16, అక్టోబర్ 2021, శనివారం

29 వ సామాన్య ఆదివారం (3)

 29 వ సామాన్య ఆదివారం  (3)

ఈనాటి దివ్య పఠనాలు: యెషయా:53 :10 -11, హెబ్రీ:4 :14 -16 ,మార్కు:10 :35 -45 

         ఈనాటి దివ్య  పఠనాలు నిజమైన నాయకునికి ఉండవలిసిన  లక్షణం గురించి భోదిస్తున్నాయి. 

    దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడు సంఘమును నడిపించే నాయకుడు అదేవిధంగా కుటుంబమును నడిపించే ప్రతియొక్క నాయకుడు ఎలాగ జీవించాలన్నది, ఎలాగ వారు ఇతరులకు సేవచేయాలన్న విషయం గురించి ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి.

    ఈనాటి మొదటి పఠనంలో, బాధామయ సేవకునియొక్క నాల్గవ గీతం గురించి యెషయా గ్రంధంలో చదువుకుంటున్నాం.

        ఈయెషయా గ్రంధం 52 :13 -53 :12 వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, ఆ సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకుపడిన బాధలను మనం వింటున్నాం.

సేవకుడు దేవునికొరకు అనేక రకాలైన అవమానాలు, నిందలు,శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారు.ఆయన యొక్క భాధలలో దేవుణ్ణి విస్మరించలేదు, ఆయనయందు విశ్వాసం కోల్పోలేదు. ఈ బాధామయ సేవకునియొక్క నాల్గవగీతంలో దేవుడు తెలియజేస్తున్నారు ఎలాగ ఒక సేవకుడు జీవించాలి.సేవకునికి  దైవప్రజలమీద అధికారం ఇవ్వబడింది.ఆయన యొక్క అధికారం సేవచేయుటకు,మాత్రమే వినియోగించులున్నారు,కానీ, ఎలాంటి సుఖ సంతోషాలను పొందటానికి కాదు. ఈనాటి మొదటి పఠనంలో,ప్రభువు సేవకున్ని భాధాభరితున్ని చేయుట నా సంకల్పము అని అన్నారు (10 వ) ఇక్కడ దేవుడు సేవకునియొక్క జీవితంలో కష్టాలుఒసగినప్పుడు ఆకష్టాలను అయన ప్రేమతో స్వీకరించాడు.

ఈసేవకునిలో వున్న కొన్ని లక్షణాలు ఏమిటి;

1 .అయన తన దేవునియందు వినయము విధేయతను కనపరిచాడు.ఎందుకంటే, దేవుడు స్వయంగా ఈ సేవకుడు శ్రమలు పొందాలన్నపుడు ఆయన శ్రమలు అనుభవించుటకు తాను సిద్ధముగా వున్నానని,వినయమును,విధేయతను తెలియపరుస్తున్నాడు.- యెషయా:53 :7 .

2. ఆయన ఇతరుల కొరకు జీవించినవ్యక్తి.పరుల పాపపరిహారం కోసం తన జీవితమునే త్యాగం చేస్తున్నారు.ప్రజల యొక్క పాపములను తనమీద వేసుకొని వారికొరకు ప్రాణత్యాగం చేస్తున్నారు.ఈ సేవకునిలో వంద సంవత్సరాలు జీవించాలన్న ఆశలేదు. కానీ దేవుని కొరకు దేవుని ప్రజలకొరకు జీవించాలన్న మంచిమనస్సు ఉంది యెషయా:15 :13 .

3 . అయన ప్రేమించే సేవకుడు: అయన కేవలము ప్రేమవలన అయన జీవితమును పరులకోసం త్యాగం చేసారు.ఎన్ని భాధలు పొందినా,ఎంత హింసించినా,అయన మాత్రము నోరు విప్పలేదు.ఎంతో ప్రేమవుంటేనే అలాగ భరించగలిగి శ్రమలలో దేవుని సంతోషమును చూసిన సేవకుడు.పౌలు గారు చక్కగా వివరిస్తారు ప్రేమ సమస్తమును భరించును 1 కోరిం:13 :7 . పౌలు గారు చెప్పిన విధముగా ప్రేమకు సహనం ఉంది,వినయము ఉంది,అదేవిధముగా ఆ సేవకుని హృదయం దైవ ప్రేమ, మానవ ప్రేమతో నిండిఉంది.కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు.

