23, ఫిబ్రవరి 2023, గురువారం

 విభూది బుధవారము తరువాత శుక్రవారము 

మొదటి సాధనము  - ఉపవాసం

దేవుని కోసం ఆకలి

యెషయా 58: 1-9

మత్తయి 9: 14-15

 

మొదటి రోజు

నిన్న విభూది బుధవారం తర్వాత  రోజున మనము  ఎంపిక గురించి ధ్యానం చేసికొని వున్నాము. మరణం కంటే జీవితాన్ని ఎంచుకోవాలని మోషే ఆజ్ఞాపించాడు. సరైన నిర్ణయం తీసుకోమని  ప్రారంభంలోనే  మనకు ఒక సవాలు ఇవ్వబడింది.  ప్రార్థనాపూర్వకంగా, హృదయపూర్వకంగా ఈ కాలాన్ని అనుసరించడానికి మనమందరం  స్వేచ్ఛగా ఎంచుకోవడానికి ఇది ఒక ఆహ్వానం. సరే, సరైన ఎంపిక చేయడానికి మేము తీవ్రంగా పరిగణించకపోతే, సమయం గడిచిపోతుంది కానీ మనం యధావిధిగా పాత పంథా లోనే మారకుండా ఉంటాము.

రెండవ రోజు

మరియు ఈ రెండవ రోజు,  మనం ఒక ముఖ్యమైన దైవ, విశ్వాస మార్గంలో నడిపించబడుతున్నాము అదే: ఉపవాసం.

ఉపవాసం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటి, ఇది ప్రతి విశ్వాసానికి అంతర్లీనంగా ఉంటుంది. ఈ రోజు సువార్తలో  యోహాను శిష్యులు ఉపవాసం గురించి చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు. యోహాను శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, "మేము మరియు పరిసయ్యులు ఎక్కువ ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు?" అని అడిగారు. కాబట్టి మనం మన ఉపవాస ప్రయాణాన్ని  ప్రారంభించేటప్పుడు ఈ తపస్సు కాలం లో ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని ధ్యానించడం  మరియు అర్థం చేసుకోవడం మనకు ఎంతో అవసరం.

ఈనాటి  రెండు పఠనాల యొక్క  సందర్భం ఉపవాసం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు నిజమైన ఉపవాసం అంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తారు, దాని ద్వారా దేవుడు గౌరవించబడ్డారు.

ఇశ్రాయేలు  ప్రజలు ఉపవాసం పాటించేవారు, పుణ్యకార్యాలకు తమను తాము అంకితం చేసుకుంటున్నారు మరియు అన్ని మతపరమైన ఆచారాలను చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు వారి మొరను వినలేదని, వారి ప్రార్థనలకు సమాధానం లభించలేదని,  కాబట్టి ప్రజలు ఫిర్యాదు చేయడం, ప్రశ్నించడం మరియు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కానీ పైకి మాత్రమే ప్రజలు ఆధ్యాత్మికంగా, ప్రేమగా, భగవంతుని పట్ల అంకితభావంతో ఉన్నారని, ప్రతిరోజూ దేవుణ్ణి వెతుకుతారని, ధర్మాన్ని కోరుకుంటారని, క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటారని చెప్పారు.

కాబట్టి ఈ పరిస్థితిలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు మరియు అతని ఉద్దేశాలను స్పష్టం చేస్తాడు, ఉపవాసం విషయంలో తన వైఖరిని స్పష్టంగా చెప్పాడు.

దేవుడు ఇష్టపడని ఉపవాసం

దేవుడు వారి ఆచరణలో ఉన్న మోసాన్ని మరియు  అసత్యాన్ని బహిర్గతం చేస్తాడు. అతను అసలు సమస్య ఎంటో ఎత్తి చూపాడు, వారు ఉపవాసం ఉండరని కాదు, కానీ వారి వైఖరిలో, వారి ప్రవర్తనలో మరియు దేవుని పట్ల మరియు తమ పట్ల మరియు ఇతరుల పట్ల వారి వైఖరిలో అసలైన సమస్య దాగి ఉంది. అది దేవుడు గుర్తించారు.

వారి ఉపవాసం సరైన హృదయంతో చేయడం లేదు, కేవలం ఒక ప్రదర్శనగా అనుసరిస్తున్నారు.

వారి ఉపవాసం వ్యక్తిగత ప్రయోజనాలు మరియు స్వప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు.

