ఆగమన కాలం - మూడవ ఆదివారం
యెషయ 35: 1- 6, 10
యాకోబు 5: 7-10
మత్తయి 11: 2 -11
ఈనాటి ఆదివారమును “Gaudete Sunday” ఆనందించు ఆదివారం అని పిలుస్తారు. ఆగమన కాలం అంటే సంతోషంతో ఎదురు చూడటం, దేవుని రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తూ, ఆయన కొరకు మన యొక్క జీవితాలను తయారు చేసుకోవటమే.
ఆగమన కాలం మొదటి ఆదివారం నుండి ఇప్పటివరకు దివ్య గ్రంథ పఠనాలు హృదయ పరివర్తనం గురించి, దేవుని నిరీక్షణ కలిగి ఉండటం గురించి, ప్రభు యొక్క తీర్పు గురించి తెలుపుచున్నాయి.
ఏ విధంగానైతే ఆకలితో అలమటించే వ్యక్తి అన్నం కోసం ఎదురు చూస్తాడో, నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూస్తాడో, బానిసత్వంలో ఉన్నవారు స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తారో ప్రస్తుతం మనందరం మెస్సయ్య యొక్క రాక కోసం, క్రీస్తు జయంతి కోసం ఎదురుచూస్తున్నాం. మన యొక్క ఎదురుచూపులో ఆనందం దాగి ఉంది.
మొదటి పఠణంలో యెషయ ప్రవక్త రాబోయే మంచి రోజుల గురించి బోధిస్తున్నారు.
క్రీస్తుపూర్వం 587వ సంవత్సరంలో బాబిలోనియ రాజు యెరూషలేమును యూదులను ద్వంశం చేసి అక్కడ ఉన్న నాయకులను మరియు జనాభాను బానిసత్వంలోనికి తీసుకొని పోయారు.
దేవుడు యూదులను బాబిలోనియాలనుండి రక్షించలేని బలహీనుడు కాదు. కేవలం ఇశ్రాయేలీయులకు వారి యొక్క పాపాలకు ప్రభువు వారిని దాదాపు 50 సంవత్సరాల వరకు శిక్షించారు.
ఈ శిక్ష కేవలం వారికి మంచిని నేర్పుటకు వారి జీవితాలను సన్మార్గం లో నడిపించుటకు ప్రభు ఈ విధంగా అనుమతించారు.
నెబుకద్నెసారు రాజు యెరూషలేమును ఆక్రమించి దానిని ఎడారిలాగా మార్చాడు. అప్పటివరకు దేవుని నివాస స్థలమైన యెరూషలేమును ధ్వంసం చేశారు. పచ్చని నేలను మారు భూమిగా మార్చాడు. పుణ్యభూమిని పాప మలినం చేశాడు.
వారి యొక్క బానిసత్వం ముగిసిన తరువాత దేవుడు పర్షియా చక్రవర్తి కోరేషును ప్రేరేపించి అప్పటివరకు బాధలు కష్టాలు అనుభవిస్తున్న యూదులను విడిపించి వారిని యెరూషలేము వెళ్ళుటకు స్వేచ్ఛనిచ్చారు.
ఈనాటి మొదటి పఠనం 35:16-10 వచనాలలో ప్రవక్త ప్రజల యొక్క భవిష్యత్తు సంతోషకరంగా ఉండును అని తెలుపుచున్నారు.
రక్షకుడు మెస్సయ్య వారి మధ్యకు వచ్చినప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో ముందుగానే యెషయ ప్రవక్త ప్రవసించారు.
యెషయ 35: 1-2 వచనాలలో దేవుడు ప్రకృతిని నూత్నికరించే విధానంను తెలుపుచున్నారు. ప్రభువు ఏ విధంగా ఎడారిని మరు భూమిగా మార్చబోతున్నారు తెలుపుచున్నారు. ఫలించని ఒక స్థలంలో దేవుడు ఒక కొత్త జీవితం పుట్టిస్తున్నారు.
అప్పటి వరకు ఎడారిలాగా జీవం
లేని బ్రతుకుల్లా ఉన్న యిస్రాయేలీయులలో ప్రభువు
యొక్క రాక ద్వారా సంతోషం
నింపబడిందని పలుకుచున్నారు. ప్రభువు యొక్క రాకతో మోడుబారిన జీవితాలలో కూడా ఒక క్రొత్త
చిగురు పుడుతుందని తెలిపారు.
