25, సెప్టెంబర్ 2021, శనివారం

26వ సామాన్య ఆదివారము(2)

26వ సామాన్య ఆదివారము(2)

సంఖ్యా 11:25-29
యాకోబు 5: 1-6
మార్కు 9: 38-43, 45-46
ఈనాటి దివ్య పఠనములు దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి అందరు అర్హులే అనే అంశము గురించి భోదిస్తున్నాయి. అదేవిధముగా దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు మనకు ఇతరుల గురించి అసూయ ఉండకూడదు అలాగే వారిపట్ల అసహనంగా ఉండకూడదు అనే అంశాల గురించి భోదిస్తున్నాయి. దేవుడు తన సేవకు ఎవరినైనా, ఎప్పుడైనా, ఏవిధముగానైనా ఉపయోగించుకుంటారు. తన మీద ఆధారపడి, తన సాన్నిధ్యము అనుభవించించి తన సేవ చేసే వారు ఎవరైనా తనకు ఇష్టమైన వారే. అందరికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానస్నాము ద్వారా ఇవ్వబడినది. 
ఈనాటి మొదటి పఠనములో దేవుడు 70 మీద ఆత్మను కుమ్మరించే విధానమును చూస్తున్నాము. ఎందుకు ఇలా 70 మందిని ఎన్నుకున్నారు అంటే సంఖ్యా 11:  14వ వచనములో మోషే తన యొక్క భాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రజల బాగోగులను పరామర్శించే భాద్యత తాను ఒక్కడే భరించలేనని, అందరికి పరిచర్య చేయుటకు కష్టముగా ఉంది కాబట్టి దేవుడిని అడుగుతున్నారు. దేవుడు ఎన్నుకునే వారందరు కూడా ఎలాంటి వారో 16 వ వచనంలో చూస్తున్నాము. వారు ప్రజలచేత గౌరవవింపబడేవారు, సమాజములో మంచి పేరున్నవారు, ప్రార్ధించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. దేవుని యొక్క అభిషేకము ఎంత గొప్పదో ఈరోజు మొదటి పఠనము ద్వారా వింటున్నాము. దేవుడు మోషేకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కొంత తీసుకుని మిగతావారికి ఇస్తున్నారు. మోషే ప్రవక్త ఆత్మను స్వీకరించుట ద్వారా పొందిన శక్తులు:
నత్తివాడు అయినా ప్రవచించాడు 
అనేక లక్షల మందిని నడిపించగలిగాడు 
ఫరో ముందు ధైర్యముగా నిలబడ్డాడు
దేవునితో మాట్లాడాడు 
ప్రజలతో ప్రేమగా మెలిగాడు
అనేక అద్భుతాలు చేసాడు 
ఇవన్నీ మోషే దేవుని యొక్క ఆత్మను పొందిన తర్వాత చేసిన పనులే. మోషే డెబ్బది మందిని సమావేశము అవ్వమని చెప్పినప్పుడు అరవై ఎనిమిది మంది మాత్రమే గుడారము వద్ద సమావేశమయ్యారు. వారిలో ఇద్దరు ఎల్దాదు, మేదాదు శిబిరములోనే ఉన్నారు. అయినప్పటికీ వారు కూడా దేవుని యొక్క ఆత్మను పొందారు. ఎందుకంటే అది దేవుని చిత్తము, వారు కూడా ఎన్నుకొనబడినవారే. ఒక్కసారిగా ఆత్మను పొందినప్పుడు వారిలో జరిగిన మార్పు చాల గొప్పది. వెంటనే ప్రవచనాలు పలుకుచున్నారు. పాపులను పుణ్యాత్ములుగా చేస్తుంది దేవుని ఆత్మ. భయస్తులను భయము లేకుండా చేస్తుంది దేవుని ఆత్మ. ఏమిలేనటటువంటి వారిని దేవుని సేవలో గొప్పవారిగా చేస్తుంది దేవుని ఆత్మ.  1 కొరింతి 12 :28 - దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దయచేసారు. యేసు ప్రభువు యొక్క శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వెంటనే ప్రవచించడము ప్రారంభించారు, భయము వదిలేశారు. అపో 2:8-
దేవుని కోసము మరణించడానికి సైతం సిద్దముగా ఉన్నారు.