వారు ఉపవాసమున్నారు అయినా కానీ వారి పనివారి నుంచి దోపిడీ చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.

వారు ఉపవాసం ఉన్నారు అయినా కానీ ఇతరులను అణచివేయడం కొనసాగిస్తూనే ఉన్నారు.

వారు ఉపవాసం ఉన్నారు అయినా కానీ తమలో తాము గొడవలు, మరియు వివాదాలు  కొనసాగిస్తూనే ఉన్నారు.

వారు ఉపవాసం ఉన్నారు కానీ వారి జీవితంలో అంగుళం మార్పు కూడా  లేదు.

కాబట్టి, ఈ రకమైన ఖాళీ ప్రదర్శన, ఇతరుల ముందు ప్రత్యేక ప్రదర్శనలు దేవుడు ఇష్టపడడు. అతను ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందలేదు. దానికి  బదులుగా దేవుడు ఉపవాసం పట్ల భిన్నమైన విధానాన్ని కోరుకుంటాడు.

దేవుడు ఇష్టపడే ఉపవాసం (6-9)

ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం 6 నుండి 9 వచనాలలో చూసినట్లయితే  నిజమైన ఉపవాసం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా వెల్లడి చేసారు. ఉపవాసం అనేది ఉపేక్షించడం(వదిలివేయడం) మరియు కమీషన్ (చేయడం) రెండిటిలో కలిపి ఉంది.

ఉపేక్షించడం(వదిలివేయడం)

వారు ఇతరులను అణచివేయడం మానేయాలి (అణచివేత = ఇతరుల పట్ల  అన్యాయంగా, చెడుగా ప్రవర్తించడం మరియు స్వేచ్ఛ, అవకాశాలు ఇవ్వకపోవడం)

వారు ఇతరులపై మోపబడిన భారాలు/కాడిని (అన్యాయాపు, అనవసరమైన చెడు ఆలోచనలు, మాటలు మరియు చర్యలు) తొలగించాలి.

వారు ఇతరులపై వేళ్లు చూపడం, ఇతరులపై చెడుగా మాట్లాడటం మరియు అనవసరంగా నిందలు వేయడం మానేయాలి.

వారు తమ ఆలోచనలు, మాటలు మరియు పనులలో ఇతరులను బాధపెట్టడం మానేయాలి. (శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా,  ఇతరుల భావోద్వేగాలతో ఆడుకోవద్దు)

కమీషన్ (చేయడం)

వారు తప్పనిసరిగా  ఆకలిని తీర్చాలి

వారు తప్పనిసరిగా ఆశ్రయం అందించాలి

వారు తప్పనిసరిగా వస్త్రములను అందించాలి

మీ అన్యాయాల బంధనాలలో ఉన్న వారిని విడిపించడానికి తప్పక ప్రయత్నించాలి (శారీరక బంధాల నుండి మరియు ఇతర దుష్ట ప్రభావాల నుండి కూడా)

వారు తప్పనిసరిగా  భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా సంరక్షణ మరియు సౌకర్యాన్ని అందించాలి.

కాబట్టి, ఉపవాసం అనేది తన మరియు ఇతరుల సంపూర్ణ శ్రేయస్సును కలిగి ఉంటుంది. మరియు భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసము, చిత్తశుద్ధి గల వైఖరి. మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనం తప్పక నివారించాల్సినవి ఉన్నాయి మరియు మనం అందించాల్సినవి ఉన్నాయి అని తెలియచేస్తుంది. 8 నుండి 9 వచనాలు వివరించినట్లు అవి నెరవేరినప్పుడు, దేవుడు వారిపై తన కాంతిని ప్రకాశింపజేస్తాడు, వారిపై తన కృపను ప్రసాదిస్తాడు మరియు తన సన్నిధి ద్వారా నడిపిస్తారు / మార్గనిర్దేశం చేస్తాడు మరియు అతను మనలను తృప్తిపరుస్తాడు, మనలను ఆదరిస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు మరియు చివరకు మన ప్రార్థనలను విని ఆశీర్వదిస్తాడు.

మత్తయి 6: 16-18లో, ఉపవాసం విషయంలో, యెషయా బోధించే వాటిని ధృవీకరిస్తూ ప్రభువైన యేసు   అర్థాన్ని మెరుగుపరుస్తున్నారు/జతచేస్తున్నారు. 