4 . బాధామయ సేవకుడు దైవజ్ఞానము కలిగిన వ్యక్తి: ఈ సేవకునికి ప్రభువు యొక్క మనస్సు తెలుసు, ఆయన సంకల్పం తెలుసు.అందుకే ఆయన చిత్తమును నెరవేర్చుతూ,అన్నిటిని సహించుకొని,ముందుకు సాగారు.దేవుడుయొక్క ప్రతిమాట, ఆయన చిత్తం గ్రహించుకొని దాని ప్రకారము సేవ చేస్తూ,శ్రమల కాడిని మోసి,తన ప్రాణ త్యాగం చేసి అనేకమందియొక్క సంతోషమునకు కారణమయ్యారు.

5 .దేవుడుసేవకునికి ఇచ్చు ప్రతిఫలం : బాధామయ సేవకుడు తన కోసం పడిన ఏశ్రమనుకూడా తండ్రి దేవుడు మరచి పోలేదు.తన శ్రమలలో భాగస్తుడయ్యారు.తనకు తోడుగావున్నారు.ఆయనపట్ల సంతోషముగావున్నారు.ఎందుకంటే తన చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చారు. ఈ సేవకుడు ఎన్ని భాధలు అనుభవించాడో,దానికి అన్ని రెట్లు ఎక్కువగా అతడిని గొప్పవానిగా దేవుడు చేశారు.యెషయా :53 :12 .

ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రేమ కాబట్టి మనం జీవితములో,కూడా కష్టాలు వస్తాయి, శ్రమలను ఎదుర్కోవాలి.అయితే వాటన్నిటిని ఈ బాధామయ సేవకుని వలే భరించాలి. ప్రతి శ్రమవెనుకాల ప్రతిఫలం దాగివుంటుంది.దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తే,అవి తరువాత దీవెనలుగా మార్చబడతాయి.కాబట్టి ఈ సేవకునిలో వున్న లక్షణాలు మనం పాటించుకుందాం.

    రెండవ పఠనంలో రచయిత యేసు క్రీస్తు ప్రభునియొక్క యాజకత్వము గురించి భోదించారు.

    యేసుక్రీస్తు ప్రభువుయొక్క యాజకత్వం పాతనిభందనా గ్రంధంలో లేవీయుల యాజకత్వము కన్నా కొద్దిగా భిన్నముగా వుంటుంది. లేవియ గోత్రముకు చెందిన యాజకులకంటే,క్రీస్తుప్రభువుయొక్క యాజకత్వం గొప్పది.ఎందుకంటే,లేవీయులు దేవునికి బలులు మాత్రమే అర్పించే యాజకులు కానీ,క్రీస్తుప్రభువు తానే ప్రజలకోసం బలిగా అర్పించుకున్న గొప్ప యాజకుడు.లేవీయులు ఈ భూలోకములోవున్న దేవాలయములోకి మాత్రమే ప్రవేశించారు.(లేవి :16 :15 -17 ) కానీ యేసు ప్రభువు పరలోకమునుండి దిగివచ్చి, పరలోకంకు ఎక్కివెళ్లిన ప్రధాన యాజకుడు.