యిస్రాయేలీయులు తిరిగి రావడంతో యెరూషలేము జీవంతో నింపబడినది. నిర్జీవంగా ఉన్నటువంటి ఒక ప్రదేశమును దేవుడు
మార్చబోతున్నారు. ఎడారిలో అంతయు ఎండిపోవును, బ్రతుకుట కష్టము కానీ అలాంటి స్థలమును
దేవుడు మార్చుతున్నారు.
లెబానోను, కార్మెల్, షారోను స్థలములను దేవుడు సారవంతం చేస్తున్నారు. అక్కడ దేవుడు సమృద్ధిని దాచేస్తారు అని ప్రవక్త తెలిపారు.
మరుభూమి ప్రమోదం చెంది పుష్పించును గాక అని ప్రవక్త
తెలిపారు. పవిత్ర గ్రంధంలో మరుభూమికి వివిధ రకాలైన అర్ధాలున్నాయి.
- మరుభూమి (wildernesss or
desert) యిస్రాయేలీయుల వలసకు గుర్తు, ప్రజల యొక్క స్వేచ్ఛకు
గుర్తు - ఆది 16: 12, నిర్గమ 3: 13
- ఎడారి ప్రాణాంతకమైంది - ద్వితి 8: 15
- మరుభూమి అపాయం కలిగినది - నిర్గమ 14: 3
- నీరు కొరతగా ఉండే
ప్రదేశం (నిర్గమ 15: 17) ఎటువంటి పంటలేని స్థలం.
- విస్తారమైనది - ద్వితి 1: 19
- దేవుడి మీద నమ్మకముంచుట నేర్పిన
స్థలం
దేవుడు
యిస్రాయేలీయులను 40 సంవత్సరములు నడిపించి పోషించిన స్థలం, అసాధ్యమైన కార్యాలను ప్రభువు సుసాధ్యం చేసిన స్థలం.
ప్రభువు
వచ్చే సమయంలో ఒక క్రొత్త మార్పు
ఉంటుంది అని తెలుపుచున్నారు. ఆ
మార్పులు ఏమిటంటే:
1.
ఎడారి సంతషించును
2.
మరుభూమి పుష్పిస్తుంది
3.
జాజిపూలు పూస్తాయి
4.
అలసిపోయిన హస్తాలు
బలపరచబడతాయి
5.
వణికే మోకాళ్ళు సత్తువతో నిలబడతాయి
6.
గ్రుడ్డి, కుంటి
వారు దేవుని స్వస్థత పొందుతారు.
ఇవన్నీ కూడా మెస్సయా కాలంలో
జరిగే మార్పులు. ప్రభువు వచ్చే సమయంలో అంత సంతోషమే.
యెషయా
ప్రవక్త ప్రజలను మూడు ఉద్దేశాలను బట్టి
ఆనందించుమని తెలుపుచున్నారు.
1. యిస్రాయేలీయులు
బానిసత్వం నుండి తిరిగి రావటమును బట్టి ఆనందించాలి.
2.
గ్రుడ్డివారు, చెవిటివారు,
మూగ కుంటివారు ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతారు కాబట్టి సంతోషించాలి.
3.
కష్టాలు, భాధలు తొలగిపోతాయి కాబట్టి సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠనంలో ఆనందం అనే పదంను చాలా
సార్లు చూస్తున్నాం. దేవుడు మనందరం కూడా సంతోషంగా ఉండుట
కోరారు.
అందుకనే మనం పాపం చేసినప్పటికీ
మనల్ని వెదకి రక్షిస్తున్నారు. మనందరం ఆనందంగా ఉండాలి, ఆ ప్రభువును బట్టి
ఆనందించాలి - ఫిలిప్పి 4: 4
ఈనాటి రెండవ పఠనంలో యాకోబు గారు ప్రభువు వచ్చే
వరకు సహనంతో ఉండమని పలుకుచున్నారు.
ఏవిధంగానైతే ఒక రైతు పొలం
వేసిన తరువాత తన యొక్క పంటకోసం
ఎదురు చూస్తుంటారో అలాగే మన ప్రభువు కొరకు
మనం కూడా ఎదురు చూడాలి
అని తెలుపుచున్నారు.