ఉపవాసం అనేది దేవునితో సహవాసం చేయడానికి ఒక సాధనం

ఉపవాసం సంతోషం మరియు వేడుకలగ చేయాలి , దుఃఖం , ధీనతతో , దిగులుగా కాదు.

ఉపవాసం అనేది దేవునితో అనుబంధం కాబట్టి ఇది మనల్ని నాశనం చేసే అన్ని అనుబంధాల నుండి దూరం అవ్వాలి.

ఉపవాసం అంటే ఇష్టాలు మరియు అయిష్టాలను విస్మరించడం మాత్రమే కాదు, భగవంతుని వైపు  దృష్టిని సారించడం.

ఉపవాసం పాపం చేత ఏర్పడిన  కొవ్వును, చెడు అలవాట్లను మరియు ధోరణులను తగ్గిస్తుంది.

 

 

ఈ పఠనాల ద్వారా దేవుడు నేడు మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ కాలం లో మనం ప్రతిరోజూ ఈ ఆధ్యాత్మిక ఉపవాసం, అనేక భక్తి కార్యక్రమాలలో పాల్గొంటాము. కానీ మన ప్రార్థన వినబడలేదని, మన పుణ్యకార్యాలు దేవుడు గమనించలేదని, ఆయనపై తిరుగుబాటు చేసి ఫిర్యాదు తరచుగా చేస్తూ ఉంటాం. అయితే, ఉపవాసం మొదటి పఠనంలోని వ్యక్తుల వలె స్వలాభం కోసం స్వీయ -కేంద్రీకృతమైనదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? నేను పరిసయ్యుల వలె ప్రజల అభిప్రాయాన్ని మరియు ప్రశంసలను కోరుతున్నానా?

అలా అయితే, మనం మన దిశను మార్చుకోవలసిన సమయం. మన దృష్టిని మార్చి మరియు భగవంతుని వైపు మళ్లించాలి మరియు ఉపవాసం గురించి ఆయన మనకు చెప్పేది వినాలి.

ఆధునిక పరంగా: ఉపవాసం కేవలం ఆహారం నుండి మాత్రమే కాదు, అది సోషల్ మీడియా, సాంకేతికత, అనవసరమైన మాటలు  మరియు అధిక స్క్రీన్ సమయం నుండి కూడా కావచ్చు. ఉపవాసం భగవంతుని పట్ల మనకున్న ఆకలిని గుర్తు చేయాలి.

పోప్ ఫ్రాన్సిస్ వారి సూచనలు:

మీరు ఈ తపస్సు కాలం లో  ఉపవాసం చేయాలనుకుంటున్నారా?

బాధ కలిగించే మాటల నుండి ఉపవాసం ఉండండి        

మరియు మంచి మాటలు చెప్పండి.

విచారం నుండి ఉపవాసం ఉండండి

మరియు కృతజ్ఞతతో నిండి ఉండండి.

కోపం నుండి ఉపవాసం ఉండండి

మరియు సహనంతో నిండి ఉండండి.

నిరాశావాదం నుండి ఉపవాసం ఉండండి

మరియు ఆశతో నింపండి.

చింతల నుండి ఉపవాసం ఉండండి

మరియు దేవునిపై నమ్మకం ఉంచండి.

ఫిర్యాదుల నుండి ఉపవాసం ఉండండి

మరియు సామాన్యము / సరళత గురించి ఆలోచించండి.

ఒత్తిళ్ల నుండి ఉపవాసం ఉండండి

మరియు ప్రార్థనతో ఉండండి

చేదు అనుభవాల నుండి ఉపవాసం ఉండండి

 మరియు మీ హృదయాన్ని ఆనందంతో నింపండి

స్వార్థం నుండి ఉపవాసం ఉండండి

 మరియు ఇతరుల పట్ల కరుణతో ఉండండి.

పగ నుండి ఉపవాసం ఉండండి

మరియు రాజీపడండి.

మాటల నుండి ఉపవాసం ఉండండి

 మరియు మౌనంగా ఉండండి, తద్వారా మీరు వినగలరు.

 

కొన్ని బైబిల్ వచనాలు  : ఎజ్రా 8: 21-23, దానియేలు

9: 3-5 ; యోవేలు2:12-13; యోనా 3: 5-9; మత్తయి 6 : 16-18

 

FR. JAYARAJU MANTHENA OCD

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...