23, డిసెంబర్ 2022, శుక్రవారం

 

క్రీస్తు జయంతి పండుగ

యెషయా 9:1-6

తీతు 2:11-14

లూకా 2:1-14

 

క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఒక రక్షకుడు ఈ భూమి మీదకు కాలు మోపిన గొప్ప రోజు క్రీస్తు జయంతి. ప్రజలకై, ప్రజలతో ఉండుటకై దేవుడు మానవుడైనా వేళ.

ఈ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కలసిమెలసి చేసుకునే ఒక పండుగా ఇది.

అందరికీ ఈస్టర్ పండుగ అంటే గుర్తుంటుందో లేదో కానీ డిసెంబర్ 25 అంటే అందరికీ గుర్తుంటుంది.

అన్ని దేశాలు జరుపుకునే పండుగ ఇది. సాధారణంగా ఎవరిదైన పుట్టినరోజు అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో దేశానికో పరిమితమై ఉంటుంది కానీ క్రీస్తు ప్రభువు యొక్క పుట్టినరోజు ఈ ప్రపంచానికి సమస్తమునకు చెందినటువంటిది అందరికోసం రక్షకుడు జన్మించారు. అందరూ జరుపుకుంటారు - లూకా 2: 11.

క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సృష్టిలో దేవుడు మానవుని చేసినప్పుడు తన రూపం ఇచ్చారు, తన శ్వాస నిచ్చారు, తన యొక్క దైవత్వం మానవునికి ఇచ్చారు, పాపం చేయటం ద్వారా మానవుడు దేవునితో ఉన్న స్నేహమును ప్రేమను, బంధంను కోల్పోయారు. తనలో ఉన్న దైవత్వపు లక్షణాలు మానవుడు కోల్పోయాడు, దేవుడు మరల వాటిని మానవునికి తిరిగి ఇవ్వటానికి మనుష్యవతారం ఎత్తుతున్నారు.

ఇది ఒక గొప్ప పరమ రహస్యం, దేవుడు భూమిపై ఉన్న సమస్త మానవాళికి అందజేసిన ఒక గొప్ప వరం. స్వయానా  దేవుడు మనకు బహుకరించిన ఒక గొప్ప కానుక. మనం అడిగితే దేవుడు తన కుమారుడిని ఇవ్వలేదు. మనం అడగకుండానే మన కొరకు ఆదియు అంతమునైన తన కుమారుడిని మనందరి రక్షణార్థం కొరకు దేవుడు ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఇది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే పూర్వం దేవుడిని ఎవ్వరూ మన రూపంలో చూడలేదు, సృష్టిలో మొట్టమొదటిసారిగా దేవుడు మనలాగా మారారు, మనలాగా తల్లి ఒడిలో పవళించారు, తల్లిపాలతో పోషింపబడ్డారు, ఎంతో గొప్ప దేవుడైనప్పటికిని తనను తాను సామాన్యునిగా చేసుకున్నారు.

క్రిస్మస్ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతున్న రాత్రి, ఆది తల్లిదండ్రులు పాపం చేసిన తరువాత దేవుడు తన ఏకైక కుమారుని పంపించాలని నిర్ణయించుకున్నారు, అందుకే కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు - గలతీ 4:4.

క్రీస్తు జననం దేవుని మానవునికి దగ్గరకు తీసుకొని వచ్చింది. పరలోకంలో ఉండే దేవుడు మనతో ఉండటానికి వేంచేసిన వేళ ఇది.

ఇది ఒక ఆనందంతో కూడిన రాత్రి. దాదాపు ఈ ప్రపంచంలో అనేకమంది నిద్రిస్తున్న అర్ధరాత్రి వేళలో మనం ఈ సమయం దేవునితో గడుపుతున్నాం. మనకై వచ్చిన దేవుని కలుసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక శాంతి కరమైన రాత్రి ఎందుకంటే శాంతిని ఒసగే రారాజు జన్మిస్తున్నాడు.

ప్రతి ఒక్కరి పుట్టినరోజు మనకు ఎంతో సంతోషం ఇస్తుంది, చరిత్రలో ఆ రోజును ఎప్పుడూ గుర్తుంచుకొని ఉంటాం. దేవుని పుట్టినరోజు ప్రత్యేకం ఎందుకంటే దేవుడు మానవ చరిత్రలోనికి వస్తున్నారు.