లేవీయులు అందరిని ప్రేమించుటలేదు, ఆపదలోవున్నవారిని ఆదుకొనలేదు ( మంచి సమరుయుని కథ) కానీ క్రీస్తుప్రభువు అందరినీ ప్రేమించారు, పేదలలో జీవించాడు,అందరిని దీవించాడు,అవసరంలో వున్న వారికి చేయూతనిచ్చారు. లేవీయులు సేవింపబడ్డరు,గౌరవింపబడ్డారు.కానీ క్రీస్తు ప్రభువు సేవచేసారు, సిలువ శ్రమలు అనుభవించారు.అందుకే క్రీస్తుప్రభువుని యాజక అగ్రగణ్యుడు అంటారు. మనం బలహీనతల యందు మనకు శక్తిని ఇస్తారు.అదేవిధంగా మనలాగా ఈ లోకంలో మానవునిగా జీవించి అన్నిటిలో కూడి,ఎటువంటి పాపం చేయని వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మన బలహీనతలు తెలుసు కాబట్టి,మనల్ని  దేవుడు అర్ధం చేసుకుంటారు.సానుభూతి చూపుతారు, ఆదుకుంటారు,కాబట్టి ఆయన సన్నిధికి సమీపించి మనలను, మన పాపాలు క్షమించమని మొరపెట్టుకోవచ్చు.

         ఈ నాటి సువిశేష పఠనంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అధికారం పట్లవున్నఆశని గూర్చి వివరిస్తున్నారు. నిజమైన అధికారమంటే తనను తాను తగ్గించుకుని, అందరికీ సేవచేయడమే అని క్రీస్తు ప్రభువు శిష్యులకు తెలుపుచున్నారు.

 పోయిన వారపు సువిశేష పఠనంలో ధన వ్యామోహమును గూర్చి వింటున్నాం.ఈ రెండు కూడా మానవుడిని, దేవుడికి దూరం చేస్తాయి.ఎందుకంటే ఎప్పుడు కూడా వారిమనస్సు, హృదయం వాటిమీదనే ఉంటుంది.వారు దేవుడిగురించి ఆలోచించుట చాలా తక్కువ. వ్యామోహం ఏదైనా సరే అది విశ్వాస జీవితానికి మంచిదికాదు.

   ఈనాటి సువిశేష పఠనంలో యేసుప్రభువు తన యొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,ఇద్దరు శిష్యులు మీ రాజ్యంలో మారు రెండు స్థానాలు ఇవ్వమని జెబాదాయి పుత్రులు యాకోబు,యోహాన్నులు అడుగుచున్నారు.

 వీరిద్దరూ కూడా యేసు ప్రభువు చేత ప్రేమింపబడినవారే, ఎందుకంటే,చాలా సందర్భాలలో వీరిని తోడుగా తీసుకొని వెళ్లుచున్నారు (యాయీరు ఇంటికి,తాబోరు కొండకు,గేస్తేమనే తోటకు).

  యేసు ప్రభువు మరణం గురించి, పునరుతానము గురించి చాలా సందర్భాలలో ప్రస్తావించారు.ఆయన శ్రమలను గూర్చి చెప్పిన ప్రతిసారి కూడా శిష్యులు ఉన్నారు. అయినాకూడా వారు గొప్ప అంతస్థు గురించి ప్రభురాజ్యములో కుడి, ఎడమ స్థానం గురించి ఆలోచనలుచేయసాగారు. శిష్యులు యేసుప్రభువు మరణిస్తారని ఆలోచనలేదు. కేవలం ఆయన రాజ్యంస్థాపిస్తారని అందరి యొక్క ఆలోచన. ఇక్కడ మానవుని యొక్క స్వభావం స్పష్టంగా కనపడుతుంది.

పేరుకోసం ,అధికారంకోసం,గుర్తింపుకోసం ఉన్నటువంటి మానవ వ్యక్తిత్వం అర్ధమవుచున్నది.

   యేసు ప్రభువు మొదటిసారిగా తనయొక్క మరణం గురించి ప్రస్తావించినప్పుడు,పేతురుగారు దానికి అభ్యన్తరం పలికారు. అప్పుడు ప్రభువు తన సేవకులుగా ఉండాలంటే సిలువను మోయాలి అని పలికారు (మార్కు:8 :24 ). ఆయన ఆలోచనలు సరిచేశారు.

    రెండవసారి తన మరణం గురించి చెప్పినపుడు శిష్యులలో ఎవరుగొప్పఅని ఆలోచనలు చేశారు.అప్పుడు చిన్నబిడ్డను చూపించి,గొప్పవారు కావాలంటే,చిన్నబిడ్డలాగా దేవునిపై నమ్మకం ఉంచి,ఆయన మీద ఆధారపడి జీవించాలి అని తెలిపాడు మార్కు;9 :35 . 

