25, ఫిబ్రవరి 2023, శనివారం

 తపస్సుకాలపు మొదటి ఆదివారము

ఆది 2:7-9,3:1-7

రోమా 5:12-19

మత్త 4:1-11.

ఈనాడు మన తల్లియైన తిరుసభ మనలనందరిని కూడా తపస్సుకాలములోకి ఆహ్వానిస్తుంది. అయితే,

తపస్సు కాలము అనగా దేవుని చెంతకు మరలి వచ్చు కాలమని , హృదయ పరివర్తనా కాలమని,

పచ్చాతాపకాలమని మనల్ని మనము తయారు చేసుకొని సిద్ధపడే కాలం అని అంటాం. ఈ కాలములో ఆ దేవాతి

దేవుని శక్తిని స్వీకరించుటకు ఏసుప్రభు వలే ఉపవాసము, ప్రార్థన మరియు దానధర్మములతో మనలను మనము

తయారు చేసుకోవాలి.

ఈనాడు మన తల్లియైన తిరుసభ నాలుగు విషయాలను ధ్యానించమని మనందరినికూడా ఆహ్వానిస్తుంది.

1.యేసుప్రభువు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడును.

2. ఎందుకు ఏసుప్రభువు ఎడారికి కొనిపోబడును?

3. క్రీస్తుకు శోధనలు దేనికి?

4.శోధనలపై విజయము సాధించిన క్రీస్తు ప్రభువు.

మొదటిగా,

1.యేసుప్రభువు పవిత్రాత్మతో పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడును:


 ఏసుప్రభువు యొక్క జన్మము నుంచి మరణం వరకు పరిశుదాత్మతో నింపబడి ఉండటం

చూస్తున్నాం.

గాబ్రియేలు దూత మరియమ్మతో పలికిన పలుకులు పవిత్రాత్మ నీపై వేయించేయును

సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని

పిలవబడును.

 లూకా2:40 బాల యేసు పెరిగి దృడకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయన దేవుని

అనుగ్రహము ఆయనపై ఉండెను. బాల యేసు దేవాలయములో సమర్పణ సమయంలో సన్నివేశం.

 బాల యేసు 12 ఏళ్లు వయస్సు గలవాడైనప్పుడు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు

దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను.


 యొర్దాను నదిలో యేసుప్రభువు బాప్తిస్మము సమయంలో, పవిత్రాత్మ పావురము రూపమున

ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను

ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినిపించెను.

2. ఎందుకు ఏసుప్రభువు ఎడారికి కొనిపోబడును?

ఇశ్రాయేలు సాంప్రదాయం ప్రకారం ఎడారి దేవుని కలుసుకునే తావు, శోధనలకు గురయ్యే ప్రదేశం.

 క్రీస్తు ముందు ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ల పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. ఈ కాలంలోనే మోషే 40

రోజులపాటు ప్రార్థనలతో ఉపవాసములతో సీనాయి కొండమీద ఏకాంతముగా గడిపారు.

 ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఎడారి గుండా నడిచిపోయి హోరేబు కొండ చేరుకుని అక్కడ దైవ

సాక్షాత్కారం పొందాడు.

వీరిలాగే ఏసు కూడా ఎడారిలో దైవసాక్షాత్కారం కలిగించుకోబోతున్నాడు. అంటే తాను దేవుని కుమారుడని

సైతానుకు తెలుసు. ఇంకా ఎడారి నిలయం కూడా. దేవుని మొదటి కుమారుడు ఇశ్రాయేలు ప్రజలను, పిచాచి

ఎడారిలో శోధించింది.వారు దానికి లొంగిపోయారు కూడా. క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు, ఈ కుమారుని కూడా

సాతాను ప్రలోభ పెట్టింది కానీ మొదటి కుమారుడు పడిపోయాడు, కానీ ఈ ఏకైక కుమారుడు సైతానుపై విజయం

సాధించాడు.మరియు తన పూర్వికుల పాపాలకు పరిహారం కూడా చేశాడు.

3. క్రీస్తుకు శోధనలు దేనికి?

పాపం ఏ మాత్రం సోకని పావన మూర్తి క్రీస్తు. మరి అతడు శోధన గురి కావడం దేనికి? ఈ శోధన

అనుభవించింది తన కోసం కాదు పాపులమైన మన కోసం. అతడు నూతన మానవజాతికి శిరస్సు, నాయకుడు.

తరువాత మానవులు శోధనకు గురి అవుతారు. కనుక తాను ఈ నరుల తరపున ముందుగానే శోధనను

ఆహ్వానించాడు. వాటి మీద విజయం సాధించాడు కూడా. అప్పటినుండి మన నాయకుని విజయం మన శోధనను

ఎదుర్కొనేటప్పుడు క్రీస్తు విజయం మన మీద సోకి మనకు గెలుపును దయచేస్తుంది.