ఏసుప్రభు యొక్క పుట్టినరోజు ప్రత్యేకం. చరిత్రలో ఎవరి పుట్టినరోజు గురించి కూడా వేల సంవత్సరాలు ముందుగా ప్రవశింపబడలేదు.

చరిత్రలో చాలామంది మహనీయులు, పేరు ప్రఖ్యాతలుగాంచిన వారు ఉన్నారు, బుద్ధుడు, గాంధీ, మహమ్మద్... ఇలా చాలామంది ఉన్నారు కానీ వీరెవ్వరు పుట్టుక గురించి ముందుగా చెప్పబడలేదు. కేవలం క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి ముందుగా చెప్పబడింది - యెషయా 7:14, 9:6-7, మీకా 5:2.

ఏసుక్రీస్తు ప్రభువు తన యొక్క పుట్టుకతో మనందరికీ ఎన్నో గొప్ప విషయాలు నేర్పిస్తున్నారు. తాను ఈ లోకంలో జన్మించినది మనలను రక్షించుట కొరకే మనలను పరలోకం చేర్చుట కొరకై.

ఒక పేదవారి కుటుంబం క్రిస్మస్ చేసుకొనే సందర్భంలో ఆ కుటుంబం మీదగా ఒక విమానం పోయే సమయంలో తల్లి తన బిడ్డలతో చెప్తుంది విమానంలో మీ నాన్న ఉన్నారు నాన్నకు టాటా చెప్పమని అక్కడ ఉన్న చిన్నపిల్లవాడు తల్లిని అడుగుచున్నాడు అమ్మ ఆకాశంలో తిరిగే విమానం లోనికి నాన్న ఎలా వెళ్ళగలిగారు అని అప్పుడు ఆ తల్లి తన బిడ్డతో ఈ విధంగా అంటుంది ఆకాశంలో తిరిగి విమానం భూమి మీదకు వచ్చి వారిని ఆకాశంలోనికి తీసుకొని వెళుతుందని చెప్పారు. అది ఏ క్రిస్మస్ సందేశం.

మనందరిని పరలోకం చేర్చుటకు, మనందరికీ తండ్రి ప్రేమను దయను, తెలియచేయుటకు ఏసుప్రభువు ఈ లోకానికి వచ్చారు.

అందరూ ఈ లోకానికి జీవించటానికి వస్తే యేసు ప్రభువు మాత్రము ఈ లోకానికి మరణించటానికి వచ్చారు.

ఏసుప్రభు యొక్క జననం మన అందరి యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుంది.

1. మనందరం మంచి స్థలంలో జన్మించాలనుకుంటే ఆయన మాత్రం పశువుల పాకలో జన్మించారు.

2. సమస్తమును ఒక్క మాటతో చేసిన దేవుడు ఇప్పుడు ఏమీ మాట్లాడని పసి బిడ్డగా  మరియు తల్లి గర్భం మందు జన్మించారు.

3. సూర్యుని వేడిని చేసిన గొప్ప దేవుడు మరియ తల్లి యొక్క ఒడిలో వెచ్చదనంను పొందుతున్నారు.

4. ఎవరైతే సమస్తమును తన కౌగిలిలో ఉంచుకున్నారో వారి ఇప్పుడు మరి తల్లి యొక్క కౌగిలిలో ఉన్నారు (one who embraces everything is now embraced by mother Mary).

5. ఎడారిలో సైతం తన ప్రజలను పోషించిన జీవాహారం ఇప్పుడు మరియ తల్లి యొక్క పాల ద్వారా పోషింపబడుతున్నారు.

6. ఈ ప్రపంచమే మోయచాలని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది. ఏసుప్రభువు తనను తాను తగ్గించుకొని మరియమ్మగారి గర్భమందు శరీర రక్తములను స్వీకరించారు.

7. సృష్టిని చేసిన దేవుడు సృష్టిలో సమస్తమునకు స్థానం కల్పించిన దేవుని పుట్టికై ఈ లోకంలో ఒక మంచి స్థలం లేకుండను.

8. ఈ లోకంలో ఆయన తనను తాను తగ్గించుకొని జీవిస్తే మనం మాత్రము ఈ ప్రపంచంలో మన యొక్క అధికారమును, కీర్తిని, ప్రతిష్టలను, ఆస్తి ఆస్తులను, చూపించు కోవాలనుకుంటున్నాం.