యాకోబు గారు విశ్వాసులను సహనంతో
ఉండమని తెలిపారు. ఎందుకంటే అప్పటి ధనవంతులు, అధికారులు సామాన్యమైన ప్రజలను హింసించే సందర్భంలో భాధలు పెట్టె సమయంలో అన్ని సహనంతో భరించమని వారికి తెలియజేసారు. ఒక
రైతును ఉదాహరణగా తీసుకుంటున్నారు ఎందుకంటే రైతు పొలం వేసిన
వెంటనే త్వరగా పంటను
ఆశించడు, ఆయన సహనముతో ఎదురు
చూస్తాడు. ఆయన ప్రతిరోజు పని
చేస్తాడు. కొన్నిసార్లు అంతా పంట రాకపోయినా
సరే, మొక్కలు ఎదగకపోయినా సరే ఆయన విడిచిపెట్టడు.
అదేవిధంగా క్రైస్తవులు ప్రభువు కొరకు కూడా అదే విధంగా
వేచి ఉండాలి.
మన
యొక్క బాధలలో, కష్టాలలో ప్రభువును విశ్వసంతో, విడిచి పెట్టకుండా జీవించాలి.
మన యొక్క అనుదిన జీవితంలో ఎంత సహనంగా ఉంటే అంత సంతోషంగా జీవించగలుగుతాం. సహనంగా ఉండుట ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందవచ్చు, అబ్రహాము తన యొక్క సహనం వలన ఆశీర్వదించబడ్డారు - హెబ్రీ 6:12, హెబ్రీ 6:15.
- సహనం మనలను రక్షించును.
- మన యొక్క సహనము వలనే మనం పరలోకంలో ప్రవేశిస్తాం అని పౌలు గారు పలికారు- రోమీ 2:7.
- యోబు తన యొక్క సహనం వలన ఆశీర్వాదాలు పొందారు, అదే విధంగా క్రైస్తవులమైన మనం కూడా సహనంతో ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి.
- పునీత అవిలాపురి తెరెజమ్మ అంటారు సహనం సమస్తమును భరించును కాబట్టి సహనంతో జీవించి పరలోక రాజ్యమును పొందుదాం.
ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిందలు ఎదురు కావచ్చు, హింసలు ఎదురు కావచ్చు భయపడవచ్చు, ఇవన్నీ ఎదురైనప్పటికిని మనం ఓర్పు కలిగి ఉండాలి.
ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులకు బాధపడినా కానీ బిడ్డకు జన్మనిస్తుందని సహనంతో సంతోషంగా ఉంటుంది.
మనం కూడా సహనంతో జీవించి ప్రభువు కొరకు మన జీవితాలను సంసిద్ధం చేసుకుందాం.
ఈనాటి సువిశేష పఠనం లో బాప్తిస్మ యోహాను గారు తన యొక్క శిష్యులను యేసు ప్రభువు వద్దకు పంపించి తాను మెస్సయ్యనా లేక మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అని అడుగుచున్నారు.
బాప్తిస్మయోహాను ఏసుప్రభువు చేసే కార్యముల గురించి విన్నారు.అందుకనే తాను మరణించే ముందు ఎటువంటి సందేహం లేకుండా మరణించాలని అనుకున్నాడు.
ఎందుకని బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభువు గురించి సందేహిస్తున్నారు?
ఆయనయే స్వయంగా ఏసుప్రభు అని సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించే ప్రభువు అని పలికారు- యోహాను 1:29.
బాప్తిస్మ యోహాను గారే మెస్సయ్య గురించి ఆయన పవిత్రాత్మతో అగ్నితో ఇచ్చే బాప్తీస్మం గురించి బోధించారు. ఆయన మెస్సయ్యను ఈ ప్రశ్న అడుగుటకు చాలా కారణాలు ఉన్నాయి.
1. బాప్తిస్మ యోహాను గారు మెస్సయ్య గురించి ప్రవక్తల బోధనల ద్వారా చాలా విన్నారు. మెస్సయ్య వచ్చే సమయంలో ఆయన ఫలించని చెట్లను నరికి పారవేస్తాడని భావించాడు కానీ ప్రభువు దానికి భిన్నంగా క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు- మత్తయి 3:10.
2. క్రీస్తు ప్రభువు పాపులతో సుంకరులతో కలిసి భుజిస్తున్నారు. లూకా 15:1-2, మత్తయి 11:19.
3. ఏసుప్రభు యొక్క పరిచర్య ఆయన గురించి బోధించినది రెండూ కూడా ఒకదానితో ఒకటి సరితూగుటలేదు అందుకే సందేహిస్తున్నారు.