4.శోధనలపై విజయము సాధించిన క్రీస్తు ప్రభువు:

4.1. భోజనం ప్రీతి:

“సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడవైనచో అనే అనుమానం విత్తనం నాటుతుంది".

“మానవుడు కేవలం రొట్టెవలనే జీవింపడు, దేవుని నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును” అని

దేవుడు ఎందుకు పలికాడు. ఎందుకంటే ఏసుప్రభువుకు రాళ్లను రొట్టెగా మార్చడం సాధ్యమే కానీ, ఇలా చేస్తే

ఏసుప్రభువు ఒక రొట్టెచేసేవాడైపోతాడు. ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినది మనిషి పొట్టను రొట్టెతో నింపడానికి కాదు,


కానీ పాపములో పడిపోయిన మనుషులను రక్షించడానికి, మరియు వారి ఆత్మలను తన యొక్క దివ్య శరీర

రక్తంతో తృప్తి పరచడానికి. ఇలాంటి శోధనని మొదట ఎడారిలో ప్రయాణం చేస్తున ఇశ్రాయేలు ప్రజలకు కూడా

తెచ్చిపెట్టింది సైతాను. అక్కడ వారు సైతానుకు లొంగిపోయారు. కానీ క్రీస్తు ఇక్కడ సైతానుపై విజయం సాధించాడు.

మరియ మొదటి పఠనంలో కూడా అవ్వ భోజనం మీద ప్రీతితో దేవుడు తినవద్దన్న పండును తిన్నది. దాని

ద్వారా పాపం కట్టుకున్నది,మరణమును చవిచూచింది. మన క్రైస్తవ లేక విశ్వాసపు జీవితములలో శరీరానికి

ఆహారము ఎంత అవసరమో మన ఆత్మకు దేవునియొక్క వాక్కు కూడా అంతే అవసరము. ఈ వాక్కు ద్వారానే

మనము రక్షింపబడుతున్నాం. ఎందుకంటే ఈ వాక్కు ఎవరో కాదు సాక్షాత్తు ఆ దేవాతి దేవుడైన యేసుప్రభువు.

మన యేసు ప్రభువు ఎలాగయితే ఈ ఆహారముపై ఎక్కువగా మొగ్గుచూపకుండా తన తండ్రి ఇచ్చిన వాక్కును

పరిపూర్ణము చేస్తున్నాడో, మనము కూడా అలాగే జీవించాలి. అప్పుడే, ఆ సైతానును మనము సులువుగా

జయించగలము.


4.2.విగ్రహారాధన:

సైతాను క్రీస్తు ప్రభువుతో ప్రపంచంలోని రాజ్యాలను నీకు ఇస్తాను, కానీ నీవు నన్ను ఆరాధించాలి. అని

ఎప్పుడయితే పలికినదో అప్పుడు క్రీస్తు, "దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవించవలెను" అని

చెప్పారు. అంటే పాపంతో నిండి ఉన్న వారి జీవితాలు, రాజ్యాలు క్రీస్తుకు వద్దు.కానీ మారుమనస్సు పొందిన

జీవితాలు క్రీస్తుకు కావాలి. దానికి క్రీస్తు శ్రమలు, సిలువ మరణం ,తన పునరుద్ధానం ద్వారా నెరవేరుతుంది.

ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు బంగారు దూడను తయారు చేసి, దానిని పూజించడం మొదలుపెట్టారు. దీని ద్వారా

వారు పాపం కట్టుకుని దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా జీవించి ఆయనతో స్నేహ సంబంధాన్ని కోల్పోయారు.

మొదటి పఠనంలో కూడా, పాము చెప్పినట్లు, ఆది తల్లిదండ్రులు మంచి చెడులు తీసుకొని వారు దేవునిగా

మారాలని అనుకున్నారు. దీని ద్వారా పాపం కట్టుకున్నారు.


