28, ఆగస్టు 2021, శనివారం

సామాన్య 22 వ ఆదివారము

సామాన్య 22 వ ఆదివారము

ద్వితీ 4:1-2, 6-8

యాకోబు 1: 17-18, 21-22, 27 

మార్కు7: 1-8, 14-15, 21-23

క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా,

ఈనాడు మనము సామాన్య 22 వ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాడు మొదటి పఠనము ద్వితీయోపదేశ- కాండము నుండి తీసుకొనబడినది. దేవుడు యూదులకు ఇస్తానని ప్రమాణము చేసిన వాగ్దాన భూమిలోనికి యూదులు చేరే వరకు మోషే బ్రతకడని అతనికి తెలుసు. దేవుడు తన ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించమని ప్రజలను హెచ్చరిస్తాడు. తాను ఇచ్చిన శాసనాలను ఏ మాత్రము మార్చకుండా తు. చ. తప్పకుండా యూదులు ఆచరించాలని చెబుతాడు. వాళ్ళు ఈ విధముగా జీవిస్తే ఇతర జాతుల కన్నా వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడని చెప్పాడు(ద్వితీ 4:6)

ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఈ యూదా ప్రజలకు తానే స్వయముగా మంచి మంచి కట్టడలు ఇచ్చి వాటి ప్రకారము జీవించడానికి వారికి సహాయపడటం వారి అదృష్టమని చెప్పాలి. ఇక మరొక జాతికి దేవుడు ఇలా చేయలేదు. ఈనాడు మనము చదివిన సువిశేషములో కొందరు న్యాయపండితులు, వారు చెప్పిన ఆచారములు తు. చ. తప్పకుండా పాటించే పరిసయ్యులు, క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మీ శిష్యులు యూదా ఆచారముల ప్రకారము భోజనమునకు ముందు చేతులు కడుకొనకుండా భోజనము చేస్తున్నారు. వారు మా ఆచారమును కించ పరుస్తున్నారు అని తెలివిగా ఒక ప్రశ్న వేశారు. నిజమే! యూదుల ఆచార ప్రకారము ప్రకారము పూజారులు దేవాలయములో ఏదైనా సాంగ్యము చేస్తే దానికి ముందు చేతులు కడుకోవాలి. అయితే రాను రాను ఈ ఆచారము మామూలు జనానికి అన్వయిస్తుందని వారు చెప్పారు. ఎవరైనా సరే ప్రార్ధన చేయుటకు ముందు, భోజనము చేయటానికి ముందు చేతులు శుభ్రముగా కడుగుకోవాలను ఆచారము వచ్చేసింది. కాలక్రమేణా ఈ ఆచారము ఎలా స్థిరపడినది అంటే బాహ్యశుద్ది ముఖ్యమైనది కానీ హృదయ శుద్ధి అనేది మరుగున పడిపోయింది. ఒళ్ళు శుభ్రముగా ఉంటె చాలు, హృదయ శుద్ధి ఎవరు చూస్తున్నారు? భక్తి అనేది బాహ్య ఆచరణములకే పరిమితమైపోయినది. ఎంత శుభ్రముగా దేవాలయమునకు వెళితే అంత భక్తుడను అను భావము జనములో స్థిరపడిపోయింది. తలంటు స్నానము, మంచి బట్టలు, ఇలా అన్ని కనబడే అట్టహాసములే కానీ కనబడు హృదయ శుద్ధి అడుగంటిపోయినది. 

ఇలాంటి బాహ్యశుద్ది లేకపోయినా హృదయశుద్ధి కావాలని చూపించడానికి క్రీస్తు ప్రభువు కానీ, అయన శిష్యులు కానీ ఆ ఆచారములను పాటించలేదు. చేతులు కడుకొనకుండా భోజనము చేసారు, శుద్ధిలేని పాపులతో ఒకే పంక్తిన భోజనము చేసారు. కావున ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు ప్రభువు ఈవిధముగా అంటున్నారు, "మీరంతా కేవలము మీ పెదవులతోనే దేవుని ప్రీతి పరచాలని అనుకుంటున్నారు, అలంటి వారు దేవుని దరి చేరలేరు. దేవునికి కావలసినది భక్తి, ప్రేమ". ఏమి తింటాము, ఎలా తింటాము అనేది పైకి కనబడేవి కానీ ఇవి మనిషిని శుభ్రము చేయవు. మనిషి హృదయము నుండి వచ్చేవి మంచి లేక చేదు. మనిషిని చెరిచేది అతను తినే ఆహారము కాదు కానీ అతని మనస్సులో నుంచి వచ్చే చెడుగు అతనిని మలినపరుస్తాయి. చెడుగా ఆలోచించేవాడు, దేవుని పొరుగు వాని ప్రేమించలేనివాడు, పాపమును మూటకట్టుకుంటారు. ఆ పాపమే వానిని అపవిత్రపరుస్తుంది. 

ఈనాడు రెండవ పఠనము మనకు ఏమి నేర్పుతుంది? దేవుని రాజ్యములో ప్రేమ అంటే ఎలా ఉంటుంది, మతము అంటే అర్ధము ఏమిటి అనే విషయాన్ని యాకోబు గారు మనకు ఈ విధముగా చెబుతున్నారు(యాకోబు 1:21-25). దేవుని వాక్కులే మనజీవితాలకు మార్గదర్శులుగా ఉండాలంటున్నారు. దేవుని మాట ప్రకారము జీవించే వారు నిజముగా మతమును అవలంబించేవారు. వానికే దేవుని ఆశీస్సులు నిండుగా, దండిగా వస్తాయి. మనము పొరుగు వారిని ప్రేమించడమే అసలైన మతము. అంత కంటే వేరొక మతము లేదు. కావున లోక ఆశలనుండి దూరముగా ఉండుటయే దేవుని దృష్టిలో నిజమైన మతము. 

ఆమెన్…

Br. Avinash OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...