దేవుని ఆత్మ వారిని నడిపించింది 
దేవుని ఆత్మ వారిని ప్రేరేపించింది 
దేవుని ఆత్మ వారితో మాట్లాడించింది 
దేవుని ఆత్మ వారితో అద్భుతాలు చేయించింది 
దేవుని ఆత్మ వారితో పరలోక విషయాలు బోధించింది
ఈ యొక్క ఆత్మను మనమందరము మన జీవితములో జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా, గురుపట్టాభిషేకము ద్వారా కలిగి ఉన్నాము, కాబట్టి మనము కూడా ప్రవచించాలి. వీరు దేవుని యొక్క ఆత్మను పొందినది వారి కోసము కాదు, పరుల కోసము. ఇరుగుపొరుగువారికి సేవచేయడము కోసము. పొరుగు వారిని పరామర్శించటము కోసము, వారిని సన్మార్గములో నడిపించడము కోసము. ఈ డెబ్బది మంది ఎన్నుకొనబడినది దేవుని ప్రతినిధులుగా ఉండటం కోసమే. మోషే తనకు భారముగా ఉందని చెప్పినప్పుడు తన భారము తగ్గించుటకు అలాగే ఇతరులు కూడా దేవుని సేవకు వినియోగించబడాలని ప్రభువు ఇలా చేసారు. ఇద్దరు గుడారములోనే ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఎట్టి పరిస్థితులలో రాలేదో వివరించలేదు, బహుశా అనారోగ్యముతో ఉండవచ్చు లేదా ఇంకేదైనా అయ్యి ఉండవచ్చు దేవుడు వారిని ఎన్నుకొన్నారు. అప్పుడు వెంటనే బలవంతులగుచున్నారు. అది దేవుని యొక్క ఆత్మ శక్తి.
తన మీద ఉన్న ప్రేమ చేత యెహోషువ అసూయపడి మోషేతో ఎల్దాదు, మేదాదు అనువారిని ప్రవచించటము ఆపివేయమని చెప్పారు. ఇది కేవలము అసూయ వల్ల జరిగినది. దేవుని యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉంటుందని యేసు ప్రభువు వలె మోషేకు కూడా తెలుసు. దేవుడు మనలను ఎన్నుకున్నది, దీవించినది కేవలము మన కోసమే కాదు, ఇతరుల కోసము కూడా.  దేవునిపై ఎవరికీ హక్కు లేదు, అలాగే ఏ ఒక్కరి ద్వారానో లేక ఏ ఒక్క ప్రజ ద్వారానో మాత్రమే పనిచేయాలని కట్టడి దేవునిపై ఉండదు. అందరు సువార్త ప్రచారము చేస్తే దేవుని రాజ్యము సులువుగా ఉంటుందని చెబుతున్నారు. 
రెండవ పఠనములో యాకోబు గారు ధనవంతులందరిని హెచ్చరిస్తున్నారు. ధనవంతులు పేదవారి పట్ల న్యాయముగా ఉండాలని తెలియజేస్తుంది ఈనాటి రెండవ పఠనము. ధనికుడు పేదవాని యొక్క శ్రమను వినియోగించుకుని ధనము కూడబెట్టుకుంటున్నాడు. ఆ పేదవాని యొక్క ఆక్రందన దేవుని చేరుతుంది. బంగారము వెండి తుప్పు పట్టే వస్తువులు కావు. అయినా యాకోబు గారు తుప్పు పడతాయి అంటున్నారు. అంటే ధనికులు సంపాదించే బంగారము, వెండి అశాశ్వితమైనవి. దేవుని దృష్టిలో అవి నిరుపయోగము. అలాంటి పాడయ్యే వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి పేదలను నిలువు దోపిడీ చేస్తే దేవుని శిక్షకు గురవుతారు అని తెలుపుచున్నారు. దేవుడు ఇచ్చిన ధనముతో పేదలకు సహాయము చేసి ఆదుకోవాలి. యేసు ప్రభువు కూడా పేదవారి పట్ల ప్రేమతో మెలిగారు.
    ఈనాటి సువిశేష పఠనములో యేసు ప్రభువు యొక్క శిష్యులలో భాగస్థుడు కాని ఒక వ్యక్తి సేవను శిష్యులు నిషేదించిన విధానము గురించి వింటున్నాము. అపొస్తలులు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి, దేవుని ప్రేమను పంచుట వారికి మాత్రమే పరిమితమైనది భావించారు. వాక్యాన్ని ప్రకటించడానికి, దయ్యాలు వెడలగొట్టడానికి వారికి మాత్రమే అధికారము ఇవ్వబడినది అని భావించారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు తనతో, తన కొరకు జీవించే ఏ వ్యక్తి అయినా సువార్త ప్రకటన చేయవచ్చు అని తేటతెల్లము చేస్తున్నారు. యోహాను గారు అసూయపడుచున్నారు దేవుని మీద ఉన్న ప్రేమ వలన. మొదటి పఠనములో మోషే ప్రేమించిన శిష్యుడు అలాగే అసూయపడ్డాడు. అదేవిధముగా సువిశేషములో యేసు ప్రేమించిన శిష్యుడు కూడా అసూయపడ్డాడు. ఈ సువార్త ప్రకటన చేసే వ్యక్తిని మనము అభినందించాలి. అయన విన్నది, చూసినది, తెలుసుకున్నది నలుగురితో పంచుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటున్నాడు. దేవునిచే ప్రేరేపించబడ్డాడు. దేవుడు ఆయనను ప్రత్యేకముగా ఆ పనికోసం పిలవలేదు. అయినప్పటికీ యేసు ప్రభువు గొప్పతనము తెలియాలని, దేవుని రాజ్యస్థాపన జరగాలని తపనతో అయన ఈ సువార్త వ్యాప్తి కోసము కష్టపడ్డారు. ఈరోజు ప్రతిఒక్కరు కూడ చేయవలసినది ఇదే . దేవుని యొక్క నామమును చాటిచెప్పాలి. ఆయన గురించి భోదించాలి. ఈ వ్యక్తికి దేవుని భోదించాలి అనే ఘాడమైన కోరిక ఉంది ఉండవచ్చు. 