4. బాప్తిస్మ యోహాను గారు మెస్సయ్య రోమీయుల సామ్రాజ్యమును పడద్రోసి ఇశ్రాయేలు రాజ్యమును సైన్యమును స్థాపిస్తాడని ఆశించాడు- మత్తయి 1:18.
5. ఇశ్రాయేలులను స్వేచ్ఛ స్వతంత్రులను చేస్తాడని భావించాడు తనను చెరసాల నుండి విముక్తి గావిస్తాడని ఆశించి ఉండవచ్చు , అది కూడా జరగలేదు.
6. కొంతమంది ప్రభువు యొక్క తగ్గించుకొని జీవితంను చూసి ఆయన యొక్క జీవితమును చూసి విశ్వాసం కోల్పోయి ఇతడు నిజంగా మెస్సయేనా లేక ఇంకొక మెస్సయ్య వస్తాడా అని ఎదురు చూశారు.
ఏసుప్రభు బాప్తిస్మ యోహానుకు తన మాటల ద్వారా సమాధానం ఇవ్వకుండా తన యొక్క క్రియలే తాను మెసయ్యానని నిరూపిస్తున్నాయని తెలిపారు.
ప్రభువు యొక్క సువార్త పరిచర్య ద్వారా అనేకులు ఆయన్ను మెస్సయ్యగా గుర్తించారు. అనేకమంది ప్రజలు ఏసుప్రభువును గొప్ప వానిగా స్వీకరించారు ఆయన చేసిన అద్భుతముల ద్వారా- లూకా 7:21- 23.
అనేకమంది ప్రభువును బోధకునిగా అంగీకరించారు పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని పలికారు .మత్తయి 16:16.
- ఏసుప్రభు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడని పేతురు విశ్వాసాన్ని ప్రకటించారు. యోహాను 6-68.
- ఏసుప్రభువు అంతయు అధికార పూర్వకంగా బోధించారని విశ్వసించారు. మత్తయి 7:28-29.
ఏసుప్రభు మెస్సయ్య చేసే క్రియలన్నీ తన పరిచర్యలో ఆయన చేశారు.
1. గ్రుడ్డివారికి చూపునిచ్చారు. కొందరికి శారీరక చూపును, కొందరికి ఆధ్యాత్మిక చూపును దయచేశారు.
2. కుంటివారికి నడకను దయచేశారు.
3. కృష్ట రోగులను స్వస్థపరిచారు.
4. చెవిటి వారికి వినికిడిని దయచేశారు.
5. చనిపోయిన వారికి జీవం ఇచ్చారు శారీరకంగా, ఆధ్యాత్మికంగా మరణించిన వారికి తన యొక్క వాక్కు ద్వారా స్పర్శ ద్వారా స్వస్థతనిచ్చారు.
6. పేదలకు సువార్తను ప్రకటించారు. ఎవరినైతే సమాజం తృణీకరించిందో దేవుడు వారి పక్షమున నిలబడ్డారు. ఏసుప్రభువు ప్రవక్తల బోధనలు అన్నియు నెరవేర్చారు -మత్తయి 11: 5 లూకా 3: 23-28.
ఏసుప్రభు యోహాను శిష్యులకు తన యొక్క కార్యాల ద్వారా తానే మెస్సయ్య అని తెలియజేశారు.
శిశువులు వెళ్లిన తరువాత ఏసుప్రభువు బాప్తిస్మ యోహాను యొక్క గొప్పతనం గురించి ప్రకటించారు. ఆయన దేవుని యొక్క దూత అని గొప్ప ప్రవక్త అని మెస్సయ్యను గుర్తించిన పవిత్రుడని క్రమశిక్షణ కలిగిన బోధకుడు అని దేవుని మార్గమును సిద్ధము చేయువాడని యేసు ప్రభువు బాప్తిస్మయోహాను గారి గురించి తెలిపారు.
బాప్తిస్మ యోహాను గారు ఏసుప్రభు చేసే కార్యాలు గురించి విని ఆనందించారు.
మన యొక్క విశ్వాస జీవితం మనందరం వినిన వెంటనే సందేహించకుండా దానిని పరిశీలించి తెలుసుకొని ఏదైనా ఒక విషయమును నమ్మాలి. సందేహాలకు తావు ఇవ్వకుండా మంచిగా జీవించుదాం .
ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరం కూడా ప్రభువు తొందరలో వస్తున్నారు కాబట్టి సంతోషంతో ఎదురు చూడమని తెలుపుచున్నాయి.
BY. FR. BALAYESU OCD