25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

8 వ సామాన్య ఆదివారం

 మనిషి మాటే  - మనస్సు బాట 

సీరా 27:4-7, 1 కోరింథీ 15:54-58 లూకా 6:39-45 

క్రీస్తునాధుని యందు  ప్రియమైన దేవుని బిడ్డలారా , ఈనాడు తల్లి శ్రీ సభ  మనలను 8 వ ఆదివారం లోనికి ఆహ్వానిస్తుంది. ఈ నాటి పరిశుద్ద గ్రంధ పఠనములు ద్వారా మనకు ఇచ్చిన సందేశం మనిషి మాట ద్వారా మనస్సును తెలుసుకోవచ్చు అని మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. 

మొదటి పఠనం :- ఈనాటి మొదటి పఠనంలో మనిషి మాటకు -మనిషి మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియ చేస్తుంది. మనిషి మనస్సును మనం చూడలేముం వినలేము కానీ మనిషి మాట మనకు వినిపిస్తుంది. కనుక మనిషి మాటలే మనకు అతని మనస్సును మనకు తెలియ జేస్తాయి. మనిషి మనస్సు, గుణం, శీలం మనిషి మాటల ద్వారం ఏ విధంగా బయటపడతాయో ఈనాటి మొదటి పఠనం మనకు తెలియ జేస్తుంది. 

ఊపిన జల్లెడ- కుమ్మరి చేసిన కుండ, చెట్టు కాపు అనే మూడు ఉపమానములు చెబుతూ మనిషి యొక్క  హృదయనంతరంగమును తెలుసుకొనుటకు అతని మాటలే అని తెలియజేస్తున్నడు. కనుక ఏ నరున్ని అతన్ని మాట్లాడకముందు స్తుతించరాదు. 

1. ఊపిన జల్లేదలో మట్టి పెళ్లలు మిగులునట్లే మనిషి సంభాషణమున దోషములు కనిపించును మనిషి మనస్సులోని దోషములు  మాలిన్యాము. స్వార్ధము అతని మాటలలలోనే బయటపడుతాయి. 

2. కుమ్మరి చేసిన కుండకు అగ్ని పరీక్ష అవసరం, అగ్నిలో కాల్చబడాలి. అలాగే మనిషికి పరీక్ష అతడి మాటలే. 

3. చెట్టు కాపును బట్టి అదెంత  బలమైనదో ఊహించవచ్చు అలాగే మాట తీరును బట్టి అతడు మంచి వాడా , చెడ్డ వాడ అని అర్ధం చేసుకోవచ్చు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలుసుకుంటారు. పండు మంచిదైతేనే చెట్టు మంచిదని, పండు చెడ్డదైతే చెట్టు మంచిది కాదని ఎలా అనుకుంటామో అలాగే మనిషి మాటలను బట్టి అతను ఎలాంటి వాడు, అతని స్వభావం ఏమిటి అని తెలిసిపోతుంది. 

మనిషికి ఉన్న మాట దేవుడిచ్చిన వరం. ఆ వరంతో దేవుడిని స్తుతించడానికి, ఇతరులకు తెలియచేయడానికి ఇతరులతో స్నేహ బంధాలు ఏర్పరుచుకొని వారితో శాంతి, సమాదానంతో జీవించడానికి వినియోగిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చే వరములను సద్వినియోగం చేసుకుంటే వారి జీవితం దేవునిలో వర్ధిల్లుతుందని, దానిని దుర్వినియోగం చేసుకుంటే జీవితం పాడైపోతుంది. 

మనిషికి మాట శుద్ది ఎంతో అవసరం : - 

మన హృదయం పవిత్రంగా ఉంటే మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి. మన హృదయంలో  స్వార్ధము, కోపము, అసూయ,పగ, దురాశ ఉంటే మన మాటలు, చేతలు, ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. 

మన మాటలు మన హృదయాన్ని బహిర్గతం చేస్తాయి. our speach reveals our heart. తల్లి మాటలను బట్టి బిడ్డను ఎంత ప్రేమిస్తుందో అర్ధంచేసుకోవచ్చు.  ఇతరులు మాట్లాడే విధానమును బట్టి వారు అభిమానంతో , ప్రేమతో మాట్లాడుతున్నారా? లేదా అని అర్ధం చేసుకోవచ్చు. 