ప్రభువు యొక్క జననం మన యొక్క ఆలోచనలను చాలా తలక్రిందులుగా చేస్తుంది . మహిమను వైభవమును నిత్యము అనుభవించే దేవుడు సేవలందికొనే దేవుడు ఇప్పుడు సేవింపబడుటలేదు, సేవ చేయటానికి ఈ లోకంలోనికి జన్మించారు.

ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు చేసిన విధంగా మనం చేయగలమా? ఇది మనందరికీ ఒక గొప్ప సవాలు.

ఏసుప్రభువు ఈ భూలోకంలోనికి మానవునిగా జన్మించినప్పుడు ఆయన అప్పటి యొక్క విధులు విధానాలు ఆచారాలు సంప్రదాయాలు పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలి. విద్య నేర్చుకోవాలి ఇంకొక్క ప్రపంచంలో జీవించాలి.

ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు బోధించిన దేవుడు ఇప్పుడు ఇవన్నీ మన మధ్య పాటించాలంటే ఎంతగా ఏసుప్రభు నేర్చుకోవాలో, ఎంతగా ఆయన సర్దుకొని పోవాలో మనం గమనించాలి.

పాపుల మధ్య జీవించుట విధేయత చూపించుట ఆకలి దప్పులను అనుభవించటం అన్ని పాటించడానికి ఏసుప్రభువు సిద్ధమై ఈ లోకానికి వచ్చారు.

నేడు మనందరం ఏసుప్రభు యొక్క జననం ను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన వలే మనం మారాలి.

అనంతరం ఒక్కసారి పశువుల పాక గురించి ధ్యానించుకోవాలి. పశువుల పాకలలో ఏడుగురిని ప్రధానంగా చూస్తున్నాం .ఈరోజు వీరి గురించి ధ్యానించి మనం కూడా వారిలా మారినప్పుడే ఈ ఈ క్రిస్మస్ కు మంచి అర్థం ఉంటుంది.

1. ఏసుప్రభు - బాల యేసు

2. మరియా తల్లి

3. యోసేపు

4. పరలోక దూతలు

5. గొర్రెల కాపరులు

6. జ్ఞానులు

7. నక్షత్రం

1. బాల యేసు - పూర్వము దేవుని మనుష్యవతారమున ఎవరు ఎన్నడూ చూడలేదు - యోహాను ,1:18.

పాపంలో పడే పోయినా మనుషులను తిరిగి రక్షించుటకు తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపిస్తున్నారు.

ఎందరో ప్రవక్తలు చూడాలనుకున్నది, దర్శించాలనుకున్నది, ఎందరో వినాలనుకున్నది, క్రీస్తు ప్రభువు యొక్క జననం లో సాధ్యమైంది.

క్రీస్తు ప్రభువు మనందరిలాగా ఒక కుటుంబంలో జన్మించారు, ఏసుప్రభువుకు ఒక కుటుంబం కావాలి ఆ కుటుంబమే యోసేపు మరియమ్మ గార్ల కుటుంబం. మనలాంటి కుటుంబాన్ని మనలాంటి పరిస్థితులని మనలాంటి సంతోష బాధలని ఏసుప్రభువు ఈ లోకంలో అనుభవించదలిచారు.

ఏసుప్రభు పశువుల పాకలో అద్దాంతరంగా జన్మించలేదు. ఇది దేవుడే స్వయంగా ఎన్నుకున్నటువంటి స్థలం.

ఏసుప్రభువు పుట్టినప్పటినుంచి చివరి వరకు తనకంటూ తాను ఏమీ పెట్టుకోలేదు.ఆయన జన్మించినప్పుడు వేరే వారి పశువుల పాకను అప్పుగా తీసుకున్నారు.

ఆయన పరిచర్య అప్పుడు తలదాచుకొనుటకు స్థలం లేదు.- మత్తయి 8:19-20.

సముద్రంలో  ప్రయాణమునకు పేతురు పడవను తీసుకున్నారు. లూకా 5:1-11.

యెరూషలేము లో  ఇతరుల యొక్క గాడిదను బదులుగా సహాయంగా తీసుకున్నారు. మార్కు 11:1-11.

చివరికి ఆయన మరణించినప్పుడు వేరే వారి యొక్క సమాధిని వినియోగించారు. మత్తయి 27:57-61.

ఏసుప్రభు తనను తాను రక్షించుకొనే శక్తి కలిగిన దేవుడు అయినప్పటికీ ప్రభువు మొత్తము చిన్ననాటి నుండి మరణ పునరుత్థానము వరకు తండ్రి మీదనే ఆధారపడి ఉన్నారు, తండ్రి ప్రేమను మనందరికీ పంచారు, తండ్రికి విజయత చూపారు.

