలా మరియమ్మ మరియు ఎమ్మావు గ్రామమునకు ప్రయాణము చేసిన ఇద్దరు
శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన వారితో చెప్పినప్పుడే
ఆయనను గుర్తించగలిగారు. శిష్యుల ఎన్నిక సమయములో
ప్రభువు పలుకుతున్నారు మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను(యోహాను 15:16). ఈరోజు కూడా ఆయన మన మధ్యకు వస్తున్నారు. తన దర్శనాల ద్వారా తన స్నేహ సంబంధమును మరల మనయందు
కలిగిస్తున్నారు. ఆయన దర్శనాలకు
ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అది ఎవరు ముందుగా ఊహింపశక్యము కానిది. ఆయన ఎక్కడ ఉన్నారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరు ఊహించలేదు. ఆయన రాకడ
గురించి తెలుసుకుంటే ఒక విషయము అర్థమగుచున్నది. తన శిష్యుల అవసరతలలో పరుగెత్తుకు వచ్చారు
క్రీస్తు ప్రభువు. కన్నీరు కార్చిన మాగ్దలా మరియమ్మను ఓదార్చుటకు వచ్చారు. ఎమ్మావు మార్గములో శిష్యుల హృదయాలను
ప్రజ్వలింపచేయుటకు వచ్చారు. రాత్రంతయు శ్రమపడి చిన్న చేప కూడా దొరకని శిష్యులకు సమృద్ధిగా
ఇచ్చుటకు ఆయన వారి యొద్దకు వచ్చారు. అందుకే ఉత్తాన ప్రభువు దర్శనాలు మనకు ఇచ్చే సందేశమేమిటంటే, మన అవసరతలలో కూడా ఆయన మన సమీపముననే ఉంటారు.
పునరుత్తానము
అయిన ప్రభువు అందరికి దర్శనము ఇవ్వలేదు. ఈ భాగ్యము తన స్నేహితులకు, శిష్యులకు మాత్రమే దొరికింది. క్రీస్తు నాధుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
పునీత పేతురు గారు ఈ విషయాన్ని చాల స్పష్టముగా వివరిస్తున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలోనుండి లేపి మూడవ నాడు మరల మాకు కనబడునట్లు చేసెను, దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే
కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు(అపో కా 10:
40-41) పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే
ఉత్తానమైన ప్రభువు మొదట సారిగా
దర్శనమిచ్చింది తనను ఎక్కువగా ప్రేమించినవారికి, వెదకినవారికి మాత్రమే. ప్రభువు యొక్క దర్శన భాగ్యము పొందాలంటే సహృదయ సంభందం కలిగిఉండాలని ప్రభువును
నేర్పిస్తున్నారు. తనను వెదికే వారికి ఈరోజుకు కూడా ప్రభువు తన దర్శనాలను ఇస్తున్నారని మనము వింటున్నాము.
ఆయన యొక్క దర్శనాలు, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని స్ఫూరింపచేస్తున్నాయి. ఉత్తాన ప్రభువు మనతో
ఉన్నారని మనము గుర్తించలేకపోతున్నాము.
ఈనాటి సువిశేషములో మనము గమనించినట్లయితే యూదుల వలన భయము నిమిత్తము గదిలో చేరి తలుపులు వేసుకున్న
శిష్యులకు దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాము. అయితే ఆ శిష్యులు మనలో కొందరి వలె బయటి నుండి అద్భుతముగా
దేవుడు లోపలికి వచ్చాడని ఆలోచించారు. కానీ అది కాదు అక్కడ జరిగినది. వారితో పాటు ఆ గదిలో ఉన్నారు క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత
కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆయన తనకు తానుగ బయలుపరచకముందు కూడా ఆయన వారితో ఉన్నారని వారికి తెలియజేయుటకు
ఆయన 40 రోజులు వారి ఎదుటకు వచ్చి ప్రత్యక్షమవడము, నిష్క్రమించడము జరిగింది. ఈ 40 రోజుల అనుభవాలను బట్టి ఆయన ఎల్లపుడు మనతోనే ఉంటున్నాడని మనకు బోధపడుతుంది.
క్రీస్తు
ప్రభువు ఉత్తానమైనప్పుడు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుచేతనంటే, బహుశా వారి వారి నిరాశ నిస్పృహలకు మరియు భయాందోళనలకు బందీలై క్రీస్తు ఉత్తాన
పరామరహస్యమును, సత్యమును మర్చిపోయారు. ఆ స్థితిలో ఉన్న శిష్యులకు ప్రభువు శాంతి సందేశాన్ని
ఇస్తున్నారు. ఉత్తాన క్రీస్తు ఒసగుచున్న శాంతి సమాధానాలు ఈ లోకము ఇచ్చే శాంతి సమాధానాలు కావు. ఆయన మనలో ఉండి మనకు
ఒసగేవి ఆంతరంగిక శాంతి
సమాధానాలు. క్రీస్తు ప్రభవు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సమయములో వారి
ఆలోచనలను తప్పు పట్టలేదు. తనను
ఎరుగనని బొంకిన పేతురును, విశ్వసించని తోమాసును విడిచిపెట్టలేదు.
కానీ వారికి తన ప్రేమను తెలియజేస్తున్నారు. వారు అయన ప్రియమైన శిష్యులు, స్నేహితులని వారికి ప్రత్యేక భాద్యత ఉందని తెలియజేస్తున్నారు. మనము కూడా ఆ శిష్యుల వలె భయానికి
బందీలమై మన యొక్క కర్తవ్యాన్ని మరిచి పోయే అవకాశము ఉంది. భయాందోళనల సమయములో మనము వాటినే తలచుకుంటుంటాము. వాటిలోనే లీనమై మన
గమ్యాన్ని మరచిపోతాము. అంతేకాక అశాంతికి, నిరాశ నిస్పృహలకు గురి అవుతాము. కాబట్టి, ఈ సమయములో ఉత్తానుడైన క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే సందేశము మీకు శాంతి కలుగునుగాక. ఇది
విరిగిన మనసులకు ఒసగే కానుక. వీటితో పాటు ప్రభువు మనకు నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని మాట ఇస్తున్నారు. ఆ
ప్రభువు ఒసగే శాంతి సమాధానాలను స్వీకరించి ఆ ప్రభువుతో కలసి మన జీవితాప్రయాణాన్ని కొనసాగిద్దాము.
ఆమెన్.
Bro. Manoj OCD