       మూడవసారి మళ్ళీ మరణం గురించి చెప్పినపుడు,ఇద్దరు శిష్యులు తన రాజ్యంలో కుడి ఎడమల స్థానాలను ఆశిస్తున్నారు. అప్పుడు ప్రభువు, గొప్పవారు కాదలిస్తే,వారు సేవకుడిగా ఉండాలని తెలుపుచున్నాడు (44 వ వచనం).శిష్యులు అధికారంకోసం ఆశిస్తే, ప్రభువు సేవాగురించి భోధిస్తున్నాడు. అధికారం ఆశపడుతూ,శ్రమలను వద్దనుకుని జీవింప ప్రయత్నిస్తే,ప్రభువు మాత్రము అనుదిన జీవితములో శ్రమలు అంగీకరించాలని గట్టిగా చెబుతున్నారు. నిజమైన గొప్పదనం అంటే, ఇతరులకు సేవకునిగా ఉండి సేవచేయుటకు అని ప్రభువు చెబుతున్నారు.

  యోహాను యాకోబు అడిగిన వరం సరియైనది కాదు.ఎందుకంటే అధికారవరమును అడుగుచున్నవారు దానికోసం వారి తల్లిని కూడా తీసుకొనివచ్చి అడుగుచున్నారు (మత్త:20 :20 -21 ).వారికి ఎంత అధికారఆశ అంటే, వారు అడిగితే ఆ అధికారం రాదూ అనుకోని తన తల్లి చేత అడిగిస్తున్నారు.సలోమి మరియమ్మ గారి సోదరి వరుస అవుతారు (యేసుప్రభువుకు పిన్ని/పెద్దమ్మ వరుస).ఇక్కడ శిష్యులు ఏమిఅడుగుచున్నారో,వారికి సరిగా అవగాహన లేదు.మనం కూడా కొన్నిసార్లు ఏమిఅడుగుతామో అవగాహన లేదు.వారు (యాకోబు/యోహాను ) తనకు దగ్గర బంధువులు అయినప్పటికీ, వారికి యేసు ప్రభువు వారికి ఎలాంటి పక్షపాతం చూపించలేదు.ఆయనకు అందరూ సరిసమానులే.ప్రభువు వారి మధ్యలో వారికి విభేదాలు రాకుండా ఇలా మంచి నిర్ణయం తీసుకున్నాడు.

   మనమైతే ఎప్పుడూ కూడా మనవారి గురించి ఆలోచిస్తుంటాం. ఏదయినా పదవి ఖాళిగా ఉంది అంటే వెంటనే అది మనం బంధువులకు వచ్చేలా చూస్తాం. కానీ ఇక్కడ ప్రభువు మాత్రం వీరికి ఎలాంటి అధికారం ఇవ్వటం లేదు.

  యాకోబు యోహానులు ఇద్దరు కూడా ఉన్నవారే,(మార్కు:1 :20 ) వారికి వున్న సంపదలవల్ల అధికారం కూడా కావాలి అనే స్వార్ధపు ఆలోచనలలో వున్నారు.అందుకే ప్రభువు వారి ఆలోచనలను సరిచేస్తున్నారు (యోహా :18 :16 ). ఈ ఇద్దరు శిష్యులు యేసుప్రభువు యొక్క శ్రమల యొక్క సవాళ్లు అంగీకరించారు.అవసరమయితే ఆయనకోసం యెరూషలేములో మరణించడానికైనా సిద్ధం అని అన్నారు. యాకోబు గారియొక్క మరణ చరిత్ర మనకు ఆయన క్రీస్తుకొరకు పొందినాశ్రమలు బాప్తిస్మము గురించి వివరిస్తుంది.యాకోబుగారు హేరోదు అగ్రిప్పచే శిరచ్చేదం పొంది  మరణించారు   (అపో:12:2).  