మనిషి నీతి న్యాయముతో కూడిన మాటలు ఆనందము, సంతోషముతో కూడిన మాటలు ఓదార్పు,సహనం ,ప్రోత్సాహపు మాటలు, శాంతికరమైన మాటలు, క్షమించమని అడిగేమాటలు దేవుని బిడ్డల నుండి వస్తాయి. మనము కూడా అలాంటి  వారికే ప్రాముఖ్యతను  ఇచ్చి వారినీ ఇష్ట పడటమే కాదు వారి వలె ఉండటానికి ప్రయత్నించాలి. అబద్దపు మాటలు చాడీలు , గొడవలు పెట్టె మాటలు, బూతు మాటలు ఇతన్నింటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. "ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాదానం ఇవ్వవలసి ఉన్నది."మత్తయి 12:36 . అదే విధంగా నీ మాటలు బట్టి నీవు దోషివో , నిర్ధోషివో కాగలవు (మత్తయి 12:37). మన మాటలు మనం వ్యక్తిత్వాన్ని, మనస్సును తెలియ చేస్తాయి. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు గారు చెప్పిన మూడు ద్వారములు : మనం నోటి మాట మూడు ద్వారములు దాటి బయటకు రావాలి, 1. మనము చెప్పే మాట నిజమేనా, 2. మనము చెప్పే మాట అవసరమేనా  మరియు 3. మనము చెప్పే మాట ఉపయోగమేనా. మన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెళువడును(లూకా 6:45). 

రెండవ పఠనం :-  1 కోరింథీ 15:54-58 

ఈనాటి రెండవ పఠనాన్ని  ధ్యానించుకుందాం. ప్రియమైన  స్నేహితులారా  రెండవ పఠనంలో పునీత పౌలుగారు కోరింథీ  ప్రజలతో మాటలాడుతున్న  మాటలు  మనం శ్రద్దగా పరిశీలిస్తే, ఆయన ఆ ప్రజలకు దేవునితో ఉండటానికిధైర్యాన్ని ఇస్తున్నారు. 1 కోరింథీ 15:58 వ వచనంలో మూడు ముఖ్యమైన మాటలను కోరింతి ప్రజలకు చెపుతూ మనోధైర్యాన్ని, దేవుని యందు ధృడత్వాన్ని వారికి అందిస్తున్నాడు. ఆ మూడు విషయాలను తమ జీవితంలో నెరవేరిస్తే  దేవునిలో నిలబడగలవు అంటున్నారు. ఆ మూడు విషయాలు  మొదటిది ప్రియతమ సోదరులారా , దేవుని బిడ్డలారా దేవునిలో ధృడముగా, స్థిరముగా నిలబడుడు అని అంటున్నారు. అంటే మనం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినను భాదలు వచ్చినను ఇబ్బందులకు గురి అయినను దేవుని  యెడల అపారమైన ప్రేమ, నమ్మకము , విశ్వాసము కలిగి ఉండమంటున్నారు. భౌతికమైన మన శరీరానికి అమరమైన క్రీస్తుని ధరించి ఆయనతో స్థిరంగా నిలబడమంటున్నారు పౌలుగారు. 

రెండవదిగా ప్రభువు కార్యములలో సర్వదా శ్రద్ద చూపుడు. ఈ మాటలకు అర్దం దేవునియొక్క పనులలో సంఘం యొక్క నడిపింపులో , దైవ జనులకు సహాయము చేయుటలో ప్రభువునకు సంభందించిన పనులు చేయుటకు ముందుండి ఆ దేవుని దైవత్వంలో పాలి భాగస్తులై ఉండమంటున్నారు. ఆత్మలను దైవ సన్నదికి నడిపించ ప్రభు సేవలో ప్రభుని కార్యములో సర్వదా శ్రద్ద చూపుచు ఈ లోక వ్యామోహాలకు, ఈలోక  విషయాలకు నీ హృదిలో చోటు ఇవ్వక ప్రభువునకు సంభందించిన ప్రతికార్యములో శ్రద్ద చూపాలని పౌలుగారు పలుకుతున్నారు. ఇక , మూడవదిగా ఈ రెండు కార్యములను నీ హృదయ పూర్వకముగా చేసిన యెడల మీరు చేసే ఎట్టి కార్యాలు నిష్ప్రయోజనం కాదని పౌలుగారు పలుకుతున్నారు. 