తండ్రి మీద, మన మీద ఉన్న ప్రేమ వలన, ప్రభువు సమస్తమును భరించారు. అందుకే పౌలు గారు దైవ ప్రేమ గురించి తెలిపినప్పుడు ప్రేమ సమస్తమును భరించెను అనే పలికారు. 1 కొరింతి 13:7.

దేవుడు మనతో ఉండటానికి వచ్చారు, మనలను వెదకీ రక్షించడానికి వచ్చారు, మనల్ని క్షమించటానికి, స్వస్థత పరచటానికి, మనలను సంతోషపరచటానికి, ప్రేమించడానికి నడిపించడానికి వచ్చారు, కాబట్టి ప్రభువు యొక్క గొప్ప జీవితంలో అనుసరించాలి.

2. మరియ తల్లి:

దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక గొప్ప మాతృమూర్తి. దేవుడు మరియ తల్లిని తన తల్లిగా ఎన్నుకొన్నారంటే ఆమె ఎంత గొప్ప పవిత్రాత్పురాలు, ఎన్నో సుగుణాలు ఆమెలో ఉన్నాయో అందరూ ధ్యానం  చేసుకోవాలి.

పాత నిబంధన గ్రంథం యొక్క బోధనబట్టి ఒక స్త్రీ వృద్ధాప్యంలో శిశువును కంటే ఆ శిశువు దేవుని పని కోసం పిలువబడ్డ వ్యక్తి అని నమ్మకం. వృద్ధాప్యంలో శిశువుకు జన్మనిస్తే ఆ తల్లి గొప్పది అని అంటారు.

మరియ తల్లి పురుషుని యొక్క ప్రమేయమే లేకుండా పవిత్రాత్మ శక్తితో దేవుని కుమారునికి జన్మనిస్తున్నారంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తియో మనం అర్థం చేసుకోవాలి.

దేవుడు మనకి తల్లిని ఎంచుకోమని స్వేచ్ఛ నిస్తే మన యొక్క ఆలోచనలకు తగిన వ్యక్తిని ఎన్నుకుంటాం. మరి దేవుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎలాంటి తల్లిని ఎన్నుకొన్నారో మనందరం గ్రహించాలి.

సృష్టి మోయలేని దేవుణ్ణి మరియ తల్లి తన గర్భమందు మోసింది.

క్రీస్తు జయంతి సందర్భంగా మరియ తల్లి మనకు తెలిపే విషయం ఏమిటంటే దేవుని యందు మనం ఆనందించాలి.

దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యముల గురించి మరియమ్మ గారు సంతోషించారు. మరియ తల్లి నిజమైన ఆనందం దేవుని చిత్తంలో వెతికారు, దేవుని యందు ఆనందం కనుగొన్నారు.

క్రిస్మస్ అంటేనే ఆనందించటం, తన గర్భమందు రక్షకుడు జన్మించారని మరియ తల్లి ఆనందించింది.

సర్వ మానవాళికి దేవుడు జన్మనిచ్చారని ఆనందించింది. ఎఫెసి 5:16.

3.యోసేపు:

దైవ ప్రణాళికను నెరవేర్చుటలో ఒక గొప్ప తండ్రి పునీతుడు- పునీత యోసేపు గారు.

యోసేపు కారు నీతిమంతుడు, అందుకే దేవుడు సైతము తన యొక్క ప్రణాళికలు విడమరచి చెప్పారు. కలలో దేవుడు అంతయు విడమరచి చెప్పారు, ఎందుకంటే మరియమ్మ నిరపరాధి. దేవుని యొక్క ప్రణాళికలు వివరించిన సందర్భంలో యోసేపు గారు దైవ ప్రణాళికలు సంపూర్ణంగా విశ్వసించారు దైవ ప్రణాళికలు నెరవేర్చుట కొరకు సిద్ధంగా ఉన్నారు.

యోసేపు గారు మరియ తల్లి యొక్క గౌరవం వ్యక్తిత్వమును కాపాడారు.

ఈ క్రిస్మస్ సందర్భంగా యోసేపు గారు మనకు తెలియజేసే అంశం ఏమిటంటే నిన్ను నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకు మరియమ్మ గారు యోసేపు గారిని నమ్ముకున్నారు. ఎప్పుడైతే దూత యోసేపు గారు దైవ ప్రణాళికను వివరించినదో అప్పుడే దాన్ని అంగీకరిస్తూ మరియమ్మను తన భార్యగా స్వీకరిస్తున్నారు.