    దేవుని యొక్క సేవకులను గుర్తించి సహాయము చేస్తే వారికి బహుమానము దొరుకుతుందని చెబుతున్నారు. ఇది చాల సందర్భాలలో చూస్తున్నాము. ఆనాడు అబ్రహాము ముగ్గురు మనుజులను గుర్తించి వారికి సేవ చేసారు., ఆయన దీవించబడ్డాడు (ఆది 18:1-2). ఎలీషాకు షూనేము పట్టణములో ఉన్న సంపన్నురాలు వారికి ఆతిథ్యము ఇచ్చింది దేవుడు ఆమెను దీవించారు. (2రాజుల 4: 8,17) పేతురు ఆతిధ్యము ఇచ్చారు, ఆయన అత్త స్వస్థత పొందినది. ఏలీయాకు సహాయము చేసిన వితంతువు దీవించబడినది. అలాగే మనము కూడా దైవ సేవకులను ఎంతగా ఆదరిస్తే వారు అంతగా మనందరి కోసము ప్రార్థిస్తారు. కాబట్టి దైవ సేవకులకు సహాయము చేయమని ప్రభువు పలుకుతున్నారు. సువిశేష రెండవ భాగములో మనము ఇతరులు పాపము చేయుటకు కారణముగా ఉండకూడదు అని తెలుపుచున్నారు. ఇతరులు మన వల్ల పాపము చేయకూడదు. అసహనం, అసూయవల్ల ఎవరు చిన్నబిడ్డలకు దుర్మాత్రుకగా మారకూడదు. ఇక్కడ చిన్నబిడ్డలంటే చిన్న పిల్లలు కావచ్చు లేదా విశ్వాసపరముగా ప్రారంభ దశలో ఉన్నవారు కావచ్చు, లేదా విశ్వాసములో బలహీనంగా ఉన్నవారు కావచ్చు. ప్రభువు యొక్క ఉద్దేశమేమిటంటే విశ్వాసపరముగా గుర్తింపు ఉన్న పెద్దలు అప్పుడే కొత్తగా విశ్వాసము స్వీకరించి అభివృద్ధి చెందుతున్న వారికి కొన్నిసార్లు పాత విశ్వాసుల దురలవాట్ల వల్ల కొత్తవారి యొక్క ఎదుగుదల ఆటంకంగా మారే  ప్రమాదం ఉందని ప్రభువు తెలుపుచున్నారు.  చాల సందర్భాలలో కొంతమంది ఇతరులను పాపము చేయుటకు ప్రేరేపిస్తారు: 
తల్లిదండ్రులు కావచ్చు
స్నేహితులు కావచ్చు
పెద్దవారు కావచ్చు
ప్రేయసి ప్రియుడు కావచ్చు
    ప్రభువు అంటున్నారు, నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని పెరికివేయమని. చేతుల ద్వారా చేసే పాపము - తాకుట, పట్టుకోవడము, లాగుకోవటం, వ్రేలెత్తి చూపుట, కొట్టుట, దొంగిలించుట. మన చేతులతో పాపము చేయుటకన్నా, పాపము చేయకుండా జీవించుటయే మేలు అని చెబుతున్నారు. కళ్ళతో చేసే పాపము - పాపము చేసే స్థలములో ఉండటం ద్వారా, పాపము చేయటానికి వెళ్ళడము ద్వారా, తన్నుట ద్వారా ఇలా మనము పాపము చేస్తాము. ఇలాగ కాళ్ళుండి పాపము చేయుటకన్నా మాములుగా మంచి జీవితము జీవిస్తూ పరలోకము చేరమని ప్రభువు తెలుపుచున్నారు. అలాగే కంటితో చేసే పాపాలు - చూడటము ద్వారా, చూడకూడనటువంటివి చూడటము ద్వారానే మనలో ఆశ కలుగుతుంది. ఈ లోక ఆశలకు గురియై పాపము చేస్తాము కాబట్టి మన యొక్క దేవుడు ఇచ్చిన ప్రతి యొక్క అవయవమును పాపము చేయుటకు కాకా పుణ్యము చేయుటకు వినియోగించాలి. మనమందరము ఆత్మచే నింపబడ్డాము, కాబట్టి దేవుని సేవ చేస్తూ దేవుని రాజ్య స్థాపన కోసము కృషి చేద్దాము. 
ఆమెన్.......... 
By Rev.Fr. BalaYesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...