4.3. దేవుని పరీక్షకు గురి చేయటం:

సైతాను ఏసుప్రభుతో "నీవు దేవుని కుమారుడ వైనచో,క్రిందికి దూకు. ఏలయన, నిన్ను రక్షింప దేవుడు తన

దూతలను పంపిస్తాడు". ఏసుప్రభు సమాధానం: "ప్రభువునైన నీ దేవుని శోధించరాదు" అని సమాధానం

చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేసినప్పుడు పిచాచి ఆలోచనలతో మోషే మీద తిరగబడ్డారు. ఇజ్రాయిల్

ప్రజలు అనుకున్నారు, దేవుడు కనుక మనతో ఉంటే ఈ యొక్క కష్టాలు మనకెందుకు వస్తాయి అని దూషించి

పాపము కట్టుకున్నారు. మరి మొదటి పఠనంలో కూడా మనం చూస్తున్నాము, ఆది తల్లిదండ్రులతో, మీరు

తినకూడదు అన్న పండును వారు తిని, దేవుని ప్రేమకు దూరమయ్యి పాపము కట్టుకున్నారు. కానీ,

యేసుప్రభువు మాత్రము తన తండ్రి యందు అచంచలమైన నమ్మకముకలిగి ఎటువంటి పరీక్షకుకూడా


గురిచేయలేదు. ఎందుకంటే, ఆయన తన తండ్రియందే ఆధారపడి జీవించాడు కాబట్టి. కానీ, మనము మాత్రము,

ఈలోక ఆశలకు ఆశయాలకు బానిసలమవుతూ ఆదేవాతి దేవుని ప్రేమను అర్ధం చేసుకోకుండా మన ఇష్టానుసారం

జీవిస్తూ, ఇష్టమొచ్చిన దేవుళ్లను కొలుస్తూ ఆయనకు అయిష్టముగా జీవిస్తూ, ఆ దేవాతి దేవున్నే పరీక్షకు

గురిచేస్తున్నాము. కాబట్టి, మనము ఆయనయందు మాత్రమే విశ్వాసము కలిగి ఆయనను పరీక్షకు

గురిచేయకుండా విశ్వాసవంతులుగా జీవించాలి.

పునీత పౌలు గారు చెబుతున్నాడు, "దేవుని నుండి నర జాతి పుట్టింది ఆదాము, క్రీస్తు మొదటి మనిషి

ఆదాము ఊపిరి పోసుకున్నవాడు అయ్యాడు. రెండవ మనిషి క్రీస్తు ఊపిరి పోసేవాడు. మొదటి ఆదాము కు

మరణము ఉంది. చివరి ఆదాముకు అంతం లేదు. ఎందుకంటే, ఈ చివరి ఆదాము నిజంగా మొదటి ఆదాము.

ఆయనే స్వయంగా తనను తానే ఆదియు, అంతము అని తెలియజేసాడు . మానవుడు దేవుని వలె మారాలన్న

కోరిక నాశనమునకు, మరణానికి దారి తీసింది .

ఆదాము పాపము అందరి శిక్షకు కారమైనట్లు, ఒక్కని నీతిమంతమైన క్రియ అందరికీ విముక్తి ప్రసాదించి

వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా

చేయబడినట్లే ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు.

ప్రతిమానవుని జీవితములో శోధనలను జయించాలి అంటే ప్రార్ధన ఎంతో అవసరము. ఈ ప్రార్ధన ద్వారానే

మనము సైతాను శోధనలను జయించగలము, ఇంకా దేవుని చేరగలము. మానవుడు శరీరము, ఆత్మచేత

సృష్టింపబడ్డాడు. మనము శోధనలో పడనివ్వకండి అని తండ్రి దేవునికి ప్రార్ధన చేస్తున్నాం. ఎందుకంటే నీ సంపాదన

చోటనే నీ హృదయం కూడా ఉంటుంది ఎవరు ఇద్దరు యజమానులను సేవింపలేరు. మనము ఎప్పుడయితే

ఆత్మవలన జీవిస్తామో అప్పుడే ఆ ఆత్మ వలన నడిపింపబడతాం.

పవిత్రాత్మతో ఏకీభవించడం వల్ల తండ్రి మనకు శక్తినిస్తాడు. ఏ పరీక్ష మనలను అధిగమింపలేదు. దేవుడు

విశ్వాసపాత్రుడు నీ శక్తిని మించి శోధనకు గురికానీయడు. శోధనతో పాటు తప్పుకొనేమార్గాన్ని కూడా

సమకూర్చుతాడు. అందువల్ల ప్రార్ధన, ఉపవాసము మరియు దానధర్మములు ద్వారానే మనకు శోధనలు

ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అంతటి పోరాటం, అలాంటి విజయం సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసు

ప్రభువు శోధనకారుని వెడలగొట్టాడు. మన పరలోక తండ్రికి చేసిన ఈ విన్నపంతో క్రీస్తు తన పోరాటంలోనూ, తన

శ్రమల తోనూ మనల్ని ఐక్యం చేశాడు. కాబట్టి, ఈ తపస్సు కాలములో ముఖ్యముగా ప్రార్ధన, ఉపవాసము

మరియు దానధర్మములకు ప్రాధాన్యతఇస్తూ దేవునికి దగ్గరవుదాం.


బ్రదర్. సైమన్ ఓ సీ డి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...