సువిశేషం :- లూకా 6: 39-45 

ఈనాటి సువిశేషంలో కూడా మొదటి పఠనంలో చూసిన విధంగా వృక్షములను బట్టి దాని ఫలములుండును. అదే విధముగా ఒక మనుజుని మాటలు ఆయన తలంపులను బయలుపరచుచుండు సిరా 27:6 లో చూస్తున్నాం. సువిశేషంలో ప్రభుని మాటలు  "మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. లూకా 6:43. పండుని బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు. కోరింద పొదలనుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును. దుర్జనుడు తన దుశ్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును.  "ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. లూకా 6:43-45. 

మనం మాట్లాడే మాటలు మన హృదయం నుండి వస్తు వుంటాయి. మన అంతరంగం పవిత్రంగా ఉంటే మన మాటలుకూడా మంచిగా ఉంటాయి. మన హృదయంలో స్వార్ధం, క్రోధం, అసూయ , పగ , దురాశలు  ఉన్నప్పుడు మన యొక్క మాటలు, చేతలు ప్రవర్తన, నడవడిక అసభ్యంగా ఉంటాయి. అవినీతిగా ఉంటాయి. దురాశలతో నిండిన హృదయం నుండి మంచి మాటలు, చేతలు ఉద్భవించవు. మన ఆంతరంగిక జీవితానికి బహిరంగ ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిసయ్యుల బహిరంగ ప్రవర్తనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. వారికి మాటలు , చేతలు చట్ట పరంగా ఉంటే చాలు. ఆంతరంగిక ఉద్దేశాలు, బావాలు ఎలా ఉన్నా పర్వలేదు. యేసు ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఈ పఠనములోని వచనాలు పలికారు. వారి యొక్క చెడు డాంబిక ప్రవర్తనను, భక్తి  కార్యాలను యేసు ఖండించారు. ప్రజల పొగడ్తలకై ఎన్నో చేశారు కానీ హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించలేదు. వారు పెదవులతో దేవుని ఆరాధించేరే కాని వారి హృదయాలు ఆయనకు ఎంతో దూరంగా ఉన్నాయి. వారి కార్యలన్నీ చెట్ల పండ్లు వంటివే. ఎందుకంటే అవి అన్నీ వారి హృదయంతరిక భక్తి హీనత నుండి, అవినీతి నుండి ఉద్భవిస్తాయి. మానవుని యొక్క మాటకు, కార్యనికి  విలువను ఇచ్చేది అతని ఉద్దేశం. 

మన అంతరంగం పరిశుద్దంగా ఉన్నపుడే మన మాటలు కార్యాలు దేవునికి ప్రీతికరంగా ఉంటాయి. క్రైస్తవులమైన మనము అనేక సార్లు ఆ పరిసయ్యుల వలె ప్రవర్తిస్తుంటాము. మన హృదయం అవినీతిలో,దురాశలతో నిండి ఉన్నప్పుడు పరిసయ్యుల వలె కాక మన హృదయాన్ని పరిశుద్ద పరచుకొని ఇతరులకు మార్గదర్శులం అవ్వాలి. అనగా క్రైస్తవుని హృదయంలో మన హృదయంలో పవిత్రత, నీతి , న్యాయం, ప్రేమ ,శాంతి ,సమాదానం, ఆనందం సహకారం  మొదలైనవన్ని నెలకొంటాయి, అప్పుడు మానవుడు పలికే ప్రతిమాట నిజమైన క్రైస్తవ స్వభావాన్ని నిరూపించగలదు. 

ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా హృదయ పరిపూర్ణత, పరిశుద్దత నుండే నోటి మాట వస్తుంది. లూకా 6:45. కాబట్టి మన హృదయాన్ని నిరంతరం (శుద్ది) ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే మన ఆలోచన ,మాట , యుక్తవిధంగా ఉంటాయి. పది మందికి ఉపయోగపడుతాయి. 

Br. Manoj 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...