మనల్ని నమ్ముకున్న వారి యొక్క చేయి విడవకూడదు. యోసేపు గారువలే దైవ ప్రణాళికకు సహకరిస్తూ జీవించాలి.

మరియమ్మను ఏసుప్రభువు కాపాడిన విధంగా మనం కూడా ఇతరులను కాపాడాలి మరియు ముఖ్యంగా వారి యొక్క గౌరవం కాపాడాలి.

4. పరలోక దూత:

దేవుని యొక్క సమాచారం అందించే వార్తావాహినులు పరలోక దూతలు. రక్షకుడు జన్మించాడు అన్న శుభవార్తను అందజేశారు.

క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక దూత వలె మంచి మాటలను ఇతరులకు తెలపాలి.

దూతలు లేకుండా క్రిస్మస్ పండుగ లేదు, దూతల యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట కాబట్టి మనకు రక్షకుని ఉచిత బహుమానంగా ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించాలి ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానం.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంటారు -నువ్వు నేను క్రిస్మస్ యొక్క దూత అని ఎప్పుడైతే దేవుని యొక్క శాంతిని నీతిని ప్రేమను అందిస్తాము అప్పుడు మనం కూడా క్రిస్మస్ దూతలమని.

5. గొర్రెల కాపరులు:

క్రీస్తు జననం మొదటిగా గొర్రెల కాపరులకు అందచేయబడింది. బెత్లెహేములో యాజకులు ఉన్నారు పండితులు ఉన్నారు వారిని విడిచి దేవుడు సామాన్యులైన గొర్రెల కాపరులకు ఈ విషయమును తెలిపారు. ఈ సామాన్యులకు ఎందుకు ప్రభువు ఈ గొప్ప వార్తను తెలియజేశారు అంటే:

1. ఏసుప్రభు దావీదు వంశానికి చెందిన వాడు. దావీదు కూడా ఒక కాపరి ఏ కాబట్టి.

2. గొర్రెల కాపరులు వినయంతో ఉండేవారు సమాజంలో ఎటువంటి status లేని వారి, వినుటకు విశ్వసించుటకు అంగీకరించుటకు సిద్ధంగా ఉన్నవారు కాబట్టి దేవుడు యేసు ప్రభువు జనన వార్తను ముందుగా కాపరులకు తెలిపారు మనం కూడా వినయంతో ఉంటే దేవుని యొక్క పరమ రహస్యాలు మనకు తెలియజేయబడతాయి.

6. జ్ఞానులు:

ఏసుప్రభువును రాజుగా, రక్షకునిగా తమ కన్నా గొప్ప నాయకునిగా గుర్తించి ఆయన కొరకు దూర ప్రాంతముల నుండి ప్రయాణం చేశారు.

తమకోసం ఆకాశం నుండి భూమికి మనుష్యవతారం ఎత్తిన ప్రభువును కలుసుకొనుటకు వారు కష్టపడి ప్రాయసపడి ఇష్టంతో వచ్చారు.

కొన్ని సందర్భాలలో మనం దేవుని కొరకు గుడికి రావడానికి మన ఇంటి నుండి బయటకు రాలేము దేవుడు మాత్రము పరలోకం నుండి భూలోకానికి మన కొరకు వచ్చారు.

జ్ఞానులు మనకు, దేవునికి విలువైనవి సమర్పించుట నేర్పించారు. అదేవిధంగా దేవుని కలుసుకొనుట నేర్పించారు. కాబట్టి మన సమయమును కూడా దేవునికి సమర్పించాలి. ప్రతిరోజు ఆధ్యాత్మికంగా దేవుని కలుసుకొని జీవించాలి.

7. నక్షత్రం:

వెలుగుగా ఉంటూ మార్గం చూపిస్తుంది. దాని ద్వారానే జ్ఞానులు గమ్యం చేరారు.

నక్షత్రం నడిపించెను కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనం కూడా ఒక నక్షత్రముగా మారాలి నక్షత్రంలా అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి సత్యం వైపుకు నడిపించాలి.

దేవుడు మన కొరకై తన కుమారుడిని ఈ లోకానికి పంపారు కాబట్టి ఆయనను ప్రేమతో స్వీకరించి ఆయన జీవితమును ఆదర్శంగా తీసుకొని దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించూద్దాం.


FR. BALAYESU OCD

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం  బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6 ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గు...