    యేసు ప్రభువుయొక్క శ్రమలలో భాగస్థుడై మరణించిన మొదటి శిష్యుడు.యోహానుగారు కూడా తన తోటి క్రైస్తవుల వేద హింసల్ని,తీవ్రభాధను పొందటమే గాక, దేశ బహిష్కారణకు గురయ్యారు.వీరిద్దరూ క్రీస్తు శ్రమలలో పాలుపంచుకొని,దేవుని మహిమను పొందారు. వారు అధికారం గురించి అడిగినప్పుడు, ఆలోచించారోలేదో కానీ క్రీస్తు ప్రభువుయొక్క పునరుతానము తరువాత ఆయన కోసం జీవించాలి, మరణించాలి,ఆయన సేవ నిస్వార్ధంతో  చేయాలనే దృఢసంకల్పం కలిగిన సేవకులు వీరు.యేసు ప్రభువు తన తండ్రియే అందరికీ తన రాజ్యంలో స్థానం ఇస్తారని ప్రభువు తనయొక్క వినయాన్ని, విధేయతను చూపుచున్నారు. క్రీస్తుప్రభువుకు ఈలోకంమీద సర్వాధికారం ఇవ్వబడినది. అయితే దానిని ఎప్పుడూ కూడా సొంతలాభంకోసం వినియోగించలేదు.

    ప్రభువు దృష్టిలో అధికారం ఇవ్వబడినది కేవలం సేవకే అని స్పష్టమవుచున్నది. ప్రభువు తాను చూపిన అధికారులను ఆదేశించి పలుకుచున్నారు.వారు ప్రజలపై ఎంత కఠినముగా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ అధికారం పెత్తనం చెలాయించడాన్ని కాదు, కానీ అందరిలో ఒకడిగా ఉంటూ అందరికీ సేవచేయడమే, ఇదే నిజమైన గొప్పదనం అని తెలుపుచున్నాడు.

      గొప్పవారు కాదలిస్తే తనను తాను తగ్గించుకొని, ఇతరులను అంగీకరించి సేవచేయాలి అని భోధిస్తున్నాడు.ప్రథముడు కాదలిస్తే , బానిసగావుండాలి, ఎటువంటి పెత్తనం లేకుండా ఉండాలి అని భోధిస్తున్నాడు.

    మదర్ థెరెసా గారు తనను తాను తగ్గించు కొని అందరికీ సేవచేసారు. ఆసేవలో ప్రేమ, వినయం వున్నాయి.యేసుక్రీస్తు ప్రభువు నిజమైన సేవకునికి నిదర్శనం.ఆయన అందరికన్నా గొప్పవాడయినప్పటికీ, దేవుడైనప్పటికీ,తనను తాను తగ్గించుకున్నాడు.ఎవ్వరిమీద అధికారం చెలాయించలేదు. ప్రేమించాడు, తండ్రికి విధేయత చూపారు. పేదవారి పక్షాన పోరాడారు. అందరికీ సేవచేసారు.సిలువశ్రమాలు అనుభవించారు. శిష్యులపదాలు కడిగాడు.పేదవారిగా ఈలోకంలో జీవించారు.సుఖ సంపదలు విడిచిపెట్టారు.మనందరం కూడా క్రీస్తుప్రభువలె,సేవకు దూపం దాల్చి జీవించాలి.దేవుడిచ్చిన అధికారంతో ప్రేమిస్తూ,సేవచేస్తూ,దేవునికి దగ్గరగా జీవించాలి.మనం ఇతరులయొక్క శ్రేయస్సును కోరుకోవాలి. 1 కోరి:10 :24 , ఫిలి:2 :4 .

        అధికారం కేవలం సేవకుమాత్రమే కాబట్టి క్రీస్తు ప్రభువు వలే జీవించుటకు ప్రయత్నిద్దాము.ఆమెన్

Rev.Fr. Bala Yesu OCD

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పెంతుకోస్తు పండుగ

పెంతుకోస్తు పండుగ  అపో 2:1-11, 1 కొరింతి 12:3-7, 12-13, యోహాను 20:19-23 ఈరోజు తల్లి శ్రీ సభ పెంతుకోస్తు పండుగను కొనియాడుచున్నది. పెంతుకోస్తు...